Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    58—“లాజరూ, బయటికిరమ్ము”

    క్రీస్తు దృఢమైన శిష్యుల్లో బేతనియ కాపురస్తుడైన లాజరు ఒకడు. తమ మొదటి కలయిక నుంచి క్రీస్తుపై లాజరు విశ్వాసం అచంచలంగా ఉంది. క్రీస్తుపట్ల అతడి ప్రేమ గాఢమైంది. రక్షకుడు అతణ్ని అమితంగా ప్రేమించాడు. క్రీస్తు అద్భుతాల్లో అత్యున్నతమైంది లాజరు విషయంలో జరిగింది. తన సహాయాన్ని అర్థించిన వారందరికి రక్షకుడు సహాయం చేశాడు. మానవులందరినీ ఆయన ప్రేమిస్తాడు. కాని కొందరితో ఆయనకు ప్రత్యేకమైన స్నేహబంధం ఉంటుంది. బేతనియలోని కుటుంబంతో ఆయనకు బలీయమైన ప్రేమానుబంధం ఉండేది. ఆ కుటుంబంలో ఒకరి నిమిత్తం ఒక ఆశ్చర్యకార్యం నిర్వహించాడు.DATel 583.1

    యేసు లాజరు గృహంలో విశ్రాంతి తీసుకునేవాడు. రక్షకుడికి తనదంటూ ఒక గృహంలేదు. తన మిత్రులు శిష్యుల ఆతిథ్యం మీద ఆయన ఆధారపడేవాడు. అలసి ఉన్నప్పుడు, మానవ సహవాసానికి కోరిక కలిగినప్పుడు ఆయన తరచు ఈ గృహానికి వెళ్లడానికి సంతోషించేవాడు. అనుమానం, ఈర్య, ఆగ్రహంతో నిండిన పరిసయ్యుల నుంచి దూరంగా ఇక్కడ ఆయనకు ప్రశాంతత లభించేది. ఇక్కడ ఆయనకు హృదయపూర్వక స్వాగతం పవిత్ర, పరిశుద్ధ స్నేహం లభించేవి. ఇక్కడివారు తన మాటల్ని అవగాహన చేసుకుని వాటిని ప్రశస్త నిధిగా దాచుకుంటారని ఎరిగి ఆయన ఇక్కడే సామాన్యంగా పరిపూర్ణ స్వేచ్ఛతో మాట్లాడగలిగేవాడు.DATel 583.2

    మన రక్షకుడు ప్రశాంత గృహాన్ని, ఆసక్తిగా వినేశ్రోతల్ని అభినందించేవాడు. మానవుల నుంచి దయను, మర్యాదను, అనురాగాన్ని ఆయన ఆశించాడు. ఆయన ఎల్లప్పుడూ అందించడానికి సిద్ధంగా ఉన్న ఆధ్యాత్నిక ఉపదేశాన్ని అంగీకరించినవారు గొప్పదీవెనలు పొందారు. జన సమూహాలు యేసు వెంబడి పొలాలు దాటుకుంటూ వెళ్తున్నప్పుడు వారికి ప్రకృతి ప్రపంచంలోని సొగసుల్ని వివరించేవాడు. లోకాన్ని దేవుడు ఎలా ఉనికిలో ఉంచి కాపాడున్నాడో వారు చూసేందుకు వారి మనోనేత్రాల్ని, తెరవడానికి ఆయన ప్రయత్నించేవాడు. దేవుని దయాళుత్వాన్ని దాతృత్వాన్ని వారు అభినందించేందుకు తన శ్రోతల గమనాన్ని నెమ్మదిగా సున్నితంగా పడుతున్న పొగమంచు మీదికి, సన్నగా పడుతున్న వర్షం మీదికి, ప్రకాశవంతమైన సూర్యకాంతి మీదికి ఆయన ఆకర్షించేవాడు. వీటిని మంచివారికి చెడ్డవారికి సమానంగా ఇస్తున్నాడు దేవుడు. తాను సృజించిన మానవ సాధనాలపై ఎలాంటి శ్రద్ధ చూపిస్తాడో మనుషులు గుర్తించాలని ఆయన ఆకాంక్షించాడు. కాని ఆ జనసమూహం వినడంలో మందకొడిగా ఉంది. అంతట బహిరంగ జీవిత సంఘర్షణ నుంచి అలసిన యేసు బేతనియ గృహంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఇక్కడ వినడానికి ఎంతో ఆశగా ఉన్న శ్రోతలకు బోధించాడు. మిశ్రిత జనసమూహాలకు బోధించని విషయాల్ని ఈ ప్రత్యేక సమావేశాల్లోని శ్రోతలికి బోధించాడు. తన స్నేహితులతో ఉపమాన రూపంలో మాట్లాడాల్సిన అవసరంలేదు.DATel 583.3

    క్రీస్తు తన అద్భుత పాఠాలు బోధించేటప్పుడు మరియ ఆయన పాదాల వద్ద కూర్చుని భక్తితో శ్రద్ధగా వినేది. ఒకసారి భోజనం తయారు చెయ్యడంతో సతమతమౌతున్న మార్త క్రీస్తు వద్దకు వెళ్లి ఇలా అన్నది, “ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నాసహోదలి నన్ను విడిచి పెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుము.” ఇది మొదటిసారిగా క్రీస్తు బేతనియను సందర్శించిన సమయం. రక్షకుడు ఆయన శిష్యులు యెరికోనుంచి కాలినడకన అప్పుడే వచ్చారు! వారికి భోజన సదుపాయం చెయ్యడానికి కంగారుపడూ ఆ తొందరలో అతిథికి చేయాల్సిన మర్యాద మర్చిపోయింది. యేసు ఆమెకు ఇలా మెత్తగా సమాధానం ఇచ్చాడు, “మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావుగాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్దనుండి తీసివేయబడదు.” రక్షకుని నోటి వెంట వస్తున్న ప్రశస్తమైన మాటలతో మరియ తన మనసును నింపుకుంటోంది. ఆమెకు ఆ మాటలు లోకంలోని మిక్కిలి విలువైన రత్నాలకన్నా ప్రశస్తమైనవి.DATel 584.1

    మారకు అవసరమైన ఆ “ఒక్కటి” ఏమిటంటే ప్రశాంతమైన భక్తితత్పరమైన స్వభావం; భావి అమర్త్య జీవితం గురించిన జ్ఞానం; ఆధ్యాత్మికాభివృద్ధికి అవసరమైన కృపలు. ఆమె అశాశ్వతమైన వాటి గురించి తక్కువ ఆందోళన, నిత్యమైనవాటి గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. రక్షణ వివేకాన్నిచ్చే జ్ఞానాన్ని ఆర్జించడానికి ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవలసిందిగా యేసు తన ప్రజలకు ఉద్బోధిస్తున్నాడు. క్రీస్తు సేవకు అప్రమత్తులు, ఉత్సాహవంతులు అయిన కార్యకర్తలు అవసరం. ఉద్రేక ఉత్సాహాలతో నిండిన మార్తాలు క్రియశీలక మతసేవ చెయ్యడానికి విశాల సేవారంగం ఉంది. అయితే ముందు వారు మరియతో కలసి యేసు పాదాలవద్ద కూర్చోడం అవసరం. తర్పరత, సత్వరత, శక్తి - వీటిని క్రీస్తు కృప పరిశుద్ధపర్చాలి. అప్పుడు ఆ వ్యక్తి జీవితం మేలు చెయ్యడంలో పరాజయమెరుగని శక్తిగా రూపొందుతుంది.DATel 585.1

    యేసు విశ్రాంతి తీసుకునే ప్రశాంతమైన ఆ గృహంలో దుఃఖం చోటు చేసుకుంది. లాజరు హఠాత్తుగా జబ్బుపడ్డాడు. అతడి సహోదరీలు “ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడు” అని రక్షకునికి వర్తమానం పంపారు. తమ సహోదరుడికి వచ్చినది తీవ్రమైన వ్యాధి అని వారు గ్రహించారు. తమకు కలిగిన దుఃఖంలో ప్రభువు తమపట్ల సానుభూతి చూపుతాడని నమ్మారు. అందుచేత ఆయన వెంటనే రావలసిందిగా మనవి చెయ్యలేదు. కాని “నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడు” అని మాత్రమే తెలియజేశారు. తమ వర్తమానానికి వెంటనే ప్రతిస్పందించి సాధ్యమైనంత త్వరగా బేతనియకు వస్తాడని భావించారు.DATel 585.2

    యేసు వద్ద నుంచి వర్తమానం కోసం ఆందోళనతో కనిపెట్టారు. తమ సహోదరుడిలో ప్రాణం ఉన్నంతసేపూ ప్రార్థిస్తూ యేసు రాకకోసం ఎదురు చూశారు. కబురు తీసుకువెళ్లిన దూత ఆయన లేకుండా తిరిగి వచ్చాడు. ఆయన వద్ద నుంచి “ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు” అన్న వర్తమానాన్ని తెచ్చాడు. అందునుబట్టి లాజరు బతుకుతాడు అన్న నిరీక్షణతో వారున్నారు. దాదాపు స్పృహలేకుండా పడి ఉన్న రోగితో నిరీక్షణను ధైర్యాన్ని కలిగించే మాటలు చెప్పడానికి ప్రయత్నించారు. లాజరు మరణించినప్పుడు వారు తీవ్ర ఆశాభంగానికి గురి అయ్యారు. కాని బలాన్ని చేకూర్చే క్రీస్తు కృప వారి అనుభవంలోకి వచ్చింది. రక్షకుడిపై ఎలాంటి నింద మోపకుండా ఉండడానికి ఇది వారికి తోడ్పడింది.DATel 585.3

    క్రీస్తు ఆ వర్తమానాన్ని విన్నప్పుడు ఆయన దాన్ని పట్టించుకోనట్లు శిష్యులు భావించారు. వారు కనిపెట్టినట్లు, ఆయన దుఃఖించలేదు. వారి వంక చూసి “ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదుగాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినది” అన్నాడు. ఉన్నచోటే రెండు రోజులు ఉండిపోయాడు. ఈ తాత్సారం శిష్యులికి మర్మంగా ఉంది. విషాదం తాకిన కుటుంబానికి ఆయన సన్నిధి ఎంత ఓదార్పును ఆదరణను చేకూర్చేది! అని వారు ఆలోచించారు. బేతనియలో ఉన్న కుటుంబంతో ఆయనకున్న ప్రేమానుబంధం శిష్యులికి బాగా తెలుసు. “నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడు” అన్న వర్తమానానికి ఆయన స్పందించకపోవడం శిష్యులికి ఆశ్చర్యం కలిగించింది.DATel 586.1

    ఆ రెండు దినాలు ఆ వర్తమానంపై క్రీస్తు మనసు పెట్టనట్లు కనిపించింది. ఎందుకంటే ఆయన లాజరు ఊసు ఎత్తలేదు. శిష్యులు క్రీస్తుకు మార్గం సరాళం చేయాల్సి ఉన్న స్నానికుడైన యోహాను గురించి ఆలోచించారు. అద్భుతాలు సూచకక్రియలు చేస్తున్న యేసు యోహానుని చెరసాలలో బాధపడడానికి చివరికి దారుణ మరణం పొందడానికి ఎందుకు విడిచిపెట్టాడంటూ ఆశ్చర్యపోయారు. అద్భుతమైన శక్తి గల క్రీస్తు యోహానుని ఎందుకు కాపాడలేదు? తాను దేవుని కుమారుణ్నని క్రీస్తు చెబుతున్నమాట బూటకమని నిరూపించడానికి పరిసయ్యులు తరచుగా ఈ ప్రశ్ననే వేసేవారు. శ్రమలు, నష్టాలు, హింసలు కలుగుతాయని రక్షకుడు తన శిష్యుల్ని హెచ్చరించాడు. శ్రమల్లో వారిని ఆయన విడిచిపెడ్తాడా? కొందరు ఆయన పరిచర్యను అపార్థం చేసుకున్నామేమోనని తలంచారు. అందరూ ఆందోళనతో నిండి ఉన్నారు.DATel 586.2

    రెండు రోజులైన తర్వాత శిష్యులతో యేసేలా అన్నాడు. “మనము యూదయకు తిరిగి వెళ్ళెదము.” యేసు యూదయకు వెళ్తుంటే ఆయన ఎందుకు రెండుదినాలు ఆగాల్సివచ్చిందని శిష్యులు ప్రశ్నించారు. అయితే క్రీస్తు నిమిత్తం తమ నిమిత్తం ఇప్పుడు వారిలో ఆందోళన ఎక్కువయ్యింది. ఆయన అవలంబించనున్న విధానంలో అపాయం తప్పమరేదీ వారికి కనిపించలేదు. “బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టజూచుచుండిరే; అక్కడకు తిరిగి వెళ్లుదువా? అని ఆయన నడిగిరి. అందుకు యేసు - పగలు పండ్రెండు గంటలున్నవి గదా?” అన్నాడు. నేను నా తండ్రి నడుపుదల కింద ఉన్నాను. నేను ఆయన చిత్తాన్ని జరిగించినంతకాలం నా ప్రాణానికి ఏ హానీ కలుగదు. దినంలో నా పన్నెండు గంటలు ఇంకా అంతం కాలేదు. నా దినంలో మిగిలిన చివరి క్షణాల్లో ప్రవేశిస్తోన్నాను. ఇందులో ఇంకా ఏమైన సమయం మిగిలి ఉంటే నా ప్రాణానికి ధోకాలేదు.DATel 586.3

    ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు” దేవుని చిత్తం ప్రకారం ప్రవర్తించేవాడు, దేవుడు నిర్దేశించిన మార్గంలో నడిచేవాడు తొట్రిల్లిపడడు. మార్గం చూపించే దైవాత్మ వెలుగు అతడికి తన బాధ్యతను గూర్చిన అవగాహనను కలిగించి తన కర్తవ్యం అంతం వరకు అతణ్ని నడిపిస్తుంది. “అయితే రాత్రివేళ ఒకడు నడిచిన యెడల వాని యందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడును” తాను ఎంచుకున్న మార్గంలోనే నడిచేవాడు, దేవుడు నిర్దేశించని మార్గంలో నడుస్తున్నాడు గనుక తొట్రుపడతాడు. అతడి పగలు రాత్రిగా మారుతుంది. అతడెక్కడున్నా అతడికి క్షేమంలేదు.DATel 587.1

    “ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత - మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అతని మేలుకొలుప వెళ్లుచున్నాను.” “మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు” ఎంత మృదువైన మాటలు! ఎంత సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయి! యెరూషలేముకి వెళ్లడం వల్ల తమ ప్రభువుకి సంభవించగల ప్రమాదం గురించి ఆలోచిస్తూ బేతనియలో దుఃఖంలో మునిగి ఉన్న కుటుంబాన్ని శిష్యులు మర్చిపోయారు. కాని క్రీస్తు మర్చిపోలేదు. ఇది శిష్యులికి మందలింపుగా పనిచేసింది. ఆ వర్తమానానికి క్రీస్తు సానుకూలంగా స్పందించలేదని భావించి నిరాశ చెందారు. లాజరు పట్ల అతడి సహోదరీల పట్ల ఆయనకు ప్రేమలేదని, ఉంటే ఆయన దూత వెంటే వెళ్లి ఉండేవాడని వారు తలంచడానికి ఇది దారితీసింది. కాగా “మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు” అన్నమాటలు వారి మనసుల్లో సరైన మనోభావాల్ని మేల్కొలిపాయి. బాధల్లో ఉన్న తన మిత్రుల్ని క్రీస్తు మర్చిపోలేదన్న విశ్వాసం వారికి కలిగింది.DATel 587.2

    “శిష్యులు - ప్రభువా, అతడు నిద్రించిన యెడల బాగుండుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెనుగాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.” తన విశ్వాసులికి మరణాన్ని నిద్రగా వ్యవహరిస్తాడు క్రీస్తు. వారి జీవం ఆయనతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. తుది బూర మోగే వరకు మరణించినవారు ఆయన యందు నిద్రిస్తారు.DATel 588.1

    “కావున యేసు- లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని స నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.” తమ ప్రభువు యూదయకు వెళ్తే ఆయనకు మరణం తప్పదని తోమా భయం. కాని మనసు దృఢపర్చుకుని “ఆయనతో కూడ చనిపోవుటకు మనము కూడ వెళ్లుదము” అని తక్కిన శిష్యులతో చెప్పాడు. క్రీస్తు పట్ల యూదులకున్న ద్వేషం అతడికి తెలుసు. వారి ఉద్దేశం ఆయన్ని మట్టుపెట్టడమే కాని అది నెరవేరలేదు ఎందుచేతనంటే ఆయన నిర్దిష్ట సమయం ఇంకా కొంచెం మిగిలింది. ఈ సమయంలో పరలోక దూతల పరిరక్షణ ఆయనకుంది. ఆయనను బంధించి చంపడానికి రబ్బీలు ఎక్కడ కుట్రలు పన్నుతున్నారో ఆ యూదయ ప్రాంతంలో సయితం ఆయనకు హాని కలుగజాలదు.DATel 588.2

    “లాజరు చనిపోయెను . . . నేనక్కడ ఉండలేదని . . . సంతోషించు చున్నాను” అని క్రీస్తు అన్నప్పుడు వారు విస్మయం చెందారు. రక్షకుడు కావాలనే బాధలో ఉన్న మిత్రుల ఇంటికి వెళ్లకుండా ఉండిపోయాడా? మరియ, మార్త లాజరు ఒంటరి వారైపోయినట్లు కనిపిస్తోంది. కాని వారు ఒంటరి వారుకాదు. క్రీస్తు ఆ మొత్తం సన్నివేశాన్ని చూశాడు. లాజరు మరణించిన తర్వాత దుఃఖంలో ఉన్న అతని సహోదరీలు ఆయన కృప ద్వారా ఆదరణ పొందారు. తమ సహోదరుడు బలీయమైన శత్రువు మరణంతో పోరాడున్నప్పుడు వారనుభవించిన దుఃఖ బాధను యేసు చూశాడు. “లాజరు చనిపోయెను” అని తన శిష్యులతో అన్నప్పుడు ఆ వేదనలో బాధను ఆయన అనుభవించాడు. అయితే క్రీస్తు ప్రేమించిన వారు ఆయన పరిగణించాల్సినవారు బేతనియలో మాత్రమే లేరు. ఆయన శిష్యుల శిక్షణను గురించి ఆలోచించాల్సి ఉంది. తండ్రి శుభాలు అందరికీ అందేందుకుగాను వారు లోకానికి తన ప్రతినిధులు కావాల్సి ఉన్నారు. వారి నిమిత్తమే ఆయన లాజరుని మరణించనిచ్చాడు. లాజరు వ్యాధిని బాగుచేసి ఉంటే, తన దేవత్వానికి తిరుగులేని నిదర్శనమైన సూచక క్రియను ఆయన చేసి ఉండేవాడు కాదు.DATel 588.3

    వ్యాధిగ్రస్తుడైన లాజరు గదిలో క్రీస్తు ఉండి ఉంటే అతడు మరణించేవాడు కాదు. అతడి మీద సాతానుకి ఎలాంటి అధికారం ఉండేది కాదు. ప్రాణాధికారి సమక్షంలో మరణం తన బాణాల్ని లాజరు పైకి విడిచేదికాదు. అందుకే క్రీస్తు అక్కడ లేడు. శత్రువుని జయించి అతణ్ని వెనక్కి తరిమేసేందుకు అతణ్ని తన శక్తిని వినియోగించనిచ్చాడు. వేదనతో కుమిలిపోతున్న సహోదరీలు తమ సోదరుడు సమాధి అవ్వడం చూశారు. మరణించిన తమ సోదరుణ్ని చూస్తున్నప్పుడు విమోచకుడిపై వారి విశ్వాసం తీవ్రంగా పరీక్షించబడుందని క్రీస్తుకి తెలుసు. అయితే ఇప్పుడు వారు అనుభవిస్తోన్న క్షోభ కారణంగా వారి విశ్వాసం దేదీప్యమానంగా ప్రకాశిస్తుందని కూడా ఆయనకు తెలుసు. వారు అనుభవించిన బాధాకరమైన దుఃఖాన్ని ఆయన అనుభవించాడు. వారిని తక్కువ ప్రేమించినందుకు ఆయన జాప్యం చెయ్యలేదు. కాని వారి పక్షంగా, లాజరు పక్షంగా, తన పక్షంగా, శిష్యుల పక్షంగా మహత్తర విజయం రావాల్సి ఉందని ఆయనకు తెలుస.DATel 589.1

    “మి నిమిత్తము” “మీరు నమ్మునట్లు” నడిపించే దేవుని హస్తాన్ని స్పృశించడానికి చెయ్యి చాపే వారందరికి దేవుని సహాయం అతి సమీపంలో ఉన్న సమయమే తీవ్ర ఆశాభంగ సమయం. తమ మార్గంలో కటిక చీకటి కప్పిన భాగం వంక వెనుదిరిగి కృతజ్ఞతతో చూస్తారు. “భక్తులను శోధనలో నుండి తప్పించుటకు . . . ప్రభువు సమర్థుడు.” 2 పేతురు 2:9. ప్రతీ శోధననుంచి ప్రత్యేక శ్రమనుంచి దృఢమైన విశ్వాసంతో, విలువైన అనుభవంతో వారిని బయటికి తెస్తాడు.DATel 589.2

    లాజరు వద్దకు రావడంలో ఆలస్యం చెయ్యడంలో క్రీస్తుకో ఉద్దేశం ఉంది. తనను స్వీకరించకుండా ఉన్నవారికి దయ కనికరాలు చూపించడమన్నదే ఆఉద్దేశం. నమ్మని మొండి ప్రజలకు లాజరుని సమాధి నుంచి లేపడం ద్వారా “పునరుత్థానము జీవము” తానేనని ఇంకొక నిదర్శనం ఇవ్వడానికే ఆయన ఆలస్యం చేశాడు. ఇశ్రాయేలులో సంచరిస్తోన్న గొర్రెలవంటి పేద ప్రజల విషయంలో ఆశ వదలుకోడానికి ఆయన ఇష్టపడలేదు. పశ్చాత్తాపంలేని ఆ ప్రజల్ని చూసినప్పుడు ఆయన హృదయం బద్దలయ్యింది. దయగల ఆప్రభువు తాను విమోచకుణ్నని, తానే జీవాన్ని అమరత్వాన్ని ఇవ్వగలవాడనని చూపించడానికి వారికి మరో నిదర్శనం ఇవ్వనెంచాడు. ఈ నిదర్శనాన్ని కాదనలేరు. దానికి అపార్థం చెప్పలేరు. బేతనియకు వెళ్లడంలో జాప్యానికి కారణం ఇది. లాజరుని లేపడమన్న సర్వోన్నత సూచకక్రియ ఆయన సేవ పైన ఆయన దేవత్వం పైన దేవుని ముద్ర వేయాల్సి ఉంది.DATel 589.3

    బేతనియ ప్రయాణంలో యేసు తన అలవాటు చొప్పున వ్యాధిగ్రస్తుల్ని బాగుచేశాడు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేశాడు. ఆ పట్టణానికి చేరిన వెంటనే తన రాక గురించి లాజరు సహోదరీలకు వర్తమానం పంపించాడు. క్రీస్తు వెంటనే ఇంటిలోకి వెళ్లలేదు. దారి పక్క ప్రశాంతంగా ఉన్న ఒక చోట ఉన్నాడు. మిత్రులుకాక బంధువులు మరణించినప్పుడు యూదులు అనుసరించే గొప్ప బాహ్య ప్రదర్శన క్రీస్తు తత్వానికి అనుగుణమైంది కాదు. కూలికి శోకించే వారి ఏడ్పు ఆయన విన్నాడు. ఆ గందరగోళ పరిస్థితిలో ఆ సహోదరీల్ని కలవడానికి యేసు సుముఖంగాలేడు. శోకించే వారిలో కుటుంబానికి చెందిన బంధువులు కొందరున్నారు. వారిలో కొందరు యెరూషలోములో ఉన్నత హోదాల్లో ఉన్నవారు. వీరిలో కొందరు క్రీస్తుకి బద్దశత్రువులు. వారి ఉద్దేశాలు క్రీస్తుకు తెలుసు. అందుచేత ఆయన తనరాకను వెంటనే వెల్లడిచెయ్యలేదు.DATel 590.1

    ఆయన రాకను గూర్చిన వర్తమానం గదిలో ఉన్నవారెవరికీ వినిపించకుండా నెమ్మదిగా మారకు అందించారు. దుఃఖంలో మునిగి ఉన్న మరియకు ఆమాటలు వినిపించలేదు. మార్త వెంటనే లేచి ప్రభువును కలవడానికి బయటికి వెళ్లింది. ఆమె లాజరు సమాధివద్దకు వెళ్లిందని భావించి మరియ అక్కడే దుఃఖిస్తూ ఉండిపోయింది. ఆమె గట్టిగా ఏడ్వడం లేదు.DATel 590.2

    యేసుని కలవడానికి మార్త హడావుడిగా వెళ్లింది. ఆమెలో వేర్వేరు భావోద్వేగాలు చెలరేగుతున్నాయి. ఆయన ముఖంలో అదే అనురాగాన్ని అదే ప్రేమను చూసింది. ఆయనపై ఆమెకున్న విశ్వాసం అచంచలంగా ఉంది. కాని ఆమె తన సహోదరుణ్ణి అమితంగా ప్రేమించింది. యేసు కూడా లాజరుని ప్రేమించాడు. యేసు ముందురానందుకు దుఃఖిస్తూ అయినా ఇప్పుడు సయితం తమకు ఓదార్పు కలిగే కార్యమేదో చేస్తాడన్న నిరీక్షణతో ఆమె ఇలా అంది, “ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును.” ఏడ్చుతున్నవారి ఏడ్పు నడుమ ఆ సహోదరీలు ఈ మాటల్నే పదేపదే అంటున్నారు.DATel 591.1

    మానవ సానుభూతితో, దైవ కనికరంతో యేసు ఆమె ముఖంలోకి చూశాడు. గతాన్ని తిరిగి చెప్పడం మార్తకు ఇష్టం లేదు. “ప్రభువా నీ విక్కడ ఉండిన యెడల నాసహోదరుడు చావకుండును” అన్న మాటలోనే అంతా వ్యక్తం చేసింది. కాని ప్రేమ ఉట్టిపడే ఆముఖంలోకి చూసి ఆమె ఇలా అన్నది, “ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని యెరుగుదును.”DATel 591.2

    “నీ సహోదరుడు మరల లేచును” అని ఆమెను ధైర్యపర్చాడు. ఆయన జవాబు తక్షణ మార్పు కలుగుతుందన్న ఆశాభావాన్ని కలిగించడానకి ఉద్దేశించింది కాదు. మార్తా తలంపుల్ని ఆమె సహోదరుడి ప్రస్తుత పునరుద్ధరణకు తీసుకు వెళ్లి నీతిమంతుల పునరుత్థానం పై వాటిని నిలిపాడు. లాజరు పునరుత్థానంలో మరిణించిన నీతిమంతుల పునరుత్థానాన్ని, అది రక్షకుని శక్తి ద్వారా జరుగుతుందన్న నిశ్చయతను ఆమె చూసేందుకు ఆయన ఇది చేశాడు.DATel 591.3

    మార్తా ఇలా బదులు పలికింది, “అంత్య దిమందున పునరుత్థానమందు లేచునని యెరుగుదును.”DATel 591.4

    ఆమె విశ్వాసానికి యధార్థ దిశానిర్దేశాన్నివ్వడానికి ప్రయత్నిస్తూ యేసు ఇలా అన్నాడు, “పునరుత్థానమును జీవమును నేనే.” క్రీస్తులో జీవమున్నది అది మొదటిది, మరొకరి నుంచి వచ్చింది కాదు, మరొక దానినుంచి పుట్టింది కాదు. “దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు” 1 యోహాను 5:12. క్రీస్తు దేవత్వం విశ్వాసికి నిత్యజీవపు బీమా, “నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును, బ్రదికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాటలు నమ్ముచున్నావా?” అని ఆమె నడిగాడు. క్రీస్తు ఇక్కడ తన రెండో రాకడ సమయానికి ఎదురు చూస్తున్నాడు. మరణించిన నీతిమంతులు అప్పుడు అమర్యులుగా లేస్తారు, సజీవులై ఉన్న నీతిమంతులు మరణం చూడకుండా పరలోకానికి ఆరోహణమపుతారు. లాజరుని మరణం నుంచి లేపబోతున్న సూచకక్రియ మరణించిన నీతిమంతుల పునరుత్థానాన్ని సూచిస్తుంది. తన మాటవలన తన కార్యాల వలన తాను పునరుత్థానానికి కర్తనని ఆయన వెల్లడి చేస్తున్నాడు. త్వరలో సిలువపై మరణించనున్న ఆయన మరణపు తాళపు చెవులతో నిలిచి ఉన్నాడు. ఆయన సమాధిపై విజేత. నిత్యజీవాన్ని ఇవ్వడానికి తనకు అధికారం శక్తి ఉన్నాయని ఆయన నొక్కి చెప్పాడు.DATel 591.5

    ” ఆమె ఈ మాట చెప్పి వెళ్లి- బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను.” ఆమె ఆ మాటల్ని నెమ్మదిగా చెప్పింది. ఎందుకంటే అవకాశం కలిగినప్పుడు ఆయన్ని బంధించాలని యాజకులు అధికారులు కనిపెట్టుకుని ఉన్నారు. ఏడుస్తున్న వారి కేకల వల్ల ఆమె మాటలు ఎవరికీ వినిపించలేదు.DATel 592.1

    ఆ వర్తమానం విన్న వెంటనే మరియ హడావుడిగా లేచి ఆ గదిలో నుంచి వెళ్లిపోయింది. ఏడ్వడానికి సమాధి వద్దకు వెళ్తుందని భావించి ఏడ్చేవారు ఆమెను వెంబడించారు. ఆమె క్రీస్తు కనిపెడున్న చోటికి వెళ్లి ఆయన పాదాలవద్ద మోకరించి వణుకుతున్న పెదవులతో ఇలా అంది, “ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును.” ఏడ్చేవారి ఏడ్పు ఆమెకు బాధ కలిగించింది. ఎందుకంటే ఆమె యేసుతో ఒంటరిగా ప్రశాంతంగా కొన్ని మాటలు చెప్పుకోవాలని ఆశించింది. అయితే అక్కడి వారిలో కొందరికి ఆయన పట్ల అసూయ ఈర్య ఉన్నాయని ఆమెకు బాగా తెలుసు. అందుకు తనలో ఉన్న దుఃఖాన్ని పూర్తిగా ఆయనకు వ్యక్తం చెయ్యలేకపోయింది.DATel 592.2

    “ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో” మూలిగాడు. అక్కడ సమావేశమయిన వారందరి హృదయాల్ని ఆయన చదివాడు. అందులో అనేకమంది కనపర్చుతున్న దుఃఖం నటన మాత్రమేనని గ్రహించాడు. ఆ సమూహంలో ఉన్నవారు, ఇప్పుడు దుఃఖిస్తున్నట్లు దొంగాటకమాడున్న వారు కొందరు, కొద్ది కాలంలోనే అద్భుతమైన సూచక క్రియలు చేసిన వానినే గాక మరణం నుంచి ఇప్పుడు ఆయన లేపబోతున్న వానిని కూడా చంపడానికి పన్నాగాలు పన్నుతారని ఆయనకు తెలుసు. వారు ధరించిన దొంగ దుఃఖం ముసుగును క్రీస్తు తొలగించగలిగేవాడు. కాని ఆయన తన పరిశుద్ధ ఆగ్రహాన్ని అదుపుచేసుకున్నాడు. వాస్తవంలో తాను మాట్లాడగలిగిన మాటల్ని ఆయన మాట్లాడలేడు. ఎందుకంటే తనను ప్రగాఢంగా విశ్వసిస్తోన్న భక్తురాలు ఆయన పాదాలవద్ద మోకరించి ఉంది..DATel 592.3

    “అతనినెక్కడ నుంచితిరి” అని ఆయన అడగగా “వారు - ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.” అందరూ కలిసి సమాధి వద్దకు బయలుదేరారు. ‘ అది సంతాప దృశ్యం. లాజరుని అతడి సహోదరీలు అమితంగా ప్రేమించారు. అతడి గురించి వారు గుండె బద్దలయ్యేలా రోదిస్తోన్నారు. అతడి స్నేహితులు ఆసోదరీలతో కలిసి కన్నీళ్లు కార్చారు. ఈ మానవ దుఃఖం దృష్ట్యా లోక రక్షకుడు పక్కనే ఉండగా బాధితులైన మిత్రులు మృతుడి గురించి ప్రజాపించగలరన్న విషయం దృష్ట్యా “యేసు కన్నీళ్లు విడిచెను.” దేవుని కుమారుడైనప్పటికీ ఆయన మానవ స్వభావాన్ని స్వీకరించాడు. మానవ దుఃఖం ఆయన హృదయాన్ని చలింపజేసింది. బాధను చూసినప్పుడు సున్నితమైన దయార్ద్రమైన ఆయన హృదయం స్పందిస్తుంది. దుఃఖించే వారితో ఆయన దుఃఖిస్తాడు. సంతోషించే వారితో సంతోషిస్తాడు.DATel 593.1

    అయితే మరియ మార్తల పట్ల తన మానవ సానుభూతి వల్లే యేసు కంటతడి పెట్టలేదు. ఆయన దుఃఖంలో ఆకాశమంత ఎత్తయిన దుఃఖం ఉంది. క్రీస్తు లాజరుని గూర్చి కన్నీళ్లు విడువలేదు. ఎందుకంటే యేసు అతణ్ని సమాధిలో నుంచి లేపబోతున్నాడు. లాజరు గురించి ఇప్పుడు విలపిస్తోన్న వారిలో అనేకమంది పునరుత్థానం జీవం అయిన తనను చంపడానికి త్వరలో ప్రణాళిక రచించ నున్నందుకు ఆయన దుఃఖించాడు. ఇలాగుండగా విశ్వసించని యూదులు ఆయన కన్నీటి ఆంతర్యాన్ని తెలుసుకోడానికి ఎంత అసమర్థులు! ఆయన కన్నీటికి ఆయన ముందున్న బాహ్య పరిస్థితుల దృశ్యాన్ని మాత్రమే చూస్తున్న కొందరు “అతనిని ఏలాగు ప్రేమించెనోచూడుడని” గుసగుసలాడుకున్నారు. అక్కడున్నవారి మనసుల్లో అపనమ్మకం విత్తనం నాటజూచిన ఇతరులు ఎగతాళిగా ఇలా అన్నారు, “ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చెయలేదా?” లాజరుని రక్షించడానికి క్రీస్తుకి శక్తి ఉంటే అతణ్ని ఎందుకు మరణించనిచ్చాడు?DATel 593.2

    పరిసయ్యులు, సదూకయ్యుల విద్వేషాన్ని క్రీస్తు ప్రావచనిక నేత్రంతో చూశారు. తన్ను మట్టుపెట్టడం గురించి వారు ఆలోచనలు చేస్తోన్నారని ఆయన గ్రహించాడు. ఇప్పుడెంతో సానుభూతి ప్రదర్శిస్తోన్న వారిలో కొందరు త్వరలో తమ నిరీక్షణ ద్వారాన్ని దేవుని పరిశుద్ధపట్టణ గుమ్మాల్ని మూసి వేసుకుంటారని ఆయన గ్రహించాడు. సిగ్గు పరాభవం సిలువతో కూడిన సన్నివేశం త్వరలో చోటుచేసుకోనున్నది. పర్యవసానంగా యెరూషలేము నాశనం కానుంది. అప్పుడు మరణించిన వారి గురించి ప్రజాపించే వారుండరు. యెరూషలేము మీదికి వస్తున్న నాశనం ఆయన కన్నుల ముందు స్పష్టంగా నిలిచింది. రోమా సేనలు యెరూషలేమును ముట్టడించడం చూశాడు. ఇప్పుడు లాజరు గురించి దుఃఖిస్తున్న వారిలో కొందరు ఆముట్టడిలో మరణిస్తారని అది నిరీక్షణ లేని మరణమని ఆయన తెలుసుకున్నాడు,DATel 594.1

    తన ముందున్న ఆ దృశ్యం గురించే క్రీస్తు దుఃఖించలేదు. యుగయుగాల దుఃఖభారం ఆయన మీద ఉంది. దేవుని ధర్మశాస్త్ర ఉల్లంఘన భయంకర ఫలితాల్ని ఆయన చూశాడు. లోక చరిత్రలో హేబెలు మరణంతో ప్రారంభమైన మంచి చెడుల మధ్య పోరాటం ఎడతెగకుండా సాగుతుండండం ఆయన చూశాడు. ముందున్న సంవత్సరాల్ని పైనుంచి కిందకు చూస్తూ, మనుషులికి సంభవించనున్న శ్రమ దుఃఖం, కన్నీళ్లు మరణం, ఆయన చూశాడు. అన్ని యూగాల్లోను, అన్ని దేశాల్లోను మానవ కుటుంబ బాధ ఆయన హృదయాన్ని చీల్చివేసింది. పాప మానవ జాతి శ్రమలు దుఃఖాలు ఆయన హృదయాన్ని బరువెక్కించాయి. ఆయన మానవుల దుఃఖాన్ని తొలగించాలని ఆశిస్తుండగా ఆయన కన్నీటి కాల్వ పొంగిపొర్లింది.DATel 594.2

    “యేసు మరల తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. ” లాజరు మృత దేహాన్ని ఒక రాతిగుహలో ఉంచారు. గుహద్వారాన్ని పెద్ద బండతో మూసివేశారు. యేసు “రాయి తీసివేయుడి” అన్నాడు. మరణించిన లాజరుని చూడడానికేమో అనుకుని మార్త వద్దన్నది. శవం నాలుగురోజుల క్రితం సమాధి అయ్యింది. గనుక కుళ్లుపట్టి ఉంటుందని చెప్పింది. లాజరు పునరుత్థానానికి ముందు చేసిన ఈ ప్రకటన ఏదో మోసం జరిగిందని క్రీస్తు ప్రత్యర్థులు చెప్పకుండా వారి ముందుకాళ్లకు బంధం వేసింది. అత్యద్భుతమైన దైవశక్తి ప్రదర్శనల్ని గురించి పరిసయ్యులు గతంలో తప్పుడు ప్రకటనలు చేశారు. క్రీస్తు యాయీరు కుమార్తెను బతికించినప్పుడు ఆయన ఇలా అన్నాడు, “ఈ చిన్నది నిద్రించుచున్నాదే గాని చనిపోలేదు.” మార్కు5:39. ఆమె కొద్ది సమయం మాత్రమే జబ్బుగా ఉండి మరణించి వెంటనే లేపబడడంతో పరిసయ్యులు ఆ బాలిక మరణించలేదన్నారు. స్వయంగా క్రీస్తే ఆమె నిద్రిస్తోందని ఒప్పుకున్నాడన్నారు. క్రీస్తు వ్యాధులు బాగు చెయ్యలేడని, ఆయన సూచకక్రియల విషయంలో మోసం ఉన్నదని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో అయితే లాజరు మరణించలేదని ఎవరూ అనలేరు.DATel 595.1

    ప్రభువు ఒక పనిచెయ్యడానికి పూనుకున్నప్పుడు, దానికి అడ్డుపుల్లలు వెయ్యడానికి సాతాను ఎవరో ఒకర్ని ప్రోత్సహిస్తాడు. ” రాయి తీసివేయుడి” అని క్రీస్తు అన్నాడు. సాధ్యమైనంత మేరకు నాపనికి మార్గం సుగమం చెయ్యండి. అయినా స్థిరత, అత్యాశగల మార్తా స్వభావం ప్రాధాన్యం వహించింది. కుళ్లివాసమకొడ్చున్న శరీరాన్ని చూపించడం ఆమెకు ససేమిరా ఇష్టం లేదు. క్రీస్తు మాటల్ని అర్థచేసుకోడంలో మానవహృదయం మందకొడిగా కదులుతుంది. అయన వాగ్దానం వాస్తవభావాన్ని మార్తా విశ్వాసం అవగాహన చేసుకోలేకపోయింది.DATel 595.2

    క్రీస్తు మార్తాను మందలించాడు. కాని ఆపని అతిసున్నితంగా చేశాడు. “నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను.” నా శక్తిని నీవు ఎందుకు శంకిస్తున్నావు? నావిధులికి విరుద్ధంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నా మాట ఇస్తున్నాను. నీవు నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు. స్వాభావికమైన అసాధ్యాలు సర్వశక్తుని పనిని అడ్డుకోలేవు. శంకాతత్వం, అవిశ్వాసం వినయం కాదు. క్రీస్తు మాటను ప్రశ్నించకుండ విశ్వసించడం వినయం. అదే నిజమైన ఆత్నార్పణ.DATel 595.3

    “రాయి తీసివేయుడి” తొలగమని రాయిని యేసు ఆజ్ఞాపిస్తే అది ఆయన స్వరాన్ని విని తొలగిపోయేది. తనకు దగ్గరగా ఉన్న దేవదూతల్ని ఈ పని చెయ్యమని ఆజ్ఞాపించగలిగేవాడే. ఈ ఆజ్ఞమేరకు అదృశ్యహస్తాలు ఆ రాయిని తొలగించేవి. అయితే దాన్ని మానవ హస్తాలే తొలగించాల్సి ఉన్నాయి. మానవులు దేవునితో సహకరించాలని ఇలా క్రీస్తు సూచిస్తోన్నాడు. మానవశక్తి చేయగలిగినదానికి దైవశక్తి వినియోగం కాదు. దేవుడు మానవ సహాయాన్ని నిరాకరించడు. తనకిచ్చిన శక్తుల్ని సమర్థతల్ని మానవుడు వినియోగిస్తుంటే దేవుడు అతణ్ని బలపర్చి అతడితో సహకరిస్తాడు.DATel 596.1

    ఆయన ఆజ్ఞ ప్రకారం రాయిని తొలగించారు. అంతా దాపరికం లేకుండా బాహాటంగా జరిగింది. ఎలాంటి మోసం జరగకుండా చూడడానికి అందరికీ అవకాశం ఇవ్వబడింది. లాజరు మృతదేహం రాతి సమాధిలో చల్లగా నిశ్శబ్దంగా పడి ఉంది. ఏడ్చేవారు ఏడ్పు ఆపివేశారు. ప్రజలు ఆశ్చర్యంతో ఉత్కంఠతో సమాధి చుట్టూ నిలబడి ఏంజరిగిందో అని కని పెడ్తున్నారు.DATel 596.2

    సమాధి ముందు క్రీస్తు ప్రశాంతంగా నిలబడ్డాడు. అక్కడున్నవారందరి నీ పరిశుద్ధ గంభీరత అవరించింది. క్రీస్తు సమాధికి మరికొంచెం దగ్గరగా వెళ్లాడు. ఆకాశంవైపు కన్నులెత్తి ఆయన ఇలా అన్నాడు, “తండ్రీ నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెలించుచున్నాను.” దీనికి కొంచెం ముందు క్రీస్తు శత్రువులు ఆయన దైవదూషణ చేస్తున్నాడని ఆరోపించారు. తాను దేవుని కుమారుణ్నంటున్నాడు గనుక ఆయనమీద విసరడానకి రాళ్లుపుచ్చుకున్నారు. ఆయన సాతాను శక్తితో అద్భుతాలు చేస్తున్నాడని ఆరోపించారు. అయితే క్రీస్తు ఇప్పుడు దేవున్ని తనతండ్రని చాటుతూ సంపూర్ణ విశ్వాసంతో తాను దేవుని కుమారుణ్నని ప్రకటిస్తున్నాడు.DATel 596.3

    తాను చేసిన పనులన్నిటిలో క్రీస్తు తన తండ్రితో సహకరిస్తున్నాడు. తాను స్వతంత్రంగా ఏ పనీ చెయ్యలేదన్న విషయం కనపర్చడానికి ఆయన జాగరూకత వహించాడు. తన సూచక క్రియలన్నిటినీ విశ్వాసం ద్వారాను ప్రార్ధన ద్వారాను ఆయన చేశాడు. తండ్రితో తన సంబంధాన్ని అందరూ తెలుసుకోవాలని క్రీస్తు వాంఛించాడు. ఆయన ఇలా ఉన్నాడు, “తండ్రీ, నీవు నా మనవి వినినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీమాట చెప్పితిని.” క్రీస్తుకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మిక్కిలి నిశ్చితమైన నిదర్శనం శిష్యులికి ప్రజలికీ ఇక్కడ ప్రదర్శితమవ్వవలసి ఉంది. క్రీస్తు చెబుతున్నది అబద్దం మోసం కాదని వారికి ప్రదర్శితం కావలసి ఉంది.DATel 596.4

    “ఆయన ఆలాగు చెప్పి - లాజరూ బయటికి రమ్మని బిగ్గరగా” చెప్పాడు. స్పష్టమైన, చొచ్చుకుపోయే ఆయన స్వరం మృతుడి చెవిలోకి దూసుకువెళ్లింది. ఆయన మాట్లాడుతుండగా మానవత్వంలో నుంచి దేవత్వం ప్రకాశించింది. దేవుని మహిమతో ప్రకాశిస్తోన్న ఆయన ముఖంలో ప్రజలు ఆయన శక్తి ధ్రువీకరణను చూశారు. ప్రతీవారి దృష్టి గుహద్వారంపై నిలిచింది. ఏ చిన్న శబ్దం వచ్చినా అందరూ దీక్షగా వింటోన్నారు. క్రీస్తు దేవత్వ పరీక్షకు అనగా క్రీస్తు దేవుని కుమారుడని నిదర్శనం చూపడమో లేక దానికి అంతం పలకడమో తేల్చే పరీక్షకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.DATel 597.1

    నిశ్సబ్దంగా ఉన్న సమాధిలో అలజడి వినిపిస్తోంది. మరణించిన లాజరు సమాధి ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. సమాధి వస్త్రాలు కాళ్లు చేతుల్ని బంధించి ఉన్నందువల్ల అతడి కదలికకు ఆటంకం కలిగింది. ఆశ్చర్యపోతున్న ప్రేక్షకుల్ని ఉద్దేశించి క్రీస్తిలా అన్నాడు, “మీరు అతనికట్లు విప్పిపోనియ్యుడి.” మానవుడు దేవునితో సహకరించాలన్న విషయాన్ని ఇది వారికి మళ్లీ సూచించింది. మనుషులు మనుషులకోసం పనిచెయ్యాలి. లాజరుని బంధవిముక్తుణ్ని చేశారు. అతడు ఆ జనసమూహం ముందు నిలబడి ఉన్నాడు. వ్యాధి వలన చిక్కి బలహీనంగా తూలిపోతున్న వాడిలా లేడు అతడు. యౌవనంలో ఉన్న వ్యక్తిలా బలంగా ఉదాత్తంగా ఉన్నాడు. అతడి కళ్ళు వివేకంతో రక్షకుని పట్ల ప్రేమతో కళకళలాడాయి. అతడు యేసు పాదాలపై పడి ఆయన్ని పూజించాడు.DATel 597.2

    చూపరులు మొదట ఆశ్చర్యంతో అవాక్కయారు. ఆతర్వాత వర్ణనాతీతమైన ఆనందం వెల్లివిరిసింది. అందరూ కృతజ్ఞతతో నిండారు. అతడి సహోదరీలు అతణ్ని దేవుని వరంగా స్వీకరించారు. ఆనందబాష్పాలతో రక్షకునికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అయితే సహోదరుడు, సహోదరీలు, మిత్రులు ఈ పునఃసంయోగంలో ఆనందిస్తూ ఉండగా యేసు అక్కడనుంచి నిష్క్రమించాడు. జీవదాతకోసం వారు వెదకగా ఆయన కనిపించలేదు.DATel 598.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents