Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    19—యాకోబు బావి వద్ద

    గలిలయకు వెళ్తూ యేసు దారిలో ఉన్న సమరయను దాటి వెళ్ళాడు. ఆయన సుందరమైన షెకెము లోయకు వచ్చేసరికి మధ్యాహ్నమయ్యింది. ఈ లోయ ఆరంభంలో యాకోబు బావి ఉంది. ప్రయాణంవల్ల అలసిపోయిన ప్రభువు విశ్రమించడానికి ఇక్కడ కూర్చున్నాడు. శిష్యులు ఆహారం కొనడానికి వెళ్లారు.DATel 181.1

    యూదులు సమరయులు బద్ద విరోధులు. వారి మధ్య ఎలాంటి సంబంధాలూ ఉండేవికావు. అత్యవసర పరిస్థితిలో సమరయులో వాణిజ్యం చెయ్యడాన్ని రబ్బీలు న్యాయసమ్మతంగా పరిగణించేవారు. యూదుడు సమరయుడి వద్ద అప్పు తీసుకోడం, ఉపకారం పొందడం ఆమాటకొస్తే చిన్న రొట్టెముక్కగాని కప్పునీళ్ళు గాని స్వీకరించడం జరిగేది కాదు. ఆహారం కొనడంలో శిష్యులు ఆదేశంలోని ఆచారం ప్రకారం వ్యవహరిస్తోన్నారు. ఆచారాన్ని మించి ఆశించడం క్రీస్తు శిష్యులు ఊహించనుకూడా లేదు. -DATel 181.2

    ఆ బావి పక్క కూర్చొన్న యేసు ఆకలిగా ఉన్నాడు. దాహంతో తపిస్తున్నాడు. ఉదయం నుంచి సాగిన ప్రయాణం సుదీర్ఘమైంది. పులిమీద పుట్రలా మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది. అతిసమీపంలో చల్లని నీళ్ళు ఉన్నా అవి లభ్యమయ్యే వల్లలేదన్న తలంపు ఆయన దాహార్తిని అధికం చేసింది. ఆయన వద్ద తాడుగాని చేదగాని లేవు. అది లోతైన బావి. నీళ్ళు చేదుకోడానికి ఎవరైనా వచ్చేవరకు మానవమాతృడైన ఆయన వేచి ఉండాల్సి వచ్చింది.DATel 181.3

    ఓ సమరయ స్త్రీ వచ్చింది. ఆయన ఉనికిని గుర్తించకుండా తన కుండనిండా నీళ్ళు నింపుకుంది. ఆమె తిరిగి వెళ్ళిపోతుండగా తాగడానికి నీళ్ళు ఇమ్మని అడిగాడు. అలాంటి ఉపకారాన్ని తూర్పుదేశాల్లో ఎవరూ నిరాకరించరు. ప్రాచ్యదేశాల్లో నీటిని “దేవుని వరం”గా భావించడం జరిగేది. దాహంతో ఉన్న బాటసారికి దాహమివ్వడం ఎడారి ప్రాంతంలోని అరబ్బులు తమ విధిగా పరిగణించి ఉదారంగా సహాయమందించేవారు. యూదులకు సమరయులకు మధ్య ప్రబలిన ద్వేషంవల్ల ఆ స్త్రీ యేసుకి దయ చూపించడానికి సందేహించింది. అయితే రక్షకుడు ఈ స్త్రీ హృదయాన్ని తెరవడానికి ప్రయత్నిస్తోన్నాడు. దైవప్రేమవల్ల కలిగిన చొరవతో ఆయన ఆమె సహాయం అర్జించాడు. ఉపకారాన్ని ఇస్తానని ఆయన అనలేదు. ఆయన ఇవ్వజూపే ఉపకారాన్ని ఆమె నిరాకరించవచ్చు. కాని నమ్మకం నమ్మకాన్ని పుట్టిస్తుంది. పరలోక మహారాజు అంటరాని ఈ ఆత్మ వద్దకు వచ్చి చిన్న సహాయం యాచించాడు. సముద్రాన్ని సృష్టించినవాడు, అగాధ జలాల్ని అదుపులో ఉంచేవాడు, భూగర్భజలధారల్ని, నదుల్ని ప్రవహింపజేసేవాడు అయిన ఆ ప్రభువు యాకోబు బావివద్ద అలసట తీర్చుకుంటూ మంచినీళ్ళకు సైతం ఓ అపరిచిత వ్యక్తి దయ పై ఆధారపడ్డాడు.DATel 182.1

    యేసు యూదుడన్న విషయాన్ని ఆ స్త్రీ గ్రహించింది. ఆశ్చర్యంతో తికమకపడి ఆయన మనవిని మర్చిపోయి దానికి కారణమేంటో తెలుసుకోడానికి ప్రయత్నించింది. “యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని యేలాగు అడుగుచున్నావు?” అన్నది.DATel 182.2

    “నీవు దేవుని వరమును - నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును” అని యేసు జవాబిచ్చాడు. మన పాదాలవద్దే ఉన్న బావిలోని నీళ్ళు దాహానికివ్వమని నేను అడగడం నీకు ఆశ్చర్యంగా ఉంది. అయితే నీవే నన్ను అడిగితే నీకు నేను నిత్యజీవజలాన్ని ఇచ్చి ఉందును.DATel 182.3

    క్రీస్తు మాటలు ఆమెకు అవగతం కాలేదు. కాని వాటి గంభీర ప్రాముఖ్యాన్ని మాత్రం గ్రహించింది. ఆమె చవకబారు పరిహాస ధోరణి మారడం మొదలు పెట్టింది. తమ ముందున్న బావిని గురించే యేసు షూట్లాడాడని భావించి ఆమె ఇలా అంది, “అయ్యా, యీ బావి లోతైనది, చేడుటకు నీకేమియు లేదే? ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును? తానును తన కుమాళ్ళును, పశువులును, ఈబావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబు కంటే నీవు గొప్పవాడివా?” ఆమె తన ముందు దప్పిగొన్న అలసిపోయిన ధూళితో నిండిన ఓ బాటసారిని మాత్రమే చూడగలిగింది. తన మనసులో పితరుడు యాకోబుతో ఆయన్ని సరిపోల్చుకుంటోంది. పితరులు సమకూర్చిన ఆ బావికి మరే బావీ సాటిరాదని ఆమె భావన. అది స్వాభావికమే. ఆమె వెనకటి పితరులకేసి భవిష్యత్తులో రానున్న మెస్సీయాకేసి చూస్తోంది. వాస్తవంలో తమ తండ్రులు పితరులు నిరీక్షించిన మెస్సీయా ఆమె పక్కనే ఉన్నా ఆమె గుర్తించలేదు. ఈ నాడు దాహార్తితో బాధపడ్తోన్న ఎన్ని ఆత్మలు జీవజలాల ఊటకు సమీపంలోనే ఉన్నా జీవధారల కోసం వెదక్కుంటూ దూరంగా వెళ్లిపోతున్నాయి! “ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును! అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు; లేక - ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అవి నీవు నీ హృదయములో అనుకొనవద్దు... వాక్యము నీ యొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది... యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడుదువు.” రోమా 10: 1-9.DATel 182.4

    తన్ను గూర్చిన ప్రశ్నకు యేసు వెంటనే సమాధానం చెప్పలేదు. అనంతరం ఇలా అన్నాడు, ” ఈ నీళ్లు త్రాగువాడును మరల దప్పిగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును.”DATel 183.1

    ఈ లోకంలోని నీరు తాగి దాహార్తిని తీర్చుకోడానికి ప్రయత్నించే వ్యక్తి ఆ నీరు తాగి మళ్లీ దప్పిగొంటాడు. సర్వత్రా మనుషులు అసంతృప్తితో ఉన్నారు. తమ ఆత్మకు అవసరమైంది ఏదో దాన్ని పొందడానికి ఎదురు చూస్తున్నారు. వారికి అవసరమైన దాన్ని సమకూర్చగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. లోకానికున్న అవసరం “జనులందరి యొక్క యిష్ట” దైవం క్రీస్తే. ఆయన మాత్రమే అనుగ్రహించగల కృప జీవజలం వంటిది. అది ఆత్మను శుద్ధిచేసి, సేదదీర్చి బలోపేతం చేస్తుంది.DATel 183.2

    జీవజలం గుక్కెడు తాగితే చాలన్న అభిప్రాయాన్ని యేసు వెలిబుచ్చలేదు. క్రీస్తు ప్రేమను చవిచూసిన వ్యక్తి మరింత అనుభవించాలని ఆశిస్తాడు. అది తప్ప వేరే దాన్ని ఆకాంక్షించడు. కలిమి, ప్రతిష్ఠ, లోక భోగాలు అతణ్ని ఆకట్టుకోలేవు. అతడి హృదయం యేసూ నువ్వేకావాలి అని కోరుకుంటుంది. దాని అవసరం ఏంటో ఆత్మకు బయలుపర్చే ఆ ప్రభువు దాని ఆకలిని దప్పికను తీర్చడానికి సన్నద్ధంగా ఉన్నాడు. మానవ సంబంధమైన వనరులు హంగులు ఎన్ని ఉన్నా అవి వ్యర్ధమౌతాయి. జలాశయాలు ఎండిపోతాయి. చెరువులు గుంటలు ఇంకిపోతాయి. అయితే మన రక్షకుడు జీవనది. మనం మళ్లీ మళ్లీ తాగవచ్చు. ఎంత తాగినా నీటి సరఫరా తాజాగా ఉంటుంది. ఎవరిలో క్రీస్తు నివసిస్తాడో అతడు ఆశీర్వాద జలధారగా, “నిత్యజీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా” ఉంటాడు. తన అవసరాలికి అగత్యమైన బలాన్ని కృపను ఈ నిధి నుంచి అతడు పొందవచ్చు.DATel 184.1

    యేసు జీవజలాల గురించి ప్రస్తావించినప్పుడు ఆమె ఆయన వంక రెప్ప వాల్చకుండా ఆశ్చర్యంగా చూసింది. ఆయన ఆమెలో ఆసక్తిని కలిగించాడు. ఆయన ప్రస్తావించిన జీవజలంపట్ల ప్రగాఢవాంఛ ఆమెకు కలిగింది. ఆయన మాట్లాడింది. యాకోబు బావినీళ్లను గురించి కాదని గ్రహించింది. ఆ నీళ్లు ఆమె ఎల్లప్పుడు తాగుతూ మళ్లీ దప్పిగొంటూ ఉన్నది. “అయ్యా నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్ళు నాకు దయచేయుము” అన్నది.DATel 184.2

    ఆ సంభాషణను యేసు అర్ధాంతరంగా మార్చాడు. తాను ఇవ్వాలని ఆశించిన వరాన్ని ఈ ఆత్మ అందుకోకముందు ఆమె తన పాపాన్ని గుర్తించి తన రక్షకుణ్ని కనుగోవాల్సి ఉంది. “నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్ము” అన్నాడు. “నాకు పెనిమిటి లేడు.” అన్నది ఆమె. ఈ దిశగా వచ్చే ప్రశ్నలకి ఇలా తెరదించాలనుకుంది. కాని ప్రభువు ఆగలేదు. ఆయన ఇలా అన్నాడు, “నీకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి.”DATel 184.3

    ఆమె భయంతో వణికింది. ఏదో అదృశ్య హస్తం ఆమె జీవిత చరిత్ర పుటలు తిరగేస్తోంది. ఏ గతాన్ని మరుగున ఉంచాలనుకున్నదో అది బట్టబయలవుతోంది. తన జీవిత రహస్యాల్ని గ్రహించగలిగిన ఈయన ఎవరు? నిత్య జీవితం గురించి, రానున్న తీర్పును గురించి, ఇప్పుడు గోప్యంగా ఉంచుకుంటున్న కార్యాలు అప్పుడు బయలుపడడం గురించిన తలంపులు ఆమెలో చెలరేగాయి. ఆమె అంతరాత్మ మేల్కొంది.DATel 184.4

    ప్రభువు చెప్పిన వాటిని ఆమె కాదనలేకపోయింది. కాని అప్రియమైన ఆ అంశాన్ని దాటవెయ్యడానికి ఆమె ప్రయత్నించింది. ప్రగాఢ భక్తిభావంతో ఇలా అంది, “అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.” ఆ ప్రస్తావనను మార్చాలని ఉద్దేశించి, మత వివాదాంశాల్ని చర్చించడం మొదలు పెట్టింది. ఈయన ప్రవక్త అయి ఉంటే దీర్ఘకాలంగా వివాదాంశాలుగా వస్తూ ఉన్న విషయాలపై ఆయన ఉపదేశం ఇస్తాడని భావించింది.DATel 185.1

    ఆ సంభాషణలో తన ఇష్టం వచ్చినట్లు ఆమెను మాట్లాడనిచ్చాడు. మళ్లీ ఆమెకు సత్యాన్ని అందించడానికి ఆవకాశం కోసం కనిపెట్టాడు. “మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరిగాని ఆరాధింపవలసిన స్థలము యెరుషలేములో ఉన్నదని వారు చెప్పుదురు” అంది. గేరిజీముకొండ వారి ముందే ఉంది. దాని దేవాలయం కూలిపోయింది. బలిపీఠం మాత్రమే మిగిలి ఉంది. యూదులకు సమరయులకు మధ్య ఆరాధన స్థలం వివాదాంశమయ్యింది. సమరయుల పూర్వీకులు కొందరు ఒకప్పుడు ఇశ్రాయేలుకు చెందినవారు. అయితే తమ పాపాల ఫలితంగా వారు విగ్రహారాధక జాతి వశం కావడానికి ప్రభువు అనుమతించాడు. అనేక తరాలుగా వారు విగ్రహారాధకుల్తో మమేకమై నివసించారు. క్రమేణ వీరు విగ్రహారాధకుల మతాన్ని ఆచరించారు. అదే వీరి మతమయ్యింది. విశ్వపరిపాలకుడైన సజీవ దేవుణ్ని తమ విగ్రహాలు జ్ఞాపకం చేస్తున్నాయని వారు చెప్పుతారు. అయినా ప్రజలు విగ్రహాలు చేసుకుని వాటికి మొక్కడం మొదలు పెట్టారు.DATel 185.2

    ఎజ్రాకాలంలో యెరుషలేములో దేవాలయం నిర్మితమైనప్పుడు దాని నిర్మాణంలో యూదులతో కలిసి పనిచెయ్యాలని సమరయులు అభిలషించారు. అందుకు యూదులు అంగీకరించలేదు. ఈ రెండువర్గాల ప్రజల మధ్య ఇలా శతృత్వం పెరిగింది. సమరయులు గిరిజీముకొండపై పోటీ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. విగ్రహారాధనకు పూర్తిగా విసర్జించకపోయినా, ఇక్కడవారు మో షే ఆచార ధర్మశాస్త్రానుసారంగా ఆరాధన నిర్వహించేవారు. యెరూషలేము దేవాలయాన్ని వారు దేవాలయంగా గుర్తించలేదు. యూదుమతం తమ మతంకన్నా ఉన్నతమైందని అంగీకరించనూలేదు.DATel 185.3

    ఆ సమరయ స్త్రీ ప్రశ్నలకు సమాధానంగా యేసు ఇలా అన్నాడు, “అమ్మా ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు నాకు తెలియని దానిని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.” సమరయులపట్ల యూదీయ దురభిమానం తనకు లేదని యేసు ప్రదర్శించాడు. ఇప్పుడు యూదుల పట్ల సమరయ దురభిమానాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు. సమరయుల విశ్వాసం విగ్రహారాధన వల్ల భ్రష్టమయ్యిందని చెబుతూ, రక్షణ సంబంధిత మహత్తర సత్యాల్ని దేవుడు యూదులకు అప్పగించాడని ఆ ప్రజల్లోనుంచే మెస్సీయా రావల్సి ఉన్నాడని ఆయన వెల్లడించాడు. పరిశుద్ధ లేఖనాలు దేవుని ప్రవర్తనను ఆయన ప్రభుత్వ నిబంధనల్ని స్పష్టంగా వివరిస్తోన్నాయి. యేసు తన్నుతాను యూదుడుగా వర్గీకరించుకున్నాడు. దేవుడు తన్ను గూర్చిన జ్ఞానాన్ని యూదుల కిచ్చాడన్నాడు.DATel 186.1

    తన శ్రోత తలంపుల్ని, ఆచారాలకు, కర్మకాండకు, వివాదానికి సంబంధించిన ప్రశ్నలకు అతీతంగా ఉంచాలని ఆయన ఆశించాడు. ఆయన “యధార్ధముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుకాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను” అన్నాడు.DATel 186.2

    “ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ” అని నీకొదేముతో అన్నప్పుడు ప్రకటించిన సత్యాన్నే యేసు ఇక్కడ వెల్లడిస్తోన్నాడు. (యోహాను 3:3). పరిశుద్ధ పర్వతం ద్వారానో పవిత్ర దేవాలయం ద్వారానో మనుషులు దేవునితో సహవాసాన్ని సాధించలేరు. మతం బాహ్యాచారాలకు కర్మకాండకు పరిమితం కాకూడదు. దేవుని వద్ద నుంచి వచ్చే మతమే దేవుని వద్దకు నడిపించే మతం. ఆయనకు సవ్యంగా సేవ చేసేందుకుగాను మనం ఆత్మ మూలంగా జన్మించాలి. ఇది హృదయాన్ని పవిత్రం చేస్తుంది. మనసును నూతనం చేస్తుంది. దేవున్ని తెలుసుకుని ప్రేమించడానికి మనకు నూతన సామర్థ్యాన్నిస్తుంది.DATel 186.3

    ఆయన విధులన్నిటిని సంతోషంగా ఆచరించడానికి మనకు సిద్ధమనసు నిస్తుంది. ఇది నిజమైన ఆరాధన. అది పరిశుద్దాత్మ పని ద్వారా కలిగే ఫలం. ప్రతీ యధార్ధ ప్రార్ధనకు పరిశుద్దాత్మ మాటలు సమకూర్చుతాడు. అప్పుడు దేవుడు ఆత్మకు ప్రత్యక్షమవుతాడు. అట్టి ఆరాధకులకోసం ఆయన వెదకుతున్నాడు. వారిని స్వీకరించడానికి వారిని తన కుమారులు కుమార్తెలుగా సొంతం చేసుకోడానికి ఆయన వేచి ఉన్నాడు.DATel 187.1

    యేసు మాటలు ఆ స్త్రీని ఆకట్టుకున్నాయి. అలాంటి అభిప్రాయాలు తన జాతి యాజకులనుంచి గాని యూదుల నుంచి గాని ఆమె ఎన్నడూ వినలేదు. తన గతజీవితం తనకు స్పష్టంగా కనిపించడంతో తన గొప్ప అవసరం ఏంటో ఆమెకు అవగతమయ్యింది. తన ఆత్మ దాహార్తితో పరితపించింది. ఆ దాహాన్ని సుఖారు బావినీళ్ళు తీర్చలేవు. గతంలో తన అనుభవంలోకి వచ్చిందేదీ తన గొప్ప అవసరాన్ని గూర్చి తనను ఇంతగా చైతన్యపర్చలేదు. ఆమె జీవిత రహస్యాలు తనకు తెలుసునన్న నమ్మకం యేసు ఆమెకు కలిగించాడు. అయినా ఆయన తన మిత్రుడన్న భావన ఆమెలో చోటుచేసుకుంది. ఆయన సన్నిధే ఆమె పాపాన్ని ఖండిస్తున్నప్పటికీ ఆయన ఒక్క నిందావాక్యం పలకలేదు సరిగదా ఆమె ఆత్మను నూతనం చేసే తన కృపను గురించి ఆమెకు చెప్పాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అన్నదాన్ని గూర్చి ఆమెకు ఓ దృఢనమ్మకం ఏర్పడనారంభించింది. ప్రజలు దీర్ఘకాలం ఎదురుచూస్తున్న మెస్సీయా ఈయన కాడా? అన్న మీమాంస ఆమె మనసులో చోటుచేసుకుంది. ఆయనతో ఇలా అంది, ” క్రీస్తు అనబడిన మెస్సీయా వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును,” “నీతో మాటలాడుచున్న నేనే ఆయనను” అని యేసు బదులుపలికాడు.DATel 187.2

    ఈ మాటలు వింటోన్న ఆమె హృదయంలో విశ్వాసం ఏర్పడింది. ఆ పరమ బోధకుడి నోటి నుంచి వచ్చిన అద్భుత ప్రకటనను ఆమె ఆమోదించింది.DATel 187.3

    ఆమె మనసు అభినందించి హర్షించే స్థితిలో ఉంది. ఉదాత్తమైన ఆ ప్రకటనను స్వీకరించడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఎందుచేతనంటే ఆమె లేఖనాలపట్ల ఆసక్తి కలిగి ఉంది. కనుక మరింత వెలుగు అందుకోడానికి పరిశుద్ధాత్మ ఆమె హృదయాన్ని ఆయత్తం చేస్తోన్నాడు. ఈ పాత నిబంధన వాగ్దానాన్ని ఆమె ఆధ్యయనం చేసింది, “నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను.” ద్వితి 18:16. ఈ ప్రవచనాన్ని అవగాహన చేసుకోవాలని ఆకాంక్షించింది. అప్పటికే ఆమె మనసులో వెలుగు ప్రవేశించింది. దప్పిగొన్న ప్రతీ ఆత్మకు క్రీస్తు ప్రసాదించే ఆధ్యాత్మిక జీవితమనే జీవజలం ఆమె హృదయంలో ప్రవహించడం మొదలయ్యింది. ప్రభువు ఆత్మ ఆమెలో పని చేస్తోన్నాడు.DATel 188.1

    క్రీస్తు ఈ స్త్రీతో చెప్పిన సరళమైన వాక్యం స్వనీతిపరులైన యూదులతో చెప్పడానికి వల్లపడేదికాదు. యూదులో మాట్లాడినప్పుడు క్రీస్తు మరింత ముభావంగా ఉండేవాడు. యూదులకు తెలియకుండా నిగూఢంగా ఉంచింది, అనంతరం రహస్యంగా ఉంచాల్సిందిగా శిష్యుల్ని ప్రభువు ఆదేశించింది ప్రభువు ఆమెకు బయలుపర్చాడు. తన కృపను పంచడానికి ఇతరుల్ని తీసుకురావడంలో ఆమె తన జ్ఞానాన్ని వినియోగిస్తుందని యేసు గ్రహించాడు.DATel 188.2

    శిష్యులు తమ పని ముగించుకుని తిరిగివచ్చినప్పుడు తమ ప్రభువు ఆ స్త్రీతో మాట్లాడడం చూసి నివ్వెరపోయారు. తాను తాగాలని ఆశించిన చల్లని నీళ్ళు ఆయన తాగనేలేదు. శిష్యులు తెచ్చిన భోజనం తినడానికి ఆగలేదు. ఆ స్త్రీ వెళ్లిపోయిన తర్వాత భోజనం చెయ్యవలసిందిగా శిష్యులు అర్ధించారు. ఆయన మౌనంగా ఉండడం, దీర్ఘ ధ్యానంలో మునిగి ఉండడం గమనించారు. ఆయన ముఖం వెలుగుతో ప్రకాశిస్తోంది. దేవునితో ఆయన సాగిస్తోన్న గోష్ఠికి అంతరాయం కలిగించడానికి వారు భయపడ్డారు. కాని ఆయన అలసిపోయి నిస్సత్తువగా ఉన్నట్లు గమనించారు. తన భౌతికవసరాల్ని గురించి ఆయనకు గుర్తు చెయ్యడం తమ బాధ్యతని వారికి తెలుసు. ప్రేమతో కూడిన వారి ఆందోళనను యేసు గుర్తించి ఇలా అన్నాడు, “భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది.” ఆయనకు ఆహారం ఎవరు తెచ్చి ఉంటారా అని శిష్యులు తికమకపడోన్నారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ ఇది, “నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.” యోహాను 4:34. తన మాటలు ఆ సమరయ స్త్రీ అంతరాత్మను మేల్కొలిపినందుకు యేసు ఆనందించాడు. ఆమె జీవజలం తాగడం ఆయన చూశాడు. అది ఆయన ఆకలిని దాహార్తిని తీర్చింది. ఏ కార్యం సాధించడానికి ఆయన పరలోకాన్ని విడిచి పెట్టి వచ్చాడో దాని సాధన ఆయన్ని తన పనికి బలోపేతం చేసి ఆయన్ని మానవావసరాలకు అతీతంగా ఉంచింది. సత్యం కోసం ఆకలి దప్పులు గల ఆత్మకు చేదోడు కావడం అన్నపానాలకన్నా ఆయనకు ఎక్కువ తృప్తినిచ్చింది. అదే ఆయనకు సుఖశాంతుల్నిచ్చింది. ఉపకార గుణమే ఆయన ఆత్మకు ఊపిరి.DATel 188.3

    మన విమోచకుడు గుర్తింపును ఆకాంక్షిస్తున్నాడు. ఆయన తన రక్తంతో విమోచించిన ప్రజల సానుభూతి కోసం ప్రేమ కోసం ఆకలిగొంటున్నాడు. తన వద్దకు వచ్చి వారు జీవం పొందాలని ఆయన అమితంగా ఆశిస్తోన్నాడు. తల్లి తన చంటి బిడ్డ బోసి నవ్వు కోసం అంటే గ్రహణశక్తి వికాసం కోసం కనిపెట్టేరీతిగా క్రీస్తు కృతజ్ఞతతో కూడిన ప్రేమ ప్రకటన కోసం, అంటే ఆత్మలో ఆధ్యాత్మిక జీవితం ఆరంభ మయ్యిందని సూచించే ప్రేమ కోసం కనిపెడ్తాడు.DATel 189.1

    క్రీస్తు మాటలు వింటున్న ఆ స్త్రీ హృదయం ఆనందంతో నిండింది. ఆ వెల్లడి పట్టజాలనంత ఆనందానుభూతి నిచ్చింది. తన కుండను అక్కడే విడిచి పెట్టి ఆ వర్తమానాన్ని ఇతరులకు చేరవేయడానికి ఆమె పట్టణానికి తిరిగివచ్చింది. ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో యేసుకు తెలుసు. కుండ విడిచి పెట్టడం ఆయన మాటల ఫలితాన్ని సూచిస్తోంది. జీవజలాన్ని పొందాలన్నది ఆమె ప్రగాఢవాంఛ. తాను నూతి వద్దకు ఎందుకు వచ్చిందో ఆ పనిని మర్చిపోయింది. రక్షకుడి దాహం తీర్చడానికి నీటినివ్వాలని ఉద్దేశించినా ఆ సంగతి మర్చిపోయింది. తాను పొందిన ఆ ప్రశస్త వర్తమానాన్ని ఇతరులకు అందించాలన్న కోరికతో ఆనందం వెల్లువెత్తుతున్న హృదయంతో వడివడిగా వెళ్లింది.DATel 189.2

    “మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తు కాడా?” అని ఆ పట్టణ ప్రజలతో అన్నది. ఆమె మాటలు వారి హృదయాల్ని కదిలించాయి. ఆమె ముఖం పై నూతనకాంతి ప్రకాశించింది. ఆమె ఆకారమే మారిపోయింది. ఆ ప్రజలు యేసును చూడాలని ఆశించారు. “వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి.”DATel 189.3

    యేసు ఇంకా బావి వద్దే కూర్చుని ఉన్నాడు. ఆయన తన ముందున్న పంటపొలాల వంక చూశాడు. పొలాలు లేత ఆకు పచ్చరంగు వెన్నులతో ఉండగా వాటి మీద బంగారు సంధ్యకాంతి పడ్తోంది. శిష్యుల దృష్టిని ఆ దృశ్యం పైకి ఆహ్వానిస్తూ ప్రభువు దాన్ని ఓ చిహ్నంగా వినియోగించి ఇలా అన్నాడు, “ఇంక నాలుగు నెలలైన తరువాత కోత కాలము వచ్చునని వారు చెప్పుదురు గదా. ఇదిగో నా కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను.” ఆయన మాట్లాడుండగా బావి వద్దకు వస్తున్న ప్రజల గుంపుల వంక ఆయన చూశాడు. పంట కొయ్యడానికి ఇంకా నాలుగు మాసాల వ్యవధి ఉంది. ఇక్కడ మాత్రం కోత గాండ్ర కోసం వేచి ఉన్న కోత ఉంది.DATel 190.1

    ఆయన ఇలా అన్నాడు, “విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్ధమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే. ” సువార్తను అందుకున్న వారు చేయాల్సిన పరిశుద్ధ సేవను గూర్చి క్రీస్తు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. వారు ప్రభువుకు సజీవ సాధనాలు కావాల్సి ఉన్నారు. ఆయన వారి వ్యక్తిగత సేవను కోరుతున్నాడు. మనం విత్తినా, కోసినా మనం దేవుని సేవ చేస్తున్నాం. ఒకడు విత్తనాలు వెదజల్లుతాడు ఒకడు కోతకోసి గింజలు పోగుచేస్తాడు. విత్తేవాడు కోసేవాడు ఇద్దరూ తమ తమ జీతం పొందుతారు. తమ శ్రమప్రతిఫలం విషయంలో ఇరువురూ కలిసి ఆనందిస్తారు.DATel 190.2

    “మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి వారు వారి కష్టములో ప్రవేశించుచున్నారు” అని యేసు తన శిష్యులతో అన్నాడు. పెంతెకొస్తునాడు గొప్ప జన సమీకరణను రక్షకుడు ఇక్కడ సూచిస్తున్నాడు. శిష్యులు దీన్ని తమ కృషి ఫలంగా పరిగణించకూడదు. వారు ఇతరుల కష్టంలో ప్రవేశిస్తున్నారు. ఆదాము పతనం నాటి నుంచి వాక్య విత్తనాన్ని మానవ హృదయాల్లో నాటడానికి క్రీస్తు తాను ఎంపిక చేసుకున్న సేవకులకు అప్పగిస్తూ వచ్చాడు. సర్వశక్తి గల ఓ అగోచర సాధనం పంటను ఉత్పత్తి చెయ్యడానికి నిశ్శబ్దంగా శక్తిమంతంగా పని చేసింది. సత్య బీజానికి ఉత్తేజాన్ని పోషణను సమకూర్చడానికి దేవుని కృప అనే మంచు వర్షం సూర్యరశ్మి సరఫరా అయ్యాయి. ఆ వాక్య విత్తనానికి తన రక్తంతో నీరుపొయ్యడానికి క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. శిష్యులు దేవునితో జత పనివారుగా సేవచేసే అధిక్యతను పొందారు. క్రీస్తుతోను పూర్వపు పరిశుద్దులతోను కలిసి పనిచేసే ఆధిక్యత వారికి కలిగింది. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన ఒక్కరోజునే వేల ప్రజలు మారు మనసు పొంది సువార్తను స్వీకరించనున్నారు. ఇది క్రీస్తు విత్తిన వాక్యఫలం. ఆయన శ్రమ వలన పండిన పంట.DATel 190.3

    బావివద్ద సమరయ స్త్రీతో యేసు పలికిన మాటల్లో మంచి విత్తనాన్ని చల్లడం జరిగింది. పంట ఎంత త్వరగా వచ్చింది! సమరయులు వచ్చి యేసు బోధను విని ఆయన్ని విశ్వసించారు. బావి చుట్టూ మూగి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. తమకు గ్రాహ్యంకాని అనేక విషయాలపై ఆయన వివరణను అతృతగా అంగీకరించారు. ఆయన విశదీకరణను విన్నప్పుడు వారిలోని గందరగోళం పోయి స్పష్టత ఏర్పడింది. వారు కన్నుమిన్ను కానని చీకటిలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఓ కాంతి రేఖను కనుగొని చివరికి ప్రకాశవంతమైన దినంలో ప్రవేశించిన ప్రజల్లా ఉన్నారు. ఈ కొద్ది సేపటి సమావేశంతో వారు తృప్తి చెందలేదు. ఇంకా వినాలని తహతహలాడారు. తమ మిత్రులు కూడ ఈ మహాబోధకుడి ప్రబోధం వినాలని ఆకాంక్షించారు. తమ పట్టణానికి రావాల్సిందిగా ఆహ్వానించి తమతో కొన్ని దినాలు ఉండాల్సందిగా పట్టుపట్టారు. ఆయన సమరయలో రెండు రోజులున్నాడు. అనేకమంది ఆయన్ని విశ్వసించారు.DATel 191.1

    పరిసయ్యులు యేసు నిరాడంబరతను ద్వేషించారు. ఆయన చేసిన అద్భుతాల్ని కొట్టి పారేసి తాను దైవకుమారుణ్ణనడానికి ఓగుర్తు చూపించమని డిమాండు చేశారు. అయితే సమరయులు ఏ గుర్తును కొరలేదు. యేసు వారి మధ్య అద్భుతాలేమీ చెయ్యలేదు. బావి వద్ద ఆ స్త్రీ జీవిత రహస్యాల్ని బయలుపర్చడం మాత్రమే చేశాడు. అయినా అనేకులు ఆయన్ని స్వీకరించారు. తమ నూతనానందంలో వారు ఆ స్త్రీతో ఇలా అన్నారు, “ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మామట్టుకు మేము విని యీయన నిజముగా లోక రక్షకుడని తెలిసికొని నమ్ముచున్నాము.” -DATel 191.2

    యూదులకు మాత్రమే గాక యావత్ప్రపంచానికి విమోచకుడుగా మోస్సీయా రావాల్సి ఉన్నాడని సమరయులు నమ్మారు. దేవుడు పంపిన ప్రవక్తగా ఆయన రావాల్సి ఉన్నాడని మోషే ద్వారా పరిశుద్దాత్మ ప్రకటించడం జరిగింది. భూమి మీద సమస్త జాతులు ఆయన ద్వారా దీవించబడ్డాయని అబ్రహాము ద్వారా వెల్లడించడం జరిగింది. సమరయ ప్రజలు ఆయనకు విధేయులై ఉంటారని మోషే ద్వారా ప్రకటించడం జరిగింది. భూమి మీద సమస్త జాతులు ఆయన ద్వారా దీవించబడ్డాయని అబ్రహాము ద్వారా వెల్లడించడం జరిగింది. సమరయ ప్రజలు ఈ లేఖనాలు ఆధారంగా మెస్సీయా పై విశ్వాసముంచారు. యూదులు అనంతర ప్రవక్తల రచనలికి తప్పుడు భాష్యం చెప్పి, క్రీస్తు రెండో రాకకు సంబంధించిన మహిమను ఆయన మొదటి రాకకు అపాదించడం, సమరయులు మోషే రచనల్ని మినహా పరిశుద్ధ లేఖనాలన్నిటిని తోసి పుచ్చడానికి కారణమయ్యింది. అయితే రక్షకుడు ఈ తప్పుడు భాష్యాన్ని తుడిచివేశాడు. అనంతర ప్రక్తల ప్రవచనాల్ని దేవుని రాజ్యాన్ని గూర్చిన క్రీస్తు బోధనల్ని అనేకులు అంగీకరించారు.DATel 192.1

    యూదులికి అన్యులుకి మధ్య ఉన్న గోడను పడగొట్టి లోకానికి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు యేసు. తాను యూదుడైనప్పటికీ ఆయన సమరయులతో కలిసి మెలిసి నివసిస్తూ తన జాతి ప్రజలు నిష్ఠగా ఆచరిస్తూ వచ్చిన పరిసయ్య ఆచారాన్ని కాల రాచాడు. ఈ ప్రజలు యూదుల తీవ్ర ద్వేషానికి గురి అయినా యేసు వీరి ఆతిథ్యాన్ని అంగీకరించేవాడు. వారి ఇళ్ళలో నిద్రించేవాడు. వారి పట్ల దయగా మర్యాదగా మెలగేవాడు.DATel 192.2

    యెరూషలేము దేవాలయంలో, ఆవరణానికీ తక్కిన భాగాలకీ మధ్య ఓ చిన్న గోడ ఉండేది. యూదులు మినహా ఇతరులెవ్వరూ ఈ హద్దుదాటి వెళ్ళడం నిషిద్ధమని వివిధ భాషల్లో ఈ గోడపై రాసి పెట్టారు. దురభిమాని అయిన ఓ అన్యుడు ఆ హద్దు దాటి లోపలికి వెళ్లడం జరిగితే. అతడు దేవాలయాన్ని అపవిత్రపర్చినట్లు భావించడం జరిగేది. ఆ నేరానికి శిక్ష మరణమే. అయితే ఆలయానికి ఆలయ సేవలకు ఆద్యుడు రూపకర్త అయిన యేసు దయ కనికరాల మూలంగా అన్యజనుల్ని అక్కువ చేర్చుకునేవాడు. యూదులు నిరాకరించిన రక్షణను వారికి దైవకృపను బట్టి అందించేవాడు.DATel 192.3

    ఇంకా యూదీయ దురభిమానంతో నిండి ఉన్న ప్రభువు శిష్యులకు మేలు కలిగేందుకు సమరయలో యేసు ఉనికి ఏర్పాటయ్యింది. స్వజాతి అభిమానం దృష్టితో తాము సమరయుల పట్ల శతృత్వం ప్రదర్శించాలని శిష్యులు భావించారు. యేసు ప్రవర్తన వారికి మింగుడు పడలేదు. అలాగని ఆయన ఆదర్యాన్ని అవలంబించకుండా ఉండలేకపోయారు. సమరయలో ఉన్న ఆ రెండు రోజులు ప్రభువు పట్ల తమ ప్రేమాభిమానాల వల్ల వారు తమ దురభిమానాల్ని అదుపుచేసుకున్నారు. లోలోపల మాత్రం ఆ అంశంపై వారు రాజీ పడలేదు. తమ ధిక్కారం, విద్వేషం దయగా సానుభూతిగా మారాలన్న విషయాన్ని నేర్చుకోడానికి సమయం పట్టింది. అయితే ప్రభువు ఆరోహణమైన తర్వాత, ఆయన పాఠాలు నూతన భావంతో వారి దృష్టికి మళ్లీ వచ్చాయి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనంతరం, ప్రభువు తమ వంక చూపిన చూపును, ఆయన మాటల్ని నిమ్న జాతి ప్రజల పట్ల ఆయన ప్రేమాభిమానాల్ని ఉదాత్త వర్తనను వారు గుర్తుచేసుకున్నారు. పేతురు సమరయలో బోధించడానికి వెళ్లినప్పుడు తన సేవలో అదే స్ఫూర్తిని ప్రదర్శించాడు. యోహాను ఎఫెసుకు స్ముర్నకు వెళ్లినప్పుడు షెకెములోని అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని పరమగురువుపట్ల కృతజ్ఞతతో నిండిపోయాడు. వారికి ఎదురయ్యే కష్టాల్ని ముందే గ్రహించి ప్రభువు తన సొంత ఆదర్శం ద్వారా వారికి చేయూతనిచ్చాడు.DATel 193.1

    సమరయ స్త్రీకి జీవ జలాన్ని అందించినప్పుడు తాను చేసిన పరిచర్యనే ఆయన ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాడు. ఆయన అనుచరులమని చెప్పుకునే అనేకులు నిమ్నజాతి ప్రజల్ని తృణీకరించి విసర్జించవచ్చు. జన్మకు గాని జాతికి గాని సంబంధించిన ఏ పరిస్థితిగాని, జీవితానికి సంబంధించిన ఏ స్థితిగాని మనుషుల పట్ల ఆయన ప్రేమను రద్దుచేయలేదు. ఎంత ఘోరపాపి అయినా ప్రతీ ఆత్మతో యేసు ఇలా అంటున్నాడు, నీవు నన్ను అడిగి ఉంటే నేను నీకు జీవజలం ఇచ్చేవాడను.DATel 193.2

    సువార్త ఆహ్వానాన్ని పరిమితం చేసి, మనకు గౌరవం తెస్తారని మనం భావించి ఎంపిక చేసే కొద్ది మందికి దాన్ని మాత్రమే ఇవ్వడానికి లేదు. ఆ వర్తమానాన్ని అందరికీ అందించాలి. సత్యాన్ని అంగీకరించడానికి హృదయాలు ఎక్కడైతే సిద్ధంగా ఉంటాయో వారికి ఉపదేశమివ్వడానికి క్రీస్తు సిద్ధంగా ఉంటాడు. వారికి తండ్రిని బయలుపర్చుతాడు. హృదయాలు పరిశోధించగల దేవునికి సమ్మతమైన ఆరాధనను వారికి తెలియజేస్తాడు. అట్టి వారికి ఉపమానాల్ని వినియోగించడు. బావి వద్ద స్త్రీకి చెప్పినట్లు “నీతో మాటలాడుచున్న నేనే ఆయనను” అని వారితో చెబుతాడు.DATel 193.3

    విశ్రమించడానికి యాకోబు బావివద్ద యేసు కూర్చున్నప్పుడు ఆయన యూదయనుంచి వచ్చాడు. అక్కడ ఆయన పరిచర్యకు అంతగా ఫలితం లభించలేదు. రబ్బీలు యాజకులు ఆయన్ని నిరాకరించారు. ఆ మాటకొస్తే తన శిష్యులమని చెప్పుకొన్నవారు సయితం ఆయన దేవత్వాన్ని గుర్తించలేదు. ఆయన బలహీనంగా ఉన్నాడు, అలసిపోయాడు. అయినను ఓ స్త్రీతో మాట్లాడడానికి చేజిక్కిన అవకాశాన్ని జారవిడవలేదు. ఆమె అపరచిత వ్యక్తి. ఇశ్రాయేలుకి పరాయి వ్యక్తి. బహిరంగ పాపంలో కొనసాగుతోన్న వ్యక్తి.DATel 194.1

    ప్రజలు సమావేశమవ్వడానికి ప్రభువు ఆగలేదు. తరచు తన చుట్టూ చేరిన కొద్ది మందికే బోధించడం మొదలు పెట్టేవాడు. అటూ ఇటూ వెళ్లేవారు వినడానికి ఆగడం తుదకు పెద్ద జనసమూహం పోగుపడి ఆ పరమ బోధకుడి ద్వారా దేవుడు పంపిన వర్తమానాన్ని ఆశ్చర్యంతో విస్మయంతో వినడం జరిగేది. పెద్ద సమావేశాల్లో ప్రసంగించినట్లు చిన్న సమావేశాల్లో ప్రసంగించలేమని క్రీస్తు సేవకులు భావించకూడదు. వర్తమానం వినడానికి ఒక్కవ్యక్తే ఉండవచ్చు. దాని ప్రభావం ఎంత శక్తిమంతమైందో ఎవరికి తెలుసు? రక్షకుడు ఓ సమరయ స్త్రీతో మాట్లాడడానికి సమయం గడపడం స్వల్ప విషయమని ఆయన శిష్యులు సయితం అభిప్రాయపడ్డారు. రాజులు, విధాన సభ్యులు లేదా ప్రధాన యాజకులతో కన్నా ఎక్కువ ఉద్రేకంతో ఎక్కువ వాగ్దాటితో ఆమెతో ఆయన హేతువాదం చేశాడు. ఆ స్త్రీకి ప్రభువు బోధించిన పాఠాలు లోకంలోని మారుమూలల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తూ ఉన్నాయి.DATel 194.2

    రక్షకుణ్ని కనుగొన్న వెంటనే ఆ సమరయ స్త్రీ ఆయన వద్దకు ఇతరుల్ని తీసుకువచ్చింది. ఆయన శిష్యులకన్నా ఆమె ఎక్కువ క్రియాశీలక మిషనరీగా నిరూపించుకున్నది. సమరయలో తమ సేవకు ప్రోత్సాహం లభిస్తుందన్న నమ్మకం శిష్యులకి లేదు. భవిష్యత్తులో గొప్ప సేవ చేయడంపై వారి తలంపులు కేంద్రీకృతమై ఉన్నాయి. పంట తమ చుట్టూనే ఉందని దాన్ని తాము పోగుచేయాల్సి ఉందని వారు గ్రహించలేదు. కాగా తాము ద్వేషించిన ఆ స్త్రీ ద్వారా పట్టణ ప్రజలందరూ రక్షకుని బోధ వినడానికి కదలి వచ్చారు. వెలుగును వెంటనే తన ప్రజలకు అందించింది.DATel 194.3

    ఈ స్త్రీ క్రీస్తు పై ప్రయోగాత్మక విశ్వాసం క్రియాశీలం అవ్వడాన్ని సూచిస్తోంది. చిత్తశుద్ధి గల ప్రతీ శిష్యుడు దేవుని రాజ్యంలోకి మిషనరీగా జన్మిస్తాడు. జీవ జలాన్ని తాగేవాడు జీవపు ఊటగా మారతాడు. గ్రహీత దాత అవుతాడు. ఆత్మలో క్రీస్తు కృప ఎడారిలో నీటి బుగ్గలా ఉంటుంది. అది అందరినీ సేదతీర్చడానికి ప్రవహిస్తుంది. దాహంతో మరణించడానికి సిద్ధంగా ఉన్న వారిని జీవజలం తాగేందుకు తహతహలాడేటట్లు చేస్తుంది.DATel 195.1