Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  53—గలిలయనుంచి చివరి పయనం

  తన పరిచర్య ముగింపుకు సమయం దగ్గరపడినప్పుడు క్రీస్తు పరిచర్య తీరులో మార్పు వచ్చింది. క్రితంలో ఆయన ఉద్రేకానికి ప్రచారానికి దూరంగా ఉండేవాడు. ప్రజల నీరాజనాల్ని నిరాకరించేవాడు. తన రాక సందర్భంగా ఒక చోటు నుండి ఇంకోచోటుకి త్వరత్వరగా వెళ్ళేవాడు. తనను క్రీస్తుగా ఎవరూ ప్రకటించకూడదని పదేపదే ఆదేశించాడు.DATel 541.1

  పర్ణశాలల పండుగ సమయంలో యెరూషలేముకి ఆయన త్వరితం గాను గోప్యంగాను ప్రయాణించాడు. తన్నుతాను మెస్సీయాగా బహిరంగంగా ప్రకటించుకోవలసిందిగా తన సహోదరుల విజ్ఞప్తికి ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు, “నా సమయమింకను రాలేదు” యోహా 7:6. ఎవరూ గమనించకుండా జన సమూహాల మన్నన పొందకుండా పట్టణంలో ప్రవేశించాడు. అయితే ఆయన చివరి ప్రయాణం అలాలేదు. యాజకులు రబ్బీల ద్వేషం కారణంగా యెరుషలేమును కొంతకాలం విడిచి పెట్టాడు. అయితే ఇప్పుడు ఎంపిక చేసుకుని మునుపు ఎన్నడూ లేని రీతిలో తన రాకను గురించి ప్రచారం చేసుకుంటూ వెళ్లాడు. ఆయన తన బలిదాన దృశ్యం దిశగా సాగుతోన్నాడు. ప్రజల గమనాన్ని ఈ దృశ్యానికి ఆకర్షించడం జరగాలి.DATel 541.2

  “అరణ్యంలో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను.” యోహా 3:14. తమ స్వస్తతకు ఏర్పాటైన ఎత్తబడ్డ సర్పసంకేతం పైకి సర్వ ఇశ్రాయేలు దృష్టి ఎలా ఆకర్షితమయ్యిందో అలాగే నశించిన లోకానికి రక్షణనిచ్చే క్రీస్తు బలిదానంపై అందరి దృష్టి కేంద్రీకృతం కావలిసి ఉంది.DATel 541.3

  మెస్సీయా పరిచర్యను గూర్చి తప్పుడు అభిప్రాయం, యేసు దేవత్వంపై విశ్వాసం లేకపోవడం, పర్ణశాలల పండుగలో ప్రజలకు తన్నుతాను బహిరంగంగా మెస్సీయాగా ప్రకటించుకోవలసిందిగా తన సహోదరులు ఆయన్ని కోరడానికి దారి తీశాయి. ఇలాంటి అభిప్రాయం తోనే ఇప్పుడు ఆయన యెరుషలేముకు వెళ్లకుండా శిష్యులు అడ్డుతగిలావారు. అక్కడ తనకు సంభవించనున్న దాన్ని గురించి ఆయన చెప్పిన మాటలు వారు గుర్తు చేసుకున్నారు. మత నాయకుల దురుద్దేశాలు వారికి బాగా తెలుసు. తమ ప్రభువుని అక్కడకు వెళ్లకుండా చెయ్యడం వారి అభిమతం.DATel 542.1

  శిష్యుల భయాలు, ఆశాభంగం, ఆపనమ్మకం లెక్కచెయ్యకుండా తన పయనం సాగించడం క్రీస్తు హృదయానికి బాధాకరంగానే ఉంది. యెరూషలేములో తాము ఎదుర్కోనున్న వేదన నిస్పృహల్లోకి వారిని నడిపించడం సులభమైన పనికాదు. మనుషకుమారుణ్ని తన శోధనలతో వేధించడానికి సాతాను పొంచి ఉన్నాడు. యెరుషలేము వెళ్ళడమంటే మరణమే గనుక ఇప్పుడు అక్కడకు తాను ఎందుకు వెళ్ళాలి? తన చుట్టూ జీవాహారం కోసం ఆకలితో ఆలమటిస్తున్న ఆత్మలున్నాయి. స్వస్తత కూర్చే తన మాట వినాలని అన్ని చోట్ల వ్యాధి బాధితులు ఎదురుచూస్తోన్నారు. తన కృపా సువార్త నిర్వహించాల్సిన పరిచర్య ఇప్పుడే ప్రారంభమయ్యింది. తాను నవ యౌవనంతో నిండి ఉన్నాడు. తన కృపావాక్కులతో, తన స్వస్తత శక్తితో ప్రపంచంలోని విస్తృత సేవా రంగాల్లో ఎందుకు ఉత్సహించకూడదు? విశ్వాసంలో ఎంతో బలహీనులు, అవగాహనలో మందమతులు, కార్యాచరణకు వెనకాడేవారు అయిన శిష్యులికి పంటనుకూర్చే పనిని విడిచి పెట్టడం ఎందుకు? అరణ్యంలో క్రీస్తుని ఎదుర్కొన్న ప్రత్యర్ధి ఇప్పుడు తీవ్రమైన మోసకరమైన శోధనలతో ఆయన్ని ఎదుర్కున్నాడు. యేసు ఒక్క నిముషం ఏమరుపడి, తన్ను తాను రక్షించుకోడానికి తన విధానాన్ని మార్చుకుని ఉంటే సాతాను వర్గాలు విజయం సాధించేవి. లోకం నశించేది.DATel 542.2

  అయితే యేసు “యెరుషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచు” కున్నాడు. తన జీవితంలోని ఒకే ఒక నియమం తండ్రి చిత్తం నెరవేర్పు. తన బాల్యంలో దేవాలయ సందర్శన సమయంలో మరియతో ఆయన ఇలా అన్నాడు, “నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా?” లూకా 2:49. కానాలో తన సూచక క్రియాశక్తిని ప్రదర్శించాల్సిందిగా మరియ తనను కోరినప్పుడు ఆయనిచ్చిన జవాబు ఇది, “నా సమయమింకను రాలేదు.” “యోహా 2:4. పర్ణశాలల పండుగకు వెళ్లాల్సిందిగా తన సహోదరులు కోరినప్పుడు ఆయన ఈ మాటలతోనే సమాధానమిచ్చాడు. కాగా దేవుని మహా సంకల్పంలో మానవుల పాపాల నిమిత్తం తన్ను తాను అర్పించుకోడానికి ఒక సమయం ఏర్పాటయ్యింది. ఆ సమయం త్వరలోనే రానుంది. ఆయన ఆ కార్యాచరణకు వెనకాడడు, తడబడడు. ఆయన అడుగులు యెరుషలేము దిశగా పడున్నాయి. అక్కడ తన విరోధులు ఆయన ప్రాణం తియ్యడానికి ఎంతో కాలం నుంచి కుట్రలు పన్నుతున్నారు. ఇప్పుడు ఆయన తన ప్రాణాన్ని అర్పిస్తాడు. హింసకు, తృణీకారానికి, నిరాకరణకు, ఖండనకు, మరణానికి ఆయన తన మనసు స్థిరపర్చుకున్నాడు.DATel 542.3

  ఆయన “తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి.” కాని ఆయన యెరుషలేము వెళ్తున్నందున వారు ఆయన్ని చేర్చుకోలేదు. తాము తీవ్రంగా ద్వేషిస్తోన్న యూదుల పక్క ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా దీనికి వారు భాష్యం చెప్పారు. దేవాలయాన్ని పునరుద్ధరించడానికో గిరిజీము కొండపై ఆరాధన జరపడానికో వచ్చి ఉంటే వారు ఆయన్ని సంతోషంగా చేర్చుకునేవారు. కాని ఆయన యెరుషలేముకి వెళ్తున్నాడు. కనుక వారు ఆయనకు ఆతిథ్యమివ్వలేదు. తాము దేవుడివ్వగల ఉత్తమ ఈవిని తోసి పుచ్చుతున్నారని గ్రహించలేదు. తనను చేర్చుకోమంటూ ఆయన ఆ మనుషులికి సూచించాడు. వారికి సమీపంగా ఉండడానికి, వారికి దీవెనలు ఇవ్వడానికి వారి నుంచి సహాయం అర్థించాడు. తన పట్ల ప్రదర్శించిన ప్రతీ అభిమానానికి అంతకన్నా విలువైన కృపాదీవెనను ఆయన కుమ్మరించాడు. కాగా ఈ సమరయులు తమ దురభిమానం మత మౌఢ్యం వల్ల అంతా పోగొట్టుకున్నారు.DATel 543.1

  క్రీస్తు దూతలైన యాకోబు యోహానులికి తమ ప్రభువు పట్ల సమరయులు వ్యవహరించిన తీరుకు ఎంతో కోపం వచ్చింది. తన సందర్శన వల్ల తమను గౌరవించనుద్దేశించిన ప్రభువు విషయంలో వారు అమర్యాదగా వ్యవహరించడం వారిలో క్రోధం పుట్టించింది. ఇటీవలే వారు రూపాంతర పర్వతం మీద ప్రభువుతో ఉన్నారు. దేవుని మహిమ ఆయన్ని నింపడం చూశారు. మోషే ఏలియాలు ఆయన్ని ఘనపర్చడం చూశారు. సమరయులు ప్రదర్శించిన ఈ ‘దురహంకారాన్ని తగిన రీతిగా శిక్షించకుండా విడిచి పెట్టకూడదని భావించారు.DATel 543.2

  వారు క్రీస్తు వద్దకు వచ్చి సమరయులన్న మాటలు ఆయనతో చెప్పారు. తాను ఒక రాత్రి కూడా బస చెయ్యడానికి నిరాకరించారని తెలిపారు. వారు ప్రభువు పట్ల ఘోర తప్పిదం చేశారని భావించారు. ఏలీయా ప్రవక్త అబద్ద ప్రవక్తల్ని సంహరించిన కర్మలు పర్వతం కొంచెం దూరంలో ఉండడం చూసి వారిలా అన్నారు, “ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి వీరిని నాశనం చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా?” తమ మాటలకు యేసు బాధపడడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆయన పలికిన ఈ మందలింపు విన్నప్పుడు వారు మరింత ఆశ్చర్యపడ్డారు. “మీరు ఎట్టి ఆత్మగలవారో మీరెరుగరు. మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు.” అంతట ఆయన వేరొక గ్రామానికి వెళ్లాడు.DATel 544.1

  మనుషులు తనను స్వీకరించాలని వత్తిడి చెయ్యడం క్రీస్తు పరిచర్యలో భాగం కాదు. మనస్సాక్షిని వత్తిడి చెయ్యడానికి చూసేవారు, సాతాను అతడి స్వభావంతో నిండిన అతడి అనుచరగణంలోనివారు. దుష్టదూతలతో చెయ్యి కలిపే మనుషులు నీతి నిమిత్తం ఉద్రేకం చూపుతున్నామన్న సాకుతో సాటి మనుషుల్ని తమ మతాభిప్రాయాలకు మార్చడానికి వారిని శ్రమలకు బాధలకు గురిచేస్తారు. అయితే క్రీస్తు నిత్యం కృప చూపిస్తున్నాడు. తన ప్రేమను ప్రదర్శించడం ద్వారా ప్రజల్ని ఆకర్షించడానికి నిత్యం ప్రయత్నిస్తున్నాడు. హృదయంలో ప్రత్యర్ధిని అసహ్యించుకోడు. అరకొర సేవను అంగీకరించడు. ఆయన కొరేది స్వచ్ఛంద సేవ. ప్రేమ ఒత్తిడి వల్ల ఇష్టపూర్వకమైన హృదయసమర్పణ. మన పనిని అభినందించని వారిని లేదా మన అభిప్రాయాలకి విరుద్ధంగా వ్యవహరించే వారిని నాశనం చేయడానికి ప్రయత్నించడం మనం సాతాను స్వభావం కలిగి ఉన్నా మనడానికి తిరుగులేని సిదర్శనం.DATel 544.2

  శారీరకంగా, ఆత్మపరంగా, స్వభావ పరంగా ప్రతీ మానవుడు దేవుని సొత్తు. అందరినీ రక్షించడానికి క్రీస్తు మరణించాడు. రక్షకుడు తన రక్తంతో కొన్నవారిని మత మౌడ్యం ద్వారా శ్రమలు హింసకు గురి చెయ్యడాన్ని దేవుడు అసహ్యించుకుంటాడు. “ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను.” మార్కు 10:1.DATel 545.1

  క్రీస్తు పరిచర్య చివరి మాసాల్లో చాలా మట్టుకు యూదయ నుంచి యోర్ధానుకి అవతల పక్క ఉన్న పెరియ రాష్ట్రంలో జరిగింది. గలిలయలో తన ప్రారంభ పరిచర్యలోలాగే ఇక్కడ ఆయన ఎక్కడకు వెళ్లినా జన సమూహాలు ఆయన చుట్టూ మూగేవి. క్రితంలో ఆయన బోధించిన బోధనల్నే చాలా మట్టుకు తిరిగి బోధించాడు.DATel 545.2

  ఆయన పన్నెండు మంది శిష్యుల్ని ఎలా పంపించాడో అలాగే “డెబ్బయి మంది ఇతరులను నియమించి, తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను.” లూకా 10:1. ఈ శిష్యులు తమ పరిచర్యకు శిక్షణ పొందుతూ కొంతకాలం ఆయనతో ఉన్నారు. ఈ శిష్యులు తమ తొలి ప్రత్యేక సేవ మిద వెళ్ళినప్పుడు ఇతర శిష్యులు యేసు వెంట వెళ్ళి గలిలయ గుండా ప్రయాణం చేశారు. ఈ రకంగా వారికి ఆయనతో సన్నిహితంగా మెలగే తరుణం కలిగింది. ఇప్పుడు ఈ ఎక్కువ మంది శిష్యులు కూడా ప్రత్యేక సేవ మిద వెళ్లాల్సి ఉన్నారు.DATel 545.3

  ఈ డెబ్బయి మంది శిష్యులికి ఇచ్చిన సూచనలు పన్నెండు మంది శిష్యులకిచ్చిన సూచనలు ఒకేలాంటివి. కాని గలిలయులికి గాని సమరయులికి గాని చెందిన ఏపట్టణంలోకి ప్రవేశించవద్దని పన్నెండు మంది శిష్యులికి విధించిన నిషేధాన్ని ఈ డెబ్బయి మందికి విధించలేదు. సమరయులు క్రీస్తుని విసర్జించినా వారిపట్ల ఆయన ప్రేమలో మార్పులేదు. డెబ్బయి మంది శిష్యులు ఆయన పేరిట వెళ్లినప్పుడు వారు మొట్టమొదట సమరయ పట్టణాల్లోకే వెళ్లారు.DATel 545.4

  రక్షకుని సమరయ సందర్శన, మంచి సమరయుడికి ప్రశంస, స్వస్తత పొందిన పది మంది కుష్టు రోగుల్లోనూ యేసుకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగివచ్చిన సమరయుడైన కుష్టురోగి ఆనందం శిష్యులికి ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఆ పాఠం వారి హృదయాల్లో నాటుకుపోయింది. తన ఆరోహణానికి ముందు యేసు తన శిష్యులకిచ్చిన ఆదేశంలో వారు మొదటగా సువార్త ప్రకటించాల్సి ఉన్న పట్టణాల్లో యెరుషలేము, యూదయలతో పాటు సమరయను పేర్కొన్నాడు. ఈ ఆదేశాన్ని నెరవేర్చడానికి ఆయన బోధన వారిని సిద్ధం చేసింది. వారు తమ ప్రభువు నామంలో సమరయకు వెళ్లినప్పుడు తమను చేర్చుకోడానికి ఆ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు కనుగొన్నారు. తమ ప్రజలకు ఆయన చేసిన ఉపకారాల్ని గురించి విన్నారు. ఆయన పట్ల తాము అనాగరికంగా ప్రవర్తించినప్పటికీ తమ పట్ల ఆయనకు ప్రేమ తప్ప ద్వేషం లేదని గుర్తించారు. తమ హృదయాల్ని ఆయనకు సమర్పించారు. ఆయన ఆరోహణం తర్వాత ఆయన దూతల్ని స్వాగతించారు. ఒకప్పుడు తమ బద్ద విరోధులైన వారిలో నుంచి ఎంతో మందిని శిష్యులు క్రైస్తవుల్ని చేశారు.DATel 545.5

  “నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనుపనార వత్తిని అర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయము కనుపరచును.” “ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు.” యెష 42:3; మత్త 12:21DATel 546.1

  తమను స్వాగతించని తావులో ఉండకూడదని పన్నెండు మందిని ఆదేశించిన రీతిగానే డెబ్బయి మందినీ యేసు ఆదేశించాడు. ఆయన ఇలా అన్నాడు. “మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనకపోయిన యెడల మీరు దాని వీధులలోనికి పోయి - మా పాదములకు అంటిన ఈ పట్టణపు ధూళిని కూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించి యున్నదని తెలిసికొనుడని చెప్పుడి.” వారు ఈ పని ద్వేషంతో గాని పరువు పోయిందన్న అక్కసుతో గాని కాక ప్రభువు వర్తమానాన్ని లేదా ఆయన దూతల్ని నిరాకరించడం ఎంత తీవ్రమైన సంగతో వ్యక్తం చెయ్యడానికి చెయ్యాల్సి ఉన్నారు.DATel 546.2

  “ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను” అని యేసన్నాడు. అనంతరం ఆయన మనసు తాను ఎంతోకాలం పరిచర్య చేసిన గలిలయ పట్టణాల మీద నిలచింది. దుఃఖంతో నిండిన స్వరంతో ఆయన ఇలా అన్నాడు, “అయ్యో కొరాజీనా, అయ్యో బేతృయిదా, మా మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు. అయినను విమర్శ కాలమునందు నా గతికంటే తూరుసీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై యుండును. ఓ కపెర్నహోమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళము వరకు దిగిపోయెదవు.”DATel 546.3

  గలిలయ సముద్రం చుట్టూ ఉన్న పట్టణాల పై కుమ్మరించేందుకు దేవుని దీవెనలు సమృద్ధిగా ఉన్నాయి. రక్షకుడు అనుదినం వారి మధ్య సంచరించాడు. ప్రవక్తలు, రాజులు వీక్షించడానికి ఉవ్విళ్లూరిన దైవ మహిమ రక్షకుని చుట్టూ మూగిన జన సమూహాలపై ప్రకాశించింది. అయినా వారు పరలోక వరాన్ని నిరాకరించారు.DATel 547.1

  గొప్ప వివేకం ప్రదర్శించుకుంటూ రబ్బీలు ఈ కొత్త బోధకుడు బోధించే సిద్ధాంతాల్ని అంగీకరించ వద్దని ప్రజల్ని హెచ్చరించారు. ఆయన సిద్ధాంతాలు ఆచారాలు పితరుల బోధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. దైవ వాక్యాన్ని స్వయంగా చదివి గ్రహించే బదులు ప్రజలు యాజకులు పరిసయ్యుల మాటల్ని నమ్మారు. దేవుణ్ని ఘనపర్చే బదులు వారు యాజకుల్ని అధికారుల్ని ఘనపర్చి తమ సంప్రదాయాల్ని కొనసాగించేందుకు గాను సత్యాన్ని తోసిపుచ్చారు. అనేకులు సత్యాన్ని గుర్తించారు. అంగీకరించడానికి దాదాపు తీర్మానించుకున్నారు. కాని వారు తమ తీర్మానాన్ని ఆచరణలో పెట్టలేదు. క్రీస్తుని ఎంపిక చేసుకోలేదు. వెలుగు చీకటిగా కనిపించే వరకు సాతాను తన శోధనల్ని ప్రయోగిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా అనేకులు తమ ఆత్మను రక్షించే సత్యాన్ని తోసిపుచ్చారు.DATel 547.2

  సత్యసాక్షి ఇలా అంటున్నాడు, “ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను.” ప్రక 3:20. దైవవాక్యంలోని లేదా ఆయన దూతల ద్వారా వచ్చే వర్తమానంలోని ప్రతీ హెచ్చరిక, మందలింపు, విజ్ఞప్తి హృదయ ద్వారం తెరవడానికి వస్తున్న పిలుపు. హృదయంలోకి ప్రవేశమివ్వమని విజ్ఞప్తి చేస్తోన్న యేసు స్వరం. ఆయన హృదయ ద్వారం తట్టగా లెక్కచెయ్యని ప్రతీసారి అనుకూలంగా స్పందించే స్వభావం బలహీనమౌతుంది. పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ఈ రోజు లక్ష్యపెట్టకపోతే అది రేపు ఇంత బలంగా ఉండదు. మనసు స్వీకరణ శక్తి క్షీణిస్తుంది. జీవితం కొద్దిపాటిదని ఈ జీవితం అనంతరం నిత్యత్వం ఉందని ఎరుగని ప్రమాద స్థితిలోకి జారుకుంటుంది. అపరాధంలో ఉన్నందుకుగాక, సత్యం తెలుసుకోడానికి దేవుడు పంపిన అవకాశాల్ని అలక్ష్యం చేసినందుకు మనకు తీర్పు దినాన శిక్షపడుతుంది.DATel 547.3

  అపొస్తలులాగే ఈ డెబ్బయిమంది కూడా తమ పరిచర్య ముద్రగా మానవాతీత శక్తితో కూడిన వరాలు పొందారు. తమ కర్తవ్యం పూర్తి అయ్యాక వారు “ప్రభువా, దయ్యములు కూడ నీ నామము వలన మాకు లోబడుచున్నవి” అంటూ సంతోషానందాలతో తిరిగి వచ్చారు. వారికి యేసు ఇలా సమాధానం ఇచ్చాడు, “సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని.”DATel 548.1

  గతాన్ని భవిష్యత్తుని గూర్చిన దృశ్యాలు యేసు మనసులో నిలిచాయి. లూసీఫర్ తొలుత పరలోకం నుంచి కిందికి తోసి వేయబడడం చూశాడు. లోకాలన్నిటి ముందు ఆ పరమ వంచకుడి ప్రవర్తన బట్టబయలైనప్పుడు ఆయన తన సొంత ఆవేదన దృశ్యాలికి ఎదురుచూశాడు. నశించిన మానవజాతి విముక్తి పూర్తి అయ్యిందని, సాతాను పురికొలిపే ఆరోపణలు, మోసాలు, నటనలకు తావులేని విధంగా పరలోకం నిరంతరంగా భద్రపర్చబడిందని ప్రకటిస్తూ “సమాప్తమైనది” (యోహా 19:30) అన్న కేక విన్నాడు.DATel 548.2

  బాధ అవమానాలతో కూడిన కల్వరి సిలువను అధిగమించి యేసు ఆ మహా చివరి దినం కోసం ఎదురుచూశాడు. ఆ దినాన చీకటి శక్తుల అధినేత తన తిరుగుబాటు వలన దీర్ఘకాలంగా వికలమై ఉన్న భూమండలంతో పాటు దగ్ధమైపోతాడు. దుష్టత సమూలంగా నాశనమై దేవుని సమాధానంతో భూలోక పరలోకాలు నిండడం యేసు వీక్షించాడు.DATel 548.3

  క్రీస్తు అనుచరులు ఇకనుంచి సాతానుని ఓడిపోయిన శత్రువుగా పరిగణించాల్సి ఉన్నారు. వారి నిమిత్తం యేసు సిలువమిద విజయం సాధించనున్నాడు. ఆ విజయాన్ని వారు తమ విజయంగా పరిగణించాలని కోరాడు. ఆయన ఇలా అన్నాడు, “ఇదిగో పాములను తేళ్ళను తొక్కుటకును శత్రువు బలమంతటి మిదను మీకు అధికారమను గ్రహించియున్నాను. ఏదియు మీకెంతమాత్రమును హానిచేయదు.”DATel 548.4

  పశ్చాత్తాపపడే ప్రతీ ఆత్మకు పరిశుద్ధాత్మ సర్వశక్తి అండగా ఉంటుంది. పశ్చాత్తాపంతోను విశ్వాసంతోను ఆయన సంరక్షణను కోరే ఏ ఒక్క వ్యక్తి కూడ శత్రువు ప్రాబల్యానికి లోనవ్వడానికి క్రీస్తు సమ్మతించడు. శోధనలు శ్రమలు అనుభవిస్తోన్న తనవారి పక్కనే రక్షకుడు ఉంటాడు. ఆయనకు ఆపజయం , నష్టం, అసాధ్యం లేక ఓటమి అన్నవి లేవు. మనకు బలం ఇచ్చే ఆ ప్రభువు ద్వారా మనం సమస్తం సాధించగలం. శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు సర్దుబాటవ్వడానికి వేచి ఉండక యేసు వంక చూడండి. మీకు ఆయనే సహాయమందిస్తాడు.DATel 549.1

  సాతానుకున్న శక్తిని గురించి అతిగా మాట్లాడే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వారు తమ శత్రువు గురించి ఆలోచిస్తారు. ప్రార్ధిస్తారు, మాట్లాడారు. వారి ఊహాల్లో అతడు ప్రధానుడుగా ఇంతలంతలవుతూ ఉంటాడు. సాతాను శక్తిమంతుడన్నది వాస్తవమే. కాని ఆ దుష్టుణ్ని పరలోకం నుంచి కిందకి పడవేసిన మహాశక్తి గల రక్షకుడి నిమిత్తం దేవునికి కృతజ్ఞులం. మనం తన శక్తిని ప్రశంసించినప్పుడు సాతాను సంతోషిస్తాడు. మనం యేసు శక్తిని గురించి మాట్లాడడం మంచిది. ఆయన శక్తిని ఆయన నామాన్ని ప్రశంసించడం మంచిది.DATel 549.2

  పరలోకంలో దేవుని సింహాసనం చుట్టూ ప్రకాశిస్తూ ఉన్న వాగ్దాన సూచక ధనస్సు “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ఆద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనననుగ్రహించెను” (యోహాను 3:16) అన్న వాస్తవానికి నిత్యసాక్ష్యం. దుష్టత్వంతో తనవారు సలుపుతున్న పోరులో దేవుడు వారిని ఎన్నడు విడువడని అది విశ్వాసికి సాక్ష్యమిస్తుంది. ఆ సింహాసనం ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనకు శక్తి సంరక్షణ ఉంటాయని భరోసా ఇస్తుంది.DATel 549.3

  “అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి” అని యేసన్నాడు. శక్తి ఉన్నది మాకు అని సంతోషించకండి. దానిలో దేవుని పై ఆధారపడాల్సిన పనిలేదని తలంచే ప్రమాదముంది. ఆత్మసమృద్ధి దరికిరాకుండా, మీ ప్రభువు ఆత్మ మిద శక్తి మీద ఆధారపడి పని చెయ్యకుండేందుకు జాగ్రత్త పడండి. మీ పనిలో ఏ మాత్రం విజయం కలిగినా దాన్ని సొంతం చేసుకోడానికి స్వార్ధం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. స్వార్థం ఉప్పొంగుతుంది, ఘనత కావాలంటుంది. దేవుడే సమస్తం ఆయనే ప్రాముఖ్యం అన్న భావన ఇతరుల మనసుల్లో పుట్టించదు. అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.” 2 కొరి 12:10. మనం బలహీనులమన్న గుర్తింపు మనకు కలిగినప్పుడు మనలో లేని శక్తి మీద ఆధారపడడం నేర్చుకుంటాం. దేవుని పట్ల మన బాధ్యత తాలూకు స్పృహ మన హృదయంపై శక్తిమంతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇంత ప్రభావం కలది మరొకటి లేదు. ప్రవర్తన అగాధంలోని ఉద్దేశాల్ని క్షమాపణతో నిండిన క్రీస్తు ప్రేమా స్పృహ చేరగలిగినంత పూర్తిగా మరేదీ చేరలేదు. మనం దేవునికి దగ్గరవ్వాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనకు శక్తినిస్తాడు. అప్పుడు క్రీస్తు ద్వారా దేవునితోను పరలోక కుటుంబ సభ్యులతోను మీకు సంబంధం ఏర్పడినందుకు ఆనందించండి. మీరు నాకన్నా పైగా చూసినప్పుడు మానవులు బలహీనులు అన్న స్పృహ నిత్యం ఉంటుంది. మీరు మిమ్మల్ని గురించి ఎంత తక్కువగా తలస్తే మీ రక్షకుని ఔన్నత్యాన్ని అంత స్పష్టంగా, అంత సంపూర్తిగా గ్రహించగలుగుతారు. వెలుగుకి శక్తికి మూలంతో మీరు ఎంత దగ్గరగా అనుసంధానపడితే అంత ఎక్కువ వెలుగు మీపై ప్రకాశిస్తుంది. దేవుని సేవ చెయ్యడానికి అంత ఎక్కువ శక్తి నాకు లభిస్తుంది. వారు దేవునితోను, క్రీస్తుతోను పరలోక కుటుంబమంతటితోను మమేకమై ఉన్నందుకు ఆనందించండి..DATel 550.1

  ఆ డెబ్బయిమంది క్రీస్తు మాటలు వింటున్నప్పుడు పరిశుద్దాత్మ వారి మనసుల్ని వాస్తవాలతో నింపి వారి హృదయాలపై సత్యాన్ని రాశాడు. వారి చుట్టూ జనసమూహాలు ఉన్నా తాము దేవుని ఏకాంత స్థలంలో ఉన్నట్లే అనిపించింది.DATel 550.2

  ఆ పరిశుద్ధ స్పూర్తిని వారు పొందారని గ్రహించి యేసు “బహుగా ఆనందించి తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పనిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడియున్నది. కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రియెవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలు పరచ నుద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను.”DATel 551.1

  లోక ప్రసిద్ధి గాంచిన వారు, గొప్ప వారు ప్రతిభావంతులుగా చెలామణి అవుతున్న వారు తమ వివేకమంతటితోను యేసు ప్రవర్తనను అవగాహన చేసుకోలేకపోయారు. మానవుడుగా ఆయనకు వాటిల్లిన అవమానాన్ని బాహ్యకారాన్ని బట్టి ఆయన పై తీర్పు వెలిబుచ్చారు. అయితే జాలరులికి సుంకరులికి కంటికి కనిపించని ఆ ప్రభువుని వీక్షించే ఆధిక్యత లభించింది. తమకు బయలుపర్చాలని యేసు ఆశించిన విషయాలన్నిటినీ శిష్యులు సైతం గ్రహించలేకపోయారు. కాని వారు పరిశుద్ధాత్మ ప్రభావానికి తమ్మును తాము సమర్పించుకున్నప్పుడు వారి మనసులు ఉత్తేజం పొందాయి. మానవరూపం ధరించిన మహాశక్తి గల దేవుడు తమ మధ్య ఉన్నాడని వారు గుర్తించారు. ఈ జ్ఞానం జ్ఞానులికి ప్రాజ్ఞులికి లేక పోయినా ఈ సాదాసీదా మనుషులికి అది బయలుపర్చబడినందుకు యేసు సంతోషించాడు. ఆయన తరచు పాత నిబంధన లేఖనాల్ని వారికి బోధించి అవి తన ప్రాయశ్చితార్థ పరిచర్యకు ఎలా వర్తిస్తాయో విశదీకరించినప్పుడు పరిశుద్దాత్మ వారిని చైతన్యపర్చి వారిని పరలోక వాతావరణంతో నింపేవాడు. ప్రవక్తలు ప్రకటించిన ఆధ్యాత్మిక సత్యాల్ని వారు, వాటిని రచించిన రచయితల కన్నా స్పష్టంగా అవగాహన చేసుకున్నారు. ఇక నుంచి పాత నిబంధన లేఖనాల్ని శాస్త్రులు పరిసయ్యుల సిద్ధాంతాలు గాను, మరణించిన జ్ఞానుల హక్కులుగాను గాక దేవుని వలన కలిగిన నూతన ప్రత్యక్షతగా వారు పరిగణించారు. “లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; వారు ఆయనను ఎరుగుదురు ఆయన నాతో కూడా నివసించును నాలో ఉండును.” ఆ ప్రభువును వారు చూశారు. యోహా 14:17.DATel 551.2

  మనం సత్యాన్ని మరింత సంపూర్ణంగా గ్రహించే ఏకైక మార్గం క్రీస్తు ఆత్మకు మన హృదయాన్ని లోపరచడమే. డంబాన్ని గర్వాన్ని తుడిచి ‘వేయడం ద్వారా ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఆత్మను బంధించి ఉంచిన సమస్తాన్ని తీసిపారేయాలి. హృదయ సింహాసనం పై క్రీస్తుని నిలుపుకోవాలి. ప్రాయశ్చిత్తాన్ని గ్రహించడానికి పరిమితులు గల మానవ విజ్ఞాన శాస్త్రం చాలదు. విమోచన ప్రణాళిక ఎంత దీర్ఘకాలికమైన దంటే దాన్ని తత్వజ్ఞానం సయితం విశదీకరించడంలేదు. అది హేతు విధానానికి అందని మర్మంగా మిగిలిపోతుంది. రక్షణ శాస్త్రాన్ని విశదీకరించడం సాధ్యంకాదు. ఏ వ్యక్తి తన పాప దుస్థితిని గుర్తించగలడో అతడు రక్షకుని విలువను గ్రహించగలుగుతాడు.DATel 552.1

  గలిలయనుంచి యెరుషలేముకు నెమ్మదిగా సాగిన తన ప్రయాణంలో క్రీస్తు విలువైన సంగతులు బోధించాడు. ప్రజలు ఆయన బోధల్ని ఆసక్తిగా విన్నారు. గలిలయలోని పెరియాలో ప్రజలు యూదియ ప్రజలంత యూదుమత మౌడ్యులు కారు. ఆయన బోధకు వారు అనుకూలంగా స్పందించారు.DATel 552.2

  తన పరిచర్యలోని ఈ చివరి మాసాల్లో క్రీస్తు అనేక ఉపమానాలు చెప్పాడు. యాజకులు రబ్బీలు తీవ్ర ద్వేషంతో ఆయన్ని వెంటాడారు. వారికి తన హెచ్చరికల్ని సంకేతాల రూపంలో వెలువరించాడు. ఆయన భావాన్ని వారు అపార్ధం చేసుకోడానికి తావులేదు. అయినా ఆయన మాటల ఆధారంగా ఆయనపై నేరారోపణ చెయ్యడానికి ఆస్కారం లేకపోయింది. పరిసయ్యుడు సుంకరి ఉపమానంలో “దేవా నేను తక్కిన మనుషుల్లాంటి వాణ్ని కొనందుకు నీకు కృతజ్ఞతలు” అన్న స్వార్ధపూరిత ప్రార్ధన “పాపినైన నన్ను కనికరించు” అన్న సుంకరి ర్ధనకు భిన్నంగా ఉంది. లూకా 17:11, 18, ఆర్.వి. క్రీస్తు యూదుల వేషధారణను ఈ రకంగా మందలించాడు. పండ్లులేని అంజూరపు చెట్టు, గొప్ప విందు సంకేతాల కింద పశ్చాత్తాపం లేని యూదుజాతికి మూడనున్న నాశనాన్ని ప్రవచించాడు. సువార్త విందుకు వచ్చిన ఆహ్వానాన్ని అవహేళనతో తిరస్కరించిన వారు ఆయన చేసిన ఈ హెచ్చరికను విన్నారు, “దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱపెట్టు కొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను.” లూకా 18:7, 8DATel 552.3

  తప్పిపోయిన గొర్రెను గూర్చిన ఉపమానాన్ని యేసు మళ్లీ చెప్పాడు. పోయిన వెండి నాణెం, తప్పిపోయిన కుమారుడు ఉపమానాలతో ఆ ఉపమాన పాఠాన్ని మరింత విస్తృత పర్చాడు. ఈ పాఠాల ప్రాముఖ్యాన్ని శిష్యులు అప్పుడు పూర్తిగా అభినందించలేకపోయారు. కాని పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనంతరం, అన్యజనులు సువార్తను అంగీకరించి విశ్వాసులవ్వడం, యూదులికి కన్నెర్ర కలగడం చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడి ఉపమానాన్ని వారు మరింత స్పష్టంగా అవగతం చేసుకున్నారు. “ఈనా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను; తప్పిపోయి దొరికెను.” “మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే” అన్నమాటల్లో వ్యక్తమైన క్రీస్తు ఆనందాన్ని పంచుకోగలిగారు. లూకా 15:32, 24. నింద, పేదరికం, హింస భరిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు, ఈ చివరి ప్రయాణంలో ఆయన పలికిన ఈ మాటల్ని తరచుగా గుర్తుచేసుకుంటూ వారు తమ మనసుల్ని పటిష్ఠపర్చుకున్నారు. “చిన్నమందా భయపడకుడి. నాకు రాజ్యము అనుగ్రహించుటకు మా తండ్రికి ఇష్టమైయున్నది. నాకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడకు దొంగ రాడు; చిమ్మెటకొట్టదు. మీ ధనమెక్కడ ఉండునో అక్కడ నా హృదయము ఉండును.” లూకా 12:32-34.DATel 553.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents