Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  5—సమర్పణ

  క్రీస్తు జన్మించి దాదాపు నలభై రోజులైన తర్వాత యోసేపు మరియలు శిశువును ప్రభువుకు సమర్పించడానికి బలులు అర్పించడానికి యెరూషలేముకు తీసుకువెళ్ళారు. ఇది యూదుల ఆచారం ప్రకారం జరిగించిన కార్యం. మానవుడి ప్రత్యామ్నాయంగా ప్రతీ విషయంలో క్రీస్తు ధర్మశాస్త్రానికి బద్దుడై ఉండాలి. అప్పటికే ఆయనకు సున్నతి జరిగింది. ధర్మశాస్త్రానికి విధేయుణ్నయి నివసిస్తానన్న వాగ్దానానికి అది సంకేతం.DATel 31.1

  తల్లి తరుపున కానుకగా ఏడాది గొర్రెపిల్లను దహన బలిగాను, ఒక పావురం పిల్లను లేదా గువ్వను పాపపరిహారార్థ బలిగాను అర్పించాలని ధర్మశాస్త్రం నిర్దేశిస్తోంది. కాని తల్లిదండ్రులు గొర్రెపిల్లను అర్పించలేనంత పేదవారైతే, రెండు గువ్వల్ని లేదా రెండు పావురం పిల్లల్ని, ఒకటి దహన బలికి ఒకటి పాప పరిహారార్ధబలికి అర్పించడం సరిపోతుందని ధర్మశాస్త్రం చెబుతుంది.DATel 31.2

  ప్రభువుకు సమర్పించే అర్పణలు నిర్దోషంగా ఉండాలి. ఈ అర్పణలు క్రీస్తుకు చిహ్నాలు. ఈ కోణంలో చూస్తే శారీరకంగా క్రీస్తులో ఏ లోపమూ లేదు. ఆయన “నిరోషమును నిష్కళంకమునగు గొట్టెపిల్ల” 1 పేతురు 1:19. . ఆయన దేహ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదు. ఆయన శరీరం బలమైంది ఆరోగ్యవంతమైంది. ఆయన తన జీవితమంతా ప్రకృతి నియమాలననుసరించి నివసించాడు. దైవ ధర్మశాస్త్రానికి విధేయులై జీవించే మానవుల ప్రగతికి దేవుడు చేసిన ఏర్పాటుకు శారీరకంగాను ఆధ్యాత్మికంగాను క్రీస్తు ఆదర్శం.DATel 31.3

  మొదటి సంతానాన్ని దేవునికి సమర్పించడం అనాది నుంచి వస్తున్న ఆచారం. మానవాళిని రక్షించడానికి పరలోక జ్యేష్ఠ పుత్రుణ్ని సమర్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రతీ గృహంలోను జ్యేష్ఠ కుమారుణ్ని దేవునికి అంకితం చెయ్యడం ద్వారా ఈ ఈవిని ప్రతీ కుటుంబం గుర్తించాల్సి ఉంది. క్రీస్తు ప్రతినిధిగా అతడు యాజక సేవకు అంకితం కావలసి ఉండేవాడు.DATel 32.1

  ఐగుప్తు దాస్యం నుంచి విడుదలలో మొదటి సంతానం సమర్పణను దేవుడు మళ్లీ ఆదేశించాడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులకు దాసులుగా ఉంటున్నప్పుడు ఐగుప్తు రాజు ఫరోవద్దకు వెళ్లి అతడికి ఇలా చెప్పమని ప్రభువు మోషేను ఆదేశించాడు. “ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని యెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుము.” నిర్గమ కాండము 4:22, 23. మోషే ఆ వర్తమానాన్ని అందించాడు. అయితే గర్విష్టుడైన ఆ రాజు ఇచ్చిన సమాధానం ఇది, “నేను అతని మాటవిని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను ” నిర్గమ 5:2. ప్రభువు చిహ్నాలు అద్భుతాల ద్వారా పనిచేసి తన ప్రజల పక్షంగా భయంకరమైన తీర్పులు ఫరో మీదికి పంపాడు. చివరికి ఐగుప్తీయుల ప్రథమ సంతానాన్ని అనగా మనుషులు జంతువుల ప్రథమ సంతానాన్ని చంపవలసిందన్న ఆజ్ఞ నాశన దూతకు జారీ అయ్యింది. ఆ నాశనం ఇశ్రాయేలీయులికి సంభవించకుండేందుకోసం వారు గొర్రెపిల్లను చంపి దాని రక్తాన్ని తమ ఇళ్ళ ద్వారబంధాలకు రాయాల్సి ఉన్నారు. నాశనం చేసే తన కర్తవ్య నిర్వహణలో మరణదూత ఇశ్రాయేలీయుల గృహాల్ని దాటి వెళ్ళిపోయేందుకు ప్రతిగృహం ఈ గుర్తును ధరించాల్సి ఉంది.DATel 32.2

  ఐగుప్తుమీద తన తీర్పులు కుమ్మరించిన దరిమిలా ప్రభువు మోషేతో ఇలా అన్నాడు, “మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతిని అనగా ప్రతీ తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అదినాది.” “ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిననాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నా వారైయుందురు. నేనే యెహోవాను.” నిర్గమ 13:2; సంఖ్యా 2:13. గుడార సేవలు స్థాపితమైన తర్వాత గుడారంలో పరిచర్య చెయ్యడానికి ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానం ఇంకా ప్రభువుకు చెందిన వారిగానే పరిగణన పొందాల్సి ఉన్నారు. వారిని క్రయధనంతో తిరిగి కొనాల్సి ఉంది.DATel 32.3

  ఇలా ప్రథమ సంతానం సమర్పణకు సంబంధించిన నిబంధన ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇశ్రాయేలుకు ప్రభువు కలిగించిన అద్భుత విమోచనకు స్మృతి చిహ్నం కాగా అది దేవుని అద్వితీయ కుమారుడు కలిగించనున్న మరింత గొప్ప విమోచనకు ముంగుర్తు, ఛాయారూపకం, ద్వారబంధాలపై చల్లిన రక్తం ఇశ్రాయేలు ప్రథమసంతానాన్ని కాపాడింది. అలాగే క్రీస్తు రక్తానికి లోకాన్ని రక్షించే శక్తి ఉంది.DATel 33.1

  కాగా క్రీస్తు సమర్పణలో గర్భితమైన అర్థమేంటి! అయితే యాజకుడు ముసుగులోనుంచి చూడలేకపోయాడు. మర్మాన్ని అధిగమించి అవగాహన చేసుకోలేకపోయాడు. చిన్నపిల్లల్ని సమర్పించడం సర్వసామాన్య దృశ్యం. రోజుకి రోజు యాజకుడు చిన్న బిడ్డల్ని దేవునికి సమర్పించి విమోచన ద్రవ్యం అందుకునేవాడు. రోజుకి రోజు తన ఈ విధిని అలవాటుగా చేస్తూ ఉండేవాడు. ఈ ప్రక్రియలో పిల్లల్నిగాని తల్లిదండ్రుల్నిగాని పట్టించుకునేవాడు కాదు - వారు ఆస్తి హోదా ఉన్నవారైతే తప్ప. యోసేపు, మరియలు పేదలు. వారు తమ బిడ్డతో వచ్చినప్పుడు యాజకులు వారిని గలిలయుల్లా వస్త్రాలు ధరించిన పురుషుణ్ని స్త్రీని చూశారు. వారి అతి సామాన్య దుస్తుల్నే చూశారు. వారి గమనాన్ని ఆకర్షించడానికి వీరి ఆకృతిలో విశేషం ఏమి లేదు. వారి కానుక బీదలిచ్చే కానుక.DATel 33.2

  యాజకుడు తన విహితకర్తవ్యమైన ఆచారాన్ని నిర్వహించాడు. బిడ్డను చేతుల్లోకి తీసుకుని బలిపీఠం ముందు పైకెత్తాడు. బిడ్డను తిరిగి తల్లికిచ్చి “యేసు” అన్న పేరు ప్రథమ సంతానం జాబితాలో నమోదు చేశాడు. ఆ బిడ్డ తన చేతుల్లో ఉన్నప్పుడు అతడు పరలోకచక్రవర్తి అని మహిమరాజుఅని అతడికి తట్టలేదు. “ప్రభువైన దేవుడు ‘నా వంటి యొక ప్రవక్తను నా సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన నాతో ఏమి చెప్పినను అన్ని విషయములలో నారాయన మాట వినవలెను” (అ||కార్య 3:22) అని మోషే చెప్పింది ఈ శిశువు గురించే అని యాజకుడికి తెలియదు. ఎవరి మహిమను చూపించమని మోషే వినతి చేశాడో ఆప్రభువు ఈ శిశువేనని అతడు అనుకోలేదు. అయితే మోషేకన్నా ఘనుడు ఆ యాజకుడి చేతుల్లో ఉన్నాడు. ఆ శిశువు పేరు నమోదు చేసినప్పుడు యూదు వ్యవస్థ పునాదినే నమోదు చేస్తున్నట్లు అతడు ఎరుగడు. ఆ పేరు ఆ వ్యవస్థ మరణ శాసనం. ఎందుకంటే బలులు అర్పణల వ్యవస్థ పాతదైపోతోంది. గుర్తు వ్యక్తిని, నీడ నిజాన్ని దాదాపు కలుసుకోడం జరిగింది.DATel 33.3

  ఆలయంలో నుంచి షెకీనా కాంతి వెళ్లిపోయింది. కాని దేవదూతలు ఏ ప్రకాశతముందు వంగి నమస్కరిస్తారో ఆ ప్రకాశత బెల్లె హేము శిశువులో ముసుగుపడి ఉంది. ఆ స్పృహలేని ఈ పసిబాలుడు వాగ్రత్త సంతానం. ఏదెను గుమ్మం వద్ద నిర్మితమైన మొదటి బలిపీఠం ఈయన్నే సూచించింది. శాంతిదాత షిలోహు ఈయనే. మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలోను ఉండి ఇశ్రాయేలీయులకి మార్గనిర్దేశం చేసింది ఈయనే. దీర్ఘదర్శులు చాలాకాలంగా ప్రవచించిన మెస్సీయా ఈయనే. సకల జాతుల ఆకాంక్ష ఈయనే. దావీదు వేరు చిగురు సంతానం, ప్రకాశవంతమైన వేకువచుక్క ఈయనే. మన సహోదరుడని ప్రకటిస్తూ ఇశ్రాయేలు పట్టికలో ఎవరి పేరు నమోదయ్యిందో ఆ నిస్సహాయ పసిబాలుడు పడిపోయిన మానవాళి నిరీక్షణ. ఎవరి నిమిత్తం విమోచన ద్రవ్యం చెల్లించడం జరిగిందో ఆయనే సర్వ ప్రపంచ పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించాల్సి ఉన్న ప్రభువు. ఆయన దేవుని యింటి పైన... గొప్ప యాజకుడు,” “మార్బులేని యాజకత్వము” నకు శిరస్సు, “మహాఘనుడగు దేవుని కుడి పార్శ్వమున” ఉన్న విజ్ఞాపకుడు. హెబ్రీ 10:21; 7:24; 1:3.DATel 34.1

  ఆధ్యాత్మిక విషయాల్ని ఆధ్యాత్మికంగానే గ్రహించాలి. దైవకుమారుడు ఈ లోకంలోకి ఏ కార్యసాధన నిమిత్తం వచ్చాడో దానికి దేవాలయంలో ఆయనను ప్రతిష్ఠించడం జరిగింది. యాజకుడు ఇతర పిల్లల్ని పరిగణించినట్లే ఆ శిశువునూ పరిగణించాడు. అసాధారణమైనదేదీ యాజకుడు చూడకపోయినా గుర్తించకపోయినా దేవుడు తన కుమారుణ్ని ఇవ్వడాన్ని గుర్తించడం జరిగింది. క్రీస్తును కొంతమేరకు గుర్తించకుండా ఈ సందర్భం పూర్తికాలేదు. “యెరుషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడను భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్దాత్మ చేత బయలుపరచబడియుండెను.”DATel 34.2

  సుమెయోను దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఓ కుటుంబం తమ మొదటి సంతానాన్ని యాజకుడికి సమర్పించడం చూశాడు. వారి వాలకం పేదరికాన్ని సూచిస్తోంది. కాని సుమెయోను పరిశుద్దాత్మ హెచ్చరికల్ని అవగాహన చేసుకున్నాడు. ప్రభువుకు సమర్పితుడవుతోన్న పసివాడు ఇశ్రాయేలు ఆదరణ అని, తాను చూడాలని ఆశిస్తోన్నది ఆయన్నేనని ఆత్మ ప్రేరణ వల్ల అతడు గుర్తించాడు. దిగ్డమ చెందిన యాజకుడికి సుమెయోను ఆనందపరవశుడైనట్లు కనిపించాడు. యాజకుడు ఆ శిశువును తిరిగి తల్లి చేతుల్లో పెట్టాక సుమెయోను శిశువును తన చేతుల్లోకి తీసుకుని దేవునికి సమర్పించాడు. అది చేసినప్పుడు తానెన్నడూ అనుభవించని ఆనందాన్ని అనుభవించాడు. ఆ చిన్నారి రక్షకుణ్ని పైకెత్తిపట్టుకుని ఇలా అన్నాడు, “నాథా, యిప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీదాసుని పోనీచ్చుచున్నావు; అన్యజనులకు, నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల యెదుట స్థిరపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని”DATel 35.1

  ఈ దైవ భక్తుణ్ని ప్రవచన స్ఫూర్తి ఆవరించింది. అతడి మాటలు విన్న యోసేపు మరియలు తికమక పడుండగా వారిని ఆశీర్వదించి మరియతో ఇలా అన్నాడు, “ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడియున్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను”DATel 35.2

  ప్రవక్తి అన్నకూడా వచ్చి క్రీస్తును గురించి సుమెయోను పలికిన సాక్ష్యాన్ని ధ్రువపర్చింది. సుమయోను మాట్లాడున్నప్పుడు ఆమె ముఖం దేవుని మహిమతో ప్రకాశించింది. ప్రభువైన క్రీస్తును చూసేందుకు తనకు అనుమతి దొరికినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు చెల్లించింది.DATel 35.3

  ఈ నిరాడంబర ఆరాధకులు ప్రవచనాల్ని అధ్యయనం చెయ్యడం వ్యర్థం కాలేదు. కాని ఇశ్రాయేలు దేశంలో ప్రధానులు గాను యాజకులుగాను బాధ్యతలు నిర్వహించినవారు తమ ముందు అమూల్య ప్రవచన వాక్కులున్నప్పటికీ దేవుని మార్గంలో నడవడం లేదు. అందుకే జీవపు వెలుగును వీక్షించడానికి వారి నేత్రాలు తెరుచుకోలేదు.DATel 36.1

  పరిస్థితి ఇంకా అలాగే ఉంది. పరలోకం దృష్టి ఏ ఘటనలపై కేంద్రీకృతమై ఉందో వాటిని గూర్చిన అవగాహన లేదు. అవి సంభవిస్తూ ఉన్నా ఎవరూ పట్టించుకోడం లేదు. మత నాయకులేగాని దైవ మందిరంలోని ఆరాధకులేగాని ఎవరూ వాటిని పట్టించుకోడం లేదు. చరిత్రపరంగా మనుషులు క్రీస్తును గుర్తిస్తారు. కాని జీవిస్తున్న క్రీస్తుకు దూరంగా వెళ్లిపోతారు. ఆత్మత్యాగం చేయమంటూ, బీదలకు శ్రమల్లో ఉన్నవారికి చేయూత ఇవ్వమంటూ, పరిశుద్ద కార్యం నిమిత్తం పేదరికం, కఠినశ్రమ, నిందలు భరించాల్సిందంటూ పిలుపునిచ్చే క్రీస్తును ప్రజలు పంతొమ్మిది శతాబ్దాల క్రితం ఎలా నిరాకరించారో అలాగే నేడూ నిరాకరిస్తున్నారు.DATel 36.2

  సుమెయోను ప్రవచించిన విశాలమైన దీర్ఘకాలికమైన ప్రవచనాన్ని గురించి మరియ ఆలోచించింది. తన చేతుల్లో ఉన్న శిశువును చూస్తూ, బేల్లెహేము గొర్రెల కాపరులన్న మాటలు గుర్తుచేసుకున్నప్పుడు ఆమె హృదయాన్ని ఉత్సాహానందాలు నిరీక్షణ నింపాయి. సుమయోను మాటలు ఆమెకు యెషయా ప్రవక్త మాటల్ని తలపించాయి. “యెషయి యొద్దనుండి చిగురు పుట్టును. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా యొద్దనుండి చిగురు వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును.... అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.” “చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణచ్ఛాయగల దేశనివాసుల మిద వెలుగు ప్రకాశించును.... ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.” యెషయా 11:1-5, 9:2-6,DATel 36.3

  అయినా మరియకు క్రీస్తు కర్తవ్యం ఏంటో అవగతం కాలేదు. అన్యజనాలకు వెలుగుగా ఇశ్రాయేలు మహిమగా ఆయనను సుమెయోను ప్రవచించాడు. రక్షకుని జననాన్ని సర్వజనులకు ఉత్సాహానందాల వార్తగా దూతలు ప్రకటించారు. మెస్సీయా సేవను గూర్చి యూదుల దురభిప్రాయాల్ని సంకుచిత భావాల్ని సరిదిద్దడానికి దేవుడు ప్రయత్నిస్తోన్నాడు. ఇశ్రాయేలు విమోచకుడుగా మాత్రమేగాక లోక రక్షకుడుగా ఆయనను మనుషులు పరిగణించాలన్నది దేవుని కోరిక. అయినా ఆయన కర్తవ్యాన్ని అవగాహన చేసుకోడానికి యేసు తల్లికి సైతం అనేక సంవత్సరాలు గతించాల్సి ఉంది.DATel 37.1

  దావీదు సింహాసనంపై మెస్సీయా పరిపాలన కోసం మరియ ఎదురుచూసింది. కాని దాన్ని ఆయన శ్రమల బాప్తిస్మం ద్వారా పొందాల్సి ఉన్నాడని ఆమె గ్రహించలేకపోయింది. లోకంలో మెస్సీయా ప్రస్తానం ప్రతిఘటన ప్రతిబంధకాలు లేనిది కాదని సుమెయోను ప్రవచనం వెల్లడిచేసింది. “నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవును” అని మరియతో సుమెయోను అన్న మాటల్లో దేవుడు యేసు శ్రమల్ని గూర్చిన అందోళనను దయగల మాటలతో తెలియజేస్తున్నాడు.DATel 37.2

  “ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు” అన్నాడు సుమయోను. తిరిగి లేవగోరే వారు పడాలి. క్రీస్తు పైకి లేపకముందు మనం క్రీస్తు బండమీద పడి విరిగినలగాలి. స్వార్ధం అగ్రస్థానం నుంచి కిందపడాలి. గర్వం అణగాలి. ఆధ్యాత్మిక రాజ్యమహిమను అనుభవించాలన్నది మన ఆశ అయితే మన స్వార్ధం నశించాలి, మన గర్వం అణగిపోవాలి. యూదులు దీనత్వం వలన కలిగే ఘనతను అంగీకరించలేదు. అందువలన వారు తమ విమోచకుణ్ని స్వీకరించలేదు. ఆయన వివాదాస్పదమైన గురుతుగా ఉన్నాడు.DATel 37.3

  “అనేక హృదయాలోచనలు బయటపడునట్లు” రక్షకుని జీవితం వెలుగులో సృష్టికర్త మొదలుకొని చీకటి రాజు వరకూ అందరి హృదయాలూ బట్టబయలవుతాయి. దేవుడు స్వార్ధపరుడు, కఠిణుడు, అంతా తనకే కావాలని కోరేవాడు, ఏమి ఇచ్చేవాడు కాదు, తన సొంత మహిమ కోసం సమస్తజీవుల సేవలు కోరేవాడుగాని వారి మేలు కోసం ఏమి త్యాగం చేసేవాడు కాడని సాతాను దుష్ప్రచారం చేశాడు. క్రీస్తు ఈవి తండ్రి హృదయాన్ని బయలుపర్చుతోంది. మన’ పట్ల దేవుని ఆలోచనలు “సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు” అని అది సాక్షమిస్తోంది. యిర్మీయా 29:11. పాపం పట్ల దేవుని ద్వేషం మరణమంత బలమైంది కాగా పాపిపట్ల ఆయన ప్రేమ మరణంకన్నా బలీయమైందని అది ప్రకటిస్తోంది. మన విమోచన చర్యను చేపట్టిన ఆయన ఆ కార్యసాధన కృషిలో ఏ లోపమూ చోటుచేసుకోనియ్యడు; మన రక్షణకు అవసరమైన ఏ సత్యాన్ని ఆపుచెయ్యడు; ఏ కృపా మహత్కార్యాన్ని నిర్లక్ష్యం చెయ్యడు, ఏ దైవ సాధనాన్ని వినియోగించకుండా విడిచిపెట్టడు. మనకు ఉపకారం మిద ఉపకారం చేస్తాడు. ఈవి మీద ఈవి ఇస్తాడు. తాను రక్షించడానికి పాటు పడున్నవారికివ్వటానికి పరలోక ధనాగారమంతటిని తెరుస్తాడు. ఈ విశాల విశ్వంలోని ఐశ్వర్యాన్ని పోగుచేసి, తన అనంత శక్తి వనరుల్ని తెరిచి వాటన్నిటిని క్రీస్తు చేతికప్పగిస్తూ ఈ ఈవుల్ని మానవుడికిచ్చి నీ ప్రేమకన్నా మిన్న లోకంలోనేగాని పరమందేగాని ఏదీ లేదని, మానవుడి ఆనందం నన్ను ప్రేమించడంలోనే ఉందని వివరించు అంటాడు.DATel 37.4

  కల్వరి సిలువ వద్ద ప్రేమ, స్వార్ధం ముఖాముఖీ నిలబడ్డాయి. వాటి ఉత్తమ ప్రవర్తన ఇక్కడే టుచేసుకొంది. క్రీస్తు పరుల్ని ఓదార్చడానికి దీవించడానికి జీవించాడు. ఆయన్ని చంపడంలో సాతాను దేవునిపట్ల తనకున్న ఉక్రోశాన్ని విద్వేషాన్ని ప్రదర్శించాడు. ‘తన ధ్యేయం దేవున్ని, గద్దెదించడమే అన్నట్లు, ఎవరి ద్వారా దేవుడు తన ప్రేమను కనపర్చాడో ఆయనను నాశనం చెయ్యడమే అన్నట్లు తన్నుతాను కనపర్చుకున్నాడు.DATel 38.1

  క్రీస్తు జీవన మరణాల ద్వారా మనుషుల తలంపులు దృష్టిలోకి వచ్చాయి. పశువుల తొట్టె నుంచి సిలువ వరకు యేసు జీవితం సమర్పణకు బాధలకు పిలుపు పొందిన జీవితం. మానవుల ఉద్దేశాల్ని అది బట్టబయలు చేసింది. యేసు పరలోక సత్యంతో వచ్చాడు. పరిశుద్ధాత్మ స్వరాన్ని విన్నవారందరూ ఆయనకు ఆకర్షితులయ్యారు. స్వార్థాన్ని పూజించే వారందరూ సాతాను రాజ్యపౌరులు. క్రీస్తు పట్ల తమ వైఖరిని బట్టి అందరూ తాము ఎవరి పక్క ఉన్నదీ చూపించుకుంటారు. ఈ రకంగా ప్రతీ వ్యక్తి తనపై తానే తీర్పు తీర్చుకుంటాడు.DATel 38.2

  చివరి తీర్పు దినాన నశించిన ప్రతీ ఆత్మ తాను విసర్జించిన సత్యం స్వభావాన్ని అవగాహన చేసుకుంటుంది. సిలువను సమర్పించడం జరుగుతుంది. అతిక్రమం వల్ల అంధత్వం కలిగిన ప్రతీ మనసు దాని ప్రాముఖ్యాన్ని గుర్తిస్తుంది. మర్మపూరితమైన బాధితుడు వేలాడున్న సిలువ దర్శనం ముందు పాపులు నేరస్తులుగా నిలబడతారు. ప్రతీ అబద్ద సాకును తోసిపుచ్చడం జరుగుతుంది. మానవ భ్రష్టత దాని నీచ స్వభావాన్ని బయలుపర్చుకొంటుంది. తమ ఎంపిక ఎలాంటిదో మనుషులు తెలుసుకుంటారు. దీర్ఘ కాలంగా సాగిన సంఘర్షణలో సత్యా సత్యాల ప్రతీ సమస్య అప్పుడు స్పష్టమౌతుంది. విశ్వతీర్పులో పాపం ఉనికి కొనసాగింపు విషయంలో దేవుడు నిందారహితుడని స్పష్టమౌతుంది. దేవుని ఆజ్ఞలు పాపానికి దోహదకారులు కావని తేలుతుంది. దేవుని ప్రభుత్వంలో లోపమేదీ లేదని అసంతృప్తికి హేతువేదీ లేదని నిరూపితమౌతుంది. అందరి హృదయాలోచనలు వెల్లడి అయినప్పుడు దేవునికి నమ్మకంగా ఉన్నవారు ఆయనకు ఎదురు తిరిగినవారు ఇలా ప్రకటిస్తారు, “నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు?... నీ న్యాయ విధులు ప్రత్యక్ష పర్చబడినవి.” ప్రక 15:3,4.DATel 39.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents