Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  15—పెండ్లి విందులో

  యెరుషలేములోని సన్ హెడ్రిన్ ముందు గొప్పకార్యం చెయ్యడం ద్వారా యేసు తన సేవను ప్రారంభించలేదు. గలిలయలోని చిన్నపల్లెలో ఓ గృహంలో జరుగుతోన్న పెండ్లి విందులో ఆయనశక్తి ప్రదర్శన జరిగి అందర్నీ ఆనంద పరవశుల్ని చేసింది. ఆయన మానవులపట్ల తన సానుభూతిని, వారి సంతోషానందాల విషయంలో తన ఆసక్తిని ఇలా కనపర్చాడు. శోధనారణ్యంలో దుఃఖ పాత్రలోనిది ఆయన తానే తాగాడు. మానవులికి దీవెన పాత్రను అందించడానికి, తన ప్రసన్నతవల్ల మానవజీవిత సంబంధాల్ని పరిశుద్ధపర్చడానికి ఆయన అరణ్యంనుంచి బయటికి వచ్చాడు.DATel 136.1

  యేసు యోర్దానునుంచి గలిలయకు తిరిగివచ్చాడు. నజరేతుకు సమీపంలో ఉన్న కానా అనే చిన్నపట్టణంలో వివాహం జరుగుతోంది. పెళ్ళి వారు యోసేపు మరియలకు బంధువులు. ఇది ఎరిగిన యేసు కానాకు వెళ్లాడు. యేసును ఆయన శిష్యుల్ని పెళ్లి విందుకు ఆహ్వానించారు పెళ్లివారు.DATel 136.2

  యేసు తల్లిని కలుసుకుని చాలా కాలమయ్యింది. తల్లిని ఇక్కడ మళ్ళీ కలుసుకున్నాడు. ఆయన బాప్తిస్మమప్పుడు యోర్దానువద్ద జరిగిన ప్రదర్శనగురించి మరియ విన్నది. ఆవార్త నజరేతుకు వెళ్ళింది. ఎన్నో ఏళ్ళుగా తన మనసులో దాగి ఉన్న సన్నివేశాల్ని ఇది మళ్ళీ ఆమెకు జ్ఞాపకం చేసింది. ఇశ్రాయేలీయులందరి లాగే స్నానికుడైన యోహాను పరిచర్యను గూర్చి మరియ హృదయం దీర్ఘాలోచనలో పడింది. అతడి జన్మ సంబంధిత ప్రవచనం ఆమెకు బాగా జ్ఞాపకముంది. ఇప్పుడు యేసుతో అతడి సంబంధం ఆమె ఆశ, నిరీక్షణల్ని నూతనంగా రగిలించింది. యేసు అరణ్యానికి వెళ్లాడన్న మర్మగర్భిత వార్త కూడా ఆమెకు చేరింది. ఆమె మనసు భయాందోళనలతో కలత చెందింది.DATel 136.3

  నజరేతులోని తన గృహంలో దూత తెలిపిన వార్త విన్న నాటి నుంచీ, యేసు మెస్సీయా అనడానికి కనిపించిన ప్రతీ నిదర్శనాన్ని మరియ తసహృదయంలో భద్రంగా దాచుకుంది. సౌమ్యమైన, స్వార్థరహితమైన ఆయన జీవితం ఆయన దేవుడు పంపిన వాడేతప్ప మరెవరూ కాదని ఆమెలో దృఢనమ్మకం కలిగించింది. అయినా ఆమెకు కూడా సంశయాలు అశాభంగాలు ఎదురయ్యాయి. ఆయన మహిమ వెల్లడయ్యే సమయం ఎప్పుడొస్తుందా అని ఆమె ఆశతో ఎదురు చూసింది. యేసు జననం గురించిన మర్మం తాలుకు జ్ఞానాన్ని తనతో పంచుకున్న తన భర్త మరణంవల్ల ఆమెకు దూరమయ్యాడు. ఇప్పుడు తన నిరీక్షణల్ని భయాందోళనల్ని చెప్పుకోగలవారు. ఎవ్వరూలేరు. గడచిన రెండు మాసాలూ దుఃఖంతో నిండినమాసాలు. యేసుతో ఎడబాటుకలిగింది. ఆయన సానుభూతి ఆమెకెంతో సాంత్వన నిచ్చేది. “నీహృదయములోనికి ఒకఖడ్గము దూసికొనిపోవును” అని సుమెయోను అన్న మాటల్ని గూర్చి ఆమె ఆలోచించడం మొదలు పెట్టింది. (లూకా 2:35). మూడు రోజులు ఆయనను పోగొట్టుకున్నప్పుడు ఆయన్ని పూర్తిగా పోగొట్టుకున్నానని భావించి ఆందోళనతో ఆయన తిరిగిరావడానికి ఎదురుచూసిన సందర్భాన్ని మరియ గుర్తుచేసుకుంది.DATel 137.1

  పెండ్లి విందులో ఆయన్ని కలుసుకుంది. ఆయనలో మార్పేమీలేదు. కుమారుడుగా అదే ప్రేమ అదే ఆదరం కనపర్చాడు. ఆయన ముఖంలో మార్పు కనిపించింది. ఆయన ముఖంలో నూతనివి నూతనశక్తి ప్రస్పుటమయ్యాయి. ఆయన నిర్వహించాల్సిన పారలౌకిక కర్తవ్యానికి అవి సూచికలు. ఆయనతో యువకుల గుంపు ఉంది. వారు ఆయన్ని అపార గౌరవమర్యాదలతో చూస్తున్నారు. ఆయన్ని వారు ప్రభువుగా పిలుస్తోన్నారు. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు, ఇంకా వేరేతావుల్లోను తాము ఏమిచూశారో ఏమివిన్నారో అవన్నీ వారు మరియకు వర్ణించారు. “ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవనిగూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి” (యోహాను 1:45) అని వారు చెప్పారు.DATel 137.2

  సమావేశమైన అతిథుల్లో చాలామంది ఏదో అంశంపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. చిన్న చిన్న గుంపులుగా చేరి ప్రజలు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. కొందరు మరియ కుమారుడివంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. యేసును గురించి శిష్యుల సాక్ష్యంవిన్న మరియ దీర్ఘకాలంగా తనలో ఉన్న ఆశలు నిరీక్షణ వ్యర్ధంకాలేదని ఎంతో ఆనందించింది. అయినా ఈ పరిశుద్దానందంతోపాటు ప్రేమామయి అయిన తల్లికి స్వాభావికంగా ఉండే అతిశయం లేకపోతే ఆమె మానవాతీతమైన స్త్రీ అనాలి. అందరికళ్ళు యేసు మీదే ఉండడం గమనించిన మరియ తన కుమారుడు వాస్తవంగా దైవాదరాన్ని పొందినవాడని అక్కడ సమావేశమైన జనులికి నిరూపించుకోవాలని ఆమె ఆకాక్షించింది. వారి ముందు ఒక అద్భుతం చేసే అవకాశం ఆయనకు కలగాలని ఎంతగానో కోరుకున్నది.DATel 138.1

  ఆ కాలంలో వివాహవేడుకలు కొన్నిదినాలు కొనసాగడం ఆనవాయితీ. ఈ సమయంలో, విందు సమాప్తం కాకముందే ద్రాక్షరసం అయిపోయింది. ఇది తీవ్ర ఆందోళనను మానసిక క్షోభను కలిగించింది. వేడుక సమయాల్లో ద్రాక్షరసం సరఫరా చెయ్యకపోవడం అసాధారణం. అది లేకపోవడం అతిథి మర్యాదలు పాటించకపోవడంమౌతుంది. రెండు పక్కలవారికీ బంధువుగా విందు ఏర్పాట్లలో మరియ సహాయం చేసింది. ఆమె ఇప్పుడు యేసుతో ఇలా అంటోంది, “వారికి ద్రాక్షరసము లేదు.” వారి అవసరాన్ని తీర్చమని ఈ మాటలు సూచిస్తోన్నాయి. యేసు ఇలా జవాబిచ్చాడు, “అమ్మా నాతో నీకేమి పని? నా సమయ మింకను రాలేదు. ”DATel 138.2

  మనకు అసంగతంగా కనిపిస్తోన్న ఈ సమాధానం ఉదాసీనతనుగాని అమర్యాదనుగాని సూచించడం లేదు. రక్షకుడు తన తల్లిని సంబోధించిన తీరు తూర్పుదేశాల ఆచారానికి అనుగుణంగా ఉంది. గౌరవమర్యాదలు చూపాల్సిన వారిని ఇలా సంబోంధించడం జరిగేది. ఈ లోకంలో క్రీస్తు తొలినాళ్ళ జీవితంలోని ప్రతీ కార్యం ఆయనే ఇచ్చిన ఈ సూత్రానికి అనుగుణంగా ఉంది. “నీ తండ్రిని నీతల్లిని సన్మానించుము.” నిర్గమ 20:12. సిలువమిద ఉండి తల్లిపట్ల ప్రేమానురాగాలు వ్యక్తంచేసిన చివరి కార్యంలో ఆమెను తన అనుంగు శిష్యుడు యోహానుకు అప్పగించినప్పుడు యేసు మళ్లీ ఆమెను ఆరీతిగానే సంబోధించాడు. పెండ్లి విందువద్ద సిలువమిద ఈ రెండు సందర్భాల్లోను ఆయన వ్యక్తంచేసిన ప్రేమధ్వని తీరు ఆయనమాటలకు అర్ధంచే చేకూర్చాయి.DATel 138.3

  తన బాల్యంలో దేవాలయ సందర్శన సమయంలో తన జీవిత కర్తవ్యాన్ని గూర్చిన మర్మం తనకు విశదంగా గోచరమైనప్పుడు క్రీస్తు మరియతో ఇలా అన్నాడు, “నేను నాతండ్రి పనిమిద నుండవలెనని మీరెరుగరా?” లూకా 2:49. ఈ మాటలు ఆయన యావజ్జీవితానికి పరిచర్యకు ప్రధాన లక్ష్యాన్ని నిర్దేశిస్తోన్నాయి. లోకంలోకి ఆయన ఏ కార్యనిర్వహణ నిమిత్తం వచ్చాడో ఆ విమోచన మహాకార్యాన్ని సాధ్యంచేసేందుకుగాను ప్రతీ విషయాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఆ పాఠాన్నే ఆయన ఇప్పుడు పునరుద్ఘాటించాడు. యేసుతో తనబాంధవ్యం ఆయనపై తనకు ప్రత్యేక హక్కును ఇస్తోందని, కొంతమేరకు ఆయన పరిచర్యను నిర్దేశించే అధికారాన్ని తనకు దఖలు పర్చుతోందని మరియ పరిగణించే ప్రమాదముంది. ముప్పయి ఏళ్ళుగా ఆయన ఆమెకు ప్రేమ విధేయతలుగల కుమారుడుగా నివసించాడు. ఆ ప్రేమ మార్పులేనిది. కాని ఇప్పుడు ఆయన తన తండ్రి పనిలో నిమగ్నుడవ్వాలి. అత్యున్నతుని కుమారుడుగా, లోక రక్షకుడుగా ఆయన్ని తన కర్తవ్యం నుంచి లౌకికమైన ఏ బాంధవ్యం ఆపకూడదు లేదా ఆయన వ్యవహరణను ప్రభావితం చెయ్యకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన స్వేచ్ఛగా నిలబడాలి. ఈ పాఠం మనం కూడా నేర్చుకోడం అవసరం. దైవ విధుల నిర్వహణ మానవ బాంధవ్యాల కన్నా ప్రాధాన్యం కలది. ఆయన నిర్దేశించిన మార్గంలో నుంచి మన పాదాల్ని ఏ లౌకికాకర్షణా మళ్లించకూడదు.DATel 139.1

  పతనమైన మానవజాతి రక్షణకు నిరీక్షణ క్రీస్తే. మరియకు దేవుని గొర్రెపిల్లద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది. ఆమెలో అర్హత ఏమిలేదు. క్రీస్తుతో ఆమె సంబంధం ఏ ఇతర మానవుడికన్నా వ్యత్యాసమైన ఆధ్యాత్మిక లబ్దిని ఆమెకు చేకూర్చలేదు. రక్షకుని మాటల్లో ఇది తేటతెల్లమయ్యింది. మనుషకుమారుడిగాను దేవుని కుమారుడిగాను ఆమెతో తన సంబంధంలోని వ్యత్యాసాన్ని ఆయన స్పష్టంచేశాడు. తమ మధ్య ఉన్న బాంధవ్యం ఆయనతో ఆమెను సమానం చెయ్యదు.DATel 139.2

  “నా సమయమింకను రాలేదు” అన్న మాటలు భూమిపై క్రీస్తు జీవితంలోని ప్రతీ చర్య అనాదినుంచి ఉనికిలో ఉన్న ప్రణాళికా బద్దంగా ఉన్నదని సూచిస్తోన్నాయి. ఆయన భువికి రాకముందు ఆ ప్రణాళికను చూశాడు. అది పరిపూర్ణమైన ప్రణాళిక. అయితే ఆయన మనుషుల మధ్య సంచరించినప్పుడు తండ్రి చిత్తాన్ననుసరించే ప్రతీ అడుగూ వేశాడు. నియమిత సమయం వచ్చినప్పుడు కార్యాచరణకు వెనకాడలేదు. సమయం వచ్చేవరకు అదే అంకితభావంతో కనిపెట్టాడు.DATel 140.1

  యేసు తన సమయం ఇంకను రాలేదని మరియతో చెప్పడంలో ఆమె మనసులో ఉన్న తలంపుకు అనగా తక్కినవారిలా ఆమె మనసులో ఉన్న కోరికకు ఆయన సమాధానం ఇస్తోన్నాడు. ఆయన తన్ను తాను మెస్సీయగా ప్రత్యక్షపర్చుకుని ఇశ్రాయేలు సింహాసనాన్ని అధిరోహిస్తాడని ఆమె ఎదురుచూసింది. అయితే దానికింకా సమయంరాలేదు. రాజుగా కాక “వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిననుభవించినవాడు గాను” యేసు మానవుడి మనుగడను అంగీకరించాడు.DATel 140.2

  క్రీస్తు పరిచర్యను గూర్చి మరియకు సరిఅయిన అవగాహన లేకపోయినా ఆమె ఆయనను మినహాయింపులు లేకుండా విశ్వసించింది. ఈ విలక్షణ విశ్వాసానికి యేసు స్పందించాడు. మరియ విశ్వాసాన్ని దృఢపర్చడానికి యేసు తనమొదటి సూచక క్రియను చేశాడు. అవిశ్వాసానికి దారితీసే అనేక శోధనల్ని శిష్యులు ఎదుర్కోవాల్సి ఉన్నారు. యేసే మెస్సీయా అని ప్రవచనాలు వారికి నిర్వందంగా తెలిపాయి. మత నాయకులు తమకన్నా సమధిక విశ్వాసంతో ఆయన్ని స్వీకరిస్తారని శిష్యులు ఎదురుచూశారు. క్రీస్తు మహత్కార్యాల్ని, ఆయన పరిచర్యవిషయంలో తమ ప్రగాఢ విశ్వాసాన్ని వారు ప్రజలకు వెల్లడిచేశారు. కాని ప్రజల అవిశ్వాసం, యాజకులు రబ్బీలు క్రీస్తుపట్ల ప్రదర్శించిన శత్రుత్వం తీవ్ర విద్వేషం శిష్యుల్ని దిగ్ర్భాంత పర్చాయి. రక్షకుని తొలినాళ్ళ సూచక క్రియలు శిష్యుల్ని బలోపేతం చేశాయి. వైరుధ్యాన్ని ఎదుర్కోడానికి వారికి స్థయిర్యాన్నిచ్చాయి.DATel 140.3

  యేసు మాటలకు నిరాశ చెందక బల్లలవద్ద సరఫరాచేసే వారితో మరియ ఇలా అంది, “ఆయన మీతో చెప్పునది చేయుడి.” క్రీస్తు చేయాల్సిన కార్యానికి ఆమె ఇలా మార్గం సరాళం చేసింది.DATel 141.1

  ద్వారం వద్ద ఆరు రాతి బానలున్నాయి. వాటిని నీళ్లతో నింపాల్సిందిగా యేసు పరిచారకులతో చెప్పాడు. అలాగే వారు ఆబానలు నింపారు. వెంటనే ద్రాక్షరసం అవసరం ఏర్పడ్డప్పుడు, “మీరిప్పుడు ముంచి, విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండి” అన్నాడు. బానల్లో వారు నింపిన నీళ్ళు లేవు. ద్రాక్షరసం అయిపోయిన సంగతి విందు ప్రధానికి గాని అతిథులకు గాని తెలియలేదు. పరిచారకులు తెచ్చిన ద్రాక్షరసాన్ని రుచిచూచిన విందు ప్రధాని అలాంటి మేలిమి ద్రాక్షరసం తానెన్నడూ తాగలేదని, విందుప్రారంభంలో ఇచ్చిన దానికన్న ఇదెంతో వ్యత్యాసమైందని అన్నాడు. పెండ్లికుమారుడి పక్కకు తిరిగి ఇలా అన్నాడు, “ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసమును పోయును; నీవైతే ఇంతవరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొనియున్నావు.”DATel 141.2

  మనుషులు ఉత్తమ ద్రాక్ష రసాన్ని ముందిచ్చి తదనంతరం నాసిరకం ద్రాక్షరసం ఇచ్చే రీతిగానే లోకం తన ఈవుల్ని ఇస్తూ ఉంటుంది. లోకం ఇచ్చేది కంటికి ఇంపుగా ఉండవచ్చు. మనోభావాల్ని ఆహ్లాదపర్చవచ్చు. కాని అది ఆత్మకు తృప్తినిచ్చేదికాదని రుజువవుతోంది. ద్రాక్ష రసం చేదవుతుంది. ఆనందం విషాదమౌతుంది. పాటలతో ఉత్సాహంతో ప్రారంభమయ్యింది ఆయాసంతో విసుగుదలతో అంతమౌతుంది. అయితే యేసిచ్చే వరాలు సర్వదా తాజాగా నూతనంగా ఉంటాయి. ఆత్మకు ఆయనిచ్చే విందు తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది. ప్రతీ నూతన వరం ప్రభువు దీవెనల్ని స్వీకరించి అభినందించి అనుభవించడానికి వ్యక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆయన కృపను కృపకిస్తాడు. సరఫరాలో వైఫల్యముండదు. మీరు ఆయనయందు ఉన్నట్లయితే నేడు మీరు గొప్పవరం పొందుతారన్న విషయం, రేపు మరింత గొప్పవరం పొందుతారనడానికి భరోసా. నతనయేలుతో యేసన్న మాటలు విశ్వాసంగల తన బిడ్డలతో దేవుడు ఎలా వ్యవహరిస్తాడో అన్న నియమాన్ని సూచిస్తున్నాయి. ప్రతీ తాజా ప్రేమ ప్రత్యక్షతతో లబ్దిదారుడి హృదయానికి ఆయనిలా ప్రకటిస్తాడు, “నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువు. ” యోహాను 1:50DATel 141.3

  వివాహ విందులో యేసిచ్చిన ఈవి ఓ సంకేతం. నీళ్లు ఆయన మరణంలోకి బాప్తిస్మాన్ని సూచిస్తోన్నాయి. ద్రాక్షరసం లోకపాపాల నిమిత్తం ఆయన రక్తం చిందించడాన్ని సూచిస్తోంది. బానలు నింపడానికి తెచ్చిన నీళ్లు మానవ హస్తాలు తెచ్చినవి. అయితే ఆనీటికి జీవదాయక శక్తి నిచ్చింది క్రీస్తు పలికిన మాటే. రక్షకుని మరణాన్ని సూచించే ఆచార విధుల విషయంలోను ఇంతే. విశ్వాసం ద్వారా పనిచేసే క్రీస్తు శక్తి ద్వారా మాత్రమే ఆత్మను పరిపుష్టం చేసే శక్తిని వారు పొందగలుగుతారు. ఈDATel 142.1

  క్రీస్తు మాటల వల్ల విందుకు సమృద్ధిగా సరిపోయినంత ద్రాక్షరసం సరఫరా అయ్యింది. అలాగే ఆయన కృప మనకు సమృద్ధిగా సరఫరా అవుతుంది. మానవుల దోషాల్ని తుడిచివేసి ఆత్మను నూతనపర్చి పోషించడానికి సరిపోయేంత సమృద్ధిగా అది సరఫరా అవుతుంది.DATel 142.2

  శిష్యులతో కలిసి తాను హాజరైన మొదటి విందులో యేసు వారికి గిన్నె నిచ్చాడు. అది వారి రక్షణ నిమిత్తం ఆయన చేయనున్న పరిచర్యకు చిహ్నం. తన చివరి రాత్రి భోజనంలో గిన్నెను వారికి మళ్లీ ఇచ్చాడు. “ప్రభువు వచ్చు వరకు” (1 కొరి 11:26) ఆయన మరణాన్ని గుర్తుచేసే ఆచారం రూపేణ దాన్నిచ్చాడు. శిష్యులు ప్రభువు నుంచి వేరవుతున్నప్పుడు వారికి కలిగిన దుఃఖం, తిరగి కలయికను గూర్చిన ఈ వాగ్దానం వల్ల ఉపశమించింది. “నా తండ్రి రాజ్యములో మితో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు, ఇక దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను.” మత్తయి 26:29.DATel 142.3

  వివాహవిందుకు’ క్రీస్తు సరఫరా చేసిన ద్రాక్షరసం, తన రక్తానికి చిహ్నంగా శిష్యులకిచ్చిన ద్రాక్షరసం స్వచ్ఛమైన ద్రాక్షపండ్ల రసం. “ద్రాక్ష గెలలలో”ని కొత్త ద్రాక్షరసం గురించి ప్రవక్త యెషయా ప్రస్తావిస్తూ “అది దీవెనకరమైనది, దాని కొట్టివేయకుము” (యెషయా 65:8) అన్నప్పుడు అతడు ఉద్దేశించింది ఇదే.DATel 142.4

  “ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దీని వశమైన వారందరు జ్ఞానము లేనివారు” అని ఇశ్రాయేలుకు పాత నిబంధనలో హెచ్చరించింది. క్రీస్తే. (సామెతలు 20:1). అలాంటి పానీయం ఆయన ఇవ్వలేదు. మనుషుల ఆలోచనను మసకబార్చి వారి ఆధ్యాత్మిక అవగాహనను మందగిల్లజేసే వ్యసనాల్లో చిక్కుకోడానికి వారిని శోధిస్తాడు సాతాను. కాగా మనం మన దుష్టనైజాన్ని అదుపులో ఉంచుకోవాలని క్రీస్తు ఉద్భోధిస్తోన్నాడు. ఆత్మోపేక్షకు ఆయన యావజ్జీవితం ఓ దృష్టాంతం. ఆహారాశ శక్తిని నిర్వీర్యం చెయ్యడానికి ఆయన మన పక్షంగా కఠినాతి కఠినమైన శోధనను భరించాడు. ద్రాక్షరసంగాని మద్యంగాని తాగవద్దని స్నానికుడైన యోహాన్ని ఆదేశించింది క్రీస్తే. అలాంటి ఆంక్షల్ని మనోహ భార్యపై విధించిందీ ఆయనే. తన పొరుగువాడికి మద్యాన్ని అందించే వాడి పై శాపం ప్రకటించాడు ఆయన. క్రీస్తు తన బోధనను తానే ఖండిచుకోలేదు. పెండ్లికి వచ్చిన అతిథులకు సరఫరా చేసిన పులియని ద్రాక్షరసం ఆరోగ్య వంతం బలవర్ధకం అయిన పానీయం. అది రుచి ఆరోగ్యదాయకమైన ఆకలిని సమన్వయపర్చుతుంది.DATel 142.5

  ద్రాక్షరసం నాణ్యతను గురించి విందుకు వచ్చిన అతిథులు వ్యాఖ్యానిస్తూ పరిచారకుల్ని ప్రశ్నించినప్పుడు ఆ అద్భుతకార్యం తాలూకు వివరాలు బయలుపడ్డాయి. ఆ జనులు ఆ అద్భుత కార్యాన్ని గూర్చి అమితాశ్చర్యంతో తబ్బిబ్బయి ఆ అద్భుతాన్ని చేసిన ప్రభువునిగూర్చి ఆలోచించలేదు. ఎట్టకేలకు ఆయన కోసం చూసినప్పుడు ఆయన చడిచప్పుడు లేకుండా అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడకు వెళ్ళాడో తన శిష్యులికి కూడా తెలియదు.DATel 143.1

  ప్రజల గమనం ఇప్పుడు ప్రభువు శిష్యులమీద నిలిచింది. యేసుపై తమ విశ్వాసాన్ని వెలిబుచ్చడానికి వారికి మొట్టమొదటిసారిగా అవకాశం లభించింది. యోర్దాను వద్ద తాము చూసిన ఘటనల్ని విన్న సంగతుల్ని వారు చెప్పారు. తన ప్రజల్ని విముక్తుల్ని చేసేందుకు దేవుడు విమోచకుణ్ని లేపాడన్న నిరీక్షణ అనేకుల హృదయాల్లో రగుల్కొన్నది. ఆ సూచక క్రియను గూర్చిన వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. అది యెరుషలేముకు సైతం పాకింది. యాజకులు పెద్దలు క్రీస్తు రాకను గురించి ప్రవచనాల్ని పరిశోధించారు. ప్రజల మధ్య నిరాడంబరంగా మసలుతున్న ఈ నూతన బోధ కుడి జీవిత కర్తవ్యాన్ని గూర్చి తెలుసుకోవాలన్న ఆకాంక్ష ప్రస్పుటమయ్యింది.DATel 143.2

  క్రీస్తు పరిచర్య యూదు పెద్దల పరిచర్యకన్నా చాలా భిన్నమైంది. సంప్రదాయంపట్ల మత ఛాందసంపట్ల వారి అభిమానం భావ స్వాతంత్ర్యాన్ని లేదా ఆచరణ స్వేచ్ఛను నాశనం చేసింది. అపవిత్రపర్చడాన్ని గూర్చిన భయంతో వారు నిత్యం నివసించేవారు. “అపవిత్రమైన దాన్ని” ముట్టుకోకుండా తప్పించుకోడానికి వారు అన్యజనులకే గాక తమ సొంత ప్రజల్లో ఎక్కువ మందికి దూరంగా ఉండేవారు. వారికి ఉపకారం చేయడానికిగాని వారితో స్నేహం చెయ్యడానికిగాని ముందుకు వచ్చేవారు కాదు. ప్రతినిత్యం ఈ అంశాల్ని గురించి ఆలోచించడం ద్వారా వారు మానసికంగా పెరగకపోవడంతో వారి కార్యాచరణ వరిధి సంకుచితమయ్యింది. వారి ఆదర్శం అహంభావాన్ని ప్రోత్సహించి అన్నివర్గాల ప్రజల్లోను అసహనాన్ని పెంచింది.DATel 144.1

  మానవాళి పట్ల సానుభూతితో మెలగడం ద్వారా యేసు సమాజంలో దిద్దుబాటు ప్రారంభించాడు. దైవ ధర్మశాస్త్రంపట్ల ఎనలేని గౌరవం ప్రదర్శిస్తూ పరిసయ్యుల కపట భక్తిని గద్దించి, తమను బంధించిన అర్ధరహిత నియమనిబంధనల నుంచి విడిపించడానికి ప్రయత్నించాడు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల్ని విడదీస్తోన్న అడ్డుగోడల్ని పడగొట్టి వారిని ఏక కుటుంబసభ్యులుగా ఐక్యపర్చడానికి కృషిచేశాడు. పెండ్లి విందుకు హాజరుకావడం ఈ దిశగా ఆయన వేసిన ఒక ముందడుగు. -DATel 144.2

  స్నానికుడైన యోహానుని అరణ్యంలో నివసించాల్సిందిగా దేవుడు ఆదేశించాడు. అతణ్ని యాజకులు రబ్బీల దుష్ప్రభావం నుంచి పరిరక్షించి ఒక ప్రత్యేక కార్యనిర్వహణకు సిద్ధం చెయ్యడానికే దేవుడు ఈ పనిచేశాడు. మితవ్యయం ఏకాంత నివాసంలో గడిచిన అతడి జీవితం ప్రజలకు మాదిరిగా ఉద్దేశించింది కాదు. తమ పూర్వ విధుల్ని విడిచి పెట్టాల్సిందంటూ యోహాను తన శ్రోతల్ని ఎన్నడూ కోరలేదు. దేవుని పిలుపు తమకు ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఆయనకు నమ్మకంగా మారుమనసు పొందిన వారిగా నివసించాల్సిందని కోరాడు.DATel 144.3

  యేసు అన్ని రకాల విచ్చలవిడి ప్రవర్తనను ఖండించాడు. అయినా ఆయన సాంఘిక స్వభావం గలవాడు. ఆయన అన్ని తరగతుల ప్రజల ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ధనికులు, పేదలు, పండితులు, పామరుల గృహాలు సందర్శించాడు. సామాన్య జీవిత సమస్యల నుంచి ఆధ్యాత్మికమైన నిత్యమైన అంశాలపై వారి ఆలోచనల్ని నిలపడానికి ప్రయత్నించాడు. పాడుచేయడం చెదరగొట్టడం ఆయన సమ్మతించలేదు. చౌకబారు లౌకిక వినోదమేదీ ఆయన్ని అపవిత్రం చెయ్యలేదు. అయినా నిష్కళంకమైన, ఆనందాయకమైన దృశ్యాలు చూసి సంతోషించాడు. సాంఘిక సమావేశానికి హాజరవ్వడం ద్వారా వాటిని అంగీకరించాడు. యూదు వివాహం గొప్ప ఉత్సవం సమయం. దాని తాలూకు సంబరం దైవకుమారునికి సంతోషం కలిగించింది. ఈ వివాహ విందుకు హాజరవ్వడం ద్వారా వివాహాన్ని దైవ వ్యవస్థగా యేసు పరిగణించాడు.DATel 145.1

  పాత కొత్త నిబంధనలు రెండింటిలోనూ వివాహ సంబంధం క్రీస్తుకు ఆయన ప్రజలకు మధ్య ఉండే అనుబంధాన్ని ఐక్యతను సూచించడానికి విని యుక్తమయ్యింది. ఈ వివాహ వేడుకలు సమకూర్చే ఆనందం యేసు మనసుకు భవిష్యత్తులో తండ్రి ఇంటికి పెండ్లి కుమార్తెను తీసుకుని వచ్చినప్పుడూ, రక్షణ పొందినవారు రక్షకునితో కలిసి గొర్రెపిల్ల విందుకు కూర్చున్నప్పుడు సంతోషానందాల్ని సూచిస్తోంది. ఆయన ఇలా అంటున్నాడు, “పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు.” “ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమనుబట్టి శాంతము వహించి నీ యందలి సంతోషముచేత ఆయన హర్షించును.” జెఫన్యా 3:17. అపొస్తలుడైన యోహానుకు పరలోక విషయాల్ని గూర్చిన దర్శనం కలిగినప్పుడు అతడిలా రాశాడు, “గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి, గొట్టెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది. ” “గొట్టెపిల్ల పెండ్లి . విందుకు పిలువబడినవారు ధన్యులు.” ప్రకటన 19:6, 7, 9.DATel 145.2

  ప్రతీ ఆత్మలోను తన రాజ్యానికి పీలుపు పొందాల్సిన వ్యక్తిని యేసు చూశాడు. ప్రజల హితాన్ని కోరిన వ్యక్తిలా వారిమధ్య వ్యవహరించడం ద్వారా ఆయన ప్రజల మనసుల్ని ఆకట్టుకున్నాడు. వీధుల్లో, వీరి గృహల్లో పడవల్లో, సమాజ మందిరాల్లో, సరస్సు తీరాన, వివాహ విందులో ఆయన ప్రజల్ని కలుసుకున్నాడు. దినదినం చేసే పనుల్లో వారిని కలుసుకుని వారి లోకవ్యవహారాలపై ఆసక్తి ప్రదర్శించాడు. ఆయన తన ఉపదేశాన్ని గృహాల్లోకి తీసుకువెళ్ళాడు. ఆ కుటుంబంలోని వారిని ఆయన తన పరిశుద్ద ప్రభావం పరిధిలోకి తెచ్చేవాడు. ఆయన వ్యక్తిగత సానుభూతి ప్రజల హృదయాల్ని ఆకట్టుకుంది. ఆయన ఏకాంత ప్రార్ధన కోసం తరచు కొండల్లోకి వెళ్ళేవాడు. మానవుల మధ్య పనిచెయ్యడానికి ఇది ఆయనకు సిద్ధబాటు నిచ్చింది. ఈ ప్రార్థనల నుంచి బయటికి వచ్చి ఆయన వ్యాధిగ్రస్తుల్ని బాగుచేశాడు, రక్షణ మార్గం ఎరుగని ప్రజలకు ఉపదేశమిచ్చాడు, సాతాను చెరలో మగ్గుతున్నవారికి విముక్తి కలిగించాడు.DATel 146.1

  వ్యక్తిగతంగా కలిసి మాట్లాడం ద్వారాను వ్యక్తిగత సహవాసం ద్వారాను యేసు తన శిష్యులికి శిక్షణనిచ్చాడు. కొన్నిసార్లు కొండల పక్క శిష్యుల నడుమ కూర్చుని వారికి బోధించాడు. కొన్నిసార్లు సముద్రం పక్క కూర్చుని లేదా వారితో కలిసి మార్గంలో నడిచి వేళ్తూ వారికి దేవుని రాజ్యాన్ని గూర్చిన మర్మాల్ని విప్పి చెప్పేవాడు. ఆయన ఈనాటి బోధకుల్లా ప్రసంగాలు చెయ్యలేదు. దేవుని వర్తమానం వినడానికి సిద్ధమనసుగల ప్రజలు కనిపించినప్పుడు వారికి రక్షణ సత్యాల్ని బయలుపర్చాడు. శిష్యుల్ని ఇది చెయ్యండి అది చెయ్యండి అని శాసించలేదాయన. కాని “నన్ను వెంబడించుము.” అన్నాడు. పల్లెల్లోను పట్టణాల్లోను సంచరించునప్పుడు తనతో పాటు వారిని తీసుకువెళ్లి ప్రజలకు తాను ఎలా బోధిస్తున్నాడో వారికి చూపించేవాడు. వారి ఆసక్తుల్ని తన ఆసక్తులతో జోడించేవాడు. వారు ఆయనతో ఏకమై ఆయనతో కలిసి సేవ చేసేవారు.DATel 146.2

  మానవాళి ప్రయోజనాలతో అనుసంధానపర్చుకోడంలో క్రీస్తు ఆదర్శం సువార్త బోధకులకూ ఆయన కృపాసువార్తను పొందిన వారికీ ఆచరణీయం. మనం సాంఘిక సహవాసాన్ని కాదనకూడదు. మనం ఇతరులకి దూరంగా ఉండకూడదు. అన్ని తరగతుల ప్రజల్ని చేరేందుకు వారెక్కడుంటే అక్కడ వారిని కలుసుకోవాలి. వారు తమంతట తాము మనల్ని కలుసుకోరు. దేవుని సత్యానికి ప్రజలు స్పందించడం కేవలం ప్రసంగవేదిక నుంచి వచ్చే వర్తమానం వల్లే కాదు. ఇంకో సేవారంగం ఉంది. అది ఏమంత గంభీరంగా కనిపించకపోయినా అదీ అంతే శక్తికలది. అది సామాన్యులు సీదాసాదా ప్రజల గృహాల్లోను, ఘనులు భాగ్యవంతుల భవంతుల్లోను ఆసుపత్రి బోర్డుల్లోను, ఆటపాటలకు కూడుకునే సాంఘిక సమావేశాల్లోను ఉన్న సేవారంగం.DATel 146.3

  క్రీస్తు అనుచరులంగా మనం కేవలం వినోదాలు విలాసాల కోసం లోకంతో మమేకమవ్వకూడదు. మన మాటల ద్వారా లేదా క్రియల ద్వారా మన మౌనం ద్వారా లేదా మన సమక్షం ద్వారా మనం పాపాన్ని అనుమతించకూడదు. మనం ఎక్కడకు వెళ్తే అక్కడకు మనతో యేసును తీసుకువెళ్లి రక్షకుని ప్రాశస్థ్యాన్ని ఇతరులకు ప్రదర్శించాల్సి ఉన్నాం. రాతి గోడల నడుమ తమ మతాన్ని భద్రంగా కాపాడుకోడానికి ప్రయత్నించేవారు మేలుచేయడానికి తమకు వచ్చే బంగరు అవకాశాల్ని పొగొట్టుకుంటారు. క్రైస్తవ మతం సామాజిక సంబంధాల ద్వారా లోకానికి పరిచయమౌతుంది. దేవుని వాక్య కాంతిని పొందిన వారందరూ ఆ జీవపు వెలుగును పొందినవారి మార్గాన్ని ప్రకాశవంతం చేయాల్సి ఉన్నారు.DATel 147.1

  మనమందరం యేసుకి సాక్షులం కావాలి. రక్షకుని కోసం ఆత్మల్ని సంపాదించడానికి క్రీస్తు కృప ద్వారా పరిశుద్ధమైన సాంఘిక శక్తి వినియుక్తమవ్వాలి. మనం స్వప్రయోజనాల్లో తల మునకలయ్యేవారం కాదు మనం మన దీవెనల్ని ఆధిక్యతల్ని ఇతరులతో పంచుకునే మనుషులమని మనల్ని చూసి ప్రపంచం తెలుసుకోవాలి. మన మతం మనల్ని సానుభూతిలేని కర్కోటకులుగా చేసేది కాదని లోకం మనల్ని చూసి తెలుసుకోవాలి. క్రీస్తు విశ్వాసులుగా చెప్పుకునే వారందరూ పరులకు ఉపకారం చేయడంలో యేసులా పరిచర్యచేయాల్సి ఉన్నారు.DATel 147.2

  క్రైస్తవులు ఆనందం ఉత్సాహం లేని శోకమూర్తులో అన్న అభిప్రాయం లోకానికివ్వకూడదు. మన దృష్టి యేసు మిద నిలిచి ఉంటే మనం కృపామయుడైన రక్షకుణ్ని చూస్తాం. ఆయన ముఖంపై ప్రకాశించే వెలుగు మనపై ప్రకాశిస్తుంది. ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఆనందం ఉంటుంది. ఎందుకంటే దేవునిపై మనకు నిశ్చలమైన పరిశుద్ధమైన విశ్వాసం ఉంటుంది.DATel 147.3

  మానవమాత్రులైనప్పటికీ తాము దైవ స్వభావమందు ఆయనతో పాలివారమని క్రీస్తు అనుచరులు నిరూపించుకున్నప్పుడు ఆయన ఆనందిస్తాడు. వారు రాతి బొమ్మలు కారు. సజీవులైన పురుషులు, స్త్రీలు. దైవ కృప కుమ్మరింపు ద్వారా తెప్పరిల్లిన వారి హృదయాలు నీతి సూర్యుని కిరణాలకు విప్పారి విస్తరిస్తాయి వారు తమపై ప్రకాశించే వెలుగును క్రీస్తు ప్రేమచే ప్రకాశించే సత్కియల ద్వారా ఇతరుల్ని ప్రభావితం చేస్తారు.DATel 148.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents