Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  23—“దేవుని రాజ్యము సమీపించియున్నది”

  “యేసు కాలము సంపూర్ణమైయున్నది; దేవుని రాజ్యము సమిపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను. ” మార్కు 1:14, 15.DATel 235.1

  మెస్సీయా రాకను ప్రథమంగా యూదయలో ప్రకటించడం జరిగింది. యెరూషలేము దేవాలయంలో బలిపీఠం ముందు జెకర్యా యాజక పరిచర్య చేస్తుండగా యేసుకు అగ్రగామి అయిన యోహాను జననం ప్రవచించబడింది. బేల్లెహేము కొండలమీద దేవదూతలు యేసు జననాన్ని ప్రకటించారు. ఆయనను వెదక్కుంటూ తూర్పుజ్ఞానులు యెరూషలేముకు వెళ్లారు. దేవాలయంలో సుమెయోను, అన్న ఆయన దేవత్వం గురించి సాక్ష్యమిచ్చారు. “యోరూషలేములోను యూదయ అంతటా” ప్రజలు బాప్తిస్మమిచ్చే యోహాను బోధ విన్నారు. జనసమూహంతో పాటు స హెల్త్న్ సభ ప్రతినిధి బృందం యేసును గురించి యోహాను సాక్షాన్ని విన్నారు. యూదయలో యేసు తన తొలి శిష్యులను ఎంపిక చేసుకున్నాడు. ఆయన తొలినాళ్ళలో చేసిన సేవలో ఎక్కువ కాలం ఇక్కడే గడిచింది. ఆలయాన్ని శుద్ధి చేసినప్పుడు ఆయన దేవత్వం ప్రకాశించడం రోగుల్ని స్వస్తపర్చుతూ ఆయన చేసిన అద్భుతాలు, ఆయన నోటి నుంచి వెలువడ్డ దైవసత్యం - బేతెస్ధ వద్ద స్వస్తత దరిమిల స హెడ్రిన్ ముందు ఆయన ఉద్ఘాటించిన సత్యం ఇవన్నీ తాను నిత్యుడైన దేవుని కుమారుణ్నన్న సత్యాన్ని ప్రకటిస్తోన్నాయి.DATel 235.2

  ఇశ్రాయేలు నాయకులు క్రీస్తుని అంగీకరించి ఉన్నట్లయితే, లోకానికి సువార్త అందించడానికి వారిని తన దూతలుగా ఆయన గౌరవించేవాడు. దేవుని రాజ్యాన్ని కృపను ప్రచురించడానికి మొదటి తరుణం వారికే ఆయన ఇచ్చాడు. కాని ఇశ్రాయేలు దాన్ని తెలుసుకోలేదు. యూదు నేతల ఈర్య, అపనమ్మకం ద్వేషంగా మారింది. పర్యవసానంగా ప్రజలు యేసుకు విముఖులయ్యారు.DATel 235.3

  సన్ హెడ్రిన్ క్రీస్తు వర్తమానాన్ని తిరస్కరించి ఆయన్ని చంపాలని కృతనిశ్చయంతో ఉంది. కనుక యేసు యెరూషలేమును యాజకుల్ని, ఆలయాన్ని, మతనాయకుల్ని, ధర్మశాస్తోపదేశం పొందిన ప్రజల్ని విడిచిపెట్టి తన వర్తమానం ప్రకటించడానికి మరొక తరగతి ప్రజల పై దృష్టి పెట్టి అన్ని జాతుల ప్రజలకు సువార్త చాటించాల్సిన వారిని పోగు చేయడం మొదలు పెట్టాడు.DATel 236.1

  క్రీస్తు దినాల్లో మతాధికారులు వెలుగును మనుషుల జీవితాల్ని నిరాకరించినట్లే అనంతర తరాల్లోను ప్రజలు వెలుగును నిరాకరిస్తూ వస్తున్నారు. యూదయ నుంచి క్రీస్తు వెళ్లిపోయిన చరిత్ర మళ్లీ మళ్లీ పునరావృత్తమౌతోంది. దిద్దుబాటు నాయకులు దైవవాక్యాన్ని బోధించినప్పుడు వ్యవస్థీకృత సంఘం నుంచి విడిపోవాలన్న తలంపు వారికి లేదు. కాకపోతే మతనాయకులకు వెలుగంటే కంటగింపు. దాన్ని ప్రబోధించిన వారు సత్యాన్ని అన్వేషిస్తున్న మరో తరగతి ప్రజల్ని వెదుక్కోకతప్పలేదు. మన రోజులకు వస్తే సంస్కర్తల అనుచరులమని చెప్పుకొంటున్న అనేకుల్ని వారి స్ఫూర్తి ప్రభావితం చెయ్యడం లేదు. దేవుని స్వరాన్ని వింటున్నవారు, సత్యం ఏరూపంలో వచ్చినా దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నవారు దాదాపు ఎవ్వరూ లేరు. తరచు సంస్కర్తల స్ఫూర్తితో కృషి చేసేవారు దైవవాక్యంలోని సామాన్య బోధనల్ని ప్రకటించేందు కోసం తాము ఎంతో ప్రేమిస్తోన్న సంఘాల్లో నుంచి బయటికి వెళ్లిపోవాల్సి వస్తోంది. అనేక సందర్భాల్లో సత్యాన్ని అన్వేషిస్తోన్నవారు దేవునికి నమ్మకంగా జీవించేందుకు గాను అదే వాక్య బోధన మేరకు తమ తండ్రుల సంఘాన్ని విడిచిపెట్టి బయటికి రావలసి వస్తోంది.DATel 236.2

  గలిలయ ప్రజల్ని యెరూషలేములోని రబ్బీలు విద్యలేని మొరటు ప్రజలుగా పరిగణించేవారు. అయినా రక్షకుని కృషికి వారు సానుకూల క్షేత్రంగా పరిణమించారు. వారు వాక్యంపట్ల ఇతరులకన్నా ఎక్కువ శ్రద్ధాసక్తులు కనపర్చారు. వారు దురభిమానం అదుపులో అంతగా లేరు. సత్యాన్ని అంగీకరించడానికి వారి మనసులు ఎక్కువ సంసిద్ధత కలిగి ఉన్నాయి. గలిలయకు వెళ్లడంలో యేసు ఏకాంతాన్నో లేదా వేర్పాటునో అన్వేషించలేదు. ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఎక్కువ జనాభా ఉండేది. ఇతర జాతుల ప్రజలు కూడా యూదయలోకన్న ఇక్కడ ఎక్కువగా ఉండేవారు. అది ఓ మిశ్రమ సమాజం.DATel 236.3

  యేసు గలిలయలో బోధిస్తూ రోగుల్ని స్వస్తపర్చుతూ ప్రయాణం చేసినపుడు పట్టణాల్నుంచి గ్రామాల నుంచి జనులు తండోపతండాలుగా ఆయన వద్దకు వచ్చారు. చాలామంది యూదయనుంచి గలిలయ పరిసర ప్రాంతాల నుంచి సయితం వచ్చారు. ఆయన తరచు ప్రజల నుంచి దాకోవాల్సి వచ్చేది. ప్రజల ఉత్సాహం ఎంతగా ఉన్నదంటే రోమా అధికారులు ప్రజల్లో తిరుగుబాటు లేస్తుందని అందోళన చెందకుండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోడం అవసరమయ్యేది. ఇలాంటి సమయం లోకంలో ముందెన్నడూలేదు. మానవులకోం పరలోకమే దిగి వచ్చింది. దీర్ఘకాలంగా ఇశ్రాయేలు వియోచన కోసం ఆకలిదప్పులు గొంటోన్న ఆత్మలు ఇప్పుడు కరుణామయుడైన రక్షకుని కృపావిందును తృప్తిగా ఆరగించారు.DATel 237.1

  క్రీస్తు బోధన సారాంశం ఇది: “కాలము పరిపూర్ణమై యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి” ఇలా రక్షకుడు బోధించిన సువార్తమానం ప్రవచనాలపై ఆధారితమైంది. పరిపూర్ణమయ్యింది అని ఆయన అంటున్న “కాలము” గబ్రియేలు దానియేలుకు తెలియపర్చిన కాలం. “తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరుచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతిపరిశుద్ధస్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను.” దాని 9:24. ప్రవచనంలో ఒక దినమంటే ఒక సంవత్సరం. సంఖ్యా 14:34, యెహె 4:6 చూడండి. డెబ్బయి వారాలు లేక నాలుగు వందల తొంబై దినాలు అంటే నాలుగు వందల తొంబై సంవత్సరాలు. ఈ కాలవ్యవధికి ఆరంభాన్ని నిర్దేశించడం జరిగింది, “యెరూషలేము మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము, ” అరవై తొమ్మిది వారాలు లేదా నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు. దాని 9:25. యెరుషలేమును పునరుద్ధరించి కట్టడానికి జారీ అయిన ఆజ్ఞ (అర్తహషస్త లాంగిమనస్ ఆజ్ఞమేరకు పూర్తి అయ్యింది. ఎజ్రా6:14; 7:1,9 చూడండి) క్రీ.పూ.457 శరత్కాలంలో అమలయ్యింది. ఈ సమయం నుంచి నాలుగు వందల ఎనబై మూడు సంవత్సరాలు క్రీ.శ 27 శరత్కాలంలో ముగిశాయి. ప్రవచనం ప్రకారం ఈ కాలవ్యవధి అభిషిక్తుడైన అధిపతి అనగా మెస్సీయా వరకూ కొనసాగాల్సి ఉంది. క్రీ.శ 27 లో యేసు తన బాప్తిస్మమప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది అనంతరం తన పరిచర్యను ప్రారంభించాడు. అప్పుడు “కాలము పరిపూర్ణమై యున్నది” అన్న వర్తమానం ప్రకటితమయ్యింది.DATel 237.2

  అప్పుడు ‘అతడు ఒక వారము (ఏడు దినాలు) వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును” అని దూత చెప్పాడు. రక్షకుడు తన పరిచర్యలో ప్రవేశించింది లగాయతు ఏడు సంవత్సరాలు సువార్త ప్రకటితం కావలసి ఉంది. ముఖ్యంగా యూదులకు స్వయంగా క్రీస్తే మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాత సువార్తను అపొస్తులులు ప్రకటించాల్సి ఉన్నారు. “అర్థ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును.” దాని 9:27. క్రీ.శ 31వ వసంతకాలంలో వాస్తవిక బలి అయిన క్రీస్తు కల్వరి సిలువపై మరణించాడు. అప్పుడు బలి అర్పణ సేవ పవిత్రత ప్రాధాన్యం పోయిందని సూచిస్తూ దేవాలయం తెర పైనుంచి కిందకు రెండు ముక్కలుగా చినిగిపోయింది. భూలోక బలి అర్పణలు నైవేద్యాలు ఆగిపోడానికి సమయం వచ్చింది.DATel 238.1

  ఒక వారం - ఏడు రోజులు - క్రీ.శ 34 లో అంతమయ్యింది. స్తెఫన్ను చంపడం ద్వారా యూదులు అంతిమంగా సువార్తను విసర్జించారు. హింసవల్ల చెదిరిపోయిన శిష్యులు “సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి” (అ.కా8:4). ఆతర్వాత కొద్దికాలానికి హింసకుడైన సౌలు క్రైస్తవుడై అన్యజనులకు అపొస్తులుడైన పౌలయ్యాడు.DATel 238.2

  క్రీస్తు రాక సమయం, పరిశుద్దాత్మచే ఆయన అభిషేకం, ఆయన మరణం, అన్యజనులకు సువార్త ప్రదానం నిర్దిష్టంగా సూచించబడ్డాయి. ప్రవచనాల్ని అవగాహన చేసుకుని, యేసు పరిచర్యలో వాటి నెరవేర్పును గుర్తించడం యూదు ప్రజలకున్న ఆధిక్యత. క్రీస్తు ప్రవచనాల ప్రాముఖ్యాన్ని వివరించి వాటిని అధ్యయనం చేయాల్సిందిగా శిష్యులికి హితవు పలికాడు. తాము నివసిస్తోన్న కాలం సందర్భంగా దానియేలు ప్రవచనాన్ని ప్రస్తావిస్తూ ప్రభువిలా అన్నాడు, “చదువు వాడు గ్రహించును గాక” మత్త 24:15. తన పునరుత్థానం తర్వాత “సమస్త ప్రవక్తలును” “తన్ను గూర్చిన వచనముల భావము” శిష్యులకి విశదీకరించాడు. లూకా 24:27. రక్షకుడు ప్రవక్తలందరి ద్వారా మాట్లాడాడు. ” తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యము” ఇచ్చాడు. 1 పేతు 1:11.DATel 239.1

  దైవ వర్తమానంతో దానియేలు వద్దకు వచ్చినవాడు హోదాలో తన తర్వాత మాత్రమే ఉండే “తన దూత” గబ్రియేలునే యోహానుకు భవిష్యత్తును తెలపడానికి క్రీస్తు పంపించాడు. ప్రవచన వాక్యాన్ని చదివి విని అందులోని విషయాల్ని ఆచరించేవారు ధన్యులని ప్రకటించాడు. ప్రక1:3.DATel 239.2

  “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.” “రహస్యములు మన దేవుడైన యెహోవాకు” చెందినవైనప్పటికీ “బయలు పరచబడినవి యెల్లప్పుడు మనవి” ఆమో3:7; ద్వితీ 29:29. వీటిని దేవుడు మనకిస్తోన్నాడు. భక్తిభావంతో ప్రార్ధన పూర్వకంగా చేసే ప్రవచన లేఖన అధ్యయనాన్ని దేవుడు దీవిస్తాడు.DATel 239.3

  క్రీస్తు మొదటి రాక వర్తమానం ఆయన కృపారాజ్యాన్ని ప్రకటించినట్లే ఆయన రెండో రాక వర్తమానం ఆయన మహిమారాజ్యన్ని ప్రకటిస్తోంది. మొదటి వర్తమానంలాగే రెండో వర్తమానం ప్రవచనాలపై ఆధారపడి ఉంది. చివరి దినాల్ని గురించి దూత దానియేలుతో చెప్పిన మాటలు చివరి దినాలకు సంబంధించినవిగా మనం అర్ధం చేసుకోవాలి. ఆ కాలంలో “చాల మంది పలు దిశలు సంచరించినందున తెలివి అధికమగును.” “దుషులు దుష్టకార్యములు చేయుచుందురు గనుక ఏదుష్టుడును ఈ సంగతులను గ్రహించకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు” దాని12:4,10; రక్షకుడే తన రాకకు గుర్తుల్ని ఇచ్చి ఇలా అన్నాడు, “మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.” “నా హృదయములు ఒక వేళ తిండి వలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చునట్టు రాకుండ ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.” “కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తి గలవారై యుండునట్లు ఎల్లప్పుడును ప్రార్ధన చేయుచు మెలకువగా ఉండుడి.” లూకా 21:31,34, 36;DATel 239.4

  ప్రవచనాల్లో ప్రవచితమైన కాలావధిని మనం చేరుకున్నాం. కాలం సమాప్తి కావడానికి సమయమయ్యింది. ప్రవక్తల దర్శనాల ముద్రలు విడిపోయాయి. వాటిలోని గంభీర హెచ్చరికలు సూచిస్తోన్న మహిమతో నిండిన ప్రభువు రాక సమీపంలో ఉంది.DATel 240.1

  దైవ వాక్యానికి యూదులు తప్పుడు భాష్యం చెప్పి దాని ఆచరణను పక్కన పెట్టారు. కనుక వాటి నెరవేర్సు కాలాన్ని తెలుసుకోలేకపోయారు. క్రీస్తు ఆయన శిష్యులు పరిచర్య చేసిన సంవత్సరాల్లో దేవుడు ఎంపిక చేసుకున్న ఆ ప్రజలకు కృప అందుబాటులో ఉన్న చివరి సంవత్సరాలు - వారు ప్రభువు సేవకుల్ని అంతం చెయ్యడానికి కుట్రపన్నడంలో గడిపారు. లోకాశలే వారి లోకమయ్యాయి. ఆధ్యాత్మిక రాజ్యం గురించి వారు పట్టించుకోలేదు. అలాగే ఈ రోజుల్లో కూడా ఈ లోక రాజ్యమే మనుషుల మనసుల్ని ఆకట్టుకుంటోంది. త్వర త్వరగా నెరవేర్తున్న ప్రవచనాల్ని త్వరలో రానున్న దేవుని రాజ్య సూచనల్ని వారు కొట్టి పారేస్తున్నారు.DATel 240.2

  “సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. వారందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునైయున్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము” మన ప్రభువు వచ్చే ఘడియ మనకు తెలియక పోయినా అది దగ్గరలో ఉందని మనం తెలుసుకోవచ్చు. “కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము.” 1థెస్స 5:4-6.DATel 240.3