Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  8—“పస్కా సందర్శనం”

  పన్నెండో ఏడు బాల్యాన్ని యౌవనాన్ని వేరు చేసే విభజన రేఖగా యూదులు పరిగణించేవారు. పన్నెండో ఏడు పూర్తి చేసిన తర్వాత హెబ్రీ బాలుణ్ని ధర్మశాస్త్ర కుమారుడని దేవుని కుమారుడని పిలిచేవారు. అతనికి మతోపదేశమివ్వడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. అతడు పరిశుద్ధ పండుగల్లోను ఆచారాల్లోను పాలు పొందవచ్చు. ఈ ఆచారం ప్రకారమే తన బాల్యదశలో యేసు పస్కా ఆచరించడానికి యెరూషలేమును సందర్శించాడు. భక్తిగల అందరి ఇశ్రాయేలీయుల్లాగే యెసేపు మరియలు ప్రతీ ఏడు పస్కా ఆచరణకు వెళ్లేవారు. యేసుకి నిర్దిష్ట వయసు వచ్చినప్పుడు వారు ఆయనను తమతో తీసుకువెళ్లారు.DATel 58.1

  పస్కా పెంతెకొస్తు పర్ణశాలల పండుగ అని మూడు పండుగలుండేవి. వీటికి ఇశ్రాయేలులోని పురుషులందరు తన ముందు యెరూషలేములో హాజరు కావాలిసిందిగా ప్రభువు ఆదేశించాడు. వీటిలో పస్కాపండుగకే ఎక్కువ మంది హాజరయ్యేవారు. యూదులు ఏఏ దేశాలకు చెదిరిపోయారో ఆ దేశాలన్నిటి నుంచి అనేకమంది వచ్చేవారు. పాలాస్తీన ప్రతీప్రాంతం నుంచి ఆరాధకులు పెద్దసంఖ్యలో వచ్చేవారు. గలిలయ నుంచి ప్రయాణం అనేక దినాలు పట్టేది. భద్రతను స్నేహ బంధాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు పెద్ద పెద్ద గుంపులుగా చేరి ప్రయాణించేవారు. స్త్రీలు వృద్ధులైన పురుషులు ఎద్దుల మీద గాడిదలమీద ఎక్కి పర్వత ప్రదేశాల్లోని ఎత్తయిన రోడ్లపై ప్రయాణం చేసేవారు. బలమైన పురుషులు యువజనులు నడిచివెళ్లేవారు. పస్కాపండుగ మార్చినెల చివరి భాగం ఏప్రిల్ నెల మొదటి భాగం మధ్యలో వచ్చేది. ఆ దేశమంతా పువ్వులతోను పక్షుల మధురగానంతోను ఎంతో ఆహ్లాదంగా ఉండేది. మార్గం పొడవునా ఇశ్రాయేలు చరిత్రలోని ప్రఖ్యాత స్థలాలకు వచ్చినపుడు గతకాలంలో దేవుడు తన ప్రజల నిమిత్తం చేసిన అద్భుతాల్ని తల్లులు తండ్రులు తమ బిడ్డలకు వర్ణించేవారు. పాటలతోను, సంగీతంతోను వారు తమ ప్రయాణ బడలికను అధిగమించేవారు. చిట్టచివరికి యెరూషలేము గోపురాలు కనుచూపు మేరలో ఉన్నప్పుడు అందరూ గళాలు కలిపి,DATel 58.2

  “మా పాదములు నీ గుమ్మములలో
  నిలుచుచున్నవి యెరూషలేమా.....
  నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక
  నీ నగరములలో క్షేమముండును గాక”
  DATel 59.1

  (కీర్త 122:2-7) అంటూ పాడేవారు.

  హెబ్రీ జాతి ఆరంభంతోనే పస్కా ఆచరణ మొదలయ్యింది. ఐగుప్తు దాస్యంలోని తమ చివరి రాత్రి విడుదలకు సూచనలేవీ కనిపించనప్పుడు వారు తక్షణ విడుదలకు సన్నద్ధం కావలసిందిగా దేవుడు ఆదేశించాడు. ఐగుప్తీయుల పై చివరి తీర్పు పడుతుందని దేవుడు ఫరోను హెచ్చరించాడు. తమ. సొంత గృహాల్లో తమ కుటుంబాల్ని పోగుచేయాల్సిందిగా ఆయన హెబ్రీయుల్ని ఆదేశించాడు. గొర్రెపిల్లల్ని చంపి వాటి రక్తం తమ ఇండ్ల ద్వారబంధాలకు పూసి వధించిన ఆ గొర్రెపిల్ల మాంసం కాల్చి, దాన్ని పులియని రొట్టెలతోను చేదుకూరతోను వారు తినాల్సి ఉన్నారు. దేవుడిలా అన్నాడు, “మీరు దానిని తినవలసిన విధమేదనగా నా నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని నా కట్టలు చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను. అది యెహోవాకు పస్కాబలి. ” నిర్గమ 12:11. మధ్య రాత్రిలో ఐగుప్తీయుల జ్యేష్ఠ సంతానం హతమయ్యింది. అప్పుడు రాజు ఇశ్రాయేలుకు ఈ వర్తమానం పంపాడు. “మీరు.... లేచి నా ప్రజల మధ్య నుంచి బయలు వెళ్లుడి. మీరు చెప్పినట్లు పోయి యోహోవాను సేవించుడి” నిర్గమ 12:31. హెబ్రీయులు ఐగుప్తు నుంచి బయటికి వెళ్లినప్పుడు వారు స్వతంత్ర జాతి అయ్యారు. వారు పస్కాను ప్రతీ ఏడూ ఆచరించాలని ప్రభువు ఆజ్ఞాపించాడు. “నా కుమారులు - మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగుచున్నప్పుడు మీరు - ఇది యెహోవా పస్కాబలి, ఆయన ఐగుప్తీయులను హతముచేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెను” అన్నాడు. ఈ విధంగా ఈ విమోచన కథ తరం నుంచి తరానికి వెళ్ళాల్సి ఉంది.DATel 59.2

  పస్కా అయిన వెంటనే ఏడు రోజుల పులియని రొట్టెల పండుగ జరిగేది. ఆ పండుగ రెండోనాడు సంవత్సరపు ప్రధమ ఫలాలు ఒక బార్లీపన ప్రభువుకు సమర్పించేవారు. ఆ పండుగకు సంబంధించిన ఆచారాలన్నీ క్రీస్తు చేయనున్న సేవకు చిహ్నాలు. ఐగుప్తునుంచి ఇశ్రాయేలు ప్రజల విడుదల రక్షణను గూర్చిన పాఠం సాదృశ్యం వారి మనసుల్లో దాన్ని పస్కా ఉంచాల్సి ఉంది. వధించబడ్డ గొర్రెపిల్ల పులియని రొట్టెలు ప్రథమ పంట మన రక్షకుణ్ని సూచించాయి.DATel 60.1

  క్రీస్తు దినాల్లో ఈ పండుగ ఆచరణ అనేకమంది విషయంలో మతమౌఢ్యంగా మారింది. అయితే దైవకుమారునికి అదెంత ప్రాముఖ్యం!DATel 60.2

  బాలుడైన యేసు దేవాలయాన్ని మొట్టమొదటిసారి చూశాడు. తెల్లటి వస్త్రాలు ధరించిన యాజకులు తమ పరిశుద్ధ సేవలు చెయ్యడం చూశాడు. బలిపీఠంపై రక్తం కారుతున్న బలిపశువును చూశాడు. ధూపం మేఘంవలె దేవునిముందు పైకి లేస్తుండగా ఆరాధకులతోపాటు ఆ బాలుడు వంగి ప్రార్ధన చేశాడు. రక్తికొలిపే పస్కాసేవలను వీక్షించాడు. దినదినం వాటి భావాన్ని మరింత స్పష్టంగా అవగతం చేసుకున్నాడు. ప్రతీకార్యం తన సొంత జీవితంతో ముడిపడి ఉన్నది. ఆయనలో కొత్త బావోద్రేకాలు మేల్కోంటున్నాయి. నిశ్శబ్దంగా ఉన్న తాను ఓ గొప్ప సమస్యను అధ్యయనం చేస్తునట్లు కనిపించాడు. మర్మపూరితమైన తన కర్తవ్యం రక్షకునికి బహిర్గతమౌతోంది.DATel 60.3

  ఈ సన్నివేశాల ఆలోచనలో మునిగి ఉన్న ఆ బాలుడు తలిదండ్రుల వెంటలేడు. ఒంటిరిగా ఉండాలనుకున్నాడు. పస్కాసేవలు ముగిశాక ఆయన ఇంకా ఆలయావరణలోనే ఉన్నాడు. ఆరాధకులు యెరూషలేము విడిచి పెట్టి వెళ్లిపోయినా ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు.DATel 60.4

  యెరూషలేము సందర్శన సమయంలో యేసుని ఇశ్రాయేలులోని గొప్ప బోధకులకు పరిచయం చెయ్యాలని తల్లిదండ్రులు ఉద్దేశించారు. ప్రతీ చిన్నవిషయంలోను దైవవాక్యానికి విధేయుడై ఉండగా రబ్బీల ఆచారాలను సంప్రదాయాలను మాత్రం ఆయన లెక్కచెయ్యలేదు. మేధావులైన రబ్బీల్ని యేసు గౌరవిస్తాడని వారి నియమనిబంధనలకు కట్టుబడి ఉంటాడని యోసేపు మరియలు భావించారు. అయితే ఆలయంలో యేసుకు దేవుడు ఉపదేశించాడు. తాను అందుకున్న ఉపదేశాన్ని ఆయన వెంటనే బోధించడం మొదలు పెట్టాడు.DATel 60.5

  ఆ కాలంలో దేవాలయంలో కొంత భాగాన్ని పరిశుద్ధ పాఠశాలగా వినియోగించేవారు. అది ప్రవక్తల పాఠశాలల్లా ఉండేది. ఇక్కడ పేరుగాంచిన రబ్బీలు తమ విద్యార్థులతో సమావేశమయ్యేవారు. బాలుడైన యేసు ఇక్కడికి వచ్చాడు. ఈ రబ్బీల పాదాల చెంతకూర్చుని వారిబోధలు విన్నాడు. జ్ఞానాన్ని అన్వేషిస్తున్నవాడిగా ప్రవచనాల్ని గూర్చి, మెస్సీయాను సూచిస్తూ అప్పుడు చోటుచేసుకుంటున్న సంభవాల్ని గూర్చి ఆ బోధకుల్ని ప్రశ్నించాడు.DATel 61.1

  దైవజ్ఞానం కోసం దాహర్తితో తపించిపోతున్నవానిలా యేసు వారి వద్దకు వెళ్లాడు. చాలాకాలంగా మరుగునపడి ఉన్న ఆత్మల రక్షణకు ప్రాముఖ్యమైన సత్యాల్ని సూచించేవిగా ఉన్నాయి ఆయన ప్రశ్నలు. ఆ ఉద్దండపండితుల జ్ఞానం ఎంత సంకుచితమయ్యిందో ఎంత అల్పమయ్యిందో బట్టబయలు చేస్తుండగా ఆయన వారికి వేసే ప్రతి ప్రశ్న వారి ముందు ఒక పరమ సత్యాన్ని ఉంచింది. సత్యాన్ని నూతన కోణంలో చూపించింది. రబ్బీలు మెస్సీయా ప్రవచనాల్ని ప్రస్తావించి దేవుని గొర్రెపిల్ల శ్రమలు మరణాన్ని సూచిస్తోన్న లేఖనాల్ని వల్లిస్తూ చిన్నపిల్లవాడి వినయంతో లేఖనాల్నివల్లిస్తూ ఆ జ్ఞానులికి ఎన్నడూ తట్టి ఉండని లోతైన భావాల్ని ప్రతిపాదించాడు. ఆయన సూచించిన సత్యాన్ని వారు అనుసరించి ఉంటే ఆనాటి మతంలో దిద్దుబాటు చోటుచేసుకునేది. ఆధ్యాత్మిక సంగతులపై ఆసక్తి నిద్రలేచేది. యేసు తన సువార్త పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయనను స్వీకరించడానికి అనేకులు సిద్ధంగా ఉండేవారు.DATel 61.2

  తమ పాఠశాలల్లో యేసు చదవలేదని రబ్బీలకు తెలుసు. ఆయినా ఆయన ప్రవచన జ్ఞానం తమజ్ఞానాన్ని మించి ఉన్నది. ఆలోచనపరుడైన ఈ గలిలయ బాలుడిలో వారు గొప్ప భవితగల వ్యక్తిని చూశారు. ఆయనను తమ విద్యార్థిగా ఆకర్షించి ఆమోదట తనను ఇశ్రాయేలులో గొప్ప బోధకుడుగా తీర్చిదిద్దాలన్నది వారి ఆలోచన. ఆయన విద్యకు బాధ్యత వహించాలని ఆకాంక్షించారు. అంత ప్రతిభావంతమైన మనసును తీర్చిదిద్దే బాధ్యత తమకు లభించాలని ఆకాంక్షించారు.DATel 61.3

  ఏ మానవుడి మాటలు కదిలించలేని రీతిగా యేసు మాటలు వారి హృదయాల్ని కదిలించాయి. ఇశ్రాయేలులోని ఆ నాయకులకు వెలుగు - నివ్వడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. అందుకు వారిని చేరగల ఒకే ఒక మార్గాన్ని వినియోగించాడు. అహంకారులైన ఆ రబ్బీలు ఎవరి వద్దా నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పి ఉండేవారు. యేసు తమకు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించి ‘ వారు వినడానికే ఇష్టపడేవారు కాదు. కాని వారు ఆయనకు నేర్పుతున్నామని భావించి పొంగిపొయారు లేదా ఆయన లేఖన జ్ఞానాన్ని పరీక్షిస్తున్నామని మురిసిపోయారు. బాలుడైన యేసు నిరాడంబరత సౌమ్యత వారి పూర్వ దురభిప్రాయల్ని తొలగించాయి. తమకు తెలియకుండానే వారి మనసులు దైవవాక్యానికి తలుపులు తెరిచాయి. పరిశుద్ధాత్మ వారి హృదయాల్లో మాట్లాడాడు.DATel 62.1

  మెస్సీయాను గూర్చి తమ ఆశల్ని ప్రవచనం సమర్ధించడం లేదని వారు గ్రహించకపోలేదు. అయినా తమతమ ఆశలకు మద్దతు పలికే సిద్దాంతాల్ని త్యజించడానికి వారు సిద్ధంగా లేరు. తాము బోధిస్తున్నట్లు చెప్పుకుంటున్న లేఖనాల్ని తాము సరిగా అవగాహన చేసుకోలేదని ఒప్పుకోడానికి వారు ఇష్టపడలేదు. “విద్యలేని ఈయనకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? అని వారు తమలో తాము ప్రశ్నించుకున్నారు. చీకటలో వెలుగు ప్రకాశిస్తోంది. అయితే “చీకటి దాన్ని గ్రహించలేకపోయింది” యోహాను 1:5 ఆర్.వి.DATel 62.2

  అంతలో అక్కడ యోసేపు మరియలు గొప్ప ఆందోళనకు దుఃఖానికి గురిఅయ్యారు. యెరూషలేము నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వారికి యేసు కనిపించలేదు. ఆయన అక్కడే ఉండిపోయాడని వారికి తెలియలేదు. అప్పట్లో దేశంలో జన సాంద్రత ఎక్కువగా ఉంది. గలిలయ నుంచి వచ్చిన ప్రయాణిక వాహన సమూహాలు భారీగా ఉన్నాయి. వారు పట్టణాన్ని విడిచివెళ్లినప్పుడు అక్కడ పెద్ద గందరగోళం చోటుచేసుకుంది. స్నేహితులు పరిచయస్తులతో కలిసి ప్రయాణం చేస్తున్న సందడిలో ‘చీకటి పడేవరకు ఆయన తమతో లేకపోవడాన్ని యోసేపు మరియలు గుర్తించలేదు. విశ్రాంతి కోసం ఆగినప్పుడు వారు తమ కుమారుడి చేదోడు లేకపోవడాన్ని గమనించారు. ఆ గుంపులో ఎక్కడో ఉంటాడనుకుని వారు ఆందోళన చెందలేదు. చిన్నవాడైనప్పటికీ తల్లిదండ్రులకు ఆయనంటే నమ్మకం. ఎప్పుడూ వారి అవసరాల్ని గ్రహించి వారికి చెయ్యూత నిచ్చేటట్లే ఇప్పుడూ తమ అవసరాన్ని గుర్తించి వస్తాడనుకున్నారు. కాని ఇప్పుడు వారు భయాందోళనలకుమ లోనయ్యారు. తమ శిబిరమంతా బాలుడి కోసం వెదకారు. ఫలితం దక్కలేదు. భయంతో వణకుతూ యేసు శిశువుగా ఉన్నప్పుడు హేరోదు ఆయన్ని నాశనం చెయ్యడానికి ఎలా ప్రయత్నించాడో గుర్తు చేసుకున్నారు. ఎన్నో భయాలు వారి మనసుల్ని తొలిచాయి. వారు తమ్మును తాము నిందించుకున్నారు.DATel 62.3

  తిరిగి యెరూషలేముకి వచ్చి వెదకడం మొదలు పెట్టారు. మరుసటి రోజు వారు కొందరు ఆరాధకులతో కలిసి ఆలయంలో ఉన్నప్పుడు ఒక పరిచిత గొంతు వారి గమనాన్ని ఆకర్షించింది. అది తమ కుమారుడిదే. అందులో పొరపాటేమిలేదు. ఆయన స్వరం లాంటి స్వరం ఎవరికీ లేదు. అది గంభీరం, యధార్ధం, ఎంతో మధురం అయిన స్వరం.DATel 63.1

  వారు యేసును రబ్బీల పాఠశాలలో కనుగొన్నారు. బాలుణ్ని చూసి సంతోషించినా వారు తామనుభవించిన వేదనను ఆందోళనను మర్చిపోలేకపోయారు. ఆయన తిరిగి వాళ్లతో ప్రయాణిస్తున్న తరుణంలో మందలింపుగా తల్లి, ఇలా అన్నది “కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమి.”DATel 63.2

  “సరేల నన్ను వెదకుచుంటిరి? నేను నాతండ్రి పనిమీద నుండవలెనని మీరెరుగరా?” అని యేసు సమాధాన మిచ్చాడు. వారు తన ఆయన ముఖం కాంతితో ప్రకాశించింది. అదిచూసి వారు ఆశ్చర్యపడ్డారు. మానవత్వంలో నుంచి దేవత్వం ప్రకాశించింది. ఆయన్ని దేవాలయంలో కనుగొన్న మిదట రబ్బీలకు ఆయనకు మధ్య జరుగతోన్న వివాదాన్ని విని ఆయన ప్రశ్నలకు జవాబులకు వారు విస్మయం చెందారు. ఆయన మాటలు ప్రారంభించిన ఆలోచన పరంపర ఎన్నడూ మరపురానిది.DATel 63.3

  వారికి ఆయన వేసిన ప్రశ్నల్లో ఓ పాఠముంది. “నేను నాతండ్రి పనిమిద నుండవలెనని మీరెరుగరా?” అన్నాడు. యేసు ఈ లోకానికి ఏ పని మీద వచ్చాడో ఆయన అందులో నిమగ్నమై ఉన్నాడు కాని యేసేపు మరియలు తమపనిని నిర్లక్ష్యం చేశారు. దేవుడు తనకుమారుణ్ని వారికివ్వడంలో వారిపట్ల గొప్ప గౌరవం చూపించాడు. యేసు ప్రాణాన్ని కాపాడడంలో పరిశుద్ధ దూతలు యోసేపును నడిపించారు. అయితే ఒక రోజంతా వారు ఆయన్ని గూర్చి మర్చిపోయారు. వారు ఆయన్ని ఒక్క క్షణం కూడా మర్చిపోకూడదు. తమ ఆందోళన సద్దణిగిన తర్వాత వారు తమ్మును తాము నిందించుకునేబదులు ఆ నింద ఆయన మీద వేశారు.DATel 64.1

  యేసు తలిదండ్రులు ఆయన్ని తమ సొంత బిడ్డగా పరిగణించడం సహజమే. ఆయన అనుదినం వారితో ఉన్నాడు. ఆయన జీవితం అనేకవిధాలుగా ఇతరబిడ్డల జీవితంలా ఉంది. కనుక ఆయన్ని దేవుని కుమారునిగా గుర్తించడం వారికి కష్టమయ్యింది. లోక రక్షకుని సముఖం ద్వారా తమకు ఒనగూడిన మేలును అభినందించకపోపడమన్న ప్రమాదంలో వారున్నారు. ఆయన తమతో లేనందవల్ల కలిగిన దుఃఖం, ఆయన మాటల్లోని సున్నితమైన మందలింపు దేవుడు తమకప్పగించిన పరిశుద్ధ బాధ్యత ప్రాముఖ్యమయ్యిందని సూచించడానికి ఏర్పాటయ్యాయి.DATel 64.2

  తల్లికి చ్చిన జవాబులో యేసు దేవునితో తన సంబంధాన్ని మొట్టమొదటిసారిగా గ్రహించినట్లు చూపించాడు. ఆయన జననానికి ముందు మరియతో దూత ఇలా అన్నాడు, “ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియై దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్టులను యుగయుగములు ఏలును.” లూకా 1:32, 33. ఈ మాటల గురించి మరియ ఆలోచిస్తూ ఉన్నది. తన కుమారుడు ఇశ్రాయేలు మెస్సీయా కానున్నాడని నమ్ముతుండగా ఆయన కర్తవ్యమేంటో ఆమెకు అవగతం కాలేదు. ఆప్పుడు ఆమె ఆయన మాటల్ని అవగాహన చేసుకోలేకపోయింది. కాని ఆయన యోసేపుతో సంబంధమున్నట్లు చెప్పలేదు గాని తాను దేవుని కుమారుడినని ప్రకటించాడు.DATel 64.3

  యేసు లోక సంబంధమైన తన తల్లిదండ్రుల్ని విస్మరించలేదు. వారితో కలిసి యెరూషలేము నుంచి ఇంటికి వచ్చాడు. వారికి తమ శ్రమ జీవితంలో సాయం చేశాడు. తాను దేవుని కుమారుణ్ణన్న విషయం గుర్తించిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలుగా స్నేహితుడుగా పౌరుడుగా తన బాధ్యతల్ని నిర్వహించాడు.DATel 64.4

  దేవాలయంలో యేసుకు తన కర్తవ్యం ఏంటో బోధపడినప్పుడు జనసమూహల్తో పరిచయానికి వెనకాడాడు. తన జన్మరహస్యం తెలిసిన వారితో గుట్టు చప్పుడు కాకుండా యెరూషలేము నుంచి తిరిగి రావాలని వాంచించాడు. తన ప్రజల్ని విచారాలనుంచి మళ్లించి తమను ఐగుప్తు నుంచి విడిపించడంలో తన అద్భుతకార్యాన్ని వారికి పస్కా సేవల ద్వారా జ్ఞాపకం చెయ్యాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ కార్యంలో పాప విముక్తి వాగ్దానాన్ని వారు చూడాలని ఆయన కోరాడు. వధించబడ్డ గొర్రెపిల్ల రక్తం రక్షణ కూర్చాల్సి ఉన్నది. కాని వారు విశ్వాసం ద్వారా ఆయన జీవితాన్ని తాము జీవించినప్పుడు ఆ సంకేతాత్మక సేవలో ప్రభావముంటుంది. క్రీస్తు సేవను గుర్తించినవారు ప్రార్ధనపూర్వక అధ్యయనం చేసి ధ్యానించాలని దేవుడు కోరాడు. అయితే జనసమూహాలు యెరూషలేము నుంచి తిరిగి వెళ్లినప్పుడు ప్రయాణంలోని ఉల్లాసం సాంఘిక సంబంధ బాంధవ్యాలు తరచూ వారి గమనాన్ని ఆకట్టుకోవడంతో తాము చూసిన పస్కాసేవలు మరుగున పడిపోయాయి. రక్షకుడు వారితో కలిసి వెళ్లడానికి ఆకర్షితుడుకాలేదు.DATel 65.1

  యేసేపు మరియులు యెరూషలేము నుంచి యేసుతో ఒంటరిగా తిరిగిరావాలి గనుక రక్షకుడు అనుభవించాల్సిన శ్రమల్ని గూర్చిన ప్రవచనాలపై వారి దృష్టిని నిలపాలని ఆయన యోచించాడు. తాను సిలువపై ఉన్నప్పుడు తల్లి హృదయవేదనను తగ్గించడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఆమెను గురించి ఆలోచిస్తోన్నాడు. ఆయన చివరగా అనుభవించిన శ్రమను మరియ కళ్ళారా చూసింది. కనుక తాను నిర్వర్తించాల్సిన సేవను అవగాహన చేసుకోవాలని తన ఆత్మను చీల్చే ఖడ్గం పడినప్పుడు ఆమె శక్తిని పొంది ఆవేదనను తట్టుకోవాలని యేసు వాంఛించాడు. యేసు ఆమెనుంచి వేరైనప్పుడు ఆమె దుఃఖిస్తూ ఆయన్ని మూడు రోజులు వెదికినట్లే ఆయన లోకపాపాల నిమిత్తం మరణించినప్పుడు మళ్లీ మూడు రోజుల పాటు ఆమెకు కనిపించడు. ఆయన సమాధినుంచి రావాల్సి ఉన్నట్లే ఆమె వేదన మళ్లీ సంతోషంగా మారుతుంది. కాని ఇప్పుడు ఆయన ప్రస్తావిస్తున్న లేఖనాల్ని ఆమె అవగాహన చేసుకుని ఉంటే ఆ వేదనను ఇంకెంత చక్కగా భరించగలిగేది!DATel 65.2

  ప్రార్ధన ద్వారా, ధ్యానం ద్వారా తమ మనసుల్ని యోసేపు మరియులు దేవుని మీద నిలిపి ఉంటే తమకు దేవుడు అప్పగించిన పరిశుద్ధ బాలుని బాధ్యత ఎంత పవిత్రమైందో గుర్తించి యేసును గురించి మర్చిపోయేవారు కాదు. ఒక్కదినం అశ్రద్ధ వలన రక్షకుని పోగొట్టుకున్నారు. ఆయనను తిరిగి సంపాదించుకోడానికి వారికి ఆందోళనతో కూడిన మూడు దినాలు పట్టింది. మన విషయంలోనూ అశ్రద్ధ చెయ్యటం ద్వారా మనం ఒకనాడు రక్షకుని సముఖాన్ని పొగొట్టుకోవచ్చు. ఆయన్ని కనుగోడానికి, మనం పొగొట్టుకున్న శాంతిని తిరిగి పొందడానికి దుఃఖంతోను వేదనతోను నిండిన అనేక దినాల అన్వేషణ అవసరం కావచ్చు.DATel 66.1

  మన పరస్పర సహవాసంలో మనం యేసును మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. ఆయన మనతో లేడన్న సంగతి గుర్తించకుండా ముందుకు సాగకుండా జాగ్రత్తపడాలి. మన నిత్యజీవన నిరీక్షణ ఎవరిపై కేంద్రీకృతమై ఉందో ఆ ప్రభువును గూర్చి ఆలోచించనంతగా లోక వ్యవహరాల్లో తలమునకలై ఉన్నప్పుడు మనం యేసుప్రభువు నుంచి ఆయన దూతల నుంచి వేరవుతాం. రక్షకుని సముఖం ఎక్కడ వాంఛితంకాదో ఎక్కడ ఆయనలేకపోడం కొట్టొచ్చినట్లు కనిపించదో అక్కడ ఆ పరిశుద్ధ దూతలు నిలువలేరు. ఇందుకే క్రీస్తు అనుచరులమని చెప్పుకునేవారు తరచు నిరాశకు గురి అవుతుంటారు.DATel 66.2

  . అనేకులు మతారాధనలకు హాజరవుతారు. దైవవాక్యం విని ఆదరణ పొందుతారు. కాగా దానాన్ని, అప్రమత్తతను, ప్రార్ధనను నిర్లక్ష్యం చేయడంవల్ల వారు గొప్ప దీవెనును కోల్పోయి మరింత అభాగ్యులవుతారు. దేవుడు తమతో కఠినంగా వ్యవహరించాడని వారు తరచూ భావిస్తారు. పొరపాటు తమదేనని వారు గ్రహించరు. యేసు నుంచి వేరవ్వటంద్వారా వారు ఆయన సన్నిధికాంతిని మూసివేస్తారు.DATel 66.3

  క్రీస్తు జీవితం గురించి ప్రతిదినం ఒక గంట సేపు ధ్యానించటం మనకెంతో మంచిది. ఆయన జీవితాన్ని విషయాల వారీగా పరిశీలించి ప్రతీ సన్నివేశాన్ని ముఖ్యంగా చివరి త్యాగాన్ని మనసు అవగాహన చేసుకోవాలి. మన నిమిత్తం ఆయన చేసిన మహత్యాగం గురించి మనం ధ్యానించినప్పుడు ఆయనపై మన విశ్వాసం దృఢమౌతుంది. మన అనురాగం గాఢమౌతుంది. ఆయన ఆత్మ మనకు మరింత సమృద్ధిగా లభ్యమౌతాడు. మనం చివరగా రక్షణ పొందాలని ఆకాంక్షిస్తే పశ్చాత్తాపం పొందడం, క్రీస్తు పొందిన సిలువనుంచి దీనమనసు కలిగి ఉండడం నేర్చుకోవాలి.DATel 66.4

  కలిసి మెలసి జీవిస్తూ మనం ఒకరికొకరు మేలు చేసుకోవాలి. మనం క్రీస్తు మనుషులమైతే ఆయనే మన హృదయాల్ని నింపుతాడు. ఆయనను గురించి మాట్లాడడం మనకు ఆనందంగా ఉంటుంది. దైవ ప్రభావం మన మనసుల్ని మెత్తబర్చుతుంది. ఆయన సుందర ప్రవర్తనను వీక్షిస్తూ మనం “మహిమ నుండి అధిక మహిమను పొందుచూ ప్రభువు ఆత్మచేత ఆయన పోలికగా ” మార్పు చెందుతాం. 2 కొరింథీ 3:18;DATel 67.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents