Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    16—తన ఆలయంలో

    “అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహోమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు” వెళ్లాడు.DATel 149.1

    ఈ ప్రయాణంలో యేసు రాజధానికి వెళ్తున్న ఓ పెద్ద సమూహంతో కలసి వెళ్లాడు. ఆయన సేవను గూర్చి ఇంకా బహిరంగ ప్రకటన చెయ్యలేదు. ఆ జనసమూహంలో కలిసిపోయి ప్రయాణం కొనసాగించాడు. యోహాను పరిచర్య ద్వారా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న మెస్సీయా ఆగమనాంశం ఈ సందర్భాల్లో తరచు చర్చకు వస్తుండేది. జాతీయౌన్నత్యాన్ని గూర్చిన ఆశాభావంపై ఎంతో ఆసక్తిగా చర్చ జరిగేది. ఇది ఆశాభంగానికి దారితీసే నిరీక్షణని యేసుకు తెలుసు. ఎందుచేతనంటే అది లేఖనాల తప్పుడు అవగాహనపై ఆధారితమైన నిరీక్షణ. యేసు ప్రవచనాల్ని ఎంతో శ్రద్ధగా విశదంచేసి దేవుని వాక్యపఠనంపై వారి ఆసక్తిని రేకెత్తించడానికి ప్రయత్నించాడు.DATel 149.2

    ప్రజలు యెరూషలేములో దేవుని ఆరాధించడం నేర్చుకోవాల్సి ఉందని యూదు నాయకులు వారికి బోధించారు. పస్కాపండుగ వారంలో విస్తార జనసమూహాలు ఇక్కడ సమావేశమయ్యాయి. వారు పాలాస్తీనా అన్ని ప్రాంతాలనుంచి దూరప్రదేశాలనుంచి వచ్చారు. ఆలయ ఆవరణం రకరకాల ప్రజాసమూహాల్తో నిండింది. యేసు తానే కావాల్సి ఉన్న బలిని సూచిస్తూ ప్రజలు అర్పించాల్సిన బలుల్ని అనేకమంది తేలేకపోయారు. వీరి సౌకర్యార్ధం దేవాలయం ఆవరణంలో జీవాల్ని కొనడం అమ్మడం ఏర్పాటుచేశారు. ఇక్కడ తమ బలుల్ని కోనుగోలు చెయ్యడానికి అన్నివర్గాల ప్రజలూ సమావేశమయ్యేవారు. దేవాలయంలో కానుకలుగా వచ్చిన నాణేలు విదేశద్రవ్యంలోకి వినిమయం చేసేవారు.DATel 149.3

    ప్రతీ యూదుడు ప్రతీ ఏడాది “తన ప్రాణ పరిక్రయధనము” గా అర్ధ షెకిలు చెల్లించాల్సి ఉన్నాడు. ఇలా పోగుపడ్డ ద్రవ్యం దేవాలయ పోషణ నిమిత్తం వినియుక్తమయ్యేది. నిర్గమ 30:12-16. దీనికి అదనంగా స్వేచ్చారణల రూపంలో పెద్దమొత్తాలు వచ్చేవి. వీటిని ఆలయ ధనాగారంలో దాచి ఉంచేవారు. విదేశీ నాణేలన్నీ ఆలయషెకిల్ అనబడే నాణేనికి మార్పిడి కావాలన్న నిబంధన ఉండేది. ఆలయ సేవలో ఇదే అంగీకృతమయ్యేది. ద్రవ్యమార్పిడి ప్రక్రియ మోసానికి బలవంతపు వసూళ్ళకు తావిచ్చేది. అది అవమానకరమైన వ్యాపారంగా తయారయ్యి యాజకులకు అక్రమ ఆర్జన సాధనంగా పరిణమించింది.DATel 150.1

    వ్యాపారులు బలిపశువుల్ని అధిక ధరలకు విక్రయించి లాభాల్ని యాజకులతో పంచుకునేవారు. ఈ విధంగా యాజకులు ప్రజల్ని దోచుకుని ధనవంతులయ్యేవారు. విశ్వాసులు బలులు అర్పించకపోతే దేవుని దీవెనలు తమ బిడ్డల పైన భూములపైన ఉండవని యాజకులు ప్రజలకు బోధించేవారు. ఇలా బలి ఇచ్చే జీవాలకి ఎక్కువ ధర చెప్పి అధిక లాభాలు పొందేవారు. ఎందుచేతనంటే అంతదూరం వచ్చాక బలి అర్పించకుండా ప్రజలు తిరిగి వెళ్లిపోడానికి ఇష్టపడేవారు కాదు.DATel 150.2

    పస్కా సమయంలో ప్రజలు అనేక బలులు అర్పించేవారు. దేవాలయావరణలో అమ్మకాలు ముమ్మరంగా సాగేవి. సర్వసాధారణంగా చోటుచేసుకునే గందరగోళం పశువుల సంతను తలపించేది. అది దేవుని ఆలయమనిపించేది కాదు. కొనుగోలుదార్లు బిగ్గరగా అరుస్తూ బేరం చెయ్యడం, పశువులు, గొర్రెలు, మేకలు, అరుపులు, ఖంగుమంటున్న నాణేల మోతతో కలిసిన పావురాల కూతలు కోపోద్రిక్తులైన బేరగాళ్ళకేకలు వినిపించేవి. అక్కడ లేచే గగ్గోలువల్ల భక్తుల ఆరాధనకు తీవ్ర అంతరాయం కలిగేది. మహోన్నత దేవున్ని ఉద్దేశించి పలికే మాటలు ఆలయంలోకి ప్రవేశించే గోలలో వినిపించేవి కావు. తమ భక్తి ప్రపత్తుల విషయంలో యూదులు బహుగా అతిశయించేవారు. తమ ఆలయాన్ని గూర్చి చాలా సంతోషపడేవారు. దానికి ప్రతికూలంగా ఎవరైనా ఒక్కమాట అంటే దేవధూషణగా భావించేవారు. ఆలయానికి సంబంధించిన ఆచారాల్ని నిష్టగా ఆచరించేవారు. కాని ధనాశ వచ్చేసరికి తమ సిద్దాంతాలు నియమాలికి నీళ్ళాదిలేవారు. దేవుడు తానే స్థాపించిన ఆలయ సేవల ఉద్దేశానికి తాము ఎంతో దూరంగా వెళ్లిపోయారన్న సంగతిని వారు గుర్తించడంలేదు. .DATel 150.3

    ప్రభువు సీనాయికొండ మీదికి దిగి వచ్చినప్పుడు ఆయన సముఖంవల్ల ఆ స్థలం పరిశుద్ధం అయ్యింది. దాని చుట్టూ హద్దులు ఏర్పర్చి దాన్ని పరిశుద్ధపర్చాల్సిందిగా దేవుడు మోషేని ఆదేశించాడు. అప్పుడు దేవుడు చేసిన ఈ హెచ్చరికను ప్రజలు విన్నారు, “నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచి వారు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమా ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాని ముట్టుకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుష్యుడుగాని మృగముగాని బ్రదుకకూడదు.” నిర్గమ 19:12, 13. దేవుని సముఖం ఎక్కడ ప్రదర్శితమౌతుందో అది పరిశుద్ధ స్థలమని ఈ విధంగా వారికి నేర్పించడం జరిగింది. దేవుని ఆలయ పరిధిని పరిశుద్ధంగా పరిగణించి ఉండాల్సింది. అయితే లాభార్జనకు సాగిన పోరులో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు.DATel 151.1

    జాతికి తన రాయబారులుగా వ్యవహరించడానికి దేవుడు యాజకుల్ని ప్రధానుల్ని పిలిచాడు. ఆలయపరిధిలో సాగుతున్న అక్రమాల్ని వారు సరిదిద్ది ఉండాల్సింది. న్యాయ వర్తన ధయాళుత్వం విషయాల్లో ప్రజల ముందు వారు ఆదర్శజీవితం జీవించాల్సి ఉన్నారు. సొంత లాభం గురించి ఆలోచించేకన్నా వారు ఆరాధకుల పరిస్థితుల్ని అవసరాల్ని పరిగణించి, బలిపశువును కొనుగోలు చేయలేని వారికి చేయూత నివ్వడానికి వారు సంసిద్ధంగా ఉండాల్సి ఉన్నారు. కాని ఇందుకు సిద్ధంగా లేరు. దురాశ వారి హృదయాల్ని కఠినపర్చింది.DATel 151.2

    శారీరకంగా బాధపడున్న వారు, లేమిని దుఃఖాన్ని అనుభవిస్తున్నవారు ఈ విందుకు వచ్చారు. గుడ్డివారు కుంటి వారు చెవిటి వారు వచ్చారు. కొందరినైతే మంచాలమీద మోసుకువచ్చారు. ప్రభువుకి చిన్న కానుక కూడా కొనలేనంత పేదలు, ఆహారం కొనుక్కుతినలేనంత పేదలు చాలామంది వచ్చారు. వీరు యాజకులన్న మాటలకు ఎంతో నొచ్చుకున్నారు. ఈ యాజకులు తాము భక్తి పరులమని చెప్పుకుని అతిశయించేవారు. తామే ప్రజలకు సంరక్షకులమని సగర్వంగా చెప్పుకునేవారు. అయితే వారిలో కనికరం సానుభూతి ఏకోశానా లేదు. బీదలు వ్యాధిపీడితులు మరణిస్తున్నారు. వారి సానుభూతికోసం విఫలయత్నం చేసేవారు. శ్రమలు బాధలు అనుభవిస్తున్న బీదలపట్ల యాజకులు దయ చూపించేవారుకాదు.DATel 151.3

    యేసు దేవాలంయలోకి అడుగుపెట్టగానే ఆ దృశ్యమంతా ఆయనకు కళ్ళముందు నిలిచింది. అక్కడి అన్యాయపు అమ్మకాలు కొనుగోళ్లు ఆయన చూశాడు. బీదల్ని వారి దీనస్థితిని చూశాడు. తన రక్తం చిందించకుండా వారికి రక్షణ లభించదన్న విషయాన్ని గుర్తించాడు. తన ఆలయం ఆవరణం వ్యాపారవస్తువుల అమ్మకం కొనుగోళ్ల సంతగా మారడం చూశాడు. ఆ పరిశుద్ధ ఆవరణం ఓ విపణిగా మారింది.DATel 152.1

    ఆ పరిస్థితిని మార్చడానికి ఏదో ఒక పని చేయాల్సిన అవసరముందని క్రీస్తు గుర్తించాడు. ఎన్నో ఆచారాలు విధులు ఆచరించాల్సిందిగా ప్రజల్ని యాజకులు కోరడం జరిగేది. కాని వాటిని ఎందుకు ఆచరించాలి అన్న దాన్ని గురించి సరియైన ఉపదేశం వారికిలేదు. భక్తులు తమ బలుల్ని అర్పించే వారు గాని అవి క్రీస్తు సంపూర్ణ త్యాగాన్ని సూచించే ఛాయారూపాలని వారికి తెలియదు. వారి ఆచారాలు పూజపునస్కారాలు సూచించే ప్రభువు గుర్తింపు లేకుండా గౌరవం పొందకుండా వారి మధ్యనే ఉన్నాడు. అర్పణలకు సంబంధించిన సూచనల్ని ఈయన వారికిచ్చాడు. ఆ చిహ్నాల విలువ ఆయనకు బాగా తెలుసు. వాటిని ప్రజలు వక్రీకరించి అపార్థం చేసుకున్నట్లు ఆయన గ్రహించాడు. ఆధ్యాత్మికారాధన స్థానం కోల్పోతోంది. యాజకులు ప్రధానులకు దేవునికి మధ్య ఉన్న బంధం ఇక లేదు. క్రీస్తు పరిచర్య వేరే ఆరాధన వ్వవస్థను స్థాపించాల్సి ఉంది.DATel 152.2

    ఆలయావరణం మెట్టుమిద నిలబడి ఆ దృశ్యాన్ని క్రీస్తు జాగ్రత్తగా పరిశీలిస్తోన్నాడు. ప్రావచనిక నేత్రంతో భవిష్యత్తులోకి చూస్తోన్నాడు. సంవత్సరాలు కాదు, శతాబ్దాలు కాదు, యుగాలికి యుగాలే ఆయన నేత్రాం వీక్షిస్తోంది. ఎన్నో అవసరాలున్న పేద ప్రజల్ని యాజకులు పాలకులు తమ హక్కుల్ని హరించి వారిని ఎలా పక్కదారి పట్టిస్తారో వారికి సువార్త ప్రకటితం కాకుండా దాన్ని ఎలా దాచేస్తారో దేవుని కృపను మనుషులు ఎలా వ్యాపారావస్తువుగా చేస్తారో చూశాడు. నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన ముఖంలో ఆగ్రహం, అధికారం శక్తి వ్యక్తమయ్యాయి. ప్రజల గమనం ఆయనమీద నిలిచింది. అపవిత్ర వ్యాపార లావాదేవీల్లో మునిగి ఉన్నవారికి ఈయన తమ హృదయాలోచనల్ని ఉద్దేశాన్ని ఎరిగినవాడన్న భావన కలిగింది. వెదకుతున్న ఆయన కళ్లకు కనిపించకుండా తమ ముఖాలపై రాసి ఉన్న దుష్కార్యాల్ని దాచడానికి అన్నట్లు కొందరు తమ ముఖాల్ని దాచుకుంటోన్నారు.DATel 152.3

    ఆ గందరగోళం సద్దణిగింది. కొనుగోళ్ళు అమ్మకాలు బేరసారాల రొద ఆగిపోయింది. ఆ నిశ్శబ్ద వాతావరణం దుర్భరంగా ఉంది. అక్కడున్న వారిని ఒక రకమైన భయం అలముకొంది. వారు తమనేరాల నిమిత్తం దేవుని న్యాయస్థానం ముందు తీర్పుకి నిలబడినట్లు ఉంది. క్రీస్తు వంక చూస్తున్నప్పుడు మానవ రూపంలోనుంచి దేవత్వం ప్రకాశిస్తోన్నట్లు వారు చూశారు. ఆ అంతిమదినాన కొలువుతీరే న్యాయాధిపతిలా ఆ పరలోక ప్రభువు నిలిచి ఉన్నాడు. అప్పుడు ఆయన్ని ఆవరించనున్న మహిమా ప్రభావం ఇప్పుడు లేకపోయినా హృదయాలోచనల్ని గ్రహించడానికి అప్పుడుండే శక్తి ఆయనకు ఇప్పుడు ఉంది. ఆయన దృష్టి ఆ విస్తార జనసమూహంపై ప్రసరించి ప్రతీ వ్యక్తిని పరిశీలిస్తోంది. మన్నన గౌరవం విషయంలో ఆయన వారందరికన్నా అత్యున్నతంగా లేచాడు. ఆయన ముఖంపై పరిశుద్ధకాంతి ప్రకాశించింది. ఆయన మాట్లాడొన్నాడు. ఆయన స్వరం స్పష్టంగా వినిపిస్తోంది. సీనాయిపర్వతంపై ధర్మశాస్త్రాన్ని ప్రకటించిన స్వరం అదే. యాజకులు ప్రధానులు అతిక్రమిస్తోన్న ధర్మశాస్త్రం అదే. అదే స్వరం ఇప్పుడు దేవాలయం కమానుల్లోనుంచి ప్రతిధ్యనిస్తోన్న స్వరం అదే. “వీటిని ఇక్కడనుండి తీసికొని పొండి, నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి” అంది ఆ స్వరం.DATel 153.1

    నెమ్మదిగా మెట్లు దిగి కొరడాను ఎత్తి పట్టుకుని దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి వ్యాపారులందరినీ అక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. డబ్బు మార్చేవారి డబ్బును చల్లివేసి వారి బల్లలు పడదోసి ఎన్నడూ లేని ఆవేశంతో కాఠిన్యంతో వారిని నెట్టివేశాడు. నాణేలు పాలరాతి నేలమీద పెద్దశబ్ధంతో పడ్డాయి. ఆయన అధికారాన్ని ప్రశ్నించిన వారు ఒక్కరు లేరు. నేలపాలైన తమ అక్రమ లాభాల్ని తిరిగి పోగు చేసుకునేందుకు సాహసించినవారు ఒక్కరు లేరు. యేసు ఆ కొరడాతో ఎవర్నీ కొట్టలేదు. కాని ఆయన చేతిలోని ఆ కొరడా మండుతున్న ఖడ్గంలా భయంకరంగా కనిపించింది. దేవాలయ అధికారులు వ్యాపారం చేస్తున్న యాజకులు దళారులు, గొర్రెలు, ఎడ్ల వ్యాపారులు అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు.DATel 153.2

    ఆ జనసమూహం గుండెల్లో భయం చోటుచేసుకుంది. ఆయన దేవత్వం తమను ఆవరించినట్లు వారికనిపించింది. వందలాది పెదవుల నుంచి భయంతో నిండిన కేకలు వెలువడ్డాయి. యేసు మాటలు, ఆయన తీరు, ఆయన సాధరణ ప్రవర్తనకు భిన్నంగా ఉండడం వారిని విస్మయపర్చాయి. “నీ యింటిని గూర్చిన ఆ సక్తి నన్ను భక్షించుచున్నది.” (కీర్త 69:9) అని ఆయన్ని గూర్చి లిఖితమై ఉన్నట్లు వారు గుర్తుచేసుకున్నారు. సరకుల అమ్మకాలు కొనుగోళ్లతో గొడవ గొడవగా ఉన్న ఆ జనసమూహం కొద్దిసేపట్లో ప్రభువు ఆలయ ఆవరణం నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఆవరణంలో ఇక వ్యాపార సంబంధింత గంధరగోళం లేదు. క్రితం అస్తవ్యస్తంగా ఉన్న ఆవరణం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. పూర్వం పర్వతాన్ని పరిశుద్ధం చేసిన ప్రభువు సన్నిధి ఆయన మహిమార్ధం నిర్మితమైన ఆలయాన్ని ఇప్పుడు పవిత్రం చేసింది.DATel 154.1

    ఆలయ ప్రక్షాళనలో మెస్సీయగా యేసు తన కర్తవ్యాన్ని ప్రకటించి దాని ఆచరణను ప్రారంభిస్తోన్నాడు. దైవసన్నిధి ఉనికి నిమిత్తం నిర్మితమైన ఆలయం ఇశ్రాయేలుకీ సర్వప్రపంచానికీ ఒక దృశ్య పాఠంగా నిలవాలని దేవుడు ఉద్దేశించాడు. ప్రకాశమానమైన సెరాపు మొదలు మనుషుడు వరకు సృష్టి పొందిన ప్రతి ప్రాణి సృష్టికర్త నివాసానికి దేవాలయంగా ఉండాలని అనాదినుంచి దేవుడు సంకల్పించాడు. పాపం కారణంగా మానవులు దేవునికి ఆలయంగా ఉండే స్థితి ఆగిపోయింది. దుర్మార్గతవల్ల అపవిత్రమైన మానవహృదయం పరిశుద్ధ దేవుని మహిమను ఇక ప్రతిబింబించలేకపోయింది. అయితే దైవకుమారుని రాకవల్ల దేవుని సంకల్పం నెరవేరింది. దేవుడు మానవుల్లో నివసిస్తాడు. రక్షణార్ధమైన కృపద్వారా మానవహృదయం మళ్లీ ఆయనకు ఆలయమౌతుంది. యెరూషలే. బులోని దేవాలయం ప్రతీ ఆత్మకూ ఉన్నతమైన భవిత ఉందని నిత్యమూ సాక్ష్యం ఇవ్వాలన్నది దేవుని సంకల్పం. అయితే తాము ఎంతో గౌరవించి అతిశయించే ఆలయం ప్రాధాన్యాన్ని యూదులు గ్రహించలేదు. పరిశుద్ధాలయాలుగా వారు తమ్మును తాము దేవుని ఆత్మకు సమర్పించుకోలేదు. యెరూషలేములోని ఆలయావరణలో చోటుచేసుకున్న వాణిజ్యపరమైన గందరగోళం నిజానికి హృదయాలయాన్ని సూచిస్తోంది. అది శరీరాశలు, ఉద్రేకాలు, దురాలోచనలతో అపవిత్రమయ్యింది. లోక సంబంధులైన కొనుగోలుదార్లు అమ్మకందార్ల నుంచి ఆలయాన్ని శుద్ధిచెయ్యడంలో పాపం నుంచి, ఆత్మను భ్రష్టంచేసే కోర్కెలు, స్వార్థాశల నుంచి హృదయాన్ని శుద్ధి చేసే తన పరిచర్యను యేసు ప్రకటించాడు.DATel 154.2

    “ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటి వాడు; చాకలి వాని సబ్బువంటి వాడు; వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయునట్లు వెండి బంగారములను నిర్మలముచేయు రీతిని ఆయన వారిని నిర్మలము చేయును” మాలాకీ 3:1-3DATel 155.1

    “మీరు దేవుని ఆలయమైయున్నారనియు దేవుని ఆత్మ నాలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. మీరు ఆలయమై యున్నారు.” 1కొరింధీ 3:16, 17; హృదయాన్ని స్వాదీనం చేసుకున్న దుష్టశక్తుల్ని ఎవరూ తమంతట తాము జయించలేరు. హృదయాలయాన్ని నిర్మలం చెయ్యగలవాడు క్రీస్తు ఒక్కడే. అలాగని ఆయన మనస్సులోకి బలవంతంగా ప్రవేశించడు. పాతకాలంలో ఆలయంలో ప్రవేశించినట్లు మన హృదయాలయంలో ప్రవేశించడు. ఆయన ఇలా అంటున్నాడు “ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకువచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము.” ప్రకటన 3:20. ఆయన ఒక రోజు ఉండడానికే రాడు. ఎందుకంటే ఆయన ఇలా అంటోన్నాడు, “నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై యుందును వారు నాప్రజలై యుందురు.” “మన దోషములను అణచివేయును వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.” 2 కొరింధీ 6:16; మికా 7:19. ఆత్మ ప్రభువుకు పవిత్రాలయంగా ఉండేందుకు ఆయన సన్నిధి దాన్ని కడిగి పరిశుద్ధపర్చుతుంది. అది “ఆత్మ మూలముగా దేవునికి నివాసమై” ఉంటుంది. ఎఫెసీ 2:21, 22.DATel 155.2

    భయభ్రాంతులై యాజకులు ప్రధానులు ఆలయం ఆవరణంలోనుంచి, తమ హృదయరహస్యాల్ని గ్రహించగల నిశితమైన ఆయన చూపుల నుంచి పారిపోయారు. పారిపోతున్నవారు దేవాలయానికి వెళ్తున్న ఇతరుల్ని కలుసుకుని తాము ఏమి చూశారో ఏమి విన్నారో వారికి వివరించి తిరిగి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పారిపోతున్న వారిని క్రీస్తు చూసి తమ భయాందోళనల నిమిత్తం, నిజమైన ఆరాధన అంటే ఏంటో ఎరుగని వారి అజ్ఞానం నిమిత్తం వారి పై జాలిపడ్డాడు. యూదుజాతి దుర్మార్గత కారణంగా మారుమనసు పొందని వారి దుస్థితి కారణంగా వారు భవిష్యత్తులో చెల్లాచెదురైపొవడానికి ఓ సంకేతాన్ని ఈ సన్నివేశంలో ప్రభువు చూశాడు.DATel 156.1

    దేవాలయం నుంచి యాజకులు ఎందుకు పారిపోయారు? వారు ఆలయంలోనే ఎందుకు నిలిచిపోలేదు? వెళ్లిపొమ్మని వారిని ఆదేశించినవాడు లోకాధికారంగాని హోదాగాని లేని పేద గలిలియుడి కుమారుడైన వడ్రంగి మాత్రమే. ఆయన్ని వారు ఎందుకు ధిక్కరించలేదు? అతి సామాన్యం, దీనం అయిన బాహ్యకృతిగల ఆయన ఆజ్ఞమేరకు వారు తమ అక్రమ ఆర్జనను విడిచి పెట్టి ఎందుకు పలాయనం చిత్తగించారు?DATel 156.2

    ఓ రాజు అధికారంతో క్రీస్తు మాట్లాడాడు. ఆయన సముఖంలోను ఆయన కంఠస్వరంలోను ఏ శక్తి ప్రతిఘటించలేని శక్తి ఉంది. ఆ ఆజ్ఞ వెలువడగానే అబద్ధికులుగాను దొంగలుగాను తమ నిజస్వరూప స్వభావాల్ని వారు మున్నెన్నటికన్నా స్పష్టంగా గ్రహించగలిగారు. మానవాకృతిలో నుంచి వేవత్వం ప్రకాశించినప్పుడు క్రీస్తు ముఖంలోని ఆగ్రహాన్నే కాదు ఆయన మాటల ప్రాముఖ్యాన్ని కూడా వారు గుర్తించారు. తాము నిత్యుడైన నిత్యకాలికమైన తీర్పు వెలువరిస్తోన్నట్లు వారు భావించారు. కాసేపు క్రీస్తు ప్రవక్త అని భావించారు. వారిలో అనేకులు ఆయన్ని మెస్సీయా అని నమ్మారు. క్రీస్తును గురించి ప్రవక్తలు పలికిన మాటల్ని వారి మనస్సుల్లో పరిశుద్ధాత్మ ప్రకాశింపజేశాడు. తమలో పుట్టిన ఈ నమ్మకాన్ని వారు ఆచరిస్తారా?DATel 156.3

    వారికి పశ్చాత్తాపమన్నది లేదు. బీదల పట్ల క్రీస్తుకు కనికరముందని వారికి తెలుసు. ప్రజలతో తమ వ్యవహరణలో వారిని దోచుకున్నట్లు వారికి తెలుసు. క్రీస్తు వారిని బహిరంగంగా మందలించడం వారికి మింగుడుపడలేదు. ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న పలుకుబడి ఆదరణ వారిలో ఈర్య పుట్టించింది. తమను ఏశక్తి వలన ఆలయంనుంచి తరిమివేశాడో ఆ అధికారం ఆయనకు ఎవరిచ్చారో ఆయన్ని నిగ్గదియ్యాలని వారు కృతనిశ్చయులయ్యారు.DATel 157.1

    ఆచితూచి అడుగులు వేస్తూ అయినా మనసులనిండా ద్వేషంతో వారు దేవాలయానికి తిరిగివచ్చారు. వారు తిరిగి వచ్చేసరికి అక్కడ ఎంత గొప్ప మార్పు చోటుచేసుకుంది! వారు పారిపోగా బీదవారు అక్కడే ఉండిపోయారు. వీరిప్పుడు క్రీస్తు వద్ద ఉన్నారు. ఆయన వారిపట్ల ప్రేమ దయ కనికరాల్ని ప్రదరిస్తోన్నాడు. వణుకుతూ తన చూట్టు గుమిగూడిన ఆ ప్రజల్ని చూసి కన్నీరు కారుస్తూ భయపడకండి, నేను మీకు విడుదల కలిగిస్తాను. మీరు నన్ను మహిమపర్చుతారు. ఇందు నిమిత్తమే నేను ఈలోకానికి వచ్చాను అన్నాడు.DATel 157.2

    ప్రజలు అత్యవసరమైన దయనీయమైన విజ్ఞప్తులతో క్రీస్తు ముందుకు తోసుకుంటూ వచ్చేవారు. ప్రభువా నన్ను ఆశీర్వదించు అనేవారు. ఆయన అందరి మనవుల్ని వినేవాడు. తల్లి ప్రేమను మించిన ప్రేమతో వంగి ఆయన బాధ పడున్న చిన్నపిల్లల్ని పరామర్శించేవాడు. ఆయన అందరినీ ఆదరించేవాడు. వారి వ్యాధులేమైనా ప్రతీవారినీ స్వస్తపర్చేవాడు. మూగవారు నోరు తెరిచి ఆయన్ని స్తుతించారు. గుడ్డివారు తమను బాగుచేసిన రక్షకుని ముఖం చూశారు. బాధపడున్న వారి హృదయాల్లో ఉత్సాహానందాలతో పొంగిపొరలాయి.DATel 157.3

    యాజకులు ఆలయ అధికారులు ఈ అద్భుత పరిచర్యను చూసినప్పుడు, వారి చెవులు విన్నమాటలు ఎంత చక్కని మాటలు! ప్రజలు తామనుభవించిన బాధను గురించి, తమకు కలిగిన ఆశాభంగాలు గురించి బాధతో నిండిన దినాలు, కంటి మీద కునుకులేని రాత్రులు గురించి ఆయనకు చెబుతున్నారు. వారు ఆశలన్నీ వదులుకున్న తరుణంలో క్రీస్తు తమకు సహాయం చేశాడన్నారు. నా భారం ఎంతో తీవ్రమైంది. కాని నాకు సహాయకుడు దొరికాడు అన్నాడు ఒకడు. మరొకడు నా సహాయకుడు క్రీస్తు. ఆయన సేవలో నాజీవితం గడుపుతాను అన్నాడు. ఇంకొకడు మా ప్రాణాలు కాపాడినవాడు ఈయనే అని తల్లిదండ్రులు తమ బిడ్డలకు తెలిపి ఆయన్ని మహిమపర్చండన్నారు. పిల్లలు, యువజనులు తండ్రులు తల్లులు, స్నేహితులు ప్రేక్షకుల స్వరాలు ఏకమై ఆయనకు స్తోత్రం చెల్లించాయి. నిరీక్షణ ఆనందం వారి మనసుల్ని నింపాయి. ఆత్మ విషయంలోను శరీరం విషయంలోను వారు పునరుద్ధరణ పొందారు. వారు తమ గృహాలకు తిరిగివచ్చి ప్రతీచోటా నిరుపమానమైన యేసుప్రేమను చాటారు.DATel 158.1

    “వీనిని సిలువ వేయుము సిలువ వేయుము” అంటూ క్రీస్తును సిలువ వేస్తున్న సమయంలో కేకలు వేసిన వారిలో ఈ విధంగా స్వస్తత పొందిన వారు లేరు. వారు క్రీస్తు పట్ల సానుభూతి ఉన్నవారు. ఎందుకంటే వారు ఆయన సానుభూతిని పొందారు. ఆయన మహాశక్తిని వీక్షించారు. ఆయన్ని తమ రక్షకుడిగా గుర్తించారు. ఆయనే వారికి శరీరసంబంధమైన ఆత్మసంబంధమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. వారు అపొస్తలుల బోధలు విన్నారు. వారి హృదయాల్లో ప్రవేశించిన దైవవాక్యం వారికి అవగాహన నిచ్చింది. వారు దేవుని కృపకు దేవుని రక్షణకు సాధనాలయ్యారు.DATel 158.2

    ఆలయ ప్రాంగణంలోనుంచి పారిపోయిన జన సమూహం కొంతకాలానికి క్రమక్రమంగా తమ పాతమార్గాల్లోకి తిరిగి వెళ్లారు. తమకు కలిగిన భయం నుంచి వారు కొంత మట్టుకు కోలుకున్నారు. అయినా వారి ముఖాల్లో సందిగ్ధత భయం ప్రస్ఫుటంగా కనిపించాయి. ‘ యేసు కార్యాల్ని వారు ఆశ్చర్యంతో పరిశీలించారు. మెస్సీయాను గూర్చిన ప్రవచనాలు ఆయనలోనే నెరవేరుతున్నవని నమ్మారు. ఆలయాన్ని అపవిత్రపర్చడమన్న పాపానికి చాలావరకు యాజకులే బాధ్యులు. ఆలయావరణం విఫణి స్థలంగా మారడం వారి నిర్వాకమే. ఆ విషయంలో ప్రజలు అమాయకులే. యేసు ప్రదర్శించిన దైవాధికారం వారిని ఆకట్టుకుంది. కాని వారిపై యాజకులు ప్రధానులకున్న ప్రభావం మరింత బలీయమైంది. క్రీస్తు సేవ అన్నదాన్ని వారు జోక్యం చేసుకునే హక్కు తనకెక్కడిదని ఆయన్ని ప్రశ్నించారు. తమలోని పరిశుద్ధాత్మ స్వరాన్ని అణచివేశారు.DATel 158.3

    యాజకులు ప్రధానులు అందరికన్నా ముందుగా యేసును అభిషిక్తుడిగా గుర్తించి ఉండాల్సింది. ఎంచేతనంటే ఆయన పరిచర్యను వర్ణించే పవిత్రలేఖన గ్రంధాలు వారి చేతుల్లోనే ఉన్నాయి. ఆలయ ప్రక్షాళన మానవశక్తిని మించిన శక్తి ప్రదర్శన అని వారికి తెలుసు. యేసు పట్ల వారికి ద్వేషమున్నా ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి ఆయన దేవుడు పంపిన ప్రవక్త అయి ఉండవచ్చునన్న అనుమానం వారిని తొలిచివేసింది. ఈ భయం నుంచి పుట్టిన గౌరవంతో ఇలా ప్రశ్నిస్తూ ఆయన వద్దకు వెళ్ళారు, “నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే. సూచక క్రియను మాకు చూపెదవు?”DATel 159.1

    యేసు వారికి ఓ గుర్తు చూపించాడు. వారి మనసుల్లో వెలుగు ప్రకాశింపజెయ్యడంలోను, మెస్సీయా చేయాల్సి ఉన్న పనులు వారి ముందు చేయడంలోను ఆయన తన ప్రవర్తననుగూర్చి తిరుగులేని నిదర్శనాన్ని ఇచ్చాడు. ఒక గుర్తు చూపించమని ఇప్పుడు వారు అడిగినప్పుడు ఓ ఉపమానం చెప్పడం ద్వారా వారికి సమాధానమిస్తూ తమ దుర్బుద్ధిని గ్రహించానని అది వారిని ఏ దురాగతాలకు నడుపుతుందో అవగతంత చేసుకోగలనని వ్యక్తం చేశాడు. “ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదును” అన్నాడు.DATel 159.2

    ఈ మాటలకు రెండు భావాలు ఆయన ఉదేశించాడు. యూదుల ఆలయ విధ్వంసాన్నే కాదు తన శరీరాలయ నాశనాన్ని అనగా తన మరణాన్ని కూడా ఆయన ఉద్దేశించాడు. దీనికి యూదులు కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు. యాజకులు ప్రధానులు ఆలయానికి తిరిగి వచ్చినప్పుడు యేసును చంపాలని తమను శ్రమలకు గురిచేస్తున్న ఆయన్ని ఆరకంగా తొలగించుకోవాలని నిశ్చయించుకున్నారు. అయినా తమ దురుద్దేశాన్ని వారి ముందుంచినప్పుడు కూడా వారు ఆయన్ని గ్రహించలేకపోయారు. ఆయన మాటలు యెరూషలేము ఆలయానికి మాత్రమే వర్తిస్తున్నట్లు అపోహపడ్డారు. కోపోద్రిక్తులై ఇలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు, “ఈ దేవాలయము నలుబదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దినములలో దానిని లేపుదువా? ఇప్పుడు యేసు తమ విశ్వాసాన్ని ధ్రువపర్చాడని వారు నిర్ధారించుకున్నారు. ఆయన్ని విసర్జించడానికి దృఢచిత్తులయ్యారు.DATel 159.3

    ఈ సమయంలో అవిశ్వాసులైన యూదులు ఆ మాటకొస్తే తన శిష్యులు కూడా తన మాటల్ని అవగాహన చేసుకోవాలని యేసు ఉద్దేశించలేదు. తన విరోధులు వాటిని అపార్ధం చేసుకుంటారని వాటిని తనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారని ఆయనకు తెలుసు. తన విచారణలో తన శత్రువులు ఆయనపై ఆరోపణలుగా ఆ మాటల్ని ఉటంకిస్తారు. కల్వరి సిలువపై ఉన్నప్పుడు ఆయన్ని ఎగతాళి చేయడానికి వాటిని విసరనున్నారు. వాటిని ఇప్పుడు విశదీకరించడం తన శ్రమల గురించి శిష్యులికి తెలపడం వారిని భరించరాని దుఃఖానికి గురిచెయ్యడం అవుతుంది. విశదీకరణ వల్ల యూదులకు తమ దురభిమానం అపనమ్మిక ఫలం ఏంటో ముందే తెలుస్తుంది. ఇప్పటికే ఆయన్ని వధకు తీసుకువెళ్లే గొర్రెపిల్లలా నడిపించి తుదకు వధకు అప్పగించే మార్గంలో వారు ప్రవేశించారు.DATel 160.1

    ఆయన్ని విశ్వసించేవారి నిమిత్తమే క్రీస్తు ఈ మాటల్ని పలికాడు. వాటిని మళ్లీ మళ్లీ ప్రజలకు వినిపించడం జరుగుతుందని ఆయనకు తెలుసు. పస్కాలో అన్నమాటలు గనుక ఇవి వేల ప్రజల చెవిని పడడం అవి లోకంలో అన్ని చోట్లకూ వెళ్లడం ఖాయం. ఆయన మరణం నుంచి లేచాక ఆ మాటల అర్ధం మరింత స్పష్టమౌతుంది. అనేకులకు అది ఆయన దేవత్వానికి తిరుగు లేని నిదర్శనం.DATel 160.2

    తమ ఆధ్యాత్మిక చీకటి కారణంగా యేసు శిష్యులు సైతం ఆయన బోధించిన విషయాల్ని గ్రహించలేకపోయారు. కాగా వీటిలో అనేక విషయాలు అనంతర పరిణామాల ద్వారా వారికి విశదమయ్యేవి. వారి మధ్య ఇక ఆయన లేనప్పుడు ఆయన మాటలు వారికి మనోబలాన్ని స్థయిర్యాన్ని కూర్చాయి.DATel 160.3

    యెరూషలేములోని ఆలయం సందర్భంగా రక్షకుడు “ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాని లేపుదును” అన్న మాటలు ఆ ప్రజలు గ్రహించిన దానికన్నా ఎక్కువ భావం కలవి. క్రీస్తే ఆలయానికి పునాది, ప్రాణమూను. అందులోని సేవలు దైవకుమారుని త్యాగానికి ఛాయారూపాలు. యాజకత్వ సేవలు క్రీస్తు పోషించే మధ్యవర్తి పాత్రకు ఆయన చేయనున్న పరిచర్యకు చిహ్నంగా స్థాపితమయ్యాయి. బలిఅర్పణల రూపంలో జరిగిన ఆరాధన యావత్తు లోకాన్ని రక్షించడానికి రక్షకుడు పొందనున్న మరణాన్ని ఛాయారూపకంగా సూచిస్తోంది. ఈ బలి అర్పణలు యుగాల పొడవున సూచిస్తూ వచ్చిన ఆ ఘటన సంభవించినప్పుడు ఈ బలుల ఉపయోగం ఇక ఉండదు.DATel 161.1

    ఈ ఆచార వ్యవస్థ మొత్తం క్రీస్తుకు సంకేతాత్మాకం గనుక ఆయన్ని మినహాయిస్తే అది నిరర్ధకం. క్రీస్తును మరణానికి అప్పగిస్తూ యూదులు ఆయన్ని విసర్జించినప్పుడు దేవాలయానికి దానిలోని సేవలకూ ప్రాముఖ్యాన్నిచ్చిన సమస్తాన్ని వారు విసర్జించారు. దాని పవిత్రత మాయమయ్యింది. అది ధ్వంసం కావడానికి మిగిలి ఉంది. బలిఅర్పణలు తత్సంబంధమైన సేవలు ఆనాటి నుంచే అర్థరహితమయ్యాయి. వారి అర్పణలు కయీను అర్పణలా రక్షకునిపై విశ్వాసాన్ని వ్యక్తం చేయ్యలేదు. క్రీస్తుని చంపడంలో యూదులు వాస్తవంలో తమ దేవాలయాన్ని ధ్వంసం చేసుకున్నారు. క్రీస్తు సిలువపై మరణించినప్పుడు దేవాలయంలోని తెర పై నుంచి కిందకు చినిగింది. చివరి బలి అర్పణ జరిగిందని బలిఅర్పణ వ్యవస్థ అంతమెందిందని దీని అర్థం.DATel 161.2

    “మూడు దినములలో దాని లేపుదును” రక్షకుని మరణంలో చీకటి శక్తులు జయించినట్లు కనిపించింది. ఆ విజయం వాటి కెంతో ఆనందాన్నిచ్చింది. కాని యోసేపు సమాధిని చీల్చుకుని యేసు విజయుడుగా లేచాడు. “ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువచేత జయోత్సాహముతో వారిని తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.” కొలాస్స2:15. తన మరణ పునరుత్థానాల ద్వారా “మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన గుడారమునకు” పరిచారకుడయ్యాడు. హెబ్రీ 8:2; యూదు గుడారాన్ని మనుషులే కట్టారు. మనుషులే యూదు దేవాలయాన్ని నిర్మించారు. అయితే పరలోకమందున్న ఆలయం భూలోకంలోని ఆలయానికి మాదిరి. దాన్ని ఏ మానవ శిల్పీ కట్టలేదు. “చిగురు అను ఒకడు కలడు.... అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనానసీనుడై యేలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము” చేస్తాడు. జెకర్యా 6:12, 13.DATel 161.3

    క్రీస్తును సూచించిన బలి అర్చణ సేవలు సమాప్తమయ్యాయి. ఇక మనుషుల దృష్టి లోకపాపాల నిమిత్తం జరగనున్న వాస్తవిక బల్యర్పణపై నిలిచింది. భూలోక యాజకత్వం అంతమొందింది. కాగా నూతన నిబంధన పరిచారకుడైన యేసుపైని “హేబెలు కంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తము” పైన మనం దృష్టి నిలుపుతున్నాం. “ఆ మొదటి గుడారమింక నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలు పడలేదు.... అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి హస్తకృతము కానిది.... పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా.... తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను.” హెబ్రీ 12:24; 9:8-12; “ఈయన తనద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తి వంతుడై యున్నాడు.” హెబ్రీ 7:25. ఈ పరిచర్య ఇహలోక గుడారంలోనుంచి పరలోక గుడారంలోకి మార్పిడి కావాల్సి ఉన్నప్పటికీ, గుడారం, మన ప్రధాన యాజకుడు మానవ నేత్రాలకు కనిపించకపోయినప్పుటికీ దానిమూలంగా శిష్యులికి ఎలాంటి నష్టమూ వాటిల్లదు. తమ సంబంధ బాంధప్యాల్లో వారికి ఎలాంటి అంతరాయం సంభవించదు. రక్షకుడు లేనందువల్ల ఎలాంటి శక్తి క్షీణత కలుగదు. యేసు పరలోక గుడారంలో పరిచర్య చేస్తున్న కాలంలో కూడా లోకంలో తన సంఘానికి తన ఆత్మద్వారా పరిచర్య చేస్తుంటాడు. భౌతిక నేత్రానికి ఆయన దూరమయ్యాడు. అయినా ఆయన వెళ్లేటప్పుడు చేసిన ఈ వాగ్దానం నెరవేర్తుంది, “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము నాతో కూడా ఉన్నాను” మత్తయి 28:20. ఆయన తన శక్తిని కింది స్థాయి బోధకులకు ఇచ్చాడు. శక్తిని కూర్చే ఆయన సన్నిధి ఇంకా తన సంఘంతోనే ఉంది.DATel 162.1

    “దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదుగాని, సమస్తవిషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడై యుండెను. గనుక మనము కనికరింపబడి నమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము” హెబ్రీ 4:14-16.DATel 163.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents