Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  56—చిన్నపిల్లల్ని ఆశీర్వదించడం

  యేసు చిన్న పిల్లల్ని ప్రేమించాడు. చిన్నపిల్లల అమాయకపు సానుభూతిని నిష్కళంక ప్రేమను స్వీకరించాడు. వారి చిన్నారి పెదవుల్నుంచి వచ్చే ప్రశంస ఆయన చెవులికి సంగీతంలా వినిపించి, వంచకులు వేషధారులతో కలయిక వల్ల అలసిన ఆయన ఆత్మకు తాజాతనాన్నిచ్చేది. రక్షకుడు ఎక్కడకు వెళ్తే అక్కడ ఆయన ముఖ వైఖరిలోని సౌమ్యత, ఆయన సున్నితమైన దయాపూరితమైన వైఖరి పిల్లల్లో ఆయన పట్ల ప్రేమను విశ్వాసాన్ని పుట్టించేవి.DATel 570.1

  తమ బిడ్డలపై చేతులుంచి దీవించేందుకుగాను యూదులు రబ్బీల వద్దకు వారిని తీసుకువచ్చే ఆచారం ఉండేది. అయితే యేసు శిష్యులు ఆయన చేస్తున్న పరిచర్య ప్రాముఖ్యమయ్యింది కాబట్టి పిల్లల్ని దీవించడం ఆపనికి అంతరాయం కలిగించకూడదని భావించారు. తల్లులు తమ చంటి బిడ్డలతో ఆయన వద్దకు వచ్చినప్పుడు శిష్యులు వారి పట్ల విముఖంగా ఉన్నారు. ఈ పిల్లలు పసివారు గనుక యేసు వద్దకు రావడం ప్రయోజనకరం కాదని అందుచేత వారిని ఆయన దగ్గరకు రానివ్వడని శిష్యులు ఊహించారు. అయితే ఆయన అసంతృప్తి చెందింది ఆ బిడ్డల్ని తీసుకొచ్చిన తల్లులతో కాదు, తన శిష్యులతో. తమ బిడ్డల్ని వాక్యానుసారంగా పెంచి పెద్ద చెయ్యడానికి ప్రయత్నిస్తోన్న తల్లుల ఆందోళనను భారాన్ని రక్షకుడు గ్రహించాడు. వారి ప్రార్థనలు ఆయన విన్నాడు. వారిని ఆయనే తన వద్దకు ఆకర్షించుకున్నాడు.DATel 570.2

  యేసును కలుసుకోడానికి ఒక తల్లి తన బిడ్డను తీసుకుని బయలుదేరింది. మార్గంలో కనిపించిన పక్కింటి స్త్రీకి చెప్పింది తాను యేసు వద్దకు వెళ్తున్నట్లు. ఆమె కూడా తన బిడ్డల్ని యేసు దీవించాలని అభిలషించింది. ఇలా చాలా మంది తల్లులు తమ బిడ్డలతో వచ్చారు. ఆ పిల్లల్లో కొందరు శైశవం దాటి బాల్యంలో కౌమర్యంలో ప్రవేశించిన వారు. తల్లులు తమ కొర్కెను వెలిబుచ్చినప్పుడు బితుకుబితుకుగా ఆ తల్లులు చేసిన వినతిని యేసు విన్నాడు. కాని శిష్యులు వారి పట్ల ఎలా వ్యవహరిస్తారో చూడాలని వేచి ఉన్నాడు. ఆయనకు సహకరిస్తున్నామని భావించి శిష్యులు ఆ తల్లుల్ని పంపివెయ్యడం యేసు చూసి ఇలా అంటూ వారి పొరపాటును చూపించాడు,” “చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి; పరలోక రాజ్యము ఈలాటి వారిది అనీ చెప్పాడు. వారిని చేతుల్లోకి తీసుకుని, వారి మీద చేతులుంచి దీవించాడు.DATel 570.3

  తల్లులు ఓదార్పు పొందారు. క్రీస్తు మాటలు వారికి బలాన్ని ఉత్సాహాన్ని కూర్చాయి. వారు తమ గృహాలకు తిరిగి వెళ్ళారు. తమ భారాన్ని నూతన్నోత్సాహంతో స్వీకరించి తమ బిడ్డల పెంపకం బాధ్యతలను ఆశాభావంతో చేపట్టడానికి ప్రేరణ పొందారు. ఆయన మాటల్ని ఈ నాటి తల్లులు అదే విశ్వాసంతో స్వీకరించాల్సి ఉన్నారు. మనుషుల్లో మనిషిగా జీవించిన నాటి లాగే నేడు కూడా క్రీస్తు వ్యక్తిగత రక్షకుడు. యూదయలో చిన్న పిల్లల్ని తన ఒడిలోకి తీసుకుని తల్లులికి చేయూతనిచ్చిన సహాయకుడే నేడూ తల్లులికి సహాయకుడు. గతించిన యుగాల్లోని పిల్లలు మాత్రమే కాదు నేడు మన గృహాల్లోని పిల్లలు కూడా ఆయన రక్తంతో కొన్నవారే.DATel 571.1

  యేసు ప్రతీ తల్లి హృదయ భారాన్ని ఎరిగినవాడు. పేదరికంతో ఆకలితో బాధపడిన తల్లికి కుమారుడైన ఆ ప్రభువు కటకటపడుతున్న ప్రతీ తల్లి పట్ల సానుభూతి కలిగి ఉన్నాడు. ఒక కనాను స్త్రీ హృదయ వేదనను తీర్చడానికి దీర్ఘ ప్రయాణం చేసిన ఆయన ఈనాటి తల్లులికి కూడా ఆ రీతిగానే సహాయం చేస్తాడు. నాయీను విధవరాలికి మరణించిన తన ఒకే ఒక కుమారుణ్ని బతికించి ఇచ్చిన ఆయన, సిలువపై బాధననుభవిస్తూ తన తల్లిని జ్ఞాపకం చేసుకొన్న ఆయన ఈనాడు మాతృమూర్తి రోదనను విని చలించిపోతాడు. దుఃఖంలో ఉన్న ప్రతీ వారిని ఓదార్చి సహాయమందిస్తాడు.DATel 571.2

  తల్లుల్ని తమ ఆందోళనలతో యేసు వద్దకు రానివ్వండి. తమ చిన్నారుల్ని నిభాయించడంలో తోడ్పడే కృపను వారు పొందుతారు. తన భారాలన్నిటిని రక్షకుని పాదాల వద్ద పెట్టడానికి ఇష్టపడే ప్రతీ తల్లికీ తలుపులు తెరచి ఉన్నాయి. “చిన్న బిడ్డలను ఆటంకరపచక వారిని నా యొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటి వారిది” అన్న ప్రభువు తల్లులు తమ బిడ్డల్ని తన వద్దకు తీసుకురావలసిందిగా ఆహ్వానిస్తోన్నాడు. వారిని ఆశీర్వదిస్తానంటోన్నాడు. తల్లి ఒడిలో ఉన్న పసిపాప సయితం ప్రార్థించే తల్లి విశ్వాసం ద్వారా సర్వశక్తుని నీడను నివసించవచ్చు. స్నానికుడైన యోహాను పుట్టినప్పటి నుంచి పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. మనం దేవుని సహవాసంలో నివసిస్తే మన బిడ్డల్ని చిన్ననాటి నుంచి పరిశుద్ధాత్మ తీర్చిదిద్దుతాడని విశ్వసించవచ్చు.DATel 571.3

  తన వద్దకు తల్లులు తీసుకువచ్చిన పిల్లల్లో తన కృపకు వారసులు తన రాజ్య పౌరులు కానున్న పురుషుల్ని స్త్రీలని, తన నిమిత్తం హతసాక్షులు కానున్న కొందరిని ఆయన చూశాడు. ఈ చిన్న బిడ్డలు తన మాటలు విని లౌకిక జ్ఞానులు కఠిన హృదయులు అయిన పెద్దవారి కన్నా తనను తమ విమోచకుడుగా చిత్తశుద్ధితో స్వీకరిస్తారని ఆయనకు తెలుసు. తన బోధను వారి అవగాహన స్థాయికి తెచ్చాడు. పరలోక ప్రభువైన తాను వారి ప్రశ్నలకు జవాబు చెప్పడానకి తన పాఠాన్ని ఆ చిన్నారి మనసులికి అర్ధమయ్యేటట్లు సరళీకరించడానికి వెనుదియ్యలేదు. వారి మనసుల్లో సత్యబీజాన్ని నాటాడు. అనంతర సంవత్సరాల్లో ఆ విత్తనాలు మొలిచి నిత్యజీవానికి ఫలాలు ఫలిస్తాయి.DATel 572.1

  చిన్నపిల్లలు సువార్త బోధనలకు ఎక్కువ ఆకర్షితులవుతారన్నది ఇంకా నిజమే. వారి హృదయాలు పరిశుద్ధ ప్రభావాలకు తెరుచుకొని విన్న పాఠాల్ని మరపులో పడకుండా చేసేంత శక్తిమంతమైనవి. చిన్నపిల్లలు క్రైస్తవులు కావచ్చు. తమ వయసును అనుసరించి మతానుభవం కూడా కలిగి ఉండవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై వారిని చైతన్యపర్చడం అవసరం. క్రీస్తు వంటి ప్రవర్తనను రూపొందించుకోడానికి తల్లిదండ్రులు వారికి సహాయసహకారాలు అందించాలి.DATel 572.2

  తల్లిదండ్రులు తమ బిడ్డల్ని దైవ కుటుంబంలో సభ్యులుగా పరిగణించి వారిని దేవుని రాజ్యం కోసం తర్బీతు చెయ్యడానికి నిబద్దులై ఉన్నామని గ్రహించాలి. క్రీస్తు నుంచి మనం నేర్చుకునే పాఠాల్ని మన బిడ్డలికి అందించాలి. ఆ చిన్నారుల మనసుల్ని పరలోక సూత్రాల సౌందర్యానికి కొంచెం కొంచెంగా తెరవాలి. ఈ రకంగా క్రైస్తవ గృహం ఒక పాఠశాలగా మారుతుంది. అందులో తల్లిదండ్రులు సహాయోపధ్యాయులుగా పని చేయగా క్రీస్తు ముఖ్య ఉపదేశకుడవుతాడు.DATel 572.3

  మన బిడ్డలకు మారుమనసు కలిగించడంలో పాపి పాపం స్పృహకు ప్రధాన నిదర్శనగా తీవ్ర భావోద్రేకానికి మనం ఎదురుచూడకూడదు. వారు మారుమనసు పొంది మారిన నిర్దిష్ట సమయం తెలుసుకోడం అగత్యం కాదు. తమ పాపాల్ని యేసు వద్దకు తీసుకురావాలని ఆయన క్షమాపణ వేడుకోవాలని, అప్పుడు తమను క్షమించి తాను వ్యక్తిగతంగా భూమి మీద ఉన్నప్పుడు చిన్న బిడ్డల్ని ఎలా స్వీకరించాడో అలాగే తమను కూడా స్వీకరిస్తాడని మనం వారకి నేర్పించాలి.DATel 573.1

  పిల్లలు తల్లిని ప్రేమిస్తారు గనుక తనకు విధేయులు కావడానికి ఆమె నేర్పించేటట్లే క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి పాఠాల్ని ఆమె నేర్పిస్తుంటుంది. బిడ్డకు తల్లి ప్రేమ క్రీస్తు ప్రేమను సూచిస్తుంది. తమ తల్లి చెప్పింది నమ్మి దాన్ననుసరించే చిన్నారులు రక్షకుణ్ని నమ్మి ఆయనకు విధేయులవ్వడం నేర్చుకుంటున్నారు.DATel 573.2

  యేసు చిన్న బిడ్డలికి ఆదర్శం. తండ్రికి కూడా ఆయన దృష్టాంతం. ఆయన అధికారంతో మాట్లాడాడు. ఆయన మాటల్లో శక్తి ఉంది. అయినా అమర్యాదగా దౌర్జన్యంగా వ్యవహరించే మనుషులతో మసలేటప్పుడు ఆయన ఒక్క కటువైన మాటగాని లేక అమర్యాదకర పదబంధంగాని ఉపయోగించలేదు. హృదయంలో క్రీస్తు కృప పారలౌకిక గౌరవాన్ని ఔచిత్యాన్ని ఇస్తుంది. కర్కశమైన దాన్ని సున్నితం చేస్తుంది. కాఠిన్యాన్ని నిర్దయను అణచివేస్తుంది. తండ్రులు తమ బిడ్డల్ని జ్ఞానం గల వ్యక్తులుగా, తమను ఇతరులు ఎలా చూడాలని కోరతారో అలాగే తమ చిన్నారులని చూసేలా నడిపిస్తుంది.DATel 573.3

  తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని తర్ఫీదు చెయ్యడంలో ప్రకృతిలో దేవుడిచ్చిన పాఠాల్ని అధ్యయనం చెయ్యండి. కనకాంధ్రాన్ని, లేదా గులాబీని లేదా లిల్లీని పెంచాలంటే ఏం చెయ్యాలి? ప్రతీ కొమ్మ ప్రతీ ఆకు వృద్ధి చెంది అందంగా రూపుదిద్దుకోడానికి ఏం చేస్తాడో తోటమాలినడిగి తెలుసుకోండి. మొక్కల్ని అజాగ్రత్తగా వంచడం, ఎలాపడితే అలా తవ్వడం వల్ల అది జరగదని తోటమాలి చెబుతాడు. అలా చెయ్యడం వల్ల సున్నితమైన కాడలు విరిగిపోతాయి. చిన్నచిన్న శ్రద్ధలు పదేపదే తీసుకోడం ద్వారానే అది సాధ్యపడుతుంది. తోటమాలి నేలను తడుపుతాడు. పెరుగుతున్న, మొక్కల్ని తీవ్రమైన సూర్యతాపం నుంచి భద్రంగా కాపాడాడు. దేవుడు వాటిని వృద్ధిపర్చుతాడు. అవి అందమైన పుష్పాలు పుష్పిస్తాయి. మీ పిల్లలతో వ్యవహరించేటప్పుడు తోటమాలి పద్ధతిని అవలంబించండి. సున్నితమైన స్పర్శ ద్వారా, ప్రేమ రంగరించిన ఉద్దేశం ద్వారా క్రీస్తు ప్రవర్తనను అనుకరించి వారి ప్రవర్తనను రూపుదిద్దడానికి ప్రయత్నించండి.DATel 573.4

  దేవుని పట్ల సాటి మనుషుల పట్ల ప్రేమను కలిగి ఉండడానికి చిన్నారుల్ని ప్రోత్సహించండి. యధార్థమైన ప్రేమానురాగాల్ని బలహీనతగా పరిగణించడం, వాటిని ఖండించడం, అణచి వెయ్యడం, లోకంలో కఠిన హృదయులైన స్త్రీలు పురుషుల ఉనికికి హేతువులు. ఈ వ్యక్తుల మంచి స్వభావం వారి బాల్యంలోనే అణచివేతకు గురి అయ్యింది. దైవ ప్రేమ కాంతి వారి స్వార్థాన్ని కరిగించివేస్తేనే తప్ప వారి ఆనందం నిరంతరంగా నాశనమౌతుంది. మన బిడ్డలు యేసుకున్న కారుణ్యాన్ని దేవదూతలు ప్రదర్శించే సానుభూతిని కలిగి ఉండాలని మనం కోరుకుంటే బాల్యంలోని ఉదారత, ప్రేమ ఉద్వేగాల్ని మనం ప్రోత్సహించాలి.DATel 574.1

  ప్రకృతిలో క్రీస్తుని చూడడానికి పిల్లలకి నేర్పించండి. వారిని ఆరుబయట చక్కని చెట్ల కిందకు, తోటలోకి తీసుకువెళ్లండి. అద్భుతమైన దైవ సృష్టి అంతటిలోను వెల్లడైన ఆయన ప్రేమను చూడడానికి వారికి నేర్పించండి. సకల జీవరాశుల పాలనకు సంబంధించిన చట్టాల్ని ఆయనే చేశాడని మనకు సంబంధించిన చట్టాల్ని కూడా ఆయనే చేశాడని ఈ చట్టాలు మన సంతోషానందాల కోసం ఆయన చేశాడని వారికి బోధించండి. పిల్లల్ని దీర్ఘప్రార్థనలతోను ఆయాసకరమైన హితబోధలతోను విసిగించకండి. కాని ప్రకృతి ఆధారిత పాఠాల ద్వారా దైవ ధర్మశాస్త్రానికి విధేయులై జీవించడం నేర్పించండి.DATel 574.2

  క్రీస్తు అనుచరులుగా మీరు మీ బిడ్డల విశ్వాసాన్ని పొందే కొద్దీ ఆయన మనల్ని ప్రేమిస్తోన్న మహోన్నత ప్రేమను గూర్చి వారికి నేర్పించడం సులభ సాధ్యమవుతుంది. రక్షణ సత్యాల్ని విశదం చెయ్యడానికి ప్రయత్నిస్తూ పిల్లల్ని తమ వ్యక్తిగత రక్షకుడుగా యేసు తట్టుకు తిప్పినప్పుడు దేవదూతలు నాపక్క ఉంటారు. తమ చిన్నపిల్లల్ని బేల్లె హేము శిశువు, వాస్తవంగా లోక నిరీక్షణ అయిన ఆయన కథను ఆసక్తికరంగా అందించడానికి తల్లులికి తండ్రులికి ప్రభువు కృపను అనుగ్రహిస్తాడు.DATel 575.1

  తన వద్దకు రానీయకుండా పిల్లన్ని ఆటంకపర్చవద్దని యేసు తన శిష్యుల్ని ఆదేశించినప్పుడు, ఆయన అన్నియుగాల్లోను ఉన్న తన అనుచరులతో మాట్లాడున్నాడు - సంఘాధికారులతో, బోధకులతో, సహాయకులతో, క్రైస్తవులందరితో మాట్లాడున్నాడు. యేసు చిన్న పిల్లల్ని ఆహ్వానిస్తోన్నాడు. వారిని రానీయవలసిందిగా మనల్ని ఆదేశిస్తోన్నాడు. మీరు ఆటంక పర్చకపోతే వారు వస్తారు అన్నట్లు ఆయన ఉద్దేశిస్తోన్నాడు.DATel 575.2

  క్రీస్తుని పోలని ఈ ప్రవర్తనతో యేసుని అపార్థం పాలు చెయ్యకండి. ఈ ఉదాసీనత వల్ల కాఠిన్యంవల్ల చిన్నారుల్ని ఆయనకు దూరంగా ఉంచకండి. మీరుంటే పరలోకం తమకు సంతోషానందాల తావు కాదని వారు భావించడానికి కారణం కాకండి. మతం పిల్లలికి అర్థంకాని విషయమన్నట్లు మాట్లాడకండి. లేక వారు తమ బాల్యంలో క్రీస్తును అంగీకరించగూడదు అన్నట్లు మాట్లాడకండి. క్రీస్తు మతం సంతోషమన్నది లేని మతమని ఆయన వద్దకు రావడమంటే జీవితాన్ని ఆనందంతో నింపే సమస్తాన్నీ విడిచి పెట్టడమని వారికి తప్పుడు అభిప్రాయం కలిగించకండి.DATel 575.3

  పరిశుద్ధాత్మ చిన్నపిల్లల హృదయాల్లో పనిచేస్తుండగా ఆయనతో సహకరించండి. రక్షకుడు వారిని పిలుస్తున్నాడని వారికి నేర్పించండి. వారు తమ చిన్నతనంలో తమ్మును తాము ఆయనకు సమర్పించుకోడం కన్నా ఆయనకు ఆనందాన్నిచ్చేది మరేదిలేదని నేర్పించండి.DATel 575.4

  రక్షకుడు తన సొంత రక్తంతో కొన్న ఆత్మల్ని అనంతమైన దయ కనికరాలతో పరిగణిస్తాడు. వారిని ఆయన తన ప్రేమతో సంపాదించాడు. వారి వంక చెప్పలేనంత ఆశతో చూస్తాడు. మంచి ప్రవర్తనగల పిల్లలే కాదు పారంపర్యంగా వస్తున్న ప్రవర్తన దోషాలున్న పిల్లలికి కూడా ఆయన ఆకర్షితుడవుతాడు. తమ పిల్లల్లో ఈ గుణదోషాలకు తాము ఎంత బాధ్యులో అనేక మంది తల్లిదండ్రులు ఎరుగరు. తప్పులు చేస్తున్న పిల్లల పట్ల దయగా వివేకంతో వ్యవహరించరు. వారు అలా ఉండడానికి తామే కారణమని గుర్తించరు. అయితే యేసు ఆ పిల్లలపట్ల కనికరం కలిగి ఉంటాడు. కార్యానికి కారణం కనుగొంటాడు.DATel 575.5

  ఈ పిల్లల్ని రక్షకుని వద్దకు నడిపించడంలో క్రైస్తవ కార్యకర్త క్రీస్తుకి ప్రతినిధి కావచ్చు. వివేకం, నేర్పు ద్వారా వారిని ఆకట్టుకోవచ్చు. వారికి ధైర్యాన్ని నిరీక్షణను అందించవచ్చు. క్రీస్తు కృప ద్వారా వారి ప్రవర్తనలో మార్పుకలిగించవచ్చు. “దేవుని రాజ్యము ఈలాటి వారిది” అని చెప్పవచ్చు.DATel 576.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents