Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  49—పర్ణశాలల పండుగలో...

  సంవత్సరంలో మూడుసార్లు యూదులంతా యెరూషలేములో విధిగా మత సంబంధంగా సమావేశమయ్యేవారు. ఇశ్రాయేలు అదృశ్యనాయకుడు మేఘస్తంభంలో నుంచి ఈ సమావేశాల గురించి ఆదేశాలిచ్చాడు. యూదుల దాస్యకాలంలో ఈ సమావేశాలు జరగలేదు. కాని ఆ ప్రజలు తమ దేశానికి తిరిగి వెళ్లినప్పుడు ఈ స్మారక సమావేశాల ఆచరణ మళ్లీ ప్రారంభమయ్యింది. తనను ప్రజలు మర్చిపోకుండా ఉండేందుకు దేవుడు ఈ సాంవత్సరిక సమావేశాల్ని సంకల్పించాడు. దాదాపు యాజకులు దేశనాయకులందరు ఈ ఉద్దేశాన్ని విస్మరించారు. ఈ జాతీయ సమావేశాల ప్రాముఖ్యాన్ని గుర్తించి వాటిని ఏర్పాటు చేసిన ప్రభువు వారి వక్ర బుద్ధిని చూశాడు.DATel 493.1

  పర్ణశాలల పండుగ సంవత్సరంలో చివరి సమావేశం. ఈ సమయంలో ప్రజలు తన దయాళుత్వాన్ని కృపను గురించి ఆలోచించాలన్నది దేవుని సంకల్పం. దేశమంతా ఆయన నడుపుదలను దీవెనల్ని పొందుతోంది. రాత్రనక పగలనక ఆయన శ్రద్ధాసక్తులు వారిపై ఉంటోన్నాయి. ఎండ వానలు భూమి ఫలసాయాన్నివ్వడానికి తోడ్పడ్డాయి. పాలస్తీనా దేశం లోయలనుంచి మైదాన ప్రాంతాలనుంచి ప్రజలు పంటల్ని సమకూర్చుకున్నారు. ఒలీవ పంటను కూర్చుకుని సీసాల్ని ప్రశస్తమైన ఒలీవ నూనెతో నింపుకున్నారు. అంజూరపంట సమృద్ధిగా పండి చేతికి వచ్చింది. కుంకుమ రంగు ద్రాక్షా గెలలు గానుగల్లో వేసి రసం సమకూర్చుకున్నారు.DATel 493.2

  అది ఏడు రోజులు కొనసాగే పండుగ. దానికి పాలస్తీనా నుంచి ఇంకా అనేక ఇతర ప్రాంతాలనుంచి ప్రజలు యెరూషలేముకి వచ్చేవారు. పరిసర ప్రాంతాల్నుంచి దూర ప్రదేశాల్నుంచి ప్రజలు వచ్చేవారు. వారి చేతుల్లో ఆనందాన్ని సూచించే చిహ్నాలుండేవి. పెద్దవారు పడుచువారు ధనికులు పేదలు అందరూ ఏదో కృతజ్ఞతార్పణ తెచ్చేవారు. సంవత్సరం పొడుగున తమకు మేలు చేసి సమృద్ధిగా పంటలనిచ్చిన ప్రభువుకి ఆ అర్పణల్ని సమర్పించేవారు. కంటికి ఇంపుగా ఉండేవాటిని సర్వత్రా సంతోషానందాల్ని నింపేవాటిని అడవుల్నుంచి తెచ్చేవారు. వాటితో ఆ నగరం అడవి అందచందాల్ని సంతరించుకునేది.DATel 493.3

  ఇది పంటల సందర్భంగా కృతజ్ఞత సమర్పణ పండుగే కాదు. ఇశ్రాయేలు ప్రజల అరణ్య సంచార కాలంలో దేవుని కాపుదల సంరక్షణ జ్ఞాపకార్ధంగా ఆచరించిన పండుగ కూడా. తమ డేరాల జీవితం జ్ఞాపకార్థంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ పండుగ సమయంలో పచ్చని చెట్టు కొమ్మలు తీగెలతో కట్టిన కుటీరాల్లో లేదా గుడారాల్లో నివసించారు. వీటిని వీధుల్లోను ఆలయ ప్రాంగణంలోను లేదా ఇళ్లపైకప్పులు మీద నిర్మించుకునేవారు. యెరూషలేము చుట్టూ కొండల మిద లోయల్లోను ఈ కుటీరాలు వెలసి జనులతో సందడిగా ఉండేవి.DATel 494.1

  పరిశుద్ధ గానంతోను కృతజ్ఞతార్పణలతోను ఆరాధకులు ఈ పండుగను జరుపుకునే వారు. ఆరోజు ప్రజలు తమ పాపాల్ని ఒప్పుకున్న దరిమిలా దేవునితో సమాధాన పడేవారు. పండుగలో సంతోషించడానికి ప్రజలకి మార్గం సుగమమయ్యేది. “యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును.” (కీర్త 106:1) అంటూ ప్రజలు పాడగా హోసన్నా కేకలతో మిళితమైన నానావిధ సంగీతం ఆ సంయుక్త గానానికి నేపథ్యమయ్యింది. బలి అర్పణ ఆచారాలు ఇక్కడ ఘనంగా సాగాయి. ఇక్కడ ఆలయం తాలూకు తెల్లని పాలరాతి మెట్లకు రెండు పక్కలా లేవీయగాన బృందం పాటలు పాడింది. ఆరాధక జన సందోహం అంజూరపు మట్టలు, గొంజి చెట్టుకొమ్మలు ఊపుతూ ఆపాట పల్లవిని అందుకుని ప్రతిధ్యనించింది. దగ్గరలోను దూరంగాను ఉన్న జనుల స్వరాలు ఆ పాటను అందుకోడంతో చుట్టూ ఉన్న కొండలు ఆ స్తుతిగానంతో నిండిపోయాయి.DATel 494.2

  రాత్రిపూట ఆలయం దాని ఆవరణం దీపకాంతిలో ధగధగమెరిశాయి. సంగీతం, మట్టలు కొమ్మలు ఊపడం, ఉత్సాహహోసన్నా నినాదాలు విస్తార జనసమూహాలు, వెళాడ్తోన్న దీపాల నుంచి వారి మిద పడ్తోన్న వెలుగు, యాజకుల విన్యాసం, ఆచారాల ఔన్నత్యం వెరసి ఆ దృశ్యం చూపరులికి కనువిందు చేసింది. కాగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్య సంచారంలో ఒక ఘటనను జ్ఞాపకం చేస్తూ గొప్ప ఆనందం కలిగించే ఓ ఆచారం ఆ పండుగ అంతటి లోనూ మిక్కిలి ఆకర్షణీయమైన ఆచారం.DATel 494.3

  తొలివేకువలో యాజకులు తమ వెండి బూరలతో సన్నటి లోతైన శబ్దంతో దీర్ఘంగా ఊదారు. వాటికి ప్రతిస్పందిస్తూ ప్రజలు తమ కుటీరాల నుంచి తమ బూరలతో ధ్వనిచేస్తూ పండుగ దినాన్ని స్వాగతించారు. అంతట యాజకుడు ప్రవహిస్తోన్న కిద్రోను వాగులో బుడ్డిని ముంచి, బాకాలు మోగుతున్నప్పుడు దాన్ని పైకెత్తి పట్టుకుని “యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మమలలో నిలుచుచున్నవి.” (కీర్త 122:2) అని పలుకుతూ సంగీతంతో లయ కలుపుతూ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆలయం విశాలమైన మెట్టు ఎక్కాడు.DATel 495.1

  ఆబుడ్డిని యాజకుల ఆవరణంలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించిన బలిపీఠం వద్దకు అతడు మోసుకువెళ్లాడు. ఇక్కడ రెండు వెండి పళ్లాలున్నాయి. ఒక్కోదాని పక్క ఒక యాజకుడు నిలబడ్డాడు. ఆ బుడ్డిలోని నీళ్లు ఒక పళ్లెంలో తక్కిన బేసినులో ఒక బుడ్డి ద్రాక్షారసం పోశారు. ఆ రెంటిలో ఉన్న నీరు ద్రాక్షారసం ఓ పైపు లోకి ప్రవహించాయి. అది కిద్రోను వాగులో కలిసి చివరికి మృత సముద్రంలో కలిసింది. ఈ పరిశుద్ధ జల ప్రదర్శన దేవుని ఆజ్ఞమేరకు ఇశ్రాయేలు ప్రజల దాహార్తిని తీర్చడానికి బండలోనుంచి ప్రవహించిన ఏరును సూచిస్తోంది. అప్పుడు “యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము” “కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు” అంటూ ఉత్సాహభరితమైన స్తోత్రం మారుమోగింది.DATel 495.2

  యేసేపు కుమారులు పర్ణశాలల పండుగకు వెళ్లడానికి సిద్ధపడ్తోండగా, క్రీస్తుకి అక్కడకు వెళ్లే ఉద్దేశం లేనట్లు వారు గమనించారు. ఆయన్ని ఆందోళనతో గమనించారు. బేతెస్ధలో జరిగిన స్వస్తత అనంతరం ఈ జాతీయ సమావేశానికి ఆయన హాజరు కాలేదు. యెరూషలేములోని నాయకులతో సంఘర్షణను నివారించేందుకు ఆయన తన పరిచర్యను గలిలయకు పరిమితం చేసుకున్నాడు. ఆ ప్రసిద్ధ మత సమావేశాల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిండం, యాజకులు రబ్బీలు ఆయన పట్ల చూపిస్తోన్న వ్యతిరేకత ఆయన విషయంలో ప్రజలు ఆ మాట కొస్తే క్రీస్తు శిష్యులు ఆయన బంధువులు గలిబిలి పడడానికి కారణమయ్యింది.. తన బోధల్లో ఆయన దైవధర్మశాస్త్రానికి విధేయంగా జీవించడం ద్వారా దీవెనులు మెండుగా కలుగుతాయని చెప్పాడు. అయినా ఆయనే దేవుడు స్థాపించిన ఈ సేవను నిర్లక్ష్యం చేస్తోన్నాడు. సుంకరులతోను చెడ్డవారైన ఇతరులతోను ఆయన కలిసిమెలిసి ఉండడం రబ్బీల ఆచారాల్ని లెక్క చెయ్యకపోవడం సబ్బాతు విషయంలో సంప్రదాయ విధుల్ని అడ్డు అదుపు లేకుండా తోసిపుచ్చడం ఇవన్నీ మతాధికారులికి ఆయన వ్యతిరేకి అన్న అభిప్రాయం పుట్టించాయి. ఆయన్ని ప్రశ్నించడానికి దారితీశాయి. దేశంలోని ప్రముఖలు విద్యావంతుల్ని ఆయన దూరం చేసుకోడం పొరపాటని ఆయన సహోదరులు భావించారు. ఈ వ్యక్తుల ఆలోచనే సరి అయిందై ఉంటుందని వారిని వ్యతిరేకించడంలో యేసే తప్పు చేస్తోన్నడన్నది వారి భావన. ఇలాగుండగా వారు ఆయన నిందారహిత జీవితాన్ని చుశారు. వారు ఆయన శిష్యులతో సరితూగకపోయినా ఆయన చేస్తోన్న కార్యాలు వారిని ఆకట్టుకున్నాయి. గలిలయలో ప్రస్ఫుటమైన ఆయన ప్రజాభిమానం వారి ఆశలు ఆకాంక్షల్ని బలపర్చింది. ఆయన తన అధికారానికి నిదర్శనాన్నిస్తాడని అది పరిసయ్యులికి కనువిస్సు కలిగించి తాను చెప్పినట్లే ఆయన మెస్సీయా అని వారు గుర్తించేటట్లు చేస్తుందని వారింకా ఆశించారు. ఆయన ఇశ్రాయేలు రాజైన మెస్సీయాయేమో! ఈ విధంగా ఊహించుకుంటూ వారు అతిశయంతో కూడిన తృప్తిని పొందారు.DATel 495.3

  ఈ విషయమై వారు ఎంత ఆత్రంగా ఉన్నారంటే వారు యేసుని • యెరూషలేముకు వెళ్లమంటూ విజ్ఞప్తి చేశారు. “నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము. బహిరంగమున అంగీకరింపబడ గోరు వాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న యెడల నిన్నునీవే లోకమునకు కనపరచుకొనుము” అని వారన్నారు. “చేయుచున్న యెడల” అన్నపద బంధంలో సందేహం అవిశ్వాసం ధ్వనిస్తోంది. వారు ఆయనకి పిరికితనాన్ని దౌర్బల్యాన్ని అంటగట్టారు. మెస్సీయాను తానేనని ఎరిగినప్పుడు ఈ మౌనం ఈ నిష్క్రియాపర్వతం దేనికి? ఆయనకు నిజంగా ఆ శక్తి ఉంటే ధైర్యంగా యెరూషలేముకు వెళ్లి తన హక్కుల్ని ఎందుకు సొంతం చేసుకోకూడదు? గలిలయలో తాను చేసినట్లు వినవస్తోన్న అద్భుతాల్ని యెరూషలేములో ఎందుకు చెయ్యకూడదు? చాటుమాటుగా ఆయా ప్రాంతాల్లో ఉందవద్దు, అజ్ఞానులైన శ్రామికులు జాలరుల ప్రయోజనార్థం నీ మహత్కార్యాములు చేయమని వారు అన్నారు. రాజధానికి వెళ్లు, యాజకులు ప్రధానుల మద్దతుపొంది నూతన రాజ్య స్థాపనలోల జాతిని సమైక్య పర్చు అన్నారు.DATel 496.1

  యేసు తాలూకు ఈ సహోదరులు స్వార్థ ప్రయోజనం దృష్టితో ఆలోచించారు. ప్రదర్శించుకోడమంటే చెవికోసుకునే వారు తరచు ఇలాగే ఆలోచిస్తారు. ఈ స్వభావమే ప్రపంచంలో రాజ్యమేలుతోంది. లౌకికి సింహాసనాన్ని ఎంపిక చేసుకునే బదులు క్రీస్తు తనను తాను జీవాహారంగా ప్రకటించుకున్నందుకు వారు ఎంతో నొచ్చుకున్నారు. ఆయన శిష్యుల్లో అనేక మంది ఆయన్ని విడిచి పెట్టి వెళల్లిపోయినప్పుడు వారు నిరాశ చెందారు. ఆయన కార్యాలు బయలుపర్చినట్లు ఆయన దేవుడు పంపిన వాడన్న గుర్తింపును వ్యక్తం చెయ్యకుండా ఆయన నుంచి వీరే తొలగిపోయారు.DATel 497.1

  “యేసు - నా సమయమింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణము కాలేదు. గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను. ఆయన వారితో ఈ లాగున చెప్పి గలిలయలోనిలిచిపోయెను.” ఆయన సహోదరులు తమ అధికారం ప్రదర్శించుకుంటూ ఆయన అనుసరించాల్సిన మార్గాన్ని శాసిస్తూ మాట్లాడారు. వారి మందలింపును తిప్పికొడుతూ వారిని త్యాగశీలురైన తన శిష్యులతో గాక లౌకికులతో వర్గీకరించాడు. ఆయన ఇలా అన్నాడు, “లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ” లోకం తనలాంటి స్వభావం ఉన్నవారిని ద్వేషించదు. తనకులాగే వారిని ప్రేమిస్తుంది.DATel 497.2

  లోకం క్రీస్తుకి సుఖమైన స్థలంగాని ఆత్మాభివృద్ధికి అనువైన స్థలంగాని కాదు. లోకాధికారాన్ని లోక మహిమను చేజిక్కించుకోడానికి ఆయన ఎదురు చూడలేదు. తండ్రి ఆయన్ని లోకంలోకి పంపాడు. లోకానికి జీవాన్ని వ్యడానికి విమోచన ప్రణాళికను అమలు పర్చడానికి దేవుడు ఆయన్ని అనుగ్రహిచాడు. పాపులైన మానవాళి పక్షంగా ఆయన తన పనిని నిర్వహిస్తోన్నాడు. ఆయన దురభిమానానికి తావియ్యకూడదు. తొందరపడి అపాయానికి గురి కాకూడదు. క్లిష్ట పరిస్థితిని సృష్టించకూడదు. ఆయన సేవలో ప్రతి సంఘటనకు నియమిత గడియ ఉంది. దానికోసం ఆయన ఓపికగా వేచి ఉండాలి. తాను లోకం ద్వేషానికి గురి అవుతానని ఆయనకు ముందే తెలుసు. తన పరిచర్య తన మరణానికి దారి తీస్తుందని ఆయనకు ముందే తెలుసు. కాని అకాలంగా తన్నుతాను బయట పెట్టుకోడం ఆయన తండ్రి చిత్తం కాదు.DATel 498.1

  క్రీస్తు చేస్తోన్న అద్భుతాల్ని గురించిన నివేదిక యెరూషలేము నుంచి యూదులు ఏఏ ప్రాంతాల్లో చెదిరి ఉన్నారో అక్కడ వరకు విస్తరించింది. చాలా మాసాలుగా ఆయన పండుగలకు హాజరు కాకపోయినా ఆయన పై ప్రజల ఆ సక్తి తగ్గలేదు. ప్రపంచం అన్ని ప్రాంతాల నుంచి అనేకులు ఆయన్ని చూడవచ్చునన్న ఆశాభావంతో పర్ణశాలల పండుగకు వచ్చారు. పండుగ ఆరంభంలో ఆయన్ని గురించి చాలా మంది విచారణ చేశారు. పరిసయ్యులు ప్రధానులు ఆయన్ని తప్పుపట్టాలన్న ఉద్దేశంతో ఆయన రాకకై ఎదురు చూశారు. వారు “ఆయన ఎక్కడ?” అని ప్రశ్నించారు. కాని ఆయన ఆచూకీ ఎవ్వరికీ తెలియలేదు. అందరి మనసుల్లోను ఆయన్ని గురించిన తలంపే ఉంది. యాజకులు ప్రధానులకి జడిసి ఆయన్ని ఎవ్వరూ మెస్సీయాగా గుర్తించడం లేదు. కాని ప్రతీ చోట గుట్టుచప్పుడు కాకుండా ఆయన్ని గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆయన దేవుని వద్ద నుంచి వచ్చినవాడని అనేకులు సమర్ధించగా ఇతరులు ఆయన మోసగాడని విమర్శించారు.DATel 498.2

  ఇంతలో యేసు గుట్టుచప్పుడు. కాకుండా యెరూషలేము చేరాడు. అన్ని ప్రాంతాల నుంచి యెరూషలేముకు వచ్చే ప్రయాణికుల రద్దీ ఆట్టేలేని మార్గాన్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. పండుగకి వెళ్లే ప్రయాణిక బృందాల్లో చేరి ప్రయాణిస్తే ఆయన నగరంలో ప్రవేశించేసరికి ప్రజలు ఆయనకు అనుకూలంగా ఊరేగింపులు ఏర్పాటు చెయ్యడం అవి అధికారుల్ని ఆయనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం జరిగేది. ఈ కారణం చేతనే ఆయన ఒంటిరిగా ప్రయాణం చెయ్యడానికి ఎంపిక చేసుకున్నాడు.DATel 498.3

  పండుగ మధ్యలో ప్రజల్లో ఆయన్ని గూర్చిన ఉత్సాహోద్రేకలు పెల్లుబుకుతున్నప్పుడు జనసమూహాలు చూస్తుండగా ఆయన ఆలయ ఆవరణలో ప్రవేశించాడు. పండుగలో ఆయన లేనందువల్ల ఆయన యాజకులు ప్రధానుల అధికారానికి భయపడి రాడని చాలామంది భావించారు. ఆయన్ని చూసి అందరూ దిగ్ర్భాంతిపడ్డారు. ఎవ్వరూ మాట్లాడలేదు. తన ప్రాణం తియ్యడానికి తృష్ణగొంటోన్న ప్రాబల్యం గల శత్రువుల నడుమ ఆయన హుందాతనాన్ని, ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు.DATel 499.1

  ఆ జనసమూహం దృష్టిని ఆకర్షిస్తూ అలా నిలబడి యేసు వారినుద్దేశించి మాట్లాడాడు. ఆయన మాటలు ఇశ్రాయేలు చట్టాల గురించి, వ్వవస్థల గురించి బలి అర్పణ సేవను గురించి, ప్రవక్తల బోధన గురించి ఆయన అపార జ్ఞానాన్ని వెల్లడి చేశాయి. ఆయన జ్ఞానం యాజకులు రబ్బల జ్ఞానంకన్నా ఎంతో విస్తారమైంది. పారంపర్యాచరాలు సంప్రదాయాలు నిర్మించిన అడ్డు గోడల్ని ఆయన పడగొట్టాడు. భవిష్యజ్జీవిత దృశ్యాలు ఆయన ముందు విస్తరించినట్లు కనిపించింది. అదృశ్య దేవున్ని చూసిన వాడిగా ఆయన భూలోక, పరలోక, మానవ దైవసంబంధిత విషయాల గురించి అధికారంతో మాట్లాడాడు. ఆయన పలికిన మాటలు అతిస్పష్టంగా విశ్వసనీయంగా ఉన్నాయి. మళ్లీ కపెర్నహోములోలాగే ప్రజలు ఆయన బోధవిని విస్మయం చెందారు. ఎందుకంటే “ఆయన వాక్యము అధికారమతో కూడినదై యుండెను.” లూకా 4:32. తాను ఇవ్వవచ్చిన దీవెనల్ని తోసిపుచ్చిన వారికి సంభవించే విపత్తును గురించి వేర్వేరు సూచనల ద్వారా ఆయన హెచ్చరించాడు. తన స్వజాతి ప్రజలు చేయనున్న క్రియ తాలూకు అపరాధం నుంచి వారిని రక్షించగలిగితే వారు ఆయన్ని విసర్జించి హత్య చేసే వారు కాదు.DATel 499.2

  ధర్మశాస్త్రం గురించి ప్రవచనాల గురించి ఆయన జ్ఞానం విషయంలో అందరూ ఆశ్చర్యపడ్డారు. “చదువుకొనని ఇతనికి ఈ పాండిత్మమెట్లు వచ్చెను?” అని ఒకరికి ఒకరు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు. రబ్బీల పాఠశాలల్లో విద్యనభ్యసించని వారెవరూ చదువుకున్నట్లు పరిగణన పొందేవారు కాదు. యేసు, బాప్తిస్మమిచ్చే యోహాను ఈ విద్యను అభ్యసించలేదు గనుక వారిని విద్యలేని వారని వ్యవహరించేవారు. వారి బోధలు విన్నవారు “చదువుకొనని” వారి లేఖన జ్ఞానానికి విస్మయం చెందారు. వాస్తవానికి అది వారి సొంత జ్ఞానం కాదు. పరలోకమందున్న దేవుడే వారి బోధకుడు. ఆయన నుంచే వారు అత్యున్నత జ్ఞానాన్ని పొందారు.DATel 500.1

  యేసు ఆలయ ఆవరణలో మాట్లాడినప్పుడు ప్రజలు ఆశగా విన్నారు. తనకు తీవ్ర వ్యతికేకత వ్యక్తం చేసినవారే ఆయనకు హాని కలిగించడానికి శక్తి శూన్యులయ్యారు. ప్రస్తుతానికి తక్కిన ఆసక్తులన్నీ మర్చిపోయారు.DATel 500.2

  ఆయన దినదినం ప్రజలకు బోధ చేశాడు. ఆయన ” ఆ పండుగలో మహాదినము వరకు” బోధచేశాడు. దీర్ఘమైన పండుగ కాలం మూలాన ఈ దినం ఉదయానికి ప్రజలు అలసిపోయారు. హఠాత్తుగా యేసు గళమెత్తి మాట్లాడనారంభించాడు. ఆలయ ఆవరణమంతా వినిపిస్తోన్న స్వరం అది.DATel 500.3

  “ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వసించువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవనదులు పారురును.” ప్రజల పరిస్థితి ఈ విజ్ఞప్తికి బలం చేకూర్చింది. వారు ఆడంబరం వైభవంతో నిండిన పండుగలో మునిగి ఉన్నారు. వారి కళ్లు ప్రకాశవంతమైన వెలుగుతో రంగులతో జిగేలు మంటోన్నాయి. వారి చెవులికి శ్రావ్యమైన సంగీతం విందు చేస్తోంది. కాని ఆత్మకు అవసరమైంది, నశించని దానికై ఆత్మ తృష్ణను తృప్తిపర్చేది, ఈ . ఆచారాలు సంస్కారాలన్నిటి లోను ఏదీలేదు. జీవపు ఊటనుంచి తాగవలసిందిగా యేసే వారిని ఆహ్వానించాడు. అది వారిలో నిత్యజీవజలాలు ప్రవహించే బావిగా ఉంటుందని చెప్పాడు.DATel 500.4

  అరణ్యంలో బండను కొట్టడాన్ని జ్ఞాపకం చేసే ఆచారాన్ని యాజకుడు ఆ ఉదయం జరిపించాడు. దప్పిగొన్న వారందరికి ఎవరు తన మరణం ద్వారా రక్షణ జీవజలాల నదులు ప్రవహింజేస్తారో ఆ ప్రభువుకి ఆ బండ సంకేతం. క్రీస్తు మాటలే జీవజలం. అక్కడ సమావేశమైన జనసమూహాల సమక్షంలో ప్రవంచానికి జీవజలం ప్రవహించేందుకు కొట్టబడడానికి ఆయన తన్నుతాను ప్రత్యేకించుకున్నాడు. క్రీస్తుని కొట్టడంలో సాతాను జీవాధిపతిని నాశనం చెయ్యాలనుకున్నాడు. అయితే కొట్టబడ్డ ఆ బండనుంచి జీవజలం వ్రవహించింది. యేసు ప్రజల్లో అలా మాట్లాడున్నప్పుడు వారి హృదయాలు విచిత్రమైన భయంతో ఉత్సహించాయి. “నేను దప్పిగొనకుండునట్లు... ఆనీళ్లు నాకు దయ చేయము.” అంటూ ఆ సమరయ స్త్రీతో గొంతు కలపడానికి అనేకులు సిద్ధంగా ఉన్నారు. (యోహాను 4:15)DATel 500.5

  ఆత్మలోటులు ఏంటో యేసుకు తెలుసు. వైబోగం, ధనం, ప్రతిష్ఠ హృదయాన్ని తృప్తి పర్చలేవు. ” ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.” గొప్పవారు, పేదవారు, అధికులు సామాన్యులు అందరూ రావచ్చు. హృదయ భారంగలవారికి ఉపశమనం కలిగిస్తానని దుఃఖించే వారిని ఓదార్పు తానని నిరాశ చెందినవారికి నిరీక్షణ నిస్తావని ఆయన వాగ్దానం చేస్తోన్నాడు. యేసు బోధను విన్న వారిలో అనేకులు ఆశాభంగం చెంది దుఃఖిస్తోన్నారు. అనేకులు రహస్య విచారంతో కుమిలిపోతోన్నారు. అనేకులు నెమ్మదిలేని తమ ఆత్మల్ని సుఖభోగాలతో మనుషుల పొగడ్తలతో తృప్తి పర్చుకోవాలని ప్రయత్నిస్తోన్నారు. కాని అంతా అయిపోయిన తర్వాత దాహం తీర్చలేని పగిలిపోయిన తొట్లను చేరడానికే తాము ఇంత కాలం శ్రమించామని వారు గుర్తించారు. ఆ ఉత్సాహభరితమైన దృశ్యం తళుకు బెళుకులు నడుమ వారు నిరాశతో విచారంతో నిలబడి ఉన్నారు. “ఎవడైనను దప్పిగొనిన యెడల” అన్నమాటలు వారిని తమ ధ్యానంలోనుంచి కుదిపివేశాయి, ఇంకా ఆ మాటల దిశగా వారిలో నూతన నిరీక్షణ రగుల్కున్నది. పరిశుద్ధాత్మ ఆ సంకేతాన్ని వారి ముందుంచాడు. దానిలో వారు అమూల్యమైన రక్షణ వరాన్ని చూసేవరకు దాన్ని వారి ముందుంచాడు.DATel 501.1

  దప్పిగొన్న ఆత్మనుద్దేశించి క్రీస్తు అన్న మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆలయంలో పండుగ చివరి దినాన విన్నవారికన్నా మరింత శక్తితో ఆ మాటలు మనకు విజ్ఞప్తి చేస్తోన్నాయి. రక్షణ జలధారనుంచి తాగడానికి అందరూ ఆహ్వానితులే. అలసిఉన్న ఆత్మలు నిత్యజీవజలం తాగి సేదదీరవచ్చు. “ఎవడైనను దప్పి గొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చు కొనవలెను.” “దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్చయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” “నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై దానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును” అంటూ యేసు ఇంకా ఆహ్వానిస్తోన్నాడు. ప్రకటన 22:19; యోహాను 4:14;DATel 501.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents