Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    67—పరిసయ్యులకు శ్రమ

    అది క్రీస్తు దేవాలయంలో బోధించిన చివరి రోజు. యెరూషలేములో సమావేశమైన జన సమూహాల గమనమంతా ఆయన మీదే ఉంది. దేవాలయంలో జరుగుతున్న పోటీని చూడడానికి ప్రజలు ఆలయ ఆవరణంలో గుమికూడారు. ఆయన మాట్లాడ్తోన్న ప్రతీమాటను శ్రద్ధగా వింటోన్నారు. అలాంటి దృశ్యాన్ని వారు ఎన్నడూ చూడలేదు. ఆ యువ గలిలయుడు నిలబడి ఉన్నాడు. లోక గౌరవ చిహ్నంగాని, రాజరికపు చిహ్నంగాని ఆయనకులేవు. ఆయన చుట్టూ విలువైన దుస్తులు ధరించిన యాజకులు, తమ ఉన్నత స్థానాన్ని సూచించే అంగీలు చిహ్నాలు ధరించిన అధికారులు, తమ చేతుల్లో లేఖన గ్రంథాల చుట్ట పట్టుకుని వాటిని తరచుగా పరిశీలిస్తోన్న శాస్త్రులూ ఉన్నారు. యేసు వారి ముందు రాజఠీవితో నిలబడి ఉన్నాడు. తనను తన బోధనలను విసర్జించి తన ప్రాణం తియ్యడానికి తృష్ణగొని ఉన్న తన ప్రత్యర్థుల వంక పరలోక అధికారం ఉన్నవాడిలా తీక్షణంగా చూస్తున్నాడు. గొప్ప సంఖ్యలో ఆయన పై దాడిచేశారు. కాని ఆయన్ని పడవెయ్యడానికి ఆయనకు శిక్ష విధించడానికి వారి ప్రయత్నాలు ఫలించలేదు. సవాలు వెంటసవాలును ఆయన ఎదుర్కున్నాడు. యాజకులు పరిసయ్యులు సమర్పించిన చీకటి కి అసత్యాలకూ భిన్నంగా ఆయన స్వచ్ఛమైన ప్రకాశవంతమైన సత్యాన్ని సమర్పించాడు. ఈ నాయకుల ముందు తమ వాస్తవిక పరిస్థితిని ఉంచి, తమ దుష్క్రియల కొనసాగింపు వల్ల కలిగే ప్రతిఫలాన్ని వివరించాడు. ఆయన సమ్మకంగా హెచ్చరించాడు. అయినా క్రీసు చెయ్యడానికి ఇంకోపని మిగిలిపోయింది. ఇంకో కార్యాన్ని ఆయన నిర్వహించాల్సి ఉంది.DATel 681.1

    క్రీస్తు పరిచర్యపై ప్రజల ఆసక్తి క్రమంగా పెరింగింది. ఆయన బోధలు వారిని మంత్రముగ్ధుల్ని చేస్తోన్నాయి. కాని వారిలో తీవ్ర ఆందోళన కూడా చోటుచేసుకుంటోంది. యాజకులు రబ్బీల ప్రతిభా పాటవాల్ని బట్టి వారు నటిస్తోన్న భక్తిని బట్టి ప్రజలికి వారిపట్ల గౌరవాభిమానాలు ఉన్నాయి. మత విషయాలన్నిటిలోను ప్రజలు వారి అధికారానికి విధేయులై ఉండేవారు. అయిన ఇప్పుడు వారు ఈ వ్యక్తులు యేసు మీద బురద చల్లడానికి ప్రయత్మిస్తున్నారని గ్రహించారు. తనపై జరిగిన ప్రతీ దాడిలో యేసు సత్యశీలత, జ్ఞానం దేదీప్యమానంగా ప్రకాశించాయి. యాజకులు పెద్దలు ముఖాలు కిందకి దించుకోడం ప్రజలు చూశారు. వారి ఇరకాటాన్ని గందరగోళ పరిస్థితిని గమనించారు. యేసు బోధలు అంత స్పష్టంగా సరళంగా ఉన్నప్పటికి ఈ నాయకులు అంగీకరించకపోవడం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఏ మార్గాన్ని అనుసరించాలో ప్రజలికి బోధపడలేదు. ఎవరి సలహాలు సూచనలపై వారు ఎల్లప్పుడు ఆధారపడేవారో వారి కదలికల్ని ప్రజలు ఆందోళనతో గమనిస్తోన్నారు.DATel 682.1

    యేసు చెప్పిన ఉపమానం ఉద్దేశం అధికారుల్ని, హెచ్చరించడం. బోధకు చెవినిచ్చే ప్రజలికి ఉపదేశ మందించడం. కాని ఇంకా మరింత స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సంప్రదాయం పట్ల తమ వల్లమాలిన అభిమానం, అవినీతితో నిండిన యాజకత్వంపై తమ గుడ్డి విశ్వాసం ప్రజల్ని, బానిసలు చేశాయి. ఈ బంధకాల్ని, క్రీస్తు తెంచివెయ్యాలి. యాజకులు, అధికారులు, పరిసయ్యుల ప్రవర్తనల్ని పూర్తిగా బయట పెట్టాలి.DATel 682.2

    “శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు గనుక - వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురేగాని చేయరు.” అన్నాడు యేసు. శాస్త్రులు పరిసయ్యులు తమకు మోషేకున్న దైవాధికారం ఉన్నదని చెప్పేవారు. ధర్మశాస్త్రాన్ని విశదీకరించడానికి, ప్రజలికి తీర్పు తీర్చడానికి వారు మోషే స్థానాన్ని ఆక్రమించుకున్నారు. అందును బట్టి వారు ప్రజల గౌరవాన్ని విధేయతను పొందాలని కోరారు. రబ్బీలు ధర్మశాస్త్రం నుంచి చెప్పేదంతా చేయమని, కాని వారి మాదిరి ననుసరించవద్దని యేసు తన శ్రోతలికి ఉద్బోధించాడు. తాము బోధించేదాన్ని వారే ఆచరించలేదు. -DATel 682.3

    వారు బోధించిన దానిలో చాలామట్టుకు లేఖనాలకు విరుద్ధంగా ఉంది. యేసిలా అన్నాడు, “మోయ శక్యముగాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మిద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.” పరిసయ్యులు లెక్కకు మించినన్ని నియమాల్ని నిబంధనల్ని, అమలుపర్చారు. వాటికి పునాది సంప్రదాయం, అవి ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను దారుణంగా నియంత్రించేవి. తాము విధించే ఆచారాల్ని లేక తాము రహస్యంగా ఉల్లంఘించే ఆచారాన్ని ప్రజల మీద రుద్దడానికి అనుకూలంగా ధర్మశాస్త్రంలోని కొన్ని భాగాలికి వారు వివరణలు ఇచ్చేవారు. వాటిని ఆచరించకుండా ఉండడానికి తమకు మినహాయింపు ఉన్నదని చెప్పేవారు.DATel 683.1

    తమ భక్తిని ప్రదర్శించుకోడమే వారి ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో వారికి పరిశుద్ధత అడ్డురాలేదు. తన ఆజ్ఞల్ని గురించి దేవుడు మోషేతో ఇలా అన్నాడు, “సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నులనడుమ బాసికమువలె ఉండవలెను.” ద్వితి 6:8. ఈ మాటల్లో లోతైన భావం ఉంది. దేవుని వాక్యాన్ని ధ్యానించి దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మనిషిలో మార్పు కలిగి - అతడు సౌమ్యుడవుతాడు. నీతికార్యాలు, దయ కనికరాలతో నిండిన కార్యాలు చేసే చేతులు దైవ ధర్మశాస్త్ర సూత్రాల్ని చూపిస్తాయి. ఆ చేతులు లంచాలు ముట్టకుండా, అవినీతికి వంచనకు పాల్పడకుండా పరిశుభ్రంగా ఉంటాయి. ప్రేమను, దయను పంచే కార్యకలాపాల్లో నిమగ్మమై ఉంటాయి. ఉదాత్త కర్తవ్యంపై కేంద్రీకృతమైన కన్ను స్పష్టమైన దృష్టి కలిగి నిజాయితీగా ఉంటుంది. భావ ప్రకటన చేసే ముఖం, మాట్లాడే కన్ను దైవ వాక్యాన్ని ప్రేమించి గౌరవించే వ్యక్తి నిష్కళంక ప్రవర్తనకు సాక్ష్యం. కాని క్రీస్తు రోజుల్లోని యూదులు వీటిని చూడలేదు. దేవుడు మోషేకిచ్చిన ఈ ఆదేశాన్ని వారు అపార్థం చేసుకున్నారు. లేఖన సూత్రాల్ని తమ ఒంటి పై ధరించాల్సిందిగా ఈ ఆదేశం నిర్దేశిస్తోందని భావించారు. కనుక లేఖన సూత్రాల్ని తోలు కాగితంలపై రాసి స్పష్టంగా కనిపించేలా తలకు చేతులికి కట్టుకుని తిరిగేవారు. అయితే దీనివల్ల దైవ ధర్మశాస్త్రం మనసులోను, హృదయంలోను బలంగా పాదుకోలేదు. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఆ తోలు కాగితాల్ని కేవలం బ్యాడ్జిలుగా ధరించారు. వాటిని ధరించిన వారు భక్తిపరులుగా కనిపిస్తారని అందుచేత ప్రజలు వారిని గౌరవిస్తారని నమ్మేవారు. ఈ అర్థం పర్థం లేని ప్రదర్శనను క్రీస్తు ఖండించాడు.DATel 683.2

    “మనుష్యలకు కనబడు నిమిత్తము తమ పనులన్నియు చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు, విందులలో అగ్రస్థానములను సమాజమందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. వారైతే బోధకులని పిలువబడవద్దు, ఒకడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమి మీద ఎవనినైనను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మిగురువు.” హృదయం దురాశతోను అసూయతోను నిండి ఉన్నా, వినయం నటిస్తూ, పదవికోసం అధికారం కోసం నిత్యం పాకులాడే స్వార్థాశను స్పష్టమైన ఇలాంటి మాటల్లో రక్షకుడు ఎండగట్టాడు. వ్యక్తుల్ని విందుకు ఆహ్వానించినప్పుడు అతిథుల్ని తమ తమ హోదాను బట్టి కూర్చోబెట్టేవారు. మిక్కిలి ప్రతిష్టాత్మక స్థానాన్ని పొందినవారు ప్రత్యేక శ్రద్ధను, ప్రత్యేక ఉపకారాల్ని పొందేవారు. ఈ గౌరవాన్ని పొందడానికి పరిసయ్యులు నిరంతరం పన్నాగాలు పన్నుతుండేవారు. ఈ దురాచారాన్ని క్రీస్తు ఖండించాడు.DATel 684.1

    రబ్బీ లేక గురువు పేరు కోరడంలో ప్రదర్శితమైన ఆడంబరాన్ని ఆయన మందలించాడు. అలాంటి పేరు మనుషులికి కాదు క్రీస్తుకి మాత్రమే చెందుతుందన్నాడు. యాజకులు, శాస్త్రులు, అధికారులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నిర్వహణాధికారులు అందరూ సహోదరులు, ఒకే తండ్రి పిల్లలు. తమ మనస్సాక్షిని లేక తమ విశ్వాసాన్ని అదుపుచెయ్యడాన్ని సూచించే ఏ పేరుగాని బిరుదుగాని గౌరవంగాని ఏ మానవుడికి ఇవ్వకూడదని యేసు ప్రజలికి ఉద్భోధించాడు.DATel 684.2

    ఈనాడు క్రీస్తు భూమి మీద ఉంటే “రెవరెండ్” ‘రైట్ రెవరెండ్” బిరుదులతో తన చుట్టూ ఉన్నవారిని చూసి “మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే నా గురువు” అని మళ్లీ అనడా? దేవున్ని గురించి లేఖనం ఇలా ప్రకటిస్తోంది, “ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.” కీర్త. 111:9. ఆ పేరు ధరించడానికి ఏ మానవుడు సరిపోతాడు? ఆ నామం సూచించే వివేకాన్ని నీతిని ఏ కొంచెమైనా ప్రదర్శించగలడా! ఈ నామాన్ని ధరించే వారిలో ఎంతమంది దేవుని నామాన్ని ఆయన ప్రవర్తనను గూర్చి అసత్య ప్రచారం చేస్తున్నారు! అయ్యో, ఉన్నతమైన, పరిశుద్ధమైన మతాధికారి వస్త్రాల కింద లోకాశ, నిరంకుశత్వం, అతినీచమైన పాపాలు ఎంత తరచుగా దాగి ఉంటున్నాయి! రక్షకుడింకా ఇలా అంటున్నాడు:DATel 684.3

    “మీలో అందరికంటె గొప్పవాడు నాకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.” నిజమైన గొప్పతనం నైతిక యోగ్యతను బట్టి వస్తుందని క్రీస్తు పదేపదే నేర్పించాడు. దేవుని దృష్టిలో గొప్పతనమంటే సాటిమనుషుల సంక్షేమం కోసం ప్రేమ, దయ కార్యాలు చేస్తూ నివసించడం. మహిమ ప్రభువైన క్రీస్తు పాప మానవుడికి సేవకుడుగా నివసించాడు.DATel 685.1

    యేసు ఇలా అన్నాడు, “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల యెదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవెశించువారిని ప్రవేశింపనియ్యరు. ” పరిసయ్యులికి ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. దీన్ని వారు సొమ్ముచేసుకున్నారు. వారు భక్తిగల విధవరాండ్ర విశ్వాసాన్ని పొంది ఆ మీదట తమ ఆస్తిని మత సంబంధిత కార్యాలకి సమర్పించడం తమ విధి అని వారికి బోధించారు. ఈ రకంగా విధవ రాండ్ర ఆస్తిపై నియంత్రణ సంపాదించి వారి ద్రవ్యాన్ని ఈ వంచకులు తమ సొంత విలాసాలకు ఖర్చు పెట్టుకున్నారు. తమ వంచనను కప్పిపుచ్చుకునేందుకు వారు దీర్ఘ బహిరంగ ప్రార్థనలు చేసి గొప్ప భక్తిని నటించేవారు. ఈ కపట నాటకం తమకు నాశనం కలిగిస్తుందని క్రీస్తు వెల్లడించాడు. మన రోజుల్లో కూడా గొప్ప భక్తి నటించే వారికి ఇదే గద్దింపు వర్తిస్తోంది. వారి జీవితాలు స్వార్థం తోను పేరాశతోను మైలపడ్డాయి. అయినా తమ దుష్కృతాలన్నిటి మీద దొంగభక్తి వస్త్రం కప్పుకుని కొంతకాలం తమ సోదర మానవుల్ని మోసం చేస్తారు. కాని వారు దేవుణ్ని మోసం చెయ్యలేరు. హృదయంలోని ప్రతీ ఆలోచననూ ఆయన చదువుతాడు. ప్రతివారికీ తమ తమ క్రియల చొప్పున తీర్పు తీర్చుతాడు.DATel 685.2

    క్రీస్తు ప్రతీ దురాచారాన్ని, ప్రతీ దుర్వినియోగాన్ని ఖండించాడు. ఆయన విధి నిర్వహణ బాధ్యతను ఏ మాత్రం తగ్గించలేదు. విధవరాండ్ర విరాళాల్ని బలవంతంగా వసూలు చేసి వాటిని దుర్వినియోగం చెయ్యడాన్ని ఆయన గద్దించాడు. అదే సమయంలో దేవుని ఖజానాలోకి కానుక తెచ్చిన విధవరాలిని ఆయన ప్రశంసించాడు. మానవుడిచే కానుక దుర్వినియోగం దాత నుంచి దైవ దీవెనను తొలగించజాలదు.DATel 686.1

    ద్రవ్య ఖజానా ఉన్న ఆవరణలో క్రీస్తు ఉన్నాడు. కానుకలు ఇవ్వడానికి వచ్చినవారందరినీ ఆయన గమనించాడు. చాలామంది ధనవంతులు పెద్ద మొత్తాలు తెచ్చి వాటిని ఆడంబరంగా సమర్పించారు. యేసు వారిని చూసి విచారపడ్డాడు. కాని వారు ధారాళంగా ఇచ్చిన కానుకల గురించి వ్యాఖ్యానించలేదు. ఒక పేద విధవరాలు సందేహిస్తూ, భయపడూ తనను ఎవరైనా పరిశీలిస్తారేమోనని వెనకాడూ వచ్చింది. ధనవంతులు అహంకారులు కానుకలు సమర్పించడానికి ఆమెను దాటి వెళ్తుండగా ఆమె ముందుకు వెళ్లడానికి భయపడున్నట్లు, వెనక్కి తగ్గింది. అయినా తాను ఎంతగానో ప్రేమిస్తున్న పరిచర్యకు ఏదో ఇవ్వాలని ఆశించింది. తన చేతిలో ఉన్న కానుక వంక చూసింది. తన చుట్టూ ఉన్నవారి కానుకలతో పోల్చితే ఆమెది చిన్నకానుక. అయినా ఆమెకున్నదంతా అదే. సమయం చూసుకుని తనకున్న ఆ రెండు కాసుల్ని ఖజానాలో వేసి వెళ్లిపోడానికి వెనక్కి తిరిగింది. ఇలా చెయ్యడంలో ఆమె క్రీస్తు దృష్టిని ఆకర్షించింది. ఆయన దృష్టి ఆమెపై నిలిచింది.DATel 686.2

    రక్షకుడు తన శిష్యుల్ని పిలిచి ఆ విధవరాలి పేదరికాన్ని గుర్తించాల్సిందిగా కోరాడు. అప్పుడు ఆయన మెచ్చుకోలుని ఆమె విన్నది, “కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెను” తన చర్యను అవగాహన చేసుకుని అభినందించడం జరిగినందుకు ఆమె కళ్లు ఆనంద బాష్పాలతో నిండాయి. తన చిన్న కానుకను తానే ఉంచుకుని తన అవసరాలికి వినియోగించుకోమని, దాన్ని బాగా సంపాదన ఉన్న యాజకుల చేతుల్లో పెడితే మందిరంలోకి వచ్చే పెద్ద పెద్ద కానుకల్లో తన కానుక లెక్కలోనికి రాదని ఆమెకు సలహా వచ్చి ఉండవచ్చు. కాని యేసు ఆమె ఉద్దేశాన్ని గ్రహించాడు. దేవాలయ సేవలు దేవుడు నియమించినవని ఆమె విశ్వసించింది. ఆ సేవను కొనసాగించడానికి తాను చేయగలిగినదంతా చెయ్యాలని ఆశించింది. కనుక తన శక్తిమేరకు కానుక ఇచ్చింది. ఆమె చర్య తన జ్ఞాపకార్థ చిహ్నంగా ఆమె నిత్యజీవానందం చిహ్నంగా కాలాంతం వరకూ నిలిచి ఉంటుంది. ఆమె తన కానుకను దానితో పాటు తన హృదయాన్ని అర్పించింది. నాణెం విలువను బట్టి కాక ఆ చర్యను బట్టి ప్రోత్సహించిన దేవుని పట్ల ఆమె ప్రేమను ఆయన సేవ విషయంలో ఆమె ఆసక్తిని బట్టి ఆమె కానుక వీలువ బేరీజు వేయడం జరుగుతుంది.DATel 686.3

    ఆమెను గురించి ” ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెను” అని యేసు అన్నాడు. ధనవంతులు తమ గొప్ప ఆదాయంలో నుంచి ఇచ్చారు. ఆ వర్గంలోని అనేకులు మనుషులు చూసేందుకు తమను గౌరవించేందుకు ఇచ్చారు. వారి పెద్ద కానుకవల్ల వారికి ఏ సుఖమూ లేదా ఏ విలాసమూ తక్కువ కాలేదు. వారు ఏ త్యాగమూ చెయ్యాల్సిరాలేదు. కనుక విలువ విషయానికి వచ్చేసరికి ఆవిధవరాలి కానుకతో వారి కానుకను పోల్చడానికి లేదు.DATel 687.1

    ఉద్దేశం మన క్రియలకు గుణాన్నిస్తుంది. మన క్రియల్ని, తుచ్చమైనవిగా లేక ఉచ్ఛమైనవిగా ముద్రవేసేది ఉద్దేశమే. ప్రతీ నేత్రం చూసే, ప్రతీ నాలుకా శ్లాఘించే గొప్ప విషయాలన్నిటిని మిక్కిలి విలువ గలవాటిగా దేవుడు భావించడు. సంతోషంగా ఆచరించే చిన్నచిన్న విధులు, నిరాడంబరమైన, మానవదృష్టికి నిరుపయోగంగా కనిపించే చిన్న చిన్న కానుకలు తరచు దేవుని దృష్టిలో మిక్కిలి విలువైనవిగా నిలుస్తాయి. విశ్వసించే హృదయం, ప్రేమించే హృదయం గొప్ప విలువగల కానుకకన్నా ఎంతో విలువైనది. తానిచ్చిన ఆ కొంచెం ఇవ్వడానికి ఆ బీద విధవరాలు తన జీవనాధారాన్ని ఇచ్చింది. తాను ప్రేమించిన సేవకు రెండు కాసులు ఇవ్వడానికి ఆమె ఆహారాన్ని త్యాగం చేసింది. ఆ క్రియను ఆమె విశ్వాసంతో చేసింది. పరలోకమందున్న తండ్రి తన గొప్ప అవసరాన్ని విస్మరించడని విశ్వసించి ఆ పని చేసింది. ఈ స్వార్ధరహిత స్వభావం, చిన్న బిడ్డలాంటి ఈ విశ్వాసం రక్షకుని ప్రశంసను పొందింది.DATel 687.2

    దేవుని కృప నిమిత్తం, సత్యం నిమిత్తం తమ కృతజ్ఞతను చూపించాలని ఆకాంక్షించే వారు బీదవారిలో అనేకమంది ఉన్నారు. ఆయన సేవను పోషించడానికి తమ ధనిక సహోదరులతో కలిసి భారాన్ని పంచుకోవాలని వారు ఎంతగానో ఆశిస్తోన్నారు. ఈ ఆత్మల్ని నిరాకరించగూడదు. పరలోక ధనాగారంలో వారిని కూడా తమ కాసుల్ని ఆదా చేసుకోనివ్వాలి. దేవుని పట్ల ప్రేమతో నిండిన ‘ హృదయం నుంచి ఇచ్చినట్లయితే స్వల్పంగాను అల్పంగాను కనిపించే కానుకలు ప్రతిష్ఠిత అర్పణలుగా, విలువైన కానుకలుగా రూపొందుతాయి. వాటిని చూసి దేవుడు ఆనందించి ఆశీర్వదిస్తాడు.DATel 688.1

    “వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెను” అని యేసన్నప్పుడు ఆయన మాటలు నిజం. ఉద్దేశం విషయంలోనే కాదు ఆ కానుక ఫలితం విషయంలోనూ అవి నిజం. ఆ “రెండు కాసులు” దేవుని ధనాగారంలోకి తెచ్చిన ద్రవ్యం ఆ ధనిక యూదుల కానుక కన్నా ఎక్కువ. ఆ చిన్న కానుక ప్రభావం ప్రారంభంలో స్వల్పంగా ఉండి యుగాలు తరబడి ప్రవహించే కొద్దీ విశాలంగాను లోతుగాను తయారై ప్రవహించే ఏరులాంటిది. బీదల సహాయానికి సువార్త ప్రచారానికి అది వెయ్యి మార్గాల్లో సహాయం చేస్తోంది. ఆమె ఆత్మ త్యాగాదర్శం ప్రతీ దేశంలోను ప్రతీ యుగంలోను వేలాది ప్రజల్లో పనిచేస్తూ ప్రతిస్పందిస్తోంది. అది ధనికుల్లోను పేదవారిలోను స్పందన కలిగిస్తోంది. వారి కానుకలు కానుక విలువను పెంచుతున్నాయి. ఆ బీద విధవరాలి రెండు కాసులపై దేవుని దీవెన దాన్ని గొప్ప ఫలితాలకు మూలం చేస్తోంది. దేవుని మహిమను ఆకాంక్షించి ఇచ్చే ప్రతీ కానుక నిర్వహించే ప్రతీ కార్యం ఇలాగే పనిచేస్తుంది. అది సర్వశక్తుని ఉద్దేశాలకు సహకరిస్తుంది. దాని ఫలితంగా జరిగే మంచి అపరిమితం.DATel 688.2

    శాస్త్రులు పరిసయ్యుల ఖండనను రక్షకుడు కొనసాగించాడు, “అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొంటే అందులో ఏమియు లేదుగాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్దుడని వారు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధ పరచు బలిపీఠమా?” యాజకులు తమ తప్పుడు, సంకుచిత ప్రమాణాల ప్రకారం దేవుని విధులికి అర్ధం చెప్పడానికి పూనుకున్నారు. వివిధ పాపాలకి తులనాత్మక దోషిత్వం నిర్ణయించడానికి కొన్నింటినీ తేలికగా విడిచి పెట్టి తక్కిన వాటిని - బహుశ కొంచెం తక్కువ పర్యవసానాలు గల వాటిని - క్షమించరాని పాపాలుగా పరిగణించేవారు. డబ్బు తీసుకుని మొక్కుబడులు చెల్లించాల్సిన వ్యక్తుల మొక్కుబడులను క్షమించేవారు. కొన్నిసార్లు పెద్దమొత్తాల డబ్బుకు తీవ్రమైన నేరాల్ని విస్మరించేవారు. అయితే ఈ యాజకులు అధికారులు అదే సమయంలో ఇతరుల విషయంలో చిన్నచిన్న నేరాలికి సైతం కఠినమైన తీర్పులు వెలువరించేవారు.DATel 688.3

    “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, పోపులోను, జీలకఱ్ఱ లోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచి పెట్టి తిరి. వాటిని మానక నీటి ని చేయవలసియుండెను.” ఈ మాటల్లో పరిశుద్ధ విధుల దుర్వినియోగాన్ని క్రీస్తు మళ్లీ ఖండిస్తోన్నాడు. ఆ విధిని ఆయన తోసిపుచ్చడంలేదు. పదవభాగం చెల్లింపు వ్యవస్థను దేవుడే స్థాపించాడు. అది అనాదినుంచీ అమలులో ఉంది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తన ఆస్తి అంతటి లోనూ దశమ భాగం చెల్లించాడు. యూదు అధికారులు దశమ భాగం చెల్లింపు విధిని గుర్తించారు. కనుక దీని చెల్లింపు న్యాయమే. కాని ప్రజలు తమ మనస్సాక్షి ప్రకారం తమ విధుల్ని ఆచరించడానికి వీరు వారిని స్వేచ్ఛగా విడిచి పెట్టడం లేదు. ప్రతీ కేసుకి నిరంకుశ నిబంధనలు అమలుపర్చారు. ఆ నిబంధనలు ఎంతో క్లిష్టమైనవి కావడంతో ప్రజలు వాటిని నెరవేర్చడం సాధ్యమవ్వలేదు. దేవుడిచ్చిన రీతిలో ఆ వ్యవస్థ న్యాయంగా సముచితంగా ఉంది. కాని యాజకులు రబ్బీలు దాన్ని ఆయాసకరమైన భారంగా తయారుచేశారు.DATel 689.1

    దేవుడు ఆజ్ఞాపించేదంతా ప్రాముఖ్యమైనది. దశమభాగం చెల్లింపును ఒక విధిగా క్రీస్తు గుర్తించాడు. అయినా ఇతర విధుల నెరవేర్చును ఇది నివారించదని ఆయన స్పష్టం చేశాడు. పుదీన సోపు జీలకర్ర వంటితోట ఉత్పత్తుల్లో సైతం దశమ భాగం చెల్లించడంలో పరిసయ్యలు నిక్కచ్చిగా ఉండేవారు. ఇది వారికి పెద్ద ఖర్చుకాదు. కాని దీనివల్ల వారికి ఖచ్చితమైనవారు, పరిశుద్ధులు అన్న పేరు వచ్చింది. అదే సమయంలో అర్ధరహితమైన వారి ఆంక్షలు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులికి గురిచేసి దేవుడు నియమించిన పరిశుద్ధ వ్యవస్థపై వారి గౌరవాన్ని నాశనం చేశాయి. అవి మనుషుల మనసుల్ని కొరగాని చిన్నచిన్న తేడాలతో నింపి, ముఖ్యమైన సత్యాల నుంచి వారి మనసుల్ని మళ్లించాయి. ధర్మశాస్త్ర సంబంధమైన ముఖ్య విషయాల్ని న్యాయం, దయ, సత్యాల్ని నిర్లక్ష్యం చేశారు.DATel 689.2

    ఇలాగే ఇతర చట్టాల్ని కూడా రబ్బీలు వక్రీకరించారు. మోషేకిచ్చిన ఆదేశాల్లో అపవిత్రమైన దాన్ని తినకూడదన్న నిషేధం ఉంది. పంది మాంసం, ఇంకా ఇతర జంతు మాంసం నిషిద్ధం. అది రక్తాన్ని మలిన పదార్థాలతో నింపి జీవితాన్ని తగ్గిస్తుంది. కాని పరిసయ్యులు ఈ ఆంక్షల్ని యథాతథంగా ఉంచలేదు. వారు అతిగా వ్యవహరించి అవాంఛనీయ కార్యాలకి పాల్పడ్డారు. ఇతర ఆంక్షలతో పాటు, సూక్ష్మక్రిముల్ని అపవిత్ర జంతువులతో వర్గీకరించవచ్చునన్న ఊహ సూక్ష్మక్రిములు లేకుండా నీళ్లు వడకట్టుకు తాగాలన్న ఆంక్షను విధించారు. ఈ స్వల్ప నిష్ఠల్ని వారి ఘోర పాపాల పరిమాణానికి ఎదురుగా ఉంచి యేసు పరిసయ్యులతో ఇలా అన్నాడు, “అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగువారు మీరే.”DATel 690.1

    “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి” అందంగా అలంకరించి ఉన్న సమాధి కుళ్లిన అవశేషాల్ని ఎలా దాచి ఉంచుతుందో అలాగే యాజకుల అధికారుల వెలుపలి పరిశుద్ధత వారి దోషాన్ని దాచి ఉంచింది. యేసు ఇంకా ఇలా అన్నాడు:DATel 690.2

    “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణము విషయములో వారితో పాలివారమైయుండక పోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారీ కుమారులైయున్నారని నా మిద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. ” మరణించిన ప్రవక్తలపట్ల తన గౌరవాన్ని, వ్యక్తం చెయ్యడానికి వారి సమాధుల్ని సింగారించడంలో యూదులు ఉత్సాహాన్ని, ప్రదర్శించారు. కాని వారు ప్రవక్తల బోధనలవల్ల గద్దింపులవల్ల ప్రయోజనం పొందలేదు.DATel 690.3

    పరిసయ్యులు ప్రవక్తల సమాధుల్ని కట్టించి, వాటిని అలంకరించి, మనం మన తండ్రుల కాలంలో నివసించి ఉంటే, దైవ సేవకుల రక్తం చిందించడంలో వారితో చెయ్యి కలిపేవారం కాము అని ఒకరితో ఒకరు చెప్పుకునేవారు. అలాగంటూనే దేవుని కుమారుణ్ని చంపడానికి వారు పన్నాగాలు పన్నుతున్నారు. ఇది మనకొక పాఠం కావాలి. సత్యం నుంచి తొలగే మనసును మోసం చెయ్యడానికి సాతానుకున్న శక్తికి ఇది మనకు కనువిప్పు కలిగించాలి. పరిసయ్యుల మార్గాన్నే అనేకమంది అనుసరిస్తోన్నారు. తమ విశ్వాసం కొరకు మరణించిన వారిని వీరు గౌరవిస్తారు. క్రీస్తును నిరాకరించిన యూదుల గుడ్డితనానికి విస్మయం చెందుతారు. ఆయన రోజుల్లో మేము నివసించి ఉంటే ఆయన బోధనల్ని మేము సంతోషంగా అంగీకరించేవారం అని, రక్షకుణ్ని విసర్జించినవారి అపరాధంలో మేము పాలు పంచుకునేవారం కాము అని వారు అంటారు. అయితే దేవునికి విధేయులై నివసించడంలో ఆత్మత్యాగం, అవమానాన్ని భరించడం అవసరమైనప్పుడు, ఈ వ్యక్తులే తమ మనస్సాక్షి నోరు నొక్కి తమ విశ్వాసాన్ని వదులుకుంటారు. క్రీస్తు ఖండించిన పరిసయ్యులు ఏ స్ఫూర్తిని ప్రదర్శించారో అదే స్ఫూర్తిని ఈ తీరుగా వీరు ప్రదర్శిస్తారు.DATel 691.1

    క్రీస్తును విసర్జించడంలో ఉన్న భయానక బాధ్యతను యూదులు గుర్తించలేదు. కయీను హేబెలు నిరపరాధ రక్తం ప్రప్రధమంగా చిందించినప్పటి నుంచి పెచ్చు పెరుగుతున్న అపరాధిత్వంతో అదే చరిత్ర పునరావృత్తమౌతోంది. రాజులు, అధికారులు, ప్రజల పాపాల్ని ఖండిస్తూ దేవుడు తమతో చెప్పిన మాటల్ని మాట్లాడూ, ఆయన చిత్తానికి విధేయులవుతూ ప్రతీయుగంలోనూ ప్రవక్తలు తమ స్వరాన్ని ఎత్తారు. వెలుగును సత్యాన్ని విసర్జిస్తున్నవారికి తరతరాలుగా శిక్షపోగుపడ్తోంది. క్రీస్తు శత్రువులు ఇప్పుడు ఈ శిక్షను తమ తల మీదికి తెచ్చుకుంటున్నారు. రక్షకుణ్ని విసర్జించడం ద్వారా యాజకులు అధికారుల పాపం అంతకు ముందటి ఏ తరంలోని పాపం కన్నా ఎక్కువ. హేబెలు మొదలుకుని క్రీస్తు వరకు వధించబడ్డ నీతిమంతుల రక్తానికి వారు బాధ్యులవుతారు. వారు తమ అపరాధ పాత్రను నింపుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పాత్రలోనిది శిక్ష విధిగా వారి తలలమీద త్వరలో కుమ్మరించబడనుంది. దీన్ని గురించి యేసు హెచ్చరించాడు :DATel 691.2

    “నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య వారు చంపిన, బరకీయ కుమారుడగు జెకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు నా మీదికి వచ్చును.”DATel 692.1

    యేసు మాటలు వింటున్న శాస్త్రులు పరిసయ్యులు ఆయన చెబుతున్న మాటలు వాస్తవని ఎరుగుదురు. జెకర్యా ప్రవక్త ఎలా వధకు గురి అయ్యాడో వారికి తెలుసు. దేవుని వద్ద నుంచి హెచ్చరిక వర్తమానం ఇంకా అతడి పెదాల మీద ఉండగా రాజు సాతాను సంబంధమైన దురాగ్రహంతో ప్రవక్తను సంహరించడానికి ఆజ్ఞ జారీ చేశారు. అతని రక్తం ఆలయ ఆవరణలోని రాళ్ల మీద ముద్రితమయ్యింది. దాన్ని చెరిపివేయడం సాధ్యమవ్వలేదు. భ్రష్టమైన ఇశ్రాయేలు పై సాక్ష్యం చెప్పడానికి అది అలా మిగిలిపోయింది. దేవాలయం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆ నీతిమంతుడి రక్తపు మరక నిలిచి ఉంటుంది. ప్రతీకారాన్ని కోరుతూ అది దేవునికి మొర పెట్టుకుంటోంది. ఆ భయంకర పాపాల్ని గురించి యేసు ప్రస్తావిస్తోన్నప్పుడు ప్రజల్లో భయాందోళనలు చెలరేగాయి.DATel 692.2

    భవిష్యత్తులోకి చూస్తు, యూదులు మారుమనసు పొందకపోవడం, దేవుని సేవకుల విషయంలో వారి అసహనం గతంలో ఎలా ఉన్నదో అలాగే భవిష్యత్తులోనూ ఉంటుందని యేసు చెప్పాడు.DATel 692.3

    “అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను, మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని ఈ సమాజమందిరములలో కొరడాలతో కొట్టి, పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు.” ప్రవక్తల్ని, విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను నిండిన జ్ఞానుల్ని సైఫను, యాకోబు, ఇంకా అనేకుల్ని - వధిస్తారు. చెయ్యి ఆకాశం వైపుకి ఎత్తి దివ్యకాంతి తనను ఆవరించి ఉండగా ఒక న్యాయాధిపతి తన ముందున్న వారితో మాట్లాడినట్టుగా క్రీస్తుతో మాట్లాడాడు. తరచు సున్నితంగా విజ్ఞాపన చేస్తూ వినిపించిన ఆ స్వరం ఇప్పుడు మందలించడం ఖండించడం వినిపించింది. శ్రోతలు ఉలిక్కిపడ్డారు. ఆయన పలికిన మాటలు, ఆయన సారించిన దృష్టి ప్రభావం ఎన్నటికీ చెరిగిపోనిది.DATel 692.4

    మనుషులు తమ ఆత్మల్ని నాశనం చేసుకోడానికి, ప్రజల్ని మోసగించడానికి, దేవుణ్ని అగౌరవపర్చడానికి వారికి దోహదపడున్న వేషధారణ పై, అతిదారుణ పాపాలపై క్రీస్తు తన ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడు. యాజకులు అధికారుల ఆకర్షణీయ, మోసకర హేతువాదంలో సాతాను శక్తులు వారితో చెయ్యికలిపి పని చెయ్యడాన్ని ఆయన చూశాడు. పాపాన్ని ఆయన నిశితంగా ఖండించాడు. కాని ఆయన ప్రతీకార ధోరణిలో మాట్లాడలేదు. చీకటి శక్తుల రాజైన సాతానుపై ఆయన పరిశుద్ధ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాని ఆయన దురాగ్రహాన్ని ప్రదర్శించలేదు. దేవునితో సామరస్యంగా నివసిస్తోన్న ఆత్మ, ప్రేమ, కనికరం వంటి సౌమ్య గుణగణాలు కలిగి ఉన్న ఆత్మ, పాపంపై పరిశుద్ధమైన ఆగ్రహం ప్రదర్శిస్తుంది. కాని తన్ను దూషించేవారిని, ఆవేశంతో రెచ్చిపోయి దూషించేందుకు కృషిచేసే వారితో వ్యవహరించేటప్పుడు సైతం, అతడు క్రీస్తు స్ఫూర్తితో ప్రశాంతతను సంయమనాన్ని పాటిస్తాడు.DATel 693.1

    దైవకుమారుడు ఒక్కక్షణం ఆలయం మీద ఆమోదట తన శ్రోతల మీద తన దృష్టిని నిలిపిన తరుణంలో ఆయన ముఖం దివ్య కనికరంతో వికసించింది. తీవ్ర హృదయ వేదనతో కన్నీటితో గద్గదమైన స్వరంతో ఇలా అన్నాడు, “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తనపిల్లలను రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెననియుంటిని గాని మీరు ఒల్లకపోతిరి!” ఇదీ వియోగ సంఘర్షణ. క్రీస్తు పొందుతున్న దుఃఖవేదనలో దేవుని హృదయం ద్రవించి పారుతోంది. దీర్ఘకాలంగా బాధలు అనుభవించిన దివ్యప్రేమకు అది మర్మపూరితమైన వీడ్కోలు.DATel 693.2

    పరిసయ్యులు సదూకయ్యులు ఒకేరీతిగా మౌనం దాల్చారు. యేసు తన శిష్యుల్ని పిలిచి ఆలయం విడిచి వెళ్లిపోడానికి సమాయత్తమయ్యాడు. పరాజయం పొంది శత్రువుల సముఖం నుంచి నిష్క్రమించాల్సి వచ్చిన వానిలా కాక తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్న వానిలా, ఆపోటీ నుంచి విజయుడిగా నిష్క్రమించాడు. -DATel 693.3

    ఆ చరిత్రాత్మక దినాన క్రీస్తు నోటి నుంచి రాలిన సత్యముత్యాల్ని అనేకమంది తమ హృదల్లో దాచుకున్నారు. వారి జీవితాల్లోకి నూతన భావాలు రావడం ప్రారంభించాయి. క్రీస్తు మరణం పునరుత్థానం దరిమిల ఈ వ్యక్తులు ముందుకువచ్చి, తమ కర్తవ్య ఔన్నత్యానికి దీటైన విజ్ఞత ఉద్రేకాలతో దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చారు. ప్రజల హృదయాల్ని ఆకట్టుకుని, దీర్ఘకాలంగా వేలాదిమంది జీవితాల్ని అణగార్చుతున్న మూఢనమ్మకాల్ని బలహీనపర్చే వర్తమానాన్ని వారు ప్రకటించారు. సువార్త పక్షంగా వారిచ్చిన సాక్ష్యం ముందు మానవ సిద్ధాంతాలు తత్వజ్ఞానం కేవలం కట్టుకథలుగా మారాయి. యెరూషలేము దేవాలయంలో రక్షకుని మాటల ఫలితం అత్యద్భుతం.DATel 694.1

    కాగా ఇశ్రాయేలు ఒక జాతిగా దేవునితో తెగతెంపులు చేసుకుంది. ఒలీవ చెట్టు స్వాభావికమైన కొమ్మలు విరిగిపోయాయి. చివరిసారిగా ఆలయం లోపలి భాగాల్ని చూస్తూ, ముంచుకొస్తున్న దుఃఖంతో యేసు ఇలా అన్నాడు, “ఇదిగో నా యిల్లు మీకు విడువబడి యున్నది. ఇది మొదలుకొని - ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నిన్ను చూడను.” ఇంతకు ముందు దేవాలయాన్ని తన తండ్రి గృహంగా వ్యవహరించేవాడు. కాని ఇప్పుడు దైవ కుమారుడు ఆ గోడల మధ్యనుంచి వెళ్లిపోవాల్సి ఉండడంతో, దేవుని మహిమకోసం నిర్మితమైన ఆలయం నుంచి దేవుని మహిమ నిరంతరంగా ఉపసంహరించుకోబడుతుంది. ఇకనుంచి దానిలోని ఆచారాలు అర్థరహితమౌతాయి. దానిలోని పరిచర్య అపహాస్యం అవుతుంది.DATel 694.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents