Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    43—కూలిన అడ్డుగోడలు

    పరిసయ్యులతో సంఘర్షణ అనంతరం యేసు కపెర్నహోమును విడిచి పెట్టి గలిలయ దాటి ఫేనీకే సరిహద్దులో ఉన్న కొండ ప్రదేశానికి వెళ్ళాడు. పశ్చిమ దిశగా చూస్తే కింద మైదాన ప్రదేశంలో పురాతన పట్టణాలైన తూరు సీదోనులు వ్యాపించి ఉన్నాయి. ఆ పట్టణాల్లో అన్యమత దేవాలయాలు, వైభవోపేతమైన రాజభవనాలు, మండీలు, ఓడలతో నిండిన ఓడరేవులు ఉన్నాయి. నేపథ్యంలో మధ్యదరాసముద్రం ఉంది. సువార్త సేవకులు ఆ మహాసముద్రం పై ప్రయాణించి ప్రపంచంలో గొప్పదైన ఆ సామ్రాజ్య కేంద్రాలకి సువార్త సువర్తమానాన్ని అందించాల్సి ఉన్నారు. అయితే దానికి సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు తనముందున్న పని తన శిష్యుల్ని తమ పరిచర్యకు సిద్దంచెయ్యడం. ఈ ప్రాంతానికి రావడంలో బేత్సయిదాలో పొందలేకపోయిన విశ్రాంతిని పొందాలని నిరీక్షించాడు. అయినా ఈ ప్రయాణాన్ని చెయ్యడంలో ఇదొకటే ఆయన ఉద్దేశం కాదు.DATel 438.1

    “ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతె వచ్చి - ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము; నాకుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసెను.” మత్త 15:22. ఈ జిల్లాకు చెందిన ప్రజలు కనానీయజాతివారు, విగ్రహారాధకులు. యూదులు వారిని తృణీకరించి ద్వేషించారు. ఇప్పుడు యేసు వద్దకు వచ్చిన స్త్రీ ఈ తరగతికి చెందింది. ఆమె అన్యురాలు కనుక యూదులు దినదినం పొందే ఉపకారాలికి ఆమె అర్హురాలు కాదు. ఫేనీకేయుల మధ్య చాలా మంది యూదులు నివసిస్తోన్నారు. క్రీస్తు పరిచర్య వార్తలు ఈ ప్రాంతానికి వ్యాపించాయి. ఆ ప్రజల్లో కొందరు ఆయన మాటలాడడం విన్నారు. ఆయన అద్భుతకార్యాలు చూశారు. అన్ని రకాల వ్యాధుల్ని నయంచేసే ఒక ప్రవక్తనుగురించి ఈమె విన్నది. ఆయన శక్తిని గూర్చి విన్నప్పుడు ఆమెలో ఆశ మొలకెత్తింది. తల్లి ప్రేమ వెల్లువెత్తడంతో ఆమె తన కుమార్తె పరిస్థితిని ఆయనకు విన్నవించాలని నిర్ణయించుకుంది. తన కష్టాన్ని యేసు ముందు పెట్టాలని నిశ్చయించుకుంది. ఆయన తన కుమార్తెను బాగుచెయ్యాలి. అన్యదేవతల సహాయాన్ని అర్థించిందిగాని లాభం లేకపోయింది. ఈ యూదు బోధకుడు నాకేమి సహాయం చేయగలుగుతాడు? అని కొన్నిసార్లు తలంచేది. అయితే ఆయన అన్ని వ్యాధుల్నీ స్వస్తపర్చుతాడన్న - వార్త ఆమెకు వినిపించింది. తన వద్దకు సహాయానికి వచ్చేవారు ఉన్నవారైనా లేనివారైనా వారెవరైనా ఆయన బాగుచేస్తాడని విన్నది. తనకు లభించే ఒకే ఒక అవకాశాన్ని వదులుకోకూడదని తీర్మానించుకుంది.DATel 438.2

    ఈ స్త్రీ పరిస్థితి క్రీస్తుకి తెలుసు. తనను చూడడానికి ఆమె ఎంతో ఆశిస్తోందని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఆమె మార్గంలో ఉన్నాడు. ఆమె దుఃఖాన్ని ఉపశమింపజేసే పరిచర్య ద్వారా తాను నేర్పించాలని ఉద్దేశించిన పాఠానికి ఆయన సజీవ సాదృశ్యం ఇవ్వగలుగుతాడు. ఈ హేతువుచేతనే తన శిష్యుల్ని ఆ ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. ఇశ్రాయేలు పరిసరాల్లో ఉన్న పట్టణాల్లో పల్లెల్లో ఉన్న అజ్ఞానాన్ని వారు చుడాలని ఆయన కోరాడు. సత్యాన్ని అవగాహన చేసుకోడానికి ప్రతీ అవకాశం ఉన్న ప్రజలు తమ చుట్టు పట్ల ఉన్న ప్రజల అవసరాన్ని గూర్చిన జ్ఞానం లేకుండా ఉన్నారు. చీకటిలో ఉన్న ఆత్మలికి సహాయం చెయ్యడానికి ఎలాంటి కృషీ జరగలేదు. యూదు అహంభాం నిర్మించిన వేర్పాటు అడ్డుగోడ అన్యజనులికి సానుభూతి చూపే విషయంలో శిష్యుల్ని సయితం ఆటంకపర్చింది. అయితే ఈ అడ్డుగోడని పగులగొట్టాల్సిన అవసరం ఉంది.DATel 439.1

    ఆ స్త్రీ వినతికి క్రీస్తు వెంటనే స్పందించలేదు. తృణీకారానికి ద్వేషానికి గురి అయిన ఒక జాతికి ప్రతినిధి అయిన ఈ స్త్రీ పట్ల యూదులు ఎలా వ్యవహరించి ఉండేవారో, అలాగే ఆయన ఆమెతో వ్యవహరించాడు. ఇలాంటి వ్యక్తితో ఎంత నిరుత్సాహంగా, నిర్లిప్తంగా, నిర్దయగా వ్యవహరిస్తున్నారో తన శిష్యులు గుర్తించాలన్నదే దీన్ని ఏర్పాటు చెయ్యడంలో ప్రభువు ఉద్దేశం. తన శిష్యులు తాను ఈ స్త్రీని స్వీకరించిన రీతిని బట్టి తాము అట్టి వారి పట్ల దయగా వ్వహరించాలని అనంతరం ఆమె కోరిక మేరకు సాయం చేసిన రీతిని బట్టి అలాంటి దుస్థితిలో ఉన్న వారిని వారు ఆదుకోవాలని ఆయన కోరాడు.DATel 439.2

    యేసు సమాధానం చెప్పకపోయినా ఆ స్త్రీ తన విశ్వాసాన్ని కోలుకోలేదు. తనను వినిపించుకోనట్టుగా కనిపించినా ఆమె ఆయన్ని వెంబడించి తన మనవిని కొనసాగిస్తూనే ఉంది. ఆమె ఎడతెరపి లేకుండా. అర్ధించడంతో విసిగిన శిష్యులు ఆమెను పంపివేయమని యేసుతో అన్నారు. తమ ప్రభువు ఆమెతో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు వారు చూశారు. కనుక కనానీయుల పట్ల యూదులు ప్రదర్శిస్తోన్న దురభిమానం ఆయనకు ఆనందంగా ఉంటుందని భావించారు. కాని ఆ స్త్రీ మనవి చేసుకున్నది దయామయుడైన రక్షకునికి. కనుక శిష్యుల మనవికి జవాబుగా యేసు ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొట్టెల యొద్దకేగాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు.” ఈ జవాబు యూదుల దురభిమానానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ దాని అంతర్గత భావం శిష్యులికి మందలింపుగా ఉంది. దాన్ని వారు తదనంతరం అవగాహన చేసుకున్నారు. అదేంటంటే తనను అంగీకరించే వారందరినీ రక్షించడానికి వచ్చానని జ్ఞాపకం చేస్తూ తమకు ఆయన తరచుగా చెప్పడం.DATel 440.1

    ఆ స్త్రీ ఆయన పాదాలికి నమస్కరించి, “ప్రభువా నాకు సహాయము చేయుము” అంటూ ఎడతెగకుండా వేడుకుంటోంది. యేసు ఇంకా ఆమె మనవిని తోసిపుచ్చుతోన్నట్లు కనిపిస్తూ, కరడుగట్టిన యూదు దురభిమానం ప్రకారం ఆమెకు ఇలా బదులు పలికాడు, “పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు.” దేవుడు అభిమానించే ప్రజలు కోసం తెచ్చిన ఆశీసులు ఇశ్రాయేలుకు చెందని వారికి ఇవ్వడం న్యాయం కాదని ఖండితంగా చెప్పడమే ఇది. పట్టుదల లోపించిన మరే ఇతర వ్యక్తినైనా ఈ సమాధానం నిరుత్సాహపర్చేది. అయితే ఈ స్త్రీ తనకు వచ్చిన అవకాశాన్ని గుర్తించింది. యేసు నిరాకరణ వెనక దాచినా దాగని కరుణా హృదయాన్ని ఆమె చూసింది. “నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్లమీద నుండి పడుముక్కలు తినునుగదా!” అన్నది. కుటుంబంలోని పిల్లలు తండ్రితో బల్లమీద భోజనం చేస్తుండగా భోజనం పెట్టకుండా కుక్కల్ని సయితం విడిచిపెట్టడం జరగదు. బల్లమీద నుంచి విస్తారంగా పడే ముక్కలు తినడానికి వాటికి హక్కు ఉంది. అలాగే ఇశ్రాయేలుకి ఎన్నో ఆశీసులుండగా ఆమెకు ఒక్కదీవెన కూడా లేదా? ఆమెను కుక్కగా పరిగణించాడు ప్రభువు. అలాగైనప్పుడు ఆయన విస్తారమైన ఆశీర్వాదాల్లోని ముక్కలు తినడానికి ఆ కుక్కకు హక్కులేదా?DATel 440.2

    యేసు తన సేవారంగం నుంచి నిష్క్రమించాడు. ఎందుకంటే శాస్త్రులు పరిసయ్యులు ఆయన్ని చంపాలని చూస్తోన్నారు. వారు ఆయన్ని గూర్చి సణుగుకున్నారు. ఫిర్యాదులు చేశారు. ద్వేషం శత్రుత్వం ప్రదర్శించారు. ఆయన ఉచితంగా ఇస్తానని ముందుకు వచ్చిన రక్షణను వారు నిరాకరించారు. ఇక్కడ క్రీస్తు తృణీకారానికి ద్వేషానికి గురి అయిన ఓ జాతికి చెందిన అభాగ్యురాలిని కలిశాడు. ఆ జాతి దేవుని వాక్య వికాసానికి నోచుకోలేదు. అయినా ఆమె క్రీస్తు దైవప్రభావానికి తన్నుతాను సమర్పించుకున్నది. తను కోరిన ఉపకారాన్నివ్వడానికి ఆయనకు శక్తి ఉన్నదని ఆమె చిత్త శుద్ధి తో నమ్మింది. యజమాని బల్ల మీద నుంచి పడ్డ రొట్టెముక్కలివ్వమని అర్ధించింది. కుక్కకుండే తరుణం తనకు లభిస్తే కుక్కగా ఉండడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఆమెకు జాతీయ లేదా మతపరమైన దురభిమానం లేదా అతిశయం లేదు. తాను కోరింది సాధించడానికి ఆమె యేసుని విమోచకుడుగాను తాను యాచించేదంతా అనుగ్రహించడానికి సమర్ధుడుగాను వెంటనే గుర్తించింది.DATel 441.1

    రక్షకుడు తృప్తి చెందాడు. తనపై ఆమెకెంత విశ్వాసముందో పరీక్షించాడు. ఇశ్రాయేలు తృణీకరించిన వ్యక్తిగా పరిగణన పొందిన ఆమె ఇక పరాయి వ్యక్తి కాదు గాని దేవుని కుటుంబసభ్యురాలని ఆమెతో తాను వ్యవహరించిన రీతిని బట్టి ఆయన చూపించాడు. బిడ్డగా తండ్రి వరాల్లో పాలుపంపులు పొందడం ఆమెకున్న విశేష హక్కు. క్రీస్తు ఇప్పుడు ఆమె మనవిని మంజూరు చేశాడు. దానితో శిష్యులికి ఆయన చెబుతోన్న పాఠం సమాప్తమయ్యింది. ఆమె వంక దయగా ప్రేమగా చూస్తూ ఇలా అన్నాడు. “అమ్మా, నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే నీకు అవును గాక.” ఆ ఘడియ నుంచి ఆమె కుమార్తె స్వస్తత పొంది బాగున్నది. దయ్యం ఇక ఆమెను బాధించలేదు. ఆ స్త్రీ రక్షకుణ్ని అంగీకరించి ఆయన తన ప్రార్థనకు ఫలమిచ్చినందుకు ఆనందోత్సాహాలతో వెళ్లిపోయింది.DATel 441.2

    ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు యేసు ఈ ఒక్క అద్భుతాన్నే చేశాడు. ఈ కార్యం నిర్వహించేందుకే ఆయన తూరు సీదోనుల సరిహద్దులికి వెళ్లాడు. శ్రమననుభవిస్తోన్న ఆ స్త్రీకి నివారణ చేకూర్చాలని భావించాడు. అదే సమయంలో తృణీకారానికి నిర్లక్ష్యానికి గురి అయిన ప్రజల్లోని వారికి దయకనికరాలు అందించే తన పరిచర్యకు వారికి సాదృశ్యాన్ని విడిచి పెట్టాలని, తాను ఇక లేనప్పుడు అది తన శిష్యులికి ఎంతో ఉపకరిస్తుందని ఆయన ఆశించాడు. తమ యూదు వేర్పాటు తత్వం నుంచి వారిని వేరుచేసి తమ జాతి వారి కోసమే గాక ఇతర ప్రజల కోసం పనిచెయ్యడంపై వారికి ఆసక్తి కలిగించడానికి కృషి చేశాడు.DATel 442.1

    యుగయుగాలుగా మరుగై ఉన్న సత్యసంబంధమైన మర్మాన్ని విశదీకరించాలని యేసు ఆశించాడు. అన్యజనులు యూదులతో సహవారసులు “సువార్త వలన క్రీస్తు యేసునందు.... వాగ్దానములో పాలివారలు” అయి ఉండాలన్నదే ఆమర్మం. శిష్యులు ఈ సత్యాన్ని గ్రహించడంలో మందకొడిగా ఉన్నారు. పరమగురువు యేసు వారికి ఎన్నో పాఠాలు బోధించాడు. కపెర్నహోములోని శతాధిపతి విశ్వాసానికి ప్రతిఫలం ఇవ్వడంలో సుఖారు ప్రజలకి సువార్త ప్రకటించడంలో తాను యూదుల అసహనాన్ని పంచుకోలేదని అప్పటికే ఆయన నిదర్శనం ఇచ్చాడు. పోతే సమరయులికి కొంత మేరకు దేవుని గూర్చిన జ్ఞానం ఉంది. ఆ శతాధిపతి ఇశ్రాయేలుకి దయ చూపించాడు. ఇప్పుడు ఒక అన్యురాలితో పరిచయమయ్యే పరిస్థితిలోకి శిష్యుల్ని యేసు తీసుకువచ్చాడు. ఆయన అనుగ్రహం పొందడానికి ఆయన ప్రజలకన్నా ఆమెకు ఎక్కువ హేతువు లేదని శిష్యుల పరిగణించారు. అలాంటి వ్యక్తి విషయంలో ఎలా మెలగాలో ఓ ఉదాహరణ ఇవ్వాలని ఆయన భావించాడు. ఆయన తన కృపావరాల్ని అతి ధారాళంగా ఇచ్చివేస్తోన్నాడని శిష్యులు అనుకున్నారు. తన ప్రేమను తెగకు జాతికి పరిమితం చెయ్యకూడదని ఆయన కనపర్చనున్నాడు.DATel 442.2

    “ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొట్టెల యొద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదు.” అని ఆయన అన్నప్పుడు ఆయన సత్యాన్ని ప్రకటించాడు. ఆ కనానీయ స్త్రీకి చేసిన పరిచర్యలో తాను చేయడానికి అవతరించిన కార్యాన్ని ఆయన నెరవేర్చతున్నాడు. ఈ స్త్రీ తప్పిపోయిన గొర్రెల్లో ఒక గొర్రె. ఆ గొర్రెను ఇశ్రాయేలు రక్షించాల్సింది. అది వారికి నియోగితమైన పని. కాని వారు దాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల క్రీస్తు చేస్తోన్నాడు.DATel 442.3

    అన్యజనుల మధ్య తాము చేయాల్సి ఉన్న పరిచర్యను ఇది మరింత స్పష్టంగా శిష్యులికి బోధ పర్చింది. యూదయకు వెలపల విశాలమైన ప్రయోజనకరమైన సేవారంగాన్ని వారు చుశారు. ఎంపికైన ఈ జనులు ఎరుగని దుఃఖాలు శ్రమలు భరిస్తోన్న ఆత్మల్ని వారు చూశారు. ఎంపికైన ఈ జనులు ద్వేషించి తృణీకరించడానికి నేర్చుకున్న వారిలో ఆ మహావైద్యుని సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తోన్న ఆత్మలున్నాయి. దేవుడు యూదులికి సమృద్ధిగా ఇచ్చిన జీవాహారం కోసం ఆ ఆత్మలు ఆకలిగా ఉన్నాయి.DATel 443.1

    అనంతరం, శిష్యులు యేసుని లోక రక్షకుడుగా ప్రకటించినందుకు యూదులు శిష్యులికి మరింత దూరమైనప్పుడు, యూదులికీ అన్యజనులికీ మధ్య ఉన్న వేర్పాటు గోడ క్రీస్తు మరణంతో కూలిపోయినప్పుడు, ఈ పాఠం - ఆచారం చేత లేక జాతీయత చేత నియంత్రితం కాని ఇలాంటి పాఠాలు - క్రీస్తు ప్రతినిధులు తమ సేమను నిర్వహించే పద్ధతిపై శక్తివంతమైన ప్రభావాన్ని ప్రసరించాయి.DATel 443.2

    రక్షకుని ఫేనీకే సందర్శనం అక్కడ ఆయన చేసిన అద్భుతం తాలుకు ఉద్దేశం ఎంతో విశాలమయ్యింది. బాధితురాలైన ఆ స్త్రీ ఒక్కదానికే కాదు లేదా ఆయన శిష్యులు వారి సేవల లబ్ధి పొందిన వారికే కాదు కాని “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును,” ఆ సేవ జరిగింది. యోహాను 20:31. పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం ఏ సాధనాలు మనుషుల్ని క్రీస్తు వద్దకు రాకుండా అడ్డుకున్నాయో అవే నేడూ పనిచేస్తోన్నాయి. యూదులికి అన్యజనులకి మధ్య అడ్డుగోడ కట్టిన స్వభావమే ఇంకా చురుకుగా పనిచేస్తోంది. అహంకారం, దురభిమానం వివిధ తరగతుల ప్రజల మధ్య వేర్పాటు గోడలు నిర్మిస్తోన్నాయి. క్రీస్తు ఆయన పరిచర్య గురించి అబద్ధ ప్రచారం జరుగుతోంది. వేల ప్రజలు సువార్త పరిచర్య పరిధిలో తమకు స్థానం లేదని భావిస్తారు. అయితే తాము క్రీస్తు వద్దకు రాకూడని వారు భావించకూడదు. విశ్వాసం చొచ్చుకుపోలేని ఆటంకాల్ని మానవులు గాని లేక సాతాను గాని నిర్మించలేరు.DATel 443.3

    యూదులు అన్యజనుల మధ్య పేరుకుపోయిన ప్రతిబంధకాల్ని లెక్కచెయ్యకుండా ఆ ఫేనీకే స్త్రీ విశ్వాసంతో ముందుకు వెళ్లింది. నిరుత్సాహానికి వ్యతిరేకంగా సందేహం కలిగించే పరిస్థితుల్ని లెక్క చెయ్యకుండా ఆమె రక్షకుని ప్రేమను నమ్మింది. ఆయన్ని మనం ఆ విధంగా నమ్మాలని ఆయన కోరుతున్నాడు. రక్షణ దీవెనల్ని దేవుడు ప్రతీ ఆత్మకూ ఇస్తాడు. సువార్త ద్వారా క్రీస్తులోని ఆశీర్వాదాల్లో పాలు పంచుకోకుండా ఎవరినీ ఏదీ ఆపలేదుఆ వ్యక్తి ఎంపిక తప్ప.DATel 444.1

    కులం దేవునికి హేయం. ఈ కోవకు చెందిన సమస్తాన్ని ఆయన విస్మరిస్తాడు. ఆయన దృష్టిలో మనుషులందరి ఆత్మలు సమానమైన విలువ కలవి. “యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతిజాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసస్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ” వయసు, హోదా, జాతీయత, మతపరమైన ఆధిక్యత - వీటితో నిమిత్తం లేకుండా ఆయన వద్దకు వచ్చి జీవించాల్సిందిగా అందరికీ ఆహ్వానం వస్తోంది. “ఆయన్ని ఎవరు విశ్వసిస్తారో వారు సిగ్గుపడరు. ఎందుకంటే విభేదమేమి ఉండదు.” “ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు” “ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు. వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే.” “ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయుండి తనకు ప్రార్థన చేయువారి యెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైయున్నాడు. ఎందుకనగా - ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును.” అ.కా. 17:26, 27; గలతీ 3:28; సామెతలు 22:2; రోమా 10:11-13.DATel 444.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents