Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    80—యోసేపు సమాధిలో

    తుదకు యేసు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అవమానం హింసతో నిండిన సుదీర్ఘ దినం అంతమయ్యింది. అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు సబ్బాతును స్వాగతిస్తుండగా దైవ కుమారుడు యోసేవు సమాధిలో ప్రశాంతంగా ఉన్నాడు. తన పనిని ముగించుకుని చేతులు ముడుచుకుని సబ్బాతు పరిశుద్ధ గడియల్లో ఆయన విశ్రమించాడు.DATel 868.1

    ఆదిలో తమ సృష్టికార్యం ముగిసిన తర్వాత తండ్రికుమారులు సబ్బాత నాడు విశ్రమించారు. “ఆకాశమును భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును” (ఆది 2:1) పూర్తి చేసినప్పుడు, సృష్టికర్త పరలోక నివాసులు ఆ సుందర దృశ్యాన్ని చూసి సంతోషించారు. “ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి ఉత్సాహధ్వనులు” చేశారు. యోబు 38:7. ఇప్పుడు యేసు విమోచన పని అనంతరం విశ్రమించాడు. భూమిపై ఆయన్ని ప్రేమించిన వారిలో దుఃఖం ఉన్నప్పటికీ పరలోకంలో ఆనందం వెల్లివిరిసింది. భవిష్యత్తును గూర్చిన వాగ్దానం పరలోకనివాసుల కళ్లకి మహిమాన్వితంగా కనిపించింది. పునరుద్దరణ పొందిన సృష్టి, విమోచన పొందిన జాతి -అనగా పాపాన్ని జయించి మళ్లీ పడిపోని జాతి-క్రీస్తు ముగించిన పనినుంచి ఈ ఫలితం కలగడం దేవుడూ ఆయన దూతలూ చూశారు. ఈ దృశ్యంతో యేసు విశ్రమించిన దినం ముడిపడి ఉన్నది. ఎందుచేతనంటే “ఆయన కార్యము సంపూర్ణము.” “దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములు” ద్వితి. 32: , ప్రసగిం 3:21. “అన్నింటికి కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తలనొట” పలికించింది జరిగినప్పుడు (అ.కా. 3:21) సృష్టి నాటి సబ్బాతు అనగా యోసేపు సమాధిలో యేసు విశ్రాంతిగా ఉన్నదినం ఇంకా విశ్రాంతి, ఆనందోత్సాహాల దినంగా ఉంటుంది. వివిధ జాతుల నుంచి రక్షణ పొందిన వారితో గళం కలిపి పరలోకం భూలోకం ఒకటై “ప్రతి విశ్రాంతి దినమునను” (యెష. 66:23) ఆనందోత్సాహాలతో దేవుని గొర్రెపిల్లను కొనియాడుతూ ఆరాధిస్తారు.DATel 868.2

    సిలువ వేసిన దినం చివరి ఘటనల్లో ప్రవచన నెరవేర్పుకు తాజా నిదర్శనం కనిపించింది. క్రీస్తు దేనత్వానికి నూతన సాక్ష్యం సమకూర్చింది. సిలువను ఆవరించిన చీకటి వీడిపోయినప్పుడు, రక్షకుడు మరణిస్తూ కేక వేసిన వెంటనే వేరొక స్వరం “నిజముగా ఆయన దేవుని కుమారుడు” (మత్త. 27:54) అనడం వినిపించింది. .DATel 869.1

    ఈ మాటలు గుసగుసల్లా నెమ్మదిగా అన్నవికావు. అవి ఎక్కడ నుంచి వచ్చాయా అని చూడడానికి అందరి కళ్లూ అతడి తట్టు తిరిగాయి. ఆ మాటలన్నది ఎవరు? అతడు రోమా సైన్యంలో శతాధిపతి. రక్షకుని ఓర్పు, పెదవులపై విజయ నినాదం, ఆయన ఆకస్మికంగా మరణించడం ఈ అన్యుణ్ని ఆకట్టుకున్నాయి. సిలువపై వేలాడున్న చితికిన, విరిగి నలిగిన శరీరంలో దేవుని కుమారుని రూపాన్ని ఆ శతాధిపతి చూశాడు. తన విశ్వాసాన్ని వ్యక్తం చెయ్యకుండా ఉండలేకపోయాడు. మన రక్షకుడు తన ఆత్మక్షోభను చూడవలసి ఉన్నదనడానకి ఇలా నిదర్శనం ఇవ్వబడింది. ఆయన మరణించిన రోజే వేర్వేరు నేపథ్యాలు గల ముగ్గురు మనుషులు తమ విశ్వాసాన్ని ప్రకటించారు. వారు రోమా సైనికుల అధిపతి, రక్షకుని సిలువమోసిన వ్యక్తి, ఆయన పక్క సిలువమిద మరణించిన వ్యక్తి.DATel 869.2

    సాయంత్రం అయ్యేసరికి కల్వరిపై వింతైన ప్రశాంతి నెలకొన్నది. జనులు వెళ్లిపోయారు. ఉదయం జరిగిన ఘటనలు చూసి మారిన మనస్సుతో అనేకులు యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయారు. ఏమిటో చూడాలన్న ఉత్సాహంతో అనేకులు సిలువ వద్దకు వచ్చారు. వారికి క్రీస్తుపట్ల ద్వేషం లేదు. అయినా వారు యాజకుల ఆరోపణల్ని నమ్మి క్రీస్తుని నేరస్తుడని భావించారు. ఉద్రేకం కొద్దీ వారు ఆయన్ని ఎగతాళి చేస్తున్న మూకలో కలిశారు. అయితే భూమిపై చీకటి కమ్మి తమ అంతరాత్మ ప్రబోధం ప్రకారం నిందితులుగా నిలబడినప్పుడు, వారు తాముగొప్ప నేరం చేశామని భవించారు. ఆ భయకర అంధకారంలో వెటకారపు మాటలు, ఎగతాళి నవ్వులు ఎక్కడాలేవు. ఆ చీకటి పోయిన తర్వాత వారు నిశ్శబ్దంగా ఇళ్లకు వెళ్లిపోయారు. యాజకుల ఆరోపణలు నిజంకావని, యేసు అబద్ధికుడు కాడని వారు దృఢంగా నమ్మారు. కొన్ని వారాల తర్వాత పెంతెకొస్తు దినాన పేతురు ప్రసంగించినప్పుడు క్రీస్తు విశ్వాసులుగా మారిన వేల ప్రజల్లో వారున్నారు.DATel 869.3

    కాగా యూదు నాయకుల్లో ఆనాటి సంభవాలు ఎలాంటి మార్పూ కలిగించలేదు. క్రీస్తుపై వారి ద్వేషం తగ్గలేదు. సిలువ సమయంలో భూమిని కమ్మిన చీకటికన్నా యాజకులు అధికారుల మనసుల్లో పేరుకుపోయిన చీకటి దట్టంగా ఉంది. ఆయన జన్మించినప్పుడు నక్షత్రం క్రీస్తుని గుర్తించి ఆయన పరుండి ఉన్న పశువుల తొట్టె వద్దకు జ్ఞానుల్ని నడిపించింది. పరలోక సమూహాలికి ఆయన తెలుసు. బేల్లె హేము మైదానాల్లో వారు ఆయనకు స్తుతిగానాలు చేశారు. సముద్రానికి ఆయన స్వరం పరిచయమే. అది ఆయన ఆజ్ఞను శిరసావహించింది. వ్యాధి మరణాలు ఆయన అధికారాన్ని గుర్తించాయి. తాము బలిగొన్నవారిని అవి ఆయనకు తిరిగి ఇచ్చాయి. సూర్యుడికి ఆయన తెలుసు. ఆయన మరణ వేదనను చూసినప్పుడు తన ముఖాన్ని దాచుకున్నాడు. కొండలు బండలు ఆయన్ని ఎరుగును. ఆయన కేకవేసినప్పుడు అవి వణికి బద్దలయ్యా యి. నిర్జీవ ప్రకృతి ఆయన్ని ఎరుగును. అది ఆయన దేవత్వానికి సాక్ష్యమిచ్చింది. కాని ఇశ్రాయేలు యాజకులు అధికారులు దేవుని కుమారుణ్ని ఎరుగలేదు.DATel 870.1

    అయినా యాజకులు అధికారులికి విశ్రాంతి లేదు. క్రీస్తుని చంపడంలో తమ లక్ష్యాన్ని సాధించారు. కాని తాము ఆశించిన విజయాన్ని సాధించామన్నభావన వారికి కలగలేదు. తాను విజయం సాధించామనుకున్న గడియలో సయితం, తర్వాత ఏం జరుగుతుందోనన్ను ఆందోళన వారిని కలచివేసింది. “సమాప్తమైనది” “తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను” అని పెద్ద స్వరంతో ఆయన వేసిన కేక విన్నారు. భూకంపం అనుభవించారు. వారికి శాంతిలేదు సుఖంలేదు.DATel 870.2

    క్రీస్తు జీవించి ఉన్నప్పుడు ప్రజల్లో ఆయన పలుకుబడి వారికి కన్నుకుట్టింది. ఆయన మరణంలోనూ వారికి అసూయ పుట్టింది. బతికి ఉన్న క్రీస్తు కంటే మరణించిన క్రీస్తంటే వారికి భయం ఎక్కువయ్యింది. ఆయన సిలువకు సంబంధించిన విషయాలికి ప్రజలు గమనాన్ని తిప్పడం వారికి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆనాటి తమ పని పర్యవసానానికి వారు భయపడ్డారు. ఆయన దేహం సబ్బాతు పరిశుద్ధ తకు విఘాతంమవుతుంది. సబ్బాతును అతిక్రమించడమవుతుంది. దీన్ని సాకుగా చేసుకునే కొందరు యూదు నాయకులు పిలాతు వద్దకు వెళ్లి బాధితుల మరణాన్ని వేగవంతం చేసి సూర్యాస్తమయానికి ముందు వారి దేహాల్ని తొలగించాల్సిందిగా అతడికి విజ్ఞప్తిచేశారు.DATel 870.3

    యేసు దేహం సిలువ మీద ఉండడానికి పిలాతుకి కూడా ఏ మాత్రం ఇష్టం లేదు. పిలాతు అనుమతి ఇచ్చిన వెంటనే ఆ యిద్దరి దొంగలూ మరణించడానికి వారి కాళ్లూ విరగగొట్టారు. అయితే క్రీస్తు అప్పటికే మరణించినట్లు కనుగొన్నారు. కఠిన హృదయులైన ఆ సైనికులు క్రీస్తు మాటలు విని ఆయన తీరును గమనించి ఆయన పట్ల సానుభూతి కలిగి ఉన్నారు. వారు ఆయన కాళ్ళు విరగకొట్టకుండా ఆగిపోయారు. ఇలా దేవుని గొర్రెపిల్లను అర్పించడంలో పస్కానియమాన్ని నెరవేర్చడం జరిగింది, “వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముకనైనను విరువవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరించవలెను.” సంఖ్యా 9:12.DATel 871.1

    క్రీస్తు మరణించడం యాజకుల్ని అధికారుల్ని ఆశ్చర్యపరిచింది. సిలువ మరణం నెమ్మదిగా కొనసాగే ప్రక్రియ. ప్రాణం ఎప్పుడు పోయిందో నిర్ణయించడం కష్టం. సిలువవేసిన ఆరుగంటలోనే ఒక వ్యక్తి మరణించడం ఎన్నడూ వినని విషయం. ఆయన మరణాన్ని నిర్ధారించగోరారు. వారి సలహా మేరకు ఒక సైనికుడు ఆయన పక్కలోకి బళ్లెం దించాడు. అతడు చేసిన గాయంలో నుంచి రెండు ధారల ద్రవం వచ్చింది. ఒకటి రక్తం ఇంకొకటి నీరు. ప్రేక్షకులంతా ఈ దృశ్యాన్ని చూశారు. ఈ ఘటనను యోహాను నిర్దిష్టంగా వివరించాడు. అతడిలా వివరించాడు, “సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనెరుగును. అతని యెముకలలో ఒకటైనను విరువడబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. - తాము పొడిచిన తట్టుచూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది. ” యోహా 19:34-37.DATel 871.2

    క్రీస్తు సిలువ మిద మరణించలేదని ఆయన కేవలం మూర్చపోయాడని, అనంతరం కోలుకున్నాడని, యాజకులు తప్పుడు ప్రచారం సాగించారు. సమాధిలో పెట్టింది రక్తమాంసాలు గల నిజమైన శరీరం కాదని అది శరీరాన్ని పోలింది మాత్రమేనని ఇంకొక తప్పుడు వార్త ప్రచారం చేశారు. రోమా సైనికుల చర్య ఈ సమాచారం తప్పని నిరూపించింది. ఆయన అప్పటికే మరణించాడు గనుక వారు ఆయన కాళ్లు విరగగొట్టలేదు. యాజకుల్ని తృప్తిపర్చేందుకు ఆయన పక్కను ఈటెతో పొడిచారు. ప్రాణం అప్పటికే పోయి ఉండకపోతే ఈ చర్య తక్షణ మరణం కలిగించేది.DATel 872.1

    అయితే ఆయన పక్కలో దించిన ఈటె పోటుగాని, సిలువ మూలంగా కలిగిన తీవ్ర బాధ గాని యేసు మరణానికి హేతువు కాదు. మరుణించే సమయంలో ఆయన “గొప్ప శబ్దముతో” వేసిన కేక (మత్త 27:450; లూకా 23:46). ఆయన పక్కలోనుంచి కారిన రక్తం నీరు ఆయన హృదయం పగిలి మరణించాడని చాటుతున్నాయి. ఆయన హృదయం మానసిక వేదనవల్ల పగిలింది. లోక పాపం ఆయన్ని బలిగొన్నది.DATel 872.2

    క్రీస్తు మరణించడంతో ఆయన శిష్యుల ఆశలు అంతమయ్యాయి. మూతపడ్డ ఆయన కళ్లని, వంచి ఉన్న ఆయన తలని, రక్తంతో తడిసిపోగులుగా ఏర్పడ్డ వెంట్రుకల్ని చూశారు. గాయపడ్డ ఆయన పాదాల్ని చేతుల్ని చూశారు. వారి దుఃఖానికి గుండెకోతకు అంతులేదు. ఆయన మరణిస్తాడని చివరివరకూ వారు నమ్మలేదు. ఆయన నిజంగా మరణించాడని వారు నమ్మలేకపోతున్నారు. ఈ సన్నివేశాన్ని ముందే తమకు చెప్పిన మాటల్ని దుఃఖంలో మునికి ఉన్నవారు గుర్తు తెచ్చుకోలేదు. ఆయన చెప్పింది ఏదీ ఇప్పుడు వారికి ఆదరణ కూర్చడంలేదు. వారు సిలువను రక్తం కారుతున్న క్రీస్తు దేహాన్ని మాత్రమే చూస్తున్నారు. భవిష్యత్తు నిరాశ నిస్పృహల చీకటితో నిండినట్లు కనిపిస్తోంది. యేసుపై వారికున్న విశ్వాసం నశించింది. కాని ఆయనపట్ల వారి ప్రేమ ప్రగాఢమయ్యింది. మునుపెన్నటికన్నా ఎక్కువగా ఇప్పుడు ఆయన విలువను గుర్తించారు. తమకు ఆయన ఎంత అవసరమో ఇప్పుడు గుర్తించారు.DATel 872.3

    మరణించినప్పుడు సయితం క్రీస్తు శరీరం శిష్యులికి ఎంతో విలుగలదయ్యింది. ఆయన్ని గౌరవంగా సమాధి చెయ్యలని భావించారు. కాని ఆపని ఎలా చెయ్యాలో వారికి తెలియలేదు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశద్రోహ చర్యలకు పాల్పడ్డాడన్న ఆరోపణ పై యేసుని నేరస్తుడుగా తీర్చితీర్చి మరణశిక్ష వింధించారు. ఈ నేరం కింద మరణించిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటయిన శ్మశాన వాటికలో పాతి పెట్టేవారు. శిష్యుడు యోహాను గలిలయనుంచి వచ్చిన స్త్రీలు సిలువవద్ద ఉన్నారు. మానవతలేని సైనికులు ఆయన దేహం విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించి దాన్ని అప్రదిష్ఠకరమైన శ్మశానవాటికలో పాతి పెట్టడం వారికి ఇష్టం లేదు. అయినా దాన్ని ఆపలేకపోయారు. యూదు అధి కారుల సానుభూతి పొందలేకపోయారు. పిలాతుతో వారికి ఎక్కువ పరిచయమూ లేదు.DATel 873.1

    ఆ అత్యవసర పరిస్థితిలో అరిమతయియ యోసేపు, నీకొదేము వారికి సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఈ ఇద్దరూ సన్ హెడ్రిన్ సభ్యులు. వారికి పిలాతుతో మంచి పరిచయం ఉంది. ఇద్దరూ భాగ్యవంతులు, మంచి పలుకుబడి గలవారు. యేసు సమాధి ఘనంగా జరగాలని వారిద్దరూ కృతనిశ్చయంతో ఉన్నారు.DATel 873.2

    యోసేవు ధైర్యంగా పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహాన్నివ్వవలసిందిగా బతిమాలాడు. యేసు నిజంగా మరణించాడని పిలాతు మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాడు. సిలువకు సంబంధించిన సంఘటనల్ని గూర్చి పరస్పర విరుద్ద నివేదికులు అతడువిన్నాడు. కాని క్రీస్తు మరణాన్ని గూర్చిన వార్త కావాలని అతడికి అందకుండా చేశారు. క్రీస్తు దేహం విషయంలో ఆయన శిష్యులు మోసాలు చేస్తారని అందుచేత తాను అప్రమత్తంగా ఉండాలన్ యాజకలు అధికారులు పిలాతుని హెచ్చరించారు. కనుక యోసేపు మనవి విన్న వెంటనే సిలువ విషయాలకు నాయకత్వం వహించిన శతాధిపతికి పిలాతు కబురు చేసి యేసు మరణాన్ని ధ్రువపర్చుకున్నాడు. యోసేపు సాక్షాన్ని ధ్రువపర్చుకోడానికి కల్వరి వద్ద జరిగిన సంగతులు శతాభిపతి నడిగి తెలుసుకున్నాడు.DATel 873.3

    యోసేవు మనవిని పిలాతు మంజూరు చేశాడు. ప్రభువు సమాధి గురించి యోహాను ఆందోళన చెందుతుండగా క్రీస్తు దేహాన్ని తీసుకువెళ్లడాన్ని అనుమతిస్తూ పిలాతు జారీచేసిన ఆదేశంతో యోసేవు వచ్చాడు. నీకొదేము ఆయన దేహాన్ని భద్రపర్చడానికి బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబై పేర్లు తెచ్చాడు. యెరూషలేములో అత్యున్నత గౌరవ పాత్రుడు మరణించి ఉంటే ఇంతకన్నా ఎక్కువ ఘనత అతడికి లభించేది కాదు. తమ ప్రభువు సమాధి విషయంలో ధనవంతులైన ఈ అధికారులు తమలాగే ఆసక్తిగా ఉండడం చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు.DATel 873.4

    యోసేపుగాని నీకొదేముగాని క్రీస్తు జీవించి ఉన్నప్పుడు ఆయన్ని రక్షకుడుగా బహిరంగంగా స్వీకరించలేదు. ఆ చర్య తమను సన్ హెడ్రిన్ సభ్యత్వానికి దూరం చేస్తుందని వారికి తెలుసు. ఆ సభలో ఉండి తమ పలుకుబడి ద్వారా ఆయన్ని కాపాడాలన్నది వారి ముఖ్యోద్దేశం. కొంతకాలం వారు జయం పొందుతున్నట్లు కనిపించింది. కాని జిత్తులమారి యాజకులు క్రీస్తు పట్ల వారి మక్కువను అనురాగాన్ని చూసి వారి ప్రణాళికలికలికి అడ్డుకట్ట వేసేవారు. వీరు లేనప్పుడు వారు క్రీస్తుని నేరస్తుడుగా తీర్చి సిలువ వేయడానికి అప్పగించారు. ఇప్పుడు క్రీస్తు మరణించాడు గనుక ఆయనపట్ల తమ సాన్నిహిత్యాన్ని మరుగుపర్చాల్సిన అవసరం లేదు. ఆయన అనుచరులుగా బహిరంగంగా కనపర్చుకోడానికి శిష్యులు బుగులు చెందుతుండగా యోసేవు నీకొదేములు ధైర్యంగా వారికి సహాయం చేశారు. ఈ సమయంలో భాగ్యవంతులు గౌరవ ప్రతిష్టలు గలవారు అయిన వీరి సహాయం ఎంతో అవసరమయ్యింది. మృతుడైన తమ ప్రభువికి ఈ బీద శిష్యులు చేయలేనిది వారు చెయ్యగలిగారు. యాజకులు అధికారుల ద్వేషం శత్రుత్వం నుంచి శిష్యుల్ని వీరి భాగ్యం పలుకుబడి చాలామట్టుకు కాపాడగలిగాయి.DATel 874.1

    తమ సొంత చేతులతో వారు యేసు దేహాన్ని పదిలంగా గౌరవంతో సిలువ మీద నుంచి కిందికి దింపారు. గాయాలు కొరడా దెబ్బల పుండ్లతో నిండిన ఆయన దేహాన్ని చూసినప్పుడు వారికి కన్నీరు మున్నీరుగా కారాయి. యోసేవుకి రాతిలో తొలిచిన కొత్త సమాధి ఉంది. దీన్ని అతడు తనకోసం అట్టి పెట్టుకున్నాడు. అది కల్వరికి దగ్గరలో ఉంది. దాన్ని ఇప్పుడు యేసుకి సిద్ధం చేశాడు. దేహంపై నీకొదేము తెచ్చిన సుగంధ ద్రవ్యాలు పోసి ఒక నారబట్టలో చుట్టి రక్షకుణ్ని సమాధి వద్దకు మోసుకువెళ్లారు. అక్కడ ఆ ముగ్గురు శిష్యులు చితుక కొట్టబడ్డకాళ్లను సరిచేసి, దెబ్బలతో నిండిన చేతుల్ని ఆయన శ్వాసలేని ఛాతిమీద మడిచి పెట్టారు. తమ ప్రియతమ బోధకుని నిర్జీవ ఆకారానికి చేయగలిగినదంతా చెయ్యడానికి గలిలయ స్త్రీలు వచ్చారు. అప్పుడు పెద్దరాయి దొర్లించుకుని వచ్చి ఆ సమాధి గుమ్మాన్ని దానితో ముశారు. రక్షకుణ్ని ఆసమాధిలో ఉంచారు. ఆ స్త్రీలు సిలువ వద్ద ఉన్న వారిలో చివరివారు. రక్షకుని సమాధివద్ద ఉన్నవారిలో కూడా వారే చివరివారు. సాయంత్రం మసక చీకట్లు కమ్ముతున్న సమయంలో మగ్దలేనే మరియ ఇతర మరియలు తాము అమితంగా ప్రేమించిన ప్రభువుకి జరిగిన దానికి దుఃఖిస్తూ సమాధి వద్ద ఒకింత సేపు ఉన్నారు. వారు “తిరిగి వెళ్లి.... ఆజ్ఞచొప్పున విశ్రాంతి దినము తీరికగా ఉండరి.” లూకా 23:56.DATel 874.2

    దుఃఖిస్తున్న శిష్యులికి యాజకులికి, అధికారులికి, శాస్త్రులికి ప్రజలికి కూడా అది ఎన్నడూ మరచిపోకూడని సబ్బాతు. ఆ సిద్ధబాటు దినం సూర్యాస్తమయ సమయంలో సబ్బాతు ప్రారంభమయ్యిందని సూచిస్తూ బూరలు మోగాయి. శతాబ్దాలు తరరబడి ఆచరిస్తూ వస్తున్న విధంగా పస్కాను ఆచరించారు. అయితే అది ఎవరిని సూచిస్తుందో ఆయన్ని దుష్టులు హతమార్చగా ఆయన యోసేవు సమాధిలో విశ్రమిస్తోన్నాడు. సబ్బాతునాడు ఆలయ ఆవరణం ఆరాధకులతో కిటకిటలాడ్తోంది. గొల్గోతాకు చెందిన ప్రధానయాజకుడు యాజక వస్త్రాలు ధరించి అక్కడున్నాడు. తెల్లని పాగాలు ధరించిన యాజకులు తమ విధులు నిర్వహిస్తోన్నారు. పాపం కోసం ఎడ్లు మేకల రక్తం సమర్పిస్తున్నప్పుడు అక్కడున్న వారిలో కొందరికి మనసు మనసులో లేదు. ఛాంటారూపకం నిజస్వరూపాన్ని కలిసిందని లోక పాపాల నిమిత్తం అనంతమైన త్యాగం చేయబడిందని వారికి తెలియదు. ఆ ఛాయారూపక ఆచారప్రధాన సేవలో ఇక ఏమాత్రం విలువలేదని వారికి తెలియదు. అయితే ఆ సేవను ఎన్నడూ ఇంత విరుద్ధ మనోభావనలతో ప్రజలు వీక్షించడం జరగలేదు. బూరలు, సంగీత వాద్యాలు, గాయకుల స్వరాలు ఎప్పటిలాగే గట్టిగా స్పష్టంగా వినిపిస్తోన్నాయి. అయితే ఒక విచిత్ర పరిస్థితి అంతటా వ్యాపించింది. అక్కడ చోటుచేసుకున్న వింతపరిణామం గురించి ఒకరి తర్వాత ఒకరు వాకబు చేస్తోన్నారు. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరూ ప్రవేశించకుండా దాన్ని పరిశుద్ధంగా ఇప్పటివరకూ కాపాడడం జరిగింది కాని ఇప్పుడది అందరికీ కనిపించేటట్లు బాహాటంగా తెరచి ఉంది. స్వచ్ఛమైన నారతో నేసిన, బంగారు ధూమ్ర రక్త వర్ణములుగల అడ్డతెర పైనుంచి కిందకు చినిగిపోయింది. తన మహిమను ఇవ్వడానికి యెహోవా ప్రధాన యాజకుణ్ని కలిసే స్థలం, దేవుని సందర్శన స్థలంగా ఉంటూ వచ్చిన ఆ స్థలం ప్రతీ నేత్రానికీ కనిపించే విధంగా తెరచి ఉంది. అది ఇక దేవుడు గుర్తించని సలంగా ఉంది. బలిపీఠం ముందు భయంతోను వణకుతోను యాజకులు పరిచర్య చేసేవారు. అతి పరిశుద్ధ స్థలాన్ని బాహాటపర్చడమన్న పరిశుద్ధ మర్మం రానున్న ఉపద్రవం గుర్తించి వారి మనసుల్ని భయంతో నింపింది.DATel 875.1

    కల్వరి దృశ్యాలతో ప్రారంభమైన ఆలోచనలతో అనేకమంది మనసులు నిండిఉన్నాయి. అవి దీక్షతో పనిచేస్తున్నాయి. సిలువ మొదలుకొని పునరుత్థానం వరకూ ఉన్న ప్రవచనాల్ని నిద్రలేని అనేక నేత్రాలు పరిశీలిస్తున్నాయి. కొన్ని కళ్లు తాము జరుపుకుంటోన్న పండుగ పూర్తిభావాన్ని తెలుసుకోడానికి పరిశీలిస్తోన్నాయి. కొన్ని కళ్లు క్రీస్తు తాను ఎవరనని చెప్పుకున్నాడో ఆయన కాదనడానికి నిదర్శనాన్ని కనుగోడానికి పరిశీలిస్తోన్నాయి. కొందరు ఆయన నిజమైన మెస్సియా అని రుజువులు కనుగోడానికి దుఃఖభరిత హృదయాలతో పరిశోధిస్తున్నారు. వేర్వేరు ఉద్దేశాలతో పరిశోధిస్తున్నా అందరికీ ఒకే సత్యం గురించి నమ్మకం కలిగింది. గత కొన్ని దినాల క్రితం చోటుచేసుకున్న ఘటనల్లో ప్రవచనం నెరవేరిందని సిలువవేయబడిన ఆప్రభువు లోక రక్షకుడన్నదే ఆనమ్మకం. ఆ సమయంలో ఆ పరిచర్యలో పాల్గొన్నవారిలో అనేకమంది పస్కాకర్మకాండలో మళ్లీ ఎన్నడూ పాల్లో లేదు. అనేకమంది యాజకులతో సహా యేసు నిజ స్వరూపాన్ని గుర్తించారు. వారి ప్రవచన పరిశోధన వ్యర్థం కాలేదు. ఆయన పునరుత్థానం తర్వాత ఆయన్ని దైవకుమారుడుగా గుర్తించారు.DATel 876.1

    నీకొదేము యేసును సిలువమిద వేలాడడం చూసినప్పుడు రాత్రివేళ ఒలీవల కొండపై తనతో ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు, “అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తైనో ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.” యోహా 3:14, 15. క్రీస్తు సమాధిలో విశ్రాంతి తీసుకునంటున్న ఆ సబ్బాతునాడు నీకొదేము ధ్యానించడానికి తరుణం కలిగింది. ఇప్పుడు అతడి మనసును స్పష్టమైన వెలుగు నింపింది. యేసు తనతో అన్నమాటలు ఇక తనకు మర్మంతో నిండిన మాటలుకావు. రక్షకుడు జీవించి ఉండగా ఆయన అనుచరుడు కానందుకు తానెంతో పోగొట్టుకున్నానని బాధపడ్డాడు. ఇప్పుడు కల్వరి సంఘటనల్ని నెమరు వేసుకున్నాడు. తన హంతకుల నిమిత్తం క్రీస్తు చేసిన ప్రార్ధన మరణిస్తున్న దొంగ మనవికి ఆయన ఇచ్చిన సమాధానం పండితుడు సన్ హెడ్రిన్ సభ్యుడు అయిన నీకొదేము మనసును ఆకట్టుకున్నాయి. బాధ అనుభవిస్తోన్న రక్షకుణ్ని మళ్లీ చూశాడు. ఆయన చివరగా “సమాప్తమైనది” అంటూ వేసిన కేకను మళ్లీ విన్నాడు. అవి విజేత పలికిన మాటలవంటి మాటలు. కంపిస్తున్న, భూమిని, చీకటి కమ్మిన ఆకాశాన్ని చినిగిన గుడి తెరను, బద్దలైన రాతి బండల్ని మళ్లీ చూశాడు. అతడి విశ్వాసం సుస్థిరమయ్యింది. ఏ సంభవం శిష్యుల నిరీక్షణను నీరుగార్చిందో అదే సంభవం యోసేపు నీకొదేములు క్రీస్తు దేవుడని నమ్మడానికి దోహదపడింది. తమ అచంచల విశ్వాసంవల్ల కలిగిన ధైర్యం వారి భయాల్ని జయించింది.DATel 876.2

    క్రీస్తు ఇప్పుడు సమాధిలో ఉన్నప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించినంతగా ఎప్పుడూ ఆకర్షించలేదు. తమ వాడుక చొప్పున ప్రజలు వ్యాధి బాధితుల్ని ఆలయ ఆవరణంలోకి తీసుకువచ్చి నజరేయుడైన యేసు ఎక్కడ అంటూ భోగట్టా చేస్తున్నారు. వ్యాధిగ్రస్తుల్ని బాగుజేసిన, మృతుల్ని లేపిన ఆ ప్రభువుని వెతుక్కుంటూ అనేకులు దూరప్రాంతాల నుంచి వచ్చారు. స్వస్తత కూర్చే క్రీస్తు కావాలని అంటూ అన్నిపక్కలనుంచీ కేకలు వినిపించాయి. ఈ సమయాల్లో కుష్టు వ్యాధి చిహ్నాలున్నవారిని యాజకులు పరీక్షించడం ఆనవాయితీ. భర్తల్నో భార్యల్నో లేక పిల్లల్నో కుష్టువ్యాధి ఉన్న వారిగా ప్రకటించి, ఇంటి వసతి స్నేహితుల శ్రద్ద విడిచిపెట్టె బయటికి వెళ్లిపోయి, తెలియని వారిని హెచ్చరించేందుకు “అపవిత్రం అపవిత్రం” అంటూ కేకలు వెయ్యడానికి అనేకుల్ని ఒత్తిడి చేసేవారు. హేయమైన కుష్ఠు రోగుల్ని స్వస్థత నిచ్చే తన హస్తాలతో ముట్టుకోడానికి ఎన్నడూ నిరాకరించని నజరేయుడు స్నేహశీలి అయిన యేసు హస్తాలు ఇప్పుడు ఆయన ఛాతి మీద మడిచి ఉన్నాయి. “నా కిష్టమే; నీవు శుద్ధుడువుకమ్ము” (మత్త. 8:3) అని అతడికి సమాధాన మిచ్చిన పెదవులు నిశ్శబ్దంగా ఉన్నాయి. దయ చూపించమంటూ ప్రధాన యాజకులికి అధికారులికి చాలామంది విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. క్రీస్తు తమ మధ్య మళ్లీ జీవించాని వారి దృఢ సంకల్పమన్నట్లు కనిపిస్తోంది. వారు మళ్లీ మళ్లీ ఆయన కావాలని అడిగారు. ఆయన్ని చూడకుండా వెళ్లిపోడానికి సిద్ధంగా లేరు. అయితే వారిని బలవంతంగా ఆలయ ఆవరణం నుంచి తరిమివేశారు. వ్యాధిగ్రస్తుల్ని తీసుకువచ్చి లోపలికి ఆలయం ఆవరణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వారిని వెనక్కినెట్టివెయ్యడానికి గుమ్మాల వద్ద సైనికుల్ని మోహరించారు.DATel 877.1

    రక్షకుడు స్వస్తపర్చుతాడని నిరీక్షిస్తూ వచ్చిన వ్యాధి బాధితులు నిరాశతో నీరుగారిపోయారు. వీధులు శోకిస్తోన్నవారితో కిటకిటలాడున్నాయి. స్వస్తపర్చే యేసు స్పర్శలేక వ్యాధిగ్రస్తులు మరణిస్తోన్నారు. వ్యాధిగ్రస్తులు వైద్యుల వద్దకు వెళ్తున్నారు. కాని వారు ఏమి చెయ్యలేకపోతున్నారు. యేసేవు సమాధిలో విశ్రమిస్తున్న ఆ ప్రభువుకున్న నైపుణ్యం ఇంకెవరికీ లేదు.DATel 878.1

    వ్యాధుల్తో బాధపడుతున్నవారి రోదనలు గొప్ప వెలుగు లోకంలోనుంచి వెళ్లిపోయిందన్న నమ్మకాన్ని వేలాదిమందికి పుటించింది. క్రీస్తు లేక లోకం చీకటిమయమౌతుంది. “వానిని సిలువవేయుము సిలువవేయుము” అని కేకలు వేసిన వారిలో అనేకులు ఇప్పుడు తమకు కలిగిన విపత్తును గుర్తించారు. ఆయన ఇంకా బతికి ఉంటే వారు “మాకు యేసునివ్వండి” అని కేకలు వేసేవారు.DATel 878.2

    యాజకులు యేసుని చంపారని ప్రజలు తెలుసుకున్నప్పుడు ఆయన మరణాన్ని గురించి విచారణ చేశారు. ఆయన తీర్పు వివరాల్ని యాజకులు రహస్యంగా ఉంచారు. కాని ఆయన సమాధిలో ఉన్న సమయంలో ఆయన పేరు వేలాదిమంది పెదవులపై ఉంది. ఆయనపై జరిగిన బూటకపు విచారణను గూర్చి, ఆయనపట్ల యాజకులు అధికార్లు అమానుష్యంగా ప్రవర్తించిన తీరును గూర్చిన సమాచారం అందరికీ వెల్లడయ్యింది. మెస్సీయాను గూర్చిన పాత నింబంధన ప్రవచనాల్ని వివరించాల్సిందిగా మేధావులు యాజకుల్ని అధికారుల్ని కోరారు. ఏదో తప్పుడు సమాధానం తయారు చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు వారు పిచ్చివారుగా తయారయ్యారు. క్రీస్తు శ్రమల్ని మరణాన్ని గూర్చిన ప్రవచనాల్ని వివరించలేకపోయారు. లేఖనాలు నెరవేరాయని అనేకమంది పరిశీలకులు విశ్వసించారు.DATel 878.3

    ఎంతో మధురంగా ఉంటుందని యాజకలు భావించిన ప్రతీకారం వారికి చేదు అనుభవంగా పరిణమించింది. తాము ప్రజల తీవ్ర మందలింపును ఎదుర్కొంటున్నామని వారికి తెలుసు. వారు యేసుకి వ్యతిరేకంగా ఎవరిని రెచ్చగొట్టారో ఆ ప్రజలే ఇప్పుడు తాము చేసిన పనులికి తీవ్ర అభ్యంతరాన్ని తెలుపుతున్నారని వారికి తెలుసు. యేసు మోసగాడని నమ్మించడానికి యాజకులు ప్రయత్నించారు గాని అది వ్యర్థ ప్రయత్నమయ్యింది. వారిలో కొందరు లాజరు సమాధి పక్క ఉండి మరణించిన అతడు బతికి బైటకి రావడం చూశారు. క్రీస్తు మృతుల్లోనుంచి లేచి మళ్లీ తమముందు నిలుస్తాడని వారు భయపడ్డారు. తన ప్రాణాన్ని పెట్టడానికి దాని మళ్లీ తీసుకోడానికి తనకు శక్తి ఉన్నదని ఆయన చెప్పడం వారు విన్నారు. “ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదును” (యోహా. 2:19) అని ఆయన చెప్పడం గుర్తు చేసుకున్నారు. యెరూషలేముకి చివరి ప్రయాణంలో క్రీస్తు శిష్యులతో చెప్పిన ఈ మాటల్ని యూదా వారితో చెప్పాడు: “ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము అక్కడ మనుష్యకునారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణశిక్ష విధించి, ఆయనను అపహసించుటకు కొరడాలతో కొట్టుటకును సిలవవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, మూడవ దినమున ఆయన మరల లేచును” మత్త. 20:18, 19. ఈ మాటలు విన్నప్పుడు వారు ఎగతాళి చేసి అపహసించారు. కాని ఇప్పుడు క్రీస్తు ముందుగా చెప్పినవన్నీ నెరవేరినట్లు, గుర్తుచేసుకున్నారు. తాను మూడోరోజున లేస్తానని చెప్పాడు. ఇది నెరవేరదని ఎవరు చెప్పగలరు? ఈ ఆలోచనల్ని మానాలని అనుకున్నారుగాని అది వారికి సాధ్యం కాలేదు. తమ తండ్రి అపవాదిలాగే వారూ నమ్మి వణికారు.DATel 878.4

    ఇప్పుడు ఆ భావోద్వేగం గతించింది. కాని క్రీస్తు రూపం వారి మనసుల్లో ప్రత్యక్షమౌతూ ఉంది. ఆయన తన శత్రువుల ముందు పిర్యాదులేమీ లేకుండా నిలబడడం, వారు పెట్టే బాధను, చేస్తున్న ఎగతాళిని సణగకుండా గొణకుండా భరించడం వారు చూశారు. ఆయన విచారణ, సిలువకు సంబంధించిన ఘటనలన్నీ వారి ముందుకు వచ్చాయి. అవి ఆయన దేవుని కుమారుడన్న విశ్వాసాన్ని పుట్టించాయి. ఆయన ఎప్పుడైన తమ ముందు నిలబడవచ్చునని భావించారు. నిందితుడు తమపై నింద మోపుతాడని, శిక్షకు గురి అయిన ఆయన తమను శిక్షిస్తాడని, వధకు గురి అయిన ఆయన తన హంతకుల మరణాన్ని డిమాండు చేస్తాడని భావించారు. .DATel 879.1

    సబ్బాతు దినాన వారు విశ్రమించలేకపోయారు. అపవిత్రత అంటుతుందన్న భయంతో అన్యుడి గడపతొక్కరు గాని యేసు దేహాన్ని గురించి వారు ఒక సమావేశం జరుపుకున్నారు. వారు సిలువవేసిన ఆయన్ని మరణం సమాధిలో బంధించి ఉంచాలి. “మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులును పరిసయ్యులును పిలాతునొద్దకు వచ్చి -అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు - మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము, వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి - ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచనకంటే కడపటి వంచన మరి చెడ్డదైయుండును అని చెప్పిరు. అందుకు పిలాతు - కావలివారున్నారు గదా మీరు వెళ్లి నా చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను” మత్త, 27:62-65.DATel 880.1

    యాజకులు సమాధిని భద్రపర్చడానికి ఆదేశాలిచ్చారు. సమాధి గుమ్మాన్ని మూసి వేస్తూ ఒక బ్రహ్మాండమైన రాయిని దొర్లించారు. ఈ రాతికి అడ్డంగా బలమైన తాళ్లుకట్టి వాటి కొనలను బలమైన రాతిలో అమర్చి వాటి మీద రోమా ప్రభుత్వము ముద్రవేశారు. ఆ ముద్రల్ని బద్దలు కొట్టకుండా ఆ రాయిని కదిలించడం అసాధ్యం. సమాధిని ఎవరూ ముట్టుకోకుండా కాపాడేందుకు దాని చూట్టూ వందమంది రోమా సైనికుల్ని మోహరించారు. క్రీస్తు శరీరాన్ని పెట్టిన చోటనే ఉంచడానికి యాజకులు శాయశక్తులా ప్రయత్నించారు. ఆయన ఆ సమాధిలోనే నిత్యమూ ఉండిపోవాలనట్లుగా సమాధికి ముద్రలు వేసి దాన్ని భద్రపర్చారు.DATel 880.2

    బలహీన మనుషులు సంప్రదించుకుని పథకాలు వేసుకున్నారు. తమ ప్రయత్నాలు నిరర్థకమని ఈ హంతకులు గ్రహించలేదు. అయితే వారి చర్యమూలంగా దేవుడు మహిమ పొందాడు. క్రీస్తు పునరుత్థానం జరగకుండా చూడడానికి చేసిన ప్రయత్నాలే అది వాస్తవ మనడానికి తిరుగులేని రుజువు. సమాధి చుట్టూ ఎంత ఎక్కువమంది సైనికుల్ని మోహరిస్తే ఆయన లేచాడనడానికి అది అంత బలమైన సాక్ష్యం అవుతుంది. క్రీస్తు మరణానికి వందల సంవత్సరాలకి పూర్వం కీర్తనల రచయిత ద్వారా పరిశుద్దాత్మ ఇలా ప్రకటించాడు, “అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్ధమైన దానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదమురండి వారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికినికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు.” కీర్త. 2:1-4. జీవనాధుడు యేసుని సమాధిలో బందించి ఉంచడానికి రోమా సైనికులు శక్తిహీనులు. రోమా ఆయుధాలు నిరర్థకం. ఆయన విడుదల గడియ సమిపించింది.DATel 880.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents