Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    74—గెత్సెమనే

    శిష్యులతో కలిసి రక్షకుడు నెమ్మదిగా గెత్సెమనే తోటకు వెళ్తున్నాడు. అది పస్కారాత్రి. మబ్బులేని ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తోన్నాడు. యాత్రిక గుడారాలతో నిండిన పట్టణం సద్దుమణిగి నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.DATel 771.1

    క్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ వారికి ఉపదేశం ఇస్తున్నాడు. అయితే గెత్సేమనె దగ్గరకు వచ్చేసరికి ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. ప్రార్థనకి ధ్యానానికి ఆయన ఈ స్థలానికి తరచుగా వచ్చేవాడు. కాని ఆయన బాధాకరమైన ఈ చివరి రాత్రి ఉన్నంత విచారంగా దుఃఖక్రాంతంగా ఎన్నడూలేడు. లోకంలో ఆయన నివసించిన కాలమంతా దేవుని సన్నిధికాంతిలో నడిచాడు. సాతాను ప్రేరిత మనుషులతో సంఘర్షణ ఏర్పడ్డప్పుడు, “నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు. ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచి పెట్టలేదు” అనేవాడు. యోహా 8:29. కాని ఇప్పుడు దేవుని సన్నిధికాంతికి దూరమైనట్లు కనిపించింది. ఇప్పుడు ఆయన పాపుల్లో ఒకడుగా లెక్కించబడ్డాడు. పతనమైన మానవాళి అపరాధాన్ని ఆయన భరించాలి. పాపమెరుగని ఆయన మీద మనందరి దోషం మోపబడాల్సి ఉంది. పాపం ఆయనకు ఎంతో భయంకరంగా కనిపిస్తోంది. ఆయన భరించాల్సిన పాపం ఎంత భారమైందంటే అది తన తండ్రి ప్రేమకు తనను నిరంతరం దూరంగా ఉంచుతుందేమోనని ఆయన భయపడ్డాడు. అతిక్రమమంటే దేవునికి ఎంత ఆగ్రహమో తెలిసిన ఆయన “మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది” అన్నాడు.DATel 771.2

    తోటను సమీపించినప్పుడు తమ ప్రభువు ముఖంలో కలిగిన మార్పును శిష్యులు గుర్తించారు. అంత విచారంగా, నిశ్శబ్దంగా ఆయన ఉండడం వారు ఎన్నడూ చూడలేదు. ఆయన ముందుకి వెళ్లేకొద్దీ ఈ విచారం తీవ్రమయ్యింది. అయినా దానికి కారణమేంటని వారు ఆయన్ని అడగడానికి జడిశారు. ఆయన అటూఇటూ ఊగుతూ పడిపోడానికి సిద్ధంగా ఉన్నట్లు నడుస్తున్నాడు. తోటలోకి వెళ్లిన తర్వాత తమ ప్రభువు విశ్రమించడానికి ఆయన సాధారణంగా వెళ్లే స్థలం కోసం శిష్యులు ఆందోళనగా వెదకుతున్నారు. ఆయన ఇప్పుడు వేస్తున్న ప్రతీ అడుగూ కష్టంగా పడుతోంది. ఆయన గొప్పభారం ఒత్తిడివల్ల బాధతో మూలుగుతున్నట్లు కనిపించింది. రెండుసార్లు శిష్యులు ఆయన్ని పట్టుకున్నారు, లేకపోతే నేలకు కూలిపోయేవాడే.DATel 772.1

    తోట ద్వారానికి కొంచెం దూరంలో యేసు ముగ్గురు తప్ప తక్కిన శిష్యుల్ని ప్రార్ధన చెయ్యమని చెప్పి అక్కడ విడిచిపెట్టాడు. పేతురు యాకోబు యోహానులతో ఆ తోటలోని ఏకాంత స్థలానికి వెళ్లాడు. ఈ ముగ్గురూ క్రీస్తుకి సన్నిత మిత్రులు. రూపాంతర పర్వతంపై వీరు ఆయన మహిమను చూశారు. ఆయనతో మోషే ఏలీయాలు మాట్లడడం చూశారు. పరలోకం నుంచి వచ్చిన స్వరాన్ని విన్నారు. ఇప్పుడు తన గొప్ప పోరాటంలో వీరు తన దగ్గర ఉండాలని ఆకాంక్షించాడు. ” తరచు వీరు ఈ ఏకాంత స్థలంలో ఆయనతో కలిసి ఒక రాత్రి గడిపేవారు. ఈ సమయాల్లో కొంత సేపు మెళుకువగా ఉండి ప్రార్థనచేసి ఆయనకి కొంత దూరంలో ఉదయం ఆయన లేపేవరకూ ప్రశాంతంగా నిద్రపోయేవారు. అయితే ఇప్పుడు రాత్రంతా తనతో ప్రార్థనలో గడపవలసిందిగా వారినికోరాడు. అయినప్పటికీ తన హృదయవేదనను వారు కూడా చూడకూడదని తలంచి, “మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగానుండుడి” అని చెప్పాడు.DATel 772.2

    వారి నుంచి కొంచెం దూరం వెళ్లాడు. ఎక్కువ దూరం కాదు. వారు ఆయన్ని చూడగలిగినంత దూరమది. ఆయన నేలమీద సాగిలపడ్డాడు. పాపం వల్ల తాను తండ్రి నుంచి వేరవుతానేమోనని భయపడ్డాడు. మధ్య అగాధం ఎంతో విశాలం, ఎంతో లోతు, ఎంతో చీకటిగా ఉన్నది. దాని ముందు ఆయన ఆత్మ గజగజ వణికింది. ఆ వేదనను తప్పించుకోడానికి ఆయన తన దివ్యశక్తిని వినియోగించకూడదు. మానవ పాప పర్యవసానాన్ని ఆయన మానవుడిగా భరించాలి. అతిక్రమంపట్ల దేవుని ఉగ్రతను ఆయన మానవుడిగా భరించాలి.DATel 772.3

    క్రీస్తు ఇప్పుడు ఇంతకు ముందుకంటే వేరేస్థాయిలో నిలబడి ఉన్నాడు. ఆయన బాధను ప్రవక్త మాటల్లో బాగా వర్ణించవచ్చు, “ఖడ్గమా, నా గొట్టెల కాపరివాదను నా సహకాపరి మిదను పడుము ఇదే సైన్యముల కధిపతియగు యెహోవా వాక్కు” జెక 13:7. పాప మానవుడికి మారుగాను జామీనుగాను క్రీస్తు దైవన్యాయపాలిక కింద శిక్షననుభవిస్తున్నాడు. న్యాయమంటే ఏమిటో చూశాడు. ఇప్పటివరకు ఇతరుల కొరకు విజ్ఞాపకుడిగా వ్యవహరించాడు. ఇప్పుడు తన పక్షంగా విజ్ఞాపకుడి కోసం ఆకాంక్షిస్తోన్నాడు.DATel 773.1

    తండ్రితో తన ఏకత్వం విచ్ఛిన్నమయ్యిందని క్రీస్తు భావిస్తుండగా, తన మానవ స్వభావంతో చీకటి శక్తులతో రానున్న తన పోరాటాన్ని తట్టుకోలేమోనని భయపడ్డాడు. శోధనారణ్యంలో మానవజాతి భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. క్రీస్తు అప్పుడు విజేత. శోధకుడు ఇప్పుడు చివరి భయంకర పోరాటానికి వచ్చాడు. క్రీస్తు మూడు సంవత్సరాల పరిచర్య కాలంలో దీని కోసం అతడు సిద్ధపడ్డాడు. అంతా ప్రమాదంలో ఉంది. ఆయన ఇక్కడ పరాజయం పొందితే పరలోక రాజ్యపాలన నిరీక్షణ వ్యర్ధమవుతుంది. లోక రాజ్యాలు తుదకు క్రీస్తు రాజ్యాలవుతాయి. ఆయనే కూలిపోవడం తోసివేయబడడం జరుగుతుంది. కాని క్రీస్తు విజయం సాధిస్తే ఈ లోకం సాతాను రాజ్యమవుతుంది. మానవజాతి నిత్యం అతని అధికారం కింద ఉంటుంది. సంఘర్షణలోని అంశాలు తన ముందుండడంతో దేవుని నుంచి ఎడబాటు కలుగుతుందన్న భయం క్రీస్తు ఆత్మను నింపింది. పాపలోకానికి జామీనుగా ఉంటే దేవునితో తన ఎడబాటు నిత్యకాలికమైందని సాతాను క్రీస్తును హెచ్చరించాడు. తనను సాతాను రాజ్యసభ్యుడుగా తండ్రి పరిగణిస్తాడని తాను ఎన్నటికి దేవునితో ఏకమవ్వడం సాధ్యపడదని చెప్పాడు.DATel 773.2

    ఈ ఆత్మత్యాగం సాధించేదేమిటి? మనుషుల దోషం, కృతఘ్నత ఎంత ఘోరంగా కనిపిస్తోన్నాయి! చాలా కటువైన విషయాలతో పరిస్థితిని విమోచకుని మీదికి తిప్పాడు: లౌకికమైన ఆధ్యాత్మికమైన విషయాల్లో అందరికన్నా అధికులమని చెప్పేవారు నిన్ను నిరాకరించారు. ప్రత్యేక జనాంగంగా దేవుడు తమకు చేసిన వాగ్దానాలకు పునాది, కేంద్రం, ముద్ర అయిన నిన్ను నాశనం చెయ్యడానికి వారు ప్రయత్నిస్తున్నారు. నీ ఉపదేశాన్ని విన్నవాడు, సంఘ కార్యకలాపాల్లో ముందున్న వారిలో ఒకడు అయిన నీ సొంత శిష్యుడొకడు నిన్ను అప్పగించబోతున్నాడు.. నీ వీరానుచరుల్లో ఒకడు నిన్ను ఎరుగనుగాక ఎరుగనని బొంకుతాడు. నిన్ను అందరూ విడిచిపెట్టె వెళ్లిపోతారు. ఆ తలంపుని క్రీస్తు నిలువెల్లా అసహ్యించుకున్నాడు. తాను రక్షించాలని పూనుకున్నవారు, తాను ఎంతో ప్రేమించిన వారు సాతాను కుట్రలో భాగస్వాములన్నది ఆయన ఆత్మను చీల్చింది. సంఘర్షణ భయంకరమైంది. సమస్యకు కారణం తన జాతి అపరాధం, నిందారోపకులు, మిత్రద్రోహి అపరాధం, దుర్మార్గంలో పడి ఉన్న లోకం అపరాధం. మనుషుల పాపాలు క్రీస్తును బహుగా దుఃఖపర్చాయి. పాపం పట్ల దేవుని ఉగ్రతను గూర్చిన తలంపు ఆయన్ని క్షోభింపజేస్తోంది.DATel 773.3

    మానవాత్మ చెల్లించాల్సిన మూల్యాన్ని గురించి ఆలోచిస్తోన్న ఆ ప్రభువుని వీక్షించండి. దేవునికి ఇంకా దూరం కావడం నివారించడానికా అన్నట్లు ఆయన బాధతో నేలపై సాగిలపడి ఉన్నాడు. అలాపడి ఉన్న ఆయనపై చల్లని మంచుపడుతోంది. ఆయన దాన్ని లెక్కచెయ్యలేదు. ఆయన బలహీన పెదవుల్నుంచి ఈ మాటలు వచ్చాయి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్దనుండి తొలపోనిమ్ము” “అయినను నా యిష్ట ప్రకారముకాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము.DATel 774.1

    బాధలో మానవ హృదయం సానుభూతిని ఆశిస్తుంది. ఈ ఆశ క్రీస్తులో కూడా చోటుచేసుకుంది. తీవ్ర హృదయ వేదనతో తన శిష్యుల వద్దకు వచ్చాడు. తరచు తాను దీవించి ఓదార్చిన ఆ శిష్యుల నోటి నుంచి ఓదార్పు మాటలు వినాలని ఆశతో వచ్చాడు. తమకు నిత్యం దయగల మాటలు చెప్పే ఆ ప్రభువు ఇప్పుడు గుండెకోతను అనుభవిస్తోన్నాడు. వారు తన కోసం తమ సొంత ఆత్మల కోసం ప్రార్థన చేస్తుండడం చూడాలని ఆశించాడు. పాపం ఎంత నీచమైనది! దేవుని ముందు తాను నిరపరాధిగా నిలిచి మానవాళిని తన పాపపర్యవసానాల్ని అనుభవించడానికి విడిచి పెట్టేద్దాంDATel 774.2

    అన్న శోధన బలంగా వచ్చింది. దీన్ని తన శిష్యులు గ్రహించి అభినందిస్తే ఆయనకు బలం చేకూరుతుంది.DATel 774.3

    చాలా శ్రమతో పైకి లేచి తన శిష్యుల్ని విడిచిపెట్టిన స్థలానికి తూలుతూ నడిచి వెళ్లాడు. అయితే “వారు నిద్రించుట” చూశాడు. వారు ప్రార్ధించడం చూసి ఉంటే ఆయనకు కొంత ఉపశమనం కలిగేది. వారు దేవుని యందు ఆశ్రయం కోరి ఉంటే సాతాను శక్తులు వారిని జయించి ఉండేవి కావు. వారి స్థిర విశ్వాసం వల్ల ఆయనకు తృప్తి కలిగేది. “మెలకువగా ఉండి ప్రార్ధన చేయుడి” అంటూ ఆయన పదే పదే చేసిన హెచ్చరికను వారు పాటించలేదు. సాధారణంగా ప్రశాంతంగా, గంభీరంగా ఉండే తమ ప్రభువు దుఃఖంతో కుమిలిపోవడం మొదట్లో చూశారు. ఆ దుఃఖం దేనికో వారికి అర్ధంకాలేదు. ఆయన బాధపడూ వేస్తున్న కేకలు వింటూ వారు ప్రార్ధన చేశారు. తమ ప్రభువుని విసర్జించడం వారి ఉద్దేశం కాదు. కాని వారిని ఒక విధమైన స్తబ్దత ఆవరించింది. వారు దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లయితే దాన్ని వారు అధిగమించగలిగేవారు. శోధనను జయించడానికి మెలకువగా ఉండి ప్రార్ధించడం అవసరమని వారు గుర్తించలేదు. తోటలో అడుగుపెట్టకముందు యేసు శిష్యులతో “ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు” అన్నాడు. తనతో కలిసి చెరసాలకు చివరికి మరణానికి కూడా వెళ్లడానికి సిద్ధమని వారందరూ ఘంటాకంఠంగా చెప్పారు. ఆత్మ సమృద్ధత ఎక్కువగా ఉన్న పేతురు ఇలా అన్నాడు. “అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతర పడను” మార్కు 14:27, 29. శిష్యులు తమ సొంత శక్తిని నమ్ముకున్నారు. క్రీస్తు చెప్పినట్లు శక్తిమంతుడైన సహాయకుడి చేయూతను వారు కోరలేదు. ఈ రకంగా రక్షకుడికి వారి సానుభూతి ప్రార్ధనలు అవసరమైనప్పుడు వారు నిద్రమత్తులో మునిగిపోయారు. పేతురు సయితం నిద్రపోతోన్నాడు.DATel 774.4

    యేసు రొమ్మున ఆనుకొని ఉన్న ప్రియ శిష్యుడు యెహాను కూడా నిద్రిస్తోన్నాడు. చెప్పాలంటే ప్రభువు పట్ల యోహానుకున్న ప్రేమను బట్టి అతడు మెళకువగా ఉండాలి. తన ప్రియమైన రక్షకుని తీవ్ర దుఃఖ గడియల్లో తన ప్రార్ధనలు ఆయన ప్రార్ధనతో సంయుక్త కావలసింది. తన శిష్యుల విశ్వాసం స్థిరంగా ఉండేందుకు రక్షకుడు రాత్రంతా ప్రార్ధన చేస్తూ ఎన్నో రాత్రులు గడిపేవాడు. యాకోబు యోహానులికి “నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ” అని ఒకప్పుడు తాను వేసిన ప్రశ్నను యేసు ఇప్పుడు వేస్తే “త్రాగగలము” అని చెప్పడానికి వారెవ్వరూ సాహసించరు. మత్త 20:22.DATel 775.1

    యేసు స్వరం విని శిష్యులు మేల్కొన్నారు. కాని ఆయన్ని సరిగా గుర్తించలేకపోయారు. హృదయ వేదన వల్ల ఆయన ముఖం ఎంతో మారిపోయింది. పేతురుని సంబోధిస్తూ యేసు ఇలా అన్నాడు, “సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియైనను మేలుకొనియుండలేవా? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్ధన చేయుడి; ఆత్మ సిద్ధమేగాని శరీరము బలహీనమని పేతురుతో” అన్నాడు. శిష్యుల బలహీనత యేసుకి సానుభూతి పుట్టించింది. తన అప్పగింతకు మరణానికి సంబంధించి తమకు వచ్చే పరీక్షల్లో వారు నిలబడలేరేమోనని ఆయన భయపడ్డాడు. వారిని మందలించలేదు గాని వారికి ఈ హితవు పలికాడు, “మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి” తీవ్రమైన బాధలో సయితం “ఆత్మ సిద్ధమేగాని శరీరము బలహీనము” అంటూ వారి బలహీనతను క్షమించడానికి చూస్తున్నాడు.DATel 776.1

    దైవకుమారునికి మళ్లీ మానవాతీతమైన హృదయ వేదన కలిగింది. అలసిపోయి తూలుతూ లోగడ తనకు వేదన కలిగిన స్థలానికి వెళ్ళాడు. తన ఆత్మను వేధిస్తున్న బాధవల్ల “ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువులవలె ఆయెను.” ఆయన మౌనంగా భరించిన గుండెకోతకు పక్కనున్న దేవదారు చెట్లు గొంజి చెట్లు సాక్షులు. తన సృష్టికర్త అంధకార శక్తులతో ఒంటరిగా సల్పుతున్న పోరాటంలో పడున్న బాధకు ప్రకృతి కన్నీరు కార్చుతున్నట్లు ఆ చెట్ల కొమ్మల ఆకులనుంచి మంచు బొట్లు ఆయన పై పడ్తున్నాయి. కొద్ది కాలం క్రితం తన మీద విరుచుకుపడ్డ వ్యతిరేకతా తుపానుని తట్టుకుంటూ యేసు బలమైన దేవదారు వృక్షంలా నిలబడ్డాడు. మొండి మనసులు ద్వేషం కపటంతో నిండిన హృదయాలు ఆయన్ని గందరగోళపరచి జయించటానికి ప్రయత్నించాయి. దేవుని కుమారుడుగా ఆయన దివ్యఠీవితో నిలిచాడు. అయితే ఇప్పుడు భయంకర తుపాను ఇటూ అటూ కొడుతున్న రెల్లులా ఉన్నాడు. ప్రతీ మెట్టువద్ద చీకటి శక్తులపై విజయాన్ని సాధిస్తూ విజేతగా తన కర్తవ్య సాఫల్యాన్ని సమీపించాడు. అప్పుడు మహిమపొంది ఉన్న ఆయన దేవునితో ఏకత్వాన్ని కోరాడు. తడబడని స్వరంతో స్తుతిగీతాలు ఆలపించాడు. శిష్యులికి ధైర్యం చెబుతూ ప్రేమపూర్వకంగా మాట్లాడాడు. ఇప్పుడు చీకటి అధికారానికి సమయం వచ్చింది. ఆ సాయంత్ర వాతావరణంలో ఇప్పుడు వినిపిస్తున్న ఆయన స్వరం విజయోత్సాహ స్వరం కాదు, బాధతో నిండిన మానవ స్వరం. రక్షకుని ఈ మాటలు నిద్ర బద్ధకంతో ఉన్న శిష్యులికి వినిపించాయి. ” నాతండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని యిది నా యొద్దనుండి తొలగిపోవుట సాధ్యము కాని యెడల, నీ చిత్తమే సిద్ధించుగాక.”DATel 776.2

    శిష్యులికి వెంటనే ఆయన వద్దకు వెళ్లాలన్న తలంపు వచ్చింది. కాని వారు అక్కడే మెలకువగా ఉండి ప్రార్థించవలసిందిగా రక్షకుని ఆదేశం. యేసు వారి వద్దకు వచ్చినప్పుడు వారింకా నిద్రించే ఉన్నారు. సహవాసానికి, తనను ఆవరించిన, దాదాపు తన్ను జయించిన చీకటిని పరాదోలే కొన్ని మాటల కోసం తన శిష్యుల నుంచి మళ్లీ ఎదురు చూశాడు. అయితే వారు గాఢ నిద్రలో ఉన్నారు. “ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు.” ఆయన సన్నిధి వారిని మేల్కొలిపింది. ఆయన ముఖం మీద రక్తపు చెమటను చూసి భయపడ్డారు. ఆయన మానసిక వేదనను వారు గ్రహించలేకపోయారు. “మనిషి రూపము కంటె అతని ముఖమును, నరరూపము కంటె అతని రూపమును చాల వికారము.” యేష 52:14.DATel 777.1

    అక్కడనుంచి వెళ్లిపోయి యేసు మళ్లీ తన విడిది స్థలానికి వెళ్లి ఆ ప్రగాఢమైన చీకటిలో నేలపై సాగిలపడ్డాడు. ఆ దుర్భర ఘడియలో దైవకుమారుని మానవత్వం వణికింది. ఇప్పుడు తన శిష్యుల విశ్వాసం బలంగా ఉండాలని ఆయన ప్రార్ధన చెయ్యలేదు. శోధనకు గురిఅయి వేదనతో నిండిన తన ఆత్మను గురించి ప్రార్ధన చేశాడు. ఆ భయంకర గడియ వచ్చింది. అది లోకం భవిష్యత్తును నిర్ణయించే గడియ. మానవజాతి భవితవ్యం త్రాసులో అస్థిరంగా వేలాడ్తోంది. దోషి అయిన మానవుడికి నిర్ణయించిన గిన్నెలోనిది తాగడానికి క్రీస్తు ఇప్పుడు కూడా నిరాకరించవచ్చు. దానికి సమయం ఇంకా మించిపోలేదు. తన ముఖానికి పోసిన రక్తపు చెటని తుడిచివేసుకుని మానవుణ్ని తన అతిక్రమంలో నశించడానికి విడిచిపెట్టి తన దారిని తాను వెళ్లిపోవచ్చు. దోషిని తన అతిక్రమానికి శిక్ష అనుభవించనియ్యి, నేను తిరిగి నా తండ్రి వద్దకు వెళ్లిపోతాను అని ఆయన అనవచ్చు. దైవకుమారుడు ఆ అవమానం వేదనతో నిండిన ఆ గిన్నెలోనిది తాగుతాడా? అపరాధిని రక్షించడానికి నిరుపరాధి పాపశాప పర్యవసానాల్ని భరిస్తాడా? యేసు పెదవుల నుంచి “నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని యిది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించుగాక” అన్నమాటలు వెలువడ్డాయి.DATel 777.2

    ఆ ప్రార్థన ఆయన మూడుసార్లు చేశాడు. మూడుసార్లు సర్వోన్నత త్యాగానికి మానవత్వం వెనకడుగు వేసింది. ఇప్పుడు మానవజాతి చరిత్ర విమోచకుని ముందుకు వచ్చింది. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే వారు అలా ఉంటే వారు నశించడం తప్పదని ఆయన చూశాడు. మానవుడి అశక్తతను చూశాడు. పాపానికున్న శక్తినీ చూశాడు. నశిస్తోన్న లోకం బాధలు దుఃఖాలు ఆయన కళ్లముందు నిలిచాయి. లోకం మీదికి వస్తున్న నాశనాన్ని చూశాడు. అంతట ఆయన తన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తాను ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా మానవుల్ని రక్షించాలని తీర్మానించుకున్నాడు. నశిస్తోన్న కోట్లాది ప్రజలు తన ద్వారా రక్షణ పొందేందుకు తన రక్త బాప్తిస్మానికి ఆయన సమ్మతించాడు. అంతా పవిత్రత సంతోషం, మహిమ నిత్యం ఉండే పరలోకాన్ని విడిచి పెట్టి, తప్పిపోయిన ఒక గొర్రెని అనగా అతిక్రమం వల్ల పడిపోయిన ఒక్క లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన తన కర్తవ్యం నుంచి వెనుదిరిగే ప్రసక్తి లేదు. ఇచ్ఛతో పాపం చేసిన మానవ జాతికి ఆయన ప్రాయశ్చిత్తం అవుతాడు. “నేను దీనిని త్రాగితేనే గాని యిది నా యొద్దనుండి తొలగిపోవుట సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించుగాక” అన్న ప్రార్ధన తన్నుతాను సమర్పించుకోడాన్ని సూచిస్తున్నది.DATel 778.1

    ఆ తీర్మానాన్ని చేసుకున్న తర్వాత ఆయన మరణిస్తూ నేలమీద పడి దాని నుంచి పాక్షింగా లేచాడు. మూర్చపోతున్న తమ ప్రభువు తలకింద చేతులుంచి, మానవుల ముఖంకన్నా ఎక్కువ పాడైన ఆయన ముఖాన్ని కడగడానికి తన శిష్యులు ఎక్కడున్నారు? రక్షకుడు ద్రాక్షారసం గానుగను ఒంటరిగా ఆడాడు. ప్రజలెవ్వరూ ఆయనతో లేరు.DATel 778.2

    అయితే తన కుమారునితో పాటు దేవుడు శ్రమననుభవించాడు. రక్షకుడు పడ్డ శ్రమల్ని దేవదూతలు వీక్షించారు. వేలాదిమంది సాతాను అనుచరులు ఆయనను చుట్టుముట్టడం, ఆయన మానవ స్వభావం అజ్ఞాతమైన భయంతో వణకడం చూశారు. పరలోకంలో మౌనం చోటు చేసుకుంది. వీణెలు మోగలేదు. తండ్రి తన కాంతి కిరణాల్ని ప్రేమను మహిమను తన ప్రియ కుమారుడి నుంచి వేరుచెయ్యడం మౌన దుఃఖంతో అత్యంత విస్మయంతో వీక్షిస్తున్న దేవదూతల్ని మానవులు చూడగలిగి ఉంటే, దేవునికి పాపమంటే ఎంత హేయమో అవగాహన చేసుకోగలుగుతారు.DATel 779.1

    పోరాటం సమప్తానికి వస్తున్నప్పుడు పాపరహిత లోకాల నివాసులు, పరలోకదూతలు ప్రగాఢమైన ఆసక్తితో వీక్షించారు. విమోచన కార్యనిర్వహణలోని ఈ క్లిష్ట పరిస్థితిని సాతాను అతడి దుష్ట సహచరుల కూటమి, భ్రష్ట ప్రజా సమూహాలు ఆసక్తిగా పరిశీలించాయి. క్రీస్తు ముమ్మారు చేసిన ప్రార్థనకి ఏమి జవాబు వస్తుందోనని మంచి చెడు శక్తులు ఉత్కంఠంతో కని పెట్టాయి. బాధపడున్న ప్రభువుకి ఉపశమనాన్ని అందించాలని దేవదూతలు ఆశిస్తోన్నారు. కాని అది సాధ్యపడకపోవచ్చు. దైవకుమారునికి తప్పించుకునే మార్గం లేదు. ఈ భయంకరగడియలో అంతా ప్రమాదకరంగా కనిపిస్తున్న తరుణంలో, మర్మపూరితమైన ఆ గిన్నె బాధితుని చేతిలో వణుకుతున్న సమయంలో పరలోకం తెరుచుకుంది. దేవుని సన్నిధిలో నిలిచి ఉండే దూత, లూసీఫర్ స్థానంలో నియమితుడైన దూత క్రీస్తు పక్కకు వచ్చాడు. ఆ గిన్నెను క్రీస్తు చేతిలోనుంచి తీసుకోడానికి కాదు గాని దాన్ని తాగడానికి ఆయన్ని బలోపేతుణ్ని చెయ్యడానికి తన పట్ల తండ్రి ప్రేమను ధ్రువపర్చడానికి వచ్చాడు. ఆ దేవ మానవ వినతి దారునికి శక్తినివ్వడానికి ఆ దూత వచ్చాడు. తెరచి ఉన్న పరలోకం వైపు చూపిస్తూ, తన శ్రమల ఫలితంగా ఆత్మలు రక్షణ పొందుతాయని ఆయనకు చెప్పాడు. తన తండ్రి సాతాను కన్నా అధికుడని, శక్తిమంతుడని తన మరణం సాతానుకి భంగపాటు కలిగిస్తుందని, ఈ లోక రాజ్యం సర్వోన్నతుని భక్తులికి ఇవ్వబడుతుందని ఆయనకు చెప్పాడు. తన ఆత్మపడుతున్న క్షోభను ఆయన చూసి సంతోషిస్తాడని, ఎందుకంటే మానవాళిలో నుంచి గొప్ప జనసమూహం నిత్య రక్షణ పొందుతుందని ఆయనకు చెప్పాడు.DATel 779.2

    క్రీస్తు వేదన అంతం కాలేదు. కాని ఆయన్ని అలముకున్న విషాద వాతావరణం నిరాశ ఇక లేవు. తుపాను ఇంకా ఆగిపోలేదు. కాని ఎవర్ని నాశనం చెయ్యడానికి అది మొదలయ్యిందో ఆయన దాని ఉదృత్తిని తట్టుకోడానికి బలో పేతుడయ్యాడు. దాన్నుంచి ఆయన ప్రశాంతంగా, నిర్మలంగా బయటకొచ్చాడు. రక్తచారికలతో నిండిన ఆయన ముఖంపై పరలోక శాంతి నెలకొంది. ఏమానవుడూ ఎన్నడూ భరించని భరించలేని దాన్ని ఆయన భరించాడు. ఎందుకంటే ఆయన ప్రతీ మానవుడి కోసం మరణ బాధలను చవిచూశాడు.DATel 780.1

    రక్షకుని చుట్టూ ప్రకాశిస్తోన్న వెలుగుకు శిష్యులు హఠాత్తుగా మేల్కొన్నారు. నేలపై సాగిలపడి ఉన్న తమ ప్రభువుపై వంగి ఉన్న దేవదూతను చూశారు. ఆయన తలను నిలబెట్టి, దేవదూత పరలోకం వైపుకు చూపించడం చూశారు. ఆయనకు ఓదార్పు నిరీక్షణ కలిగే మాటలాడుతున్న దేవదూత సంగీతంలాంటి మధురమైన స్వరాన్ని విన్నారు. శిష్యులు రూపాంతర పర్వతం మిది దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. దేవాలయంలో యేసుని ఆవరించిన మహిమను మేఘంలోనుంచి మాట్లాడిన దేవుని స్వరాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే మహిమ మళ్లీ ప్రదర్శితమయ్యింది. ఇక శిష్యులికి తమ ప్రభువు విషయంలో ఎలాంటి భయంలేదు. ఆయన దేవుని కావుదలకింద ఉన్నాడు. ఆయన్ని కాపాడడానికి మహాశక్తి గల దేవదూత పరలోకం నుంచి వచ్చాడు. అలసిపోయి, శిష్యులు మళ్లీ ఆ వింతయిన మత్తులో మునిగిపోయారు. మళ్లీ వారు నిద్రించడం యేసు చూశాడు.DATel 780.2

    వారి వంక విచారంగా చూస్తూ యేసు ఇలా అన్నాడు, ” ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి; ఇదిగో ఆ గడియ వచ్చియున్నది; మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు.”DATel 780.3

    ఆయన ఈ మాటలు చెబుతుండగా ఆయన్ని వెదక్కుంటూ దొమ్మిగా వస్తున్న ప్రజల అడుగుల చప్పుడు వినిపిస్తోంది. ఆయన ఇలా అన్నాడు, “లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడు.”DATel 780.4

    తనను అప్పగించేవాడిని కలవడానికి ముందుకి అడుగు వేసినప్పుడు ఇటీవల ఆయన అనుభవించిన వేదన ఆనవాళ్ళు ఏమిలేవు. శిష్యులందరికి ముందు నిలబడి ఆయన “మీరెవరిని వెదకుచున్నారు?” అని అడిగినప్పుడు వారు “నజరేయుడైన యేసుని” అని బదులు పలికారు. “ఆయనను నేనే” అని యేసు ఉత్తరమిచ్చాడు. ఆయన ఈ మాటలు చెబుతుండగా పరలోకం నుంచి వచ్చిన దూత ఆయనకు ఆ గుంపుకు మధ్య నిలబడ్డాడు. రక్షకుని ముఖం దైవ కాంతితో ప్రకాశించింది. పావురం లాంటి ఒక ఆకారం ఆయనను కప్పింది. ఈ దైవ మహిమ సమక్షంలో, దొమ్మీగా వచ్చిన ఆ హంతక జనసమూహం ఒక్కక్షణం కూడా నిలువలేకపోయింది. వారు దారి తడుముకుంటూ వెనక్కి వెళ్లారు. యాజకులు, పెద్దలు, సైనికులు, యూదా సయితం చచ్చిన వారివలె నేలకుకూలారు.DATel 780.5

    వృద్ధులు వెనక్కి మళ్లారు. చురుకైన వారు పలాయనం చిత్తగించారు. యేసు తప్పించుకోడానకి అవకాశం ఉంది. కాని ఆయన ప్రశాంతంగా సంయమనంతో అక్కడే ఉన్నాడు. కరడుగట్టిన ఆ దుష్టులు నిస్సహాయంగా నేలపై తన పాదాల ముందు సాగిలపడి ఉండగా మహిమ పొందిన ప్రభువు వారి మధ్య నిలిచి ఉన్నాడు. శిష్యులు ఆ దృశ్యాన్ని భయభీతులతో నిశ్శబ్దంగా ఆశ్చర్యంగా వీక్షిస్తున్నారు. ఆ దృశ్యం త్వరలో మారిపోయింది. ఆ గుంపు తిరిగి లేచింది.DATel 781.1

    రోమా సైనికులు, యాజకులు, యూదా క్రీస్తు చుట్టూ చేరారు. తమ బలహీనతకు సిగ్గుపడ్డట్టు కనిపించారు. ఆయన తప్పించుకుంటాడేమోనని భయపడ్డారు. “మీరెవని వెదకుచున్నారు?” తమ ముందు నిలిచి ఉన్నవాడు దేవుని కుమారుడన్న నిదర్శనం వారికుంది. అయినా వారు నమ్మడం లేదు. “మీరెవని వెదకుచున్నారు?” అన్న ప్రశ్నకు “నజరేయుడైన యేసుని” అని వారు మళ్లీ జవాబు చెప్పారు. అందుకు యేసు “నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్న యెడల వీరిని పోనియ్యుడి” అని శిష్యుల కేసి వేలు చూపిస్తూ అన్నాడు. వారి విశ్వాసం ఎంత అల్పంగా ఉందో ఆయనకు తెలుసు. వారిని శోధన నుంచి శ్రమల నుంచి కాపాడడానికి ప్రయత్నించాడు. వారి నిమిత్తం తన్నుతాను అర్పించుకోడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు.DATel 781.2

    ద్రోహి అయిన యూదా తాను నిర్వహించాల్సిన పాత్రను మర్చిపోలేదు. ఆ ఆల్లరి మూక తోటలో ప్రవేశించినప్పుడు యూదా వారి ముందు నడిచాడు. అతణ్ని వెన్నంటి ప్రధాన యాజకుడు నడిచాడు. యేసుని పట్టుకోవాలని చూస్తున్న వారికి అతడు ఒక గుర్తునిచ్చాడు. “నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడి” అని చెప్పాడు. మత్త 26:48. ఇప్పుడు వారితో తనకు సంబంధం ఏమిలేనట్లు నటిస్తోన్నాడు. యేసుని సమిపించి సన్నిహిత మిత్రుడిలా ఆయన చెయ్యిపట్టుకున్నాడు. “బోధకుడా, నీకు శుభము” అని ఆయన్ని పదే పదే ముద్దు పెట్టుకుని, కష్టాలు పడున్న ఆయన పట్ల సానుభూతి సూచకంగా కంటతడి పెట్టినట్లు నటించాడు.DATel 781.3

    యేసు “చెలికాడా, నీవు చేయవచ్చిన పనియేమి?” యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించుచున్నావా?” అని దుఃఖంతో వణుకుతున్న స్వరంతో ప్రశ్నించాడు. ఈ మాటలు ఆ ద్రోహి మనస్సాక్షిని మేల్కొలిపి అతడి కఠిన హృదయాన్ని కదిలించి ఉండవచ్చు. అయితే గౌరవం, విశ్వాసం, మానవీయత అతణ్ని విడిచి పెట్టేశాయి. అతడు ధిక్కార స్వభావంతో, మారుమనసుకు తావులేకుండా అలాగే నిలిచిపోయాడు. అతడు సాతానుకి దాసుడయ్యాడు. అతణ్ని ప్రతిఘటించే శక్తి తనకు లేదు. యేసు ఆ ద్రోహి ముద్దును నిరాకరించలేదు.DATel 782.1

    లోగడ తమ కళ్లముందే మహిమపర్చబడిన ఆయన్ని యూదా ముట్టుకోవడం చూసిన మూక ధైర్యం తెచ్చుకుంది. వారు యేసుని పట్టుకుని మంచి చెయ్యడానికి వినియోగించిన ఆయన ప్రశస్తమైన చేతుల్ని బంధించడానికి పూనుకున్నారు.DATel 782.2

    తనను బంధించి తీసుకువెళ్ళడాన్ని ప్రభువు జరగనివ్వడని శిష్యులు భావించారు. ఎందుకంటే ఆ మూకను మరణించిన వారిలా పడేటట్లు చేసిన శక్తే యేసూ. ఆయన శిష్యులూ తప్పించుకు వెళ్లి పోయే వరకు వారిని అదే నిస్సహాయ స్థితిలో ఉంచగలుగుతుందని భావించారు. తాము అమితంగా ప్రేమించిన తమ ప్రభువు చేతుల్ని బంధించడానికి తెచ్చిన తాళ్లను చూసి వారు నిరుత్సాహపడ్డారు. వారికి కోపం వచ్చింది. ఆగ్రహంతో ఉన్న పేతురు తన కత్తిని తీసి తన ప్రభువుని కాపాడాలని ప్రయత్నించాడు. కాని అతడు ప్రధాన యాజకుడి దాసుడి చెవిని మాత్రమే నరికాడు. అది యేసు చూసినప్పుడు రోమా సైనికులు గట్టిగా పట్టుకొని ఉన్న తన చేతుల్ని విడిపించుకుని, “ఈ మట్టుకు తాళుడి” అని చెప్పి గాయపడ్డ ఆ చెవిని ముట్టగా అది వెంటనే బాగుపడింది. అప్పుడాయన పేతురుతో ఇలా అన్నాడు, “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తితోనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా ప్యూహముల కంటే ఎక్కువమంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా?” -ఒకొక్క శిష్యుడి స్థానంలో ఒక్కొక్క సేన. ఆయన తన్ను తానూ మనల్ని ఎందుకు రక్షించడం లేదు? అనుకున్నారు శిష్యులు. వారి మనసులోని ఆ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇలా అన్నాడు, “ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరును?” తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా?”DATel 782.3

    యేసుని వెంటాడడంలో చేతులు కలపడానికి యూదునాయకుల అధికారం మర్యాద వారికి అడ్డురాలేదు. ఆయన్ని బంధించడం తక్కువ స్థాయి అధికారులికి విడిచి పెట్టలేనంత ప్రాముఖ్యమైంది. జిత్తులమారి యాజకులు, పెద్దలు ఆలయ పోలీసులు రబ్బీలతో కలిసి గెత్సెమనేకి యూదా వెంబడి వెళ్లారు. ఆ ఉన్నతాధికారులు జతకలిపి వెళ్లిన గుంపు ఎంత గొప్పది! అది ఒక అడవి మృగాన్ని తరుమడానికి రకరకాల పరికరాలు పట్టుకుని ఉద్రేకోత్సోహాల కోసం వెళ్ళే మూకలాంటిది.DATel 783.1

    యాజకులు పెద్దల పక్కకు తిరిగి వారిపై యేసు తన తీక్షణ దృష్టిని నిలిపాడు. ఆయన అన్నమాటల్ని తాము బతికి ఉన్నంత కాలం వారు మరిచిపోలేరు. అవి సర్వశక్తుని పదునైన బాణాల వంటివి. ఆయన మర్యాదగా ఇలా అన్నాడు, ఒక దొంగమిదికో బందిపోటు మీదికో వెళ్లినట్లు వారు నా మీదికి కత్తులు కర్రలతో వచ్చారు. ప్రతీరోజు నేను ఆలయంలో కూర్చుని బోధించాను. నన్ను బంధించడానికి మీకు ఎన్నో అవకాశాలున్నాయి. కాని మీరు ఏమి చెయ్యలేదు. నా పనికి రాత్రి చాలా అనుకూలమైన సమయం. “ఇది నా గడియయు అంధకార సంబంధమైన అధికారమును” అన్నాడు.DATel 783.2

    తనను పట్టుకొని బంధించడానికి యేసు అనుమతించడం చూసిన శిష్యులు భయంతో వణికారు. ఆయన ఈ సిగ్గును భరించి తనకు తమకు హాని కలిగించాడని భావించారు. ఆయన ప్రవర్తన వారికి అర్ధంకాలేదు. అల్లరి మూకకు తన్నుతాను అప్పగించుకున్నందుకు వారు ఆయన్ని తప్పుపట్టారు. కోపం భయం మిళితమైన ఆ సమయంలో తమ్ముని తాము కాపాడుకోడం ఉత్తమమని పేతురు ప్రతిపాదించాడు. ఈ సలహా మేరకు “అందరు ఆయనను విడిచి పారిపోయిరి.” ఈ పరిణామం గురించి క్రీస్తు ముందే చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “ఇదిగో మిలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.” యోహా 16:32.DATel 783.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents