Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    86—వెళ్ళి సర్వజనాలకు బోధించండి

    పరలోక సింహాసనానికి ఒక్క అడుగుదూరంలో ఉన్న క్రీస్తు తన శిష్యులికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది.” “మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి” మార్కు 16:15. శిష్యులు వాటి ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు ఈ మాటల్ని ప్రభువు పదేపదే పలికాడు. ఉన్నతమైన స్థాయి వారు తక్కువ స్థాయివారు, ధనికులు పేదలు వారెవరైన భూమిపై నివసించేవారందిరి మీద పరలోక కాంతి కిరణాలు ప్రసరించాల్సి ఉంది. లోకాన్ని రక్షించే కర్తవ్యంలో శిష్యులు విమోచకునితో కలిసి కృషి చేయాల్సి ఉన్నారు.DATel 922.1

    క్రీస్తు మేడగదిలో తన పన్నెండు మంది శిష్యుల్ని కలిసినప్పుడు వారికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ ఆజ్ఞ ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాల్సిఉంది. గలిలయలో ఒక కొండమీద జరిగిన సమావేశానికి రాగలిన వారందరూ వచ్చారు. క్రీస్తే తన మరణానికి ముందు ఈ సమావేశానికి సమయాన్ని స్థలాన్ని నిర్ణయించాడు. తన శిష్యుల్ని గలిలయలో కలుసుకుంటానన్న క్రీస్తు వాగ్దానాన్ని సమాధి వద్ద శిష్యులికి దూత జ్ఞాపకం చేశాడు. పస్కా వారంలో యెరుషలేములో సమావేశమైన విశ్వాసులికి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చెయ్యడం జరిగింది. క్రీస్తు మరణం గురించి దుఃఖిస్తోన్న అనేక ఒంటరి సభ్యులికి వారి ద్వారా ఈ వాగ్దానం అందింది. ఈ సమావేశంలో ఆయనతో మాట్లాడడానికి అనేకులు ఆసక్తితో ఎదురుచూస్తోన్నారు. అసూయ విద్వేషంతో నిండిన యూదుల కంటపడకుండేందుకు అనేకులు చుట్టు దారుల గుండా సమావేశ స్థలానికి వచ్చారు. క్రీస్తుని గురించి తమకు అందిన వార్తను గురించి ప్రజలు ఉద్రేకంగా మాట్లాడుకుంటూ వచ్చారు.DATel 922.2

    నిర్ణీత సమయం వచ్చినప్పుడు కొండపక్కన చిన్న చిన్న గుంపులుగా ఇంచుమించు అయిదువందలమంది సమావేశమయ్యారు. క్రీస్తు పునరుత్థానుడైనప్పటి నుంచి ఆయన్ని చూసినవారి నుంచి తెలుసుకోగల సంగతుల్ని తెలుసుకోవాలని వారందరూ ఆతురతగా ఉన్నారు. యేసు గురించి తాము చూసిన సంగతుల్ని, ఆయన తమకు చెప్పిన రీతిగా లేఖనాల్లో ఉన్న సంగతుల్ని ఉటంకిస్తూ, విషయాలు వివరిస్తూ శిష్యులు ఒక గుంపు నుంచి ఇంకో గుంపుకి వెళోన్నారు. తోమా తన అవిశ్వాసం కథను చెప్పి తన సందేహాలు ఎలా తొలగిపోయాయో వివరించాడు. అకస్మాత్తుగా క్రీస్తు వారి మధ్యకు వచ్చి నిలబడ్డాడు. ఆయన ఎక్కడ నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఎవరికీ తెలయలేదు. అక్కడున్న వారిలో అనేకులు ఇంతకుముందు ఆయన్ని చూడలేదు. కాని ఆయన చేతుల్లోను కాళ్లలోను సిలువవేసిన గుర్తుల్ని చూశారు. ఆయన ముఖం దేవుని ముఖం లాగుంది. ఆయన్ని చూసినప్పుడు వారు సాగిలపడి నమస్కరించారు.DATel 923.1

    అయితే కొందరు సందేహపడ్డారు. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కొందరికి విశ్వసించడం కష్టమవుతుంది. వారు సందేహిస్తూ ఉండిపోతారు. అట్టి వారు తమ అవిశ్వాసం వల్ల చాలా నష్టపోతారు.DATel 923.2

    తన పునరుత్థానం తర్వాత అనేకమంది విశ్వాసులతో సమావేశమై ఆయన మాట్లాడడం ఈ ఒక్కసారే జరిగింది. ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, “పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడియున్నది.” ఆయన మాట్లాడకముందు శిష్యులు ఆయన్ని మొక్కారు. మరణం వల్ల మూతపడి ఉన్న ఆయన పెదవుల్నుంచి వచ్చిన మాటలు వారిని శక్తితో నింపాయి. ఇప్పుడు ఆయన తిరిగి లేచిన రక్షకుడు. ఆయన వ్యాధిగ్రస్తుల్ని బాగుచెయ్యడం సాతాను ప్రతినిధుల్ని అదుపుచెయ్యడం అక్కడున్న వారిలో చాలామంది చూశారు. యెరుషలేములో రాజ్యం స్థాపించడానికి తనను వ్యతిరేకించిన వారందరినీ అణచివెయ్యడానికి ఆయనకు శక్తి ఉన్నదని వారు నమ్మారు. ఆయన తుపానుతో కల్లోలమైన సముద్రాన్ని సద్దణిచాడు. నురుగు కిరీటాలు ధరించిన తరంగాల పైన నడిచాడు. మృతుల్ని లేపాడు. ఇప్పుడు “సర్వాధికారము” తనదేనని ప్రకటించాడు. ఆయన మాటలు ప్రజల మనసుల్ని లౌకికం శారీరకం అయిన విషయాల నుంచి పారలౌకికం నిత్యకాలికం అయిన విషయాల మీద లగ్నం చేశాయి. ఆయన ఔన్నత్యాన్ని మహిమను గూర్చిన అత్యున్నతాభిప్రాయం పొందడానికి వారిని పైకిలేపాయి.DATel 923.3

    పర్వతం పక్క ప్రజలతో క్రీస్తు చెప్పిన మాటలు మానవుల తరపున తన ప్రాణార్పణ సంపూర్ణమైనదని ప్రకటించాయి. ఆయన ప్రాయశ్చిత్తం షరతుల్ని నెరవేర్చాడు. లోకంలోకి ఆయన ఎందునిమిత్తం వచ్చాడో ఆ కార్యం పూర్తి అయ్యింది. దేవదూతల నివాళులు రాజ్యాలు అదికారాల మన్ననల్ని అందుకోడానికి ఆయన పరలోకానిక వెళ్లడానికి సిద్ధమై ఉన్నాడు. ఆయన తన మధ్యవర్తిత్వ బాధ్యతల్ని చేపట్టాడు. అవధులు లేని అధికారాన్ని చేతపట్టుకుని శిష్యులికి ఆయన ఈ ఆజ్ఞ ఇచ్చాడు, “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చిచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటనన్నిటిని గౌకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తివరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” మత్త 28:19,20.DATel 924.1

    యూదు ప్రజలు పరిశుద్ధ సత్యనిధికి ధర్మకర్తలుగా నియమితులయ్యారు. అయితే పరిసయ్యుల సంకుచిత మతవాదం వారిని మానవులందరిలోను విలక్షణమైన, తీవ్ర మతదురభిమానం గల ప్రజలుగా మార్చింది. యాజకుల్ని గూర్చి సమస్తం - వారి దుస్తులు, ఆచారాలు, కర్మకాండ, సంప్రదాయాలు - లోకానికి వెలుగు కావడానికి వారిని అయోగ్యుల్ని చేసింది. తామే అనగా యూదుజాతే లోకమని వారు భావించారు. కాని కులంతో గాని దేశంతోగాని సంబంధం లేని ఒక విశ్వాసాన్ని ఆరాధనను ప్రబోధించమని క్రీస్తు తన శిష్యులికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విశ్వాసం అందరికి, అన్ని జాతులికి, అన్ని తరగుల ప్రజలికి అనుకూలమైన విశ్వాసం.DATel 924.2

    తన శిష్యుల్ని విడిచి వెళ్లకముందు తన రాజ్య స్వభావాన్ని గురించి క్రీస్తు వారికి స్పష్టంగా చెప్పాడు. దాన్ని గురించి గతంలో వారికి ఏమి చెప్పాడో అది వారికి మళ్లీ గుర్తు చేశాడు. లోకంలో లౌకిక రాజ్యం కాదు అధ్యాత్మిక రాజ్యం స్థాపించడం తన ఉద్దేశమని ఆయన చెప్పాడు. దావీదు సింహాసనం మీద కుర్చుని లోక రాజులా పరిపాలించనన్నాడు. లోకంలో తాను అనుభవించినదంతా తండ్రికి తనకు మధ్య పరలోకంలో జరిగిన సమావేశం నిర్ణయం ప్రకారం జరిగిందని లేఖనాలు తెరిచి చూపించాడు. పరిశుద్దులు పరిశుద్దాత్మ ప్రేరణతో ఈ విషయాల్ని ముందే వెల్లడించారు. నన్ను మెస్సీయాగా విసర్జించడాన్ని గురించి నేను చెప్పింది నెరవేరడం మీరు చూస్తునే ఉన్నారు అన్నాడు. నేను భరించాల్సి ఉన్న అవమానాన్ని గురించి పొందాల్సి ఉన్న మరణాన్ని గురించి నేను చెప్పినదంతా వాస్తవమయ్యింది. మూడోరోజున నేను తిరిగి లేచాను. లేఖసాల్ని శ్రద్ధగా పరిశీలించండి. ఈ విషయాలన్నిటిలోను నన్ను గూర్చిన ప్రవచనం ప్రతీ చిన్న వివరం సహా నెరవేరినట్లు మీకే తెలుస్తుంది.DATel 924.3

    తమ చేతుల్లో విడిచి పెట్టిన పనిని యెరుషలేముతో ప్రారంభించి చేయమని క్రీస్తు తన శిష్యుల్ని ఆదేశించాడు. మానవ జాతి నిమిత్తం ఆయన తన్నుతాను ఎంతగా తగ్గించుకున్నాడన్నడానికి యెరుషలేము ప్రదర్శన వేదిక. అక్కడే ఆయన శ్రమలనుభవించాడు, విసర్జించబడ్డాడు, మరణ శిక్ష అనుభవించాడు. యూదయలో ఆయన జన్మించాడు. మానవుడిగా అవతరించి అక్కడ ఆయన మనుషులతో నడిచాడు. క్రీస్తు తమ మధ్య నివసించినప్పుడు పరలోకం భూమికి ఎంత దగ్గరయ్యిందో గ్రహించిన వారు దాదాపు లేరు. శిష్యుల పరిచర్య యెరుషలేములో ప్రారంభమవ్వాల్సి ఉంది.DATel 925.1

    క్రీస్తు అక్కడ అనుభవించిన శ్రమలు, ఎవరూ అభినందించని ఆయన సేవ దృష్ట్యా, ఫలితాలు లభించే వేరే పట్టణానికి పంపమని శిష్యులు మనవి చేసి ఉంటారు. ఆయన సత్య విత్తనాల్ని వెదజల్లిన నేలలోనే శిష్యులు సేద్యం చెయ్యాలి. అప్పుడు విత్తనం మొలకెత్తి విస్తారమైన పంటనిస్తుంది. తమ పరిచర్యలో శిష్యులు యూదుల అసూయ ద్వేషం మూలంగా హింసను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే రక్షకుడు దీన్ని సహించాడు. వారు దాన్నుంచి పారిపోకూడదు. మొట్టమొదటగా రక్షకుని హంతకులపట్ల కృపను కనపర్చాలి.DATel 925.2

    యేసుని రహస్యంగా విశ్వసించిన వారు యెరుషలేములో చాలామంది ఉన్నారు. యాజకులు అధికారుల వంచనకు బలి అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వీరికి కూడ సువార్తను ప్రకటించాల్సి ఉంది. వారిని పశ్చాత్తాపానికి నడిపించాలి. క్రీస్తు ద్వారా మాత్రమే పాపక్షమాపణ లభిస్తుందన్న ప్రశస్తసత్యాన్ని విశదం చెయ్యాలి. గత కొన్ని వారాల్లో చోటు చేసుకున్న సంఘటనలు యెరుషలేముని కుదిపివేయగా సువార్త బోధ ప్రజల హృదయాలలో చెరగని ముద్రవేసుకుంటుంది.DATel 925.3

    అయితే ఆ పరిచర్య ఇక్కడ నిలిచిపోకూడదు. అది లోకం మారుమూల ప్రాంతాలకు విస్తరించాల్సి ఉంది. లోకం నిమిత్తం నేను జీవించిన ఆత్మ త్యాగ పూరిత జీవితానికి మీరు సాక్షులని క్రీస్తు తన శిష్యులతో అన్నాడు. నేను ఇశ్రాయలు కోసం చేసిన శ్రమను మీరు చూశారు. తమకు జీవం కలిగే నిమిత్తం వారు నా వద్దకు రాకపోయినా, యాజకులు అధికారులు తమ ఇష్ట ప్రకారం నాతో అమానుష్యంగా ప్రవర్తించినా, లేఖనం చెబుతున్నట్లు వారు నన్ను విసర్జించినా దైవకుమారుణ్ని అంగీకరించడానికి వారికి ఇంకా తరుణం ఇవ్వాలి. తమ పాపాలు ఒప్పుకుంటూ నావద్దకు వచ్చేవారందరిని నేను అంగీకరిస్తున్నట్లు మీరు చూస్తునే ఉన్నారు. ఇష్టపడేవారందరూ దేవునితో సమాధానపడి నిత్యజీవం పొందవచ్చు. నా శిష్యులారా, మీకు ఈ కృపావర్తమానాన్ని ఇస్తున్నాను. దీన్ని వారు ముందు ఇశ్రాయేలుకి అందించాలి. ఆ తర్వాత అన్ని జాతులికి అన్ని భాషల వారికి, అందిరికీ అందించాలి. దాన్ని యూదులికి అన్యులికి అందించాలి. విశ్వసించేవారందిరిని ఒక సంఘంగా ఏర్పాటు చెయ్యాలి.DATel 926.1

    పరిశుద్ధాత్మ వరం ద్వారా శిష్యులు అద్భుత శక్తిని పొందాల్సి ఉన్నారు. వారి సాక్ష్యం గుర్తులు అద్భుతాలలో ధ్రువీకరణ పొందాల్సి ఉంది. సూచక క్రియలు అపొస్తలులే కాదు వారి వర్తమానం విన్నవారు కూడా చేయనున్నారు. యేసు ఇలా అన్నాడు, “నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొ భాషలు మాటాలాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ” మార్కు 16:17, 18.DATel 926.2

    ఆ కాలంలో విష ప్రయోగం తరచుగా జరుగుతుండేది. నీతి నియమాలు లేని వ్యక్తులు తమ దారికి అడ్డువచ్చే వారిని ఈ విధంగా తొలగించుకునే వారు. తన శిష్యుల జీవితం ఈ విధంగా అపాయానికి గురి కావచ్చునని యేసుకు తెలుసు. తన సాక్షుల్ని మట్టుపెట్టడం దేవుని సేవ అని చాలామంది తలంచేవారు. కనుక ఆయన ఈ అపాయం నుంచి వారిని కాపాడ్తానని వాగ్దానం చేశాడు.DATel 926.3

    “ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థ” పర్చడానికి క్రీస్తుకున్న శక్తే శిష్యులు కూడా పొందనున్నారు. ఆయన పేరట శారీరక వ్యాధుల్ని బాగుచెయ్యడం ద్వారా ఆత్మను స్వస్తపర్చడానికి ఆయనకున్న శక్తిని గురించి వారు సాక్ష్యమివ్వవలసి ఉన్నారు. మత్త 4:23, 9:6. ఇప్పుడు వారికి కొత్త వరం వాగ్దానం చెయ్యబడింది. శిష్యులు ఇతర జాతుల ప్రజల మధ్య బోధించాల్సి ఉంటుంది. కనుక వారు ఇతర బాషలు మాట్లాడే శక్తిని పొందుతారు. అపొస్తలులు వారి సహచరులు అక్షర జ్ఞానం లేనివారు. అయినా పెంతెకొస్తు దినాన పరిశుద్దాత్మ కుమ్మరింపు ద్వారా వారి భాష, అది తమ సొంత బాషలోనే కాదు విదేశ బాషల్లో కూడ మాట విషయంలోను ఉచ్చారణ విషయంలోను స్వచ్ఛంగా సరళంగా నిర్దుష్టంగా సాగింది.DATel 927.1

    క్రీస్తు శిష్యులికి ఇలా తమ సేవాదేశాన్ని ఇచ్చాడు. ఆ సేవను అమలుపర్చడానికి ఏర్పాటు చేసి దాని విజయానికి తానే బాధ్యతను చేపట్టాడు. వారు ఆయన మాట విని ఆయనతో కలిసి పనిచేసినంతకాలం వారికి వైపల్యం ఉండదు. అన్ని జాతులకు వెళ్లండి అని ఆయన ఆదేశించాడు. భూమిపై జనసంచారమున్న మారుమూలలికి వెళ్లండి. అక్కడ నేను మీతో ఉంటానని తెలుసుకోండి. విశ్వాసంతో నమ్మకంగా పనిచెయ్యండి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టను.DATel 927.2

    రక్షకుడు శిష్యులకిచ్చిన సేవాదేశం విశ్వాసులందరికీ వర్తిస్తుంది. చివరికాలంలో క్రీస్తుని విశ్వసించే వారందరికి ఇది వరిస్తుంది. ఆత్మల రక్షణ పరిచర్య అభిషేకం పొందిన బోధకుడే చెయ్యాలన్నది గొప్ప పొరపాటు. పరలోక ఆవేశం పొందిన వారందరు సువార్త నిధికి బాధ్యులవుతారు. క్రీస్తు జీవితాన్ని స్వీకరించే వారందరు సాటి మనుషుల రక్షణ నిమిత్తం పనిచెయ్యడానికి అభిషేకం పొందిన వారు. ఈ సేవ నిమిత్తమే సంఘం స్థాపితమయ్యింది. సంఘం తాలుకు పరిశుద్ద ప్రమాణాన్ని స్వీకరించే వారందరు క్రీస్తుతో జతపనివారం అవుతామని ప్రమాణం చేస్తున్నారు.DATel 927.3

    “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను.” వినేవారందరు తిరిగి ఆహ్వానాన్నందించాలి. జీవనోపాధికి ఒక వ్యక్తి ఏపని చేసినా ఆత్మల్ని రక్షించడం అతడి ప్రథమ ఆసక్తి కావాలి. అతడు విశ్వాసుల సభల్లో ప్రసంగించలేకపోవచ్చు. కాని అతడు వ్యక్తిగత సేవ చెయ్యవచ్చు. తాను ప్రభువు వద్ద నుంచి పొందిన ఉపదేశాన్ని అతడికి అందించవచ్చు. సువార్త సేవ అంటే బోధించడమే కొదు. జబ్బుగా ఉన్నవారికి బాధపడుతున్నవారికి సహాయమందించేవారు, అవసరంలో ఉన్నవారికి చేయూత నిచ్చేవారు, నిరాశ చెందిన వారితోను, విశ్వాసంలేని వారితోను మాట్లాడి వారిని ఉత్సాహపర్చే వారు సువార్త సేవ చేస్తున్న వారే. అపరాధ భారాన్ని మోస్తున్న వారు దగ్గరలోను దూర ప్రాంతం లోను అనేకమంది ఉన్నారు. మానవుల్ని హీనస్థితికి తెచ్చేవి కష్టాలు, శ్రమలు లేక పేదరికమే కాదు. అపరాధం, దుష్క్రియల వల్ల అశాంతి అసంతృప్తి చోటుచేసుకుంటాయి. పాప వ్యాధి తో బాధపడున్న ఆత్మలకు తన సేవకులు పరిచర్య చెయ్యాలని క్రీస్తు కోరుతున్నాడు.DATel 928.1

    శిష్యులు తామున్న చోటే తమ సేవను ప్రారంభించాల్సి ఉన్నారు. ఫలితం కనిపించని కష్టమైన స్థలాన్ని ప్రాంతాల్ని విడిచి వెళ్లిపోకూడదు. క్రీస్తు సేవకుల్లో ప్రతీవారు ఈ విధంగా తామున్న చోటే ప్రారంభించి పని చెయ్యాల్సి ఉన్నారు. సానుభూతి అవసరమైన వారు జీవాహారానికి ఆకలిగొన్నవారు మన కుటుంబాల్లోనే ఉండవచ్చు. క్రీస్తు మార్గంలో తర్పీదు చెయ్యాల్సిన బిడ్డలుండవచ్చు. మన తలుపులవద్దే అన్యజనులున్నారు. మనకు అతి సమీపంలోనే ఉన్న పనిని చేద్దాం. ఆ తర్వాత దేవుడు ఎక్కడకు నడిపిస్తే అక్కడకు వెళ్లి సేవ చేద్దాం. అనేకుల సేవ పరిస్థితుల వల్ల పరిమితం అయినట్లు కనిపించవచ్చు. అయినప్పటికీ సేవను ఎక్కడ చేసినా దాన్ని నమ్మకంగాను శ్రద్ధగాను నిర్వహిస్తే ఆస్థలమే లోకం చిట్టచివరి ప్రాంతమవుతుంది. క్రీస్తు లోకంలో నివసించినప్పుడు ఆయన సేవ చాలా చిన్న ప్రాంతానికి పరిమితమైనట్లు కనిపించింది. కాని అన్ని ప్రాంతాల నుంచి జన సమూహాలు వచ్చి ఆయన వర్తమానాన్ని విన్నారు. దేవుడు తరచు అతి సామాన్య వనరులతో అత్యద్భుత ఫలితాన్ని సాధిస్తాడు. పెద్ద చక్రంలో చిన్న చక్రం ఉండి అన్నీ సమన్వయంతో ఎలా పనిచేస్తాయో అలాగే ఆయన సేవలో ప్రతీ భాగం తక్కిన భాగాలతో కలిసి సమన్వయంతో పని చెయ్యాలన్నది దేవుని సంకల్పం. పరిశుద్ధాత్మ నడుపుదలతో పనిచేసే అతిసామాన్య సేవకుడు అదృశ్యమైన తీగల్ని స్పృశిస్తాడు. వాటి కంపనం లోకం కొనలకు వ్యాపించి నిత్య యుగాల పొడవునా శ్రావ్య సంగీతాన్ని పుట్టిస్తుంది.DATel 928.2

    “మీరు సర్వలోకమునకు” వెళ్లండి అన్న ఆజ్ఞను విస్మరించకూడదు. మనం కన్నులెత్తి “అవలి ప్రదేశములలో”కి దృష్టి సారించాల్సిందిగా పిలుపువస్తున్నది. క్రీస్తు ప్రజల్ని విడదీసే జాతీయతా దురభిమానపు అడ్డుగోడల్ని కూల్చివేసి సర్వమానవ కుటుంబం పట్ల ప్రేమను ప్రబోధిస్తోన్నాడు. తమ స్వార్ధం ఏర్పర్చే సంకుచిత పరిధి నుంచి మనుషుల్ని ఆయన పైకి లేపుతాడు. ఆయన ప్రాంతీయ విభజనల్ని, సమాజం సృష్టించుకున్న భేదాల్ని రద్దు పర్చుతున్నాడు. పొరుగు వారు పరదేశులు, స్నేహితులు, శత్రువులు అన్న భేదం ఆయనకు లేదు. అవసరంలో ఉన్న ప్రతీ వ్యక్తిని మన సోదరుడుగా పరిగణించాలని సర్వలోకం మన సేవారంగం అని ఆయన ప్రబోధిస్తోన్నాడు.DATel 929.1

    “మీరు సర్వలోకమునకు వెళ్లి... ప్రకటించుడి” అని రక్షకుడన్నప్పుడు ఆయన ఈ మాటలు కూడా అన్నాడు, “నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త బాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకారకమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు” ఈ ఆజ్ఞ ఎంత దీర్ఘకాలిక మయ్యిందో ఈ వాగ్దానం కూడా అంతే దీర్ఘకాలికమయ్యింది. అన్ని వరాలు విశ్వాసులందరికీ ఉంటాయని కాదు. ఆత్మ “తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి” ఇస్తాడు. 1 కొరి 12:11. అయితే ప్రభువు సేవకు వ్యక్తి అవసరాల్ని బట్టి ఆత్మవరాన్ని ప్రతీ విశ్వాసికి దేవుడు వాగ్దానం చేశాడు. అపొస్తలుల దినాల్లోలాగే నేడు కూడా ఈ వాగ్దానం బలమైంది. నమ్మదగింది. “నమ్మినవారి వలన ఈ సూచక క్రియ కనబడును.” ఇది దేవుని బిడ్డల ఆధిక్యత. పొందడానికి సాధ్యమైనదంతా విశ్వాసం సొంతం చేసుకోవాలి.DATel 929.2

    “రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు.” ఈ లోకం విశాలమైన వ్యాధిగ స్రుల గృహం. అయితే వ్యాధిగ్రస్తుల్ని స్వస్తపర్చడానికి, సాతాను బంధాల్ని విడిపించడానికి క్రీస్తు వచ్చాడు. ఆయనే *ఆరోగ్యం బలం. ఆయన తనలోని జీవాన్ని రోగులికి పీడితులికి, దయ్యాలు పట్టినవారికి ఇచ్చాడు. తన స్వస్తత శక్తినాశ్రయించి వచ్చిన వారినెవ్వరినీ ఆయన నిరాకరించలేదు. తన సహాయాన్ని అర్ధిస్తున్న వారు తమ పైకి తామే వ్యాధిని తెచ్చుకున్నారని ఆయనకు తెలుసు. అయినా వారిని స్వస్తపర్చడానికి ఆయన నిరాకరించలేదు. క్రీస్తు మహిమ ఈ ఆత్మల్లో ప్రవేశించినప్పుడు వారు తాము పాపులమని గుర్తించారు. అనేకులు తమ ఆధ్యాత్మిక వ్యాధి నుంచి శారీరక రుగ్మతల నుంచి స్వస్తత పొందారు. సువార్తకు అదే శక్తి ఉంది. ఈనాడు మనకు అవే ఫలితాలు ఎందుకు కనిపించడం లేదు?DATel 929.3

    ప్రతీ బాధితుడు పడున్న శ్రమల్ని క్రీస్తు కూడా అనుభవిస్తాడు. దురాత్మలు మానవ దేహాన్ని చీల్చుతున్నప్పుడు క్రీస్తు ఆ శాపాన్ని భరిస్తాడు. లోకంలో ఉన్నప్పుడు వ్యాధి బాధితుల్ని బాగుచెయ్యడానికి ఎంత సంసిద్ధంగా ఉండేవాడో నేడు కూడా స్వస్తత కూర్చడానికి అంతే సంసిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు సేవకులు ఆయన ప్రతినిధులు. ఆయన వారి ద్వారా పనిచేస్తాడు. వారి ద్వారా తన స్వస్తత శక్తిని ప్రదర్శించాలని ఆశిస్తోన్నాడు.DATel 930.1

    రక్షకుడు స్వస్తపర్చిన తీరులో శిష్యులు నేర్చుకోవలసిన పాఠాలున్నాయి. ఒక సందర్భంలో ఒక గుడ్డివాడి కళ్లమీద మన్ను పూసి “నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను... వాడు వెళ్లి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను.” యోహా 9:7. ఆ స్వస్తత ఆ మహావైద్యుని శక్తి వల్ల జరిగి ఉండేదే. అయినా క్రీస్తు ప్రకృతిలోని సామాన్య సాధనాల్ని ఉపయోగించుకున్నాడు. మందుల వాడకం పట్ల ఆయన సుముఖత చూపకపోయినా సామాన్య స్వాభావిక చికిత్సను ఆయన ఆమోదించాడు.DATel 930.2

    స్వస్తత పొందిన అనేక బాధితులతో క్రీస్తు ఇలా అన్నాడు. “మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక పాపము చేయకుము” యోహా 5: 14. వ్యాధి దేవుని చట్టాల్ని - స్వాభావిక చట్టాల్ని ఆధ్యాత్మిక చట్టాల్ని - అతిక్రమించడం వల్ల వస్తుందని ఇలా ఆయన బోధించాడు. సృష్టికర్త ప్రణాళికననుసరించి మానవులు నివసిస్తున్నట్లయితే నేడు ప్రపంచంలో ఉన్న దుఃఖం ఉండేది కాదు.DATel 930.3

    పూర్వం ఇశ్రాయేలీయులికి క్రీస్తు మార్గదర్శకుడు ఉపదేశకుడుగా వ్యవహరించాడు. ఆరోగ్యం దైవ చట్టాలకు విధేయంగాసాగే జీవిత ఫలమని ఆయన బోధించాడు. పాలస్తీనాలో వ్యాధిగ్రస్తుల్ని స్వస్తపర్చిన ఆ మహా వైద్యుడే మేఘ సంభంలోనుంచి తన ప్రజలతో మాట్లాడి తాము ఏమి చెయ్యాలో తమకు దేవుడు ఏమి చేస్తాడో వారికి తెలిపాడు. వారితో ఆయనిలా అన్నాడు, “మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని ఆచరించి నడిచిన యెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.” నిర్గ 15:26. క్రీస్తు ఇశ్రాయేలీయులికి తమ అలవాట్లు అభ్యాసాల గురించి నిర్దిష్టమైన ఉపదేశం ఇచ్చిన మిదట ఈ హామీ ఇచ్చాడు, “యెహో నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించు”ను. ద్వితి 7:15. వారు షరతుల్ని నెరవేర్చినప్పుడు ఈ వాగ్దానం నెరవేర్పును చూశారు, ” వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్రిల్లువాడొక్కడైనను లేకపోయెను” కీర్త 105:37.DATel 931.1

    ఈ పాఠాలు మనకే. మంచి ఆరోగ్యం కావాలనుకునే వారందరూ నెరవేర్చాల్సి షరతులున్నాయి. ఈ షరతులేంటో అందరూ తెలుసుకోవాలి. తన చట్టాల విషయంలో - అవి ప్రాకృతిక చట్టాలేగాని లేక ఆధ్యాత్మిక చట్టాలేగాని - ప్రభువు అజ్ఞానాన్ని అంగీకరించడు. శరీరానికి ఆత్మకు ఆరోగ్యాన్ని చేకూర్చడంలో మనం దేవునితో కలిసి పని చెయ్యాల్సి ఉన్నాం.DATel 931.2

    ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, ఆరోగ్యాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలో మనం ఇతరులికి నేర్పించాలి. జబ్బుగా ఉన్న వారికి ఆరోగ్యం చేకూర్చడానికి దేవుడు ప్రకృతిలో పెట్టిన నివారణ సాధనాల్ని మనం వినియోగించుకోవాలి. మనం ప్రజల్ని క్రీస్తు వద్దకు నడిపించాలి. ఆయన మాత్రమే స్వస్తత కూర్చగలడు. జబ్బుగా ఉన్నవారిని, బాధపడుతున్నవారిని మన విశ్వాస హస్తాలతో ఆయనకి సమర్పించడం మనపని. ఆ గొప్ప వైద్యుణ్ని విశ్వసించడం మనం వారికి నేర్పించాలి. ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ఆయన శక్తి ప్రదర్శన కోసం ప్రార్థించాలి. పునరుద్దరణే సువార్త సారాంశం. జబ్బుగా ఉన్నవారిని, నిరీక్షణ లేని వారిని, శ్రమలనుభవిస్తున్న వారిని ప్రభువు మీద ఆధారపడాల్సిందిగా ప్రోత్సహించాలని మనల్ని ప్రభువు కోర్తున్నాడు.DATel 931.3

    క్రీస్తు నిర్వర్తించిన స్వస్తత అంతటి లోను ప్రేమ శక్తి ఉంది. ఆ ప్రేమలో విశ్వాసములంగా పాలు పొందడం ద్వారా మాత్రమే మనం ఆయన సేవకు సాధనాలు కాగలుగుతాం. మనం మనల్ని క్రీస్తుతో అనుసంధానపర్చుకోడానికి నిర్లక్ష్యం చేస్తే మన నుంచి ఇతరులికి ప్రాణాధారమైన శక్తి ప్రవహించలేదు. రక్షకుడు అనేకమైన తన మహత్కార్యాలు చేయలేకపోయిన స్థలాలున్నాయి. అందుకు వారి అవిశ్వాసమే కారణం. అలాగే ఇప్పుడు కూడా అవిశ్వాసం సంఘాన్ని తన దివ్య సహాయకుడి నుంచి వేరుచేస్తోంది. నిత్య సత్యాలపై దాని పట్టు బలహీనంగా ఉంది. సంఘపరంగా ఈ విశ్వాస లోపం వల్ల దేవుడు ఆశాభంగం చెందుతోన్నాడు. తాను పొందాల్సిన మహిమను ఆయన పొందడం లేదు.DATel 932.1

    తన సేవ చెయ్యడంలో సంఘంతో తన సన్నిధి ఉంటుందని క్రీస్తు వాగ్దానం చేశాడు. వెళ్లి సర్వజనులకు ప్రకటించండి, “ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నాతో కూడ ఉన్నాను” అన్నాడు. ఆయన శక్తిని పొందడానికి ఆయన సిలువను ఎత్తుకోడం మొదటి షరతుల్లో ఒకటి. ప్రభువిచ్చిన సువార్తజను నమ్మకంగా నెరవేర్చడం మీదనే సంఘం జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ పనిని అలక్ష్యం చెయ్యడం ఆధ్యాత్మిక బలహీనతను క్షీణతను ఆహ్వానించడమే. ఇతరుల కోసం క్రియాశీలక కృపలేనప్పుడు ప్రేమ చల్లారుంది, విశ్వాసం మసకబారుతుంది.DATel 932.2

    తన సేవకులు సువార్త సేవపై సంఘానికి ఉపదేశకులుగా వ్యవహరించాలని క్రీస్తు ఆకాంక్షిస్తోన్నాడు. వెదకి రక్షించడం ఎలాగో వారు నేర్పించాలి. వారు ఈ పని చేస్తున్నారా? మరణించడానికి సిద్ధంగా ఉన్న ఒక సంఘాన్ని తెప్పరిల్ల జెయ్యడానికి ఎంతమంది కృషిచేస్తున్నారు? అంతలో కోట్లాది ప్రజలు క్రీస్తును గురించి వినకుండా మరణిస్తోన్నారు.DATel 932.3

    మానవుల కోసం దేవుని హృదయంలో అనంతమైన ప్రేమ పుట్టుకువస్తుంది. అంత గొప్ప ప్రేమను పొందుతున్న లబ్ధిదారుల్లోని స్వల్పకృతజ్ఞతను చూసి దేవదూతలు ఆశ్చర్యపడ్డారు. దేవుని ప్రేమను మానవులు అంతగా అభినందించలేకనపోవడాన్ని చూసి దేవదూతలు విస్మయపడ్డారు. మానవాత్మల విషయంలో ప్రదర్శితమవుతోన్న నిర్లక్ష్యానికి పరలోకానికి అగ్రహం కలుగుతుంది. దీన్ని క్రీస్తు ఎలా పరిగణిస్తాడో మనకు తెలుసా? తమ బిడ్డ చలిలోను మంచులోను చిక్కుకుని ఉండగా రక్షించగలిగిన వారు చూసి సహాయం చెయ్యకుండా అతణ్ని ఆస్థితిలోనే ఉంచి వెళ్లిపోతే ఆ బిడ్డ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? వారికి తీరని దుఃఖం కలుగదా? పట్టరాని కోపం రాదా? ఆ హంతకుల్ని ఖండించి వారిపై ఆగ్రహం వ్యక్తం చెయ్యరా? ఆ ఆగ్రహం తమ కన్నీళ్లంత వేడిగాను తమ ప్రేమ అంత తీవ్రం గాను ఉండదా? బాధపడే ప్రతీ వారితో దేవుని బిడ్డ బాధపడ్డాడు. నశిస్తున్న తమ తోటి మానవులికి చెయ్యి చాపి సహాయం చెయ్యనివారు ప్రభువు పరిశుద్ధ అగ్రహాన్ని రేపుతారు. ఇది గొర్రెపిల్ల ఉగ్రత. క్రీస్తుతో తమకు సహవాసమున్నదని చెప్పుకుంటూ సాటి మనుషుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే ఆ తీర్పుదినాన ఆయన ఈ ప్రకటన చేస్తాడు, “ఈ రెక్కడి వారో మిమ్మును ఎరుగును. అక్రమముచేయు వారందరు నా యొద్దనుండి తొలగిపొండి” లూకా 13:27.DATel 932.4

    తన శిష్యులకిచ్చిన ఆజ్ఞలో వారికి తమ కర్తవ్యాన్ని కాదు వర్తమానం కూడా క్రీస్తు ఇచ్చాడు. “నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనుటకు” ప్రజలకి బోధించండి అని చెప్పాడు. శిష్యులు క్రీస్తు తమకు బోధించిన వాటిని ప్రజలకి బోధించాల్సి ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా చెప్పిన సంగతుల్నే కాదు పాతనిబంధన ప్రవక్తలందరి ద్వారాను బోధకులందరి ద్వారాను తాను బోధించిన సంగతుల్ని కడా ఆయన ఇక్కడ సూచిస్తోన్నాడు. మానవ బోధను ఇందులో చేర్చలేదు. సంప్రదాయానికి, మానవ సిద్ధాంతాలు తీర్మానాలికి లేక సంఘ నిబంధనలకి చోటు లేదు. మతాధికారం నిర్దేశించిన నిబంధనలేవీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలో లేవు. వీటిని క్రీస్తు సేవకులు బోధించకూడదు. “ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములు” ఆయన సొంతమాటలు, క్రియలు, ఇవి లోకానికి అందించడానికి శిష్యులు పొందిన కలిమి. క్రీస్తు నామమే వారి నినాదం వారి గుర్తింపు చిహ్నం, వారి సమైక్యతా బంధం, వారి కార్యాచరణకు అధికారం, వారీ విజయానికి మూలం. ఆయన పైరాత లేనిదేదీ ఆయన రాజ్యంలో గుర్తింపు పొందదు.DATel 933.1

    సువార్తను ఒక నిర్జీవ సిద్ధాంతంగా కాక జీవితాన్ని మార్చే సజీవ శక్తిగా అందించాలి. తన కృపను అందుకున్నవారు దాని శక్తికి సాక్షులుగా నివసించాలని దేవుడు కోరుతున్నాడు. తన దృష్టిలో హేయంగా నడుచుకుంటున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. వారు పశ్చాత్తాపపడినప్పుడు తన ఆత్మను వారికిస్తాడు, వారిని ఉన్నత బాధ్యతలు గల స్థానాల్లో పెడతాడు, తన అనంత కృపను ప్రచురించడానికి వారిని తనకు అపనమ్మకంగా ఉన్నవారి మధ్యకు పంపుతాడు. తన కృపద్వారా మనుషులు క్రీస్తు వంటి ప్రవర్తనను కలిగి నివసిస్తూ ఆయన ప్రేమ తమకున్నదన్న నిశ్చయతలో ఆనందించవచ్చన్న దానికి తన సేవకులు సాక్షులు కావాలని ఆయన అభిలషిస్తోన్నాడు. మానవజాతిని తిరిగి సంపాదించే తన కుమారులు కుమార్తెలుగా వారికి తమ పరిశుద్ధ ఆధిక్యతల్ని పునరుద్ధరించే వరకు ఆయన తృప్తి పడడన్న వాస్తవానికి మనం సాక్షులం కావాలని ఆయన కోరిక.DATel 933.2

    కాపరి కరుణ, తల్లి ప్రేమ, దయామయుడైన రక్షకుని నిరుపమాన కృప క్రీస్తులో ఉన్నాయి. మనసుల్ని దోచుకునే రీతిగా ఆయన తన దీవెనల్ని సమర్పిస్తాడు. ఈ దీవెనల్ని కేవలం ప్రకటించడంతోనే తృప్తి చెందడు. వాటిని కావాలని కోరుకునే విధంగా ఆకర్షణీయంగా సమర్పిస్తాడు. అలాగే ఆయన సేవకులు వచింపశక్యం గాని ఈ వరం మహిమను లోకానికి సమర్పించాలి. కేవలం సిద్ధాంతాల పునరుచ్చరణ నిర్ధరకమైనప్పుడు క్రీస్తు అద్భుత ప్రేమ హృదయాల్ని కరిగించి వాటిని ఆకర్షిస్తుంది, వశపర్చుకుంటుంది. “మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా - నా జనులను ఓదార్చుడి. ఓదార్చుడి” “ఓ సీయోనూ, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరుషలేమూ సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి - ఇదిగో నా దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము... గొట్టెల కాపరివలె ఆయన తన మందను మేపును తన బహువుతో గొట్టెల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును.” యెష 40:1, 9-11. “పదివేల మందిలో గుర్తింప” గలిగినంత శ్రేష్టుడు “అతికాంక్షణీయుడు” అయిన ప్రభువును గూర్చి ప్రజలకు చెప్పండి. (పరమగీతములు 5:10, 16) కేవలం మాటలే చెప్పలేవు. ప్రవర్తనలో ఆయన్ని ప్రతిబింబించండి. జీవితంలో ఆయన్ని ప్రదర్శించండి. తన చిత్రపటం గీయించుకునేందుకు క్రీస్తు తన ప్రతీ శిష్యుడిలోను కూర్చుని ఉన్నాడు. “తన కుమారునితో సారూప్యము గలవారగుటకు” ప్రతీ వారిని దేవుడు ముందుగా నిర్ణయించాడు. (రోమా 8:29). క్రీస్తు దీర్ఘశాంతపూరిత ప్రేమ, ఆయన పరిశుద్ధత, సాత్వికం, కృప, సత్యం ప్రతీవారిలోను ప్రపంచానికి ప్రదర్శితం కావాలి.DATel 934.1

    మొదటి శిష్యులు వాక్యం ప్రకటిస్తూ ముందుకువెళ్లారు. తమ జీవితాల్లో క్రీస్తుని వెల్లడించారు. “వెను వెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన” ప్రభువు వారితో కలిసి పనిచేశాడు. మార్కు 16:20. ఈ శిష్యులు తమ సేవకోసం సిద్ధపడ్డారు. పెంతెకొస్తు దినానికి ముందు తమ మనసుమర్థనల్ని భేదాల్ని విడిచిపెట్టి అందరూ సమావేశమయ్యారు. ఇప్పుడు అందరిదీ ఒకే మనసు. మేలు కలుగుతుందన్న క్రీస్తు వాగ్దానాన్ని వారు నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేశారు. వారు తమకే మేలు కలగాలని ప్రార్థించలేదు. ఆత్మల రక్షణ భారంతో వారి హృదయాలు బరువెక్కాయి. సువార్త లోకంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. కనుక క్రీస్తు వాగ్దానం చేసిన శక్తిని వారు ఆకాంక్షించారు. అప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. ఒక్కరోజే వేలాదిమంది క్రీస్తునంగీకరిస్తూ మత మార్పిడి చేసుకున్నారు.DATel 935.1

    ఇది ఇప్పుడు కూడా జరగవచ్చు. మానవుడి ఊహాగానాల బదులు దేవుని వాక్యాన్ని ప్రకటించండి. క్రైస్తవులు తమ భేదాల్ని పక్కన పెట్టి ఆత్మల రక్షణ సేవకు తమ్మును తాము అంకితం చేసుకోవాలి. వారు విశ్వాసంతో దీవెనలకోసం ప్రార్థిస్తే వాటిని పొందుతారు. అపొస్తలుల దినాల్లో జరిగిన పరిశుద్ధాత్మ కుమ్మరింపు “తొలకరి వర్షము.” ఫలితం అద్భుతం, మహిమాన్వితం. కాని “కడవరి వర్షము” మరింత సమృద్ధిగా ఉంటుంది. యోవేలు 2:23.DATel 935.2

    ఆత్మ శరీరం జీవాన్ని దేవునికి సమర్పించుకునే వారందరూ నూతన శారీరక మానసిక శక్తిని నిత్యం పొందుతుంటారు. కొరవడడమంటూ లేని పరలోక వనరులు వారి ఆధీనంలో ఉంటాయి. క్రీస్తు తన ఊపిరిలో ఊపిరిని, తన జీవంలో జీవాన్ని వారికిస్తాడు. హృదయంలోను మనసులోను పనిచెయ్యడానికి పరిశుద్ధాత్మ తన అత్యున్నత శక్తిని వినియోగిస్తాడు. దేవుని కృప వారి మానసిక శక్తుల్ని విశాలపర్చి వృద్ధిపర్చుతుంది. ఆత్మల రక్షణ పరిచర్యలో దైవస్వభావ సంపూర్ణత వారికి తోడ్పడుతుంది. క్రీస్తుతో సహకరించడం ద్వారా వారు ఆయన యందు పరిపూర్ణులవుతారు. అంతట వారు సర్వశక్తుని క్రియలు చెయ్యడానికి సమర్థత పొందుతారు.DATel 935.3

    రక్షకుడు తన కృపను ప్రదర్శించి ప్రపంచంపై తన ముద్రను వేయాలని కోరుకుంటున్నాడు. లోకం ఆయన కొని సంపాదించుకున్న ఆస్తి. మనుష్యుల్ని స్వతంత్రులుగాను పవిత్రులుగాను పరిశుద్ధులుగాను తీర్చిదిద్దాలని ఆయన అభిలషించాడు. ఈ కార్యానికి సాతాను ఎన్నో ప్రతిబంధకాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నా లోకం నిమిత్తం క్రీస్తు చిందించిన రక్తం ద్వారా దేవుని గొర్రెపిల్లకు మహిమతెచ్చే విజయాలు సాధించాల్సి ఉంది. విజయం సంపూర్తి అయ్యేవరకు క్రీస్తు తృప్తి చెందడు. “అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి చెందును” యెష 53:11. లోక రాజ్యా లన్నీ ఆయన కృపా సువార్తను వింటాయి. ఆయన కృపను అందరూ అంగీకరించరు. అయితే “ఒక సంతతివారు ఆయనను సేవించెదరు. రాబోవుతరమునకు ప్రభువును గూర్చి వివరింతురు” కీర్త 22:30. “ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్యమహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును.” “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును.” “పడమటి దిక్కునున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు” దాని 7:27, యెష 11:9, 59, 19.DATel 936.1

    “సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.... యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీత గానమునము చేయుడి, యెహోవా తన జనులను ఆదరించెను .... యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచియున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణను చూచెదరు. యెష 52:7-10.DATel 936.2