Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    84—“మీకు సమాధానమవుగాక”

    యెరూషలేము చేరిన తర్వాత ఆ శిష్యులిద్దరూ పండుగ సమయాల్లో రాత్రులు తెరిచిఉండే తూర్పు గుమ్మంగుండా పట్టణంలో ప్రవేశించారు. ఇళ్లు చీకటి గాను నిశ్శబ్దంగాను ఉన్నాయి. కాని ఈ ప్రయాణికులు ఉదయిస్తోన్న చంద్రుడి కాంతిలో ఇరుకు వీధులగుండా వెళ్తున్నారు. యేసు తన మరణానికి ముందు సాయంత్రం తన చివరి గడియల్ని గడిపిన మేడగదికి వెళ్లారు. ఇక్కడ తమ సహోదరులుంటారని వారికి తెలుసు. రాత్రి చాలా గడిచిపోయినా తమ సహోదరులు ప్రభువు దేహం ఏమయ్యిందో కచ్చితంగా తెలిసేవరకు నిద్రపోరని వారికి తెలుసు. మేడగది తలుపులు వేసి గడియలు బిగించి ఉన్నట్టు కనుగొన్నారు. లోపలికి వెళ్లాలని తలుపు తట్టారు. దానికి స్పందనలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అంతట వారు తమ పేర్లు చెప్పారు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. వారు గదిలో ప్రవేశించారు. వారితో అదృశ్యుడైన ఇంకో వ్యక్తి ప్రవేశించాడు. ఆ తర్వాత గూఢచారులు ప్రవేశించకుండేందుకు మళ్లీ తలుపులు వేసి గడియలు బిగించారు.DATel 904.1

    అందరూ ఉత్సాహంగా ఉన్నట్లు ఆ ప్రయాణికులు గమనించారు. గదిలో ఉన్నవారందరూ కృతజ్ఞత స్తోత్రాలు వ్యక్తం చేస్తూ ఇలా పాడారు. “ప్రభువు నిజముగా లేచి సీమోమునకు కనబడెను” అంతట ఆ ఇద్దరు ప్రయాణికులు పరుగుపరుగున రావడంతో ఒగర్చుతూ యేసు తమకు ఎలా కనిపించాడో వివరిస్తూ తమ అద్భుత కథను చెప్పారు. వారు తమ కథనాన్ని ముగించిన వెంటనే అది తాము నమ్మలేమని కొందరన్నారు. అది నమ్మలేనంత మంచికథ మరి. అప్పుడు ఇంకొక వ్యక్తి వారి ముందు నిలబడ్డాడు. అందరికళ్లూ ఆపరదేశిఖాదే ఉన్నాయి. లోపలికి రావడానికి తలుపు తట్టలేదు ఆయన అడుగుల సవ్వడి వినిపించలేదు. శిష్యులు ఉలిక్కిపడి చూస్తోన్నారు.DATel 904.2

    దాని అర్థం ఏమిటా అని ఆశ్చర్యపడ్తో న్నారు. “అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయన -మీరెందుకు కలవరపడుచున్నారు? నా హృదయములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్లుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతములకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను.”DATel 905.1

    క్రూరంగా మేకులు దించిన ఆయన చేతుల్ని పాదాల్ని వారు పట్టుకున్నారు. ఆయన స్వరాన్ని గుర్తుపట్టారు. తాము విన్న ఏస్వరం ఆయన స్వరంలా లేదు. “అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన - ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని అడగెను. వారు కాల్చిన చేపముక్కను ఆయనకిచ్చిరి. దానిని ఆయన తీసికొని వారియెదుట భుజించెను.” “శిష్యులు ప్రభువును చూచి సంతోషపడిరి.” అవిశ్వాసం స్థానే విశ్వాసం, సంతోషం నెలకొన్నాయి. మాటలు వ్యక్తం చెయ్యలేని మనోభావాలతో వారు తిరిగిలేచిన తమ రక్షకుణ్ని గుర్తించారు.DATel 905.2

    యేసు జన్నించినప్పుడు భూమిపై సమాధానం మనుషులికి సుహృద్భావం అంటూ దేవదూత ప్రకటించాడు. ఇప్పుడు ఆయన పునరుత్థానం అనంతరం శిష్యులికి మొట్టమొదటిసారిగా కనిపించినప్పుడు రక్షకుడు వారిని “మీకు సమాధానమవు గాక” అని దీవించాడు. సందేహాలు భయాలతో బరువెక్కిన ఆత్మలకు శాంతి అనుగ్రహించడానికి యేసు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. హృదయ ద్వారాన్ని ఆయనకు తెరిచి నాలో నివసించవలసిందని మనం కోరడానికి ఆయన ఎదురుచూస్తోన్నాడు. ఆయన ఇలా అంటున్నాడు, “ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నాస్వరము విని తలుపు తీసినయెడల నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము.” ప్రక 3:20.DATel 905.3

    క్రీస్తు పునరుత్థానం ఆయన యందు నిద్రించేవారందరి చివరి పునరుత్థానానికి ఛాయారూపం. తిరిగిలేచిన రక్షకుని ముఖం, ఆయన తీరు, ఆయన మాటలు అన్నీ శిష్యులికి తెలుసు. క్రీస్తు మృతుల్లోనుంచి ఎలా లేచాడో అలాగే ఆయనయందు నిద్రించిన వారంతరూ తిరిగిలేస్తారు. శిష్యులు యేసుని గుర్తించినట్లే మనం మన స్నేహితల్ని గుర్తిస్తాం. ఈ మధ్య జీవితంలో వారు వికలాంగులు కావచ్చు, వ్యాధిగ్రస్తులు కావచ్చు, కురూపులు కావచ్చు. అయినా మహిమ శరీరాలు దాల్చినప్పుడు వారు సంపూర్ణారోగ్యంతోను కళంకంలేని దేహాకారంతోను లేస్తారు. మహిమ శరీరాల్లోనూ వారి ఆకృతి మారదు. అలానే ఉంటుంది. అప్పుడు మనల్ని ఇతరులు గుర్తిస్తారు. మనం వారిని గుర్తిస్తాం. 1 కొరి 13:12. క్రీస్తు ముఖం నుంచి వచ్చే వెలుగుతో ప్రకాశించే ముఖంలో మన ప్రియుల ముఖ కవళికల్ని మనం గుర్తిస్తాం.DATel 906.1

    క్రీస్తు తన శిష్యుల్ని కలిసినప్పుడు తన మరణానికి ముందు తమతో చెప్పిన మాటల్ని వారికి జ్ఞాపకం చేశాడు. ఆ మాటలు ఏమిటంటే తనను గురించి మోషే ధర్మశాస్త్రంలోను కీర్తనల గ్రంధంలోను రాసిఉన్నవన్నీ నెరవేరాలి. “అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి -క్రీస్తు శ్రమపడి మూడవ దిమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింప బడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతలకు మిరే సాక్షులు.”DATel 906.2

    శిష్యులు తమ పరిచర్య స్వభావాన్ని విస్తృతిని గుర్తించడం మొదలు పెట్టారు. క్రీస్తు తమకు అప్పగించిన మహత్తర సత్యాల్ని వారు ప్రకటించాల్సి ఉన్నారు. ఆయన జీవితానికి సంబంధించిన సంఘటనలు, ఆయన మరణ పునరుత్థానాలు, ఈ సంఘటనల్ని సూచించిన ప్రవచనాలు, దైవ ధర్మశాస్త్ర పరిశుద్ధత, రక్షణ ప్రణాళిక మర్మాలు, పాపక్షమాపణకు క్రీస్తు శక్తి - వీటన్నిటికి వారు సాక్షులు. వారు వాటిని లోకానికి ప్రకటించాలి. పశ్చాత్తాపం ద్వారాను రక్షకుని శక్తి ద్వారాను సమాధాన సువార్తను రక్షణ సువార్తను వారు ప్రకటించాల్సి ఉన్నారు.DATel 906.3

    “ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది -పరిశుద్దాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవివారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.” పరిశుద్ధాత్మ ఇంకా పూర్తిగా ప్రదర్శితం కాలేదు. ఎందుకంటే క్రీస్తు ఇంకా మహిమను పొందలేదు. క్రీస్తు ఆరోహణుడయ్యేవరకు పరిశుద్ధాత్మ సమృద్ధిగా అనుగ్రహించబడడం జరగలేదు. పరిశుద్దాత్మను పొందే వరకు సువార్తను లోకాని ప్రకటించడమన్న తమ ఆదేశాన్ని శిష్యులు నెవేర్చలేదు. కాని ఆత్మను ఆయన ఒక ప్రత్యేకపని నిమిత్తం ఇప్పుడిచ్చాడు. సంఘపరంగా తమ అధికారిక విధుల్ని నెరవేర్చకముందు క్రీస్తు వారిమీద తన ఆత్మను ఊదాడు. ఆయన వారికి అతి పవిత్ర కర్తవ్యాన్ని అప్పగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఆ పనిని సాధించడం అసాధ్యమన్న సత్యాన్ని వారికి బోధపర్చాలని ఉద్దేశించాడు.DATel 906.4

    ఆత్మలో ఆధ్యాత్మిక జీవితానికి పరిశుద్ధాత్మ ఊపిరివంటిది. ఆత్మను అనుగ్రహించడమంటే క్రీస్తును అనుగ్రహించడం. ఈ విధంగా దేవుని ఉపదేశాన్ని పొందినవారే, లోపల పనిచేసే పరిశుద్దాత్మను కలిగినవారే, ఎవరి జీవితంలో క్రీస్తు జీవితం ప్రదర్శితమౌతుందో వారే సంఘం తరపున ప్రతినిధులుగా లోకంలో నిలబడాల్సి ఉన్నారు.DATel 907.1

    “మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును.” ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండును అన్నాడు క్రీస్తు. ఏ మనుషుడు ఇతరుల మీద తీర్పు ప్రకటించడానికి ఇక్కడ స్వేచ్ఛ ఇవ్వడం లేదు. కొండమీది ప్రసంగంలో ఆయన దీన్ని నిషేధించాడు. అది దేవునికి మాత్రమే చెందిన హక్కు. వ్యవస్థీకరణ పొంది అధికారంగల సంఘంపై ప్రభువు వ్యక్తిగత సభ్యుల బాధ్యతను మోపుతున్నాడు. పాపంలో పడ్డవారి విషయంలో హెచ్చరిక చెయ్యడానికి, ఉపదేశమివ్వడానికి, సాధ్యమైతే పునరుద్ధరించడానికి సంఘానికి బాధ్యత ఉంది. “ఉపదేశించుము, ఖండించుము” ఇది “సంపూర్ణదీర్ఘశాంతముతో” (2తిమో 4:2) చెయ్యాలంటున్నాడు’ ప్రభువు. తప్పు చేసినవారి విషయంలో నమ్మకంగా వ్యవహరించాలి. ప్రమాదంలో ఉన్న ప్రతీ ఆత్మను హెచ్చరించండి. ఎవర్నీ తమ్ము తాము మోసం చేసుకోడానికి విడిచి పెట్టకండి. పాపాన్ని ధైర్యంగా పేర్కోండి. అబద్దమాడడం గురించి, సబ్బాతు మారడం గురించి, దొంగిలించడం గురించి, వ్యభిచరించడం గురించి, ప్రతీ చెడును గురించి దేవుడు ఏమి చెప్పాడో ప్రకటించండి. “ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు.” గలతీ 5:21. వారు పాపాన్ని విడిచి పెట్టకుండా కొనసాగుతుంటే దేవుని వాక్యం నుంచి వారు ప్రకటించే తీర్పు పరలోకంలో వారి మీద ప్రకటింతమౌతుంది. పాపాన్ని ఎన్నుకోడం ద్వారా వారు క్రీస్తుని విడిచిపెడ్తారు. వారి క్రియల్ని తాను ఆమోదించనని సంఘం వారికి తెలియజెయ్యాలి. అది చెయ్యకపోతే సంఘం దేవున్ని అగౌరవపర్చుతుంది. పాపం గురించి దేవుడు ఏమి చెప్పుతాడో అది సంఘం చెప్పాలి. దేవుని ఆదేశం మేరకు దాని విషయంలో సంఘం వ్యవహరించాలి. అప్పుడు దాని చర్యను పరలోకం ధ్రువీకరిస్తుంది. సంఘం అధికారాన్ని లెక్కచెయ్యని వ్యక్తి క్రీస్తు అధికారాన్నే తృణీకరిస్తున్నాడు.DATel 907.2

    ఈ చిత్రంలో వెలుగున్న పక్క ఒకటుంది. “మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును.” ఈ విషయాన్ని ఎల్లప్పుడు గుర్తుంచుకోండి. తప్పులో ఉన్నవారి నిమిత్తం పనిచెయ్యడంలో ప్రతీవారి దృష్టి క్రీస్తుపై నిలవాలి. ప్రభువు మందలోని గొర్రెల్ని ప్రతీకాపరి సున్నతమైన ప్రేమతో చూసుకోవాలి. తప్పులో ఉన్నవారితో క్రీస్తు క్షమాగుణాన్ని గూర్చి ఆయన కృపను గూర్చి మాట్లాడాలి. క్షమాపణనిచ్చే ప్రభువుని విశ్వసించడానికి పాపిని ప్రోత్సహించాలి. వాక్యం ఇస్తున్న అధికారంతో వారు, “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్మీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహా 1:9) అని ప్రకటించాలి. పశ్చాత్తప్తులైన వారందరికీ ఈ హామి ఉన్నది, “ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.” మికా 7:19.DATel 908.1

    పాపి పశ్చాత్తాపాన్ని సంఘం కృతజ్ఞతతో అంగీకరించాలి. పత్తాత్తాపడబోతున్న వ్యక్తిని అవిశ్వాసపు చీకటిలో నుంచి విశ్వాసం, నీతి వెలుగులోకి నడిపించాలి. వణుకుతున్న పాపి హస్తాన్ని ప్రేమామయుడైన యేసు చేతిలో పెట్టాలి. అలాంటి క్షమాపణని పరలోకం ధ్రువీకరిస్తుంది.DATel 908.2

    పాపిని క్షమించే అధికారం ఈ విధంగా మాత్రమే సంఘానికి ఉంది. పాపక్షమాపణ క్రీస్తు నీతిద్వారా మాత్రమే లభిస్తుంది. ఆత్మను పాపభారం నుంచి విడిపించడానికి ఏ వ్యక్తికీ ఏ మానవ సభకూ అధికారం లేదు. అన్ని జాతుల మధ్య తన నామంలో పాపక్షమాపణ ప్రకటించాల్సిందిగా క్రీస్తు తన శిష్యుల్ని ఆదేశించాడు. కాని వారికి పాపాన్ని తీసివేసే శక్తిని ఇవ్వలేదు. యేసు నామంలోనే తప్ప “ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము” అ.కా. 4:12.DATel 908.3

    యేసు శిష్యుల్ని మేడగదిలో మొట్టమొదటగా కలిసినప్పుడు, వారితో తొమా లేడు. ఇతరులు చెప్పిన వార్త అతడు విన్నాడు. యేసు తిరిగి లేచాడనడానికి అతడికి బోలెడు నిదర్శనం ఉంది. కాని అతడి హృదయాన్ని అపనమ్మకపు చీకటి కప్పింది. రక్షకుడు తమకు కనిపించిన అద్భుత సన్నివేశాన్ని శిష్యులు తనకు వల్లించడం విన్నాడు. అది అతడికి మరింత నిస్పృహ కలిగించింది. క్రీస్తు నిజంగా మృతుల్లోనుంచి లేస్తే, లోకంలో లౌకిక రాజ్యస్థాపన నిరీక్షణ వట్టిమాటే. రక్షకుడు శిష్యులందరికీ కనిపించి తనకు మాత్రం కనిపించకపోవడం అతడి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. ఆ వార్తను నమ్మకూడదని మొండికేశాడు. ఒక వారం రోజులు తన దురదృష్టాన్ని గూర్చి బాధపడ్డాడు. తన సహోదరుల్లో చోటుచేసుకున్న నిరీక్షణ విశ్వాసంతో పోల్చి చూస్తే అతడి పరిస్థితి మరింత అయోమయంగా మారింది.DATel 909.1

    ఈ సమయంలో పదేపదే ఇలా అనేవాడు, “నే ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నావ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మను.” అతడు సహోదరుల కళ్లతో చూడనన్నాడు. వారి మాటలమీద ఆధారపడి ఆ విషయంపై విశ్వాసం పెంచుకోనన్నాడు. అతడు ప్రభువుని ప్రగాఢంగా ప్రేమించాడు. కాని తన మనసులోను హృదయంలోను అసూయకు అవిశ్వాసానికి చోటు పెట్టాడు.DATel 909.2

    మేడగది ఇప్పుడు అనేకమంది శిష్యులికి తాత్కాలికి నివాసమయ్యింది. సాయంత్రాలు తోమా తప్ప తక్కిన శిష్యులందరూ ఇక్కడ సమావేశమయ్యేవారు. ఒక సాయంత్రం తక్కిన శిష్యుల్ని కలవాలని తోమా నిశ్చయించుకున్నాడు. తన అవిశ్వాసం ఇంకా ఉన్నా ఆయన పునరుత్థాన శుభవార్త వాస్తవమయిఉంటుదని నిరీక్షించాడు. శిష్యులు రాత్రి భోజనం చేస్తుండగా క్రీస్తు ప్రవచనాల్లో తమకు ఇచ్చిన నిదర్శనాల గురించి మాట్లాడుకుంటున్నారు. “తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యన నిలిచి -నాకు సమాధానము కలుగునుగాక అనెను.”DATel 909.3

    తోమా పక్కకు తిరిగి ఆయన ఇలా అన్నాడు, “నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుము.” తోమా ఆలోచనలు మాటలు ఆయనకు తెలుసునని ఈ మాటలు సూచిస్తోన్నాయి. తన సహచర శిష్యుల్లో ఎవరూ ఒక వారంగా యేసుని కలవలేదని సందేహిస్తున్న శిష్యుడికి తెలుసు. తన అపనమ్మకాన్ని గురించి వారెవ్వరూ ప్రభువుకి చెప్పి ఉండరు. తన ముందున్న ఆయన్ని అతడు తన ప్రభువుగా గుర్తించాడు. ఇంకేమి రుజువులు కోరలేదు. అతడి హృదయం సంతోషంతో గంతులు వేసింది. “నా ప్రభువా, నాదేవా” అని ఏడుస్తూ యేసు పాదాలమీద పడ్డాడు.DATel 910.1

    యేసు అతడి గుర్తింపును అంగీకరించాడుగాని అతడి అవిశ్వాసాన్ని సున్నితంగా మందలించాడు. తోమా, “నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులు” అన్నాడు. తన సహోదరుల సాక్ష్యం పై తోమా నమ్మి ఉంటే అతడి విశ్వాసం క్రీస్తుకి ఎక్కువ ఆనందాన్ని కూర్చేది. లోకం ఇప్పుడు తోమా మాదిరిని అనుసరిస్తే ఎవ్వరూ నమ్మి రక్షణ పొందడం జరగదు. ఎందుకంటే యేసుని అంగీకరించే వారందరూ ఇతరుల సాక్ష్యం మీదే అంగీకరించాల్సి ఉంటుంది.DATel 910.2

    సందేహించే ప్రవృత్తిగల అనేకమంది తోమాకి తన మిత్రులు అందించిన సాక్ష్యం తమకుంటే తాము నమ్ముతామని చెబుతారు. తమకు ఆ నిదర్శనం మాత్రమే గాక ఇంకా ఎక్కువ నిదర్శనం ఉంది. తన సందేహాలకి కారణాలన్నీ తొలగిపోయే వరకు తోమాలాగ వేచి ఉండే అనేకమంది తాము ఆశించినదాన్ని ఎన్నడూ సాధించలేదు. క్రమేణ వారు అవిశ్వాసంలో కూరుకుపోతారు. ఎప్పుడూ చీకటి కోణం నుంచి చూడడమే అలవర్చుకుని గొణుగుకుంటూ ఫిర్యాదులు చేసేవారు తాము ఏంచేస్తున్నారో ఎరుగరు. వారు సందేహ విత్తనాలు నాటుతున్నారు. కనుక వారు కొయ్యడానికి సందేహం పంట విస్తారంగా ఉంటుంది. విశ్వాసం నమ్మకం అత్యవసరమైన సమయంలో నిరీక్షించడానికి విశ్వసించడానికి అనేకులు ఈరకంగా శక్తిహీనులవుతారు.DATel 910.3

    తోమాతో తాను వ్యవహరించిన తీరులో, యేసు తన అనుచరులికి ఒక పాఠం బోధిస్తోన్నాడు. బలహీన విస్వాసంగల వారిపట్ల, తమ సందేహాల్ని ప్రధానాంశాలుగా చేసేవారిపట్ల మనం ఎలావ్యవహరించాలో యేసు ఆదర్శం మనకు బోధిస్తోంది. యేసు నిందవేసి తోమాను అణచివెయ్యలేదు లేక అతడితో వాదానికి దిగలేదు. సందేహపడుతున్న తోమాకు ఆయన తన్నుతాను కనపర్చుకున్నాడు. తన విశ్వాసానికి షరతులు విధించడంలో తోమా మూర్ఖంగా వ్యవహరించాడు. కాని తన ప్రేమను సహృదయతను బట్టి యేసు అడ్డుగోడలన్నిటిని కూల్చివేశాడు. అవిశ్వాసాన్ని సంఘర్షణ ద్వారా జయించడం ఎప్పుడోగాని జరగదు. అది ఆత్మ రక్షణ చర్యకు నడిపించి నూతన మద్దతును సాకును వెదకుతుంది. ప్రేమగల కృపగల యేసుని, సిలువను పొందిన రక్షకుడుగా బయలుపర్చండి. అప్పుడు అయిష్టంగా ఉన్న అనేకుల నోళ్లనుంచి “నా ప్రభువా, నా దేవా” అన్న తోమా గుర్తింపు వినబడుంది.DATel 910.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents