Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    35—“నిశ్శబ్దమైయుండుము”

    యేసు జీవితంలో అది చరిత్రాత్మక దినం. గలిలయ సముద్రం పక్కన మొదటి ఉపమానాల్ని పలికాడు. తన రాజ్యం స్వరూప స్వభావాల్ని గురించి అది స్థాపితం కానున్న తీరును గురించి సుపరిచితమైన సాదృశ్యాలతో ప్రజలికి మళ్లీ వివరించాడు. తన పనిని విత్తువాడి పనితో సరిపోల్చాడు. తన రాజ్యం పెరుగుదలని ఆవగింజ పెరుగుదలతోను పిండిలో ఉంచిన పులిపిండి చర్యతోను పోల్చాడు. నీతిమంతులు దుర్మార్గుల మధ్య జరుగనున్న తుది వేర్పాటును గోధుమలు గురుగుల ఉపమానంలోను చేపల వల సత్యాల ప్రాధాన్యాన్ని దాచబడ్డ ధనం ఉపమానంతోను గొప్ప విలువగల ముత్యం ఉపమానంతోను ఉదాహరించి తన శిష్యులికి బోధించాడు. గృహయజమాని ఉపమానంలో తన ప్రతినిధులుగా తాము ఎలా పని చేయ్యాలో శిష్యులికి నేర్పించాడు.DATel 360.1

    ఆయన దినమంతా బోధిస్తూ స్వస్తపర్చుతూ ఉన్నాడు. సాయంత్రం అయినా జనులు ఆయన వద్దకు వస్తూనే ఉన్నారు. ఇలా ప్రతీ దినం వారికి పరిచర్య చేశాడు. భోజనానికి గాని విశ్రాంతి తీసుకోడానికి గాని ఆయన తన పరిచర్యను ఆపేవాడు కాదు. పరిసయ్యుల విమర్శలు దుష్ప్రచారం మధ్య వారు ఆయన్ని నిత్యం వెంబడించడం ఆయన పరిచర్యను కష్టతరం చేసింది. ఇప్పుడు సాయంత్రమయ్యే సరికి ఆయన పూర్తిగా అలసిపోయి సముద్రం అద్ద రిని ఏకాంత స్థలంలో విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు.DATel 360.2

    గెన్నేసంతు తూర్పు తీరం జనావాసం లేనిది కాదు. సముద్రం పక్క అక్కడక్కడా పట్టణాలున్నాయి. అయినా పశ్చిమతీరంతో పోల్చితే అది జనులు అంతగాలేని ప్రాంతం. అక్కడి ప్రజల్లో యూదులకన్నా అన్యజనులే ఎక్కువ. వారికి గలిలయతో సంబంధాలు తక్కువ. ఈ రకంగా యేసు ఏకాంతంగా ఉండడానికి ఈ ప్రదేశం అనువుగా ఉంది. శిష్యుల్ని తనతో అక్కడికి రావలసిందిగా ప్రభువు ఆదేశించాడు.DATel 361.1

    ఆయన జనసమూహాల్ని పంపివేసిన తర్వాత వారు “ఆయనను ఉన్నపాటున” దోనెలో ఎక్కించి హడావిడిగా బయలుదేరారు. అయితే వారు ఒంటరిగా వెళ్లిపోడానికి లేదు. తీరానికి సమీపంలో చేపలుపట్టే ఇతర పడవలున్నాయి. ఇవి ప్రజలతో నిండిపోయాయి. వారు యేసును ఇంకా చూడడానికి ఆయన మాటలు ఇంకా వినడానికి ఆశగా ఉండి ఆయన్ని వెంబడించారు.DATel 361.2

    తుదకు ప్రజల ఒత్తిడినుంచి రక్షకునికి విముక్తి కలిగింది. అలసిపోయిన, ఆకలిగొని ఉన్న ఆయన ఓడలో ఓమూల పడుకున్నాడు. కాసేపటి లో గాఢనిద్రలో మునిగిపోయాడు. అది సాయంత్రం, వాతావరణం ప్రశాంతంగా హాయిగా ఉంది. సముద్రం కూడా ప్రశాంతంగా ఉంది. హఠాత్తుగా ఆకాశం మేఘావృతమయ్యింది. తూర్పు తీరం వెంట ఉన్న పర్వతాల సందుల్లోనుంచి బలమైన గాలులు వీచాయి. సముద్రంపై పెనుతుపాను రేగింది.DATel 361.3

    సూర్యుడు అస్తమించాడు. తుపానుకల్లోలిత సముద్రం పై గాఢాంధకారం అలముకొంది. గాలులు వీస్తుండడంతో అలలు ఉవ్వెత్తున లేచి పడ్తోన్నాయి. అలలు శిష్యుల నౌకను బలంగా తాకుతుండడంతో అది మునిగిపోతుందేమోనన్న భయం కలిగింది. దృఢమైన దేహాలు గల ఆ మత్స్యకారులు ఆ సముద్రంపైనే తమ యావజ్జీవితం గడిపిన వ్యక్తులు. ఎన్నో తుపానుల్లో తమనావల్ని సురక్షితంగా నడిపిన దిట్టలు. అయితే ఇప్పుడు వారి బలంగాని నైపుణ్యంగాని అక్కరకు రావడంలేదు. ఆ భయంకర తుపానులో వారు నిస్సహాయులు. నౌకలోకి నీళ్లు రావడం చూశారు. తాము బతికి బట్టకడతామన్న ఆశ అడుగంటింది.DATel 361.4

    తమ్మును తాము రక్షించుకునే ప్రయత్నంలో తలమునకలై యేసు ఓడలో ఉన్నాడన్న సంగతి మరిచిపోయారు. తమ ప్రయత్నాలు వ్యర్ధమని తమకు మరణం తప్పదని గుర్తించి తమను ఆ ప్రయాణానికి ఎవరు ఆదేశించారో ఆ ప్రభువును గుర్తు చేసుకున్నారు. యేసే వారి ఆశాజ్యోతి. తమ నిస్సహాయ, నిరాశాపూరిత స్థితిలో వారు “బోధకుడా!” అని అరిచారు. ఆ చీకటిలో ఆయన ముఖం వారికి కనిపించలేదు. వారి స్వరాలు తుపాను హోరులో వినిపించడంలేదు. ఆయన వద్ద నుంచి సమాధానం లేదు. సందేహం భయం వారిని ఆందోళన పరిచాయి. యేసు వారిని విడిచి పెట్టేశాడా? వ్యాధిని దయ్యాల్ని మరణాన్ని సయితం జయించిన ఆ ప్రభువు ఇప్పుడు తన శిష్యుల్ని కాపాడడానికి శక్తిలేనివాడా? ఆపదలో ఉన్న తమ పట్ల ఆయన ఉదాసీనంగా వ్యవహరిస్తోన్నాడా?DATel 361.5

    వారు మళ్లీ పిలిచారు. గాలి హోరు తప్ప వారికి సమాధానం రాలేదు. వారి ఓడ మునిగిపోతోంది. ఇంకా సేపట్లో వారు ఆ భీకర తరంగాలకు ఆహుతి అయిపోవడం ఖాయమనట్లు కనిపిస్తోంది.DATel 362.1

    అర్ధాంతరంగా ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక్క మెరుపు మెరిసింది. ప్రశాంతంగా నిద్రపోతున్న యేసును వారు చూశారు. “బోధకుడా, మేము నశించిపోవుచున్నాము; నీకు చింతలేదా?” అని ఆశ్చర్యపడుతూ ప్రశ్నించారు. తాము ప్రమాదస్థితిలో ఉండి మరణంతో పోరాడుండగా ఆయన అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోగలడు?DATel 362.2

    వారి అరుపులికి యేసు నిద్రలేచాడు. మెరుపు వెలుగులో కనిపించిన ఆయన ముఖంలో వారు పరలోక శాంతిని తిలకించారు. ఆచూపులో ఆయన తన్నుతాను మర్చిపోయే గుణాన్ని అతిసున్నితమైన ఆయన ప్రేమాహృదయాన్ని చూశారు. వారి హృదయాలు ఆయన తట్టు తిరిగి “ప్రభువా మమ్మల్ని రక్షించు, మేము నశించిపోతున్నాం” అని అరిచాయి.DATel 362.3

    ఓ ఆత్మ అలా మొర పెట్టడం, దానికి ప్రభువు స్పందించకపోవడం ఎన్నడూ జరగలేదు. తమ చివరి ప్రయత్నం చెయ్యడానికి శిష్యులు తమ పడవ తెడ్లు చేపడున్న తరుణంలో యేసు లేచాడు. శిష్యుల మధ్య నిలబడ్డాడు. తుపాను బీభత్సంగా చెలరేగుతోంది. కెరటాలు వారిని బలంగా తాకుతోన్నాయి. మెరుపులు ఆయన ముఖాన్ని స్పష్టంగా కనపర్చాయి. ఆయన తరచు కృపాకార్యల్లో ఉపయోగించిన తన హస్తాన్ని పైకెత్తి ఆ భీకరసముద్రాన్ని “నిశ్శబ్దమై యుండుము” అని ఆజ్ఞాపించాడు.DATel 362.4

    తుపాను ఆగిపోయింది. కెరటాలు తమ యధాస్థానానికి దిగిపోయాయి. మేఘాలు మాయమయ్యాయి. నక్షత్రాలు ప్రకాశిస్తోన్నాయి. ఓడ ప్రశాంత సముద్రం మీద ఆగి ఉంది. అప్పుడు శిష్యుల వంక చూస్తూ విచారంతో యేసు “మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా?” అన్నాడు. మార్కు 4:40.DATel 363.1

    శిష్యులు మౌనంగా ఉండిపోయారు. పేతురు సయితం తన హృదయాన్ని నింపిన సంభ్రమాశ్యర్యాల్ని వెలిబుచ్చడానికి ప్రయత్నించలేదు. యేసు వెంబడి రావడానికి బయలుదేరిన పడవలికి కూడా శిష్యుల పడవకి కలిగిన ఆపదే కలిగింది. పడవలో ఉన్నవారు భయభ్రాంతులయ్యారు. అయితే క్రీస్తు ఆజ్ఞమేరకు ఆ సంక్షోభంపోయి శాంతి నెలకొన్నది. తుపాను ఉదృతి వల్ల పడవలు దగ్గరదగ్గరగా ఉన్నాయి. వాటిలో ఉన్నవారందరూ జరిగిన అద్భుతకార్యాన్ని వీక్షించారు. అనంతరం ఏర్పడ్డ ప్రశాంత వాతావరణంలో భయం మాయమయ్యింది. ప్రజలు “ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి.” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.DATel 363.2

    . తుపానుని ఎదుర్కోడానికి యేసు మేల్కోన్నప్పుడు ఆయన తొణకకుండా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన మాటలోగాని చూపులోగాని భయం కనిపించలేదు. ఎందుచేతనంటే ఆయన హృదయంలో ఎలాంటి భయంలేదు. తనకు సర్వోన్నత శక్తి ఉన్నందుకు కాదు ఆ ప్రశాంతత. ఆయన “భూమికి, సముద్రానికి, ఆకాశానికి” ప్రభువైనందుకూ కాదు. ఆ అధికారాన్ని ఆయన పక్కన పెట్టాడు. ” నా అంతట నేనే ఏమియు చేయలేను” (యోహను 5:30) అంటున్నాడు ఆయన. తండ్రి శక్తి పై ఆయన విశ్వాసముంచాడు. ఆ ప్రశాంతత ఆయన విశ్వాసం మూలంగా కలిగింది. అది దేవుని ప్రేమపై ఆయన సంరక్షణ పై ఉన్న విశ్వాసం. తుపానును సద్దణచిన శక్తి దేవుని శక్తి.DATel 363.3

    తండ్రి సంరక్షణ పై విశ్వాసంతో యేసు ప్రశాంతంగా ఉన్నాడు. అలాగే మనం కూడా మన రక్షకుని సంరక్షణలో నిశ్చలంగా ఉండాలి. శిష్యులు ఆయన్ని విశ్వసించి ఉంటే వారికి ప్రశాంతత దక్కేది. ప్రమాద సమయంలో వారు ప్రదర్శించిన భయం వారి అవిశ్వాసాన్ని వెల్లడి చేసింది. తమ్మును తాము కాపాడుకునే ప్రయత్నంలో వారు యేసుని మరచిపోయారు. నిరాశతో ఆత్మ రక్షణ ప్రయత్నంలో ఉన్నప్పుడు తమకు సహాయం చేయ్యగలడని గుర్తించి ఆయన వద్దకు వెళ్లారు.DATel 363.4

    శిష్యుల్లాగే మనం కూడా ఎంత తరచుగా వ్యవహరిస్తుంటాం! శోధన తుపాను రేగినప్పుడు, భయంకరమైన మెరుపులు వచ్చినప్పుడు కెరటాలు మన మీదికి లేచినప్పుడు మనం తుపానుతో ఒంటరిగా పోరాడాం . మనకు సాయమందించగల ప్రభువున్నాడని మరిచిపోతాం. మన నిరీక్షణ మాయమై ఇక నాశనం తప్పదనుకునే వరకు మన సొంత శక్తిని నమ్ముకుంటాం. అప్పుడు యేసును గుర్తు చేసుకుంటాం. మమ్మల్ని రక్షించమంటూ ఆయన్ని వేడుకుంటే ఆత్మవిశ్వాసాన్ని మందలించినప్పటికి మనకు అవసరమైన ఆసరా ఆయన ఇస్తాడు. అందులో సందేహం లేదు. భూమి మీదే గాని సముద్రం మీదే గాని రక్షకుడు మన హృదయంలో ఉంటే భయపడాల్సిన అవసరం ఉండదు. విమోచకునిపై సజీవ విశ్వాసం జీవిత సముద్రాన్ని శాంత పరిచి మనల్ని అపాయం నుంచి రక్షిస్తుంది. ఆ మార్గామేంటో ఆ ప్రభువుకే బాగా తెలుసు.DATel 364.1

    తుపాన్ని సద్దణచిన అద్భుతకార్యంలో మరో ఆధ్యాత్మిక పాఠం ఉంది. ప్రతీ వారి అనుభవం ఈ లేఖన సత్యాన్ని ధ్రువపర్చుతుంది, ” భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మళింపనేరదు... దుష్టులకు నెమ్మది యుండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు.” యెషయా 57:20,21 పాపం మన సమాధానాన్ని నాశనం చేస్తోంది. స్వార్థాన్ని అణచివేయకపోతే మనకు విశ్రాంతి దొరకదు. బలీయమై హృదయ వాంఛల్ని ఏ మానవ శక్తి అదుపులో ఉంచలేదు. తుపాను వలన కల్లోలితమైన సముద్రాన్ని శాంతింపజెయ్యడానికి శిష్యులు ఎలా శక్తిహీనులో ఇక్కడ మనం కూడా అలాగే శక్తి హీనులం. అయితే గలిలయ సముద్ర తరంగాల్ని శాంతించాల్సిందిగా ఆదేశించిన ప్రభువు ప్రతీ ఆత్మకు సమాధానాన్ని ప్రవచించాడు. శోధన ఎంత భయంకరమైందైనా, “ప్రభువా మమ్ముల్ని రక్షించు” అంటూ యేసును ఆశ్రయించే వారికి విముక్తి లభిస్తుంది. ఆత్మను దేవునితో సమాధానపర్చే ఆయన కృప మానవ ఉద్రేకాల కల్లోలాన్ని శాంతపర్చుతుంది. అప్పుడు ఆత్మ ఆయన ప్రేమలో విశ్రమిస్తుంది. “ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.” కీర్తనలు 107:29,30. “విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము.” “నీతి సమాధానము కలుగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును.” రోమా 5:1; యెషయా 32:17.DATel 364.2

    ఉదయం పెందలాడే రక్షకుడు ఆయన శిష్యులు ఒడ్డుకు వచ్చారు. ఉదయ భానుడి అరుణ కిరణాలు సముద్రం పైన నేల పైన వ్యాపిస్తోన్నాయి. అయితే వారు తీరంపై కాలు పెట్టిన వెంటనే వారి దృష్టి ఓ భయంకర దృశ్యంపై నిలిచింది. అది తుపానుకన్నా భయంకరమై దృశ్యం. సమాధుల్లో ఎక్కడో తాము దాక్కొని ఉన్న స్థలం నుంచి ఇద్దరు పిచ్చివాళ్లు వీరిని ముక్కలు ముక్కలుగా చీల్చడానికన్నట్లు వడివడిగా వస్తోన్నారు. వారిని బంధించి ఉంచిన గొలుపులు తెగిపోయి వారి ఒంటిపై వేలాడున్నాయి. చెరనుంచి తప్పించుకునేందుకు వారు తెంచుకుని వచ్చిన గొలుసులవి. వారి దేహంపై రక్తంకారుతున్న గాయాలున్నాయి. అవి వారు పదునైన రాయితో కోసుకోగా అయిన గాయాలు. వారి తలవెంట్రుకలు జడలల్లుకుని పొడవుగా వెలాడ్తున్నాయి. వాటి మధ్య నుంచి వారు గుడ్లెర్రజేసి చూస్తోన్నారు. వారిని పట్టిన దయ్యాలు వారిలోని మానవత్వాన్ని పూర్తిగా తుడిచివేసినట్లు కనిపిస్తోంది. వారు మనుషుల కన్నా మృగాల్లాగే ఎక్కువగా కనిపించారు.DATel 365.1

    శిష్యులు వారితో ఉన్న ప్రజలు భయభ్రాంతులై పారిపోయారు. తర్వాత తమతో క్రీస్తులేనట్లు గుర్తించారు. ఆయన కోసం ఇటూ అటూ చుశారు. తాము ఆయన్ని విడిచివచ్చిన స్థలంలోనే ఆయన ఉండటం చుశారు. తుపానును సద్దణచిన, సాతానుని ఎదుర్కొని మన్నుకరిపించిన ప్రభువు ఈ దయ్యాల్ని చూసి పారిపోలేదు. వాళ్లరూ పళ్లు కొరుకుతూ నోటివెంట తెల్లని సొంగకార్చుతూ ఆయన్ని సమీపించినప్పుడు తరంగాల్ని శాంతించమంటూ ఏ హస్తాన్ని పైకెత్తాడో దాన్నే పైకెత్తగా వారు ఇక ఒక్క అడుగు ముందుకి వెయ్యలేకపోయారు. వారు ఉగ్రరూపం ధరించారు. కాని ఆయన ముందు నిస్సహాయులై నిలబడ్డారు. వారిని విడిచి బయటికి రావలసిందిగా దురాత్మల్ని ఆయన అధికారంతో అదేశించాడు. ఆయన మాటలు ఆ అభాగ్యుల చీకటి మనసుల్లోకి చొచ్చుకుపోయాయి. తమను రాచిరంపాన పెడ్తోన్న ఈ దురాత్మల నుంచి విడిపించగల ఒక వ్యక్తి తమ చెంత ఉన్నాడని వారు చూచాయగా గ్రహించారు. రక్షకుని పాదాలపై పడ్డారు ఆయన్ని పూజించడానికి. కాని ఆయన కృపను అర్థించడానికి వారు పెదవులు విప్పినప్పుడు దయ్యాలు వారి ద్వారా మాట్లాడూ, “యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను.” అని కేకలు వేశాయి.DATel 365.2

    యేసు “నీ పేరేమి?” అని అడిగాడు. “నా పేరు సేన, యేలయనగా మేము అనేకులము” అన్న జవాబు వచ్చింది. తమచే బాధితులైన ఈ వ్యక్తుల్నే తమ మాధ్యమంగా వినియోగించుకుని తమను దేశం నుంచి బయటికి పంపివెయ్యవద్దంటూ ఆ దురాత్మలు యేసును బ్రతిమాలాయి. దగ్గరలో ఉన్న ఓ కొండపక్క పెద్ద పందుల మంద మేస్తోంది. ఈ మందలోకి ప్రవేశించడానికి తమను అనుమతించాల్సిందిగా అది కోరగా యేసు అనుమతించాడు. వెంటనే ఆ మందలో భయం చెలరేగింది. అవి గలిబిలిగా ఆ ప్రాంతం నుంచి కిందికి పరుగుతీశాయి. సముద్రం ఒడ్డుకి వెళ్లినప్పుడు తమ్మునుతాము అదుపు చేసుకోలేక సముద్రంలోకి దూకి నశించాయి. ఈDATel 366.1

    ఈ వ్యవధిలో దయ్యాలు పట్టిన ఈ వ్యక్తుల్లో గొప్ప మార్పు చోటు చేసుకుంది. వారి మనసుల్లో వెలుగు ప్రకాశించింది. వారి కళ్లు వివేకంతో కళకళలాడాయి. అప్పటిదాకా సాతాను వాలకం సంతరించుకున్న వారి ముఖం అకస్మాత్తుగా సాధువైఖరి ధరించింది. రక్తం చిందించే వారి చేతులు సంతోషానందాలో దేవున్ని స్తుతించారు.DATel 366.2

    పందుల కాపర్లు తమ పందులకేమి సంభవించిందో కొండపై నుంచి చూస్తోన్నారు. తమ యజమానులికి ప్రజలకు ఆ వార్త చాటడానికి వారు హుటాహుటిగా వెళ్లిపోయారు. భయంతోను ఆశ్చర్యంతోను నిండి ప్రజలు యేసుని కలవడానికి గుమిగూడారు. దయ్యాలు పట్టిన ఈ ఇద్దరూ దేశంలో గొప్ప భయోత్పాతం సృష్టించారు. తామున్న తావు దాటి ఎవ్వరూ క్షేమంగా వెళ్లలేకపోయేవారు. ఎందుకంటే వీరు ప్రతీ ప్రయాణికుడి మీద దయ్యా ల్లా కోపంగా విరుచుకుపడేవారు. ఇప్పుడు ఈ వ్యక్తులు దుస్తులు ధరించారు. ఇప్పుడు వీరు బుద్ధిగల మనుషులు. యేసు చెప్పే మాటల్ని వింటూ తమను స్వస్తపర్చిన ప్రభువుని మహిమ పర్చుతోన్నారు. కాని ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించిన ప్రజలు సంతోషించలేదు. ఈ సాతాను బందీల విడుదలకన్నా వారికి పందుల నష్టం ఎక్కువ ప్రాముఖ్యంగా కనిపించింది.DATel 366.3

    పందుల యజమానుల పట్ల కనికరంతోనే వారికి ఈ నష్టం కలగడానికి ఆయన అనుమతించాడు. వారు లోక వ్యవహారాల్లో మునిగి ఆధ్యాత్మిక జీవితంలో ఆసక్తి కనపరచలేదు. వారు తన కృపను అంగీకరించేందుకోసం స్వార్ధంతో కూడిన వారి ఉదాసీనతను నాశనం చెయ్యాలని యేసు సంకల్పించాడు. అయితే తమకు వాటిల్లిన నష్టం నిమిత్తం సంతాపం ఆగ్రహం రక్షకుని కృపను చూడకుండా వారికి అంధత్వం కలిగించింది.DATel 367.1

    మానవేతర శక్తి ప్రదర్శన ప్రజల మూఢనమ్మకాల్ని రెచ్చగొట్టి వారిలో భయాల్ని సృష్టించింది. వారి మధ్య ఈ పరదేశిని ఉండనిస్తే మరిన్ని దుర్ఘటనలు చోటుచేసుకోవచ్చు. వారు ఆర్ధిక పతం సంభవిస్తుందని భావించి ఆయన్ని సన్నిధిలోనుంచి వెళిపొమన్నారు. క్రీస్తుతో పాటు సముద్రం దాటినవారు గడచిన రాత్రి సముద్రంపై జరిగిందంతా వారికి చెప్పారు. తుపానులో తమ కడగండ్ల గురించి, సముద్రం గురించి, గాలులు కల్లోలిత సముద్రం ఎలా శాంతించాయో వాటి గురించి చెప్పారు. కాని వారి మాటల్ని ఎవరూ నమ్మలేదు. భయభ్రాంతులై యేసు చుట్టూ గుమిగూడి, తమ మధ్య నుంచి వెళ్లిపొమ్మని బతిమాలారు. ఆయన వారి మనవిని అంగీకరించాడు. వెంటనే వారు ఓడ ఎక్కి అద్దరికి వెళ్లారు.DATel 367.2

    క్రీస్తు శక్తిని కృపను గురించిన నిదర్శనం గదరేనీయుల కళ్ల ముందే ఉన్నది. తిరిగి స్వస్తబుద్ధి పొందిన ఆ యిద్దరు మనుషుల్ని వారు చూస్తూనే ఉన్నారు. కాని తమ లౌకికాసక్తులికి విఘాతం కలిగించడానికి భయపడి, తమ కళ్లముందే చీకటి రాజును మట్టి కరిపించిన ప్రభువుని చొరబాటుదారుడిగా పరిగణించి, దేవుడు పంపిన వరాన్ని నిరాకరించారు. గదరేనీయుల్లా క్రీస్తు వ్యక్తిగత సముఖం నుంచి తొలగిపోయే అవకాశం మనకు లేదు. అయినా ఆయన మాటను ఆచరించడం ఏదో లౌకిక ప్రయోజనం త్యాగాన్ని కోరుతున్నందున దాన్ని తోసిపుచ్చేవారు ఎందరో ఉన్నారు. ఆయన సముఖం తమకు ఆర్ధికంగా నష్టదాయకం గనుక అనేకులు ఆయన కృపను నిరాకరించి ఆయన ఆత్మను పారదోల్తున్నారు.DATel 367.3

    అయితే పునరుద్ధరణ పొందిన ఈ దయ్యాల పీడితుల వైఖరి ఎంతో వ్యత్యాసంగా ఉంది. తమ విమోచకుడితోనే ఉండాలని వారు ఆశించారు. తమను ఎంతో బాధించి తమ బతుకుల్ని వృధాపర్చిన దురాత్మల బారినుంచి కాపాడిన ఆయన సముఖంలోనే వారికి భద్రత ఉంది. పడవ ఎక్కడానికి యేసు సిద్ధమౌతున్నప్పుడు వారు ఆయనకు దగ్గరగా ఉంటూ ఉన్నారు. ఆయన పాదాల వద్ద మోకరించి తన మాటలు నిత్యం వినేందుకు తమను తనవద్దనే ఉంచవలసిందని మనవి చేశారు. కాని వారు ఇంటికి వెళ్లి తమకు ప్రభువు చేసిన మహోపకారాల్ని గూర్చి చెప్పవలసిందిగా ఆదేశించాడు.DATel 368.1

    చేయడానికి వారికో పని ఏర్పడింది, - ఒక అన్యజనుల గృహానికి వెళ్లి తాము యేసు నుంచి పొందిన ఉపకారాల్ని గురించి చెప్పడం. రక్షకుణ్నుంచి వేరవ్వడం వారికి కష్టమయ్యింది. తమ అన్యజన సహవాసుల నుంచి వారికి ఎన్నో ఇక్కట్లు ఎదురవ్వడం ఖాయం. సమాజం నుంచి తాము చాలాకాలం దూరమవ్వడం ప్రభువు నియమించిన పని చేయ్యడానికి వారిని అనరుల్ని చేసినట్లు కనిపించింది. అయితే వారు తమ గృహాల్లో వారికి, ఇరుగుపొరుగు వారికే గాక దెకపొలి అంతటా యేసుని గురించి చెప్పారు. రక్షించడానికి ఆయన శక్తిమంతుడని చాటి, తమను దయ్యాల బారినుంచి ఆయన ఎలా విడిపించాడో వివరించారు. తమ వ్యక్తిగత భద్రతకోసం యేసుతోనే ఉండిపోడంకన్నా ఈ సాక్ష్యసేవ చెయ్యడంలో వారికి ఇతోధిక దీవెన ఉంది. రక్షణ శుభవార్తను ప్రచురించడంలో మనం రక్షకునికి దగ్గరవుతాం.DATel 368.2

    పునరుద్ధరణ పొందిన ఈ ఇద్దరు దురాత్మ బాధితులూ సువార్త ప్రకటించడానికి దెకపొలి ప్రాంతానికి క్రీస్తు పంపిన మొట్టమొదటి మిషనరీలు. ఈ ఇద్దరూ కొన్ని గడియలు మాత్రమే క్రీస్తు బోధను వినడం జరిగింది. ఆయన నోటి నుంచి ఒక్క ప్రసంగం కూడా వారు విని ఎరుగరు. యేసుతో అనుదినం ఉన్న శిష్యులవలే వారు ప్రజలకు ఉపదేశించలేకపోయారు. కాని క్రీస్తే మెస్సీయా అన్నదానికి నిదర్శనాన్ని వారు వ్యక్తిగతంగా ప్రదర్శించారు. క్రీస్తు శక్తిని గూర్చి తమకు స్వయంగా తెలిసింది తాము స్వయంగా చూసింది విన్నది అనుభవించింది వారు చెప్పగలిగారు. దైవకృప స్పర్శను అనుభవించిన ప్రతీ వారు ఇది చేయగలరు. యేసు ప్రియ శిష్యుడు యోహాను ఇలా రాశాడు, “జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది యుండెనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము.” 1యోహాను 1:1-3. క్రీస్తు సాక్ష్యులుగా మనకు తెలిసింది మనం స్వయంగా చూసిన దాన్ని విన్నదాన్ని అనుభవపూర్వకంగా గ్రహించిన దాన్ని మనం చెప్పాల్సి ఉన్నాం. మనం ప్రతీ అడుగు యేసుని వెంబడిస్తూ ఉంటే ఆయన మనల్ని నడిపించిన విధం గురించి నిర్దిష్టంగా చెప్పడానికి విషయముంటుంది. ఆయన వాగ్దానాల్ని పరీక్షించి అవి యధార్ధమైనట్లు ఎలా కనుగొన్నామో చెప్పవచ్చు. మన ప్రభువు ఇలాంటి సాక్ష్యం ఇవ్వడానికే మనకు పిలుపు నిస్తోన్నాడు. ఇది లేనందుకే ప్రపంచం నశించిపోతోంది.DATel 368.3

    గదరేనీయులు యేసును అంగీకరించకపోయినా తాము ఎన్నుకున్న చీకటిలోనే వారిని ఆయన విడిచి పెట్టలేదు. తమను విడిచి పెట్టి వెళ్లి పొమ్మని వారు ఆయన్ని కోరినప్పుడు వారాయన మాటలు వినలేదు. తాము ఎందునిమితం ఆనందిస్తున్నారో వారికి తెలియదు. కనుక ఆయన వారికి వెలుగును మళ్లీ పంపాడు. తాము ఎవరినైతే కాదనలేరో వారిద్వారా వెలుగును పంపాడు.DATel 369.1

    పందుల మంద నాశనాన్ని కలుగజెయ్యడం, ప్రజల్ని క్రీస్తుకి దూరంగా ఉంచడం, ఆ ప్రాంతంలో సువార్త ప్రకటనను అడ్డగించడం సాతాను సంకల్పం. అయితే మరే ఇతర ఘటన చేయగలిగి ఉండని రీతిలో ఈ ఘటన దేశమంతటినీ మేల్కొలిపి ప్రజల గమనాన్ని క్రీస్తుపై నిలిపింది. రక్షకుడు ఆరోహణమై వెళ్లిపోయినప్పటికీ ఆయన స్వస్తపర్చిన వారు ఆయన శక్తికి సాక్షులుగా నిలిచి ఉన్నారు. చీకటి రాజుకు సాధనాలుగా ఉన్నవారు వెలుగు మార్గాలుగాను దైవకుమారుని దూతలుగాను మారారు. అద్భుతమైన వారి సాక్ష్యం విన్నప్పుడు ప్రజలు విస్మయం చెందారు. ఆ ప్రాంతం మొత్తం సువార్తకు తలుపులు తెరిచింది. యేసు తిరిగి దెకపొలికి వచ్చినప్పుడు ప్రజలు ఆయన చుట్టూ ముగారు. కేవలం ఆ పట్టణ ప్రజలే కాదు ఆ ప్రాంతంలోని వేల ప్రజలు మూడు దినాలు రక్షణ వార్తను విన్నారు. దయ్యాల శక్తి కూడా రక్షకుని అదుపులో ఉంది. ప్రజల మేలు నిమిత్తం దుష్టుడి శక్తిని విఫలం చెయ్యడం జరుగుతోంది.DATel 369.2

    గదరేనీయుల దేశంలో దయ్యాల్ని ఎదుర్కోడంలో శిష్యులికి ఓ పాఠం ఉంది. సర్వమానవ జాతిని నీచస్థితికి దిగజార్చడానికి, మానవుల్ని సాతాను శక్తి నుంచి విడిపించడానికి క్రీస్తు చేస్తున్న సేవను దెబ్బతియ్యడానికి అతడు ఎంతగా ప్రయత్నిస్తోన్నాడో ఇది తెలియజేస్తోన్నది. సాతాను ఆధీనంలో ఉండి అడ్డు అదుపులేని ఉద్రేకాలికి క్షుద్ర కామేచ్చలికి బానిసలై సమాధుల నడుమ నివసిస్తోన్న ఈ దౌర్భాగ్యులు, సాతాను నియంత్రణకింద ఉంటే మనుషులు ఎలా తయారవుతారో అన్నదాన్ని కళ్లకు కడుతోంది. ఇంద్రియాలికి ధ్యానభంగం కలిగించడానికి, దుర్మార్గతకు పాల్పడడానికి మనసును నియంత్రంచడానికి, దౌర్జన్యాన్ని నేరాన్ని రెచ్చగొట్టడానికి సాతాను మనుషుల్ని సర్వదా ప్రభావితం చేస్తుంటాడు. సాతాను దేహాన్ని బలహీనపర్చుతాడు. వివేకాన్ని మసకబార్చుతాడు. ఆత్మను నైతికంగా దిగజార్చుతాడు. మనుషులు దేవుని ఆహ్వానాన్ని విసర్జించినప్పుడల్లా వారు సాతానుకు లొంగిపోతోన్నారు. జీవితంలోని ప్రతీ రంగంలో - గృహంలో వ్యాపారంలో సంఘంలో సైతం - వేలమంది చేస్తున్నది ఇదే. ఈ కారణం వల్లనే లోకంలో దౌర్జన్యం నేరం విస్తరించాయి. శవపేటికను కప్పే గుడ్డలా మనుషుల నివాసాల్ని నైతిక అంధకారం కప్పివేస్తోంది. దుష్టత్వనాశనం సంభవించే వరకు సాతాను తన శోధనల ద్వారా మనుషుల్ని నీచాతి నీచమైన పాపాల్లోకి నడిపిస్తాడు. అతడి ప్రాబల్యం నుంచి పరిరక్షించగలిగే ఏకైక శక్తి యేసు సన్నిధి. సాతాను మానవుడికి శత్రువు నాశన కర్త అని, క్రీస్తు మానవుడి మిత్రుడు, విమోచకుడు అని మానవుల ముందు దూతగణాల ముందుకు వెల్లడయ్యింది. మనిషిలో ప్రవర్తనను ఉదాత్తం నైజాన్ని సమున్నతం చేసే సమస్తాన్ని ఆయన ఆత్మ వృద్ధి పర్చుతుంది. అది మనిషిని శారీరకంగా ఆత్మపరంగా స్వభావపరంగా దేవుని మహిమ కోసం నిర్మిస్తుంది. “దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహముగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మను ఇవ్వలేదు.” 2 తిమోతి 1:7. “మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను - ప్రవర్తనను” - “పొందవలెనని” ఆయన మనల్ని పిలిచాడు. “తన కుమారునితో సారూప్యము” కలిగి ఉండడానికి మనల్ని పిలిచాడు. 2థెస్స. 2:14; రోమా 8:29.DATel 370.1

    ఆధ్యాత్మికంగా దిగజారిపోయి, సాతానుకి సాధనాలయ్యే ఆత్మల్ని క్రీస్తు తన శక్తి ద్వారా నీతి దూతలుగా రూపొందించి “ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని” చెప్పడానికి వారిని ఇంకా పంపుతాడు.DATel 371.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents