Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  10—అరణ్యంలో స్వరం

  ఇశ్రాయేలులో దేవునికి నమ్మకంగా ఉంటూ మెస్సీయా కోసం కనిపెట్టొన్న వారిలో నుంచి క్రీస్తుకు అగ్రగామి జన్మించాడు. వృద్ధుడైన యాజకుడు జెకర్యా అతడి భార్య ఎలీసబెతు ” దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.” ప్రశాంతమూ పరిశుద్ధమూ అయిన వారి జీవితాల్లో విశ్వాసదీపం నాటి దుర్మారపు చీకటిలో నక్షత్రంలా ప్రకాశించింది. భక్తిపరులైన ఈ జంటకు దేవుడు ఒక కుమారుణ్ని వాగ్దానం చేశాడు. అతడు “ప్రజలను సిద్ధపరచుటకై ఆయనకు ముందుగా వెళ్ళు”నని చెప్పాడు.DATel 78.1

  జెకర్యా “యూదాదేశము”లో నివసించాడు. ఆలయంలో ఒక వారంపాటు సేవచెయ్యడానికి యెరూషలేముకి వెళ్లాడు. ప్రతీ తరగతికి చెందిన యాజకులూ ఈ రకమైన సేవను ఏడాదిలో రెండు విడతలు చేయాల్సి ఉన్నారు. “జెకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని యెదుట ధర్మము జరిగించుచుండగా యాజకమర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతువచ్చెను.”DATel 78.2

  దేవాలయంలో బంగారు ధూపవేదిక ముందు అతడు నిలబడి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రార్ధనలతో కలిసి ధూపం మేఘంలా దేవుని ముందు లేస్తోంది. హఠాత్తుగా దైవసంబంధమైన సముఖం ఉన్నట్లు గుర్తించాడు. ప్రభువు దూత “ధూపవేదిక కుడివైపున నిలిచి” ఉన్నాడు. దేవదూత నిలిచిన దిశ దైవప్రసన్నతకు సూచిక. అయితే జెకర్యా దీన్ని గుర్తించలేదు. రానున్న విమోచకుని గూర్చి అనేక సంవత్సరాలుగా ప్రార్ధన చేశాడు. ఈ ప్రార్థనలు సఫలమయ్యే సమయం ఇప్పుడు వచ్చిందని ప్రకటించడానికి దేవుడు తన దూతను పంపించాడు. అయితే దేవుని ప్రసన్నత జెకర్యా నమ్మలేనంత గొప్పగా ఉంది అతణ్ని భయం ఆత్మఖండన నింపాయి.DATel 78.3

  వాగ్దానం చేసిన ప్రభువు నమ్మకమైనవాడని విశ్వసించాడు గనుక అబ్రహాముకి వృద్ధాప్యంలో ఒక బిడ్డను దేవుడు ఎలా ఇచ్చాడో జెకర్యాకు బాగా తెలుసు. కాగా ఆవృద్ధ యాజకుడు కాసేపు మానవ బలహీనతకు లొంగాడు. తాను వాగ్దానం చేసినదాన్ని దేవుడు నెరవేర్చడానికి సమర్ధుడని జెకర్యా మరిచాడు. ఈ అవిశ్వాసానికి మరియ ప్రదర్శించిన పసిపిల్ల లాంటి విశ్వాసానికీ మధ్య ఎంత తేడా ఉంది! నజరేతుకి చెందిన ఈ కన్య దేవదూత ప్రకటించిన అద్భుత విషయానికి “ఇదిగో ప్రభువు దాసురాలను; నీమాట చొప్పున నాకు జరుగును గాక” అని సమాధానం ఇచ్చింది. లూకా 1:38.DATel 79.1

  అబ్రహాముకి బిడ్డపుట్టడంలాగ మరియకు బిడ్డపుట్టడంలాగ జెకర్యాకు కొడుకు పుట్టడం ఒక గొప్ప ఆధ్యాత్యిక సత్యాన్ని బోధించడానికి సంభవించింది. ఆ సత్యాన్ని త్వరగా నేర్చుకోం గాని మర్చిపోవడానికి మనం సిద్ధంగా ఉంటాం. మనం స్వయంగా ఏమి మంచి చెయ్యలేం. కాని మనం ఏదైతే చేయలేమో, అది విధేయమైన, విశ్వసించే ఆత్మలో దేవుని శక్తివల్ల సంభవిస్తుంది. వాగ్దత్త శిశువు జననం విశ్వాసమూలంగా సంభవించింది. ఆధ్యాత్మిక జీవితం విశ్వాసమూలంగానే జనిస్తుంది. అప్పుడు నీతిక్రియలు చెయ్యడానికి మనకు శక్తి కలుగుతుంది.DATel 79.2

  జెకర్యా వేసిన ప్రశ్నకు దూత ఇలా జవాబిచ్చాడు, “నేను దేవుని సముఖముందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని” దీనికి అయిదువందల సంవత్సరాలు ముందు క్రీస్తు మొదటి రాక వరకూ విస్తరించాల్సి ఉన్న ప్రవచనాన్ని గబ్రియేలుదూత దానియేలు ప్రవక్తకు ఇచ్చాడు. ఈ కాలావధి సమాప్తం దగ్గరలోనే ఉన్నదన్న జ్ఞానం మెస్సీయారాక కోసం ప్రార్థన చెయ్యడానికి జెకర్యాకు ప్రేరణనిచ్చింది. ఆ ప్రవచనం ఎవరి ద్వారా వచ్చిందో ఆ దూతే దాని నెరవేర్చును ప్రకటించడానికి ఇప్పుడు వచ్చాడు.DATel 79.3

  “నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును” అన్న దేవదూత మాటలు ఆయన పరలోకంలో ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నాడని సూచి స్తోన్నాయి. గబ్రియేలు దానియేలు వద్దకు వర్తమానంతో వచ్చినప్పుడు ఇలా అన్నాడు, ” నా యధిపతియగు మిఖాయేలు గాక యీ సంగతులను గూర్చి నాపక్షముగా నిలువ తెగించినవాడొకడును లేడు.” దానియేలు 10:21. గబ్రియేలు గురించి మాట్లాడూ ప్రకటనలో రక్షకుడు ఇలా అంటున్నాడు “ఆయన తనదూత ద్వారా వర్తమానము పంపి తనదాసుడైన యోహానుకు వాటిని సూచించెను” ప్రకటన 1:1; యోహానుతో దూత ఇలా అన్నాడు. “నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను... సహదాసుడను” ప్రకటన 22:9. దేవుని సంకల్పాన్ని పాపమానవులకి తెలియపర్చడానికిగాను ఘనత విషయంలో దైవకుమారుని తర్వాత నిలిచే దూతను దేవుడు ఎంపికచెయ్యడం అద్భుతమైన ఆలోచన.DATel 80.1

  దూత మాటల్ని జెకర్యా శంకించాడు. అందుకు అవి నెరవేరే వరకు అతడు మూగవాడయ్యాడు. దూత అతనితో ఇలా అన్నాడు, ” నామాటలు వాటి కాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు ఉన్న యాజకుడి బాధ్యత ప్రజల పాపాలు జాతి పాపాల క్షమాపణ కోసం మెస్సీయా రాకకోసం ప్రార్థించడం. అయినా ఈవిధి నిర్వహణకు అతడు ప్రయత్నించినప్పుడు ఒక్క మాటకూడా పలుకలేకపోయాడు.DATel 80.2

  ప్రజల్ని ఆశీర్వదించడానికి బయటికి వచ్చినప్పుడు “వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడైయుండెను. ” వారు చాలా సేపు వేచి ఉండి దేవుని తీర్పు వల్లే అది జరిగిందని భయపడ్డారు. కాని అతడు పరిశుద్ధ స్ధలంనుంచి బయటికి వచ్చినప్పుడు అతని ముఖం దేవుని మహిమతో ప్రకాశించడంతో “ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి.” తాను ఏమి చూశాడో ఏమి విన్నాడో అంతా సంజ్ఞల ద్వారా వారికి తెలిపాడు. “అతడు సేవచేయు దినములు సంపూర్ణమైనప్పుడు తనయింటికి వెళ్లెను.DATel 80.3

  వాగ్దాత్త పుత్రుడి జననం చోటుచేసుకున్న వెంటనే తండ్రి నాలుక సడలింది. “అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆసంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచురమాయెను. ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆసంగతులను గూర్చి వినిన వారందరును - ఈ బిడ్డ యేలాటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.” ఇదంతా మెస్సీయా రాకకు ప్రజల గమనాన్ని ఆకర్షించడానికి దోహదపడింది. యోహాను మెస్సీయారాకకు మార్గం సుగమం చేయాల్సి ఉన్నాడు.DATel 80.4

  జెకర్యాపై పరిశుద్దాత్మ నిలువగా అతడు తన కుమారుడి పరిచర్యను గురించి ఈ చక్కని మాటల్లో ప్రవచించాడు: “మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండు వారికి వెలుగు నిచ్చుటకై ఆ మహావాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము ననుగ్రహించెను”DATel 81.1

  “శిశువు ఎదిగి ఆత్మయందు బలమును పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను.” యోహాను జననానికి ముందు దూత ఇలా అన్నాడు, “అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షరసమైనను త్రాగక తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన దేవునివైపునకు త్రిప్పును.” జెకర్యా కుమారుణ్ని దేవుడు గొప్పకార్యనిర్వహణ నిమిత్తం పిలిచాడు. అది ఎంతో విశిష్టమైన సేవ. అలాంటిది ఇంకే మానవుడికీ దేవుడు అప్పగించలేదు. ఈ కర్తవ్యసాధనకు అతనితో కలిసి ప్రభువు పనిచెయ్యడం అవసరం. అతడు దేవదూత ఉపదేశాన్ని అనుసరిస్తే దేవుని ఆత్మ అతనితో ఉంటాడు.DATel 81.2

  మనుషులికి దేవుని వెలుగును అందించడానికి యోహాను యెహో వాదూతగా లోకంలోకి వెళ్ళాల్సి ఉన్నాడు. అతడు మానవుల తలంపులను నూతన దిశగా నడిపించాల్సి ఉన్నాడు. దైవ విధులు పవిత్రమైనవని ఆయన సంపూర్ణ నీతి వారికి అగత్యమని అతడు వారికి బోధపర్చాలి. అలాంటి దూత పరిశుద్దుడై ఉండాలి. దేవుని ఆత్మ నివసించేందుకు అతడు.ఆలయమై ఉండాలి. తన కర్తవ్య సాధనకు అతనికి దేహదారుడ్యం మానసిక ఆధ్యాత్మిక శక్తి అవసరం. అందునుబట్టి అతడు రుచులు అభిరుచులు భావోద్రేకాలు అదుపులో ఉంచుకోడం అవసరం. చూట్టూ ఉండే పరిస్థితుల ప్రభావం తాకిడికి అటూఇటూ కదలకుండా అరణ్యంలోని బండలూకొండల్లా దృఢంగా నిలిచేందుకు అతడు తన సర్వశక్తుల్ని అదుపులో ఉంచుకోగలగాలి.DATel 81.3

  బాప్తిస్మమిచ్చే యోహాను కాలంలో ధనా పేక్ష విలాస జీవితం డంబంపై అనురక్తి పెచ్చు పెరిగాయి. వినోదాలు, విందులు, తాగుడు వల్ల వ్యాధులు క్షీణత సంభంవించడం, ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన మొద్దుబారడం, పాపస్పృహ క్షీణించడం జరిగింది. యోహాను సంస్కర్తగా వ్యవహరించాల్సి ఉన్నాడు. తన మిత, నిరాడంబర జీవనం, సామాన్య వస్త్రధారణ వలన తన కాలంలోని మితిమీరిన జీవన విధానానికి యోహాను గద్దింపుగా ఉండాల్సి ఉంది. అందుచేతనే యోహాను తలిదండ్రులకు దేవుడు ఆ ఉపదేశం అందించాడు. ఆ ఉపదేశం పరలోకప్రభువు సింహాసనం నుంచి దూత తెచ్చిన మితానుభవ వర్తమానం.DATel 82.1

  బాల్యంలోను, యౌవనంలోను ప్రవర్తన ఎక్కువగా ప్రభావితమౌతుంది. ఆత్మనిగ్రహశక్తిని సంపాదించాల్సిన సమయం ఆదే. చలి కాగేటప్పుడు కుటుంబం భోజనం చేసేటప్పుడు అభిప్రాయాలు ప్రభావాలు ఏర్పడ్డాయి. వాటి పర్యవసానాలు నిత్యమూ నిలిచేవి. జీవన సమరంలో వ్యక్తి జయాపజయాల్ని ఏ స్వాభావిక వర్గాలకన్నా ఎక్కువగా చిన్నవయసులో ఏర్పడే అలవాట్లే నిర్ధారిస్తాయి - ఈజీవితం విషయంలోనే కాదు నిత్యజీవితం విషయంలో కూడా.DATel 82.2

  ప్రవక్తగా అతడు “తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచ” వలసి ఉన్నాడు. క్రీస్తు రెండో రాకకు ప్రజల్ని సిద్ధంచేస్తూ వారికి ప్రతినిధిగా నిలిచాడు. లోకం స్వార్థ క్రియల్లో మునిగిపోయింది. దోషాలు కట్టు కథలు పెచ్చు పెరుగుతోన్నాయి. ఆత్మల్ని నాశనం చెయ్యడానికి సాతాను ఉచ్చులు ఇబ్బడి ముబ్బడి అవుతోన్నాయి. దైవభీతి కలిగి పరిపూర్ణ పరిశుద్ధత సాధించగోరేవారందరూ మితానుభవాన్ని ఆత్మనిగ్రహాన్ని పాటించడం నేర్చుకోవాలి. భోజనప్రీతి, దురావేశాలు ఉన్నతమైన మానసిక శక్తుల నియంత్రణ కింద ఉండాలి. దైవవాక్యంలోని పరిశుద్ధ సత్యాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టడానికి అవసరమైన మానసిక శక్తిని పొందడానికి ఈ సంయమనం అవసరం. ఈ కారణంగా రెండో రాకకు ప్రజల్ని సన్నద్ధపర్చేసేవలో మితానుభవం ప్రాధాన్యం సంతరించుకొంటోంది.DATel 82.3

  స్వాభావికంగా జెకర్యా కుమారుడు యాజకత్వానికి విద్యనభ్యసించేవాడు. కాని రబ్బీ పాఠశాలల్లోని శిక్షణ అతణ్ని తాను చేయాల్సిన పనికి సమర్ధుణ్ని చేసేది కాదు. లేఖనాలకు భాష్యం చెప్పడం నేర్చుకోడానికి వేదాంత పండితుల వద్దకు అతణ్ని పంపలేదు దేవుడు. ప్రకృతి దేవుణ్ని గురించి నేర్చుకోడానికి అతణ్ని అరణ్యంలోకి పిలిచాడు.DATel 83.1

  అతడు నివాసం ఉంటున్నది ఒంటరి ప్రాంతం. అది కొండలు లోయలు రాతి గుహల నడుమ ఉన్న ప్రదేశం. అరణ్యంలో కఠిన క్రమశిక్షణ కోసం అతడు జీవితంలో ఆనందోత్సాహాల్ని సుఖసౌఖ్యాల్ని ఉపేక్షించడానికి ఎంపిక చేసుకున్నాడు. ఇక్కడ అతని పరిసరాలు అతి సామాన్యజీవనానికి ఆత్మోపేక్షకు అనువుగా ఉన్నాయి. లోకంలోని గోల ఇక్కడ ఉండదు. ఆప్రశాంత వాతావరణంలో ప్రకృతి పాఠాల్ని దేవుని ఆవిష్కరణల్ని దేవుని చిత్తాన్ని యోహాను అధ్యయనం చేయవచ్చు. దైవభక్తిగల తల్లిదండ్రులు దేవదూత జెకర్యాకు చెప్పిన మాటల్ని తరచు వల్లిస్తూ ఉండేవారు. చిన్నతనం నుంచి యోహాను తన కర్తవ్యం ఏంటో గుర్తెరుగుతూ వచ్చాడు. ఆ పవిత్ర కర్తవ్యాన్ని ఒక ధర్మ నిధిగా అంగీకరించాడు. అరణ్యంలోని ఏకాంత నివాసం అతనికి సమాజంలో విస్తరించి ఉన్న అనుమానాలు అపనమ్మకాలు అపవిత్రత నుంచి విడుదల అనిపించింది. శోధనను ప్రతిఘటించడానికి అతడు తన సొంతశక్తిని నమ్ముకోలేదు. పాపం తాలూకు విస్తారమైన నైచ్యాన్ని గుర్తించలేనన్న భయంతో పాపంతో పరిచయానికి దూరంగా ఉన్నాడు.DATel 83.2

  పుట్టినప్పటి నుంచి దేవునికి నాజీరుగా సమర్పితుడైన అతడు ఆ ప్రతిజ్ఞను తన జీవితమంతా కొనసాగించడానికి తన్నుతాను అంకితం చేసుకున్నాడు. అతని వస్త్రధారణ పూర్వప్రవక్తల తీరుగా ఉంది. అతడు ఒంటేరోమాలతో తయారైన వస్త్రం, మొలచుట్టూ తోలుదట్టీ ధరించాడు. అడవిలో లభించే “మిడతలు అడవితేనెయు” అతడు భుజించి కొండలనుంచి ప్రవహించే స్వచ్ఛమైన నీళ్ళు తాగాడు.DATel 84.1

  యోహాను జీవితం సోమరితనంలోనో, తపస్వి చీకటి కోణంలోనో లేక స్వార్ధంతో కూడిన ఒంటరితనంలోనో గడవలేదు. మనుషులతో కలిసి మాట్లాడడానికి అప్పుడప్పుడు బయటికి వెళ్లేవాడు. లోకంలో ఏంజరుగుతుందో అతడు నిత్యం ఆసక్తితో పరిశీలించాడు. జరుగుతోన్న ఘటనల్ని తన ప్రశాంత ఆశ్రమం నుంచి పరిశీలించేవాడు. దేవుని ఆత్మ వికాసం వల్ల కలిగిన దృష్టితో మనుషుల ప్రవర్తనల్ని అధ్యయనంచేసి దైవవర్తమానం వారికి ఎలా అందిచాలో గ్రహించేవాడు. తన కర్తవ్య భారాన్ని అతడు ఔదల ధరించాడు. తన ముందున్న కర్తవ్యసాధనకు ఏకాంత ధ్యానం ద్వారా ప్రార్ధనద్వారా తన ఆత్మను సన్నద్ధం చెయ్యడానికి పూనుకున్నాడు.DATel 84.2

  అరణ్యంలో ఉంటున్నా అతడు శోధనకు అతీతుడు కాదు. సాధ్యమైనంత మేరకు సాతాను ప్రవేశించే మార్గాలన్నిటినీ అతడు మూసివేశాడు. అయినా శోధకుడు అతణ్ని వెంటాడుతూనే ఉన్నాడు. అయినా అతని ఆధ్యాత్మిక స్పృహ స్పష్టంగా ఉంది. అతడు బలాన్ని పొందాడు. నిశ్చయాత్మక ప్రవర్తనను కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహాయంతో సాతాను ఎత్తుగడల్ని గుర్తించి వాటిని ప్రతిఘటించగలిగాడు.DATel 84.3

  యోహనుకి అరణ్యమే పాఠశాల, దేవాలయం. మిద్యాను పర్వతాల నడుమ మోషేవలే దేవుని శక్తికి నిదర్శనాల మధ్య యోహాను దేవుని సముఖానికి పరిమితమై ఉన్నాడు. ఆ ఇశ్రాయేలీయుల మహానాయకుడిలాగ గంభీర పర్వతాలనడుమ ఏకాంతంలో నివసించే తరుణం అతనికి లేదు. కాని అతని ముందు యోర్దానుకు పైగా మోయాబు పర్వతాలున్నాయి. పర్వతాల్ని ఏర్పర్చి వాటికి బలాన్నిచ్చిన ప్రభువును గూర్చి అవి వెల్లడిస్తున్నాయి. చీకటి భయంతో నిండిన ప్రకృతిలోని అతని అరణ్యగృహం ఇశ్రాయేలు పరిస్థితికి అద్దం పట్టింది. ఫలభరితమైన ప్రభువు ద్రాక్షతోట ఎడారి అయ్యింది. కాని ఆ ఎడారిపై ఉన్న ఆకాశం ప్రకాశిస్తూ అందంగా కనిపిస్తోంది. తుపానును సూచిస్తోన్న నల్లని మేఘాలపై వాగ్దానపు ధనుస్సు ఉంది. అలాగే ఇశ్రాయేలు పతనస్థితి పై మెస్సీయా పరిపాలన మహిమ ప్రకాశించింది. ఉగ్రత మేఘాలకు పైగా మెస్సీయా నిబంధన కృప ప్రకాశించింది.DATel 84.4

  అబ్రహాముకి ఒంటరిగా నిశ్శబ్ద రాత్రిలో దేవుడు ఆకాశ నక్షత్రాలవలే లెక్కకు మించిన సంతానాన్నిస్తానని చేసిన వాగ్దానం గురించి తలంచాడు. మోయాబు కొండలపై ప్రకాశిస్తున్న అరుణోదయ కాంతి “ఉదయ కాలపు సూర్యోదయ కాంతి వలె మబ్బులేకుండ ఉదయించిన సూర్యునివలె” ఉండనున్న (2 సమూ 23:47) ఆ ప్రభువును ప్రచురించింది. మిట్టమధ్యాహ్నం సూర్యకాంతిలో ఆయన ప్రదర్శన వైభవాన్ని వీక్షించాడు. అప్పుడు “యెహోవా మహిమ బయలు పరచబడును. ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు” యెషయా 40:5.DATel 85.1

  ఆశ్చర్యానందాలతో నిండిన మనసుతో మెస్సీయా రాకకు సంబంధించిన ప్రత్యక్షతల్ని ప్రవచన గ్రంథాల్లో వెదకాడు. సర్పం శిరస్సును చితకకొట్టాల్సిఉన్న వాగ్రత్త సంతానంగా దావీదు సింహాసనంపై రాజు పరిపాలించడం ఆగకముందు ప్రత్యక్షం కావాల్సిఉన్న “శాంతిదాత” అయిన షిలోహు ఆయనే. ఇప్పుడు సమయం వచ్చింది. సీయోను పర్వతంమిది భవనంలో ఓ రోమా రాజు ఆసీనుడై ఉన్నాడు. తప్పక నెరవేరే దైవవాక్యం ప్రకారం క్రీస్తు జన్మించాడు.DATel 85.2

  యెషయిలో నుంచి వేరు చిగురు అనగా నీతితో పరిపాలించడానికి, “నీతిని బట్టి తీర్పు” తీర్చడానికి “గాలివానకు చాటైన చోటువలెను.... అలసట పుట్టించు దేశమున గొప్ప నీడవలెను ఉండి పరిపాలించు రాజు వస్తాడు అని, ఇశ్రాయేలు విడువబడినది” అని పాడైనది అని ఆదేశము ఇక పిలువబడదు గాని ప్రభువు దాన్ని “ఇష్టురాలు” అని “బ్యూలా” అని పిలుస్తాడంటూ మెస్సీయా మహిమను గూర్చి యెషయా అందించిన వర్ణనలు యోహాను అధ్యయనాంశాలు. యెషయా 11:4; 32:2; 62:4. ఈ ఒంటరి బందీ హృదయం మహిమాన్వితమైన దర్శనంతో నిండింది.DATel 85.3

  అతడు ఆ సుందర ప్రభువును వీక్షించాడు. తన్నుతాను మర్చిపోయాడు. పరిశుద్ధత ఔన్నత్యాన్ని వీక్షించాడు. తాను అసమర్ధుణ్ని అయోగ్యుణ్ని అని భావించాడు. దేవుని దూతగా లోకంలోకి వెళ్లడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవుణ్ని వీక్షించాడు గనుక అవివాహితుడుగా ఉండిపోవాలనుకున్నాడు. రాజులకు రాజు ముందు వంగాడు గనుక లోక రాజులముందు తిన్నగా నిర్భయంగా నిలబడగలిగాడు.DATel 86.1

  యెహాను మెస్సీయా రాజ్యం స్వరూప స్వభావాల్ని పూర్తిగా అవగాహన చేసుకోలేదు. ఇశ్రాయేలుకు తన జాతీయ శత్రువుల నుంచి విడుదల కలుగుతుందని ఎదురు చుశాడు. రాజు నీతితో రావడం, ఇశ్రాయేలు పరిశుద్ధ జాతిగా స్థాపితమవ్వడం అతని నిరీక్షణ పరమోద్దేశం. తన జననమప్పుడు వచ్చిన ప్రవచనం ఇలా నెరవేర్తుందని అతడు విశ్వసించాడు;DATel 86.2

  “తన పరిశుద్ధ నిబంధన.... జ్ఞాపకము
  చేసికొనుటకును, మన శత్రువుల చేతినుండి,
  మన జీవిత కాలమంతము నిర్భయులమై,
  పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను
  అనుగ్రహించుటకును ఈ రక్షణను కలుగజేసెను”
  DATel 86.3

  తన ప్రజలు మోసపోయినట్లు, సంతృప్తి చెంది తమ పాపాల్లో నిద్రపోతున్నట్లు అతడు చూశాడు. వారిని పరిశుద్ధ జీవితానికి మేల్కొల్పాలని ఆశించాడు. దేవుడు అతని ద్వారా పంపిన వర్తమానం వారిని తమ నిద్రావస్థ నుంచి లేపి తమ దుర్మార్గత కారణంగా వారిని భయకంపితుల్ని చేయడానికి ఏర్పాటయ్యింది. సువార్త విత్తనాన్ని నాటక ముందు హృదయమనే నేలను దున్నడం జరగాలి. యేసు నుంచి స్వస్తతను ఆశించక ముందు పాప గాయాలవల సంభవించే ప్రమాదాన్ని వారు గుర్తించాలి.DATel 86.4

  దేవుడు పాపు? పొగడడానికి దూతల్ని పంపడు. పరిశుద్దులు కాని వారికి ప్రాణాంతకమైన భద్రత కూర్చడానికి శాంతి వర్తమానం పంపడు. ఆయన అపరాధి మనస్సాక్షి భారాన్ని పెంచి, ఆత్మను విశ్వాస బాణాలతో గుచ్చగా అతడు తన అవసరాన్ని గుర్తించి ” రక్షణ పొందడానికి నేనేమి చేయాలి?” అని దుఃఖించేందుకు, పరిచర్యచేసే దూతలు అతనికి,దేవుని భయంకర తీర్పులు వివరిస్తారు. అంతట మానవావతారం ధరించిన ఆ దీన హస్తం పశ్చాత్తప్తమైన ఆత్మను పైకి లేపుతుంది. అప్పుడు పాపాన్ని గద్దించి గర్వాన్ని దురాశను దునుమాడిన స్వరం “నీకు నేను ఏమిచేయాలని కోరుతున్నావు?” అని దయగా అడుగుతుంది.DATel 86.5

  యోహాను పరిచర్య ప్రారంభమైనప్పుడు జాతిని ఉద్వేగభరిత వాతావరణం ఆవరించింది. ప్రజలు అసంతృప్తితోనిండి విప్లవానికి పాల్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్కెలాయు తొలగింపు తర్వాత యూదయ ప్రత్యక్షంగా రోము నియంత్రణ కిందకు వచ్చింది. రోమా అధిపతుల నిరంకుశత్వం, బలవంతపు వసూళ్ళు, అన్యమత చిహ్నాల్ని ఆచారాల్ని ప్రవేశపెట్టడానికి వారి ప్రయత్నాలు తిరుగుబాటుకు దారితీశాయి. ఆ తిరుగుబాటును అణచివేయడంలో రోమా అధిపతులు వేలాది ఇశ్రాయేలీయుల్ని బలిగొన్నారు. ఇదంతా ప్రజలు రోమా పరిపాలకుల్ని మరింత ద్వేషించడానికి వారి పరిపాలన నుంచి విముక్తి పొందాలని ఆకాంక్షించడానికి తోడ్పడింది.DATel 87.1

  ఈ అసమ్మతి ఈ సంఘర్షణ నడుమ అరణ్యంలో నుంచి ఒక స్వరం వినిపిస్తోంది. అది భయం పుట్టించే కఠినమైన స్వరం. అయినా అది నిరీక్షణతో నిండిన స్వరం; “పరలోక రాజ్యము సమీపించియున్నది మారుమనస్సు పొందుడి.” ఒక నూతనమైన విచిత్రమైన శక్తి తో అది ప్రజల్ని ఆకట్టుకొంటోంది. యేసు రాక భవిష్యత్తులో ఎప్పుడో సంభవించనున్న ఘటనగా ప్రవక్తలు ప్రవచించారు. అయితే అది దగ్గరలో ఉన్నదని ఇప్పుడు ఈ ప్రకటన తెలుపుతోంది. యోహాను విలక్షణమైన ఆకారం శ్రోతలకు వెనుకటి ప్రవక్తల్ని గుర్తుకు తెచ్చింది. తన పద్దతిలోను వస్త్రధారణలోను యోహాను ఏలియా ప్రవక్తను తలపించాడు. ఏలియా స్ఫూర్తితోను శక్తితోను జాతీయ దుర్నీతిని ఖండించాడు. ప్రబలుతోన్న పాపాల్ని గద్దించాడు. అతని మాటలు స్పష్టంగా సూటిగా, నమ్మకం పుట్టించేవిగా ఉన్నాయి. అనేకులు అతణ్ని మరణించి తిరిగి లేచిన ప్రవక్తల్లో ఒకడిగా భావించారు. ఆ జాతి మొత్తం ఉత్సాహోద్రేకాలతో నిండింది. జనులు తండోపతండాలుగా అరణ్యంలోకి సాగారు.DATel 87.2

  మెస్సీయా రాకను ప్రకటిస్తూ పశ్చాత్తాపపడాల్సిందిగా అతడు ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. పాప శుద్ధికి చిహ్నంగా వారికి యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చాడు. దేవుని ప్రజలుగా ఎంపికయ్యామని చెప్పుకుని ప్రజలంతా పాపంవల్ల అపవిత్రులయ్యారని హృదయసంబంధమైన జీవనసంబంధమైన శుద్ధి లేకుండా ఎవరూ మెస్సీయా రాజ్యంలో స్థానం పొందలేరని ఓ సాదృశ్య పాఠంద్వారా వివరించాడు.DATel 88.1

  ప్రవక్త బోధను వినడానికి అధిపతులు రబ్బీలు సైనికులు సుంకరులు శ్రామికులు ప్రజలు వచ్చారు. దేవుని గంభీర హెచ్చరిక వారికి కొంతకాలం ఆందోళన కలిగించింది. అనేకమంది మారుమనసుపొంది బాప్తిస్మం తీసుకున్నారు. స్నానికుడు ప్రబోధించిన రాజ్యంలో ప్రవేశానికి పొందేందుకు అతడు విధించిన షరతుల్ని పాటించడానికి అన్ని వర్గాల ప్రజలు సమ్మతించారు.DATel 88.2

  శాస్త్రులు పరిసయ్యులు అనేకమంది తమ పాపాల్ని ఒప్పుకుని బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. తమ్మును తాము హెచ్చించుకుని ఇతరులకంటే మంచివారమని తమ భక్తి ఉన్నతమైందన్న భావనను కలిగించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు వారి చీకటి బతుకులు బట్టబయలయ్యాయి. అయితే వారిలో అనేకమందికి యధార్ధమైన పాపాపశ్చాత్తాపం లేదని యోహానుకి పరిశుద్ధాత్మ తెలియపర్చాడు. వారు కపట వర్తనులు. ప్రవక్త సన్నిహితులుగా, రానున్న రాజు అనుగ్రహాన్ని పొందాలన్నది వారి ఎత్తుగడ. పేరుగాంచిన ఈ యువ బోధకుడి వలన బాప్తిస్మం పొందటం ద్వారా ప్రజల్లో తమ ప్రాబల్యాన్ని ఇబ్బడిముబ్బడి చేసుకోవాలని ఆశించారు.DATel 88.3

  యోహోను వారిని ఈ విధంగా విమర్శించాడు, ” సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగినఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మిలో వారు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళవలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను.”DATel 88.4

  ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానం చేసిన నిత్యసముఖానికి యూదులు తప్పుడు భాష్యం చెప్పారు. “పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్రనక్షత్రములను నియమించినవాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన యెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకపోవచ్చు. ఇదే యెహోవా వాక్కు” యిర్మీయా 31:35-37. స్వాభావికంగా తాము అబ్రహాము సంతతి వారైనందువల్ల ఈ వాగ్దానం తమకు మాత్రమే వర్తిస్తోందని యూదులు భావించారు. కాకపోతే దేవుడు నిర్దేశించిన షరతుల్ని వారు విస్మరించారు. ఈ వాగ్దానం చేయకముందు ఆయన ఇలా అన్నాడు. “వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచేదను వారి హృదమముమీద దానిని వ్రాసెదను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడును జ్ఞాపకము చేసికొనను” యిర్మీయా 31:33,34.DATel 89.1

  ఎవరి హృదయాలపై ఆయన తన ధర్మవిధిని రాస్తాడో ఆ ప్రజలకు ఆయన ప్రసన్నత తప్పక లభిస్తుంది. వారు ఆయనతో ఏకమౌతారు. అయితే యూదులు దేవుని నుంచి వేరైపోయారు. తమ పాపాలవల్ల వారు దేవుని తీర్పులకు లోనయ్యారు. వారు అన్యజనులు బానిసలవ్వటానికి హేతువు ఇదే! అతిక్రమం వారి మనసుల్ని అంధకారంతో నింపింది. గతంలో దేవుడు తమపట్ల గొప్ప ఆదరం చూపించాడు గనుక వారు తమ పాపాల్ని తీవ్రంగా పరిగణించలేదు. తాము ఇతరులకంటె మంచివారమని దేవుని దీవెలనకు హక్కుదారులమని పరిగణించారు.DATel 89.2

  “ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంబంధించి యుగాంతమునందున్న మనకు బుద్ధికలుగుటకై వ్రాయబడెను” 1కొరింథీ 10:11. దేవుని దీవెనలకు మనం తరచు తప్పుడు భాష్యం చెప్పి మనలోని ఏదో మంచి వలనే మనకు దేవుని అనుగ్రహం లభిస్తోందని భావిస్తుంటాం. దేవుడు మనకు చేయాలని ఆశించినదాన్ని ఆయన చేయలేకపోతున్నాడు. స్వీయతృప్తిని పెంచుకోటానికి అపనమ్మకంలోను పాపంలోను మన హృదయాల్ని కఠినపర్చుకోటానికి ఆయన వరాలు ఉపయుక్తమౌతుంటాయి.DATel 89.3

  తమ అహంకారం స్వార్ధం క్రూరత్వమే తాము సర్ప సంతానమని చాటుతున్నాయని ఇశ్రాయేలీయుల బోధకులనుద్దేశించి యోహాను ప్రకటించాడు. వారు అబ్రహాము తాలూకు నీతిమంతులు విధేయులు అయిన బిడ్డలు కారు. ప్రజలకు వారొక భయంకర శాపమన్నాడు. తమకు అందిన సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఎవరికన్నా అధికులమని భావిస్తున్నారో ఆ అన్యజనులకన్నా నైతికంగా దిగజారిపోయారని వారిని విమర్శించాడు. తమను ఏ బండనుంచి దేవుడు తొలిచి మలచాడో ఏ గుంటలో నుంచి తమను తవ్వి తీశాడో వారు మర్చిపోయారని నిందించాడు. తన సంకల్పాల నెరవేర్చుకు దేవుడు తమ మీద ఆధారపడలేదు. అన్యజనుల మధ్య నుంచి ఇప్పుడు వారి హృదయాలు అరణ్యంలోని రాళ్లవలె నిర్జీవంగా ఉండవచ్చుగాని తన చిత్తం నెరవేర్చి తన వాగ్దాన నెరవేర్పును పొందేందుకుగాను ఆయన ఆత్మ వాటిని జీవంతో నింపుతుంది.DATel 90.1

  ప్రవక్త ఇలా హెచ్చరించాడు, “ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.” దాని వేరును బట్టి కాక అది ఫలించేఫలాల్ని బట్టి చెట్టు విలువ ఉంటుంది. పండ్లు ఉపయోగం లేనివైతే చెట్టువేరు ఆచెట్టు ధ్వంసం కాకుండా కాపాడలేదు. వారి జీవితం ప్రవర్తన దేవుని చిత్తానికి అనుగుణంగా లేకపోతే వారు ఆయన ప్రజలు కానేరరు.DATel 90.2

  గుండెల్లోకి చొచ్చుకుపోయే అతని మాటలు శ్రోతల్లో విశ్వాసం పుట్టించాయి. “ఆలాగైతే మేమేమి చేయవలెను?” అంటూ తన వద్దకు జనులు రాగా “రెండు అంగీలు కలవాడు ఏమియులేని వానికియ్యవలెననియు ఆహారము గలవాడును అలాగు చేయవలెననియు” వారికి సమాధానం ఇచ్చాడు. ఇంకా అన్యాయం చెయ్యవద్దని సుంకరుల్ని దౌర్జన్యం చెయ్యవద్దని సైనికుల్ని హెచ్చరించాడు.DATel 90.3

  క్రీస్తురాజ్య పౌరులైన వారందరు మారుమనసు పొంది క్రీస్తును విశ్వసించారనటానికి నిదర్శనం చూపిస్తారు. వారి జీవితాల్లో దయ, నిజాయితీ, విశ్వసనీయత కనిపిస్తాయి. వారు అవసరార్డులికి సేవలందిస్తారు. ప్రభువుకు కానుకలర్పిస్తారు. బలహీనుల్ని కాపాడారు. సత్ప్రవర్తన విషయంలోను దయ, కనికరాల విషయంలోను ఆదర్శంగా నివసిస్తారు. ఈ విధంగా క్రీస్తు అనుచరులు పరిశుద్ధాత్మ నిర్వహించే పరివర్తన శక్తికి నిదర్శనంగా నిలుస్తారు. వారి దైనందిన జీవితంలో న్యాయశీలత కరుణ దైవసంబంధిత ప్రేమ కనిపిస్తాయి. ఇది లేకపోతే వారు కాల్చివేయాల్సిన పోట్టులా మిగిలిపోతారు.DATel 91.1

  యోహాను ఇలా అంటున్నాడు, “మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన పరిశుద్దాత్మలోను అగ్నిలోను నాకు బాప్తిస్మమిచ్చును.” మత్త 3:11. తన ప్రజల పాపాల్ని ప్రభువు, “తీర్పుతీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మవలను” “కడిగివేస్తాడని యెషయా ప్రవక్త అంటున్నాడు. ఇశ్రాయేలుకి దేవుని సందేశం ఇది: “నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసెదను.” యెషయా 4:4; 1:25; పాపం ఎక్కడున్నా దానికి “మన దేవుడు దహించు అగ్నియైయున్నాడు” హెబ్రీ 12:29; ఆయన శక్తికి తమ్మును తాము సమర్పించుకునే వారందరిలోను దేవుని ఆత్మ పాపాన్ని దహించే శక్తిలా ఉంటుంది. కాగా మనుషులు పాపానికి అంటి పట్టుకుని ఉంటే వారు దానిలో భాగమౌతారు. అప్పుడు పాపాన్ని దహించి వేసే దైవమహిమ దానితోపాటు వారిని కూడా దహించి వేయకతప్పదు. దూతతో రాత్రంతా పోరాడిన అనంతరం యాకోబు ఇలా అన్నాడు: ” నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. అయినను నాప్రాణము దక్కినది. ” ఆది 32:30; ఏశావుపట్ల తన ప్రవర్తన విషయంలో యాకోబు ఘోరపాపం చేశాడు. కాని దానినిమిత్తం అతడు పశ్చాత్తాపపడ్డాడు. అతడి అతిక్రమానికి క్షమాపణ లభించింది. అతడి పాపం తుడుపు పడింది. అందుచేత అతడు దైవసన్నిదిని తాళగలిగాడు. అయితే పాపాన్ని మనసులో ఉంచుకుని మనుషులు ఎక్కడ దైవసన్నిధిలోకి వస్తే అక్కడ నాశనమయ్యారు. క్రీస్తు రెండో రాకడ సమయంలో దుష్టులు ఆయన “నోటి యావిరి చేత” ఆయన “ఆగమన ప్రకాశముచేత” నాశనమవుతారు. 2 థెస్స 2: 8. నీతిమంతులకు జీవమునిచ్చే దేవుని మహిమ ప్రకాశం దుష్టుల్ని హతమార్చుతుంది.DATel 91.2

  బాప్తిస్మమిచ్చే యోహాను కాలంలో దేవుని ప్రవర్తనను ప్రత్యక్షపర్చే వ్యక్తిగా దర్శన మివ్వటానికి లోకంలోకి రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సమక్షమే మనుషులికి తమ పాపాల్ని ప్రదర్శించనున్నది. మనుషులు తమ పాపాల నుంచి ప్రక్షాళన పొందటానికి సన్నద్ధంగా ఉన్నప్పుడే వారు ఆయనతో సహవాసం చేయగల్గుతారు. హృదయశుద్ధిగలవారు మాత్రమే ఆయన సముఖంలో ఉండగలుగుతారు.DATel 92.1

  స్నానికుడు దైవవర్తమానాన్ని ఈ విధంగా ప్రకటించాడు. అతని ఉపదేశాన్ని అనేకులు పాటించారు. దాన్ని ఆచరించే కృషిలో అనేకులు తమకున్నదంతా త్యాగం చేశారు. ఈ నూతన బోధకుడు ఎక్కడకువెళ్తే అక్కడ జనసమూహాలు అతణ్ని వెంబడించాయి. అనేకులు అతడే మెస్సీయా అని భావించారు. అయితే ప్రజలు తనను వెంబడించటంచూసి యోహాను వారి విశ్వాసాన్ని రానున్న ప్రభువుపై కేంద్రీకరించటానికి ప్రతీ తరుణాన్ని వినియోగించుకోటానికి ప్రయత్నించాడు.DATel 92.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents