Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  37—తొలి సువార్త సేవకులు

  అపొస్తలులు యేసు కుటుంబ సభ్యులు. ఆయన గలిలయ అంతట కాలినడకన తిరిగినప్పుడు వారు ఆయనతో వెళ్లారు. ఆయన కృషిలోను కష్టాల్లోను వారు పాలుపంచుకున్నారు. ఆయన ఉపదేశాలు విన్నారు. ఆయనతో కలిసి నడిచారు. మాట్లాడారు. మానవాళి ఉద్దరణకు ఎలా కృషి చేయ్యాలో ఆయన అనుదిన ఉపదేశం నుంచి నేర్చుకున్నారు. తన చుట్టూ మూగే జనాలకు యేసు పరిచర్య చేస్తుండగా, శిష్యులు ఆయన దగ్గర ఉండి ఆయన చెప్పిన పనులు చేసి ఆయన కార్యభారాన్ని తగ్గించేవారు. ప్రజల్ని వరుసలో పెట్టడం, వ్యాధి బాధితుల్ని రక్షకుని వద్దకు తీసుకురావడం, అందరికి సౌకర్యాలు కల్పించడం వంటి కార్యాలు నిర్వహించేవారు. ఆసక్తిగా వినేవారిని కనిపెట్టి వారికి లేఖనాలు వివరించేవారు. ఇంకా అనేక రీతుల్లో ప్రజల ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడేవారు. వారు యేసు వద్ద నేర్చుకున్న సత్యాల్ని ప్రజలకు నేర్పేవారు. ఇలా రోజుకు రోజు విలువైన అనుభవం గడించేవారు. కాగా ఒంటరిగా పని చెయ్యడానికి వారికి అనుభవం కూడా అవసరం. వారికి ఇంకా ఉపదేశం, ఎంతో ఓర్పు, కనికరం అవసరం. ఇప్పుడు వ్యక్తిగతంగా వారి పొరపాట్లను ఎత్తి చూపించడానికి సలహాలివ్వడానికి తప్పులు సవరించడానికి రక్షకుడు వారితో ఉండగా వారిని తన ప్రతినిధులుగా పంపాడు.DATel 378.1

  శిష్యులు ప్రభువుతో ఉన్నప్పుడు యాజకులు పరిసయ్యుల బోధనలతో వారు తరచు తికమకపడుతుండేవారు. సంప్రదాయానికి భిన్నంగా లేఖన సత్యాల్ని ఆయన శిష్యుల ముందు పెట్టాడు. ఇలా దేవుని వాక్యం విషయంలో వారి విశ్వాసాన్ని పటిష్ఠపర్చి రబ్బీల భయం నుంచి, సంప్రదాయానికి బానిసత్వం నుంచి వారిని చాలా మట్టుకు విముక్తుల్ని చేశాడు. శిష్యుల శిక్షణ విషయంలో సిద్ధాంతాలపై ఉపదేశం కన్నా రక్షకుని ఆదర్శం ఎంతో శక్తి ముంతంగా ఉంది. ఆయన ఇక వారి మధ్య లేనప్పుడు ప్రతీ చూపు, ఆధోరణి, మాట వారికి జ్ఞప్తికి వచ్చేది. తరచు సువార్త విరోధుల్తో ఘర్షణ వచ్చినప్పుడు వారు ఆయన మాటల్ని వల్లించి ప్రజలపై వాటి ప్రభావాన్ని చూసి ఎంతో ఆనందిచేవారు.DATel 378.2

  పన్నెండుగుర్నీ పిలిచి, ఇద్దరిద్దరుగా పట్టణాల్లోకి, పల్లెల్లోకి వెళ్లాల్సిందిగా ప్రభువు ఆదేశించాడు. ఎవ్వరినీ ఒంటరిగా పంపలేదు. సోదరుడు సోదరుడితో, మిత్రుడు మిత్రుడితో కలిసి వెళ్లారు. ఈ రీతిగా వారు ఒకరినొకరు ధైర్యపరిచి ఒకరికొకరు సలహాలు సూచనలు ఇచ్చుకుని, ఇద్దరూ కలిసి ప్రార్ధించి పరస్పరం సహకరించుకుని సేవ చేయాల్సి ఉన్నారు. ఈ రీతిగానే అనంతరం ఆయన డెబ్బయి మందిని పంపాడు. సువార్త దూతలు ఈ విధంగా సహకరించుకోవాలన్నది రక్షకుని ఉద్దేశం. ఈ ఆదర్శాన్ని చిత్తశుద్ధితో అవలంబించినట్లయితే మన రోజుల్లో సువార్త పరిచర్య మరింత విజమవంతమవుతుంది.DATel 379.1

  శిష్యుల వర్తమానం బాప్తిస్మమిచ్చే యోహాను క్రీస్తు బోధించిన వర్తమానమే. “పరలోక రాజ్యము సమీపించియున్నది” అన్నదే ఆ వర్తమానం. నజరేయుడైన యేసు మెస్సీయా ఔనా కాదా అన్న విషయమై వారు ప్రజలతో వాదోపవాదాలకు దిగకూడదు. కాని ఆయన చేసిన కృపాకార్యాల్నే ఆయన పేర వారు కూడా చేయాల్సి ఉన్నారు, “రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, దయ్యములను వెళ్లగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి” అని ఆయన వారిని ఆదేశించాడు.DATel 379.2

  తన సేవాకాలంలో బోధించడానికి కన్నా వ్యాధిగ్రస్తుల్ని బాగు చెయ్యడానికి యేసు ఎక్కువ సమయం వినియోగించాడు. తాను నాశనం చెయ్యడానికి కాదు గాని రక్షించడానికి వచ్చానన్న తన మాట వాస్తవమని ఆయన మహత్కార్యాలు నిరూపిస్తోన్నాయి. ఆయన నీతి తన ముందు నడిచింది. ప్రభువు మహిమ ఆయన సైన్యపు వెనుకటి భాగానికి కావలిగా ఉంది. ఆయన ఎక్కడకు వెళ్లినా తన కృపను గూర్చిన వార్త ఆయన కంటే ముందు వెళ్లింది. ఆయన వెళ్లిన స్థలాల్లో ఆయన కృపను పొందిన వారు ఆరోగ్యాన్ని పొంది ఆనందిస్తూ తాము నూతనంగా పొందిన శక్తుల్ని వినియోగించారు. ప్రభువు చేసిన కార్యాల్ని గురించి వారి నోటినుంచి వినడానికి జన సమూహాలు వారి చుట్టూ పోగుపడొన్నాయి. ఆయన స్వరమే అనేకులు ప్రప్రథమంగా విన్న శబ్దం. ఆయన పేరే వారు మొట్టమొదటగా పలికిన మాట. ఆయన ముఖమే వారు మొట్టమొదటగా చూసిన ముఖం. యేసుని వారు ఎందుకు ప్రేమించకూడదు? ఆయన్ని ఎందుకు సన్నుతించకూడదు? పట్టణాల్లోనుంచి నగరాల్లోనుంచి ఆయన వెళ్లినప్పుడు తాను ఎక్కడకు వెళ్తే అక్కడ ఆయన జీవాన్ని వెదజల్లే ప్రముఖ శక్తిలా ఉన్నాడు.DATel 379.3

  క్రీస్తు అనుచరులు ఆయన పని చేసిన రీతిగా పని చెయ్యాలి. మనం ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలివ్వాలి. బాధలు శ్రమలు అనుభవిస్తోన్న వారిని ఓదార్చాలి. నిరాశ నిస్పృహలకు గురి అయిన వారికి పరిచర్య చేయాలి. ఆశను కోల్పోయిన వారిలో ఆశను రగిలించాలి. ఈ వాగ్దానం మనపట్ల నెరవేర్తుంది, “నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.” యెష 58:8. స్వార్థరహిత సేవలో కనపర్చే క్రీస్తు ప్రేమ దుర్మార్గుల్ని సంస్కరించడంలో ఖడ్గంకన్నా, న్యాయస్థానం కాన్న ఎక్కువ శక్తి మంతంగా ఉంటుంది. చట్టాన్ని అతిక్రమించే వాడిలో భయం పుట్టించడానికి ఈ రెండూ అవసరమే. కాని ప్రేమతో సేవచేసే మిషనరీ ఇంతకన్నా ఎక్కువ సాధించగలుగుతాడు. తరచు మందలింపుకు గురి అయిన హృదయం కఠినమౌతుంది. కాని అది క్రీస్తు ప్రేమ వల్ల కరుగుతుంది. మిషనరీ శారీరక రుగ్మతల్ని నివారించడమే గాక పాపిని ఆ మహావైద్యుని వద్దకు నడిపించగలడు. ఆత్మను పీడిస్తోన్న పాపమనే కుష్టు వ్యాధిని ఆయన స్వస్తపర్చుతాడు. వ్యాధిగ్రస్తులు, దిక్కులేనివారు దురాత్మలు పట్టిన వారు తన సేవకుల ద్వారా తన స్వరాన్ని వినాలని దేవుడు సంకల్పించాడు. తన మానవ ప్రతినిధుల ద్వారా లోకం ఎన్నడూ ఎరుగని ఆదరణకర్తగా వ్యవహరించాలని ఆయ ఆకాంక్షిస్తోన్నాడు.DATel 380.1

  తమ మొదటి మిషనరీ ప్రయాణంలో “ఇశ్రాయేలు వంశములోని నశించిన గొట్టెల యొద్దకే” వెళ్లాల్సి ఉన్నారు. ఇప్పుడు అన్యజనులకు గాని సమరయులకు గాని సువార్తను ప్రకటించి ఉంటే వారు యూదుల మధ్య తమ పలుకుబడిని పోగొట్టుకునేవారు. పరిసయ్యుల దురభిమానాన్ని రెచ్చగొట్టడం ద్వారా వారు వివాదాన్ని లేపేవారు. అది ఆదిలోనే హంసపాదుగా పరిణమించి వారిని నిరాశపర్చేది. సువార్త సకల జాతుల ప్రజలకు ప్రకటితం కావాలి అన్న విషయాన్ని శిష్యులు సయితం సరిగా గ్రహించలేకపోయారు. ఈ సత్యాన్ని అవగాహన చేసుకునే వరకు అన్యజనుల కోసం కృషి చేయ్యడానికి వారు సిద్ధంగా లేరు. యూదులు సువార్తను స్వీకరించి ఉంటే దేవుడు వారిని అన్యజనులకు తన దూతలుగా వినియోగించాలని ఉద్దేశించాడు. కనుక వారు సువార్తను ముందు వినాల్సి ఉంది.DATel 380.2

  క్రీస్తు సేవారంగమంతటా తమ అవసరం గుర్తించిన ఆత్మలూ సత్యంకోసం ఆకలిదప్పులు గొన్న ఆత్మలూ ఉన్నాయి. ఆశతో ఎదురుచూస్తోన్న ఆ హృదయాలకు ఆయన ప్రేమ సందేశం అందించడానికి సమయం వచ్చింది. వీరందరి వద్దకు తన శిష్యులు రాయబారులుగా వెళ్లాల్సి ఉన్నారు. వారిని దేవుడు నియమించిన బోధకులుగా విశ్వాసులు ఇలా పరిగణించడం జరుగుతుంది. రక్షకుడు తమ మధ్య ఇకలేనప్పుడు వారు ఉపదేశకుడు లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడదు.DATel 381.1

  ముందు వారు యేసు స్నేహసంబంధాలు స్థాపించిన స్థలాలకే ఈ మొదటి ప్రయాణంలో వెళ్లాల్సి ఉన్నారు. ప్రయాణానికి వారి సిద్దబాటు అతి సామాన్యంగా ఉండాలి. తమ మహత్కార్య సాధనకు ఏదీ అడ్డుతగలకూడదు. ఏదీ తమ దృష్టిని చెదరగొట్టకూడదు. లేక వ్యతిరేకతను పుట్టించి మరెక్కువ సేవకు తలుపును మూయకూడదు. వారు తమ గురువుల మత దుస్తుల్ని ధరించకూడదు. లేక సామాన్య శ్రామికుల నుంచి తమను వేరు చేసే మరేరకమైన దుస్తుల్ని ధరించడకూడదు. సమాజమందిరాల్లోకి వెళ్లి ప్రజల్ని బహిరంగ ఆరాధనకు ఆహ్వానించకూడదు. వారి పరిచర్య ఇంటింటికి వెళ్లి చేయాల్సింది. వారు వ్యర్ధ ప్రసంగాలతో గాని లేదా వినోదానికి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్లడంతో గాని సమయం వ్యర్ధపుచ్చకూడదు. అయితే ప్రతీ స్థలంలోను యోగ్యులైన వారి ఆతిథ్యాన్ని క్రీస్తును ఆహ్వానిస్తున్నట్లు హృదయపూర్వకంగా ఆహ్వానించే వారి సత్కారాన్ని వారు స్వీకరించాలి. “ఈ ఇంటికి సమాధానమగు గాక” (లూకా 10:5) అన్న, చక్కని మాటలతో వారు ప్రతీ గృహంలోకి ప్రవేశించాలి. వారి ప్రార్థనల ద్వారా ఆ కుటుంబం గొప్ప దీవెనను పొందుతుంది.DATel 381.2

  తమ ప్రభువు రాకకు మార్గం సుగమం చేసేందుకు ఈ శిష్యులు సత్యదూతలు కావాల్సి ఉన్నారు. వారు అందించాల్సిన వర్తమానం నిత్యజీవవాక్యం. దాన్ని స్వీకరించడమో విసర్జించడమో అన్నదానిపై మనుషుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. దాని గంభీరతను ప్రజలికి బోధపర్చేందుకు యేసు తన శిష్యుల్ని ఇలా ఆదేశించాడు: ” ఎవడైనను మిమ్మును చేర్చుకొనక నా మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు నా పాదధూళి దులిపివేయుడి. విమర్శదినమందు ఆ పట్టణపుగతి కంటే సొదొమ గొమొట్టా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”DATel 382.1

  ఇప్పుడు రక్షకుని దృష్టి భవిష్యత్తులోకి వెళ్లింది. తన మరణం తర్వాత శిష్యులు తనకు సాక్షులుగా ఉండాల్సిన ప్రాంతాల్ని ఆయన వీక్షించాడు. తాను రెండోసారి వచ్చేవరకూ యుగాలన్నిటిలోను తన ప్రావచనిక దృష్టి తన సేవకుల అనుభవాల్ని వీక్షించింది. తన అనుచరులు ఎదుర్కోవాల్సి ఉన్న సంఘర్షణల్ని వారికి చూపించాడు. సమరం స్వభావాన్ని దాని ప్రణాళికను వారికి వెల్లడించాడు. తాము ఎదుర్కోనున్న అపాయాల్ని బయలుపర్చాడు. వాటిని ఎదుర్కోడానికి ఆత్మత్యాగం అవసరమౌతుందని హెచ్చరించాడు. శత్రువు తమపై అకస్మాత్తుగా పడకుందేందుకు వారు తమ చర్య మూల్యాన్ని పరిగణించాల్సిందని వారిని కోరాడు. వారి పోరాటం రక్తమాంసాలుగల శరీరులతో కాదని అది “ప్రధానులతోను అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాధులతోను ఆకాశమండల మందున్న దురాత్మల సమూహముతోను” (ఎఫెసీ 6:21) జరగనుంది. వారు మానవాతీత శక్తులతో పోరాడాల్సి ఉన్నారు. అయితే వారికి మానవాతీత సహాయ హామి కూడా ఉంది. ఈ సేవలో పరలోక నివాసులందరూ ఉన్నారు. దూతలకన్నా అధికులు ఈ సేవలో ఉన్నారు. ఈ పోరాటాన్ని నడిపించడానికి సైన్యాలకు అధిపతి ప్రతినిధి అయిన పరిశుద్దాత్మ దిగి వస్తాడు. మన బలహీనతలు అనేకం కావచ్చు. మన పాపాలు అపరాధాలు ఘోరమైనవే కావచ్చు. దైవకృప పశ్చాతప్త హృదయంతో యాచించే వారందరికీ లభిస్తుంది. దేవునిపై విశ్వాసముంచే వారందరి పక్షంగా సర్వశక్తుని శక్తి కార్యాచరణకు పూనుకుంటుంది.DATel 382.2

  “ఇదిగో తోడేళ్ల మధ్యకు గొట్టెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండిడి” అన్నాడు యేసు. సత్యం ఒక్కమాటను కూడా క్రీస్తు అణచివెయ్యలేదు. కాని సత్యాన్ని సర్వదా ప్రేమతో వచించాడు. ప్రజలతో కలిసి తిరిగేటప్పుడు గొప్ప నేర్పును, విజ్ఞతను, దయతో కూడిన ఆసక్తిని ప్రదర్శించాడు. ఆయన అనాగరకంగా ఎన్నడూ ప్రవర్తించలేదు. ఎన్నడూ అనవసరంగా కఠినంగా మాట్లాడలేదు. నొచ్చుకునే ఆత్మకు ఎన్నడూ బాధకలిగించలేదు. మానవ బలహీనతను విమర్శించలేదు. దొంగాటకాన్ని అపనమ్మకాన్ని దుష్టత్వాన్ని ఆయన నిర్భయంగా ఖండించాడు. కాని తీవ్ర గద్దింపులు చేసినప్పుడు ఆయన గొంతు దుఃఖంతో బొంగురుపోయేది. మార్గం, సత్యం, జీవం అయిన తనను తాను ప్రేమించిన యెరూషలేము నిరాకరించినప్పుడు ఆ పట్టణం నిమిత్తం ఆయన ఏడ్చాడు. రక్షకుడైన ఆయన్ని వారు నిరాకరించారు. కాని ఆయన వారిని జాలి హృదయంతో తీవ్రసంతాపంతో పరిగణించాడు. ఆ దుఃఖం ఆయన హృదయాన్ని బద్దలు కొట్టింది. ఆయన దృష్టిలో ప్రతీ ఆత్మ ప్రశస్తమైందే. ఆయన ఎల్లప్పుడు దివ్యమైన ఠీవితో సంచరిస్తుండగా దేవుని కుటుంబంలోని ప్రతీ బిడ్డను సున్నితమైన ప్రేమతో పరిగణించేవాడు. మనుషులందరిలోను పతనమైన ఆత్మల్ని చూసి వారిని రక్షించడమే తన కర్తవ్యంగా ఎంచుకున్నాడు.DATel 383.1

  క్రీస్తు సేవకులు తమ స్వాభావిక హృదయ వాంఛల్ని అనుసరించి ప్రవర్తించకూడదు. వారికి దేవునితో దగ్గర సంబంధం ఉండాలి. లేకపోతే కోపం రేగినప్పుడు అహం తలెత్తుతుంది. అప్పుడు వారు అసభ్యమైన మాటల జడివాన కురిపిస్తారు. అవి ఎండిపోతున్న మొక్కల్ని తెప్పరిల్లజేసే మంచులాగాని నిలకడగా పడే చినుకుల్లాగాని ఉండవు. వారిలా ప్రవర్తించాలన్నదే సాతాను కోరిక. ఎందుకంటే అతడి పద్దతులు ఇవే. ఆగ్రహం తెచ్చుకోడం ఘట సర్పం తత్వం. ఆగ్రహంలోను నిందారోపణలోను వ్యక్తమయ్యేది సాతాను స్వభావం. అయితే దేవుని సేవకులు ఆయన ప్రతినిధులుగా మెలగాలి. తన రూపం, సత్యమనే పైరాత ఉన్న పరలోక ద్రవ్యాన్నే వారు వాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దుష్టిని క్రీస్తు శక్తి ద్వారానే వారు జయించాల్సి ఉన్నారు. క్రీస్తు మహిమే వారి బలం. వారు తమ దృష్టిని ఆయన సౌమ్యత పై నిలపాలి. అప్పుడు వారు సువార్తను నేర్పుగా మృదువుగా అందించగలుగుతారు. కోపం వచ్చినప్పుడు శాంతంగా ఉండే స్వభావం సత్యం పక్షంగా బలమైన వాడనకన్నా శక్తిమంతంగా మాట్లాడగలుగుతుంది.DATel 383.2

  సత్య విరోధులతో సంఘర్షణకు దిగినవారు మనుషుల్నే కాదు సాతానుని అతడి పరివారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అట్టి వారు రక్షకుని ఈ మాటలు గుర్తుంచుకోడం అవసరం, “మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్ల మద్యకు గొట్టె పిల్లలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను.” లూకా 10:3. వారు దేవుని ప్రేమలో విశ్రమించాలి. అప్పుడు వ్యక్తిగత దూషణ జరిగినప్పటికీ శాంతంగా ఉండే స్వభావం అబ్బుతుంది. ప్రభువు వారిని దివ్యగుడారంతో కప్పుతాడు. ఆయన పరిశుద్దాత్మ మనసుని హృదయాన్ని ప్రభావితం చెయ్యడంతో వారి స్వరాలు తోడేళ్ల అరుపుల్ని స్వరాల్ని సంతరించుకోవు.DATel 384.1

  శిష్యులికి తన ఉపదేశాన్ని కొనసాగిస్తూ యేసు ఇలా అన్నాడు, “మనుష్యులను గూర్చి జాగ్రత్తపడుడి.” దేవున్ని ఎరుగని వారిని పూర్తిగా నమ్మి వారికి తమ ఆలోచనలను విప్పి చెప్పకూడదు. హాని చెయ్యడానికి ఇది సాతాను అనుచరులకు అవకాశమిస్తుంది. మానవ కల్పనలు తరచు దైవ ప్రణాళికల్ని అడ్డుకుంటాయి. దేవుని ఆలయాన్ని నిర్మించేవారు కొండమీద ఆయన చూపించిన మాదిరి ప్రకారం నిర్మించాలి. అనగా ఆయన మాదిరి ననుసరించి నిర్మించాలి. పరిశుద్దాత్మ దర్శకత్వాన్ని అనుసరించని మనుషుల ఆలోచనలపై ఆయన సేవకులు ఆధారపడినప్పుడు వారు దేవున్ని ఆగౌరవపర్చినవారు సువార్తకు ద్రోహం తలపెట్టినవారు అవుతారు. లోకజ్ఞానం దేవునికి బుద్ధిహీనతగా ఉంటుంది. దానిపై ఆధారపడేవారందరూ తప్పుదారి పట్టడం ఖాయం.DATel 384.2

  “వారు మిమ్మును మహాసభలకు అప్పగించి... వీరికిని అన్యజనులకును సాక్ష్యార్ధమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును బడుదురు.” మత్త 10:17, 18. హింస వెలుగును విస్తరింపజేస్తుంది. దైవ సేవకుల్ని లోకంలోని గొప్పవారి ముందు నిలబెడ్తారు. ఈ తరుణంలో తప్పవారు మరెన్నడు సువార్తను వినరు. ఈ మనుషులికి సత్యాన్ని వక్రీకరించి చెప్పడం జరుగుతుంది. క్రీస్తు అనుచరుల విశ్వాసం విషయంలో వారు అబద్ద ఆరోపణలు వింటున్నారు. తరచుగా దాని నిజ స్వభావాన్ని తెలుసుకునే ఒకే ఒక మార్గం తమ విశ్వాసం విషయమై విచారణకు తేబడ్డవారి సాక్ష్యమే. పరీక్షలో వీరు సమాధానం చెప్పాలి. వారిచ్చే సాక్ష్యాన్ని న్యాయమూర్తులు విని అధ్యయనం చెయ్యాలి. ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోడానికి తన సేవకులికి దేవుడు తస కృపనిస్తాడు. “మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే నా కనుగ్రహించబడును. నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడేగాని మాట్లాడువారు మీరు కాదు” అని యేసు అంటున్నాడు. దేవుని ఆత్మ ఆయన సేవకుల మనసుల్ని వెలుగుతో నింపినప్పుడు సత్యం దైవశక్తితో సమర్పించబడింది. సత్యాన్ని తిరస్కరించేవారు శిష్యుల్ని నిందించి హింసించడానికి నిలబడ్డారు. కాగా దేవుని బిడ్డలు నష్టంలోను బాధలోను చివరికి మరణం వరకు తమ దివ్య ఆదర్శమైన ప్రభువు సాత్వికాన్ని ప్రదర్శిస్తారు. సాతాను ప్రతినిధులికి క్రీస్తు ప్రతినిధులికి మధ్య వ్యత్యాసం ఇలా కొట్టొచ్చినట్లు కనిపింస్తుంది. ప్రధానుల ముందు ప్రజల ముందు క్రీస్తుని అగ్రస్థానంలో ఉంచడం జరుగుతుంది.DATel 384.3

  హతసాక్షులు ప్రదర్శించిన ధైర్యగుణం అది అవసరమయ్యే వరకూ శిష్యుల్లో కనిపించలేదు. అప్పుడు రక్షకుని వాగ్దానం నెరవేరింది. పేతురు, యోహానులు సన్ హెల్త్న్ సభ ముందు సాక్ష్యం ఇచ్చినప్పుడు మనుషులు “ఆశ్చర్యపడి వారు యేసుతో కూడ ఉండినవారని గుర్తెగిరి.” అ.కా 4:13. స్తెఫన్ని గురించి ఇలా ఉంది, “సభలో కూర్చున్న వారందరు అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.” మనుషులు “అతనిని ప్రేరేపించిన ఆత్మను... ఎదిరింపలేకపోయిరి.” అ.కా 6:15, 10. కైసరు న్యాయస్థానంలో తన సొంత విచారణను గురించి మాట్లాడూ పౌలిలా అంటోన్నాడు, “నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు. అందరును నన్ను విడిచిపోయిరి.... అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరును దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించుకొంటిని.” 2 తి మోతి 4:16,17.DATel 385.1

  విచారణకు నిలబడినప్పుడు క్రీస్తు సేవకులు తాము చెప్పాల్సింది తయారు చేసుకుని నిలబడకూడదు. దినదినం దేవుని వాక్యం నుంచి ప్రశస్త సత్యాల్ని పోగు చేసుకుని ప్రార్ధన ద్వారా తమ విశ్వాసాన్ని పటిష్ఠం చేసుకోడం ద్వారా ఆసిద్ధబాటు జరగాలి. వారిని విచారణకు తీసుకొని వచ్చినప్పుడు వారికి ఏ సత్యాలు అవసరమవుతాయో వాటిని పరిశుద్దాత్మ వారి స్పురణకు తెస్తాడు.DATel 386.1

  దేవుని తెలుసుకోడానికి, ఆయన పంపిన క్రీస్తును తెలుసుకోడానికి అనుదినం యధార్ద హృదయంతో చేసే కృషి ఆత్మకు శక్తిని సమర్థతను చేకూర్చుతుంది. లేఖనాల్ని శ్రద్ధగా పరిశోధించడం ద్వారా సంపాదించే జ్ఞానం సరి అయిన సమయంలో జ్ఞప్తికి వస్తుంది. అయితే ఎవరైనా క్రీస్తు మాటల్ని పఠించి మనసులో దాచుకోడం అశ్రద్ధ చేస్తే ఆయన కృపకున్న శక్తిని పరీక్షించడం అశ్రద్ధ చేస్తే, పరిశుద్దాత్మ తన మాటల్ని వారికి జ్ఞాపకం చేస్తాడనుకోకూడదు. వారు పూర్ణహృదయంతో దేవుని అనుదినం సేవించాలి. అప్పుడు ఆయన్ని విశ్వసించాలి.DATel 386.2

  సువార్త పట్ల వ్యతిరేకత ఎంత తీవ్రమైందంటే మిక్కిలి ఆత్మీయ బంధాలు సయితం పరిగణనకు రావు. క్రీస్తు శిష్యుల్ని తమ కుటుంబీకులే మరణించడానికి అప్పగించారు. ఆయన ఇలా అన్నాడు. “నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించినవాడే రక్షణ పొందును.” మార్కు 13:13. అనవసరంగా హింసకు తమ్మును తాము గురి చేసుకోవద్దని కూడా ప్రభువు హెచ్చరించాడు. తనను చంపడానికి చూస్తున్న వారి నుంచి తప్పించుకోడానికి ఆయన తరచుగా ఒక ప్రాంతం విడిచి పెట్టి వేరే ప్రాంతానికి వెళ్లేవాడు. నజరేతు ప్రజలు ఆయన్ని విసర్జించినప్పుడు తన సొంత పట్టణ ప్రజలే తనను చంపజూచినప్పుడు ఆయన కపెర్నహోముకు వెళ్లాడు. అక్కడి ప్రజలు ఆయన బోధ విని విస్మయం చెందారు. ఎందుకంటే “ఆయన వాక్యము అధికారముతో కూడినదైయుండెను” లూకా 4:32. కనుక హింస మూలంగా ఆయన సేవకులు అధైర్యపడకూడదు. అట్టి సమయంలో వారు సురక్షిత స్థలం చూసుకుని ఆత్మల రక్షణార్ధం ఇంకా కృషి చేయవచ్చును.DATel 386.3

  సేవకుడు యాజమాని కన్నా అధికుడు కాడు. పరలోక యువరాజుని బయెఱ్ఱబూలు అని పిలిచారు. ఆయన శిష్యుల్ని కూడా అలాగే పిలుస్తారు. ప్రమాదమేదైనా క్రీస్తు అనుచరులు తమ నియమాలకు నిబద్దులై ఉండాలి. వారు దాపరికాన్ని ద్వేషించాలి. సత్యాన్ని స్వీకరించడంలో భద్రతకు భరోసా లభించేవరకు ఊగిసలాడకూడదు. అపాయం గురించి మనుషుల్ని హెచ్చరించడానికి వారు కావలివారుగా ఏర్పాటయ్యారు. క్రీస్తు వద్ద నుంచి వచ్చిన సత్యాల్ని అందరికి స్వేచ్చగాను బాహాటంగాను ఇవ్వాల్సి ఉన్నాం . “చీకటిలో నేను మీతో చెప్పనది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడమీద ప్రకటించుడి.” అని యేసు చెప్పాడు.DATel 387.1

  యేసు ఎన్నడూ రాజీ ద్వారా సమాధానాన్ని కొరలేదు. సకల మానవ జాతిపట్ల ఆయన హృదయం ప్రేమతో పొంగిపొర్లింది. అయినా ఆయన పాపాల్ని ఉపేక్షించలేదు. ఆయన వారికి బాగా సన్నిహితుడు గనుకనే వారు తమ ఆత్మల్ని అనగా సొంత రక్తంతో తాను కొన్న ఆత్మల్ని నాశనం చేసే పనులు చేస్తున్నప్పుడు మౌనంగా ఉండలేక పోయాడు. మనిషి తనపట్ల తానే నమ్మకంగా ఉండడానికి, తన ఉన్నతమైన నిత్యమైన ఆసక్తుల విషయంలో నమ్మకంగా ఉండడానికి ఆయన కృషిచేశాడు. క్రీస్తు సేవకులు కూడా అదే పనికి పిలుపుపొందుతోన్నారు. విభేదాలు లేకుండా చెయ్యడానికి ప్రయత్నించడంలో సత్యాన్ని వదలుకోకుండా వారు జాగ్రత్త పడాలి. “సమాధానమును.... కలుగజేయు వాటినే.... అనుసరింతము” (రోమా 14:19) అయితే నిజమైన సమాధానం నియమంపై రాజీ ద్వారా ఎన్నడూ లభించదు. వ్యతిరేకత లేకుండా ఏ వ్యక్తి నియమానికి నిలబడలేడు. అవిధేయులు ఆధ్యాత్మికమైన క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తారు. యేసు తన శిష్యులికి ఈ హితోపదేశం చేశాడు, “ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి.” దేవునికి నమ్మకంగా ఉండేవారు మనుషుల అధికారానికిగాని సాతాను వ్యతిరేకతకుగాని భయపడాల్సిన అవసరం లేదు. వారి నిత్యజీవం యేసులో భద్రంగా ఉంటుంది. వారికుండాల్సిన భయమల్లా సత్యాన్ని వదిలి పెట్టి దేవుడు వారిని ఏ సత్యంతో గౌరవించాడో దానికి నమ్మకద్రోహం చేస్తామేమో అన్నదే.DATel 387.2

  మనుషుల హృదయాల్ని సందేహంతో నింపడమే సాతాను చేసేపని. దేవుడు దయలేని న్యాయాధిపతి అని ప్రజల్ని నమ్మిస్తాడు. పాపం చెయ్యడానికి మనుషుల్ని శోధించి ఆ తర్వాత తాము పరలోక తండ్రి వద్దకు వెళ్లలేనంత ఘోరపాపులమని ఆయన దయకు అపాత్రులమని భావించడానికి వారిని నడిపిస్తాడు. ప్రభువు ఇదంతా అర్ధం చేసుకుంటాడు. తమ అవసరాల్లోను బలహీనతల్లోను తమ పట్ల దేవుడు సానుభూతి కలిగి ఉంటాడని శిష్యులికి యేసు భరోసా ఇస్తున్నాడు. తండ్రి హృదయంలో ప్రతిధ్వనించని నిట్టూర్పు, నొప్పి పుట్టించని బాధ, ఆయన ఆత్మను బద్దలు చెయ్యని దుఃఖం ఉండదు.DATel 388.1

  ఉన్నతమైన, పరిశుద్ధమైన స్థలంలో ఉన్నట్లే తప్ప, నిష్మియగా, నిశ్శబ్దంగా ఏకాంతంగా ఉన్నట్లు దేవుణ్ని బైబిలు చూపించడం లేదు. ఆయన చిత్తాన్ని జరిగించడానికి సంసిద్ధంగా వేలవేల దూతలు ఆయన చుట్టూ ఉంటారని బైబిలు చెబుతోంది. మనకు గ్రాహ్యం కాని అనేక మార్గాల్లో తన రాజ్యంలోని ప్రతీ భాగంతో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉంది. అయితే ఆయన ఆసక్తంతా ఈ చిన్నలోకం పైనే. ఏ ఆత్మల్ని రక్షించడానికి తన అద్వితీయ కుమారుణ్ని ఇచ్చాడో ఆ ఆత్మలపై కేంద్రీకృతమై ఉంది. బాధితుల మొర వినడానికి ఆయన సింహాసం మిద నుంచి వంగి చెవిగ్గుతాడు. ప్రతీ ప్రార్ధనకు ఆయన “ఇక్కడున్నాను” అని జవాబిస్తాడు. దుఃఖంలో ఉన్నవారిని, బడుగు ప్రజల్ని ఆయన లేవనెత్తుతాడు. మనకు బాధ కలిగినప్పుడు ఆయన బాధపడతాడు. ప్రతీ శోధనలోను ప్రతీ శ్రమలోను విడుదల కలిగించడానికి ఆయన శ్రమపడతాడు. ప్రతీ శోధనలోను ప్రతీ శ్రమలోను విడుదల కలిగించడానికి ఆయన సముఖపు దూత మనపక్కనే ఉంటాడు.DATel 388.2

  తండ్రికి తెలియకుండా చిన్న పిచ్చుక సయితం పడిపోదు. దేవునిపట్ల సాతానుకున్న ద్వేషం రక్షకుడు సంరక్షించే ప్రతీ వస్తువును ప్రాణిని ద్వేషించడానికి దారి తీస్తుంది. దేవుని హస్తకృత్యాన్ని పాడుచెయ్యడానికి అతడు ప్రయత్నిస్తాడు. అందుకు మూగజీవుల్ని నాశనం చెయ్యడం కూడా ఆనందింపజేసేందుకు దేవుని కాపుదలవల్లే సజీవంగా ఉన్నాయి. అయితే ఆయన పిచ్చుకల్ని సైతం మర్చిపోడు. “భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?” అంటున్నాడు.DATel 388.3

  యేసు ఇంకా ఇలా అంటున్నాడు మీరు నన్ను మనుషుల ముందుఒప్పుకుంటే నేను మిమ్మల్ని దేవుని ముందు పరిశుద్ధ దూతలు ముందు ఒప్పుకుంటాను. లోకంలో మీరు నాకు సాక్షులుగా ఉండాలి. లోకానికి స్వస్తత కూర్చడానికి నా కృప అందించే సాధనాలుగా మారుండాలి. అలాగే పరలోకంలో నేను మీకు ప్రతినిధిగా ఉంటాను. తండ్రి నా దోషపూరిత ప్రవర్తనను చూడడు. కాని నా పరిపూర్ణతను ధరించిన మిమ్ముల్ని ఆయన చూస్తాడు. మీకు నా ద్వారా పరలోక దీవెనలు వస్తాయి. నశించిన వారికోసం నేను చేసిన త్యాగాన్ని పంచుకునే ప్రతీవారు విమోచన పొందిన ప్రజల మహిమలోను సంతోషంలోను పాలిభాగస్తులని ఒప్పుకుంటాను.DATel 389.1

  క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చేవానిలో క్రీస్తు నిసించాలి. తాను పొందనిది అతడు ఇతరులికి అందించలేడు. శిష్యులు సిద్ధాంతంపై అనర్గళంగా ప్రసంగించవచ్చు. క్రీస్తు మాటల్ని వల్లించవచ్చు. వారికి ఏ మున్నా క్రీస్తును పోలిన సాత్వికం ప్రేమ ఉంటే తప్ప వారు క్రీస్తును గురించి సాక్ష్యం ఇవ్వడం లేరు. పైకి చెప్పుకునేది ఏమైనా క్రీస్తు స్వభావానికి విరుద్ధమైన స్వభావం ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది. అవాకులు చవాకులు చెప్పడం వల్ల బుద్దిహీనంగా మాట్లాడడం వల్ల అబద్దాలు ఆడడం వల్ల లేదా నిర్దయగా మాట్లాడడం వల్ల మనుషులు క్రీస్తుని ఎరగమని సాక్ష్యం ఇవ్వవచ్చు. బతుకు బాధ్యతల్ని పట్టించుకోకపోవడం వల్ల పాపభోగాల్ని అనభవించడంవల్ల మనుషులు ఆయన్ని ఎరగమని సాక్ష్యం ఇవ్వవచ్చు. లోకాశలకు ఆకర్షితులవ్వడం ద్వారా తమ్ము తాము సమర్ధించుకోడం ద్వారా వారు ఆయన్ని ఎరుగమని చెప్పవచ్చు. ఇన్ని విధాలుగా క్రీస్తు తమలో లేడని వారు చెప్పవచ్చు. “మనుషులు యెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును” అని ఆయనంటున్నాడు.DATel 389.2

  సువార్త పట్ల లోకం వ్యతిరేకతను అధిగమించ వచ్చునని కొంతకాలానికి ఆ వ్యతిరేకత ఆగిపోతుందని నిరీక్షించవద్దని రక్షకుడు తన శిష్యుల్ని హెచ్చరించాడు. “ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు” అన్నాడాయన. ఈ వైరం సువార్త ఫలితం కాదు, దానికి ఏర్పడే వ్యతిరేకత పర్యవసానం. హింస అంతటిలోను అతి కష్టమైన హింస కుటుంబంలో తలెత్తే భేదాలవల్ల లోకంలో మిక్కిలి సన్నిహితులు విడిపోడం వల్ల కలిగేదే. అయితే యేసు ఇలా అంటున్నాడు. “తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.”DATel 389.3

  క్రీస్తు సేవకుల కర్తవ్యం ఉన్నతమైంది, గౌరవప్రదమైంది. అది ఒక పవిత్ర నిధి. ఆయన ఇలా అన్నాడు, “మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.” తన పేర తన శిష్యులకు కనపర్చే దయ గుర్తింపును ప్రతిఫలాల్ని పొందుతాయి. ప్రేమ పూర్వకమైన ఈ గుర్తింపులో దేవుని కుటుంబంలోని మిక్కిలి బలహీనుల్ని మిక్కిలి బీదల్ని ఆయన చేర్చుతున్నాడు. “శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో” - అనగా క్రీస్తును గూర్చిన విశ్వాసం విషయంలోను, జ్ఞానం విషయంలోను చిన్నపిల్లల్లా ఉన్న వారికి - “వాడు తన ప్రతిఫలమును పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను”DATel 390.1

  రక్షకుడు తన ఉపదేశాన్ని ఇలా ముగించాడు. ఆయన వెళ్లిన రీతిగానే ఆయన శిష్యులు ఆయన పేరట “బీదలకు సువార్త ప్రకటించుటకై.... చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును” వెళ్లారు. లూకా 4:18, 19.DATel 390.2