Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  30—“ఆయన పండ్రెండు మందిని నియమించెను”

  “ఆయన కొండెక్కి తన కిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఈయన పండ్రెండు మందిని నియమించెను.”DATel 308.1

  తన పన్నెండు మంది శిష్యుల్ని అపొస్తలుల సేవకు యేసు సమావేశపర్చిన స్థలం గలిలయ సముద్రానికి అల్లంత దూరాన కొండ పక్క చెట్ల నీడలో ఉన్నది. కొండ మీది ప్రసంగం ఇక్కడే జరిగింది. పొలాలు కొండలు యేసుకి ఇష్టమైన సమావేశ స్థలాలు. ఆయన బోధన చాలా మట్టుకు ఆలయాల్లోను సమాజమందిరాల్లోను గాక ఆరుబయట జరిగేది. ఆయన్ని వెంబడించిన జనులకు ఏ సమాజమందిరమూ చాలేది కాదు. కాని పొలాల్లోను చెట్ల తోపుల్లోను బోధించడానికి ఆయన ఎంపిక చేసుకోడానకి కారణం అదికాదు. ప్రకృతి దృశ్యాలంటే యేసుకి ప్రాణం. ఆయనకు ప్రశాంతమైన ప్రతీ సమావేశ స్థలం ఓ పవిత్ర దేవాలయం.DATel 308.2

  భూమిపై మొట్టమొదటి నివాసులు ఏదెనులో చెట్ల కింద నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మానవజాతి పితతో యేసు అక్కడే సంభాషించేవాడు. పరదైసు నుంచి బహిష్కృతులయ్యాక మన మొదటి తల్లితండ్రులు ఇంకా పొలాల్లోను చెట్లతోపుల్లోను ఆరాధనలు జరుపుకునేవారు. అక్కడ యేసు వారిని తన కృపా సువార్త వర్తమానంతో కలిసేవాడు. మ లోని సింధూర చెట్ల కింద అబ్రహాముతో మాట్లాడింది; ప్రార్ధన చేయడానికి ఇస్సాకు సాయంత్రం పొలాల్లోకి వెళ్లినప్పుడు అతడితో ఉన్న వ్యక్తి; బేతేలులో కొండ పక్క యాకోబుతో ఉన్న వ్యక్తి; మిద్యాను దేశంలో కొండల నడుమ మోషేతో ఉన్న వ్యక్తి; గొర్రెల మందల్ని కాస్తున్న బాలుడు దావీదుతో ఉన్న వ్యక్తి క్రీస్తే, క్రీస్తు ఆదేశం మేరకు హెబ్రీ ప్రజలు పదిహేను శతాబ్దాలుగా సంవత్సరంలో ఒక వారం తమ గృహాలు విడిచిపెట్టి “ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువ యొద్ద మండు నిరమంజి చెట్ల” కొమ్మలను ఉపయోగించి పాకలు వేసుకుని వాటిలో నివసించారు. లేవీ కాండము 23:40.DATel 308.3

  శిష్యులికి నేర్పించగోరిన ఆత్మ త్యాగ పాఠాలకు అనుగుణమైన వాతావరణం కోసం గందరగోళంతో నిండిన పట్టణ వాతావరణం కాక పొలాలు కొండల నడుమ లభించే ప్రశాంత వాతావరణాన్ని యేసు ఎంపిక చేసుకున్నాడు. తన పరిచర్య కాలంలో ప్రజల్ని ఆరుబయట నీలి ఆకాశం కింద కొండ పక్కపచ్చని మైదానంలో లేక సరస్సు పక్క తీరం పైన సమావేశ పర్చేవాడు. ఇక్కడ తాను చేసిన సృష్టి నడుమ తన శ్రోతల మనసుల్ని కృత్రిమాల నుంచి స్వాభావికాలకు తిప్పాడు. ప్రకృతి పెరుగుదలలోను అభివృద్ధిలోను తన రాజ్య నిబంధనల్ని వెల్లడి చేశాడు. దేవుని కొండల తట్టుకు మనునషులు కన్నులెత్తి ఆయన అద్భుతమైన హస్తకృత్యాన్ని వీక్షించినప్పుడు వారు దైవ సత్యాల్ని గూర్చి విలువైన పాఠాలు నేర్చుకోనున్నారు. ప్రకృతి కార్యల్లో వారికి క్రీస్తు బోధన పునరూవృత్తమవ్వనుంది. తమ హృదయాల్లో క్రీస్తుతో కలిసి పొలాల్లోకి వెళ్లే వారందరికీ ఇలాగే జరుగుతుంది. ఓ పరిశుద్ధ ప్రభావం తమ చుట్టూ ఉన్నట్లు వారు భావిస్తారు. మన ప్రభువు ప్రకృతి విషయాలతో ఉపమానాలు చెప్పి తద్వారా తన ఉపదేశాన్ని పునరుద్ఘాటించేవాడు. ప్రకృతి ద్వారా దేవునితో సంభాషించడం వలన మనసు ఉన్నతమౌతుంది. హృదయానికి విశ్రాంతి లభిస్తుంది.DATel 309.1

  సంఘాన్ని వ్యవస్థీకరించడంలో ఇప్పుడు మొదటి చర్య తీసుకోవాల్సి ఉంది. క్రీస్తు ఆరోహణానంతరం సంఘమే లోకంలో ఆయనకు ప్రతినిధిగా వ్యవహరించాల్సి ఉంది. వారికి ఖరీదైన ఆలయంలేదు. తనకు మిక్కిలి ప్రియమైన సమావేశ స్థలానికి ప్రభువు తన శిష్యుల్ని తీసుకువెళ్లాడు. ఆనాటి పవిత్ర అనుభూతులు సుందర పర్వతాలతో లోయలతో సముద్రంతో వారి మనస్సుల్లో నిరంతరం జతపడి ఉండిపోయాయి.DATel 309.2

  తనకు సాక్షులుగా పంపేందుకు యేసే తన శిష్యుల్ని పిలిచాడు. తాము చూసిన వాటిని విన్నవాటిని వారు లోకానికి చాటాల్సి ఉన్నారు. మానవ బాధ్యతలన్నిటిలో వారి బాధ్యత అతి ప్రాముఖ్యమైనది. వారిది క్రీస్తు తర్వాత రెండోస్థానం. లోకాన్ని రక్షించే సేవలో వారు దేవునితో జత పనివారు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రతినిధులుగా పన్నెండు మంది పితరులున్నారు. అలాగే ఆ పన్నెండుమంది అపొస్తలులు సువార్త సంఘానికి ప్రతినిధులుగా నిలవాల్సి ఉన్నారు.DATel 310.1

  తాను ఎంచుకున్న మనుషుల ప్రవర్తన లెలాంటివో రక్షకునికి తెలుసు. వారి బలహీనతలు పొరపాట్లు ఆయనకు తెలుసు. వారు అనుభవించాల్సి ఉన్న శ్రమలు వారు వహించాల్సి ఉన్న బాధ్యతలు ఆయనకు తెలుసు. తాను ఎంపిక చేసుకున్న వీరి నిమిత్తం ఆయన హృదయం వేదనతో నిండింది. గలిలయ సముద్రం దగ్గర ఓ కొండపై ఒంటరిగా రాత్రంతా వారి కోసం ప్రార్థన చేశాడు, పర్వతం అడుగు భాగం వద్ద శిష్యులు నిద్రలో మునిగి ఉన్నారు. సూర్యోదయమప్పుడు తనను “కలవమని వారిని ఆదేశించాడు. ఎందుకంటే వారికి అందించడానికి ఆయనకో ముఖ్య విషయం ఉంది.DATel 310.2

  ఈ శిష్యులు కొంతకాలం యేసుతో కలిసి చురుకుగా సేవ చేశారు. యోహానును, యాకోబు, అంద్రియ, పేతురు, ఫిలిప్పు, నతనయేలు, మత్తయిలు ఇతరులకన్నా ఎక్కువగా ఆయనతో కలిసి ఉన్నారు. కనుక ఆయన మహత్కార్యాల్ని వారు ఎక్కువగా చూశారు. పేతురు, యాకోబు, యెహోన్లు ఆయనతో మరింత సన్నిహితంగా ఉన్నారు. వారు ఆయనతో దాదాపు ఎల్లప్పుడూ ఉన్నారు. ఆయన సూచక క్రియల్ని చూశారు. ఆయన మాటల్ని విన్నారు. యోహాను యేసుతో మరింత ఆత్మీయత పెంచుకున్నాడు. అందుచేత అతడు యేసు ప్రేమించిన శిష్యుడుగా పరిగణన పొందాడు. రక్షకుడు శిష్యులందరినీ ప్రేమించాడు. కాని యోహానుది ఎక్కువ అవగాహన ఉన్న మనస్సు. అతడు శిష్యులందరికన్నా చిన్నవాడు. చిన్న పిల్లవాడి మనస్తత్వంతో యేసును నమ్మి తన హృదయాన్ని ఆయనకు తెరిచాడు. ఇలా యేసు ఆప్యాయతను సానుభూతిని చూరగొన్నాడు. రక్షకుని లోతైన ఆధ్యాత్మిక బోధనలు యోహోను ద్వారా ప్రజలకు అందాయి.DATel 310.3

  అపొస్తలుల్ని గుంపులుగా విభజించారు. ఒక గుంపుకి ఫిలిప్పు నాయకుడు. “నన్ను వెంబడించుము” అన్న యేసు నిర్దిష్ట ఆజ్ఞను పొందిన మెదటి శిష్యుడు ఫిలిప్పు బేత్సయిదావాడు. అంద్రియ పేతురులు ఈ పట్టణ నివాసులే. ఫిలిప్పు బాప్తిస్మమిచ్చే యోహాను బోధన విన్నాడు. యేసు దేవుని గొర్రెపిల్లగా యోహాను ప్రకటించడం విన్నాడు. ఫిలిప్పు చిత్తశుద్ధిగల సత్యాన్వేషి. కాకపోతే నమ్మడానికి వచ్చేసరికి కాస్త నిదానించేవాడు. అతడు క్రీస్తుతో కలిసి ఉన్నప్పటికీ క్రీస్తు దేవత్వం గురించి అతడికి పూర్తి విశ్వాసం లేదని ఆయన్ని గురించి అతడు నతనయేలుతో అన్నమాటలు తెలుపుతున్నాయి. పరలోకం నుంచి వచ్చిన స్వరం ఆయనను దేవుని కుమారునిగా ప్రకటించినా ఫిలిప్పుకి మాత్రం ఆయన “యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు” యోహా 1:45; అయిదు వేల మందికి ఆహారం పెట్టిన సందర్భంలోనూ ఫిలిప్పు విశ్వాసరాహిత్యం బయలుపడింది. “వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుము?” అని అతణ్ని పరీక్షించడానికి యేసు ప్రశ్నించాడు. ఫిలిప్పు సమాధానం అతడి అవిశ్వాసాన్ని బయలుపర్చింది. “వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.” యోహాను 6:5,7. యేసు బాధపడ్డాడు. ఆయన కార్యాల్ని కళ్లారా చూసినా, ఆయన శక్తిని అనుభవపూర్వకంగా గ్రహించినా ఫిలిప్పుకి ఆయనపై విశ్వాసం లేదు. “ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియును?” అని తోమా అన్నప్పుడు యేసు “నేనే మార్గమును, సత్యమును, జీవమును.... మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు.” అని సమాధానం చెప్పాడు. ఫిలిప్పు నుంచి ఈ అపనమ్మకపు స్పందన వచ్చింది, ” ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము మా కంతే చాలును” యోహా 14:5-8. మూడు సంవత్సరాలుగా యేసుతో ఉన్న ఆ శిష్యుడు అంత మందబుద్ది గలవాడు! విశ్వాసంలో అంత బలహీనుడు!DATel 311.1

  ఫిలిప్పు అపనమ్మకానికి భిన్నమైంది నతనయేలు విశ్వాసం. అతడి విశ్వాసం పసివాడి విశ్వాసం వంటిది. నతనయేలు గాఢమైన యదార్థమైన స్వభావం గలవాడు. అతడి విశ్వాసం దృశ్యం కాని వాస్తవాల్ని నమ్మే విశ్వాసం. అయినప్పటికీ ఫిలిప్పు క్రీస్తు పాఠశాలలో విద్యార్ధి. ఆ పరమ బోధకుడు ఫిలిప్పు అవిశ్వాసాన్ని మందగమనాన్ని ఓర్పుతో సహించాడు. శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనంతరం ఫిలిప్పు దైవప్రణాళిక మేరకు బోధకుడయ్యాడు. తాను ప్రస్తావించిన సందేహాలు మాయమయ్యాయి. శ్రోతలకు విశ్వాసం పుట్టించగల నిశ్చయతతో ఫిలిప్పు బోధించాడు.DATel 312.1

  శిష్యుల్ని అభిషేకానికి యేసు సిద్ధం చేస్తున్న సమయంలో ఆయన రమ్మని పిలవని ఒక వ్యక్తి వారి మధ్యకు వచ్చాడు. అతడు క్రీస్తు అనుచరుణ్నని చెప్పుకుంటున్న యూదా ఇస్కరియోతు. ఇప్పుడు అతడు ముందుకు వచ్చి శిష్యవర్గంలో ప్రముఖ స్థానాన్ని కోరాడు. గొప్ప భక్తి యధార్ధత నటిస్తూ అతడిలా అన్నాడు, “బోధకుడా నీ వెక్కడికి వెళ్లినను నీవెంట వచ్చెదను.” యేసు అతన్ని తోసిపుచ్చలేదు. స్వాగతించనూ లేదు గాని విషాదకరమైన ఈ మాటలన్నాడు, “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదు.” మత్తయి 8:19.20. యేసు మెస్సీయా అని యూదా విశ్వసించాడు. అపొస్తులుల్లో చేరడం వల్ల నూతన రాజ్యంలో ఉన్నత హోదాను సంపాదించవచ్చునని భావించాడు. అతడిలోని ఈ ఆశాభావాన్ని తన పేదరికం ప్రకటనతో అంతం చెయ్యాలని యేసు ఉద్దేశించాడు.DATel 312.2

  యూదా తమలో ఒకడు కావాలని శిష్యులు ఆత్రపడుతోన్నారు. అతడికి చక్కని ఆకృతి సూక్షగ్రాహ్యత వ్వవహార దక్షత ఉన్నాయి. తన సేవకు అతడు గొప్ప అండగా ఉండగలడని ఆయనకు శిష్యులు సిఫార్సు చేశారు. యేసు అతడి పట్ల ఏమంత ఉత్సాహం ప్రదర్శించకపోడం వారిని ఆశ్చర్యపర్చింది.DATel 312.3

  యేసు ఇశ్రాయేలు నాయకుల సహకారం పొందడానికి ప్రయత్నించకపోవడం శిష్యులుకి ఆశాభంగం కలిగించింది. పలుకుబడి ప్రాబల్యం ఉన్న వ్యక్తుల సహాయ సహకారాలు సంపాదించకపోవడం పొరపాటని భావించారు. ఆయన యూదాను తిరస్కరించి ఉంటే వారు తమ మనసుల్లో ప్రభువు విజ్ఞతను ప్రశ్నించేవారు. దేవుని సేవకు మనుషుల యోగ్యతను నిర్ధారించేటప్పుడు లోకసంబంధమైన అర్హతల పరిగణన ఎంత అపాయకరమో యూదా తదనంతర చరిత్ర తేటపర్చుతోంది. శిష్యులు కోరినట్లు అలాంటి మనుషుల సహకారం దేవుని సేవను అతి నికృష్ణ శత్రువుల చేతులికి అప్పగించడమయ్యేది.DATel 312.4

  అయినా యూదా శిష్యుల్లో చేరిన అనంతరం క్రీస్తు గుణసౌందర్యాన్ని గుర్తించకపోలేదు. ఆత్మలను రక్షకుని వద్దకు ఆకర్షిస్తోన్న ఆ దైవశక్తి ప్రభావం అతడి మీద కూడా పడింది. నలిగిన రెల్లును విరువని, మకమకలాడుతున్న జనపనార వత్తిని ఆర్పని ఆయన సత్యకాంతిని చేరడానికి చిన్న కోరిక కనపర్చుతోన్న ఈ ఆత్మను తోసిపుచ్చడు. రక్షకుడు యూదా హృదయాన్ని పరిశోధించాడు. దైవ కృప విమోచిస్తే తప్ప యూదా పాపంలో ఎంత లోతుకి కూరుకుపోతాడో ఆయనకు తెలుసు. ఈ వ్యక్తిని తన సహవాసంలో ఉంచుకోడంలో ఆయన ఉద్దేశం స్వార్ధరహితమైన తన ప్రేమ వెల్లువ అతణ్ని దినదినం తాకే స్థానంలో ఉంచాలన్నదే. క్రీస్తుకి తన హృదయాన్ని తెరవడానికి అతడు ఇష్టపడితే స్వార్ధం రాక్షసిని దేవుని కృప బహిష్కరిస్తుంది. అప్పుడు యూదా సయితం దేవుని రాజ్యపౌరుడు కావచ్చు.DATel 313.1

  మానవ లక్షణాలతో ఉన్న తమ ప్రవర్తనలతో మనుషుల్ని తామున్న రీతిగా స్వీకరించి, తన క్రమశిక్షణ ఉపదేశానికి వారు సమ్మతిస్తే వారిని తన సేవ కోసం దేవుడు తర్బీతు చేస్తాడు. వారు సంపూర్ణులైనందుకు ఎంచుకోడు. వారిలో లోపాలున్నా వారిని ఎంచుకుంటాడు. సత్యజ్ఞానం వల్ల సత్యాచరణ వల్ల క్రీస్తు కృపద్వారా తన స్వరూపంలోకి వారు మార్పు చెందాలన్న ఉద్దేశంతో దేవుడు మనుషుల్ని ఎంపిక చేసుకుంటాడు.DATel 313.2

  తక్కిన శిష్యులకున్న అవకాశాలే యూదాకీ ఉన్నాయి. అతడూ అవే పాఠాలు విన్నాడు. క్రీస్తు కోరినట్లు సత్యాన్ని ఆచరించడానికి వచ్చేసరికి అది యూదా ఆశలు ఆశయాల్ని అనుసరించి సాగింది. దైవజ్ఞానాన్ని స్వీకించేందుకు తన అభిప్రాయాల్ని వదులుకోలేకపోయాడు.DATel 313.3

  తనను పట్టి ఇవ్వనున్న వ్యక్తి పట్ల రక్షకుడు ఎంత సున్నితంగా వ్యవహరించాడు! దురాశకు గొడ్డలి పెట్టయిన దయ కనికరాల్ని గూర్చిన సూత్రాల్ని యేసు తన బోధనలో చర్చించాడు. అత్యాశ నీచమైందని యూదాకి వివరించాడు. తన ప్రవర్తననే ఆయన వర్ణిస్తోన్నాడని తన పాపాన్నే వేలెత్తి చూపిస్తున్నాడని యూదా అనేకసార్లు భావించాడు. అయినా అతడు తన పాపాన్ని ఒప్పుకుని తన అనీతిని విడిచిపెట్టలేదు. అతడు తనకే లోటూ లేదని తాను స్వయంసమృద్ధుణ్ణని భావించాడు. శోధనను ప్రతిఘటించే బదులు మోసకరమైన అభ్యాసాల్ని కొనసాగించాడు. ఆయన మధ్యవర్తిత్వం, పరిచర్య తాలూకు ప్రయోజనాల్ని వినియోగించుకున్నట్లయితే తాను ఎలా ఉండగలడో అన్నదానికి సజీవ ఉదాహరణగా యేసు అతడి ముందే ఉన్నాడు. అయినా ఆ పాఠాల్లో ఏదీ యూదా చెవికెక్కలేదు.DATel 313.4

  తన దురాశ నిమిత్తం యేసు అతణ్ని మందలించలేదు. అతడి పొరపాట్లును ఓర్పుతో సహించాడు. అతడి హృదయంలో ఏముందో తనకు విదితమే అన్న దానికి నిదర్శనమిస్తూనే అతణ్ని సహించాడు. న్యాయంగా వర్తించడానికి అతడికి అత్యున్నత ప్రోత్సాహాకాలిచ్చాడు. దేవుడిచ్చిన ఆ వెలుగును తోసిపుచ్చడానికి యూదాకి ఎలాంటి సాకూలేదు.DATel 314.1

  వెలుగులో నడిచే బదులు యూదా తన లోపాలోనే మిగిలిపోయాడు. చెడు కోరికలు, పగ, దురాలోచనలు, అతణ్ని సాతాను అదుపులోకి నడిపించాయి. యూదా ఇలా క్రీస్తు విరోధికి ప్రతినిధి అయ్యాడు.DATel 314.2

  యేసు సహవాసంలోకి వచ్చినప్పుడు అతడికి కొన్ని మంచి గుణలక్షణాలున్నాయి. అవి సంఘానికి ఎంతో బలాన్ని చేకూర్చి ఉండేవి. క్రీస్తు కాడిని మోయడానికి సమ్మతంగా ఉండి ఉంటే అతడు అపొస్తలుల్లో ప్రధాన వ్యక్తి అయ్యేవాడు. తన తప్పిదాన్ని ఎత్తి చూపినప్పుడు అతడు తన హృదయాన్ని కఠినపర్చుకున్నాడు. అహంకారంతోను తిరుగుబాటు స్వభావంతోను నిండి తన స్వార్థాశల్ని నెరవేర్చుకున్నాడు. దేవుడు అతడికి ఇచ్చిఉండే పనికి అతడు ఇలా తన్నుతాను అయోగ్యుణ్ని చేసుకున్నాడు.DATel 314.3

  యేసు తన సేవనిమిత్తం శిష్యుల్ని పిలిచినప్పుడు వారందరిలోనూ పొరపాట్లున్నాయి. సాత్వికానికి దీనత్వానికి మారుపేరైన ఆ ప్రభువుతో సాన్నిహిత్యం గల యోహాను సైతం స్వాభావికంగా నెమ్మదిపరుడు కాదు. అణిగిమణిగి ఉండేవాడు కాదు. అతడు అతడి సోదరుడు “ఉరిమెడువారు” అని పేరు పొందారు. వారు యేసుతో ఉన్నప్పుడు ఆయనకు ఏ చిన్న అవమానం జరిగినా వారి ఆగ్రహం కట్టలు తెంచుకునేది. ప్రతిఘటనకు సిద్ధమయ్యేవారు. ముక్కుమీద కోపం, పగ, ఖండన స్వభావం - ఇవి ఈ శిష్యుడి గుణలక్షణాలు. అతడికి అతిశయం ఎక్కువ. దేవుని రాజ్యంలో తనే మొదటి స్థానంలో ఉండాలన్న కోరికా ఎక్కువే. తన దౌర్జన్యపూరిత ప్రవృత్తికి భిన్నంగా అతడు దినదినం యేసు కారుణ్యాన్ని సహనశీలాన్ని చూశాడు. అణకువ ఓర్పుపై అయన చెప్పిన పాఠాల్ని విన్నాడు. ఆ దివ్య ప్రభావానికి తన హృదయం తెరిచాడు. రక్షకుని మాటలు వినే వాడేగాక వాటిని ఆచరణలో పెట్టేవాడు అయ్యాడు. స్వార్ధం క్రీస్తులో మరుగయ్యింది. క్రీస్తు కాడిని ధరించడం ఆయన భారాన్ని మొయ్యడం నేర్చుకున్నాడు.DATel 314.4

  యేసు తన శిష్యుల్ని మందలించాడు. వారికి హెచ్చరికలు చేసేవాడు. మెళుకువలు చెప్పేవాడు. అయినా యోహాను అతడి సహోదరులు ఆయన్ని విడిచిపెట్టలేదు. వారి బలహీనతలు పొరపాట్ల కారణంగా రక్షకుడు వారికి దూరంగా ఉండలేదు. ఆయన కష్టాల్లో భాగం పంచుకోడానికి ఆయన జీవితం నుంచి పాఠాలు నేర్చుకోడానికి వారు ఆయనతో చివరి వరకు ఉన్నారు. క్రీస్తును చూస్తూ ఉండడంవల్ల వారి ప్రవర్తనలో మార్పు కలిగింది.DATel 315.1

  అలవాట్లలోను చిత్త వృత్తి పరంగాను అపొస్తలులు విభిన్నమైన వ్యక్తులు. అగ్గిబరాటా, సుంకరి లేవీ మత్తయి రోమా అధికారులంటే ఏ మాత్రం కిట్టని సీమోను, దుండుకు పేతురు, నీచస్వభావి యూదా, యధార్ద హృదయుడు, అయినా పిరికివాడు, భయస్తుడు అయిన తోమా, మందబుద్ది సందేహించే ప్రవృత్తిగల ఫిలప్పు, గొప్ప ఆశలు కలిగి, సూటిగా మాట్లాడే జెబెదయి కుమారులు - వీరు ఆ ఆపొస్తలులు. తమ తమ పొరపాట్లు పారంపర్య దుర్గుణాలు, నేర్చుకున్న దురభ్యాసాలు గల వీరిని ఆయన ఎంచుకున్నాడు. కాగా క్రీస్తులోను క్రీస్తు ద్వారాను వారు దేవుని కుటుంబంలో నివసించాల్సి ఉన్నారు. విశ్వాసంలో, సిద్ధాంతంలో, ఆత్మలో వారు ఐక్యత కలిగి ఉండడం నేర్చుకోవాల్సి ఉన్నారు. వారి పరీక్షలు వారి ఇక్కట్లు వారి అభిప్రాయ భేదాలు వారికున్నాయి. అయితే, క్రీస్తు తమ హృదయాల్లో నివసిస్తుంటే వారి మధ్య ఎలాంటి విభేదాలూ ఉండవు, ఆయన ప్రేమ వారు ఒకరినొకరు ప్రేమించడానికి నడిపిస్తుంది. ప్రభువు బోధించిన పాఠాలు భేదాల్ని తొలగించి సామరస్యాన్ని నెలకొల్పుతాయి. శిష్యుల్ని ఐక్యపర్చి వారిలో ఒకే మనసు ఒకే తీర్మానం పుట్టిస్తాయి. వారికి క్రీస్తే గొప్ప కేంద్రం. ఆ కేంద్రానికి దగ్గరయ్యే నిష్పత్తిలోనే వారు ఒకరికొకరు దగ్గరవుతారు.DATel 315.2

  తన ఉపదేశాన్ని ముగించాక యేసు శిష్యుల్ని తన చుట్టూ పోగుజేసి వారి మధ్య మోకాళ్లూని వారి తలలమీద చేతులుంచి తన పవిత్ర సేవకు వారిని ప్రతిష్ఠిస్తూ ప్రార్ధన చేశాడు. శిష్యులు ఈ విధంగా పవిత్ర పరిచర్యకు అభిషేకం పొందారు.DATel 316.1

  మనుషుల మధ్య తన ప్రతినిధులుగా నివసించడానికి, పాపం చెయ్యని దేవదూతల్ని క్రీస్తు ఎంపిక చేసుకోడు గాని తాను రక్షించడానికి సంకల్పించిన మానవుల స్వభావం గల మనుషుల్నే ఎంపిక చేసుకుంటాడు. మానవుల్ని చేరుకోడానికి యేసు మానవుడుగా అవతరించాడు. దేవత్వానికి మానవత్వం అవసరమయ్యింది. ఎందుకంటే లోకానికి రక్షణ నందించడానికి దేవత్వం మానవత్వం రెండూ అవసరమయ్యాయి. దేవుడికి మానవుడికి మధ్య ఉత్తర ప్రత్యుత్తర వ్యవస్థ ఏర్పడేందుకోసం దేవత్వానికి మానవత్వం అగత్యమయ్యింది. క్రీస్తు సేవకులు దూతలు అయిన వారికి ఇదే అవసరం ఉంటుంది. మానవుడికి తనలోలేని, తనకు వెలపలనుంచి వచ్చే శక్తి అవసరం. అతణ్ని దేవుని పోలికకు పునరుద్ధరించడానికి, దేవుని పరిచర్య చేయడానికి సమర్ధుణ్ని చేసేందుకు ఆశక్తి అవసరం. అలాగని మావన సాధనం అవసరం లేనిది అని భావించాకూడదు. మానవత్వం దైవశక్తి పై అధారపడి ఉంటుంది. క్రీస్తు విశ్వాసం ద్వారా మనసులో నివసిస్తాడు. దేవునితో సహకంరిచడం ద్వారా మానవుడి శక్తి మేలు చేయడానికి సామర్ధ్యం పొందుతుంది.DATel 316.2

  గలిలయ జాలరుల్ని పిలిచిన ప్రభువు తన సేవకు ఇంకా మనుషుల్ని పిలుస్తోన్నాడు. తొలినాటి శిష్యుల ద్వారా తన శక్తిని ఎలా ప్రదర్శించాడో అలాగే మన ద్వారా కూడా ప్రదర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఎంత పాపులం అసంపూర్ణులం అయినప్పటికీ మనకు తనతో భాగస్వామ్యాన్ని ప్రభువు వాగ్దానం చేస్తోన్నాడు. తనే మనకు శిక్షణనిస్తానంటోన్నాడు. క్రీస్తుతో కలిసి దేవుని పనులు చెయ్యడాకిగాను దైవోపదేశం పొందాల్సిందిగా ప్రభువు మనల్ని ఆహ్వానిస్తోన్నాడు,DATel 316.3

  “ఆ బలాధిక్యము మామూలమైనదికాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.” 2కొరి 4:7, అందుకే సువార్త ప్రకటన దేవదూతలకు కప్పగించడం కన్నా మానవులకు అప్పగించడం జరిగింది. బలహీన మానవుల ద్వారా పనిచేసే శక్తి వాస్తవానికి దేవుని శక్తి. అని ప్రదర్శితమయ్యింది. కనుక మనలా బలహీనులికి సాయం చెయ్యగల శక్తి మనకు ప్రోత్సాహాన్నిస్తోంది. “బలహీనత చేత ఆవరింపబడియున్న” వారు “ఏమియు తెలియని వారి యెడలను త్రోవ తప్పిన వారి యెడలను తాలిమి” చూపగలుగుతారు. హెబ్రి 5:2. శ్రమలు కష్టాలు అనుభవిస్తోన్న వారు మార్గంలో ఎదురయ్యే కష్టాల్ని ఎరిగే ఉంటారు. ఈ హేతువు చేత అలాంటి శ్రమల్లోనే ఉన్న ఇతరులకు చేయూత నివ్వాల్సిందిగా వారికి పిలుపు వస్తోంది. సందేహంతో తికమకపడూ బలహీనతల భారం కింద మగ్గుతూ, బలహీన విశ్వాసంతో సతమతమౌతూ అదృశ్యుడైన ఆ ప్రభువుని గ్రహించలేని ఆత్మలున్నాయి. అయితే తాము చూడగలిగే ఓ మిత్రుడు క్రీస్తు బదులు వచ్చి తడబడ్తున్న వారి విశ్వాసాన్ని క్రీస్తుతో అనుసంధానపర్చవచ్చు.DATel 316.4

  మనం యేసుని లోకానికి సమర్పించడంలో దేవదూతలతో చెయ్యి కలిపి పనిచేయ్యాలి. మన సహకారం కోసం దేవదూతలు ఆత్రంగా కనిపెడుతోన్నారు. ఎందుకంటే మానవుడితో వ్యవహారించడానికి మానవుడే సాధనం కావాలి. పూర్ణ భక్తితో మనం క్రీస్తుకి అంకితమయితే మన స్వరంతో మాట్లాడి దేవుని ప్రేమను వెల్లడి చెయ్యడానికి దేవదూతలు ఆనందిస్తారు.DATel 317.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents