Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 2— తొలి శతాబ్దాలలో హింసాకాండ

    యరూషలేము నాశనాన్ని గురించి, తన రెండోరాక దృశ్యాలను గురించి యేసు తన శిష్యులతో చెప్పినప్పుడు, తాను వారిని విడిచి వెళ్లే సమయం లగాయతు వారిని విమోచించేందుకోసం శక్తి మహిమలతో తాను మళ్లీ వచ్చే వరకు తన ప్రజలకు కలుగనున్న అనుభవాల్ని గురించి కూడా ప్రవచనంలో చెప్పాడు. అపోస్తలుల సంఘంపై విరుచుకు పడనున్న తుపానుల్ని రక్షకుడు ఒలీవ కొండపై నుంచి చూశాడు. భవిష్యత్తును లోతుగా పరిశీలించినప్పుడు ముందున్న చీకటి యుగాల్లోను, హింసాకాండలోను తన అనుచరులను అతలాకుతలం చేయనున్న గాలి వానల్ని ఆయన నేత్రం పసిగట్టింది. ఈ లోకపాలకులు సంఘానికి చేయనున్న కీడును గూర్చి ఆయన ప్రవచించాడు. అవి కొద్ది మాటలే అయిన గంభీరమైన మాటలు. మత్తయి 24:9,21, 22. యేసు అనుచరులు తమ ప్రభువు మారాన్నే అనుసరించి అవమానం అపనింద శ్రమలు భరించాల్సి ఉన్నారు. లోకరక్షకుడైన ఆ ప్రభువుకు వ్యతిరేకంగా పెల్లుబికిన ద్వేషమే ఆయన నామాన్ని విశ్వసించే ప్రజలందరిపట్ల ప్రదర్శితమౌతుంది.GCTel 22.1

    రక్షకుని మాటల నెరవేర్పును తొలి దినాల సంఘ చరిత్ర ధ్రువపర్చుతున్నది. లోక పాలకులు సాతాను శక్తులు క్రీస్తుకు వ్యతిరేకంగా జట్టుకట్టి ఆయన అనుచరులను శ్రమలకు గురిచేశారు. సువార్త విజయం సాధిస్తే తన గుడులు బలిపీఠాలు మూలబడ్డాయని అన్యమతం ఊహించింది. అందుచేత క్రైస్తవ మతాన్ని నిర్మూలించ వలసిందిగా తన పరివారాన్ని ఆదేశించింది. హింసా జ్వాలలు రగుల్కొన్నాయి. క్రైస్తవుల ఆస్తుల్ని స్వాధీనపర్చుకొని వారిని తమ కొంప గోడు నుంచి తరిమివేశారు. క్రైస్తవులు “శ్రవులతో కూడిన గొప్ప పోరాటమును” హించారు. హెబ్రీ 10:32. “తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి” హెబ్రీ 11:36. అనేకమంది ప్రాణత్యాగాలతో తమ సాక్ష్యాలిచ్చారు. స్వతంత్రులు బానిసలు ధనికులు ఓడలు విద్యావంతులు విద్యలేని వారు అందరూ చిత్రవధకు గురి అయ్యారు.GCTel 22.2

    ఈ హింసాకాండ నీరోచక్రవర్తి పాలన కిండ దాదాపు పౌలు హతసాక్ష్యం సమయంలో ప్రారంభమై ఉదృతితో హెచ్చుతగ్గులతో కొన్ని శతాబ్దాలు కొనసాగింది. క్రైస్తవులపై ఘోరమైన తప్పుడు నేరాలు మోపి వారే కరవులు, వ్యాధులు, భూకంపాల వంటి అరిష్టాలకు కారకులని నిందించారు. వీరు ఇలా ప్రజల ద్వేషానికి, అనుమానాలకు గురికాగా అది చాలదన్నట్టు డబ్బుకు కక్కుర్తిపడి అబద్ధ సాక్ష్యం చెప్పి అమాయకుల్ని అప్పగించేందుకు సాక్షులు సిద్ధమయ్యారు. రోమా సామ్రాజ్యానికి విరోధులుగాను, మతానికి, సమాజానికి శత్రువులుగాను వారిని నిందించి శిక్షించారు. ఎంతోమంది క్రైస్తవులను క్రూర జంతువులకు ఆహారంగా వేశారు లేదా ఏంఫి తియేటర్లలో మంటలకు బలి చేశారు. కొందర్ని సిలువ వేశారు. కొందరిని అడవి జంతువుల చర్మాలతో కప్పి కుక్కలు చీల్చుకొని తినేందుకుగాను క్రీడా స్థలంలో పడేశారు. వారికి తరచుగా విధించిన ఇలాంటి శిక్షను ప్రజలకు వినోద విన్యాసాలుగా ఏర్పాటు చేసేవారు. ఆ వేడుకల్ని తిలకించడానికి ప్రజలు తండోపతండాలుగా చేరి బాధితుల రోదనలకు నవ్వులతో చప్పట్లతో స్పందించేవారు.GCTel 23.1

    క్రీస్తు అనుచరులు తలదాచుకొన్న స్థలాలకు వెళ్ళి వారిని క్రూర మృగాల్ని వేటాడేటట్లు వేటాడారు. అందువల్ల వారు దూరంగా పాడుపడ్డ స్థలాల్లో అజ్ఞాతంగా నివసించవలసి వచ్చింది. “దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు అడవులలోను, కొండల మీదను గుహలలోను, సొరంగములలోను తిరుగాడుచు సంచరించిరి” 37, 38 వచనాలు. వేలాది మంది బాధితులకు భూగర్భ సమాధులు(కేటకూంబ్స్) నిలువ నీడ నిచ్చాయి. రోము నగరం వెలుపల కొండల దిగువ భాగంలో భూమిలోంచి, రాతిబండల్లో నుంచి, సుధీర్ఘమైన సొరంగాలు తవ్వారు. అవి చీకటితో నిండిన చిక్కుదారులు. అవి పట్టణ ప్రాకారాలు దాటి ఎన్నోమైళ్ళు విస్తరించి ఉండేవి. భూగర్భంలోని ఆ స్థలాల్లో యేసు అనుచరులు తమ మృతులను పాతిపెట్టేవారు. అధికారులు అనుమానించి బహిష్కరించినప్పుడు భూగర్భంలోని ఆ స్థలాలే క్రైస్తవులకు గృహాలయ్యేవి. మంచి పోరాటం పోరాడిన భక్తులందరినీ జీవనాధుడు యేసులేపే తరుణంలో క్రీస్తు నిమిత్తం ప్రాణాలు త్యాగం చేసిన అనేక హతసాక్షులు ఆ చీకటి గుహలనుంచి లేచి వస్తారు. GCTel 23.2

    దారుణ హింసకు గురి అయినప్పటికీ యేసును విశ్వసించిన ఈ భక్తులు తమ విశ్వాసాన్ని పవిత్రంగా కాపాడుకొన్నారు. తమకు వసతులేమీ అనుమతించక పోయినా, తమ గృహాలు భూగర్భంలో ఉన్నందువల్ల సూర్యకాంతికి నోచుకోక పోయినా పిర్యాదులు చేయలేదు. శ్రమలను దుఃఖాన్ని అధిగమించేందుకుగాను విశ్వాసంగా ఓర్పు నిరీక్షణ కలిగించే మాటలతో వారు ఒకరి నొకరు ధైర్యపర్చుకునేవారు. లోకసంబంధమైన ఉపకారాలన్నీ పోగొట్టుకున్నా వారు యేసుపై తమకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. శ్రమలు హింస వారిని తమ విశ్రాంతికి ప్రతిఫలానికి దగ్గరచేసే మెట్లుగా పరిణమించాయి.GCTel 24.1

    గతంలో దేవుని సేవకుల మాదిరిగా అనేకులు “మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి.” 35 వ వచనం. ఆయన నిమిత్తం శ్రమలు పొందినప్పుడు వారు సంతోషించారు. ఎందుకంటే పరలోకంలో తమకు కలిగే ప్రతిఫలం గొప్పదని క్రీస్తు చెప్పిన మాటల్ని వీరు గుర్తు చేసుకున్నారు. వీరికి ముందు నివసించిన ప్రవక్తలు కూడా హింసకు గురి అయ్యారు. సత్యం నిమిత్తం శ్రమలనుభవించటానికి యోగ్యులుగా పరిగణన పొందినందుకు వారు సంతోషించారు. భగభగ మండుతున్న మంటల మధ్యనుంచి వారు పాడుతున్న విజయ గీతాలు ఆకాశానికి లేచాయి. పరలోకం బురుజుల మీద ఆనుకొని అమితాశక్తితో తమ స్థయిర్యాన్ని అభినందిస్తూ చూస్తున్న క్రీస్తును కన్నులెత్తి విశ్వాసంతో చూశారు. దైవ సింహాసనం నుంచి దిగివచ్చిన ఒక స్వరం వారిని ఇలా ధైర్యపర్చింది. “మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను. ” ప్రకటన 2:10. దౌర్జన్యంతో క్రీస్తు సంఘాన్ని నాశనం చేసేందుకు సాతాను ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏ మహా సంఘర్షణలో యేసు శిష్యులు తమ ప్రాణాల్ని త్యాగం చేశారో నమ్మకమైన ఆ సిలువ యోధులు తమ స్థానాల్లో పోరాడూ నేలకొరగడంతో అది అంతంకాలేదు. వారు తమ ఓటమిలో జయం సాధించారు. దైవకార్యకర్తలు వధకు గురి అయ్యారు. అయితే దైవకార్యం ఆగలేదు. అది కొనసాగుతూనే వుంది. సువార్త వృద్ధి చెందుతూనే ఉన్నది. విశ్వాసుల సంఖ్య పెరుగుతూనే వుంది. రోమా అధికారులు ప్రవేశించలేని ప్రాంతాలకు కూడా సువార్త చొచ్చుకు పోయింది. హింస కొనసాగింపును ప్రోత్సహిస్తున్న అన్యపాలకులతో వాదిస్తూ ఓ క్రైస్తవుడిలా అన్నాడు “మేము నిరపరాధులమని మీ అన్యాయ ప్రవర్తనే రుజువు చేస్తున్నది. మీ క్రూరత్వమువల్ల మీకు లాభమేమీ కలుగదు. ఇతరులలో విశ్వాసం పుట్టించటానికి ఇది మరింత బలీయమైన ఆహ్వానం. మీరు మమ్మల్ని ఎంత తరచుగా సంహరిస్తుంటే అంత త్వరితంగా “మా సంఖ్య పెరుగుతుంది. క్రైస్తవుల రక్తం విత్తనం.” -టెర్టూలియన్, ఎపోలజీ, పేరా 50.GCTel 24.2

    వేలాదిమందిని ఖైదుల్లో వేశారు, చంపారు. అయితే వారి స్థానాన్ని నింపటానికి ఇతరులు లేచి వచ్చారు. తమ విశ్వాసం కోసం ప్రాణాలు కోల్పోయిన వారు క్రీస్తు రాజ్యానికి సిద్ధమై భద్రంగా వున్నారు. వారిని ఆయన విజేతలుగా పరిగణిస్తున్నాడు. వారు మంచి పోరాటం పోరాడారు. క్రీస్తు మళ్ళీ వచ్చినప్పుడు వారికి మహిమా కిరీటాల్ని బహూకరిస్తాడు. తాము సహనంతో అనుభవించిన శ్రమలను బట్టి వారు ఒకరికొకరు దగ్గరయ్యారు. ప్రభువుతో వారికి సాన్నిహిత్యం ఏర్పడింది. జీవిస్తున్న తరుణంలో వారి బతుకు, మరణిస్తున్నప్పుడు వారి సాక్ష్యం సత్యాన్నికి స్థిరమైన సాక్షిగా నిలిచాయి. అంతేకాదు సాతాను అనుచరులు అనేకులు అతణ్ణి విడిచిపెట్టి క్రీస్తు ధ్వజం కిందకు వచ్చారు. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం.GCTel 25.1

    కనుక తన ధ్వజాన్ని క్రైస్తవ సంఘంలోనే ఎత్తటం ద్వారా దైవ పరి పాలనను విజయవంతంగా ఎదిరించటానికి అతడు ప్రణాళికలు రూపొందించుకున్నాడు. క్రీస్తు అనుచరులను మోసగించి దేవుడ్ని అసంతృప్తి పర్చేందుకు వారిని నడిపించగలిగితే వారి బలం ధైర్యం సైర్యం దెబ్బతింటాయని అలా తనకు వారు సులభంగా చేజిక్కుతారని సాతాను భావించాడు.GCTel 25.2

    బలప్రయోగం వల్ల సాధించలేకపోయినదాన్ని యుక్తి ద్వారా సాధించటానికి విరోధి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు. హింస ఆగిపోయింది. కాని, దాని స్థానంలో లోక ప్రతిష్ట భౌతిక సుఖ భోగాల వంటి ప్రలోభాలు వచ్చిపడ్డాయి. విగ్రహారాధకులు క్రైస్తవ విశ్వాసంలో కొంత భాగాన్ని విశ్వసించి ముఖ్యమైన ఇతర సత్యాల్ని విసర్జించేటట్లు వారిని సాతాను నడిపించాడు. యేసును దేవుని కుమారునిగా విశ్వసించి ఆయన మరణ పునరుత్థానాల్ని నమ్మినట్లు ప్రకటించుకొన్నప్పటికీ వారిలో పాప స్పృహగాని, తృప్తి, పశ్చాత్తాపం హృదయపరివర్తన అవసరంగాని ఏ కోశానా కనిపించలేదు. తమ పక్షంగా కొన్ని మినహాయింపులు క్రైస్తవులు చేయటం అవసరమని క్రీస్తును విశ్వసించటమన్న ఉమ్మడి వేదికపై ఇది అందరినీ ఐక్యపర్చుతుందని వారు ప్రతిపాదించారు.GCTel 25.3

    సంఘానికి ఇప్పుడు గొప్ప ముప్పు ఏర్పడింది. దీనితో సరిపోల్చితే చెరసాల హింస అగ్నిమంటలు ఖడ్గం మేలనిపించింది. క్రైస్తవుల్లో కొందరు అచంచలంగా నిలబడ్డారు. ఎలాంటి రాజీకి ఒప్పుకోమని కుండ బద్దలు కొట్టారు. కొందరైతే తమ విశ్వాసం విషయంలో కొన్ని మార్పులకు అంగీకరించి క్రైస్తవ మతాన్ని పాక్షికంగా స్వీకరించిన వారితో ఐక్యపడటానికి ఒప్పుకొన్నారు. వారు పూర్తిగా మారటానికి ఇదొక మార్గమయినా తమ చర్యను సమర్ధించుకున్నారు. అది యధార్ధమైన అనుచరులకు ఎంతో వేదన కలిగించిన సమయం. సభ్యుల విశ్వాసాన్ని భ్రష్టుపట్టించి వారి మనసుల్ని సత్యం నుంచి మరల్చటానికి సాతాను కపట క్రైస్తవం దుస్తులు ధరించి నేర్పుగా సంఘంలోకి ప్రవేశించాడు.GCTel 26.1

    తుదకు ఎక్కువమంది క్రైస్తవులు తమ ప్రమాణాల్ని తగ్గించుకోటానికి సమ్మతించారు. ఇలా క్రైస్తవులకు అన్యులకు మధ్య ఐక్యత ఏర్పడింది. విగ్రహారాధకులు క్రైస్తవ మతాన్ని స్వీకరించి సంఘంతో ఏకమైనప్పటికీ వారు తమ విగ్రహాల్ని విడిచి పెట్టలేదు. తమ ఆరాధ్య విగ్రహాలు ఇప్పుడు యేసు మరియు భక్తుల విగ్రహాలుగా రూపాంతరం చెందాయి. ఇలా సంఘంలోకి వచ్చిన విగ్రహారాధన అనే పులిసిన పిండి దాని దుష్కార్యాన్ని అది కొనసాగించింది. అబద్ద సిద్ధాంతాలు, మూఢాచారాలు, విగ్రహపూజాపునస్కారాలు సంఘ విశ్వాసంలోకి, ఆరాధనలోకి ప్రవేశించాయి. క్రీస్తు అనుచరులు విగ్రహారాధకులతో ఏకమైనప్పుడు క్రైస్తవమతం భ్రష్టమైంది. సంఘ పవిత్రత, శక్తి నశించాయి. ఏమైనా ఈ వంచనలకు లొంగకుండా వున్నావా? కొందరున్నారు. వారు సత్యానికి కర్త అయిన దేవుని పట్ల నమ్మకంగా నిలిచి ఆయన్నే ఆరాధించారు.GCTel 26.2

    క్రీస్తు అనుచరులమని చెప్పుకొనే వారిని రెండు తరగతులుగా వర్గీకరించవచ్చు. రక్షకుని జీవితాన్ని అధ్యయనం చేసి, తమ పొరపాట్లను సవరించుకొని ఆయన ఆ ధర్మాన్ని అనుసరించే వారు ఒక వర్గం వారు కాగా తమ తప్పుల్ని బహిర్గతం చేసే స్పష్టమైన సత్యాలను విసర్జించేవారు రెండోవర్గం వారు. సంఘం అత్యుత్తమ దశలో సయితం నిజాయితీపరులు, పరిశుదులు, చిత్తశుద్ధి గలవారే సభ్యులుగా ఉన్నారనలేం. ఇష్టపూర్వకంగా పాపం చేసే వారిని సంఘంలో చేర్చుకోకూడదని ప్రభువు బోధించాడు. అయినా ఆయన చెడు ప్రవర్తన గల వారి స్నేహబంధాలు కలిగి ఉన్నాడు. తమ లోపాల్ని, తప్పిదాల్ని గుర్తించి వాటిని సరిజేసుకునేందుకు కాను వారికి తన ఉపదేశాన్ని ఆదర్శాన్ని అందించాడు. పన్నెండుమంది శిష్యుల్లోను ఒక ద్రోహి ఉన్నాడు. యూదాను అతడి లోపాల కారణంగా గాక అవి ఉన్నవని తెలిసినప్పటికీ ఆయన అంగీకరించాడు. క్రీస్తు ఉపదేశం ఆదర్శం వల్ల క్రైస్తవ ప్రవర్తన అంటే ఏంటో యూదా గ్రహించటానికి, తన దోషాన్ని గుర్తించి పశ్చాత్తాపపడి, దైవకృప సహాయం ద్వారా “సత్యాన్ని ” ఆచరించటంలో తన ఆత్మశుద్ధి అయ్యేందుకు అతనికి శిష్యులతో సంబంధం కలిగింది. అయితే తనపై ప్రకాశించేందుకు సదుద్దేశంతో ఏర్పాటైన వెలుగులో యూదా నడువలేదు. పాపాన్ని ప్రేమించినందువల్ల సాతాను శోధనలకు ఆహ్వానం పలికాడు. అతని ప్రవర్తనలోని దుర్గుణాలు బలం పుంజుకొన్నాయి. అంధకార శక్తుల అదుపాజ్ఞలకు తల వంచాడు. తన తప్పుల్ని సవరించటానికి గద్దించినప్పుడు ఆగ్రహించాడు. ఇలాతన ప్రభువుని అప్పగించటమున్న భయంకర నేరానికి పాల్పడ్డాడు. భక్తులమని చెప్పుకుంటూ పాపాన్ని ప్రేమించే వారందరు ఇలాగే వ్యవహరిస్తారు. తమ పాప జీవిత సరళిని విమర్శించటం ద్వారా తమ శాంతిని పాడుచేసే వారిని వారు ద్వేషిస్తారు. అవకాశం వచ్చినప్పుడు తమ మంచిని కోరేవారిని తమను గద్దించే వారిని యూదా మాదిరిగా అప్పగించటానికి సిద్ధమవుతారు.GCTel 26.3

    పైకి భక్తిపరులకు మల్లే నటిస్తూ రహస్యంగా దుర్మార్గాన్ని అనుసరించే సంఘ సభ్యులున్నట్లు అపోస్తలులు గమనించారు. అననీయ, సప్పీరాలు మోసగాళ్ళ పాత్ర పోషించారు. దైవ సేవ నిమిత్తం సర్వం సమర్పణ చేస్తున్నట్లు నటిస్తూ అందులో కొంత భాగం వారు అట్టిపెట్టుకొన్నారు. ఈ వంచకుల నిజ స్వరూపాన్ని సత్యాత్మ స్వరూపి శిష్యులకు బయలు పర్చాడు. అంతట దేవుని తీర్పు వెలువడింది. సంఘ పవిత్రతకు కళంకం తెచ్చిన ఈ దంపతుల బెడద విరగడయ్యింది. క్రీస్తు ఆత్మ సంఘంలోని సమస్తాన్ని చూస్తాడు అన్న సత్యానికి తిరుగులేని ఈ రుజువు వేషధారులకు, దుష్టులకు వెన్నులో చలించింది. అలవాట్లు పరంగాను, మనస్తత్వం పరంగాను నిత్యము క్రీస్తు సహవాస రాయబారులుగా నివసిస్తున్న భక్తుల వారు ఎక్కువ కాలం నిలువలేక పోయారు. ఆయన అనుచరులకు శ్రమలు హింస రాగా సత్యం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేయటానికి ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వారు మాత్రమే క్రీస్తు శిష్యులుగా ఉండాలని ఆశించారు. హింస కొనసాగినంతకాలం సంఘం ఇలా పవిత్రంగా నిలిచింది. కాగా సంఘం పెరిగిన కొద్దీ కొత్త విశ్వాసులు కలిశారు. వారి నిజాయితీ, భక్తి అంతంత మాత్రమే. సాతాను సంఘంలో అడుగు పెట్టటానికి మార్గం ఇలా సుగమ మయ్యింది.GCTel 27.1

    కాని వెలుగు యువరాజుకు చీకటి యువరాజుకు ఎలాంటి పొత్తూ లేదు. వారి అనుచరుల మధ్య కూడా ఎలాంటి పొత్తూ వుండదు. అన్యమత విశ్వాసాన్ని సగం మాత్రమే మార్చుకొన్న వారితో ఏకమవ్వటానికి క్రైస్తవులు సమ్మతించినప్పుడు తమను సత్యం నుంచి దూరంగా తీసుకుపోయే మార్గంలో వారు ప్రవేశించారు. క్రీస్తు అనుచరుల్లో ఎక్కువ మందిని మోసగించటంలో సఫలమైనందుకు సాతాను సంతోషించాడు. ఇక వారిపై తన ప్రభావాన్ని ప్రసరింపజేసి దేవునిపట్ల నమ్మకంగా నిలిచి ఉన్న ప్రజల్ని హింసించటానికి వారిని ఉద్రేకపర్చాడు. ఒకప్పుడు క్రైస్తవ విశ్వాసాన్ని గట్టిగా సమర్థించిన వారే దాన్ని సమర్ధంగా వ్యతిరేకించగలుగుతారు. ఇకపోతే సగం అన్యులైన మిత్రులతో చేయి కలిపిన భ్రష్ట క్రైస్తవులు క్రీస్తు సిద్ధాంతాల్లో అతిముఖ్యమైన వాటిపై తమ దాడి మొదలు పెట్టారు.GCTel 28.1

    మత గురువుల అంగీల మారువేషంలో సంఘంలోకి ప్రవేశించిన మోసాలు, హేయ కార్యాలను వ్యతిరేకిస్తూ నిలబడటానికి యధార్ధ విశ్వాసులు గట్టి పోరాటం సల్పాల్సి వచ్చింది. విశ్వాసానికి ఒరవడిగా వారు బైబిలును అంగీకరించలేదు. మతస్వేచ్ఛా సిద్ధాంతాన్ని అసమ్మతి సిద్ధాంతంగా పేర్కొన్నారు. దాన్ని సమర్థించిన వారిని ద్వేషించి వెలివేశారు.GCTel 28.2

    విగ్రహారాధనను భ్రష్ట సంఘం విడిచి పెట్టకపోతే దానిలో తమ కొనసాగింపును రద్దు చేసుకోవాలని నమ్మకంగా నిలిచిన కొద్దిమంది దీర్ఘంగా ఆలోచించిన అనంతరం తీర్మానించారు. దైవ వాక్యానికి విధేయులై నివసించాలంటే ఆ సంఘం నుంచి వేరుపడటం తప్ప వేరే మార్గం లేదని గ్రహించారు. తమ సొంత ఆత్మలకు విఘాతం కలిగించే తప్పిదాన్ని సహించి తద్వారా తాము తమ పిల్లల విశ్వాసాన్ని వారి పిల్లల విశ్వాసాన్ని దెబ్బతీసే ఆదర్శాన్ని నెలకొల్పటానికి సాహసించలేదు. సమాధానం ఐక్యతల కోసం - దేవునికి నమ్మకంగా జీవించటానికి వ్యతిరేకంకాని ఏ రాయితీకైనా వారు సర్వసన్నద్ధులు. అయితే నియమం తప్పి సంపాదించే సమాధానం మూల్యం చాలా హెచ్చని కూడా వారు గుర్తించారు. సత్యంపై నీతిపై రాజీ ద్వారా మాత్రమే సమాధానం సాధ్యమైతే భేదాలే, ఆ మాటకొస్తే యుద్ధమే మేలు.GCTel 28.3

    ఆధ్యాత్మిక పరిపుష్టిగల ఆ వ్యక్తుల్ని చైతన్యపర్చిన సూత్రాలు దైవ ప్రజలమని చెప్పుకొంటున్న వారి హృదయాల్లో ఉజ్జీవం పొందితే సంఘం ఎంతో మెరుగవుతుంది. లోకం మెరుగవుతుంది. క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభాలైన సిద్ధాంతాల పరంగా చోటుచేసుకున్న ఉదాసీనవైఖరి ఆందోళన కరంగా వున్నది. ఇవి ఏమంత ప్రాముఖ్యమైన అంశాలు కావన్న అభిప్రాయం బలం పుంజుకొంటున్నది. ఈ నైతిక క్షీణత సాతాను శక్తుల్ని బలోపేతం చేస్తున్నది. ఏ తప్పుడు సిద్ధాంతాల్ని, ప్రాణాంతకమైన మోసాల్ని అడ్డుకోటానికి వాటిని బట్టబయలు చేయటానికి గతించిన యుగాల్లోని యధార్థ విశ్వాసులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టారో వాటినే ఇప్పుడు క్రీస్తు అనుచరులమని చెప్పుకొంటున్న వేలాదిమంది భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు.GCTel 28.4

    అలనాటి క్రైస్తవులు వాస్తవంగా ప్రత్యేకమైన ప్రజలు. వారి నిందారహిత ప్రవర్తన, అచంచల విశ్వాసం పాపిని నిత్యమూ మందలిస్తూ అతడికి మనశ్శాంతి లేకుండా చేశాయి. వారి సంఖ్య ఏమంత పెద్దది కాదు. వారికి ధనంలేదు, హోదాలేదు, గౌరవసూచక బిరుదులు లేవు. అయితే వారి నడవడిని, సిద్ధాంతాన్ని ఏ ఏ ప్రాంతాల ప్రజలు తెలుసుకొన్నారో ఆ ప్రాంతాల్లో దుర్మార్తులకు వారంటే గుండెల్లో గుబులు. దుష్టుడైన కయీను హేబెలును ద్వేషించినట్లే వారిని దుష్టులు ద్వేషించారు. కయీను హేబెలును ఏ కారణం చేత హత్య చేశాడో అదే కారణం చేత పరిశుద్ధాత్మ నియంత్రణను ద్వేషించే ప్రజలు దేవుని భక్తుల్ని హతమార్చారు. అదే కారణాన్ని బట్టి యూదులు రక్షకుణ్ణి విసర్జించి సిలువవేశారు. ఎందుకంటే పరిశుద్ధమైన, నిందారహితమైన ఆయన ప్రవర్తన వారి స్వార్థబుద్ధిని అవినీతిని సర్వదా ఖండించింది. క్రీస్తు నాటి నుంచి నేటి వరకు క్రీస్తుకు నమ్మకంగా వున్న శిష్యులు, పాపాన్ని ప్రేమించి పాపమార్గాన్ని అనుసరించే వారి ద్వేషాన్ని, వైరుధ్యాన్ని రెచ్చగొడుతూ వచ్చారు.GCTel 29.1

    అలాగైనప్పుడు సువార్త సమాధాన వర్తమానం ఏలాగవుతుంది? మెస్సీయా జన్మను గూర్చిన తన ప్రవచనంలో యెషయా ఆయనకు “సమాధానకర్తయగు అధిపతి” అన్న పేరును ఉపయోగించాడు. క్రీస్తు జన్మించినట్లు దూతలు గొల్లలకు తెలిపినప్పుడు బెల్లెహేము పచ్చిక బయళ్లపై “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక” అని ఆకాశం నుంచి పాడారు. లూకా 2:14. ఈ ప్రవచన ప్రకటనలకూ క్రీస్తు ఖడ్గమునేగాని సమాధానమును పంపుటకు నేను రాలేదు”లూకా 10:34. అన్న మాటలకూ మధ్య పొంతన లేనట్లు కనిపిస్తుంది. సరైన విధంగా అవగాహన చేసుకొంటే ఈ రెండింటి మధ్య సంపూర్ణ సామరస్యం వుంది. సువార్త సమాధాన వర్తమానం. క్రైస్తవ మతం ఒక వ్యవస్థ. దాన్ని స్వీకరించి ఆచరించినప్పుడు సమాధానం సామరస్యం సంతోషం లోకమంతా వ్యాపిస్తాయి. క్రీస్తు మతం దాని బోధనలు అంగీకరించిన వారందరినీ ఐక్యపర్చి వారిలో సహోదర భావం పుట్టిస్తుంది. మనుషులకు దేవునికి మధ్య, మనుషులకు మనుషులకు మధ్య సమాధానం ఏర్పాటు చేయటమే యేసు జీవిత పరమావధి. కాగా లోకం క్రీస్తు బద్ధశత్రువు అయిన సాతాను ఆధీనంలో వుంది. సువార్త ప్రబోధించే జీవిత సూత్రాలు ప్రజల అలవాట్లకు, ఆశలకు పూర్తిగా భిన్నమైనవి అవటంతో వాటిపై తిరుగుబాటు చేస్తారు. తమ పాపాల్ని చూపించి వాటిని విమర్శించే పవిత్రతను వారు ద్వేషిస్తారు. అందుచేత అదికోరే పరిశుద్ధ సూత్రాల్ని ఆచరించాల్సిందిగా విజ్ఞప్తి చేసే వారిని హింసించి మట్టుపెడ్తారు. ఈ అర్ధం దృష్ట్యా అది ప్రకటించే సమున్నత సత్యాలు ద్వేషం, ఘర్షణ కలిగిస్తాయి.- సువార్త ఈ విధంగా ఖడ్గమవుతుంది.GCTel 29.2

    దుష్టులవల్ల నీతిమంతులకు కలిగే హింసను సహించటానికి అగోచరమైన దైవ చిత్తం అనుమతించటమన్నది బలహీన విశ్వాసంగల అనేకమందిని తికమక పెడున్నది. కొందరైతే దేవునిమీద తమ విశ్వాసాన్ని వదలు కోటానికి సిద్ధంగా వుంటారు. ఎందుకంటే అతినీచులు వృద్ధి చెందుతుంటే క్రూరమైన వారిశక్తి ప్రభావాలవల్ల అత్యుత్తములు నీతిమంతులు కష్టాలకు హింసలకు ఆహుతి అవటం ఆయన సహిస్తున్నాడు. న్యాయవంతుడు, కృపామయుడు, అనంత శక్తి సంపన్నుడు అయిన దేవుడు అలాంటి అన్యాయాన్ని, హింసను ఎలా సహించగలడు అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నతో మనకు సంబంధం లేదు. తన ప్రేమను గూర్చి మనకు దేవుడిచ్చిన నిదర్శనం కోకొల్లలు. కనుక ఆయన చిత్తం నెరవేరే మార్గాన్ని అవగాహన చేసుకోలేని కారణంగా ఆయన మంచితనాన్ని మనం శంకించకూడదు. కష్టాలు శ్రమలు కలిగే చీకటి దినాల్లో తమను వేధించి బాధించ బోతున్న సందేహాల్ని ముందే చూసిన రక్షకుడు తన శిష్యులతో ఇలా అన్నాడు. “దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకముంచుకొనుడి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడ హింసింతురు” యోహాను 15:20. దుర్మార్గుల క్రూరత్వము వలన తన అనుచరులు ఎవరైనా అనుభవించగల శ్రమలకన్నా తీవ్రమైన శ్రమలను యేసు అనుభవించాడు. హింస పొందటానికి, హతసాక్షులవ్వటానికి పిలుపుపొందే వారు దేవుని కుమారుని అడుగుజాడల్లో నడుస్తూ ఆయనను వెంబడిస్తున్నారు.GCTel 30.1

    “ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు.” 2 పేతురు 3:9 ఆయన తన బిడ్డలను మరచిపోడు. వారిని ఎన్నడూ నిర్లక్ష్యం చేయడు. కాకపోతే, ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి ఆశిస్తూ వారు ఎవరూ దుషుల విషయంలో మోసపోకుండా ఉండేందుకుగాను దుష్టులు తమ నిజమైన ప్రవర్తన బయలు పర్చుకోటానికి దేవుడు వారిని అనుమతిస్తాడు. తమను పరిశుదులుగా తీర్చి దిద్దటానికి, విశ్వాసం, దైవభక్తి వాస్తవమైనవని తమ ఆదర్శం ఇతరులలో నమ్మకం పుట్టించేందుకు, తమ స్థిరమైన భక్తి జీవితం దుష్టులకు అవిశ్వాసులకు గద్దింపుగా ఉండేందుకు నీతిమంతులు శ్రమల అగ్ని గుండంలో బాధపడటానికి ఆయన అనుతిస్తాడు.GCTel 31.1

    దుష్టులు తమ దుర్నీతి పాత్రను నింపుకొని నాశనమైనప్పుడు లోకులందరు చూసి దేవుని న్యాయబుద్ధిని, కృపాకనికరాల్ని గ్రహించేందుకుగాను దుర్మార్గులు వర్ధిల్లటానికి, తనపట్ల తమ వ్యతిరేకతను ప్రదర్శించటానికి దేవుడు సమ్మతిస్తాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవారు, ఆయన ప్రజల్ని హింసించే వారు తమ క్రియల చొప్పున ప్రతిఫలం పొందే దినం త్వరలో వస్తుంది. అదే ఆయన పగ తీర్చుకునే దినం. దేవునికి నమ్మకంగా నివసించే ప్రజలకు చేసిన అన్యాయాలకు వారిపట్ల జరిగించిన క్రూరకృత్యాలకు శిక్ష కలుగుతుంది. వాటిని క్రీస్తు పట్ల జరిగించిన అకృత్యాలుగా దేవుడు పరిగణిస్తాడు.GCTel 31.2

    ఈనాడు సంఘం దృష్టి సారించాల్సిన ప్రాముఖ్యమైన సమస్య మరొకటి ఉంది. “క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించువారందరు హింస పొందుదురు” 2 తిమోతి 3:12. అంటూ అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. అయితే హింస గాఢ నిద్రలో వున్నట్లు కనిపిస్తుంది. ఎందుకని? సంఘం లోక ప్రమాణాల్ని అనుసరించి నివసిస్తుంది గనుక వ్యతిరేకత లేదన్నది దీనికి ఒకే ఒక కారణం. నేడు ఆచరణలో వున్న మతం క్రీస్తు దినాల్లోను, ఆపోస్తలుల దినాల్లోను ఆచరణలోవున్న పవిత్ర పరిశుద్ధ క్రైస్తవ విశ్వాసం కానే కాదు. పాపంతో రాజీపడే స్వభావం, దైవ వాక్యంలోని మహాత్తర సత్యాల్ని లెక్కచేయకపోటం, సంఘంలో ప్రధానమై భక్తి తత్పరత నామమాత్రంగా మిగలటం- ఇవి ప్రపంచంలో క్రైస్తవ మతం పేరు ప్రతిష్టలు సంపాదించటానికి కారణాలు. తొలిదినాల సంఘంలో వున్నటువంటి విశ్వాసం శక్తి నేడు సంఘంలో పునరుజ్జీవం పొందనీయండి. హింసా స్వభావం కూడా పునరుజ్జీవం పొందుతుంది. హింసా జ్వాలలు మళ్లీ రగులుకొంటాయి.GCTel 31.3