Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  39—“మీరు వారికి భోజనము పెట్టుడి”

  క్రీస్తు తన శిష్యులతో విశ్రమించడానికి ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్లాడు. కాని ఈ అరుదైన ప్రశాంతి కొద్ది సమయంలోనే భగ్నమయ్యింది. ఎలాంటి ఆటంకాలు ఉండని స్థలానికి వెళ్లామని శిష్యులు భావించారు. అయితే పరమ బోధకుడు లేకపోవడం గుర్తించిన వెంటనే జనసమూహాలు “ఆయన ఎక్కడున్నాడు?” అని వాకబు చేశారు. వారిలో కొందరు క్రీస్తు ఆయన శిష్యులు వెళ్లిన మార్గం గుర్తించారు. వారిని కలవడానికి చాలా మంది రోడ్డుమార్గాన వెళ్లగా ఇతరులు జలమార్గాన పడవల్లో వారిని వెంబడించారు. పస్కా సమిపించడంతో యెరూషలేముకు ప్రయాణం చేస్తోన్న యాత్రిక సమూహాలు యేసుని చూడడానికి సమావేశమయ్యాయి. జనులు ఇంకా వచ్చి చేరడంతో స్త్రీలు పిల్లలుగాక వారి సంఖ్య వెరసి అయిదు వేలయ్యింది. క్రీస్తు సముద్రతీరం చేరక ముందే ఆయన కోసం పెద్ద జనసమూహాం వేచి ఉంది. అయితే వారికి తెలియకుండా ఆయన రావడం శిష్యులతో కొంత సమయం ప్రత్యేకంగా గడపడం జరిగింది.DATel 398.1

  కదులుతున్న జనసమూహాల వంక కొండ పక్క నుంచి చుశాడు. ఆయన హృదయం సానుభూతితో నిండింది. తనకు అంతరాయం కలిగినా విశ్రాంతి కరవైనా ఆయన సహనం కోల్పోలేదు. గుంపులు గుంపులుగా వస్తోన్న ప్రజల్ని చూసినప్పుడు తన గమనాన్ని దృష్టిని నిలపవలసిన ఆవశ్యకతను ఆయన గుర్తించాడు. “వారు కాపరి లేని గొట్టెల వలె ఉన్నందున వారి మీద” కనికరపడ్డాడు. తన విరామస్థలాన్ని విడిచి పెట్టి వారికి పరిచర్య చేయగల స్థలాన్ని కనుగొన్నాడు. వారికి యాజకులు ప్రధానులు ఎలాంటి సహాయమూ అందించలేదు. కాని క్రీస్తు రక్షణ మార్గాన్ని ప్రజలకు బోధించినప్పుడు ఆయన నుంచి స్వస్తత కూర్చే జీవ జలాలు ప్రవహించాయి.DATel 398.2

  దైవకుమారుని నోటి నుంచి ధారాపాతంగా వస్తోన్న దయ కనికరాల్తో కూడిన మాటలు ప్రజలు విన్నారు. కృపాపూరితమైన అతి నిరాడంబరమైన ఆ మాటలు వారి ఆత్మలకు గిలాదులో గుగ్గిలంలా ఉన్నాయి. ఆయన దివ్యహస్తం ద్వారా కలిగిన స్వస్తత మరణించే వారికి ఆనందాన్ని జీవాన్ని ఇచ్చింది. వ్యాధి బాధితులికి సుఖశాంతుల్ని ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఆ దినం వారికి భువిపై వెలసిన స్వర్గంలా ఉంది. తాము ఆహారం తిని ఎన్నిరోజులయ్యిందో వారికి గుర్తులేదు.DATel 399.1

  ఆ దినం చాలా పొద్దు పోయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ప్రజలంతా అక్కడే ఉన్నారు ఆహారం, విశ్రాంతి లేకుండా. యేసు ఆ దినమంతా పని చేశాడు. ఆయన చాలా అలసిపోయాడు. ఆకలిగా ఉన్నాడు. బలహీనంగా కూడా ఉన్నాడు. పని ఆపుచెయ్యవలసిందిగా శిష్యులు అర్థించారు. కాని తన వద్దకు తోసుకుంటూ వస్తోన్న జనాల్నుంచి ఆయన నిష్క్రమించలేకపోయాడు.DATel 399.2

  తుదకు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ప్రజల్ని పంపివేయవలసిందిగా వేడుకున్నారు. అనేకులు ఎంతో దూరం నుంచి వచ్చారు. వారు ఉదయం నుంచి ఏమి తినలేదు. చుట్టుపక్కల ఉన్న పట్టణాలు గ్రామాల నుంచి వారు ఆహారం కొనుక్కోవచ్చు. అయితే, “మీరు వానికి భోజనము పెట్టుడి” అని, ఫిలిప్పు తట్టుకి తిరిగి, “వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుము?” అని ప్రశ్నించాడు. ఆ శిష్యుడి విశ్వాసాన్ని పరీక్షించడానికే ఆయన ఈ ప్రశ్నవేశాడు. ఫిలిప్పు ఆ జనసముద్రాన్ని కలియజూసి అంతమందికి తృప్తికరంగా ఆహారం పెట్టడం అసాధ్యమని తలంచాడు. అందరికీ కొంచెం కొంచెం పెట్టడానికైనా రెండు వందల దేనారాల రొట్టెలు చాలవని అతడు బదులు పలికాడు. అక్కడున్న వారి నుంచి ఎంత ఆహరం పోగు చెయ్యగలమని యేసు భోగట్టా చేశాడు. “ఇక్కడ ఉన్న యొక చిన్న వాని యొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని యింతమందికి ఇవి ఏమాత్రము?” అని అంద్రియ అన్నాడు. వాటిని తన వద్దకు తెప్పించాల్సిదిగా యేసు సూచించాడు. అంతట ఆయన చేయనున్న కార్యాన్ని అందరూ చూసేందుకు, ప్రజలు క్రమాన్ని పాటించేందుకు వారిని ఆ గడ్డిపై ఏభై చొప్పున లేక వంద చొప్పున వరుసగా కూర్చోబెట్టవలసిందిగా శిష్యుల్ని ఆదేశించాడు. వారు ఈ పని చేసిన తర్వాత యేసు ఆహారాన్ని తీసుకుని “ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వాదించి, ఆ రొట్టెను విరిచి వారికి పంచిపెట్టుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికి పంచి పెట్టెను.” “వీరందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టెముక్కలను పండ్రెండు గం పెళ్లు ఎత్తిరి.”DATel 399.3

  ప్రజలకి శాంతి ఆనందాల మార్గం బోధించిన ప్రభువు వారి ఆధ్యాత్మిక అవసరాల్ని గురించి ఆలోచించినట్లే వారి శారీరకావసరాల్ని గురించి ఆలోచించాడు. ప్రజలు అలసిపోయారు. శక్తి శూన్యులై ఉన్నారు. అడ్డంలో చంటి పిల్లలున్న తల్లులున్నారు. తల్లి కొంగు పట్టుకుని ఉన్న చిన్నబిడ్డలున్నారు. చాలా మంది గంటలు తరబడి నిలబడి ఉన్నారు. యేసు మాటలు వినాలని ఆశతో వేచి ఉన్నారు. అందుచేత కూర్చోవాలన్న తలంపు ఒకసారి కూడా వారికి రాలేదు. ప్రజాసమూహం విస్తారంగా ఉన్నందున తొక్కిసలాట ప్రమాదం కూడా ఉంది. విశ్రమించడానికి అవకాశం ఇవ్వాలని యేసే వారిని కూర్చోవలసిందిగా కోరాడు. అది గడ్డి ఉన్న ప్రదేశం కావడంతో అందరూ సుఖంగా విశ్రమించవచ్చు.DATel 400.1

  వాస్తవిక అవసరం ఏర్పడితే తప్ప క్రీస్తు ఎన్నడూ అద్భుతం చెయ్యలేదు. ఏ వృక్షం ఆకులు జనాల స్వస్తతకు ఉపయుక్తమౌతాయో ఆ జీవవృక్షం వద్దకు ప్రజల్ని నడిపించేదిగా ప్రతీ అద్భుతకార్యం ఉంటుంది. శిష్యుల చేతుల ద్వారా పంపిణీ అయిన సామాన్యాహారంతో ఎన్నో విలువైన పాఠాలున్నాయి. పంపిణీ ఆహారం సామాన్యమయ్యిందే. చేపలు యవల రొట్టెలు గలిలయ సముద్ర ప్రాంతంలోని జాలరుల అనుదినాహారం. ఆ ప్రజలముందు గొప్ప విందు భోజనాన్ని క్రీస్తు ఉంచగలిగేవాడే. కాకపోతే ఆకలి తీర్చడానికి తయారు చేసిన భోజనం వారికి మేలు చేసే పాఠం అందించలేదు. దేవుడు మానవుడికి ఏర్పాటు చేసిన స్వాభావిక ఆహారపదార్థాల్ని అతడు దురుపయోగిస్తున్నాడని ఈ పాఠంలో క్రీస్తు బోధించాడు. మానవ నివాసానికి ఎంతో దూరంలో ఉన్న ఈ జనసమూహానికి యేసు సమకూర్చిన సామాన్య భోజనం ఇచ్చినంత తృప్తిని విశ్రాంతిని, వక్రమైన రుచుల తృప్తి కోసం తయారు చేసిన ఏ విందు భోజనం ఇవ్వలేదు.DATel 400.2

  ఆదిలో ఆదామవ్వలమల్లే ప్రకృతి చట్టాలికి అనుగుణంగా నివసిస్తూ మనుషులు నేడు సామాన్య అలవాట్లు కలిగి నివసిస్తే, మానవ కుటుంబ అవసరాలికి సమృద్ధిగా సరఫరాలుండేవి. ఊహాజనిత అవసరాలు బహు తక్కువ ఉండేవి. దేవుని మార్గాన్ననుసరించి పని చెయ్యడానికి ఎక్కువ అవకాశాలుండేవి. అయితే స్వార్ధం అస్వాభావిక అభిరుచులు వాంఛల నెరవేర్పు లోకంలోకి పాపాన్ని దుఃఖాన్ని తెస్తోంది. ఓ పక్క సమృద్ధి ఉంటే ఓ పక్క లేమి దర్శనమిస్తోంది.DATel 401.1

  సుఖభోగ వాంఛలు తృప్తి పర్చడం ద్వారా మనుషుల్ని ఆకట్టుకోడానికి యేసు ప్రయత్నించలేదు. సుదీర్ఘమైన ఉద్రేకంతో నిండిన ఆదినం చివరిలో అలసిపోయి, ఆకలిగా ఉన్న ఆ మహాజనసమూహానికి ఆయన ఇచ్చిన సామాన్యమైన ఆహారం ఆయన శక్తిని గూర్చిన నిశ్చయతను మాత్రమే గాక జీవితంలోని సామాన్య అవసరాల్ని తీర్చడంలో కూడా ఆయన శ్రద్ధను ఆసక్తిని సూచిస్తోంది. వారి ఆహారం సామాన్యమయ్యింది అరకొరగానిది కావచ్చు. వారు పేదరికంతో సతమతమౌతున్న వారే కావచ్చు. కాని వారి అవసరాలు తీరుస్తానని ఆయన మాట ఇచ్చాడు. లోకం సమకూర్చే మేలు కన్నా ఎంతో మొరుగైన దాన్ని - నిత్యం ఉండే తన సన్నిధి ఆవరణను - ఆయన వాగ్దానం చేస్తోన్నాడు.DATel 401.2

  అయిదు వేల మందికి ఆహారం పెట్టడంలో యేసు ప్రకృతి ప్రపచం మిద తెరలేపి, మన శ్రేయం కోసం నిరంతరం పనిచేసే శక్తిని ప్రదర్శించాడు. భూమిపై పండుతున్న పంటల్లో ప్రతీ దినం దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. జనసమూహానికి ఆహారం పెట్టడంలో ఏ శక్తి పని చేసిందో అదే శక్తి స్వాభావిక సాధనాల ద్వారా పని చేసి కార్యసిద్ధి సాధిస్తోంది. మనుషులు నేలదున్ని విత్తనాలు జల్లుతారు. అయితే ఆ విత్తనం మొలకెత్తడానికి కారణమయ్యేది దేవుని వద్ద నుంచి వచ్చే జీవమే. “మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను” పుట్టించేది (మార్కు 4:28) దేవుడిచ్చే వర్షం, గాలి, సూర్యరశ్మి. భూమి పండే పంటలతో అనుదినం కోట్ల ప్రజలకు ఆహారం పెడుతున్నది దేవుడే. గింజ విషయమైన శ్రద్ధలోను ఆహారం తయారీలోను మనుషులు దేవునికి సహకరించాల్సిందిగా ఆయన కోరుతున్నాడు. అయితే వారు దైవశక్తిని విస్మరిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లించరు. ఆయన శక్తి వలన జరుగుతున్న పని స్వాభావిక కారణాలవల్ల లేదా మానవ సాధనాల వల్ల జరిగినట్లు చెబుతారు. దేవుని బదులు మానవుణ్ని శ్లాఘిస్తారు. ఆయన వరాల్ని స్వార్ధప్రయోజనాలికి వినియోగించుకుంటారు. ఇలా వాటిని దీవెనలుగా కాక శాపాలుగా మార్చుతారు. ఈ మొత్తం పరిస్థితిని మార్చడానికి దేవుడు ప్రయత్నిస్తోన్నాడు. మందకొడిగా ఉన్న మన ఇంద్రియాలు ఆయన దయకనికరాల్ని గ్రహించి ఆయన శక్తి వల్ల జరుగుతున్న కార్యాలికి ఆయన్ని మహిమపర్చడానికి ఉత్తేజం పొందాలని ఆయన ఆకాంక్షిస్తోన్నాడు. ఈ కార్యాన్ని సాధించడానికే క్రీస్తు అద్భుతాలు చేశాడు.DATel 401.3

  జనసమూహం తిన్న తర్వాత చాలా ఆహారం మిగిలింది. అయితే అనంతశక్తి తన ఆధీనంలో ఉన్న ప్రభువు ఇలా అన్నాడు, “ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడి.” ఈ మాటల అర్ధం రొట్టెముక్కల్ని గంపల్లో పెట్టడం కన్నా ఎక్కువే. ఇందులో రెండు పాఠాలున్నాయి. ఏమి వృధాకాకూడదు. మనం లౌకిక లాభాన్ని జారవిడువకూడదు. ఓ మనిషికి ఉపకరించేది ఏదైనా దాన్ని మనం నిర్లక్ష్యం చేయ్యకూదడు. లోకంలో ఆకలిబాధితుల అవసరాల్నితీర్చే ప్రతీ వస్తువును పోగుచేద్దాం. ఆధ్యాత్మిక విషయాల్లోనూ ఇదే జాగ్రత్తను పాటించడం అవసరం. ముక్కలు పోగుచేసి గంపల్లోకి ఎత్తినప్పుడు ప్రజలు ఇంటివద్ద ఉన్న తమ మిత్రుల గురించి ఆలోచించారు. క్రీస్తు దీవించిన రొట్టెను వారితో పంచుకోవాలని అభిలషించారు. జనసమూహాంలో ఆతురుతగా ఉన్న వారికి గంపల్లో ముక్కలు పంచి పెట్టగా వాటిని వారు పరిసరాన ఉన్న ప్రాంతమంతటా పంచిపెట్టారు. అలాగే విందులో ఉన్నవారు పరలోకం నుంచి వచ్చిన రొట్టెను తమ ఆత్మలోని ఆకలి తీర్చుకునేందుకు ఇతరులతో పంచుకోవాల్సి ఉంది. దేవుని గురించి తాము నేర్చకున్న విషయాలు వారు వల్లించారు. దేన్నీ జారవిడుచుకోడానికి లేదు. తమ నిత్యజీవానికి సంబంధించిన ఏ విషయాన్ని తోసిపుచ్చకూడదు.DATel 402.1

  రొట్టెల్ని గూర్చిన అద్భుతం దేవునిపై ఆధారపడడం అన్న పాఠాన్ని నేర్పుతోంది. క్రీస్తు అయిదువేల మందికి ఆహారం పెట్టినప్పుడు, దగ్గరలో ఆహారం లేదు. తన అందుబాటులో మార్గాలు ఏమి లేనట్లు కనిపించింది. పిల్లలు స్త్రీలుగాక అయిదువేల మంది ప్రజలున్నారు. అది అరణ్యప్రదేశం. తన వెంట రమ్మని ఆ జనుల్ని ఆయన ఆహ్వానించలేదు. వారంతా ఆహ్వానం లేకుండానే వచ్చారు. అంతసేపు తన ప్రసంగం విన్నతర్వాత వారు ఆకలిగా ఉంటారని అలసిపోతారని ఆయనకు తెలుసు. ఎందుకంటే వారందరిలాగే ఆయన కూడా ఆకలిగా ఉన్నాడు. ప్రజలు తమ గృహాలికి ఎంతో దూరంలో ఉన్నారు. చీకటి పడుతోంది. వారి నిమిత్తం నలభై దినాలు అరణ్యంలో ఉపవాసమున్న ఆయన ఇప్పుడు వారిని ఆకలితో ఇళ్లకు పోనివ్వడానికి ఇష్టపడలేదు. క్రీస్తుని ఆ పరిస్థితిలోకి నడిపించింది. దేవుడే. తనను ఆ పరిస్థితిలో నుంచి కాపాడడానికి ఆయన తన పరలోకపు తండ్రి మీద ఆధారపడ్డాడు.DATel 403.1

  సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో మనం దేవుని మీద ఆధారపడాలి. లెక్కలేనితనంగా వ్వవహరించడం వల్ల కష్టాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు, జీవితానికి సంబంధించిన ప్రతీకార్యంలోను మనం జ్ఞానాన్ని వివేచనను ఉపయోగించాలి. దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన అనుగ్రహించిన వసతుల్ని దుర్వినియోగపర్చి కష్టాల్లో పడకూడదు. క్రీస్తు సేవకులు ఆయన ఆదేశాల్ని శిరసావహించాలి. పని దేవునిది. మనం పరులకు ఉపకారులం కావాలని ఆకాంక్షిస్తే ఆయన ప్రణాళికల్ని అనుసరించడం అవసరం. స్వార్ధం కేంద్రస్థానంలో ఉండకూడదు. అసలు స్వార్ధానికి గౌరవం స్థానం ఇవ్వకూడదు. మనం మన అభిప్రాయాల్ని ఆధారం చేసుకుని ప్రణాళికలు తయారు చేసుకుంటే, ప్రభువు మనల్ని మన పొరపాట్లలోనే ఉంచుతాడు. కాని ఆయన ఆదేశాల్ని అనుసరిస్తున్నప్పుడు మనం చిక్కుల్లో పడితే ఆయన మనల్ని ఆదుకుంటాడు. మనం నిరాశ చెంది నిష్క్రమించకూడదు. ప్రతీ అత్యవసర పరిస్థితిలోను అనంత వనరులు కలిగి ఉన్న ఆయన సహాయాన్ని మనం అర్ధించాలి. తరచు మనల్ని కష్టపరిస్థితులు ఆవరిస్తుంటాయి. అప్పుడు మనం పూర్ణ విశ్వాసంతో ప్రభువును ఆశ్రయించాలి. ప్రభువు మార్గాన్ని అనుసరించడంలో ఆందోళనకు గురిఅయ్యే ప్రతీ ఆత్మను ఆయన కాపాడాడు.DATel 403.2

  “నీ ఆహారమను ఆకలిగొనిన వారికి పెట్టుటయు” నీ రక్తసంబంధికి ముఖము తప్పింపకుండుటయు” “వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు” “దిక్కుమాలిన బీదలను నెయింట చేర్చుకొనుటయు” చేయాలని ప్రవక్త ద్వారా మనల్ని క్రీస్తు ఆదేశిస్తోన్నాడు. యెషయా 16:15. అవసరం ఎంత విస్తృతమైందో, మనకు ఉన్న నిధులు ఎంత స్వల్పమో అన్నది గ్రహించినప్పుడు మన హృదయాలు కుంగిపోడం, మన విశ్వాసం క్షీణించడం ఎంత తరచుగా జరగడం లేదు! అయిదు రొట్టెలు రెండు చిన్న చేపల గురించి అంద్రియ తలంచినట్టు మనం “ఇంతమందికి ఇవి ఏమాత్రము?” అని పెదవి విరుస్తాం. తరచు సందేహిస్తాం. మనకున్నదంతా ఇవ్వడానికి ఇష్టపడం. ఇతరుల కోసం ఖర్చు పెట్టడానికి మనల్ని మనం సమర్ధించుకోడానికి భయపడ్డాం. అయితే “మీరు వారికి భోజనము పెట్టుడి” అని యేసు మనల్ని కోరుతున్నాడు. ఆయన ఆదేశం ఒక వాగ్దానం. సముద్రంపక్క జనసమూహానికి ఆహారం పెట్టిన శక్తే ఈ ఆదేశం వెనుక ఉన్న శక్తి.DATel 404.1

  ఆకలిగా ఉన్న జనసమూహం భౌతిక అవసరాన్ని తీర్చడానికి క్రీస్తు గైకొన్న చర్యలో ఆయన సేవకులికి గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఉంది. క్రీస్తు తండ్రి వద్ద నుంచి పొందాడు. దాన్ని శిష్యులికిచ్చాడు. వారు దాన్నే జనసమూహానికి ఇచ్చారు. ప్రజలు ఒకరికొకరు ఇచ్చుకున్నారు. అలాగే క్రీస్తుతో సమైక్యత కలిగి ఉన్నవారు క్రీస్తు వద్ద నుంచి పరలోకాహారం అందుకుని దాన్ని ఇతరులికి అందిస్తారు.DATel 404.2

  దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డ యేసు ఆ కొద్ది రొట్టెముక్కల్ని స్వీకరించాడు. తన సొంత శిష్య కుటుంబానికి కొంచెం ఉంచినప్పటికి తినమని వారిని ఆహ్వానించలేదు. వారికి పంచి పెట్టి ప్రజలికి వడ్డించాల్సిందిగా ఆదేశించాడు. ఆయన చేతుల్లో ఆహారం అధికమయ్యింది. తానే రొట్టి అయిన క్రీస్తును ముట్టుకుంటున్న శిష్యుల చేతులు శూన్యంగా లేవు. ఆ చిన్న నిల్వే అందరికీ సరిపోయింది. ప్రజల అవసరాలు తీరిన తర్వాత ముక్కల్ని పోగు చేశారు. క్రీస్తు ఆయన శిష్యులు కలిసి పరలోకం నుంచి సరఫరా అయిన ఆ ఆహారాన్ని భుజించారు.DATel 404.3

  శిష్యులు ప్రజలకు క్రీస్తుకి మధ్యవర్తులుగా వ్యవహరించారు. నేడు ఆయన శిష్యులికి ఇది గొప్ప ప్రోత్సాహాన్నియ్యాలి. యేసే గొప్ప కేంద్రం. సర్వశక్తికి ఆయనే నిలయం. శిష్యులు తమకు అవసరమైన సరఫరాల్ని ఆయన వద్దనుంచి పొందాలి. మిక్కిలి ప్రతిభావంతులు మిక్కిలి ఆధ్యాత్మికులు తాము పొందిన దాని ప్రకారమే ఇతరులకి ఇవ్వగలుగుతారు. ఆత్మకు అవసరమైనదాన్ని తమంతట తామే సరఫరా చేసుకోలేరు. మనం క్రీస్తు వద్ద నుంచి పొందిన దాన్నే ఇతరులికి ఇవ్వగలం. మనం ఇస్తూ ఉంటుంటే పొందుతూ ఉంటాం. మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పొందుతాం. ఈ రీతిగా మనం ఎల్లప్పుడూ నమ్ముతూ, విశ్వసిస్తూ, పొందుతూ, ఇస్తూ ఉండవచ్చు.DATel 405.1

  క్రీస్తు రాజ్యనిర్మాణ కార్యం ముందుకు సాగుతూనే ఉంటుంది. నెమ్మదిగా సాగుతున్నట్లు కనిపించినా, పురోగతికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నట్లు కనిపించే అసాధ్యాలు ఉన్నప్పటికీ ఆ కార్యం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ కార్యం దేవునిది. నిధుల్ని ఆయనే సమకూర్చుతాడు. సహాయకుల్ని చిత్తశుద్ది నిజాయితీ గల శిష్యుల్ని ఆయనే పంపుతాడు. ఆకలి బాధతో నశిస్తున్న జనసమూహాలికి ఇచ్చేందుకు వారి చేతులు కూడా ఆహారంతో నిండి ఉంటాయి. నశిస్తున్న ఆత్మలకి జీవ వాక్యాన్ని అందించడానికి ప్రేమతో శ్రమించే వారు ఆకలిగా ఉన్న ఇతర ఆత్మలు ఆహారం కోసం చేతులు చాపడం దేవుడు మర్చిపోడు.DATel 405.2

  దేవునికి మనం చేసే సేవలో మన వరాలు ప్రతిభతో చేయగల పనిమిద ఎక్కువ ఆధారపడే ప్రమాదం ఉంది. పని చేసే ఆ ప్రభువుని ఇలా విస్మరిస్తుంటాం. క్రీస్తు సేవకుడు తరచు తనవ్యక్తిగత బాధ్యతను గుర్తించడు. సర్వశక్తికి మూలమైన ఆయన మీద ఆధారపడే బదులు అతడు తన భారాన్ని వ్వవస్థల మిద మోపుతూ ఉంటాడు. దేవుని సేవలో మానవ జ్ఞానం మీద లేదా సంఖ్య మిద నమ్మకం పెట్టుకోడం గొప్ప పొరపాటు. క్రీస్తు సేవలో జయం సంఖ్య మీద గాని వరాల మీద గాని కాక ఆ సేవ తాలూకు పవిత్ర ఉద్దేశం మీద చిత్త శుద్ధిగల నిరాడంబర విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. క్రీస్తుని ఎరుగని విషయంలో వ్యక్తిగత బాధ్యత వహించాలి. వ్యక్తిగత విధుల్ని చేపట్టాలి. వ్యక్తిగత కృషి చెయ్యాలి. నాకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్నదని వారు భావించే వారి మీద నా బాధ్యత పెట్టే బదులు మిరే మీ శక్తి మేరకు పని చెయ్యాలి.DATel 405.3

  “వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుము?” అన్న ప్రశ్న నాకు వచ్చినప్పుడు నా జవాబు అపనమ్మకాన్ని వ్యక్తం చేసేది కాకూడదు. “సరే వారికి భోజనము పెట్టుడి” అన్న రక్షకుని ఆదేశాన్ని శిష్యులు విన్నప్పుడు వారి మనసుల్లో అన్ని రకాల కష్టాలూ పుట్టుకొచ్చాయి. ఆహారం కొనడానికి గ్రామాల్లోకి వెళ్లమా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలు జీవాహారం లేకుండా ఉన్నప్పుడు వారికి ఆహారం పెట్టడానికి దూరం నుంచి ఎవరినైనా పంపేదా? అని దైవప్రజలు ప్రశ్నిస్తారు. అయితే క్రీస్తు ఏమన్నాడు? “జనులను కూర్చుండబెట్టుడి” అని వారికి అక్కడ ఆహారం పెట్టాడు. కనుక ప్రజలు నా చుట్టూ చేరినప్పుడు, క్రీస్తు అక్కడ ఉన్నాడని గుర్తెరగండి. ఆయనతో సంప్రదించండి. మీ యవల రొట్టెల్ని యేసు వద్దకు తీసుకురండి.DATel 406.1

  మన వద్ద ఉన్న వనరులు ఆయన పనికి చాలనట్లు కనిపంచవచ్చు. కాని మనం విశ్వాసంతో దేవుని సర్వశక్తి పై నమ్మకంతో ముందడుగు వస్తే నిధులు సమృద్ధిగా మన ముందుకి వస్తాయి. ఆ సేవ దేవుని సేవ అయితే దాని పరిపూర్తికి ద్రవ్యాన్ని ఆయనే సమకూర్చుతాడు. తన మీద ఆధారపడే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఉన్న కొంచెంని తెలివిగా జాగ్రత్తగా దేవుని సేవాభివృద్ధికి వినియోగించినట్టయితే, ఆ క్రియ మూలంగా అది పెరుగుతుంది. ఆకలిగా ఉన్న జనసమూహం తృప్తిగా భోజనం చేసే వరకు ఆ కొంచెం ఆహారం క్రీస్తు చేతిలో తరుగు లేకుండా నిలిచి ఉంది. సర్వశక్తికి నిలయమైన ప్రభువు వద్దకు విశ్వాస హస్తాలు చాపి వస్తే, మన సేవలో మనకు తృప్తి కలుగుతుంది. అతి కష్టపరిస్థితుల్లో సయితం మనకు తృప్తి కలుగుతుంది. ఇతరులికి జీవాహారాన్ని ఇవ్వడానికి మనం శక్తి పొందుతాం. ప్రభువిలా అంటున్నాడు, “ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును.” “కొంచెముగా విత్తువాడు, కొంచెము పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును..... మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మిలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడుDATel 406.2

  నా యెడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై -DATel 407.1

  “అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను
  అతని నీతి నిరంతరము నిలుచును”
  DATel 407.2

  అని వ్రాయబడియున్నది. “విత్తు వానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు నాకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణాదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతిఫలములు వృద్ధి పొందించును.” లూకా 6:38; 2 కొరి 9:6-11.DATel 407.3