Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  అధ్యాయం 42—సమాప్తమైన సంఘర్షణ

  వెయ్యేండ్ల కాలం ముగియగానే క్రీస్తు భూమికి మళ్లీ వస్తాడు. రక్షింపబడినవారి సమూహాలు దూతలు ఆయన వెంట పస్తారు. భీకరమైన మహిమతో దిగివస్తూ సమాధుల నుంచి లేవ వలసిందిగా దుష్టుల్ని ఆదేశిస్తాడు. వారు తమ ప్రతి ఫలం అనుభవించటానికి లేస్తారు. సముద్రతీరాన ఉన్న ఇసుకరేణువుల్లా లెక్కించలేని సంఖ్యలో బ్రహ్మాండమైన సమూహంగా వారు లేచివస్తారు. మొదటి పునరుత్థానంలో లేచిన వారికీ వీరికీ మధ్య ఎంత వ్యత్యాసముంటుంది! నీతి మంతులు అమర్త్యమైన యౌవనాన్ని సౌందర్యాన్ని కలిగిఉంటారు. దుర్మార్గులు వ్యాధి మరణాల ఆనవాళ్లు కలిగి ఉంటారు.GCTel 627.1

  ఆ జనవాహినిలోని ప్రతీ నేత్రము దైవ కుమారుని మహిమను వీక్షించటానికి ప్రయత్నిస్తుంది. “ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక” అంటూ దుర్మారులందరూ ముక్తకంఠంతో పలుకుతారు. ఈ మాటలు పలికించేది క్రీస్తుపట్ల వారికున్న ప్రేమకాదు. ఇష్టంలేని పెదవులతో బలవంతంగా సత్యం పలికించే మాటలివి. దుర్మార్గులు సమాధుల్లోకి ఏరీతిగా వెళ్లారో ఆ రీతిగానే సమాధుల్లో నుంచి బైటికి వస్తారు. క్రీస్తుపట్ల అదే వైషమ్యంతో, అదే తిరుగుబాటు స్వభావంతో తమ గత జీవితాన్ని సరిచేసుకోవటానికి వారికి నూతన కృపకాలం ఉండదు. కృపకాలం వల్ల కలిగే మార్పేమీ ఉండదు. జీవితమంతా పాపంలో గడిపినందువల్ల వారి హృదయాలు మెత్తబడవు. రెండో కృప కాలం ఇవ్వటమంటూ జరిగితే అది కూడా మొదటిదానిలాగే దేవుని ధర్మశాసనాల్ని ఆచరించకుండా తప్పించుకోవటంలోను దేవునిపై తిరుగుబాటు రేపటంలోను గడిచిపోతుంది.GCTel 627.2

  తన పునరుత్శానం అనంతరం క్రీస్తు ఏ పర్వతంపై నుంచి ఆరోహణుడయ్యాడో ఏ పర్వతం మీది ఆకాశంలో దేవదూతలు ఆయన తిరిగి రాకడ వాగానాన్ని పునరుద్ఘాటించారో ఆ ఒలీవ కొండ మీద ఆయన దిగుతాడు. ప్రవక్త ఇలా అంటున్నాడు, “నీతో కూడ పరిశుద్ధులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రతక్ష్యమగును” “ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున నున్న ఒలీపకొండ మీద ఆయన పాదము లుంచగానే ఒలీవకొండ ...నడిమికి విడిపోయి... విశాలమైన లోయ ఒకటి ఏర్పడును” “యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును” జెకర్యా 14:4, 5, 9. అతి సుందరం ప్రకాశమానం అయిన నూతన యెరూషలేము ఆకాశవిశాలంలో నుంచి దిగివచ్చి తనకోసం సిద్ధం చేసిన పరిశుద్ధ స్థలంలో నిలుస్తుంది. తన ప్రజలతోను, పరిశుద్ధ దూతలతోను క్రీస్తు ఆ పట్టణంలో ప్రవేశిస్తాడు.GCTel 627.3

  ఇప్పుడు ఆధిక్యం సంపాదించటానికి సాతాను అంతిముపోరాటానికి సన్నద్ధమౌతాడు. అధికారం పోయి, మోసగించే పనికూడా పోయి సాతాను నిరాశ నిస్పృహలతో నిండి ఉంటాడు. అయితే దుష్టుల పునరుత్థానంతో అతనికి తన పక్కనున్న పెద్ద జనసమూహం కనిపిస్తుంది. అతనిలో ఆశలు చిగురిస్తాయి. ఆ మహా సంఘర్షణలో లొంగిపోకూడదని నిశ్చయించుకొంటాడు. దుష్ట ప్రజల సైన్యాలన్నింటిని తన జెండా కింద సంఘటితపర్చి వాటి ఆసరాతో తన ప్రణాళికలను అమలు పర్చటానికి కృషి సల్పుతాడు. దుర్మార్గ జనులంతా సాతాను బానిసలు. క్రీస్తును విసర్జించటం ద్వారా వారు తిరుగుబాటు నేత నాయకత్వాన్ని స్వీకరిస్తారు. సాతాను సలహాల్ని ఆదేశాల్ని అంగీకరించటానికి వారు సిద్ధంగా ఉంటారు. అయినా జిత్తులకు ఎత్తులకు ముత్తాత అయిన అతను తాను సాతానునన్న విషయాన్ని అంగీకరించడు. తాను యువరాజునని ప్రపంచానికి హక్కుదారుడనని తన వారసత్వం అన్యాయంగా తన వదనుంచి తీసుకొన్నారని చెప్పుకొంటాడు. తానే విమోచకుణ్ణని, వారిని తమ సమాధుల్లో నుంచి బైటికి తీసుకు వచ్చింది తానే అని క్రూరమైన నిరంకుశత్వం నుంచి తమను కాపాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని తన ఆధీనంలో ఉన్న వంచిత ప్రజలకు సాతాను చెబుతాడు. క్రీస్తు లేక పోవటంతో చెప్పిన మాటలకు మద్దతుగా అద్భుతకార్యాలు చేస్తాడు. బలహీనులకు బలాన్నిస్తాడు. అందరిని తన ఉత్సాహంతోను శక్తితోను నింపుతాడు. పరిశుద్ధుల శిబిరంపై దాడి జరిపి దేవుని పట్టణాన్ని స్వాధీనం చేసుకుందామని దానికి తాను నాయకత్వం వహించటానికి సంసిద్ధమని వారికి ప్రతిపాదిస్తాడు. సమాధుల్లో నుంచి లేచిన కోట్లాదిమంది దిశగా చూస్తూ తమ నాయకుడుగా తాను పరిశుద్ధ పట్టణాన్ని స్వాధీనం చేసుకొని తనసింహాసనాన్ని తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకో గలనని వారితో నమ్మబలుకుతాడు.GCTel 628.1

  జలప్రళయానికి ముందు దీర్ఘకాలం జీవించిన వేలాదిమంది ప్రజలు ఆ గొప్ప ప్రజాసమూహంలో ఉంటారు. ఎత్తయిన దృఢమైన దేహాలు, బ్రహ్మాండమైన ప్రతిభ కలిగినవారు, పడిపోయిన దూతల మాటలు విని తమ్మును తాము హెచ్చించుకోటానికి తమ మానసిక శారీరక శక్తుల్ని ఉపయోగించుకోటానికి సిద్ధంగా ఉన్న వారు ఉంటారు. తమ అద్భుత కళాసృష్టి ప్రతిభా కౌశలాల వల్ల ప్రపంచ నివాళులందుకొన్న తాము సృష్టించిన క్రూరత్వం, చేటువల్ల లోకాన్ని అపవిత్రపరచి దేవుని స్వరూపాన్ని వికృత పర్చిన వారున్నారు. అందుచేత దేవుడు వారిని తన సృష్టిలో లేకుండా తుడిచివేశాడు. రాజ్యాలు జయించిన రాజులు, సేనాపతులు, ఒక్క యుద్ధంలో కూడా ఓటమిని ఎరుగని వీరులు, ధీరులు, రాజ్యాలకు రాజ్యాలనే వణికించిన వీరసైనికులు ఉన్నారు. మరణంలో వీరికి మార్బేమీ కలుగలేదు. వారి తలంపులు ఎక్కడ ఆగిపోయాయో సమాధులలో నుంచి బైటికి వచ్చినప్పుడు అక్కడ నుంచి కొనసాగుతాయి. జయించాలని ఎంత బలమైన కోరికతో నేలకొరిగారో అదే కోరిక వారిని ముందంజ వేయిస్తుంది.GCTel 629.1

  సాతాను తన దూతలతో సంప్రదించి ఆ తర్వాత ఈ రాజులు సైన్యాధిపతులు, యుద్దశూరులతో సంప్రదిస్తాడు. వారు తమ పక్క ఉన్న సంఖ్యా బలాన్ని చూసి పరిశుద్ధ పట్టణంలోని సైన్యం చాలా చిన్నదని దాన్ని సునాయాసంగా ఓడించవచ్చని అభిప్రాయపడ్డారు. నూతన యెరూషలేములోని భూభాగాన్ని మహిమను సొంతం చేసుకోటానికి పథకాలు తయారుచేసుకొంటారు. వెంటనే యుద్ధానికి సిద్ధమౌతారు. నిపుణతగల చేతిపనివారు యుద్ధాయుధాల్ని తయారుచేస్తారు. సైనికాధికారులు సైనికుల్ని పోగుచేసి పటాలాలుగాను విభాగాలుగాను వ్యవస్థీకరిస్తారు.GCTel 629.2

  చివరికి ముందుకు సాగటానికి ఆదేశం వస్తుంది. లెక్కకుమించిన ప్రజావాహిని కదులుతుంది. భూపతులెవ్వరూ అలాంటి సైన్యాన్ని నడిపించి వుండలేదు. భూమిమీద యుద్దాలు మొదలైనప్పటి నుంచి అలాంటి సంయుక్త సైన్యం ఎప్పుడూ ఏర్పాటై ఉండలేదు. యుద్దశూరుల్లో అగ్రగణ్యుడైన సాతాను నాయకుడుగా ముందు నడుస్తాడు. అతని దూతలు వారి సేనలు ఈ చివరి పోరాటానికి ఏకమవుతారు. ఈ సేనలో రాజులూ యుద్దశూరులూ ఉంటారు. ప్రజలు తమతమ సేనా విభాగ నాయకుల వెంట కంపెనీలుగా నడుస్తారు. సైన్యంలో మాదిరిగానే నియమబద్ధంగా పగిలిన ఎత్తు పల్లాలుగా ఉన్న నేల మీద తమ తమ రేంకుల ప్రకారం నడుస్తూ పరిశుద్దపట్టణం దిశగా వెళ్తారు. యేసు ఆదేశం మేరకు నూతన యెరూషలేము గుమ్మాలు మూసివేస్తారు. సాతాను సేనలు పరిశుద్ధ పట్టణాన్ని చుట్టుముట్టి యుద్ధానికి సిద్ధమవుతాయి.GCTel 629.3

  క్రీస్తు మళ్లీ తన శత్రువులకు కనిపిస్తాడు. పట్టణానికి పైగా ధగధగా మెరసే బంగారు పునాది మీద ఉన్నతమైన సింహాసనం ఉంది. ఈ సింహాసనంపై దైవకుమారుడు ఆసీనుడౌతాడు. ఆయనచుట్టూ తాను పాలించే ప్రజలుంటారు. క్రీస్తు అధికారాన్ని మహాత్మ్యాన్ని ఏ భాషా వర్ణించలేదు. ఏ కలమూ చిత్రించలేదు. ఆయన కాంతి దేవుని పట్టణాన్ని నింపి గుమ్మాల గుండా బైటికి ప్రవహించి భూమండలాన్ని వెలిగిస్తుంది.GCTel 629.4

  ఒకప్పుడు సాతానుసేవలో చురుకుగా పనిచేసి ఇప్పుడు అగ్నిలోనుంచి తీసిన కొరవిలా వుంటూ తమ రక్షకున్ని ప్రగాఢ భక్తిశ్రద్ధలతో అనుసరిస్తున్న వారు సింహాసనానికి దగ్గరగా ఉంటారు. అసత్యం, అపనమ్మకం నడుము పరిపూర్ణ క్రైస్తవ ప్రవర్తనల్ని నిర్మించుకొన్న వారు, దైవ ధర్మశాస్త్రం నిరర్ధకమయ్యిందని క్రైస్తవ లోకమంతా ప్రబోధించినప్పుడు ధర్మశాస్త్రాన్ని గౌరవించిన వారు అన్ని యుగాల్లోను తమ విశ్వాసానికి నిలిచి ప్రాణాలు కోల్పోయిన లక్షలాది హతసాక్షులు ఆ తర్వాత దగ్గరగా వుంటారు. ఆ తర్వాత “ప్రతి జనములో నుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండియు వచ్చి యెవడును లెక్కింప జాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్న వారై, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల యెదుటను” నిలబడ్డారు. ప్రకటన 7: 9 వారి పోరాటం ముగుస్తుంది, విజయం వస్తుంది. పందెంలో పరుగెత్తిన వారు బహుమతి పొందుతారు. వారి చేతుల్లోని ఖర్జూరపుమట్టలు విజయానికి సంకేతం. తెల్లని వస్త్రం క్రీస్తు నిష్కళంకమైన నీతికి ప్రతీక. ఇప్పుడు క్రీస్తునీతి వారి సొంతమవుతుంది.GCTel 630.1

  రక్షణ పొందిన వారు “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము”(10వ వచనము) అంటూ స్తుతి చెల్లిస్తారు. ఆ గీతంతో పరలోకం మారుమోగుతుంది. దూతలు సెరాపులు గళాలు కలిపి పాడుతూ ఆయనను ఆరాధిస్తారు. రక్షణ పొందిన వారు సాతాను శక్తిని కౌటిల్యాన్ని చూసి తెలుసుకొనేటట్లు క్రీస్తు శక్తి తప్ప మరే శక్తి తమకు విజయాన్నిచ్చి వుండేది కాదని ముందెన్నటికన్నా ఇప్పుడు ఎక్కువగా గ్రహిస్తారు. ఆ సమూహంలో అందరు తమకు కలిగిన రక్షణ తమ స్వశక్తివల్లగాని మంచితనం వల్లగాని లభించదని భావించే వారు. వారు ఏమి చేశారు లేదా ఎన్ని బాధలనుభవించారు అన్న వాటిని గురించిన ప్రస్తావన ఉండదు. కాని ప్రతీ పాటకు పల్లవి ప్రతీ ఇతివృత్తం దీక్ష “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొట్టెపిల్లకును మా రక్షణకై స్తోత్రము” అన్నదే.GCTel 630.2

  భూలోకం నుంచి పరలోకం నుంచి సమావేశమైన వారి సమక్షంలో దైవ కుమారుని చివరి పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఇప్పుడు సర్వాధికారం అత్యధిక ప్రభావం పొందిన రారాజు తన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ద్రోహులపై తీర్పు ప్రకటించి తన చట్టాన్ని అతిక్రమించిన వారికి, తన ప్రజలను హింసించిన వారికి శిక్ష విధిస్తాడు. దేవుని ప్రవక్త ఇలా అంటున్నాడు, “మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని. భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్ప వారేమి కొద్దివారేమి మృతులైన వారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడి యుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, ఆ గ్రంథముల యందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి” ప్రకటన 20:11,12.GCTel 630.3

  గ్రంథాల్ని తెరచిన వెంటనే యేసు దుర్మార్గుల వంక చూడగా వారు చేసిన తప్పులు వారికి గుర్తు వస్తాయి. తమ పాదాలు సన్మార్గం నుంచి నీతి నుంచి ఎక్కడ తప్పాయో దైవధర్మ నియమాలకు ఎదురుతిరిగి వాటిని అతిక్రమించటంలో అహంకారం తిరుగుబాటు ఎంత వరకు నడిపించాయో జ్ఞాపకం వస్తుంది. తమ దుష్ప్రవర్తన ద్వారా వారు ప్రోత్సహించిన మోసకరమైన శోధనలు, దుర్వినియోగం చేసిన దీవెనలు, అనాదరణ పొందిన దైవ సేవకులు, విసర్జించబడిన హెచ్చరికలు పశ్చాత్తాపం లేని హృదమాన్ని మూర్బత్వం తోసిపుచ్చిన కృప-- ఇవన్నీ అగ్నితో రాసిన అక్షరాలా కనిపిస్తాయి.GCTel 631.1

  సింహాసనానికి పైన సిలువ కనిపిస్తుంది. ఆదాము శోధన, పతనం, అనంతరం రక్షణ ప్రణాళికలోని చర్యలు, రక్షకుని దీన జన్మ, ఆయన సాధారణ విధేయ జీవితం, యోర్డాను నదిలో ఆయన బాప్తిస్మం, అరణ్యంలో ఉపవాసం, శోధన, ఆయన ప్రజాసేవ, మనుషులకు దేవుని విలువైన దీవెనలు, ప్రేమ, కరుణా కార్యాలతో నిండిన దినాలు, మెలకువగా ఉండి ఏకాంతంగా పర్వతాల్లో ప్రార్ధనలో గడిపిన రాత్రులు, చేసిన మేళ్లకు ప్రతిగా అసూయ, ద్వేషం, దుర్బుద్ధితో కూడిన కుట్రలు, లోక పాపాల భారంతో గెత్సేమనే తోటలో హృదయవేదన, హంతకుల చేతులకు ఆయన అప్పగింత, ఆ రాత్రి చోటు చేసుకొన్న భయంకర ఘటనలు, తాను అమితంగా ప్రేమించిన శిష్యులచే విసర్జన, అనంతరం యెరూషలేము వీధుల్లో నుంచి నడిపించుకు వెళ్తున్న ప్రతిఘటన లేని ఖైదీ, అన్నా ముందు దైవ కుమారుని ప్రదర్శన, ప్రధానయాజకుడి భవనంలోనూ, పిలాతు న్యాయస్థానంలోనూ పిరికి హేరోదు సముఖంలోను నేరారోపణ, ఎదురైన ఎగతాళి, అవమానం, హింస, మరణశిక్ష - ఇవన్నీ ఒక విశాల దృశ్యంలోలా స్పష్టంగా చిత్రీకరించ బడ్డాయి.GCTel 631.2

  ఊగిసలాడున్న జనసమూహం ముందు ఈ చివరి దృశ్యాలు ప్రదర్శితమవుతాయిభారంగా అడుగులు వేస్తూ కల్వరికి వస్తున్న మౌన బాధితుడు, సిలువపై వేళాడున్న పరలోక యువరాజు, యాజకులు ప్రజలచే శ్రమలసుభవిస్తున్న ప్రభువుకు ఎగతాళి, అస్వాభావికమైన చీకటి కంపిస్తున్న భూమి, బద్దలైన బండలు, లోక రక్షకుడు ప్రాణం విడిచిన ఘడియను సూచిస్తూ తెరువబడ్డ సమాధులు.GCTel 632.1

  భయం పుట్టించే ఆ దృశ్యాలు అవి జరిగినప్పటి తాజాతనంతో ప్రదర్శితమౌతాయి. చేస్తున్న పనిని చూపించే దృశ్యంలో నుంచి సాతానుగాని అతని దూతలుగాని అతని ప్రజలుగాని తప్పుకోలేరు. తాను నిర్వహించిన కార్యాలనే ప్రతీ వ్యక్తి ప్రదర్శించాడు. ఇశ్రాయేలు రాజును అంతం చేయటానికి బెల్లెహేములోని చిన్న పిల్లల్ని సంహరించిన హేరోదు, బాప్తిస్మమిచ్చే యోహాను రక్తానికి బాధ్యురాలైన హేరోదియ, అసమర్దుడైన పిలాతు, ఎగతాళి చేసిన భటులు, “వాని రక్తము మా మీదను, మా పిల్లల మీదను ఉండును గాక” అని కేకలు వేసిన యాజకులు, పరిపాలకులు, వెర్రెత్తిన ప్రజలు-- అందరూ విస్తారమైన తమ అపరాధాల్ని వీక్షిస్తారు. “నా కోసం మరణించిన ప్రభువు” అంటూ విమోచన పొందిన ప్రజలు తమ కిరీటాలు యేసు పాదాలవద పెడుతుంటే సూర్యతేజస్సును మించిన కాంతిగల ఆయన ముఖాన్ని చూడకుండా దాకోటానికి ఆ దుష్టులు వ్యర్థ ప్రయత్నాలు చేస్తారు.GCTel 632.2

  రక్షణ భాగ్యం కలిగిన జససందోహంలో క్రీస్తు అపోస్తలులు-- వీర భక్తుడు పౌలు, పట్టుడల గల అనుచరుడు పేతురు, ప్రేమగల ప్రేమించదగిన భక్తుడు యోహాను, వారి యధార్ధ హృదయులైన సహోదరులు, వారితో పాటు గొప్ప హతసాక్షుల సమూహం ఉంటారు. నానాదుష్కార్యాలు హేయకృత్యాలకు పాల్పడుతూ దైవ జనులను హింసించి, ఖైదులోవేసి, సంహరించిన వారు బైట ఆ గోడల వెలపల ఉంటారు. తాను పెట్టే హింసకు గురి అయి బాధ ననుభవిస్తున్న వారిని చూసి వారి తీవ్ర వేదనను క్షోభను పైశాచికానందంతో తిలకించిన ఆ క్రూర మృగం నీరో ఆ గుంపులో ఉంటాడు. తాను చేసిన పని ఫలితాలు, తన కుమారునికి ఆమె అందించిన దుష్ప్రవర్తన తన ప్రభావం ద్వారా ఆదర్శం ద్వారా ఆమె ప్రోత్సాహించిన ఆవేశకావేషాలు, అవి నేరాల రూపంలో ఫలించిన ఫలాలు కళ్లారా చూడటానికి అతడి తల్లి కూడా ఆ గుంపులో ఉంటుంది.GCTel 632.3

  క్రీస్తు రాయబారులమని చెప్పుకొంటూ ప్రజల మనస్సాక్షిని అదుపుచేసేందుకోసం శిరచ్ఛేదనలు, చీకటికొట్లలో నిర్బంధనలు కావించిన పోపుమతవాద ప్రీస్టులు, ప్రిలేటులు అక్కడుంటారు. దేవునికి పైగా తమ్ముని తాము హెచ్చించుకొని సర్వోన్నతుడైన దేవుని ధర్మశాస్త్రాన్ని మార్చటానికి చూసిన అహంకారపూరిత మతగురువులు అక్కడుంటారు. సంఘ ఫాదర్లుగా నటించిన ఆ బూటకపు నాయకులు దేవునికి లెక్క అప్ప జెప్పాల్సింది చాలా వుంది. అది క్షమించబడుందని వారి నమ్మకం. సర్వజ్ఞుడైన ప్రభువు తన ధర్మశాస్త్రం విషయంలో రోషంగల వాడని అపరాధుల్ని ఆయన ఉపేక్షించడని వారికి ఆలస్యంగా గ్రాహ్యమవుతుంది. శ్రమలనుభవించే తన ప్రజల ఆసక్తులే తన ఆసక్తులుగా క్రీస్తు పరిగణిస్తాడని ఇప్పుడు వారు తెలుసుకొంటారు. ఆయన పలికిన ఈ మాటల్లోని అరాన్ని వారు గ్రహిస్తారు: “మిక్కిలి అల్పులైన యీనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” మత్తయి 25:40.GCTel 632.4

  దుష్ట లోకమంతా రాజద్రోహ నేరం పై దేవుని న్యాయస్థానంలో నిలబడుతుంది. వారి కేసును వాదించటానికి ఎవరూ ఉండరు. వారికి సాకు ఉండదు. వారికి నిత్యమరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువడుంది.GCTel 633.1

  పాపం సంపాదించే జీతం మరణమే తప్ప స్వతంత్ర నిత్యజీవం కానేకావని ఇప్పుడు అందరికి విదితమౌతుంది. తిరుగుబాటు జీవితంవల్ల తాము పోగొట్టుకొన్నది ఏమిటో దుర్మార్గులు గ్రహిస్తారు. అత్యధికమైన విలువగల నిత్యజీవం లభ్యమయ్యే సమయంలో వారు దాన్ని తృణీకరించారు. ఇప్పుడది ఎంతో కోరదగినదిగా కనిపిస్తుంది. “ఇదంతా నాకు ఉండేది. కాని వీటిని నేను ఆమడ దూరాన ఉంచాను. ఆశ ఎంత విచిత్రమైంది. సమాధానం, సంతోషం, గౌరవాలకు మారుగా దౌర్భాగ్యాన్ని, అప్రతిష్ఠను, నిస్పృహను ఎన్నుకొన్నాను” అంటూ నశించిన ఆత్మ వాపోతుంది. పరలోకం నుంచి తమ మినహాయింపు న్యాయమే అని అందరూ అంగీకరిస్తారు. తమ బతుకుల ద్వారా వారిలా ప్రకటిస్తారు. “ఇతడు మమ్మునేలుట మాకిష్టములేదు” GCTel 633.2

  దైవ కుమారుని పట్టాభిషేకం దుర్మార్గులకు దర్శనంలో చూసినట్లుంటుంది. తాము ద్వేషించి ఉల్లంఘించిన దైవ ధర్మశాస్త్రాన్ని ఆయన చేతుల్లో చూస్తారు. రక్షణ పొందిన ప్రజలు ఆశ్చర్యం, ఆనందం, ఆరాధన భావంతో ఉత్సాహగానాలు చేయటం వారు చూస్తారు. పట్టణం వెలుపల ఉన్న జన సమూహాలు ఆ గానం వింటూ “ప్రభువా, దేవా సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి” అంటూ వారంతా ఒకే కంఠంతో పలుకుతారు. (ప్రకటన 15:3.) నేలమీద పడి జీవనాధుణ్ణి ఆరాధిస్తారు.GCTel 633.3

  క్రీస్తు మహిమను మహాత్మ్యాన్ని చూసి సౌతాను స్తంభించి పోతాడు. ఒకప్పుడు ఆశ్రయంగా ఉన్న, కెరూబు అయిన తాను ఎంత ఉన్నతస్థాయి నుంచి పడిపోయాడో గుర్తు తెచ్చుకొంటాడు. ప్రకాశమానమైన సెరాపు, “తేజోనక్షత్రము”గా ఉన్న అతను ఎంత మారిపోయాడు! ఎంత దిగజారిపోయాడు! ఒకప్పుడు తాను సన్మానం పొందిన సభనుంచి అతను నిత్యబహిష్కృతుడు. తండ్రికి దగ్గరగా మరోదూత నిలబడి ఆయనను కప్పుతుండటం అతను చూస్తాడు. ఆజాను బాహుడు, ఠీవిగా వ్యవహరిస్తున్న వాడు అయిన ఒక దూత క్రీస్తు శిరం మీద కిరీటం పెట్టటం చూస్తాడు. ఈ దూత పొందిన ఆ సమున్నత హోదా తనకు వచ్చి ఉండేదని అతను లోలోన బాధపడ్డాడు.GCTel 634.1

  తాను అమాయకంగా పరిశుద్ధంగా ఉన్ననాటి గృహం, దేవునికి వ్యతిరేకంగా సణుగుతూ క్రీస్తుపై ఈర్ష్య వ్యక్తం చేసేంతవరకూ తాను అనుభవించిన సమాధానం, సంతృప్తి, జ్ఞాపకాలు అతని మనసులో మెదులుతాయి. అతని ఆరోపణలు, అతని తిరుగుబాటు, సాటి దూతల సానుభూతి సంపాదించటానికి అతను చేసిన మోసాలు, దేవుడు తనను క్షమించటానికి అవకాశమున్నప్పుడు అసలు ప్రయత్నించకుండా మొండిగా నిలిచిపోవటం - అన్నీ స్పష్టంగా అతని ముందుకు వస్తాయి. మనుషుల మధ్య తాను చేస్తున్న పనిని ఆ పని ఫలితాన్ని అతను పునస్సమీక్షిస్తాడు. మనిషికి తోటిమనిషి పట్ల వైరుధ్యం, విధ్వంసం, ప్రాణ నష్టం, రాజ్యాల ఉత్థాన పతనాలు, ప్రభుత్వాల కూల్చివేతలు ఒక దాని వెంట ఒకటిగా అల్లరు, సంఘర్షణలు, విప్లవాలు-- ఇవి అతని కార్యకలాపాలు. క్రీస్తు పరిచర్యను వ్యతిరేకించటానికి మనిషిని అదోగతికి దిగజార్చటానికి తన అవిశ్రాంత కృషిని జ్ఞప్తికి తెచ్చుకొంటాడు. యేసును నమ్మిన వారిని నాశనం చేయటానికి తన కుతంత్రాలు నిష్ప్రయోజనమౌతున్నాయని గ్రహిస్తాడు. సాతాను తన రాజ్యాన్ని పారజూసినప్పుడు తన కృషి ఫలితంగా కనిపించేది వైఫల్యం నాశనమే. దేవుని పట్టణాన్ని స్వాధీనం చేసుకోటం నల్లేరుపై బండి నడకని ప్రజాసమూహాల్ని నమ్మిస్తాడు. కాని అది జరగని పని అని అతనికి తెలుసు. ఈ మహా సంఘరణలో సాతాను పదేపదే పరాజయం పొందాడు. లొంగిపోవలసిందిగా వచ్చిన ఒత్తిడిని తోసిపుచ్చాడు. నిత్యుడైన దేవుని శక్తి ప్రభావాలు అతను బాగా ఎరిగినవే.GCTel 634.2

  ఈ గొప్ప తిరుగుబాటు దారుడి గురి ఏమిటంటే తాను అనుసరించిన మార్గమే సమంజసమైనదని తన తిరుగుబాటుకు దేవుని ప్రభుత్వానిదే బాధ్యత అని నిరూపించటం. ఈ కార్య సాధనకు తన అసాధారణ మేధను శక్తిని వినియోగించి పని చేస్తున్నాడు. అతను పద్ధతి ప్రకారం చాలా విజయవంతంగా పనిచేస్తూ వచ్చాడు. దీర్ఘకాలంగా సాగుతున్న ఈ మహా సంఘర్షణను గురించి విశేష ప్రజానీకం తన అభిప్రాయాల్ని అంగీకరించేటట్లు వారిని మభ్యపెడుతున్నాడు. కుతంత్రాలకు కుట్రలకు అధినేత అయిన ఇతను వేల సంవత్సరాల కొద్దీ అబద్ధాన్ని సత్యంగా నమ్మిస్తూ వచ్చాడు. అయితే ఈ సంఘర్షణలో చివరి ఓటమికీ, సాతాను పుట్టుపూర్వోత్తరాలు, ప్రవర్తన సుబ్బు రట్టవ్వటానికి ఇప్పుడు సమయం వస్తుంది. క్రీస్తును సింహాసనం నుంచి తొలగించటానికి, ఆయన ప్రజల్ని నాశనం చెయ్యటానికీ, పరిశుద్ధ పట్టణాన్ని స్వాధీనం చేసుకోటానికి ఈ అపూర్వ వంచకుడు చేసే బృహత్తర ప్రయత్నంలో అతడి ముసుగు తొలగిపోవటం ఖాయం. అతని నిజస్వరూపం బట్టబయలవుతుంది. అతనితో కలిసి పని చేసినవారందరు అతని ఉద్యమం కుప్ప కూలటం చూస్తారు. క్రీస్తు అనుచరులకు విశ్వసనీయ దూతగణానికి దేవుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను చేసిన కుతంత్రాల కత కమామీషు పూర్తిగా తెలిసిపోతుంది. అతను విశ్వవ్యాప్త ద్వేషానికి తిరస్కృతికి గురి అవుతాడు.GCTel 634.3

  తాను బుద్ధి పూర్వకంగా చేసిన తిరుగుబాటు తనను పరలోక నివాసానికి అనర్హుణ్ణి చేస్తుందని సాతాను గ్రహిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా పోరాడటానికి అతను తనశక్తి సామర్థ్యాల్ని వినియోగిస్తున్నాడు. పరలోకంలోని ఐక్యత, సమాధానం, సామరస్యం అతనికి హింసగా ఉంటుంది. దేవుని కృపాన్యాయాల విషయంలో అతని ఆరోపణలు ఇప్పుడు మూగబోతాయి. తాను యెహోవా మీద మోపటానికి ప్రయత్నించిన నింద ఇప్పుడు పూర్తిగా అతనిమీదే పడుతుంది. సాతాను ఇప్పుడు దిగివచ్చి దేవునికి నమస్కరించి తనకు వేసిన శిక్ష న్యాయమైందేనని ఒప్పుకొంటాడు.GCTel 635.1

  “ప్రభువా నీపు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు” 4వ వచనం. దీర్ఘకాలంగా సాగుతున్న సంఘర్షణలోని సత్యాసత్యాలకు సంభంధించిన ప్రతీ ప్రశ్న ఇప్పుడు స్పష్టమౌతుంది. తిరుగుబాటు ఫలితాలు, దేవుని నీతి విధుల తిరస్కృతి ఫలాలు సృజించబడ్డ మేధావుల ముందుంచటం జరుగుతుంది. దైవ పరిపాలన నియమ నిబంధనలు వాటికి విరుద్దంగా సాతాను అనుసరిస్తున్న యమాలూ సకల విశ్వం ముందు పెట్టటం జరుగుతుంది. తన క్రియలే సాతానుని నేరస్తుణ్ణి శిక్షార్హుణ్ణి చేస్తాయి. దేవుని వివేకం, న్యాయగుణం, మంచితనం నిజమైనవని రుజువవుతుంది. ఈ మహా సంఘర్షణలో దేవుడు తన కార్యాలన్నింటిని తన ప్రజల హితం తానుసృజించిన ఇతర లోకాల ప్రజల హితం కోరి జరిగించాడని వ్యక్తమౌతుంది. “యెహోవా నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు.” కీర్తనలు 145:10. దైవధర్మశాస్త్రం అస్థిత్వంతోనే దేవుడు సృజించిన మనుషుల సంతోషానందాలు ముడిపడి ఉన్నాయని పాపాల్ని గూర్చిన చరిత్ర నిత్యసాక్ష్యంగా నిలుస్తుంది. మహా సంఘర్షణను గూర్చిన వాస్తవాలన్నీ బాహాటంగా కనిపించటంతో, విశ్వసనీయ ప్రజలు తిరుగుబాటు దారులు సహా విశ్వమంతా ఏకమనసుతో “యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి.” అని ప్రకటిస్తుంది.GCTel 635.2

  మానవుడి తరపున తండ్రి కుమారులు చేసిన బృహత్తర త్యాగం విశ్వం ముందు ఉంచటం జరుగుతుంది. క్రీస్తు తన న్యాయమైన స్థానాన్ని పొందటానికి సమయం వస్తుంది. రాజ్యాలకన్నా, అధికారులకన్నా, పేరుగల ప్రతి నామంకన్నా ఆయన అత్యున్నత మహిమను కలిగి ఉంటాడు. తన ముందున్న ఆనందం నిమిత్తం అనగా అనేకమంది మనుషుల్ని మహిమలోకి తెచ్చేందుకు ఆయన సిలువను భరించాడు. అవమానాన్ని సహించాడు. దుఃఖం పరాభవం ఎంత చేదుగా ఉన్నా ఆయన పొందే ఆనందం మహిమ మరెంతో ఉన్నతంగా ఉంటాయి. తన స్వరూపంలోకి మారి విమోచన పొందిన ప్రజల వంక ఆయన చూస్తాడు. ప్రతీ హృదయం దేవుని స్వరూపాన్ని ధరించుకొని ఉంటుంది. ప్రతీ ముఖం తమ రాజు యేసు పోలికను సంతరించుకొని ఉంటుంది. తన ఆత్మకు సంభవించిన వేదనను వాటిలో చూసి ఆయన తృప్తి చెందుతాడు. దరిమిల సమావేశమై ఉన్న నీతిమంతులు దుర్మార్గుల సమూహాలకు వినిపించే స్వరంతో ఆయన ఈ ప్రకటన చేస్తాడు: “ఇదిగో వీరు నా రక్తంతో నేను కొన్నవారు. వీరు నాతోపాటు అనంత యుగాలు నివసించేందుకుగాను వీరికోసం నేను శ్రమలను భరించాను, వీరికోసం నేను మరణించాను.” తెలని వస్త్రాలు ధరించి సింహాసనం చుట్టూ ఉన్న వారు పాడే ఈ స్తోత్రగీతం వినిపిస్తుంది, “వధించబడిన గొట్టెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు” ప్రకటన 5:10.GCTel 636.1

  దేవుని న్యాయశీలతను అంగీకరించి క్రీస్తు సర్వోన్నతిని గుర్తిస్తూ ఆయనకు నమస్కరించి నప్పటికీ సాతాను ప్రవర్తనలో మార్పేమీ ఉండదు. తిరుగుబాటు స్వభావం మహా జలపాతంలా మళ్లీ విరుచుకుపడుంది; కోపోద్రిక్తుడై తన మహా సంఘర్షణను కొనసాగించటానికి తీర్మానించుకొంటాడు. పరలోకరాజుపై దాడికి చివరి ప్రయత్నానికి సమయం వస్తుంది. హుటాహుటిగా తన ప్రజల్లోకి వెళ్లి దురాగ్రహం పుట్టించి వారిని వెంటనే యుద్ధానికి సిద్ధం చేయటానికి ప్రయత్నిస్తాడు. తన మోసంలో పడి తిరుగుబాటులో పాల్గొన్న కోట్లాది ప్రజల్లో అతని ఆధిక్యాన్ని అంగీకరించిన వారు ఎవరూ ఉండరు. అతని శక్తి పోతుంది. దేవుని పట్ల సాతానుకున్న ద్వేషమే దుష్టప్రజల్లోనూ ఉంటుంది. కాని తమ పరిస్థితి ఆశాజనకంగా లేదని యెహోవాకు వ్యతిరేకంగా తాము పోరాడలేమని వారు గుర్తిస్తారు. వారి ఆగ్రహం సాతానుపైన మోసం చేయటంలో అతనికి కుడిభుజంగా ఉన్న దుష్టదూతలపైన రగుల్కొంటుంది. పైశాచిక ఆగ్రహంతో అతనిపై విరుచుకు పడ్డారు.GCTel 636.2

  ప్రభువంటున్న మాటలిలాగున్నాయి, “దేవునికి తగినంత అభిప్రాయం కలిగియున్న వాడా ఆలకింపుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్యమును నీచపరతురు. నిన్ను పాతాళములో నుండి పడవేతురు ” “ఆశ్రయముగా ఉన్న కెరూబూ కాలుచున్న రాళ్ల మధ్యను నీ వికను సంచరింపవు... నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళన కప్పగించేదను... జనులందరు చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసెదను... నిన్ను ఎరిగిన వారందరును నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు.” యెహేజ్కేలు 28:68; 16-19.GCTel 637.1

  “యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లుసు రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును” “యెహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చుచున్నది. వారి సర్వసైన్యముల మీదికి ఆయస క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించును”. “దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయ భాగమగును.” యెషయా 9:5; 34:2; కీర్తనలు 11:6. దేవుని వద్ద నుంచి ఆకాశంలోనుంచి అగ్ని దిగివస్తుంది. భూమి బద్దలైపోతుంది. భూమిలో దాచి ఉంచిన ఆయుధాలు బైటికి తీస్తారు. బద్దలైన భూమి సంధుల్లో నుంచి మంటలు బయలుదేరాయి. రాళ్ల నుంచి మంటలు రేగుతాయి. సూర్యుడు ప్రచండమైన వేడితో మండుతున్న పొయ్యిలా ప్రకాశిస్తాడు. పంచభూతాలు, భూమి, దానిమీది కృత్యాలు మిక్కుటమైన వేడితో కాలిపోతాయి. మలాకీ 4:11; 2 పేతురు 3:10. భూమి ఉపరితలం కరిగించి పోతపోసిన ముద్దలా కుత కుత ఉడుకుతున్న అగ్ని సరస్సులా కనిపిస్తుంది. అది దుర్మారుల తీర్పు నాశనాల దినం - “యెహావా ప్రతి దండన చేయు దినము, సీయోను వ్యాజ్యెమును గూర్చిన ప్రతీకార సంవత్సరము.” యెషయా 34:8GCTel 637.2

  దుష్టులు తమ ప్రతి ఫలాన్ని భూమి మీద పొందుతారు. సామెతలు 11:31. ‘‘గర్విష్టులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు... రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” మలాకి 4:1. కొందరు ఒక్క క్షణంలోనే నశించగా కొందరు చాలా దినాలు బాధననుభవిస్తారు. “వాని వాని క్రియల చొప్పున” అందరికీ శిక్ష కలుగుతుంది. నీతిమంతుల పాపాలు సాతానుకి బదలాయింపు కావటంతో అతను తన తిరుగుబాటు నిమిత్తమేగాక దేవుని ప్రజలతో చేయించిన పాపాల నిమిత్తం కూడా శిక్ష అనుభవిస్తాడు. అతనివల్ల మోసపోయిన వారి శిక్షకన్నా సాతాను శిక్ష ఎంతో అధికంగా ఉంటుంది. తన మోసాల వల్ల పడిపోయిన వారందరూ నాశనమైన తర్వాత అతను ఇంకా జీవించి బాధ ననుభవించాల్సి ఉంటుంది. చివరికి దుర్మార్గులు ప్రక్షాళన అగ్నిలో కాలి వేరుగాని కొమ్మలుగాని లేకుండా నాశనమవ్వటంతో జరుగుతుంది. వేరు సాతాను, కొమ్మలు అతని అనుచరులు. ధర్మశాస్త్రం విధించే శిక్ష పూర్తిగా అమలవుతుంది. న్యాయం జరిగించబడుతుంది. పరిశీలిస్తున్న భూలోక పరలోక యెహోవా నీతి ప్రచురపర్చ బడుతుంది.GCTel 638.1

  సాతాను విధ్వంసక క్రియలకు తెర పడుంది. ఆరువేల సంవత్సరాలుగా అతను తన దుష్కృతాలు చేస్తూ ఈ విశ్వాన్ని దుఃఖంతో నింపుతూ వచ్చాడు. సృష్టి అంతా బాధతో మూలుతున్నది. ఇప్పుడు దేవుని ప్రజలు అతని నుంచి అతని శోధనల నుంచి విముక్తి పొందుతారు. “భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది. జనములు పాడసాగుదురు” యెషయా 14:7. నమ్మకంగా నిలిచిన విశ్వమంతా కృతజ్ఞతతో విజయ నినాదాలు చేస్తుంది. “గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము” ఇలా అనటం వినిపిస్తుంది, “సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు; ఆయనను స్తుతించుడి” ప్రకటన 19:6.GCTel 638.2

  అగ్ని జ్వాలలు భూమండలాన్ని అలముకొని నాశనం చేస్తుండగా పరిశుద్దులు పరిశుద్ధ పట్టణంలో క్షేమంగా ఉంటారు. మొదటి పునరుత్థానంలో పాలుపొందిన వారిపై రెండో మరణానికి శక్తి ఉండదు. దేవుడు దుర్మార్గులకు దహించే అగ్నిగాకా, తన ప్రజలకు సూర్యుడుగాను రక్షణ కవచంగాను ఉంటాడు. ప్రకటన 20:6; కీర్తనలు 84:11.GCTel 638.3

  “అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను” ప్రకటన 21:1. దుష్టులను దహించివేసే అగ్ని భూమిని పవిత్రం చేస్తుంది. శాప సూచనలన్నీ తుడుపు పడ్డాయి. భయంకరమైన పాప పర్యవసాల్ని రక్షణ పొందిన వారిముందు జ్ఞాపకం చేస్తూ ఉండటానికి నిత్య నరకాగ్ని ఉండదు.GCTel 638.4

  జ్ఞాపకం చేసే గుర్తు ఒకటి మాత్రమే ఉంటుంది. మన రక్షకుడు తాను పొందిన సిలువ గుర్తుల్ని ఎల్లప్పుడు కలిగివుంటాడు. పాపం కావించిన చెడు అంతటినీ సూచించే క్రూర చిహ్నాలు శిరంమీద గాయపడ్డ ఆయన పక్కలోను చేతుల్లోను కాళ్లలో కనిపిస్తాయి. మహిమతో ప్రకాశిస్తున్న క్రీస్తును వీక్షిస్తూ ప్రవక్త ఇలా వర్ణిస్తున్నాడు: “ఆయన హస్తమునుండి కిరణములు బయలు వెడలు చున్నవి. అచ్చట ఆయన బలము దాగియున్నది” హబక్కూకు 3:4. గాయపడ్డ ఆ పక్క నుంచి ప్రవహించి మానవుణ్ణి దేవునితో సమాధాన పర్చిన రక్త ప్రవాహమే రక్షకుని మహిము. అక్కడే “ఆయన బలము దాగియున్నది” విమోచక త్యాగం ద్వారా “రక్షించుటకు బలాఢ్యుడు” అయిన ప్రభువు తన కృపను తృణీకరించిన వారికి శిక్ష అమలు పర్చటానికి శక్తిమంతుడు. తన అవమాన చిహ్నాలే ఆయనకు అత్యున్నత గౌరవ పురస్కారాలు. కల్వరిలోని గాయాలు నిత్యయుగాల పొడుగునా ఆయనకు స్తుతులు చెల్లించి ఆయనశక్తిని ప్రచురపర్చుతాయి.GCTel 639.1

  “మందల గోపురమా, సీయోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును” మీకా 4:8. ప్రథమ దంపతులు ఆదామవ్వల్ని ఏదెనులో ప్రవేశింపకుండా ఖడ్గ జ్వాల ఆపినప్పటి నుంచి “ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగుటకై” (ఎఫెస్సీ 1:14.) పరిశుద్ధులు ఆశతో ఎదురుచూసిన సమయం ఇప్పుడు వస్తుంది. ఆదిలో తన రాజ్యంగా తనకు వచ్చిన ఈ భూమిని మానవుడు సాతాను మోసంలో పడి అతడికి ధారాదత్తం చేయగా బలమైన ఆ శత్రువు ఇంత కాలం దాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. అయితే రక్షణ ప్రణాళిక ద్వారా అది ఇప్పుడు మానవులకు తిరిగి వస్తుంది. పాపం వల్ల నశించినదంతా పునరుదరణ పొందుతుంది. “ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా... భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాని సృజించెను” యెషయా 45:18. ఈ భూమి విమోచన పొందిన జనులకు నివాస స్థలం అవుతుంది. కనుక భూమిని సృజించటంలో ఆదిలో దేవునికున్న ఉద్దేశం నెరవేరుతుంది. “నీతిపుంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు.” కీర్తనలు 37:29.GCTel 639.2

  భవిష్యత్తులో పరలోకంలోని వారసత్వాన్ని భౌతిక దృష్టితో పరిగణించే భయంవల్ల పరలోకాన్ని మన గృహంగా భావించటానికి నడిపించే సత్యాల్ని అనేకులు ఆధ్యాత్మిక వాదంగా మాత్రమే అంగీకరిస్తున్నారు. తండ్రి ఇంట నివాసాలు సిద్ధపర్చటానికి వెళ్లినట్లు క్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. దైవవాక్య బోధనల్ని అంగీకరించేవారు పరలోక నివాసాల గురించి పూర్తిగా ఎరుగనివారు కాదు. అయినా “దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు.” 1 కొరింధి 2:9. నీతిమంతుల ప్రతిఫలం ఎలాంటిదో వర్ణించటానికి మానవ భాష చాలదు. చూసే వారే దాన్ని తెలుసుకో గలుగుతారు. దేవుని పరదైసును మహిమా ప్రభావాల్ని మానవ మేధ అవగాహన చేసుకోలేదు.GCTel 640.1

  రక్షణ పొందిన పరిశుద్దుల వారసత్వాన్ని బైబిలు ఓ “పట్టణము” అంటుంది. హెబ్రీ 11:14-16. అక్కడ పరలోకపు కాపరి తన మందల్ని జీవజలాల ఊటల వద్దకు నడిపిస్తాడు. జీవవృక్షం నెలనెల ఫలాలు ఫలిస్తుంది. ఆ వృక్షం ఆకులు వివిధ జాతుల ప్రజల పరిచర్యకు వినియోగమవుతాయి. అక్కడ నిరంతరం ప్రవహించే ఏరులుంటాయి. వాటి జలాలు నిర్మలంగా వుంటాయి. ఆ ఏరుల పక్క రక్షణ పొందిన వారికి ఏర్పాటైన దారుల పక్క తలలు ఊపుతూ నీడనిచ్చే చెట్లుంటాయి. అక్కడ విశాల మైదానాలు అందమైన కొండలవరకూ వ్యాపించి ఉంటాయి. దేవుని పర్వతాలపై ఎత్తయిన శిఖరాలు కనిపిస్తాయి. ఎంతో కాలంగా యాత్రికులు పరదేశులుగా జీవించిన దైవప్రజలు నిత్యమూ ప్రవహించే ఆ ఏరుల పక్క ప్రశాంత మైదానాల్లో నివాసముంటారు.GCTel 640.2

  “నా జనులు విశ్రమ స్థలము నందును ఆశ్రయస్థానములందును సుఖకరమైన నివాసములందుసు నివసించెదరు”. “ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అనుమాటగాని, నాశనము అను మాటగాని వినపడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు”. “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు... తాము చేసికొనిన దానిఫలమును పూర్తిగా అనుభవింతురు” యెషయా 32:18; 60:18; 65:21, 22.GCTel 640.3

  “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పమువలె పూయును” ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును” “తోడేలు, గొట్టె పిల్లయొద్ద వాసము చేయును. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును... బాలుడు వాటిని తోలును”. “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనముచేయదు” యెషయా 35:1; 55:13; 11:6-9.GCTel 640.4

  పరలోక వాతావరణంలో బాధ ఉండటం అసాధ్యం. కన్నీళ్లు సమాధి కార్యక్రమాలు, దుఃఖదుస్తులు ఉండవు. “మరణము ఇక ఉండదు.దుఃఖమైనను ఏడ్పయినను వేదనయైనను ఇక వుండదు. మొదటి సంగతులు గతించిపోయెను”. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు. దానిలో నివసించు నరుల దోషము పరిహరింప బడును.” ప్రకటన 21:4; యెషయా 33:24. నూతన యెరూషలేము “యెహోవా చేతిలో భూషణ కిరీటము... దేవుని చేతిలో రాజకీయ మకుటము” అయి నూతన భూమికి రాజధానిగా ఉంటుంది. “దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.” “జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దాని లోనికి తీసికొని వత్తురు.” ప్రభువిలా అంటున్నాడు: “నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. నా జనులను గూర్చి హర్షించెదను. ” “ఇదిగో దైవ నివాసము మనుష్యులతో కూడ ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజల్లో యుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.” యెషయా 62:3; ప్రకటన 21:11, 24; యెషయా 65:19; ప్రకటన 21:3.GCTel 641.1

  దేవుని పట్టణంలో “రాత్రిలేదు”. విశ్రాంతి అవసరమయ్యేవారుగాని కోరేవారుగాని అక్కడ ఉండరు. దేవుని చిత్రాన్ని జరిగించటంలోనే గాని ఆయన నామాన్ని స్తుతించటంలోనే గాని విసుగు అలసట ఉండవు. ఉదయాన ఉండే తాజాతనమే ఎప్పుడూ ఉంటుంది. సాయంత్రం రానేరాదు. “రాత్రి యిక నెన్నడు ఉండదు. దీపకాంతియైనను సూర్యకాంతి యైనను వారి కక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును” ప్రకటన 22:5. అది సూర్యకాంతికన్నా ప్రకాశవంతమైన వెలుగు. కాని అది బాధకరమైన తేజస్సుకాదు. అయినా ఆ కాంతి మధ్యాహ్న సూర్యకాంతికన్నా ప్రకాశవంతమైనది. తండ్రి మహిమతోను గొర్రెపిల్ల మహిమతోను పరిశుద్ధపట్టణం నిత్యమూ వెలుగుతో నిండి ఉంటుంది. రాత్రిలేని ఆ నిత్యదినంలో రక్షణ పొందిన భక్తులు సంచరిస్తారు.GCTel 641.2

  “దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొట్టెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.” ప్రకటన 21:22. దైవ ప్రజలు తండ్రితోను కుమారునితోను భయంగాని దాపరికంగాని లేకుండా మాట్లాడవచ్చు. “ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము.” 1 కొరింథి 13:12. ప్రకృతి కృత్యాలలోను ఆయన వ్యవహరించే విషయాల్లోను మనం ఆయన స్వరూపాన్ని అద్దంలో చూసినట్లు ఇపుడు చూస్తున్నాం. అప్పుడైతే మధ్య మసక తెరలేకుండా ఆయనను ముఖాముఖి చూస్తాం. ఆయన ముందు నిలబడి ఆయన ముఖం మీది మహిమను చూస్తాం.GCTel 642.1

  రక్షణ పొందిన భక్తులు అక్కడ ఒకరినొకరు తెలుసుకొంటారు. దేవుడు ఆత్మలో పెట్టిన ప్రేమ సానుభూతి అక్కడ క్రియాశీలకమవుతాయి. పరిశుద్ధ దూతలతో నిర్మలమైన ఇష్టాగోష్ఠి దేవదూతలతోను అన్నియుగాల్లోను దేవునికి నమ్మకంగా నిలిచి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుక్కొని తెల్లగా చేసుకొన్న భక్తులతో సామరస్య పూర్వక సాంఘిక జీవితం, “పరలోకమునందును భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము” (ఎఫెస్సీ 3:15.) ను ఏకంచేసే పవిత్ర బంధాలు-- ఇవి విమోచన పొందిన వారికి సంతోషానందాల్ని ప్రోదిచేస్తాయి.GCTel 642.2

  సృజన శక్తి అద్భుతాలను గురించి, విమోచక ప్రేమ మర్మాలను గురించి అక్కడ అమర్య మనస్సులు నిత్యము ఆనందంతో ధ్యానిస్తూ ఉంటాయి. దేవుని గురించి మరపు పుట్టించే శోధకుడు మోసగాడు ఉండడు. మేధ వృద్ధి చెందుతుంది. సామర్థ్యం అధికమవుతుంది. జ్ఞానార్జన కృషి మనసుకు శ్రమ అనిపించదు, అలసట పుట్టించదు. అక్కడ భారీ పథకాలు చేపట్టవచ్చు. ఉన్నతాశయాలు నెరవేర్చుకోవచ్చు. ఉన్నతమైన ఆశలు అభిలాషలు తీర్చుకోవచ్చు. సాధించాల్సిన ఆశయాలు పెరుగుతూనే ఉంటాయి. అభినందించటానికి కొత్తవింతలు, గ్రహించటానికి కొత్త వాస్తవాలు, మనసును ఆత్మను శరీరాన్ని సవాలుచేసే ధ్యేయాలు ఉత్థానమౌతూనే ఉంటాయి.GCTel 642.3

  రక్షణ పొందిన ప్రజలు అధ్యయనం చేయటానికి విశ్వవిజ్ఞానమంతా వారి ముందర ఉంటుంది. ఇక మరణ బంధకాలు లేని ఆ అమర్త్యులు దూరాన వున్న ఇతరలోకాలకు అలవోకగా ఎగిరి వెళ్తారు. అవి మానవ దుఃఖాన్ని చూసి, వేదన చెంది, విమోచన పొందిన ఆత్మ విషయం విని ఎంతో ఆనందించిన లోకాలు. పాపంలో పడకుండా ఉన్న లోకాల ప్రజల ఆనందంలో జ్ఞానంలో వారు అమితానందంతో పాలు పొందుతారు. దేవుని చేతి పనిని యుగయుగాలుగా పరిశీలించి సంపాదించిన జ్ఞాన నిధుల్ని వారు పరస్పరం పంచుకొంటారు. సృష్టి మహిమను -- సూర్యుడు నక్షత్రాలు వాటి వాటి వ్యవస్థలు తమనిర్దిష్ట క్రమంలో దేవుని సింహాసనం చుట్టూ తిరగటాన్ని వారు స్వచ్ఛమైన నిర్మలమైన దృష్టితో వీక్షిస్తారు. చిన్నలేమి, పెద్దలేమి అన్నిటి మీద సృష్టికర్తపేరు రాసి ఉంటుంది. అన్నిటిలో ఆయన శక్తి సంపద ప్రదర్శిత మౌతుంది.GCTel 642.4

  నిత్యత్వంలో సంవత్సరాలు గతించే కొద్దీ దేవుని గురించి క్రీస్తు గురించి ఎన్నో నూతనమైన మహిమాన్వితమైన సత్యాలు బయలుపడూ ఉంటాయి. జ్ఞానం ప్రగతిశీలమైనట్లే ప్రేమ గౌరవం సంతోషం ప్రగతి చెందుతాయి. దేవుని గూర్చిన జ్ఞానం మనసుల్లో ఎంత పెరిగితే వారు దేవుని ప్రవర్తనను అంత ఎక్కువగా అభినందిస్తారు. అమూల్యమైన రక్షణ సంపదను గూర్చి, సాతానుతో సాగిన మహా సంఘర్షణలో తాను సాధించిన విజయాలను గూర్చి యేసు వారికి వివరిస్తున్నప్పుడు విమోచన పొందిన భక్త జనుల హృదయాలు అత్యధిక భక్తితోను ఆనందోత్సాహాలతోను ఉప్పొంగగా వారు తమ బంగారు వీణెలు మీటుతారు. వేవేలు, లక్షలు, కోట్లాది స్వరాలు కలిసి ఆయనకు స్తుతివందనం చెల్లిస్తాయి.GCTel 643.1

  “అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము, అనగా వాటిలో నున్న సర్వమును - సింహాసనాసీనుడైయున్న వానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.” ప్రకటన 5:13.GCTel 643.2

  మహాసంఘర్షణ సమాప్తమౌతుంది. పాపం పాపులు ఇక ఉండరు. విశ్వమంతా పరిశుద్ధంగా పరిశుభ్రంగా ఉంటుంది. సృష్టి అంతటా సామరస్యం ఆనందం వెల్లివిరుస్తాయి. సమస్తాన్ని సృజించిన సృష్టికర్త నుంచి హద్దులులేని అంతరిక్షమంతా జీవం వెలుగు సంతోషం ప్రవహిస్తాయి. సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు మొదలు బ్రహ్మాండమైన లోకం వరకూ సమస్తం - జీవులేగాని అచేతన పదార్ధమేగాని - తమ తము సుందరమైన ఉత్సాహ భరితమైన స్థితిలో దేవుడు ప్రేమాస్వరూపి అని ప్రచురపర్చుతాయి.GCTel 643.3

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents