Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    54—మంచి సమరయుడు

    మంచి సమరయుడి కథలో యధార్ధ మతం స్వభావాన్ని క్రీస్తు ఉదాహారిస్తోన్నాడు. మతమంటే వ్యవస్థలు, ఆచారాలు, కర్మకాండలు కాదని కాని ప్రేమతో కూడిన కార్యాలు చెయ్యడం, పరులకు మేలు చెయ్యడం, మంచి మనసు కలిగి ఉండడమే నిజమైన మతమని చూపిస్తోన్నాడు.DATel 554.1

    క్రీస్తు ప్రజలకు బోధిస్తోన్న సమయంలో “ధర్మశాస్తోపదేశకుడొకడు లేచి - బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను.” సమాధానం కోసం సభలోని వారందరూ ఉత్కంఠతో ఎదురుచూశారు. ఆ న్యాయవాదిచే ఈ ప్రశ్న వేయించడంతో క్రీస్తుని ఇరకాటంలో పెట్టాలని యాజకులు రబ్బీలు భావించారు. కాని రక్షకుడు అతడితో వాదోపవాదాలకు దిగలేదు. ప్రశ్నించినవాడి నుంచే జవాబును కోరాడు. “ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి యున్నది? నీవేమి చదువుచున్నావు?” అని ప్రశ్నించాడు. సీనాయి పై నుంచి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని యేసు పెద్దగా పట్టించుకోడం లేదని యూదులు ఆయపై ఇంకా ఆరోపణలు చేస్తున్నారు. అయితే రక్షణ దేవుని ఆజ్ఞల్ని ఆచరించడం మీద ఆనుకుని ఉన్నదని ఆయన సూచించాడు.DATel 554.2

    ఆ న్యాయవాది ఇలా అన్నాడు, “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడియున్నది.” అందుకు యేసు “నీవు సరిగా ఉత్తరమిచ్చతివి, ఆలాగున చేయుము అప్పుడు జీవించెదవు” అన్నాడు.DATel 554.3

    పరిసయ్యుల విధానాలు కార్యకలాపాలతో ఈ న్యాయవాది తృప్తి చెందలేదు. లేఖనాలు ఏమి చెబుతున్నవో తెలుసుకుని నేర్చుకోవాలన్న ఆసక్తితో అతడు అధ్యయనం చేస్తోన్నాడు. ఆ విషయమై అతడికి ఎంతో ఆసక్తి ఉంది. అందుకే చిత్తశుద్ధితో “నేనేమి చేయవలెను?” అని అడిగాడు. ధర్మశాస్త్ర విధుల్ని గుర్తించిన తన జవాబులో కోకొల్లలుగా ఉన్న ఆచార ధర్మశాస్త్ర సూత్రాల్ని అతడు పక్కన పెట్టేశాడు. వీటిని విలువలేనివిగా పరిగణించాడు. కాని ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ఆధారమైన రెండు గొప్ప నియామాల్ని ఉటంకించాడు. క్రీస్తు ప్రశంసలందుకున్న ఈ జవాబు రక్షకుణ్ని రబ్బీలకన్నా ఓ మెట్టు పైనుంచింది. ధర్మశాస్త్రకోవిదుడు సూచించింది ఆయన ప్రబోధించడంతో రబ్బీలు ఆయన్ని ఖండించలేకపోయారు.DATel 555.1

    “ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవు” అని యేసు చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని ఒక దివ్యమైన సమగ్రతగా ఆయన సమర్పించాడు. ఇందులోని ఒక సూత్రాన్ని పాటించి ఇంకొక సూత్రాన్ని ఉల్లంఘించడం సాధ్యం కాదని బోధించాడు. ఎందుకంటే అన్నిటికీ ఆధారమైన సూత్రం ఒకటే. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఆచరించడం మిదే మానవుని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దేవుని పట్ల సమున్నత ప్రేమ, మానవుడి పట్ల నిష్పక్షపాత ప్రేమ అన్న సూత్రాలు జీవితంలో క్రియాత్మకం కావాలి.DATel 555.2

    తాను ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తోన్నానని న్యాయవాది గుర్తించాడు. క్రీస్తు సూటిగా పలికిన మాటలు అతడిలో నమ్మకం పుట్టించాయి. తాను అవగాహన చేసుకున్న ధర్మశాస్త్ర సంబంధిత నీతిని అతడు ఆచరించలేదు. సాటి మనుషుల పట్ల ప్రేమను ప్రదర్శించలేదు. మారుమనసు అవసరం అయితే మారుమనసు పొందేబదులు అతడు తన్నుతాను సమర్ధించుకోడానికి ప్రయత్నించాడు. సత్యాన్ని అంగీకరించే బదులు ఆజ్ఞను నెవేర్చడం ఎంత కష్టమో చూపించాడు. ఇలా విశ్వసించడాన్ని, దాటవేసి ప్రజల దృష్టికి నీతిమంతుడుగా కనిపించాడు. తన ప్రశ్నకు సమాధానం తానే ఇచ్చాడు గనుక అతడి ప్రశ్న అనవసరమయ్యిందని రక్షకుని మాటలు స్పష్టం చేశాయి. అయినా అతడు “నా పొరుగువాడెవుడు?” అని మళ్లీ ప్రశ్నించాడు.DATel 555.3

    ఈ ప్రశ్న యూదుల మధ్య అంతులేని వివాదానికి దారితీసింది. అన్యజనులికి, సమరయులికి సంబంధించినంత వరకు వారికి ఏ సందేహం లేదు. అయితే స్వజాతి ప్రజలకు వచ్చేసరికి సమాజంలో వేర్వేరు తరగతుల ప్రజల మధ్య తేడా చూపించడం ఎలా? యాజకుడు, రబ్బీ, పెద్ద పొరుగువాడిగా ఎవర్ని పరిగణించాలి? వీరు తమ్మును తాము శుద్ధిపర్చుకోడానికి తమ జీవితమంతా ఆచారాలు వివిధ కర్మలు ఆచరించారు. అజ్ఞానులు అజాగరూకులు అయిన జనసమూహాలతో సంబంధం వల్ల అపవిత్రత కలుగుతుందని వీరు బోధించారు. “అపవిత్రుల్ని” వీరు తమ పొరుగువారిగా పరిగణించాలా?DATel 555.4

    మళ్లీ వాదోపవాదానికి దిగడానికి యేసు ఇష్టపడలేదు. తనను తప్పు పట్టడానికి చూస్తోన్న వారి మతదురభిమానాన్ని ఆయన విమర్శించలేదు. ఒక సామాన్య కథ ద్వారా ఆయన తన శ్రోతల ముందు పొంగిపొరలే పరలోక ప్రేమను వర్ణించే సన్నివేశాన్ని చిత్రించాడు. అది శ్రోతల హృదయాల్ని చలింపజేసింది. న్యాయవాది సత్యాన్ని ఒప్పుకున్నాడు.DATel 556.1

    చీకటిని పటాపంచలు చెయ్యడానికి వెలుగును స్వీకరించాలి. అసత్యాన్ని వ్యతిరేకించే ఉత్తమ మార్గం సత్యాన్ని అందించడమే. వెల్లడైన దైవప్రేమ స్వార్థంతో నిండిన హృదయ వైకల్యాన్ని పాపాన్ని కనపర్చుతుంది.DATel 556.2

    “ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్లూచు దొంగలచేతిలో చిక్కెను” అంటూ యేసు చెప్పడం మొదలు పెట్టాడు. “వారు అతని బట్టలు దోచుకొని, అతనిని కొట్టి కొనప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను” (లూకా 10:30-32) అన్నాడు. ఇది ఊహాదృశ్యం కాదు. ఇది నిజంగా జరిగింది. ఇక్కడ చెప్పిన విధంగానే అది ఆ ప్రాంతపు ప్రజలికి తెలిసిన ఉదంతం. అతణ్ని చూసి పక్కకు పోయిన యాజకుడు, లేవీయుడు ఆ జన సమూహంలో ఉన్నారు, క్రీస్తు మాటలు వింటున్నారు.DATel 556.3

    యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్న ప్రయాణంలో యూదయకు చెందిన అడవిలో కొంత భాగం గుండా ఆ ప్రయాణికుడు వెళ్లాల్సి వచ్చింది. ఆ మార్గం అడవిగుండా బండలతో నిండిన లోయలగుండా ఉంది. అది బందిపోటు దొంగలు మసలే ప్రదేశం. అక్కడ దోపిడీలు, హత్యలు తరచుగా జరిగేవి. దొంగలు ఆ ప్రయాణికుణ్ని ఇక్కడే పట్టుకుని, అతడి వద్ద ఉన్న విలువైన వస్తువులు దోచుకుని, తీవ్రంగా గాయపర్చి దారి పక్క కొరమణంతో విడిచి పెట్టి పోయారు. అతడు ఆ స్థితిలో పడిఉండగా ఒక యాజకుడు ఆమార్గాన్ని వెళ్తున్నాడు. అతడు బాధితుడి దిశగా చూడడం మాత్రమే జరిగింది, తదుపరి లేవీయుడు వెళ్లాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుని అతడు ఆగి బాధితుడి వంక చూశాడు. తాను చేయాల్సిందేంటో అతడికి బాగా తెలుసు. అయితే అది చెయ్యడానికి ఎవరూ ఇష్టపడని పని. ఆ దారిన రాకుండా ఉంటే బాగుండును, అప్పుడు ఆ బాధితుణ్ని చూడడం జరిగేది కాదు అని తలంచాడు. అయినా అది తనకు సంబంధించిన పనికాదని తన్ను తాను సముదాయించుకుని వెళ్లిపోయాడు.DATel 556.4

    ఈ ఇద్దరు వ్యక్తులు పరిశుద్ధ హోదాల్లో ఉన్నవారు. లేఖనాలు బోధించేవారమని చెప్పుకునేవారు. ప్రజల నడుమ దేవుని ప్రతినిధులుగా వ్యవహరించడానికి ప్రత్యేకంగా ఎంపికయిన తరగతికి చెందిన వారు. మానవుల పట్ల దేవుని ప్రేమను అవగాహన చేసుకోడానికి మనుషుల్ని, నడిపించేందుకుగాను వారు “ఏమియు తెలియని వారియెడలను త్రోవ తప్పిన వారియెడలను తాలిమి” (హెబ్రీ 5:2) చూపే వారుగా ఉండాలి. యేసు తన కర్తవ్యంగా వర్ణించిన పనినే వారూ చేయాల్సి ఉన్నాడు. ఆ పనిని ఆయన ఇలా వివరించాడు, “ప్రభువు ఆత్మ నామీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డివారికి చూపును కలుగునని, ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.” లూకా 4:18.DATel 557.1

    లోకంలో ఉన్న దైవ ప్రజలు దుఃఖాల్ని బాధల్ని దేవదూతలు గమనిస్తారు. హింసను బాధను తొలగించడంలో మానవులతో సహకరించడానికి వారు సంసిద్ధంగా ఉంటారు. గాయపడి బాధపడున్న ఆ వ్యక్తి పడి ఉన్న మార్గాన దేవుడే తన సంకల్పం చొప్పున వారిని తీసుకువచ్చాడు. అతడికి దయ సహాయం అవసరమని వారు గ్రహించాలని ఆయన ఉద్దేశించాడు. మానవ బాధ వ్యధ వారి మనసుల్ని కరిగిస్తుందో లేదో చూడడానికి పరలోకమంతా వేచి ఉంది. అరణ్యంలో హెబ్రీ ప్రజలికి ఉపదేశం ఇచ్చంది రక్షకుడే. యాజకులు రబ్బీలు ఇప్పుడు ప్రజలకు బోధిస్తున్న పాఠాల కన్నా భిన్నమైన పాఠాల్ని ఆయన మేఘస్తంభం నుంచి బోధించాడు. తమ అవసరాల్ని తమ బాధను వ్యక్తం చెయ్యలేని మూగజీవులికి సైతం దయతో నిండిన ధర్మశాస్త్ర సూత్రాలు వర్తించాయి. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ ఆదేశాలిచ్చాడు, “నీ శత్రువుని యెద్దయినను గాడి దయైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన యెడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వాని కప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి, దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను.” నిర్గ 23:4, 5. కాని దొంగలచే గాయపడి బాధపడుతున్న వ్యక్తిలో ఒక సహోదరుణ్ని యేసు సూచిస్తోన్నాడు. బరువులు మోసే జంతువు పట్లకన్నా అతడిపట్ల వారి హృదయాలు మరింకెంత దయతో స్పందించి ఉండాలి! “మహాదేవుడు పరాక్రమవంతుడు. భయంకరుడు” అయిన తమ దేవుడు “తల్లిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచువాడు” అన్న వర్తమానం మోషే ద్వారా దేవుడు వారికిచ్చాడు. కనుక “పరదేశిని జాలి తలచుడి” అని హితవు పలికాడు. “నిన్నువలె వానిని ప్రేమింపవలెను. ” ద్వితీ10:17-19, లేవి 19:34.DATel 557.2

    యోబు ఇలా అన్నాడు, “పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధి తలుపులు తెరచితిని గదా” మనుషుల రూపంలో ఇద్దరు దేవదూతలు సొదొమకు వచ్చినప్పుడు లోతు వారికి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు, “నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి” గడపండి. యోబు 31:32, ఆది 19:2. ఈ విషయాలన్నీ యాజకుడికి లేవియుడికి తెలిసినవే. కాని వారు వాటిని అనుసరించి జీవించలేదు. జాతీయ మతదురభిమాన పాఠశాలల్లో శిక్షణ పొంది వారు స్వార్థపరులు, సంకుచిత స్వభావులు, నేర్పాటు వాదులు అయ్యారు. గాయపడ్డ వ్యక్తిని చూసినప్పుడు అతడు తమ జాతివాడో కాదో తెలుసుకోలేకపోయారు. అతడు సమరయుడని ఊహించారు. అందుకే పక్కగా వెళ్లిపోయారు.DATel 558.1

    ధర్మశాస్త్ర విధుల గురించి తాను నేర్చుకున్న దానికి క్రీస్తు వర్ణించినట్లు వారి చర్యలో జరిగిన దానికి ఎంధ్యమమో ఆ న్యాయవాదికి కనిపించలేదు. ఇలాగుండగా ఇప్పుడు మరో సన్నివేశం ప్రారంభమయ్యింది.DATel 558.2

    ప్రయాణంలో ఉన్న ఒక సమరయుడు గాయపడి బాధితుడు పడిఉన్న చోటికి వచ్చాడు. బాధితుణ్ని చూసినప్పుడు అతడికి జాలి కలిగింది. బాధలో ఉన్న ‘ఆవ్యక్తి యూదుడా? అన్యుడా? అని ఆలోచించలేదు. అయితే అతడు యూదుడే అయిఉండి తామిరువురూ ఒకరి పరిస్థితుల్లోకి ఒకరు మారిఉంటే అతడు తన ముఖం మీద ఉమ్మివేసి అసహ్యించుకుంటూ వెళ్లిపోయేవాడని సమరయుడికి బాగా తెలుసు. కాని అతడు సందేహించలేదు. ఆ స్థలంలో ఇంకా ఉంటే తన ప్రాణాలకే ముప్పు అని తలంచలేదు, తన ముందు బాధపడుతూ సహాయం అవసరమైన మానవుడు ఉండమే చాలు. బాధితుడికి కప్పడానికి సమరయుడు తాను ధరించిన వస్త్రాన్ని తీసివేశాడు. తన ప్రయాణానికి ఉంచుకున్న నూనెను ద్రాక్షారసాన్ని అతడి గాయాలమీద పోయడానికి వినియోగించాడు. అతణ్ని పైకెత్తి తన గాడిద మీద కూర్చోబెట్టి బాధితుడికి నొప్పి బాధ కలగకుండా ఉండేందుకు గాడిదను నెమ్మదిగా నడిపించుకుంటూ ఒక సత్రానికి తీసుకు వచ్చి రాత్రంతా అతడికి సపర్యలు చేస్తూ అతణ్ని కాపాడాడు. ఉదయానికి రోగి పరిస్థితి మెరుగైనందుకు సమరయుడు తన ప్రయాణం కొనసాగించడానికి పూనుకున్నాడు. దానికి ముందు రోగిని సత్రం యజమానికి అప్పగించి, అతడి ఖర్చులికి డబ్బు కట్టి, మరికొంత డబ్బు అతడికోసం డిపోజిట్టు చేశాడు. దీనితో తృప్తి చెందక ఇంకేదైనా అవసరం ఏర్పడుతుందేమోనని దానికి కూడా ఏర్పాటు చేసి సత్రం యజమానితో ఇలా అన్నాడు, “నీవింకేమైనను ఖర్చు చేసిన యెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదను.”DATel 559.1

    కథ ముగిసింది. యేసు న్యాయవాది వంక దృష్టి సారించి అతడి ఆత్మను చదువుతున్నాడా అన్నట్లు ఇలా ప్రశ్నించాడు, “దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెను?” లూకా 10:36.DATel 559.2

    ఇప్పుడు సయితం సమరయుడన్న పదం ఉచ్చరించడానికి ఇష్టపడని న్యాయవాది “అతని మీద జాలి పడినవాడే” అని బదులు పలికాడు. “నీవును వెళ్లి ఆలాగు చేయుము” అని యేసు అతడితో చెప్పాడు.DATel 559.3

    నా పొరుగు వాడెవడు? అన్న ప్రశ్నకు ఇలా శాశ్వత సమాధానం లభించింది. పొరుగువాడంటే మన పక్కన నివసిస్తోన్నవాడో మన సంఘానికో విశ్వాసానికో చెందినవాడో కాదని యేసు చూపించాడు. జాతితోను, రంగుతోను, సామాజిక తరగతితోను దానికి నిమిత్తం లేదు. మన చేయూత అవసరమైన ప్రతివారు మన పొరుగువారే. ఆత్మల విరోధి వలన గాయపడ్డ ప్రతీ ఆత్మ మన పొరుగువాడే. దేవుని సొత్తయిన ప్రతీ వ్యక్తి మన పొరుగువాడే.DATel 560.1

    మంచి సమరయుడి కథలో యేసు తనను గురించి తన కర్తవ్యాన్ని గురించి ఒక పటాన్ని చిత్రించాడు. సాతాను మానవుణ్ని మోసంచేసి, గాయపర్చి, దోచుకుని అన్ని విధాలా నాశనం చేసి గతించి పోయేందుకు వదిలి వెళ్లాడు. అయితే మన నిస్సహాయ స్థితిని చూసి రక్షకుడు జాలిపడ్డాడు. మనల్ని విమోచించడానికి తన మహిమను విడిచి పెట్టి వచ్చాడు. మరణించడానికి సిద్ధంగా ఉన్న మనల్ని కనుగొని మన రక్షణ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. మన గాయాలు మాన్చాడు. తన నీతి వస్త్రంతో మనల్ని కప్పాడు. మన కోసం సురక్షితమైన ఆశ్రయ దుర్గాన్ని తెరిచాడు. అందులో మనం ఉండడానికి తన ఖర్చుతో ఏర్పాట్లు అన్నీ చేశాడు. మనల్ని విమోచించేందుకు మరణించాడు. తన సొంత ఆదర్శాన్ని సూచిస్తూ ఆయన ఇలా అంటోన్నాడు, “మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను.” ” నేను మిమ్మును ప్రేమించినట్టే నారును ఒకరినొకరు ప్రేమింపవలెను.” యోహాను 15:17, 13:34.DATel 560.2

    న్యాయవాది “నేనేమి చేయవలెను?” అని యేసుని ప్రశ్నించాడు. దేవుని పట్ల, సాటి మానవుడి పట్ల ప్రేమ కలిగి ఉండడమే నీతి అని గుర్తించి “ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవు” అని యేసు అతడితో అన్నాడు. దయ ప్రేమ గల హృదయం ఆదేశాలకు సమరయుడు విధేయుడయ్యాడు. ఇలా చేయడంలో తాను ధర్మశాస్త్రాన్ని ఆచరించే వ్యక్తి నని నిరూపించుకున్నాడు. “నీవును వెళ్లి ఆలాగున చేయుము” అని క్రీస్తు న్యాయవాదిని ఆదేశించాడు. “ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొనబద్దుడై యున్నాడు” 1యోహా 2:6.DATel 560.3

    ఈ పాఠం నాడు యేసు చెప్పినప్పుడు ఎంత అవసరమయ్యిందో నేడూ అంతే అవసరమవుతోంది. స్వార్థం, నిరర్ధకమైన సంప్రదాయం ప్రేమ జ్వాలను దాదాపు అర్చివేశాయి. ప్రవర్తనను పరిమళింప చేయాల్సిన సుగుణాల్ని నాశనం చేశాయి. ఆయన నామం ధరించిన అనేకమంది క్రైస్తవులు క్రీస్తు ప్రతినిధులన్న సంగతి మర్చిపోతున్నారు. కుటుంబ పరిధిలోను, పరిసర ప్రాంతంలోను, సంఘంలోను, మనం ఎక్కడ నివసిస్తే అక్కడ ఉన్నవారి శ్రేయస్సు కోసం క్రియాత్మక ఆత్మత్యాగం చెయ్యకపోతే మనం క్రైస్తవులమని ఎంత చెప్పుకున్నా వాస్తవానికి మనం క్రైస్తవులం కాం.DATel 560.4

    మాననవాళి ఆసక్తులికి తన సేవకు దగ్గర సంబంధం ఉందని చెబుతూ మానవుల్ని రక్షించడంలో తనతో ఏకం కావలిసిందిగా క్రీస్తు మనకు పిలుపునిస్తోన్నాడు. “ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి” అంటున్నాడు ప్రభువు. మత్తయి 10:8. అన్నిరకాల దుష్టతలోను అతి దారుణమైంది పాపం. పాపిని కరుణించి అతడికి సహాయం చెయ్యడం మన ధర్మం. పొరపాటు చేసి అది గుర్తించి సిగ్గుపడేవారు చాలామంది ఉన్నారు. ఉత్సాహపర్చే మాటలు వినడానికి వారు ఆశగా ఎదురుచూస్తుంటారు. వారు విసిగి వేసారే వరకు తమ దోషాలు పొరపాట్ల వంక చూస్తూ ఉంటారు. వీరిని మనం అశ్రద్ధ చెయ్యకూడదు. మనం నిజమైన క్రైస్తవులమైతే పక్కగా వెళ్లిపోము. మన సహాయం ఎంతో అవసరమైన వారిని తప్పించుకుని వెళ్లిపోము. శ్రమలు కష్టాలు మూలంగా గాని, పాపం మూలంగా గాని దుఃఖాల పాలైన వారిని చూసినప్పుడు వారితో నాకు పనిలేదు అని మనం అనకుందుం గాక.DATel 561.1

    “ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు. . . సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచిదారికి తీసికొని రావలెను. ” గలతీ 6:1. విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారా శత్రువు బలాన్ని తిప్పికొట్టండి. గాయపడ్డవాడి గాయాలికి స్వస్తత కూర్చే సుగంధ తైలం వంటి విశ్వాస పూరిత, ఉత్సాహభరిత మాటలు మాట్లాడండి. జీవన మహా సమరంలో ఎందరెందరో బలహీనపడి నిరుత్సాహం చెందారు. ఉద్రేకపర్చే ఒక్కమాట వారిని బలపర్చి విజయానికి నడిపించేది. బాధ అనుభవిస్తున్న ఒక్క ఆత్మను కూడా దేవుని నుంచి మనం పొందుతున్న ఓదార్చును అందించుకుండా మనం దాటి వెళ్లకూడదు.DATel 561.2

    ఇదంతా ధర్మశాస్త్ర సూత్రం నెరవేర్పు మాత్రమే. మంచి సమరయుడి కథ ఆ సూత్రానికి సాదృశ్యం. ఆ సూత్రం యేసు జీవితంలో ప్రదర్శితమయ్యింది. ఆయన ప్రవర్తన ధర్మశాస్త్రం ప్రాముఖ్యాన్ని బయలుపర్చుతూ మన పొరుగువారిని మనవలె ప్రేమించడమంటే ఏంటో స్పష్టం చేసింది. దేవుని బిడ్డలు ప్రజలందరి పట్ల కనికరం, దయ, ప్రేమ కనపరిస్తే వారు కూడా పరలోక కట్టడల స్వభావమిదీ అని సాక్షం ఇస్తారు. “యెహావా నియమించిన ధర్మశాస్త్రము యధార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును” (కీర్త. 19:7) అన్న సత్యాన్ని వారు చాటి చెబుతారు. ఈ ప్రేమను ప్రదర్శించటంలో ఎవరు విఫలమవుతారో వారు తాము ఘనపర్చుతున్నామని చెప్పుకునే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు. ఎందుకంటే మన సహోదరుల పట్ల మనం ప్రదర్శించే స్వభావం దేవునిపట్ల మన స్వభావాన్ని వెల్లడి చేస్తుంది. హృదయంలో ఉన్న దేవుని ప్రేమే మన పొరుగువారి పట్ల మనలో జనించే ప్రేమకు మూలం. “నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు”. ప్రియమైన వారలారా, “మనమొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.” 1యోహా 4:20,21.DATel 561.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents