Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  79—“సమాప్తమైనది”

  తాను ఏపని నిమిత్తం వచ్చాడో అది ముగించే వరకు క్రీస్తు తన ప్రాణాన్ని విడిచిపెట్టలేదు. తన చివరి శ్వాసతో “సమస్తమైనది” అన్నాడు. యెహా 19:30. యుద్ధంలో విజయం సాధించాడు. తన కుడి చెయ్యి తన పరిశుద్ధ హస్తం ఆయనకు విజయం చేకూర్చింది. విజయుడుగా ఆయన తన ధ్వజాన్ని నిత్యత్వ కొండలపై పాతాడు. అందుకు దూతలు ఆనందపరవశులు కాలేదా? రక్షకుని విజయంలో పరలోకం యావత్తు విజయం సాధించింది. సాతాను ఓడిపోయాడు. తన రాజ్యం పోయిందని గ్రహించాడు.DATel 858.1

  దేవదూతలకు, పాపంలో పడని ఇతర లోకనివాసులకు “సమాప్తమైనది” అన్న కేక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. విమోన మహా కర్తవ్యం వారి కోసం మన కోసం సాధిండం జరిగింది. క్రీస్తు విజయఫలాల్ని వారు మనతో పంచుకుంటారు. దేవదూతలకేంటి పాపం వల్ల పతనం కాని ఇతర లోకాల నివాసులకేంటి క్రీస్తు మరణించే వరకూ సాతాను ప్రవర్తన అవగాహన కాలేదు. భ్రష్టాధినేత తన వంచనను ఎంత చక్కగా నిర్వహించాడంటే ఆ పరిశుద్ధులు సయితం అతడి సూత్రాల్ని గ్రహించలేకపోయారు. అతడి తిరుగుబాటు వాస్తవ స్వభావాన్ని తెలుసుకోలేకపోయారు.DATel 858.2

  దేవునికి వ్యతిరేకంగా లేచినవాడు గొప్ప శక్తి మహిమలున్న వ్యక్తి. లూసీఫర్ ని గురించి ప్రభువిలా అంటున్నాడు, “పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి.” యోహె 28:12. లూసీఫర్ ఆశ్రయముగా ఉన్న కెరూబు. దేవుని సముఖపు కాంతిలో అతడు నిలిచి ఉండేవాడు. సృజించబడ్డవారిలో అతడు అత్యున్నతుడు. దేవుని సంకల్పాన్ని విశ్వానికి వెల్లడించడంలో లూసీఫర్ మొదటి వాడు. అతడు పాపం చేసిన తర్వాత అతడి మోసం మరింత శక్తిమంతమయ్యింది. తండ్రివద్ద అతడికున్న ఉన్నతమైన స్థానాన్ని బట్టి అతడి ప్రవర్తనను ఆవిష్కరించడం మరింత కష్టమయ్యింది.DATel 858.3

  సాతానుని అతడి సానుభూతిపరుల్ని దేవుడు ఒక్క త్రుటిలో నాశనం చేయ్యగలిగేవాడే. కాని ఆయన ఆపని చెయ్యలేదు. తిరుగుబాటును బలప్రయోగంతో జయించకూడదు. సాతాను ప్రభుత్వం కిందే ఒత్తిడి ప్రయోగించడం జరుగుతుంది. దేవుని నియమాలు ఈ కోవలోనివికావు. ఆయన అధికారం మంచితనం, కృప, ప్రేమ మీద ఆధారపడి ఉంది. ఈ నియమాల్ని అమలుపర్చడమే పరిష్కార మార్గం. దేవుని ప్రభుత్వం నైతిక ప్రభుత్వం. సత్యం ప్రేమ దాని శక్తి.DATel 859.1

  నిత్య భద్రత ప్రాతిపాదికపై విషయాల్ని ఉంచాలన్నది దేవుని సంకల్పం. తన పరిపాలనా వ్యవస్థకు పునాది అయిన నియమాల్ని వృద్ధి చేయడానకి సాతానుకి సమయం ఇవ్వాలని పరలోక సభల్లో తీర్మానించడం జరిగింది. ఈ నియమాలు దేవుని నియమాలకన్నా మెరుగైనవని అతడి వాదన. సాతాను నియమాల పనితీరును పరలోక విశ్వం పరిశీలించేందుకు వాటికి కొంత సమయం ఇవ్వడం జరిగింది.DATel 859.2

  సాతాను మనుషుల్ని పాపంలోకి నడిపించాడు. అందువల్ల రక్షణ ప్రణాళిక అమలులోకి వచ్చింది. నాలుగు వేల సంవత్సరాలుగా క్రీస్తు మానవుడి ఉద్దరణకు కృషి చేస్తోన్నాడు. స్వీయ పతనానికి భ్రష్టతకు సాతాను పనిచేస్తున్నాడు. పరలోక విశ్వం ఇదంతా చూస్తూ ఉంది.DATel 859.3

  యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు సాతాను అధికారం ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది. బెల్లె హేములో శిశువుగా కనిపించినప్పటినుంచి ఈ అక్రమార్కుడు ఆయన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నించాడు. యేసు సంపూర్ణమైన బాల్యాన్ని, నిర్దుష్టమైన యౌవనాన్ని, పరిశుద్ధమైన సువార్త పరిచర్యను, నిష్కళంకమైన త్యాగాన్ని వృద్ధి పర్చుకోకుండా అడ్డుకోడానికి కృషి చేశాడు. కాని అతడు విఫలుడయ్యాడు. యేసును పాపంలోకి నడిపించలేకపోయాడు. ఆయన్ని నిరుత్సాహపర్చలేకపోయాడు లేదా ఆయన ఏ పనిచెయ్యడానికి వచ్చాడో దాన్ని నిర్వహించకుండా అడ్డుకోలేకపోయాడు. అరణ్యం నుంచి కల్వరి వరకు సాతాను ఆగ్రహతుపాను ఆయన్నే లక్షించింది. కాని అది ఎంత నిర్దాక్షిణ్యంగా తన మీద విరుచుకుపడితే దైవ కుమారుడు అంత దృఢంగా తన తండ్రి చెయ్యిపట్టుకుని రక్తసిక్త మార్గంలో ముందుకు సాగాడు. ఆయన్ని హింసించి జయించడానికి సాతాను చేసిన ప్రయత్నాలన్నీ ఆయన నిష్కళంక ప్రవర్తనను మరింత స్వచ్ఛమైన వెలుగులో చూపించడానికి దోహదపడ్డాయి.DATel 859.4

  ఈ సంఘర్షణను పరలోక వాసులు పాపరహిత ప్రపంచాల నివాసులు వీక్షించారు. ఈ సంఘర్షణ చివరి ఘట్టాల్ని వారంతా ఎంత ఆసక్తితో అనుసరించారు! రక్షకుడు గెత్సెమనేలో ప్రవేశించడం వారు చూశారు. భయంకరమైన చీకటి ఆవరించడంతో ఆయన ఆత్మ కుంగిపోయింది. “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్దనుండి తొలగిపోనిమ్ము” అన్న ఆయన విజ్ఞావనను విన్నారు (మత్త. 26:39). తండ్రి సముఖం ఉపసంహరించబడ్డప్పుడు ఆయన అనుభవించిన దుఃఖాన్ని హృదయ వేదనను చూశారు. అది మరణంతో ఆయన చివరి పోరాటం కన్నా ప్రగాఢ దుః ఖవేదన. రక్తపు చెమట కారి చుక్కలు చుక్కలుగా నేలమీద పడింది. విడుదల కోరుతూ మూడుసార్లు ప్రార్థించాడు. ఆ దృశ్యాన్ని దేవుడు ఇక సహించలేకపోయాడు. ఓదార్పు వర్తమానంతో ఒక దూతను ఆయన వద్దకు పంపాడు.DATel 860.1

  హంతక మూక చేతుల్లోకి బాధితుణ్ని అప్పగించడం, ఆమూక ఆయన్ని ఎగతాళి చేస్తూ, ఆయనపై దౌర్జన్యం చేస్తూ ఒక న్యాయస్థానం నుంచి ఇంకొక న్యాయస్థానానికి హడావుడిగా తరలించడం పరలోకం చూసింది. ఆయన దీన జననం గురించి తన హింసకులు ఆయన్ని అపహసించడం విన్నది. మిక్కిలి ప్రియమైన తన శిష్యుల్లో ఒకడు శపిస్తూ ఒట్టు పెట్టుకుంటూ ఆయన్ని ఎరుగననని బొంకడం విన్నది. సాతాను ఉన్మాదిలా పనిచెయ్యడం చూసింది. ప్రజల హృదయాలపై అతడి ప్రభావం ఎంత బలంగా ఉందో చూసింది. అది ఎంత భయంకర దృశ్యం! అర్థరాత్రిలో గెత్సెమనే తోటలో రక్షకుణ్ని పట్టుకున్నారు. ప్రధానయాజక భవనం నుంచి తీర్పుహాలుకి అటు ఇటూ లాక్కువెళ్లారు. యాజకుల ముందు రెండుసార్లు స హెడ్రిన్ ముందు రెండుసార్లు పిలాతు ముందు రెండుసార్లు, హేరోదు ముందు ఒకసారి నేరారోపణ చేశారు. ఆయన్ని ఎగతాళి చేశారు, కొరడాలతో కొట్టారు, నేరస్తుడని తీర్పు తీర్చి సిలువ వెయ్యడానికి తీసుకువెళ్లారు. బరువైన సిలువను ఎత్తుకుని, యెరూషలేము కుమార్తెలు రోదిస్తూ ఆయన్ని వెంబడించగా, ప్రజలమూక ఎగతాళి చేస్తుండగా ఆయన నడిచాడు.DATel 860.2

  గాయపడ్డ కణతలనుంచి రక్తం కారుతూ, నుదుటి పై రక్తంతో కలిసిన చెమట బొట్టులతో క్రీస్తు సిలువమిద వేలాడున్నప్పుడు ఆ దృశ్యాన్ని పరలోకం దుఃఖంతోను విస్మయంతోను చూసింది. ఆయన చేతులనుంచి కాళ్లనుంచి కార్తున్న రక్తం సిలువను నిలబెట్టేందుకు తొలిచిన రాతిపై బొట్టుబొట్టుగా పడ్తోంది. దేహం బరువు చేతులమీద పడడంతో మేకులవల్ల అయిన గాయాలు వదులయ్యాయి. లోకపాపాల భారం కింద ఒగుర్చుతూ ఉండగా ఆయన శ్వాసక్రియ కష్టమయ్యింది. “తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరుగనుక వీరిని క్షమించుము” (లూకా 23:34) అంటూ బాధననుభవిస్తున్నప్పటికీ ఆయన ప్రార్థించినప్పుడు పరలోకం ఆశ్చర్యంతో నిండింది. అయినా దేవుని స్వరూపంలో సృష్టి అయిన మనుషులు దేవుని అద్వితీయ కుమారుని ప్రాణాన్ని నలిపివెయ్యడానికి సమకట్టారు. పరలోక విశ్వ నివాసులు చూడడానికి ఇది ఎంత విచిత్ర దృశ్యం!DATel 861.1

  అంధకార సంబంధులైన అధికారులు, అధినేతలు సిలువ చుట్టూ చేరి ప్రజల హృదయాల్లో అవిశ్వాసాన్ని అనుమానాల్ని వెదజల్లుతున్నారు. తన సింహాసనం ముందు నిలబడడానికి ప్రభువు ఆ దూతల్ని సృజించినప్పుడు వారు సుందరంగా మహిమతో నిండి ఉన్నారు. వారి సౌమ్యత పరిశుద్ధత తమ ఉన్నత స్థాయికి అనుగుణంగా ఉన్నాయి. వారు దేవుని జ్ఞానంతో వృద్ధి చెందారు. పరలోక సర్వాంగ కవచాన్ని ధరించారు. వారు యెహోవా దూతలు. అయితే పడిపోయిన దూతల్లో ఒకప్పుడు పరలోక దేవస్థానంలో ఆశ్రయంగా ఉన్న కెరూబును ఎవరుగుర్తించగలుగుతారు?DATel 861.2

  క్రీస్తు పాపులలో ప్రధానుడని ప్రజల్ని నమ్మించి ఆయన్ని ద్వేషించడానికి వారిని నడిపించడంలో సాతాను అనుచరులు దుష్టులతో కూటమిగా ఏర్పడ్డారు. క్రీస్తు సిలువపై వేలాడుండగా ఆయన్ని ఎగతాళి చేసిన వారు కూడా ఈ ప్రథమ తిరుగుబాటుదారుడి స్వభావం గలవారే. అతడు భ్రష్టమైన హేయమైన ప్రసంగాలతో వారి మనసులనిండా ద్వేషం నింపాడు. ఎగతాళి చెయ్యడానికి వారిని ఉసిగొలిపాడు. ఇంత చేసినా పాపం, ఏమి సాధించలేకపోయారు.DATel 861.3

  క్రీస్తులో ఒక్కపాపం ఉండి ఉంటే, ఆ భయంకర హింసనుంచి తప్పించుకోడానికి ఒక్క విషయంలో సాతానుకి లొంగి ఉంటే దేవునికి మానవుడికీ విరోధి అయిన సాతాను విజయం సాధించేవాడు. క్రీస్తు తలవంచి మరణించాడు. కాని తన విశ్వాసాన్ని కాపాడుకుని దేవునికి తన్నుతాను అంకితం చేసుకున్నాడు. “మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుటవింటిని రాత్రింబగళ్లు మనదేవుని యెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు.” ప్రక 12:10.DATel 862.1

  తన గుట్టు రట్టయ్యిందని సాతాను గ్రహించాడు. అతడి పరిపాలన ఎలాంటిదో పరిశుద్ధ దూతలికి పరలోక విశ్వ నివాసులికి విదితమయ్యింది. అతడు తన్నుతాను హంతకుడుగా కనపర్చుకున్నాడు. దైవకుమారుని రక్తం చిందించడం ద్వారా అతడు పరలోక నివాసుల సానుభూతిని కోల్పోయాడు. అప్పటి నుంచి అతడి పని చాలా పరిమితమయ్యింది. అతడు ఎలాంటి వైఖరి అవలంబించినా, పరలోకం నుంచి వచ్చే దూతల్ని కలిసి, క్రీస్తు సహోదరుల వస్త్రాలు పాపంతో నల్లగా ఉన్నాయని, పాపం వల్ల వారు అపవిత్రులని నిందలు వేయడానికి ఇకలేదు. సాతానుకీ పరలోక ప్రపంచానికీ మధ్య ఉన్న చివరి సంబంధం తెగిపోయింది.DATel 862.2

  అయినా దేవుడు సాతానుని అప్పుడు నాశనం చెయ్యలేదు. ఈ మహా సంఘర్శణలో భాగమైన సమస్యలన్నిటినీ దూతలు అవగాహన చేసుకోలేదు. దుర్వినియోగం కాగల నియమాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. మానవుడి నిమిత్తం సాతాను ఉనికి కొనసాగాలి. వెలుగు రాజుకి చీకటి రాజుకి మధ్య భేదాన్ని మనుషులూ దేవదూతలూ చూడాలి. తాము ఎవరిని సేవిస్తారో వారు ఎంపిక చేసుకోవాలి.DATel 862.3

  దేవుని ధర్మశాస్త్రం ఆచరణ సాధ్యంకానిదని, న్యాయం కృప మధ్య పొంతన ఉండదని, ధర్మశాస్త్ర ఉల్లంఘన జరిగితే పాపికి క్షమాపణ అసాధ్యమని సంఘర్షణ ఆరంభంలో సాతాను ఉదాటించాడు. ప్రతీ పాపానికీ శిక్ష అనుభవించి తీరాలి అన్నాడు. పాపాన్ని శిక్షించకుండా విడిచి పెట్రీ దేవుడు సత్యాన్ని న్యాయాన్ని పాలించే దేవుడవ్వడు అని వాదించాడు. మానవుడు దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి ఆయన చిత్తాన్ని ధిక్కరించినప్పుడు సాతాను చంకలు గుద్దుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆచరించడం అసాధ్యమని, పాపక్షమాపణ సాధ్యపడని మాట అని అతడు వాదించాడు. ఎందుకంటే, అతడు తన తిరుగుబాటు ఆనంతరం పరలోకం నుంచి బహిష్కృతుడయ్యాడు గనుక మానవజాతి దేవుని ప్రసన్నతకు నిత్యం దూరమవ్వాలన్నది అతడి వాదన. దేవుడు న్యాయవంతుడై ఉంటూ పాపికి కృప చూపించడం అసాధ్యమని అభిప్రాయపడ్డాడు.DATel 862.4

  కాగా పాపిగా కూడా మానవుడి పరిస్థితికి సాతాను పరిస్థితికి మధ్య తేడా ఉంది. పరలోకంలో దేవుని మహిమ వెలుగులో ఉండి లూసీఫర్ పాపం చేశాడు. సృష్టిపొందిన ఏ ఇతర జీవికీ లేని దైవ ప్రేమ ప్రదర్శన అతడికి లభించింది. దేవుని ప్రవర్తనను గ్రహించి, ఆయన మంచితనాన్ని ఎరిగి ఉండి కూడా సాతాను తన స్వార్ధ, స్వతంత్ర చిత్తాన్నే అనుసరించాడు. ఈ ఎంపికలో మార్పు లేదు. అతణ్ని రక్షించడానికి దేవుడు చెయ్యగలిగింది ఇంకేమీ లేదు. అయితే మానవుడు మోసపోయాడు. అతడి మనసు సాతాను కూటతర్కంతో నిండి ఉంది. దేవుని ప్రేమ ఎత్తు లోతు అతడికి తెలియలేదు. దేవుని ప్రేమను తెలుసుకోడంలోనే అతడికి నిరీక్షణ ఉంది. ఆయన ప్రవర్తనను వీక్షించడం ద్వారా అతడు తిరిగి ఆయన్ని చేరడానికి వీలుపడుంది.DATel 863.1

  దేవుని కృప క్రీస్తు ద్వారా మానవులికి ప్రదర్శితమయ్యింది. కృప న్యాయాన్ని పక్కకు నెట్టదు. ధర్మశాస్త్రం దేవుని ప్రవర్తనను వెల్లడి చేస్తుంది. పడిపోయిన మానవుడి స్థితికి అనుగుణంగా ఉండేందుకు దానిలోని ఒక అచ్చయినా ఒక పొల్లయినా మార్చడానికి లేదు. దేవుడు తన చట్టాన్ని మార్చలేదు, కాని మానవ విమోచన నిమిత్తం క్రీస్తులో ఆయన తన్నుతాను అర్పించుకున్నాడు. “దేవుడు... క్రీస్తు నందు లోకమును తనతో సమాధాన” పర్చుకుంటున్నాడు. 2 కొరి 5: 19.DATel 863.2

  ధర్మశాస్త్రం నీతిని కోరుతోంది - నీతి జీవితం, పరిపూర్ణ ప్రవర్తన. ఇది మానవుడికి లేదు. దైవ ధర్మశాస్త్రం కోరేది మానవుడు చెయ్యలేడు. అయితే క్రీస్తు భూమికి మానవుడుగా వచ్చి పరిశుద్ధ జీవితం జీవించి పరిపూర్ణ ప్రవర్తనను నిర్మించుకున్నాడు. తనను అంగీకరించేవాందరికి వీటిని ఆయన ఉచిత వరంగా ఇస్తానంటున్నాడు. ఆయన జీవితం మనుషుల నిమిత్తం సమర్పితమయ్యింది. దేవుని సహనం ద్వారా ఇలా వారికి గత పాపాలకి క్షమాపణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా, క్రీస్తు దైవ గుణలక్షణాల్ని మనుషులికి అనుగ్రహిస్తాడు. దేవుని ప్రవర్తన పోలికలో మానవ ప్రవర్తనను నిర్మిస్తాడు. మానవ ప్రవర్తన ఆధ్యాత్మిక శక్తిని సౌందర్యాన్ని పుణికిపుచ్చుకున్న రమ్యమైన వస్త్రం అవుతుంది. ధర్మశాస్త్ర నీతి క్రీస్తుని విశ్వసించే భక్తుడిలో ఇలా నెరవేర్తుంది. “తాను నీతి మంతుడును యేసు నందు విశ్వాసము గల వానిని నీతిమంతుడుగా తీర్చువాడునైయుండుటకు” దేవుడు అలా చెయ్యగలడు. ( రోమా 3:26)DATel 863.3

  దేవుని ప్రేమ ఆయన కృపలో ఎంత ఉందో న్యాయంలోను అంతే ఉంది. న్యాయం ఆయన సింహాసనానికి పునాది; ఆయన ప్రేమ ఫలం. కృపను సత్యం నుంచి న్యాయం నుంచి విడదియ్యడం సాతాను సంకల్పం. దైవ ధర్మశాస్త్ర నీతి శాంతికి శత్రువని నిరూపించడానికి సాతాను ప్రయత్నించాడు. కాని దేవుని ప్రణాళికలో ఈ రెంటి మధ్య అవినాభావ సంబంధం ఉందని యేసు సూచించాడు. ఒకటి లేకుంటే రెండోది ఉండదు. “కృపా సత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి” కీర్త 85:10.DATel 864.1

  దేవుని న్యాయం ఆయన కృపను నాశనం చెయ్యలేదని, పాపాన్ని క్షమించడం సాధ్యమని, ధర్మశాస్త్రం నీతి వంతమైనదని దాన్ని సంపూర్ణంగా ఆచరించడం అసాధ్యం కాదని తన జీవితం ద్వారాను తన మరణం ద్వారాను క్రీస్తు రుజువుపర్చాడు. సాతాను ఆరోపణల్ని దేవుడు తోసిపుచ్చాడు. మానవుడిపట్ల తన ప్రేమకు దేవుడు తిరుగులేని నిదర్శనాన్నిచ్చాడు.DATel 864.2

  ఇంకొక మోసం ఇప్పుడు వెలుగులోకి రావాల్సి ఉంది. కృప న్యాయాన్ని నాశనం చేసిందని, క్రీస్తు మరణం తండ్రి ధర్మశాస్త్రాన్ని రద్దు చేసిందని సాతాను ప్రకటించాడు. ధర్మశాస్త్రానికి మార్పులు చెయ్యడం గాని లేక దాన్ని రద్దు చెయ్యడం గాని సాధ్యపడితే క్రీస్తు మరణం అవసరమయ్యేది కాదు. కాగా దేవుని ధర్మశాస్త్రాన్ని రద్దు చెయ్యడం అతిక్రమాన్ని కొనాసాగించి లోకాన్ని సాతాను అదుపుకి అప్పగించడమౌతుంది. ధర్మశాస్త్రం మార్పులేనిది కాబట్టి, దాని నియమాలకి మానవుడు విధేయుడై నివసించడం ద్వారానే అతడు రక్షణ పొందగలడు కాబట్టి క్రీస్తు సిలువపై మరణించడం అవసరమయ్యింది. అయినా ధర్మశాస్త్రాన్ని స్థిరపర్చడానికి క్రీస్తు వినియోగించిన సాధనాల్ని దాన్ని నాశనం చెయ్యడానికి క్రీస్తు వినియోగించిన సాధనాలుగా సాతాను సూచించాడు. క్రీస్తుకి సాతానుకి జరిగే చివరి సంఘర్షణ ఇక్కడ వస్తుంది.DATel 864.3

  దేవుడు తన సొంత స్వరంతో పలికిన ధర్మశాస్త్రంలో తప్పులున్నాయని ధర్మశాస్త్రంలోని ఒక నిర్దిష్టాంశం రద్దుపడింనదని సాతాను వాదన. లోకం మీదకి అతడు తెచ్చే చివరి మోసం ఇదే. అతడు మొత్తం ధర్మశాస్త్రం పై దాడి చెయ్యనవసం లేదు. అందులో ఒక్క సూత్రాన్ని మారడానికి ప్రజల్ని నడిపించగలిగితే అతడి లక్ష్యం నెరవేర్తుంది. ఎందుకంటే “ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును.” యాకోబు 2:10. ఒక్క నియమాన్ని అతిక్రమించడానికి సమ్మతించడం వల్ల మానవులు సాతాను అదుపులోకి వస్తారు. దైవధర్మశాస్త్రం స్థానే మానవ నియమాల్ని ప్రవేశపెట్టడం ద్వారా సాతాను లోకాన్ని అదుపుచెయ్యడానికి ప్రయత్నిస్తోన్నాడు. ఈ పనిని గురించి ప్రవచనం ముందే చెప్పింది. సాతాను ప్రతినిధి అయిన ఆ భ్రష్ట అధికారం గురించి లేఖనంలో ఇలా ఉంది: “ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయపదతులను నివారణ చేయబూనుకొనును. వారు... అతని వశమున నుంచబడుదురు.” దానియేలు 7:25.DATel 865.1

  దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పని చెయ్యడానికి మనుషులు తమ చట్టాల్ని రూపొందించుకుంటారు. వారు ఇతరుల మనస్సాక్షిని ఒత్తిడి చెయ్యడానికి పూనుకుంటారు. తమ చట్టాల్ని అమలుపర్చడంలో సాటి మనుషుల్ని హింసిస్తారు.DATel 865.2

  దైవ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పరలోకంలో ప్రారంభమైన పోరాటం లోకాంతం వరకు కొనసాగుతుంది. ప్రతీవారు పరీక్షకు గురి అవుతారు. విధేయతా అవిధేయతా అన్న సమస్యను సర్వ ప్రపంచం నిర్ణయించాల్సి వస్తుంది. దేవుని ధర్మశాస్త్రం మానవ చట్టాలు ఈ రెండింటి మధ్య మనుషులు ఎంపిక చేసుకోవలసి వస్తుంది. విభజన రేఖను ఇక్కడ గీయడం జరుగుతుంది. రెండు తరగతుల ప్రజలు మాత్రమే ఉంటారు. ప్రతీవారి ప్రవర్తన పూర్తిగా వృద్ధిచెంది ఉంటుంది. అందరూ దేవునికి విధేయత పక్షాన్నో లేక తిరుగుబాటు పక్షానో ఎన్నుకుంటారు.DATel 865.3

  అంతట అంతం వస్తుంది. దేవుడు తన ధర్మశాస్త్రం న్యాయమైనదని నిరూపించి తన ప్రజల్ని విడిపిస్తాడు. సాతాను, తిరుగుబాటులో అతడితో ఏకమైన వారు నాశనమౌతారు. పాపం, పాపులు సమూలంగా నాశనమౌతారు (మలా 4:1) - సాతాను మూలం, అతడి అనుచరులు కొమ్మలు. దుర్మార్గుల రాజు విషయంలో ఈ మాట నెరవేరుతుంది. “దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నవాడా.... ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు; నిన్ను నాశనము చేసితిని... నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు.” అప్పుడు “భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.” “తాము ఇకనెన్నడు నుండని వాడైనట్లు వారేమియు మిగులకుండ” ఉంటారు. యెహె 28:6-19; కీర్త 37:12; ఓబర్యా 16.DATel 866.1

  ఇది దేవుని నిరంకుశాధికార చర్యకాదు. ఆయన కృపను నిరాకరించేవారు తాము విత్తిన పంటే కోస్తారు. జీవానికి దేవుడే పునాది. ఒక వ్యక్తి పాపాన్ని పాప క్రియల్ని ఎంపిక చేసుకున్నప్పుడు అతడు దేవుని నుంచి వేరవుతాడు. ఆ విధంగా అతడు జీవాన్ని కోల్పోతాడు. అతడు “దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన” వాడవుతాడు. క్రీస్తు ఇలా అంటున్నాడు, “నాయందు అసహ్యపడు వారందరు మరణమును స్నేహించుదురు.” ఎఫె 4:18; సామె 8:36. వారు తమ ప్రవర్తనను వృద్ధి చేసుకుని తమ నియమాల్ని బయలు పర్చేందుకు దేవుడు వారికి కొంతకాలం ప్రాణమిస్తాడు. ఇదైన తర్వాత వారు తమ ఎంపిక ఫలితాన్ని పొందుతారు. తిరుగుబాటు జీవితం ద్వారా సాతాను అతడితో ఏకమయ్యేవారు దేవునికి ఎంత ప్రతికూలంగా ఉంటారంటే ఆయన సన్నిధే వారికి దహించే అగ్నిలా ఉంటుంది. ప్రేమ అయిన మహిమ వారిని నాశనం చేస్తుంది.DATel 866.2

  మహాసంఘర్షణ ఆరంభంలో దూతలకి ఇది అవగాహన కాలేదు. సాతాను అతడి అనుచర సముహాలు తమ పాపం పూర్తి పర్సవసానాన్ని అనుభవించడానికి అప్పుడు విడువబడి ఉంటే వారు మరణించి ఉండేవారు. కాని ఇది పాపం తాలూకు అనివార్యమైన ఫలితమని పరలోక నివాసులకి అనిపించి ఉండేది కాదు. దేవుని దయాళుత్వం గురించి వారి మనసుల్లో సందేహం మిగిలిపోయి అది దురాలోచనలకు విత్తనమై పాపం దుఃఖం ఫలాల్ని ఫలించేది.DATel 866.3

  మహా సంఘర్షణ అంతం అయినప్పుడు అలాగుండదు. అప్పటికి రక్షణ ప్రణాళిక పూర్తి అయి దేవుని ప్రవర్తన సృష్టింపబడ్డవారందరికి వెల్లడవుతుంది. ఆయన ధర్మశాస్త్ర సూత్రాలు సంపూర్ణమైనవి మార్పు లేనివిగా రుజువవుతాయి. పాపం దాని స్వభావాన్ని బయలుపర్చుకుంటుంది. సాతాను ప్రవర్తన బట్టబయలవుతుంది. అప్పుడు పాపాన్ని నిర్మూలించడంలో దేవుని నిర్మల ప్రేమ నిరూపితమౌతుంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సంతోషిస్తూ ఆయన ధర్మశాస్త్రాన్ని తమ హృదయాల్లో ఉంచుకునే వారి ముందు ఆయన ఔన్నత్యం గౌరవం స్థాపితమవుతాయి.DATel 867.1

  కనుక దూతలు రక్షకుని సిలువను చూసినప్పుడు సంతోషించవచ్చు. ఎందుకంటే అప్పుడు వారికి అంతా అర్ధంకాకపోయినా పాపం సాతాను ఇక ఎన్నడూ లేకుండా నాశనమవ్వడం నిశ్చయమని, మానవ విమోచన ఖాయమని, విశ్వం నిత్యం భద్రంగా ఉంటుందని వారు తెలుసుకున్నారు. కల్వరిపై చేసిన త్యాగం ఫలితాల్ని క్రీస్తు పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. “సమాప్తమైనది” అని సిలువపై కేక వేసినప్పుడు దీనంతటికీ ఆయన ఎదురు చూశాడు.DATel 867.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents