Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  45—ఛాయారూపక సిలువ

  భూమిపై క్రీస్తు కర్తవ్యం శరవేగంగా అంతానికి వస్తోంది. తన అడుగులు పట్తోన్న దిశ అక్కడ చోటుచేసుకోనున్న దృశ్యాలు ఆయన ముందున్నాయి. ఆయన మానవ రూపం ధరించకముందు సయితం నశించిన వారిని రక్షించడానికి తాను నడవవలసిన మార్గాన్ని ఆది నుంచి అంతం వరకూ ఆయన చూశాడు. తన హృదయాన్ని చీల్చనున్న ప్రతీ బాధ తాను భరించనున్న ప్రతీ అవమానం తాను పొందనున్న ప్రతీ లేమి తన కిరీటాన్ని పక్కన పెట్టి, తన దేవత్వాన్ని మానవత్వంలో మరుగు పర్చడానికి తన సింహాసనం నుంచి దిగకముందు - అంతా ఆయన స్పష్టంగా చూశాడు. పశువుల తొట్టి దగ్గర నుంచి కల్వరి సిలువ వరకూ ఉన్న మార్గం ఆయన కళ్లముందుంది. తాను పొందనున్న హృదయ వేదన ఆయనకు తెలుసు. అంతా ఆయనకు తెలుసు. అయినా ఆయన ఇలా అన్నాడు, “పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది.” కీర్త 40:7, 8.DATel 453.1

  తన పరిచర్య ఫలితం నిత్యం తన ముందుంది. శ్రమతో ఆత్మార్పణతో నిండిన తన ఇహలోక జీవితంలో తాను పొందిన శ్రమంతా వ్యర్ధం కాదన్న ఆశావహభావన ఆనందాన్ని కూర్చింది. మానవులు నిత్యం జీవించడం కోసం తన ప్రాణాన్నివ్వడం ద్వారా లోకాన్ని తిరిగి దేవుని వద్దకు చేర్చుతాడు. ముందు రక్తంతో బాప్తిస్మం జరగాల్సి ఉన్నా నిరపరాధి అయిన ఆయనపై లోక పాపాల భారం పడునున్నా; చెప్పనలవిగాని దుఃఖ ఛాయ ఆయన మీద ఉన్నా, తన ముందున్న ఆనందం నిమిత్తం సిలువను భరించడానికి ఆయన ఎంపిక చేసుకుని సిగ్గును భరించాడు.DATel 453.2

  తన ముందున్న ఈ దృశ్యాలు పరిచర్య నిమిత్తం తాను ఎంపిక చేసుకున్న మిత్రులికి ఇంకా ప్రదర్శితం కాలేదు. అయితే ఆయన ఆవేదనను వారు చూడాల్సి ఉన్న సమయం దగ్గరపడ్తోంది. తాము ప్రేమించి విశ్వసించిన ప్రభువు శత్రువులికి అప్పగించబడడం, దరిమిల కల్వరి సిలువ మీద వేలాడడం వారు చూడాలి. తన భౌతిక సన్నిధి లేకుండా ప్రపంచాన్ని ఎదుర్కోడానికి వారిని విడిచి త్వరలో ఆయన వెళ్లిపోవాల్సి ఉన్నాడు. తీవ్రద్వేషం, అవిశ్వాసం వారిని హింసించనుందని ఆయనకు తెలుసు. ఆ శ్రమలకు వారిని సన్నద్ధం చెయ్యాలని ఆయన భావించాడు.DATel 454.1

  యేసు ఆయన శిష్యులు ఫిలిప్పుకు చెందిన కైసరయ పట్టణాల్లో ఒక పట్టణానికి వచ్చారు. వారు గలిలయ సరిహద్దులికి దూరంగా ఉన్నారు. అది విగ్రహారాధన ప్రబలంగా ఉన్న ప్రాంతం. శిష్యులు యూదు మత నియంత్రణకు ఇక్కడ దూరంగా ఉన్నారు. ఇక్కడ వారు అన్యదేవతారాధనతో దగ్గర పరిచయం కలిగి ఉన్నారు. ప్రపంచం అన్ని ప్రాంతాల్లో ఉన్న మూఢనమ్మకాలు ఇక్కడ వారి చుట్టూ ఉన్నాయి. అన్యజనుల పట్ల తమ బాధ్యతను గుర్తించడానికి ఈ విషయాలు శిష్యుల్ని నడిపించాలని క్రీస్తు కోరుకున్నాడు. ఆ ప్రాంతంలో తానున్న కాలంలో ప్రజలకి బోధించకుండా ఉండి తన శిష్యులికే తన సమయాన్నంతటిని వినియోగించాలనుకున్నాడు.DATel 454.2

  తనకు రానున్న శ్రమల గురించి వారికి చెప్పడానికి సిద్ధమయ్యాడు. కాని దానికి ముందు ఆయన ఏకాంతంగా వెళ్లి, వారు తన మాటల్ని అంగీకరించడానికి వారి మనసుల్ని సిద్ధం చెయ్యమని దేవునికి ప్రార్ధించాడు. తిరిగి వచ్చిన వెంటనే తాను చెప్పవలసిన విషయాల్ని వారికి చెప్పలేదు. ఈ పని చెయ్యకముందు రానున్న శ్రమలకు బలం పొందడానికి గాను వారు తనపై విశ్వాసాన్ని వ్యక్తం చెయ్యడానికి వారికో అవకాశం ఇచ్చాడు. “మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారు?” అని వారిని అడిగాడు.DATel 454.3

  ఇశ్రాయేలు ప్రజలు తమ మెస్సీయాను గుర్తించలేదని శిష్యులు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇది శోచనీయం! కొందరు ఆయన చేసిన సూచక క్రియలు చూసి ఆయన్ని దావీదు కుమారుడని ప్రకటించారు. బేత్సయిదా సంఘటనలో ఉన్న జనం ఆయన్ని ఇశ్రాయేలు రాజుగా ప్రకటించాలని పట్టుపట్టారు. కాని ఆ ప్రజలు ఆయన్ని మెస్సీయాగా స్వీకరించలేదు.DATel 454.4

  శిష్యులనుద్దేశించి యేసు ఈ ప్రశ్నవేశాడు: “మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు?” “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” అని పేతురు బదులిచ్చాడు.DATel 455.1

  యేసు మెస్సీయా అని పేతురు మొదటినుంచి నమ్మాడు. బాప్తిస్మమిచ్చే యోహాను బోధవల్ల మారుమనసు పొంది క్రీస్తును స్వీకరించిన వారిలో అనేకులు అతణ్ని చెరసాలలో వేసి చంపినప్పుడు అతని పరిచర్య విషయమై సందేహపడ్డాడు. వారిప్పుడు యేసు మెస్సీయా అని నమ్మలేదు. దీర్ఘకాలంగా తాము కని పెట్టిన మెస్సీయా ఆయన కాడని నమ్మారు. యేసు దావీదు సింహాసనంపై కూర్చుంటాడని ఆశతో ఎదురుచూసిన అనేకమంది శిష్యులు ఆయనకి ఆ ఉద్దేశం లేదని గ్రహించినప్పుడు ఆయన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. అయితే పేతురు అతని మిత్రులు ఆయనకు నమ్మకంగా నిలిచారు. నిన్న ప్రశంసించి నేడు విమర్శించిన వారి చాపల్యం రక్షకుని యధార్ధ అనుచరుల విశ్వాసాన్ని నాశనం చెయ్యలేదు. పేతురు ఇలా ప్రకటించాడు, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు.” తన ప్రభువుకి రాచమర్యాదల కోసం ఎదురు చూడక ఆయన్ని ఆయన దీన స్థితిలోనే స్వీకరించాడు.DATel 455.2

  పేతురు ఆ పన్నెండు మంది విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అయినా శిష్యులు క్రీస్తు కర్తవ్యాన్ని అర్థం చేసుకోలేదు. యాజకులు ప్రధానుల వ్యతిరేకత దుష్ప్రచారం క్రీస్తు నుంచి వారిని దూరం చెయ్యలేకపోయినా వారికి అందోళనను మాత్రం కలిగించాయి. వారి మార్గం అగమ్యగోచరంగా కనిపించింది. వారి తొలినాళ్ల శిక్షణ ప్రభావం, రబ్బీల బోధలు, సంప్రదాయం శక్తి, సత్యం విషయంలో వారికింకా దృష్టి మాంద్యం కలిగిస్తోన్నాయి. అప్పుడప్పుడు క్రీస్తు వద్ద నుంచి అమూల్యమైన వెలుగు వారి మీద ప్రకాశించింది. అయినా వారు చీకటిలో దారి కోసం తడుముకొంటున్న మనుషుల్లా ఉన్నారు. కాని ఈ దినాన, తమ విశ్వాస పరీక్షకు నిలబడినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. కొంతసేపు వారి కళ్లు “దృశ్యమైన వాటి” నుంచి “అదృశ్యమైన వాటి” మీదికి మళ్లాయి. 2 కొరి 4:18. మానవ రూపంలో ఉన్న దైవ కుమారుని మహిమను వారు వీక్షించారు.DATel 455.3

  యేసు పేతురుకి ఇలా సమాధానం ఇచ్చాడు, “సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే కాని నరులు నీకు బయలుపరచలేదు.”DATel 456.1

  పేతురు వచించిన సత్యం విశ్వాసి నమ్మకానికి పునాది. నిత్య జీవమని క్రీస్తు చెప్పింది ఇదే. అయితే ఈ జ్ఞానం ఆత్మ ఔన్నత్యానికి దారి తీయకూడదు. తన జ్ఞానం వల్ల గాని లేక తన మంచితనం వల్ల గాని పేతురు ఈ విషయం తెలుసుకోలేదు. మానవుడు తనంతట తాను దేవుని గూర్చిన జ్ఞానాన్ని సముపార్జించలేడు. “అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళము కంటె లోతుగా నున్నది, నేవేమి యెరుగుదువు?” యోబు 11:8. దేవుని లోతైన విషయాల్ని దత్తత స్వీకరణ స్వభావమే మనకు విశదం చేస్తుంది. అవి “కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. మనుష్య హృదయమునకు గోచరము కాలేదు.” “మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలు పరచియున్నాడు.” 1 కొరి 2:9, 10. “యెహోవా మర్మము ఆయన ముందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది.” పేతురు క్రీస్తు మహిమను గ్రహించగలిగాడన్నది అతడు “దేవుని చేత బోధింప” బడ్డాడనడానకి నిదర్శనం. కీర్త 25:14; యోహా 6:45. నిజంగా “సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరచెనే కాని నరులు నీకు బయలుపరచలేదు.”DATel 456.2

  యేసు ఇంకా ఇలా అన్నాడు, “నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు.” పేతురు అన్న మాటకు రాయి అని అర్ధం - దొర్లిపోయే రాయి. సంఘం ఏ రాతి మీద నిర్మితమయ్యిందో ఆ రాయి పేతురు కాదు. శపిస్తూ ఒట్టు పెడూ అతడు ప్రభువుని ఎరుగనని బొంకినప్పుడు పాతాళలోక ద్వారాలు అతడి ఎదుట నిలిచాయి. అయితే సంఘం ఎవరి మీద నిర్మితమయ్యిందో ఆ ప్రభువుని పాతాళ ద్వారాలు ఆపలేకపోయాయి.DATel 456.3

  రక్షకుని రాకకు ఎన్నో శతాబ్దాల ముందే మోషే ఇశ్రాయేలు రక్షణ శృంగం గురించి ప్రస్తావించాడు. కీర్తన కారుడు “బలమైన ఆశ్రయ దుర్గము” గురించి గానం చేశాడు. యెషయా ఇలా రాశాడు, “ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు - సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే; అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది. ” ద్వితి 32:4; కీర్త 62:7; యెష 28:16. ఆవేశం వల్ల రాస్తూ స్వయాన పేతురు ఈ ప్రవచనాల్ని యేసుకు వర్తింపజేస్తోన్నాడు. అతడిలా అంటోన్నాడు, “మనుష్యుల చేత విసర్జించబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చువారై... మీరును సజీవమైన వాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.” 1 పేతు 2:3-5.DATel 456.4

  “వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.” 1 కొరి 3:11. “ఈ బండ మీద సంఘమును కట్టుదును.” అన్నాడు యేసు. దేవుని సముఖంలోను, పరలోక వాసుల సముఖంలోను అదృశ్యమైన పాతాళలోక సైన్యం సముఖంలోను యేసు తన సంఘాన్ని సజీవమైన బండమీద నిర్మించాడు. ఆ బండ ఆయనే. అది మన కోసం నలుగగొట్టబడిన గాయపర్చబడిన ఆ ప్రభువు శరీరం. ఈ పునాది మీద నిర్మితమైన సంఘానికి ఎదురుగా పాతాళ ద్వారాలు నిలువలేవు.DATel 457.1

  క్రీస్తు ఈ మాటలన్నప్పుడు సంఘం ఎంత బలహీనంగా ఉంది! కొద్ది మంది విశ్వాసులు మాత్రమే ఉన్నారు. వారిపై దాడికి దయ్యాల శక్తి దుర్జనుల శక్తి మోహరించి ఉంది. అయినా క్రీస్తు అనుచరులు భయపడాల్సిన అవసరం లేదు. బలమైన బండపై నిర్మితమైన వారిని ఎవరూ కూలదొయ్యలేరు.DATel 457.2

  ఆరువేల సంవత్సరాల పాటు క్రీస్తుపై విశ్వాసం నిర్మితమౌతూ వస్తోంది. మన రక్షణ దుర్గాన్ని ఆరువేల సంవత్సరాలుగా సాతాను ఆగ్రహమనే వరదలు గాలి తుపానులు ఢీకొంటూ ఉన్నాయి. అయినా అది స్థిరంగా నిలిచి ఉంది. దానికి చలనం లేదు.DATel 457.3

  పేతురు వెలువరించిన సత్యం సంఘ విశ్వాసానికి పునాది. ఇప్పుడు యేసు పేతురుని విశ్వాసుల సమూహానికి ప్రతినిధిగా గౌరవించాడు. ఆయనిలా అన్నాడు, “పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును.”DATel 457.4

  “పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు” ఇవి క్రీస్తు మాటలు. పరిశుద్ధ లేఖనాల్లోని మాటలన్నీ ఆయనివే. వాటిని ఇక్కడ వినియోగించడం జరిగింది. పరలోకాన్ని తెరవడానికి, మూసివేయడానికి ఆ మాటలకి శక్తి ఉంది. పరలోకంలో మనుషుల ప్రవేశానికి లేదా వారి తిరస్కృతికి ఆ మాటలే షరతులు నిర్దేశిస్తాయి. దేవుని వాక్యం బోధించే వారి సేవ ఈ విధంగా జీవార్డమైన జీవపు వాసనగానో మరణార్ధమైన మరణపు వాసనగానో ఉంటుంది. వారి కర్తవ్యం నిత్య జీవానికి సంబంధించిన ఫలితాలు గల భారభరిత బాధ్యత.DATel 458.1

  సువార్త పరిచర్య బాధ్యతను రక్షకుడు పేతురొక్కడి మీదే పెట్టలేదు. అనంతర కాలంలో, తాను పేతురుతో అన్న మాటల్ని పునరుచ్చరిస్తూ వాటిని ప్రత్యక్షంగా సంఘానికి అనువర్తించాడు. ఇంచుమించు ఇదే విశ్వాసుల సమాజం ప్రతినిధులైన పన్నెండు మంది శిష్యులికీ చెప్పాడు. శిష్యుల్లో ఒక్కడికి ప్రత్యేకమైన అధికారాన్ని యేసు ఇచ్చి ఉంటే ఎవరు అధికులుగా ఉండాలి అన్న విషయమై శిష్యులు తరచుగా కలహించుకోడం జరిగేది కాదు. ప్రభువు కోరికను మన్నించి ఆయన ఎంపిక చేసిన వ్యక్తిని గౌరవించేవారు.DATel 458.2

  వారికి నాయకుడిగా ఒకన్ని నియమించే బదులు శిష్యులతో క్రీస్తు ఇలా అన్నాడు, “మీరైతే బోధకులని పిలువబడవద్దు”; “మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే నా గురువు.” మత 23:8, 10.DATel 458.3

  “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు.” సమస్తాన్ని రక్షకుని పాదాల కింద ఉంచిన దేవుడు “సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నిలుపుచున్న వాని సంపూర్ణతయైయున్నది.” 1 కొరి 11:3; ఎఫెసీ 1:22, 23. సంఘం క్రీస్తు పునాదిపై నిర్మితమయ్యింది. సంఘం తనకు శిరస్సు అయిన క్రీస్తుకు విధేయంగా ఉండాలి. అది మనుషుడి మీద ఆధారపడకూడదు. మనుషుడి నియంత్రణ కింద ఉండకూడదు. ఇతరులు ఏమి నమ్మాలో, ఏమి చెయ్యాలో నిర్దేశించే అధికారం తమకుందని సంఘంలో హోదా ఉన్న అనేక మంది భావిస్తుంటారు. ఈ హక్కును దేవుడు గుర్తించడు. రక్షకుడిలా అంటున్నాడు, “మీరందరు సహోదరులు.” అందరూ శోధనకు గురి అవుతారు. అందరూ పొరపాట్లు చేస్తారు. మార్గ నిర్దేశం కోసం ఏ మానవుడి మీద మనం ఆధారపడలేం. సంఘంలో క్రీస్తు సజీవ సన్నిదే విశ్వాస బండ. అతి బలహీనుడు దీని మీద ఆధారపడవచ్చు. తాము బలవంతులమని భావించేవారు క్రీస్తుని తమ బలం చేసుకుంటే తప్ప తాము అతి బలహీనులమని నిరూపించుకుంటారు. “నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొను.... వాడు శాపగ్రస్తుడు.” ప్రభువు ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము.” “ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.”DATel 458.4

  పేతురు క్రీస్తుని మెస్సీయాగా ఒప్పుకున్న అనంతరం తాను క్రీస్తునని ఎవరికీ చెప్పవద్దని క్రీస్తు తన శిష్యుల్ని ఆదేశించాడు. శాస్త్రులు పరిసయ్యుల తీవ్ర వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభువు ఈ ఆదేశానిచ్చాడు. అదీగాక, ప్రజలు, శిష్యులు సైతం మెస్సీయాను గూర్చి తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండడంతో ఆయన్ని గూర్చిన బహిరంగ ప్రకటన ఆయన పని విషయంలోను ఆయన ప్రవర్తన విషయంలోను యధార్ధమైన అభిప్రాయాన్ని ఇవ్వకపోవచ్చు. అయితే రోజుకు రోజు ఆయన తన్నుతాను రక్షకుడుగా కనపర్చుకుంటూనే ఉన్నాడు. ఈ రకంగా తన్ను గూర్చి మెస్సీయాగా వారికి వాస్తవమైన అభిప్రాయం కలిగించాలని ఆయన ఆకాంక్షించాడు.DATel 459.1

  క్రీస్తు లోక సంబంధమైన రాజుగా పరిపాలిస్తాడని శిష్యులు ఇంకా కనిపెట్టారు. ఆయన తన ఉద్దేశాన్ని అంతకాలం దాచి ఉంచినా ఎల్లకాలం పేదరికంలోను అనామకుడుగాను ఉండిపోడని వారు భావించారు. ఆయన తన రాజ్యాన్ని స్థాపించే సమయం ఆసన్నమయ్యిందని నమ్మారు. యాజకులు రబ్బీల ద్వేషం ఎన్నటికీ పోదని, స్వజాతి ప్రజలే యేసుని విసర్జించి, మోసగాడిగా తీర్పుతీర్చి, నేరస్తుడిగా సిలువవేసి చంపుతారని శిష్యులు ఎన్నడూ తలంచలేదు. కాని చీకటి శక్తికి ఘడియ సమిపిస్తుంది. తమ ముందున్న సంఘర్షణను గూర్చి ఆయన తన శిష్యులికి వివరించడం అవసరం. ఆ శ్రమ కాలం గురించి ఆలోచిస్తూ ఆయన విచారంగా ఉన్నాడు.DATel 459.2

  తన శ్రమల గురించి మరణం గురించి వారికి ఏమి చెప్పకుండా అప్పుటి వరకు దాచి ఉంచాడు. నీకొదేముతో తన సంభాషణలో ఆయన ఇలా అన్నాడు, “అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఏత్తెనో, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.” యెహో 3:14, 15. శిష్యులు ఈ మాటలు వినలేదు. ఒక వేళ విన్నా వాటిని గ్రహించి ఉండేవారు కారు. అయితే ఇప్పుడు ఆయన మాటలు వింటూ, ఆయన చేస్తున్న అద్భుతాలు చూస్తూ, సాదాసీదా పరిసరాలు, యాజకులు ప్రజల వ్యతిరేకత నడుమ, “నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” అంటూ సాక్ష్యమిచ్చిన పేతురుతో గళం కలిపే వరకు, వారు ఆయనతోనే ఉన్నారు. భవిష్యత్తును మరుగుపరిచే తెర తొలగించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. “అప్పటి నుండి తాను యెరుషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయుటకు మొదలు” పెట్టాడు .DATel 460.1

  దుఃఖంతో విస్మయంతో నిశ్చేష్టితులు అవాక్కు అయి శిష్యులు ఆయన మాటలు వింటోన్నారు. నీవు దేవుని కుమారుడవు అన్న పేతురు ఒప్పుకోలును క్రీస్తు అంగీకరించాడు. తన శ్రమల్ని మరణాన్ని సూచిస్తోన్న మాటలు అర్థం కాకుండా ఉన్నాయి. పేతురు నిశ్శబ్దంగా ఉండలేకపోయాడు. వడిగా వస్తోన్న మరణం నుంచి వెనక్కిలాగుతోన్నట్లు ఆయన్ని వారిస్తూ ఇలా అన్నాడు, “ప్రభువా, అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడును కలుగదు.”DATel 460.2

  పేతురు ప్రభువుని ప్రేమించాడు. కాని శ్రమలు హింసల నుంచి తనను కాపాడడానికి ఇలా కనపర్చిన ఆసక్తిని ప్రభువు అభినందించలేదు. తన ముందున్న మహాశ్రమ దృష్ట్యా యేసుకి పేతరు మాటలు ఆదరణ నిచ్చేవిగా లేవు. నశించిన లోకాన్ని దేవుడు సంకల్పించిన కృపతో గాని, స్వీయ ఆదర్శం ద్వారా యేసు బోధించడానికి వచ్చిన ఆత్మార్పణ పాఠంతో గాని ఆ మాటలు అన్వయించడం లేదు. క్రీస్తు పరిచర్యలో సిలువను చూడాలని పేతురు కోరుకోలేదు. తన అనుచరుల మనసులపై ప్రసరించాలని క్రీస్తు ఆశించిన ప్రభావానికి పేతురు మాటల ప్రభావం ప్రతికూలంగా ఉంది. అందుచేత తాను ఎన్నడూ ఉచ్ఛరించని కటువైన గద్దింపును ప్రభువు ఉచ్చరించాల్సి వచ్చింది; “సాతానా, నా వెనుకపొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావు.”DATel 460.3

  యేసుని నిరుత్సాహపర్చి ఆయన్ని తన కర్తవ్యం నుంచి వైదొలగించాలిని సాతాను ప్రయత్నిస్తోన్నాడు. తన గుడ్డి ప్రేమలో పేతురు సాతాను శోధనకు మాటలు సంగీతం సమకూర్చుతోన్నాడు. ఆ ఆలోచనకు దురంతాల దొర సాతానే కర్త. భావోద్వేగంతో కూడిన పేతురు విజ్ఞప్తి వెనుక సాతాను హస్తం ఉంది. అవమానం, త్యాగం మార్గాన్ని త్యజించాలన్న షరతు పై అరణ్యంలో సాతాను క్రీస్తుకి లోక రాజ్య పాలనని ఇవ్వజూపాడు. ఇప్పుడు అదే శోధనను క్రీస్తు శిష్యుడికి కలిగిస్తోన్నాడు. క్రీస్తు దృష్టి కేంద్రీకృతమౌతోన్న సిలువను చూడకుండా పేతురు దృష్టిని లౌకిక మహిమ వైభవాల మీదికి మళ్లించడానికి చూస్తోన్నాడు. అయితే రక్షకుడు దాన్ని లెక్కచెయ్యలేదు. ఆయన ఆలోచనంతా తన శిష్యుల్ని గురించే. తన నిమిత్తం క్రీస్తు భరించనున్న అవమాన దృశ్యం చూసి పేతురు హృదయం చలించకుండేటట్లు సాతాను అతనికి అతని ప్రభువుకి మధ్యగా వచ్చాడు. క్రీస్తు పలికిన మాటలు పేతురుకి ఉద్దేశించినవి కావు. తనను తన రక్షకుడి నుంచి వేరు చెయ్యడానికి ప్రయత్నిస్తోన్న అపవాదికి. “సాతానా, నా వెనుకకు పొమ్ము.” నాకూ, తప్పు చేస్తోన్న నా సేవకుడికి మధ్యగా రావద్దు. నా ప్రేమను గూర్చిన మర్మాన్ని వివరించేందుకు నేను పేతురుతో ముఖాముఖి మాట్లాడాలి.DATel 461.1

  అది పేతురుకి కఠినమైన పాఠం. దాన్ని ఆలస్యంగా నేర్చుకున్నాడు. లోకంలో క్రీస్తు మార్గం హృదయ వేదన పరాభవం అవమానంతో నిండి ఉంటుందన్నదే ఆ పాఠం. పేతురు బాధననుభవిస్తోన్న తన ప్రభువుతో సహవాసానికి వెనకంజ వేశాడు. అయితే కొలిమి మంటల తీవ్రతలో దాని మేలును గూర్చి అతడు నేర్చుకోవాల్సి ఉంది. చాలా కాలం గతించాక, వయసు, సేవాభారం వల్ల చురుకైన ఆ శరీరం వసివాడి వంగిన తరుణంలో అతడిలా రాశాడు, “ప్రియులారా, మిమ్మును శోధించుటకు నాకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.” 1 పేతరు 4:12, 13.DATel 461.2

  ఆత్మత్యాగంతో నిండిన స్వీయ జీవితం వారి జీవితాలకి ఒరవడి కావాలని యేసు తన శిష్యులికి హితోపదేశం చేశాడు. శిష్యులతో పాటు తన చుట్టూ ఉన్న ప్రజల్ని పిలిచి ఆయన ఈ మాటలన్నాడు, “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.” సిలువ రోము అధికారానికి సంబంధించింది. అతిక్రూరమైన, అవమానకరమైన మరణ సాధనం. ఈ సిలువ. అతి నికృష్ట నేరస్తుడు సిలువను వధ్యా స్థలానికి మోసుకు వెళ్లడం ఆనవాయితీ. సిలువను నేరగాళ్ల భుజాలపై మోపకముందు నేరగాళ్లు దాన్ని దౌర్జన్యంతో ప్రతిఘటించడం వారిని దౌర్జన్యంతో లొంగతీసి ఆ సాధనాన్ని వారి మీద పెట్టి బంధించడం తరచు జరిగేది. అయితే తన సిలువ నెత్తుకుని తనను వెంబడించమని యేసు తన అనుచరుల్ని ఆదేశించాడు. ఆ మాటలు అంతంత మాత్రమే గ్రాహ్యమైనా వారు అతి బాధాకరమైన. అవమానానికి తమ్మునుతాము అప్పగించుకోవాలని క్రీస్తు నిమిత్తం మరణానికి సయితం సిద్ధంగా ఉండాలని ఆయన మాటలు సూచించాయి. పరలోక సంబంధమైన అమూల్య భాగ్యంలో గొప్పవాడైన ప్రభువు బీదవాడయ్యాడు. తన పేదరికం వల్ల మనల్ని గొప్ప వారిని చెయ్యడానికి ఆయన పేదవాడయ్యాడు. ఆయన నడిచిన దారిలోనే మనం నడవాలి.DATel 462.1

  క్రీస్తు ఎవరి కోసం మరణించాడో ఆ ఆత్మల్ని ప్రేమించడమంటే స్వార్ధాన్ని సిలువ వేయడం. ఎవరు దేవుని బిడ్డ అవుతారో అతడు లోకాన్ని రక్షించేందుకు కిందికి దించిన గొలుసులో ఒక లింకుగా ఇక నుంచి తన్నుతాను పరిగణించుకోవాలి. క్రీస్తు కృపా ప్రణాళికలో ఆయనతో ఏకమై నశించిన వారిని వెదకి రక్షించడంలో ఆయనతో పని చెయ్యాలి. క్రైస్తవుడు తన్ను తాను క్రీస్తుకి అంకితం చేసుకున్నానని అతడు తన ప్రవర్తన ద్వారా క్రీస్తుని లోకానికి చూపించాల్సి ఉందని ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి. క్రీస్తు జీవితంలో ప్రదర్శితమైన ఆత్మత్యాగం, సానుభూతి, ప్రేమ, దైవ సేవకుడి జీవితంలో మళ్లీ కనిపించాలి.DATel 462.2

  “తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.” స్వార్ధం మరణమే. శరీరంలోని అవయవం ఏదైనా తన సేవల్ని తనకే పరిమితం చేసుకుంటే అది జీవించలేదు. తన రక్తాన్ని చేతికి తలకి పంపడంలో విఫలమైన గుండె త్వరలో తన శక్తిని కోల్పోతుంది. మన ప్రాణ రక్తంలాగే క్రీస్తు ప్రేమ ఆయన మార్మిక శరీరమంతా వ్యాపిస్తుంది. మనం ఒకరితో ఒకరం నివసించే సభ్యులం. ఇవ్వడానికి నిరాకరించే ఆత్మ నశిస్తుంది. “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము?” అని యేసు అన్నాడు.DATel 462.3

  నాటి పేదరికాన్ని అవమానాన్ని దాటిపోయి, మహిమతో కూడిన తన రాకకు శిష్యుల గమనాన్ని తిప్పాడు. లోక రాజుల హంగు ఆర్భాటంతో గాక దేవుని మహిమతోను పరలోక సమూహాల మహిమతోను ఆ రాకడ చోటుచేసుకుంటుందని చెప్పాడు. ఆ తర్వాత ఆయనిలా అన్నాడు, “అప్పుడాయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును.” అనంతరం వారిని ఉత్సాహపర్చడానికి ఈ వాగ్దానం చేశాడు, “ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” శిష్యులు ఆయన.మాటల్ని అర్ధం చేసుకోలేకపోయారు. ఆ మహిమ చాలా దూరంలో ఉన్నట్లు తోచింది. వారి దృష్టి దగ్గర దృశ్యాల పై నిలిచింది. - లోకంలో పేదలుగా నివసించడం, అవమానానికి ఆప్రతిష్ఠకు, శ్రమలకు గురికావడం. మెన్సీయా స్థాపించనున్న రాజ్యం విషయంలో ఇంతలంతలవుతోన్న వారి ఆశలు అడియాన లేనా? వాటి ని వదులుకోవాల్సిందేనా? తమ ప్రభువు దావీదు సింహాసనాన్ని అధిష్టించడం వారు చూడరా? క్రీస్తు దవాడిగా ఆశ్రయంలేని సంచారిగా నివసించి, తృణీకారానికి విసర్జనకు గురి అయి చంపబడాల్సి ఉన్నాడా? వారు తమ ప్రభువుని ప్రేమించారు. వారి హృదయాలు దుఃఖంతో నిండాయి. వారి హృదయాల్ని సందేహం కూడా పీడిస్తోంది. దేవుని కుమారుడు ఆ విధంగా ఆప్రతిష్ఠకు క్రూరత్వానికి గురికావడం అనూహ్యం! తమకు చెప్పినట్లు హింస అనుభవించి మరణించడానికి తనంతట తానుగా ఈయన ఎందుకు యెరుషలేము వెళ్ళాలి? అని వారు ప్రశ్నించారు. తమకు తన్నుతాను ప్రత్యక్షపర్చుకోక పూర్వం తామున్న చీకటి కన్నా ఇప్పుడు మరింత దట్టమైన చీకటిలో తమ్మును విడిచి అలాంటి కర్మకు తన్నుతాను ఆయన ఎలా అప్పగించుకోగలడు? అని తర్జన భర్జన చేసుకున్నారు.DATel 463.1

  ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలో క్రీస్తు హేరోదుకు, కయపలకు అందుబాటులో లేడని శిష్యులు తర్కించుకున్నారు. యూదుల విద్వేషం మూలంగా రోమీయుల అధికారం మూలంగా ఆయనకు ఎలాంటి భయం లేదు. పరిసయ్యులికి కొంచెం దూరంగా ఉంటూ ఎందుకు అక్కడ పని చెయ్యకూడదు? ఆయన తన్నుతాను మరణానికి అప్పగించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన మరణించాల్సి ఉంటే పాతాళం ద్వారాలు దాని ముందు నిలువలేని రీతిలో ఆయన రాజ్యం స్థాపితం కావడం ఎలా జరుగుతుంది? శిష్యులికి ఇది వాస్తవంగా ఓ మర్మమే.DATel 464.1

  ఈ సమయంలో వారు గలిలయ తీరం వెంబడి ప్రయాణిస్తూ, తమ ఆశలు నిరీక్షణలు మంట గలవనున్న ఆ పట్టణం దిశగా సాగుతోన్నారు. వారు క్రీస్తుతో తర్కించడానికి జడిశారు. కాని వారు నింపాదిగా దుఃఖ స్వరాలతో తమ భవిష్యత్తు ఎలాగుంటుందోనని మాట్లాడుకుంటోన్నారు. ప్రశ్నల నడుమ సయితం పరిస్థితులు తారుమారై తమ ప్రభువుకు సంభవించనున్న విపత్తు తప్పిపోవచ్చని ఆశించారు. దుఃఖిస్తూ, సంశయపడూ, నిరీక్షిస్తూ, భయపడూ, శిష్యులు ఆరు సుదీర్ఘ దినాలు గడిపారు.DATel 464.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents