Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  59—యాజకుల కుట్రలు

  బేతనియ యెరుషలేముకి దగ్గరలో ఉండడంతో లాజరు పునరుత్థాన వార్త ఆ పట్టణానికి కొద్ది సమయంలోనే అందింది. ఆ అద్భుతాన్ని కళ్లారా చూసిన గూఢచారుల ద్వారా యూదు అధికారులికి వాస్తవాలు అందాయి. కింకర్తవ్యమన్న దానితో వారు సతమతమౌతున్నారు. ఆ విషయమై సన్ హెడ్రిన్ సభను సమావేశపర్చారు. మరణం మిద సమాధి మీద క్రీస్తు ఇప్పుడు పూర్తి అదుపు ప్రదర్శించాడు. తమను రక్షించేందుకు దేవుడు తన కుమారుణ్ని లోకంలోకి పంపాడనడానికి ప్రాజ్ఞులికి మనస్సాక్షి గల వారికి నమ్మకం పుట్టించడానికి చాలినంత దైవశక్తి ప్రదర్శన అది. లాజరు పునరుత్థానాన్ని వీక్షించిన వారిలో అనేకులు యేసుని విశ్వసించారు. కాని ఆయన పట్ల యాజకులకున్న విద్వేషం తీవ్రమయ్యింది. ఆయన దేవత్వానికి సంబంధించిన చిన్న చితక నిదర్శనల్ని వారు నిరాకరించారు. ఇలాగుండగా ఈ నూతన సూచక క్రియ వారికి గొంతులో వెలక్కాయలాగుంది. మృతుడు పట్ట పగలు, లేపబడ్డారు. అదికూడా పెద్ద జనసమూహం సాక్షిగా. ఆ నిదర్శనాన్ని మసిపూసి మారేడుకాయ చెయ్యడం సాధ్యం కాలేదు. యాజకుల వైషమ్యానికి ఇదే హేతువు. క్రీస్తు పరిచర్యకు చరమగీతం పాడడానికి నిశ్చయించుకున్నారు.DATel 599.1

  క్రీస్తంటే ఏమంత సుముఖంగా లేకపోయినా సదూకయ్యులు ఆయనపట్ల పరిసయ్యులంత అక్కసు వైషమ్యం పెంచుకోలేదు. వారి ద్వేషం తీవ్రమయ్యింది కాదు. అయితే ఇప్పుడు వారు తీవ్ర ఆరాశకు గురి అయ్యారు. మృతుల పునరుత్థానాన్ని వారు నమ్మలేదు. ఏదో శాస్త్రం చూపిస్తూ మరణించిన వ్యక్తిని బ్రతికించడం అసాధ్యమని వారు వాదించేవారు. కాని కొన్ని మాటలతోనే క్రీస్తు వారి సిద్ధాంతాన్ని కొట్టిపారేశాడు. లేఖనాల విషయంలోను దేవుని శక్తి విషయంలోను వారు అజ్ఞానులని చూపించాడు. ఆ సూచక క్రియ ద్వారా ప్రజల్లో ఏర్పడ్డ సదభిప్రాయాన్ని తుడిచివేయడం అసాధ్యమని వారు గ్రహించారు. మృతుణ్ని సమాధిలో నుంచి లేపి బయటికి తేవడంలో విజయం సాధించిన వాని నుంచి మనుషుల్ని తరిమి వెయ్యడం ఎలా సాధ్యపడుంది? అబద్ద సమాచారం ప్రచారమయ్యింది. కాని జరిగిన ఆ సూచక క్రియ కాదనలేనిది. దాని పర్యవసానాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది వారికి బోధపడలేదు. లాజరు పునరుత్థానం అనంతరం అతడు తమకు వ్యతిరేకంగా నిర్భయంగా మోపుతున్న నిందల్ని అతడి మరణం ద్వారా మాత్రమే ఆపగలమని వారు తీర్మానించుకున్నారు. .DATel 599.2

  పరిసయ్యులు పునరుత్థానముందని నమ్మారు. మెస్సీయా తమ మధ్య ఉన్నాడనడానికి ఈ సూచక క్రియ నిదర్శనమని వారు నమ్మారు. కాని వారు క్రీస్తు పరిచర్యను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయన తమ కపటవర్తనను బట్టబయలు చేస్తూ వచ్చాడు కాబట్టి మొదటినుంచి వారు ఆయన్ని ద్వేషించారు. తమ నైతిక వైకల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి వారు ధరించిన నీతి ఆచార కర్మ అంగీని ఆయన చింపి పక్కన పెట్టాడు. ఆయన ప్రబోధించిన పవిత్ర మతం వారు ప్రచారం చేసుకుంటున్న భక్తి బోలాతనాన్ని ఎండగట్టింది. ఆయన అందించిన వాడిగల మందలింపులకు ప్రతీకారం తీర్చుకోడానికి తపించిపోయారు. ఆయన్ని ఖండించడానికి తమకు అవకాశం కల్పించేదేదైనా అనడానికి, లేక చెయ్యడానికి ఆయన్ని రెచ్చగొట్టడానికి వారు ప్రయత్నించేవారు. కాని ఆయన చడీచప్పుడూ లేకుండా అక్కడనుంచి వెళ్ళిపోయేవాడు. వారికి కనిపించేవాడు కాడు.DATel 600.1

  సబ్బాతు దినాన ఆయన చేసిన సూచక క్రియలన్నీ బాధితుల సహాయార్ధం చేసినవి. అందు నిమిత్తం ఆయన్ని సబ్బాతును ఉల్లంఘించిన అపరాధిగా విమర్శించడానికి పూనుకునేవారు. వారు హేరోదీయుల్ని ఆయన మీదికి ఉసిగొలిపేవారు. క్రీస్తు పోటీ రాజ్యాన్ని స్థాపించ చూస్తున్నాడని ఆరోపించి ఆయన్ని చంపడానికి వారితో సంప్రదించేవారు. ఆయనకు వ్యతిరేంగా రోమియుల్ని రెచ్చగొట్టడానికి గాను ఆయన వారి అధికారాన్ని కూలదొయ్యడానికి ప్రయత్నిస్తున్నట్లు నివేదించేవారు. ప్రజల్ని ప్రభావితం చెయ్యకుండా ఏదో సాకుతో ఆయన్ని తప్పించడానికి ప్రయత్నించేవారు. కాని ఇప్పటి వరకూ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన కృపాకార్యాలు చూసి ఆయన పవిత్ర పరిశుద్ధ బోధ విన్న వారు ఇవి సబ్బాతును ఉల్లంఘించే వ్యక్తి, దేవదూషణ చేసే వ్యక్తి పనులు కానేకావని గ్రహించేవారు. పరిసయ్యులు పంపిన అధికారులు సయితం ఆయన బోధవిని ఎంతగా ప్రభావితు లయ్యారంటే ఆయన్ని బంధించడానికి వెళ్ళి బంధించలేకపోయారు. నిస్పృహ చెందిన యూదులు యేసుపై ఏవ్యక్తి అయినా విశ్వాసం ప్రకటిస్తే ఆ వ్యక్తిని సమాజ మందిరం నుంచి తొలగించాల్సిందంటూ ఒక శాసనం చేశారు.DATel 600.2

  కనుక యాజకులు, అధికారులు, పెద్దలు సమాలోచనలకు సమావేశమైనప్పుడు అందరూ ఆశ్చర్యపడి అభినందించిన, అద్భుతాలు సూచక క్రియలు చేసిన క్రీస్తుని మట్టు పెట్టాలన్నది వారి నిశ్చితాభిప్రాయం. పరిసయ్యులు సద్దూకయ్యులు ఏకమయ్యారు. ఇప్పటివరకు విడిపోయి ఉన్న వీరు క్రీస్తును వ్యతిరేకించడంలో ఒకటయ్యారు. నీకొదేము, యోసేపు క్రితం జరిగిన సభల్లో యేసుని దోషిగా తీర్చడాన్ని అడ్డుకున్నందున ఇప్పుడు వీరిని సభకు పిలువలేదు. క్రీస్తును నమ్మిన, పలుకుబడిగల ఇతరులు సభలో ఉన్నారు. కాని వారి పలుకుబడి పరిసయ్యుల ప్రాబల్యం ముందు పనిచెయ్యలేదు.DATel 601.1

  అయినా సభలోని సభ్యులందరూ ఏకాభిప్రాయంతో లేరు. ఈ కాలంలో సన్ హెడ్రినసభ చట్టబద్ధమైన సభకాదు. ప్రజలసమ్మతితోనే అది కొనసాగింది. ఆ సభలోని కొందరు క్రీస్తుకి మరణ దండన విధించడం సరికాదన్నారు. ఇది ప్రజల్లో తిరుగుబాటు లేపవచ్చునని, పర్యవసానంగా రోమీయులు యాజకత్యం పట్ల విముఖత కలిగి తమకింకా ఉన్న అధికారాన్ని తీసివేయవచ్చునని భయాలు వ్యక్తంచేశారు. క్రీస్తుని ద్వేషించడంలో సదూకయ్యులు ఏకమయ్యారు. అయినా వారు తమ కదలికల్లో జాగ్రత్తగా ఉన్నారు. రోమియులు తమ ఉన్నత స్థాయి తమకు లేకుండా చేస్తారని భయపడ్డారు.DATel 601.2

  నెబుకద్నెజరు పలికిన ప్రగల్భాలు విన్నసాక్షి, బెల్టస్సరు ఇచ్చిన విగ్రహారాధనతో కూడిన విందును చూసిన సాక్షి, నజరేతులో క్రీస్తు తన్నుతాను అభిషిక్తునిగా ప్రకటించుకున్నప్పుడు ఉన్నసాక్షి, క్రీస్తు మరణాన్ని నిశ్చయించడానికి సమావేశమైన సభలో ఉన్నాడు. ఈ సాక్షి ఇప్పుడు అధికారుల్ని తాము చేస్తున్న పనిలో నడిపిస్తున్నాడు. క్రీస్తు జీవితంలోని సంఘటనలు వారి కళ్ల ముందుకి వచ్చాయి. అవి స్పష్టంగా ఉన్నాయి. ఆందోళన కలిగిస్తోన్నాయి. దేవాలయంలోని దృశ్యం వారికి జ్ఞాపకమొచ్చింది. అప్పుడు పన్నెండేళ్ల బాలుడైన యేసు ధర్మశాస్త్ర పండితుల ముందు నిలబడి వారిని ప్రశ్నిస్తుండగా వారు విస్మయం చెందారు. అప్పుడే జరిగిన సూచక క్రియ క్రీస్తు ఎవరో కాదు దేవుని కుమారుడే అని సాక్ష్యమిచ్చింది. క్రీస్తును గూర్చిన పాత నిబందన లేఖనాలు వాటి వాస్తవ ప్రాధాన్యం వారి మనసులో తళుక్కున మెరిశాయి. హైరానా పడి, ఆందోళనతో “మనమేమి చేయుచున్నాము?” అని ప్రశ్నించుకున్నారు. ఆ సభలో అభిప్రాయభేదం ఏర్పడింది. తాము దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్న అభిప్రాయం పరిశుద్ధాత్మ ప్రేరణ కింద యాజకులికి అధికారులికి కలిగింది.DATel 601.3

  సభలో ఈ ఆందోళన చెలరేగుతున్నప్పుడు ప్రధాన యాజకుడు కయప లేచాడు. కయప గర్వి, క్రూరుడు, అహంకారి, ముక్కోపి. అతడి బంధువర్గంలో సద్దుకయ్యులున్నారు. సద్దుకయ్యులు గర్వం, తెగువ, లెక్కలేనితనం, అత్యాశ, క్రూరత్వంతో నిండి ఉన్న మనుషులు. వీటిని తమ బూటకపు నీతి అంగీకింద కప్పి ఉంచుకునే వారు. కయప ప్రవచనాల్ని పఠించిన వ్యక్తి. వాటి యధార్ధభావాన్ని గ్రహించకపోయినా అతడు గొప్ప అధికారంతోను నిశ్చయతతోను మాట్లాడేవాడు; మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని వారు ఆలోచించుకొనరు.” యేసు నిరపరాధి అయినప్పటికీ ఆయన్ని లేకుండా చెయ్యడం అవసరం అని ప్రధానయాజకుడు సభకు తెలిపాడు. ఆయన అందోళకారుడు. ప్రజల్ని తన వద్దకు ఆకర్షించుకుని అధికారుల ప్రాబల్యాన్ని హరిస్తున్నాడు. ఆయన ఒకడే. అధికారుల అధికారం బలహీనపడడం కన్నా ఆయన మరణించడమే మంచిది. ప్రజలు అధికారులపై విశ్వాసం కోల్పోతే జాతీయ అధికారం నాశనమౌతుంది. ఈ సూచక క్రియ అనంతరం యేసు అనుచరులు తిరుగుబాటు చెయ్యడానికి అవకాశం ఉంది అని కయప చెప్పాడు. అప్పుడు రోమియులువచ్చి మన దేవాలయాన్ని మూసివేసి, మన చట్టాల్ని రద్దుచేసి ఒక జాతిగా ఉండకుండా మనల్ని నాశనం చేస్తారు అన్నాడు. జాతి క్షేమాభివృద్ధికి అడ్డుగా ఉంటే ఆయన్ని తీసివేయడం దేవుని సేవచెయ్యడం కాదా? జాతియావత్తు నశించడం కన్నా ఒక్క వ్యక్తి మరణించడం మేలు.DATel 602.1

  జాతిశ్రేయం కోసం ఒక మనిషి మరణించాలి అనడంలో తనకు కొంత ప్రవచన జ్ఞానం - పరిమితమైందైనా - ఉందని కయప కనపర్చుకున్నాడు. అయితే యోహాను ఈ దృశ్యాన్ని గూర్చిన తన కథనంలో ఈ ప్రవచనాన్ని స్పృశిస్తూ దాని ప్రాముఖ్యాన్ని వివరిస్తోన్నాడు. యోహాను ఇలా అంటున్నాడు, “ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును.” గర్వాంధుడైన కయప రక్షకుని పరిచర్యను ఎంత గుడ్డిగా గుర్తించాడు!DATel 603.1

  అతి విలువైన ఈ సత్యం కయప పెదవుల పై ఒక అబద్ధంగా మారింది. అతడు ప్రబోధించిన విధానం అన్యమతం నుంచి స్వీకరించిన ఒక సూత్రంపై ఆధారితమయ్యింది. అన్యుల్లో ఒకడు మానవ జాతికోసం మరణించాలి అన్న అస్పష్ట స్పృహ నరబలులు అర్పించటానికి దారి తీసింది. క్రీస్తు మరణం ద్వారా అపరాధిఅయిన జాతిని అతిక్రమంనుంచి కాక అతిక్రమంలో కాపాడడానికి ఆ ప్రజలు పాపంలో కొనసాగేందుకు కయప ప్రతిపాదించాడు. యేసులో ఇప్పటివరకు మరణదండనకు తగిన హేతువు కనిపించలేదని వాదించే వారి నోళ్ళుముయ్యించాలని తన వాదన ద్వారా కయప ప్రయత్నించాడు.DATel 603.2

  ఈ సభలో క్రీస్తు విరోధులికి హృదయంలో మార్పు కలిగింది. పరిశుద్ధాత్మ వారి హృదయాల్లో పనిచేశాడు. అయినా వారిని అదుపుచెయ్యడానికి సాతాను ప్రయత్నించాడు. క్రీస్తు మూలంగా తాము పొందిన నష్టాల్ని గుర్తించాల్సిందిగా వారిని ప్రేరేపించాడు. తమ నీతిని ఆయన ఎంత స్వల్పంగా పరిగణించాడు! దైవ ప్రజలందరు కలిగి ఉండాల్సిన సమున్నత నీతిని ఆయన సమర్పించాడు. తమ ఆచారాలు కర్మకాండల్ని పక్కన పెట్టి పాపులు ప్రత్యక్షంగా దయామయుడైన తండ్రి వద్దకు వెళ్ళి తమ మనవులు చేసుకోవలసిందని వారిని ప్రోత్సహించాడాయన. ఈ రీతిగా యాజకత్వాన్ని పక్కన పెట్టాడు. రబ్బీల పాఠశాలలు బోధించిన వేదాంతాన్ని ఆయన తోసిపుచ్చాడు. యాజకుల దురాచారాల్ని ఎండగట్టి వారి పలుకుబడికి తీరని విఘాతం కలిగించాడు. వారి నీతి సూత్రాలు సంప్రదాయాల ప్రభావాన్ని నిర్వీర్యం చేస్తూ తాము ఆచార ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా ఆచరించినా దైవ ధర్మశాస్త్రాన్ని వ్యర్ధం చేస్తున్నారని ప్రకటించాడు. ఇదంతా సాతాను ఇప్పుడు వారి మనసుల్లోకి తెచ్చాడు.DATel 603.3

  వారు తమ అధికారాన్ని నిలుపుకోవాలంటే యేసును చంపాల్సిందేనని సాతాను వారిని ప్రేరేపించాడు. వారు ఈ సలహాను పాటించారు. తాము అనుభవిస్తోన్న అధికారాన్ని కోల్పోవచ్చునన్న విషయం తాము ఒక తీర్మానానికి రావాలనడానికి చాలినంత హేతువు అని వారు తలంచారు. తమ మనసులోనిది చెప్పడానికి భయపడి నిమ్మకు నీరెత్తినట్లు చూస్తోన్న కొంతమంది తప్ప స హెడ్రిన్ సభ మొత్తం కయప మాటల్ని దైవవాక్కుగా స్వీకరించింది. సభకు ఉపశమనం లభించింది. అసమ్మతి ఆగిపోయింది. పరిస్థితులు అనుకూలించిన మరుక్షణమే క్రీస్తుని చంపడానికి సభ తీర్మానించింది. యేసు దేవత్వానికి నిదర్శనాన్ని విసర్జించడంలో ఈ యాజకులు అధికారులు తమ్మును తాము గాడాంధకారంలో బంధించుకున్నారు. వారు పూర్తిగా సాతాను అదుపులో ఉన్నారు. వారిని నిత్యనాశనంలోకి నెట్టివేయడానికి అతడు తొందరపడ్తోన్నాడు. అయినా వారు తృప్తి పడున్నారంటే వారు గురి అయిన మోసం అలాంటిది. జాతి రక్షణ కోసం పాటు పడున్నో దేశభక్తులుగా తమ్మునుతాము పరిగణించు కుంటున్నారు.DATel 604.1

  యేసు విషయంలో తీవ్ర చర్యలు చేపట్టడానికి సన్ హెడ్రిన్ భయపడింది. అట్టి చర్యలు ప్రజలకు కోపం పుట్టించవచ్చునని యేసుకు వ్యతిరేకంగా తాము తలపెడున్న దౌర్జన్యం తమ మీదికి తిరగవచ్చునని సభ సభ్యులు భయపడ్డారు. అందుచేత తమ తీర్మానం అమలుని వాయిదావేశారు. యాజకుల కుట్రల్ని రక్షకుడు గ్రహించాడు. తనను తీసివెయ్యడానికి వారు ప్రయత్నిస్తోన్నారని వారి ఉద్దేశం త్వరలో నెరవేర్తుందని ఆయనకు తెలుసు. అయినా దాన్ని వేగిరపరచడం ఆయన పనికాదు. కనుక ఆ ప్రాంతం నుంచి తన శిష్యులతో ఆయన నిష్క్రమించాడు. “వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి” (మత్త 10:23) అంటూ తన శిష్యులకిచ్చిన ఉపదేశాన్ని యేసు ఈ రకంగా స్వీయ ఆదర్శం ద్వారా మళ్ళీ అమలుపర్చాడు. ఆత్మల రక్షణ కోసం పనిచెయ్యడానికి విశాల సేవారంగం ఉన్నది. ప్రభువుకి నమ్మకంగా నిలవడంలో అవసరమైతే తప్ప, ప్రభువు సేవకులు తమ ప్రాణాలకు ప్రమాదం కొని తెచ్చుకోకూడదు.DATel 604.2

  యేసు ఇప్పటికి మూడు సంవత్సరాలు బహిరంగ సేవ చేశాడు. అసూయపరుడైన ఒక రాజు బే హేము నుంచి ఆయన్ని తరిమివేశాడు, నజరేతులో తన సొంత ప్రజలు విసర్జించారు. కారణం ఏమీ లేకుండానే యెరుషలేములో ఆయనకు మరణం విధించారు. ఈ పరిస్థితుల్లో ఆయన తన నమ్మకమైన కొద్దిమంది అనుచరులతో ఒక పరాయి పట్టణంలో ఆశ్రయం పొందాడు. మానవ శ్రమల్ని చూసి ఆయాసపడిన ఆయన్ని, వ్యాధిగ్రస్తుల్ని స్వస్తపర్చిన ఆయన్ని గుడ్డివారికి చూపును చెవిటివారికి వినికిడిని, మూగవారికి మాటను ఇచ్చిన ఆయన్ని, ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టిన ఆయన్ని దుఃఖించిన వారిని ఓదార్చిన ఆయన్ని తాను ప్రేమించిన ప్రజల వద్ద నుంచి తరిమివేశారు. ఎగసిపడున్న కెరటాలపై నడిచిన ఆయన, ఒక మాటతో వాటి గర్జనను ఆపిన ఆయన, దయ్యాల్ని వెళ్ళగొట్టగా అవి దేవుని కుమారుడిగా గుర్తించిన ఆయన, మృతుల్ని తమ నిద్రనుంచి లేపిన ఆయన, వివేకంతో నిండిన తన మాటలతో వేలమందిని పరవశింపజేసిన ఆయన, దురభిమానంతో, ద్వేషంతో గుడ్డివారైన ప్రజల్ని, వెలుగును మొండిగా విసర్జించిన ప్రజల్ని చేరలేకపోయాడు.DATel 605.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents