Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    33—నా సహోదరులెవరు?

    యేసు పరిచర్య విషయంలో యోసేపు కుమారులు ఆయనకు సానుభూతి చూపలేదు. ఆయనకు సహకరించలేదు. ఆయన జీవితం గురించి ఆయన పరిచర్యను గురించిన వార్తలు వారిని ఆశ్చర్యంతోను వ్యాకులతతోను నింపేవి. ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపే వాడని, దినమంతా జనులు ఆయన చుట్టూ మూగుతున్నారని, ఆయనకు భోజనం చెయ్యడానికి కూడా సమయం ఉండదని వారు విన్నారు. ఆయన అవిశ్రాంత సేవ వలన బలహీనుడవుతోన్నాడని ఆయన మిత్రులు భావించేవారు. పరిసయ్యుల పట్ల ఆయన ప్రదర్శిస్తోన్న వైఖరి వారికి అర్ధం కాలేదు. ఆయన మతి స్థిమితం చెడుతోందని భావించిన వారు కొందరున్నారు.DATel 345.1

    సాతాను శక్తి ద్వారా దయ్యాల్ని వెళ్లగొడ్తున్నాడన్న పరిసయ్యుల ఆరోపణను ఆయన సహోదరులు విన్నారు. యేసుతో తమ బాంధవ్యం ద్వారా తమ మీదికి వస్తున్న నిందను గురించి వారు తీవ్ర సంతాపం చెందారు. ఆయన మాటలు, పనులు ఎంతటి అలజడి సృష్టిస్తోన్నాయో గ్రహించి, ఆయన నిర్భయంగా అంటోన్న మాటల్ని బట్టి ఆందోళన చెందడమే గాక ఆయన శాస్త్రుల్ని పరిసయ్యుల్ని ఖండించడాన్ని గూర్చి ఆగ్రహంగా ఉన్నారు. ఈ తరహా పరిచర్యను ఆపడానికి, ఆయన్ని నయాన్నో భయాన్నో ఒప్పించడానికి నిశ్చయించుకుని, తమతో చెయ్యి కలపడానికి మరియను ఒప్పించారు. ఆమె పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి ఆమె మాటవిని ఆయన విజ్ఞతతో మసలుకుంటాడని బావించారు.DATel 345.2

    దీనికి కొంచెం ముందు యేసు దయ్యం పట్టిన ఒక గుడ్డి మూగవాణ్ని బాగు చేసి రెండోసారి సూచకక్రియ చేశాడు. పరిసయ్యులు “ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడన్న” తమ ఆరోపణను పునరుద్ఘాటించారు. (మత్త 9:34). పరిశుద్దాత్మ చేస్తోన్న పనిని సాతానుకి ఆరోపించడం వల్ల తాము దేవుని దీవెనల్ని కోల్పోతోన్నారని క్రీస్తు వారికి చెప్పాడు. యేసు దేవత్వాన్ని గ్రహించలేక ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్షమాపణ ఉంటుంది. ఎందుకంటే పరిశుద్దాత్మ పరిచర్య ద్వారా వారు తమ ఆపరాధాన్ని తెలుసుకుని పశ్చాత్తాపం పొందవచ్చు. పాపం ఏదైనా, ఆత్మ పశ్చాత్తాపపడి విశ్వసించినట్లయితే ఆ పాపం క్రీస్తు రక్తంతో తుడుపుపడుతుంది. అయితే ఏ వ్యక్తి పరిశుద్దాత్మ పరిచర్యను నిరాకరిస్తాడో అతడు పశ్చాత్తాపం, విశ్వాసం చేరలేని తావులో తన్ను తాను నిలుపుకుంటాడు. పరిశుద్దాత్మ ద్వారానే దేవుడు హృదయంలో పనిచేస్తాడు. మనుషులు పరిశుద్దాత్మ పనిని ఇష్టపూర్వకంగా నిరాకరించి అది సాతాను పనిగా ప్రకటించినప్పుడు, తమలో దేవుడు పనిచేసే మార్గాన్ని మూసివేసుకుంటారు. అంతిమంగా వారు దైవాత్మను విసర్జించినప్పుడు ఆ ఆత్మకు దేవుడు చెయ్యగలిగింది ఇక ఏమీ ఉండదు.DATel 346.1

    ఈ హెచ్చరికను యేసు ఏ పరిసయ్యులికి చేశాడో వారే తాము ఆయనపై మోపిన ఆరోపణను నమ్మలేదు. ఆ ఉన్నతాధికారుల్లో యేసుకి ఆకర్షితులు కానివారు ఒక్కరూ లేరు. ఆయన్ని ఇశ్రాయేలు అభిషిక్తుడుగా ప్రకటించి ఆయన శిష్యులుగా తమ్మును తాము ప్రకటించుకోవలసిందన్న పరిశుద్ధాత్మ విజ్ఞాపన గళం వారు తమ ఆత్మలో విన్నారు. ఆయన సన్నిధిలో వారు తమ అపరిశుద్ధతను గుర్తించి తాము సృష్టించుకోలేని నీతికోసం ఆశించారు. కాని ఆయన్ని నిరాకరించిన అనంతరం ఆయన్ని మెస్సీయాగా అంగీకరించడం అవమానకరమని భావించారు. అవిశ్వాస మార్గంలో అడుగుపెట్టిన తర్వాత ఆత్మాభిమానం వారిని తమ తప్పును ఒప్పుకోకుండా అడ్డుకుంది. సత్యాన్ని అంగీకరించకుండా తప్పించుకోడానికి, దౌర్జన్యపద్ధతుల్లో రక్షకుని బోధను తప్పుపట్టడానికి సమకట్టారు. ఆయన మహాశక్తికి కృపకు కోకొల్లలుగా ఉన్న నిదర్శనం వారికి ఆగ్రహం పుట్టించింది. మహత్కార్యాలు చెయ్యకుండా వారు ప్రభువుని నిలువరించలేకపోయారు. బోధించకుండా ఆయన్ని ఆపలేకపోయారు. అందుచేత ఆయనపై తప్పుడు ప్రచారం సాగించి ఆయన మాటల్ని వక్రీకరించడానికి పూనుకున్నారు. అయిన దైవాత్మవారిని వెంబడించారు. ఆ మహాశక్తిని తట్టుకోడానికి వారు అనేక ప్రతిబంధకాలు సృష్టించాల్సి వచ్చింది. మానవ హృదయాల్లో పనిచెయ్యడానికి మహత్తర శక్తి వారిని మార్చడానికి ప్రయత్నిస్తోంది. కాని వారు ఆ శక్తి ప్రభావానికి లొంగలేదు.DATel 346.2

    మనుషుల కళ్లకు గుడ్డితనం పుట్టించేవాడు లేక మనుషుల హృదయాల్ని కఠినపర్చేవాడు దేవుడు కాదు. తమ పొరపాటు సరిచేసుకోడానికి వారిని సురక్షిత మార్గాల్లో నడిపించడానికి ఆయన వారికి వెలుగునిస్తాడు. ఈ వెలుగును నిరాకరించడం వల్ల కళ్ళు గుడ్డివవుతాయి. హృదయం కఠినమవుతుంది. ఈ ప్రక్రియ తరచుగా అదృశ్యంగా క్రమక్రమంగా సాగుతుంది. దేవుని వాక్యం ద్వారా, ఆయన సేవకుల ద్వారా, లేక ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మ ప్రాతినిధ్యం ద్వారా ఆత్మకు వెలుగు వస్తుంది. అయితే ఒక్క కిరణాన్ని నిరాకరిస్తే ఆధ్యాత్మిక అవగాహన పాక్షికంగా చచ్చుబడి రెండోసారి ప్రసరితమైన వెలుగు స్పష్టంగా కనిపించదు. కనుక చీకటి అధికమై ఆత్మకు కాళరాత్రిగా పరిణమిస్తుంది. ఈ యూదు నాయకులకు జరిగిందిదే. క్రీస్తుకు దైవ శక్తి ఉందని వారికి నమ్మకం పుట్టింది. అయితే సత్యాన్ని ప్రతిఘటించేందుకు పరిశుద్దాత్మ పనిని సాతానుకి ఆరోపించారు. ఇది చెయ్యడంలో వారు వంచనను బహిరంగంగా ఎంపిక చేసుకున్నారు. వారు సాతానుకి లొంగిపోయి అప్పటి నుంచి అతడి అదుపాజ్ఞలకింద ఉండిపోయారు.DATel 347.1

    పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపాన్ని గురించి క్రీస్తు హెచ్చరికతో సన్నిహితమైంది. వ్యర్ధమైన మాటల్ని గురించిన హెచ్చరిక. మాటలు హృదయంలో ఉన్న దానికి సూచిక. “హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును.” అయితే మాటలు ప్రవర్తనను సూచించడం కన్నా ఎక్కువ పనే చేస్తాయి. మాటలకు ప్రవర్తనపై ప్రతిక్రియ నిర్వహించే శక్తి ఉంది. మనుషుల మాటలు వారిని ప్రభావితం చేస్తాయి. తరచు క్షణిక ఉద్వేగం వల్ల సాతాను ప్రోద్బలం వల్ల మనుషులు అసూయగా మాట్లాడడం, చెడుగా తలంచడం చేస్తుంటారు. నిజంగా తాము నమ్మని అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు. కాని ఆ వ్యక్తీకరణ వారి ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది. తమ మాటలే వారిని మోసం చేస్తాయి. వారు సాతాను ప్రేరణతో పలికిన మాటల్ని నిజమని నమ్ముతారు. ఒకసారి ఒక అభిప్రాయానికి లేక తీర్మానానికి వచ్చిన తర్వాత, దాన్ని మార్చుకోడానికి అహంకారం అడ్డుపడుంది. తమదే న్యాయమైన మార్గమని నిరూపించడానికి వారు ప్రయత్నించి, చివరికి అదే న్యాయమని నమ్ముతారు. దేవుని వెలుగుకు సంబంధించినంతవరకూ దాన్ని శంకించడం ప్రశ్నించడం విమర్శించడం ప్రమాదకరం. అజాగ్రత్త అమర్యాదతో కూడిన విమర్శ భక్తి రాహిత్యాన్ని అవిశ్వాసాన్ని ప్రోది చేసి ప్రవర్తనకు విఘాతం కలిగిస్తుంది. ఈ అలవాటు ఉన్న పెక్కుమంది అపాయాన్ని గుర్తించకుండా కొనసాగి చివరికి పరిశుద్దాత్మను విమర్శించి ఆయన సేవను నిరాకరించారు. యేసు ఇలా అన్నాడు, “మనుష్యులు పలుకు వ్యర్ధమైన ప్రతిమాటను గూర్చియు విమర్శ దినమున లెక్కచెప్పవలసియుండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటను బట్టియే అపవాధినని తీర్పునొందుదువు. ”DATel 347.2

    అనంతరం ఆయన బోధను సంతోషంగా విని ఆయన మాటలచే ప్రభావితులైనప్పటికీ పరిశుద్దాత్మ తమలో నివసించేందుకుగాను తమ్మును తాము సమర్పించుకోకుండా ఉండిపోయిన వారికి ఒక హెచ్చరికను జోడించాడు. ప్రతిఘటించడం వలననే కాదు అశ్రద్ధవల్ల కూడా ఆత్మ నశిస్తుంది. “అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున - నేను వదలి వచ్చిన నా యింటికి తిరిగి వెళుదుననుకొని వచ్చి, ఆ యింటిలో ఎవరును లేక అది ఊడి అమర్చియుండుట చూచి, వెళ్లి తనకంటే చెడ్డవైన మరి యేడు దయ్యములను వెంట బెట్టుకొని వచ్చును. అది దానిలో ప్రవేశించి అక్కడ కాపురముండును” అని యేసు అన్నాడు.DATel 348.1

    ఈ రోజుల్లోలాగే క్రీస్తు దినాల్లో తమపై సాతాను అదుపుకొంత కాలం విఫలమైనట్లు కనిపించినవారు కొందరున్నారు. వారు తమపై ఆధిపత్యం చూపిస్తోన్న దురాత్మల నుంచి దేవుని కృపద్వారా విముక్తి పొందారు. వారు దేవుని ప్రేమలో ఆనందంగా నివసించారు. అయితే ఉపమానంలోని రాతినేల శ్రోతల వలే వారు ఆయన ప్రేమలో నిలువలేదు. క్రీస్తు తమ హృదయాల్లో నివసించేందుకుగాను వారు దినదినం తమ్మునుతాము దేవునికి సమర్పించుకోలేదు. దురాత్మ “తనకంటె చెడ్డవైన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని” వచ్చినప్పుడు, వారు దుష్ట శక్తికి పూర్తిగా లొంగిపోయారు.DATel 348.2

    ఆత్మ తన్నుతాను యేసుకి సమర్పించుకున్నప్పుడు నూతన హృదయం ఒక నూతన శక్తి వశంలో ఉంటుంది. ఒక మార్పు కలుగుతుంది. ఆ మార్పును మానవుడు తనంతట తాను సాధించలేడు. అది మానవాతీతమైన పని. అది మానవ స్వభావంలోకి మానవాతీతమైన ప్రకృతి శక్తిని ప్రవేశపెడుంది. క్రీస్తుకు సమర్పితమైన ఆత్మ ఆయన సొంత కోట ఆవుతుంది. ఈ తిరుగుబాటు లోకంలో ఈ కోట ఆయన సొంతం అవుతుంది. అందులో ఆయన అధికారం తప్ప ఇంకెవరి అధికారానికి చోటులేదు. ఇలా పరలోక ప్రతినిధుల ఆధీనంలో ఉన్న ఆత్మ సాతాను దాడులికి దుర్భేద్యం. కాని మనం క్రీస్తు నియంత్రణకు లొంగితేనే తప్ప మనపై సాతాను అధిపత్యం చలాయిస్తాడు. లోక ప్రాబల్యం కోసం పోరాడున్న రెండు శక్తుల్లో ఒకదానికి తప్పనిసరిగా లోబడి ఉండాలి. చీకటి రాజ్యం ప్రాబల్యం కిందకు రావడానికి మనం ప్రత్యక్షంగా చీకటి రాజ్యం సేవను ఎన్నుకోనవసరం లేదు. వెలుగు రాజ్యంతో కలిసి ఉండడాన్ని ఆశ్రద్ధ చేస్తే సరిపోతుంది. మనం పరలోక ప్రతినిధుల్తో సహకరించకపోతే సాతాను మన హృదయాన్ని స్వాధీనపర్చుకుని దాన్ని, తన నివాస స్థలం చేసుకుంటాడు. ఆయన నీతిని విశ్వసించడం ద్వారా క్రీస్తు మన హృదయంలో నివసించడమే మనం దుర్మార్గతకు దూరంగా ఉండే ఒకే ఒక మార్గం. దేవునితో మనకు దగ్గర సంబంధముంటే తప్ప. ఆత్మాభిమానం సుఖభోగాలు పాప శోధనల దుష్పరిణామాల్ని మనం ప్రతిఘటించలేం. మనం ఇలా దురభ్యాసాల్ని విడిచి పెట్టవచ్చు, కొంతకాలం సాతాను సావాసాన్ని వదులుకోవచ్చు. కాని దేవునికి ప్రతీ ఘడియ మనల్ని మనం సమర్పించుకోడం ద్వారా ఆయనతో వాస్తవిక అనుసంధానం లేకపోతే మనకు ఓటమి తప్పదు. క్రీస్తుతో వ్యక్తిగతమైన పరిచయం, ఎగతెగని సహవాసం లేకపోతే మనం అవవాది అధికారం కింద ఉంటాం. తుదకు అతడి ఆజ్ఞల్ని శిరసావహిస్తాం .DATel 349.1

    “ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరము వారికిని సంభవించును” అన్నాడు యేసు. కృపాహ్వానాన్ని తృణీకరించి కృపగల ఆత్మకు విరుద్ధంగా వ్యవహరించే వారంత కఠినులు ఎవరూ ఉండరు. పశ్చాత్తాపపడమంటూ దేవుడు పంపే ఆహ్వానాన్ని పదేపదే చేసే ఏపాపం. క్రీస్తుని విసర్జించడంలోని ప్రతీ అడుగు రక్షణను తిరస్కరించే దిశగా పడిన అడుగూ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చెయ్యడానికి పడిన అడుగవుతుంది.DATel 349.2

    క్రీస్తును విసర్జించడంలో యూదు ప్రజలు క్షమించరాని పాపాన్ని చేశారు. కృపాహ్వానాన్ని నిరాకరించి మనం కూడా అదే పాపాన్ని చేయగలం. ఆయన పంపే దూతల మాటలు వినేబదులు క్రీస్తు నుంచి మనసుల్ని యేసు ప్రభువును అవమానిస్తాం, పరాభవిస్తాం. ఇది చేసిన వ్యక్తికి నిరీక్షణ లేదా క్షమాపణ ఉండదు. తుదకు దేవునితో సమాధానపడదామన్న కోరికను అతడు కోల్పోతాడు.DATel 350.1

    యేసు ఇంకా బోధిస్తుండగా, తన తల్లి, తన సహోదరులు బయట ఉన్నారని, తనను చూడగోర్తున్నారని శిష్యులు ఆయనకు వర్తమానం తెచ్చారు. వారి మనసులో ఏముందో ఆయనకు తెలుసు. “అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి - నా తల్లి యెవరు? నా సహోదరులెవరు? అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి. - ఇదిగో నా తల్లియు నా సహోదరులును, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియుననెను.”DATel 350.2

    విశ్వాసం ద్వారా క్రీస్తును స్వీకరించే వారందరూ మానవ బంధం కన్నా సన్నిహితమైన బాంధవ్యం వలన ఆయనతో ఏకమవుతారు. తండ్రితో ఆయన ఏకమైనట్లు వారు ఆయనతో ఏకమవుతారు. ఆయన మాటల్ని నమ్మి వాటిని పాటించే వ్యక్తిగా తన తల్లి తన ఆ స్వాభావిక బాంధవ్యం తనను తమ వ్యక్తిగత రక్షకుడిగా స్వీకరిస్తే తప్ప, ఆయనతో తమ బాంధవ్యం నుంచి వారికి ఒనకూడే మేలు ఏమీ ఉండదు.DATel 350.3

    యేసు భూలోక బంధువులు ఆయన్ని దేవుని వద్ద నుంచి వచ్చిన వానిగా గుర్తించి దేవుని సేవ చెయ్యడంలో ఆయనకు సహకరించి ఉంటే వారిలో ఆయనకు ఎంత బలం లభించేది! వారి అపనమ్మకం యేసు భూలోక జీవితంపై నీలినీడలు ప్రసరించింది. ఆ దుఃఖ పాత్రలోని చేదు పానీయంలో కొంత మనకోపం ఆయన తాగాడు.DATel 350.4

    మానవ హృదయంలో సువార్త పట్ల రగుల్కొన్న వైరుద్యం దైవకుమారుని హృదయాన్ని తీవ్ర ఆవేదనతో నింపింది. కుటుంబంలో ఆయనకు అది మరింత బాధగా ఉంది. ఆయన హృదయం దయతో ప్రేమతో నిండి ఉంది. కుటుంబంలోని ప్రేమానురాగాల్ని ఆయన అభినందించాడు. ఆయన తమ అభిప్రాయాల్ని అంగీకరించాలని ఆయన సహోదరులు పట్టుపట్టేవారు. అది ఆయన కర్తవ్య సాధనకు దోహదపడేది కాదు. ఆయనకి తమ సలహాలు సూచనలు అవసరమని వారు భావించారు. ఆయన్ని వారు మానవ దృక్కోణంలోనే చూశారు. శాస్త్రులికి పరిసయ్యులికి సమ్మతమైన విషయాల్నే ఆయన ప్రశసించాలని అప్పుడు ఆయనకు వారితో ఎలాంటి అవాంఛనీయ వివాదం ఉండదని వారు భావించారు. తనకు దైవాధికారం ఉందని చెప్పడం తమ పాపాల నిమిత్తం రబ్బీల్ని మందలించే వాడిగా వారిముందు నిలబడడం ఆత్మ నిగ్రహం కోల్పోయి చేసిన పని అని వారు అభిప్రాయపడ్డారు. ఆయన్ని తప్పుపట్టడానికి పరిసయ్యులు అవకాశం కోసం కనిపెట్టొన్నారని, ఇప్పుడు వారికి ఆయన అవకాశం ఇచ్చాడని వారికి తెలుసు.DATel 351.1

    వారు తమ చిన్న కొలమానంతో ఆయన ఏ కర్తవ్య నెరవేర్పుకు వచ్చాడో దాన్ని కొలవలేకపోయారు. అందుచేత ఆయన కష్టాల్లో వారు ఆయన పట్ల సానుభూతి ప్రదర్శించలేకపాయారు. ఆయన ప్రవర్తనను గూర్చిన వాస్తవిక అవగాహన తమకు లేదని, ఆయనలో దేవత్వం మానవత్వం మిళితమై ఉన్నాయని తాము గుర్తించలేదని వారి పరుషపదజాలం తెలియజేసింది. ఆయన దుఃఖంలో మునిగి ఉండడం వారు తరచుగా చూసేవారు. అయితే ఆయన్ని ఓదార్చడానికి బదులు వారి స్వభావం ద్వారా, వారి మాటల ద్వారా ఆయన హృదయాన్ని గాయపర్చారు. ఆయన సున్నితమైన నైజాన్ని హింసించారు. ఆయన ఉద్దేశాల్ని అపార్థం చేసుకున్నారు. ఆయన పరిచర్యను అవగాహన చేసుకోలేకపోయారు.DATel 351.2

    ఆయన సహోదరులు పరిసయ్యుల వేదాంతాన్ని ముందుకు తెచ్చారు. అది అతిపురాతనమైంది. సత్యాన్ని అవగతం చేసుకుని మర్మాలన్నిటిని గ్రహించగలమని ఆయనకు నేర్పగలమని భావించారు. గ్రహించలేని దాన్ని వారు స్వేచ్ఛగా ఖండించారు. తన నిందారోపకులు ఆయన్ని అణువణువూ పరిశోధించారు. ఆయన ఆత్మ అలసిపోయింది, దుఃఖాక్రాంతమయ్యింది. వారు దేవునిపై విశ్వాసం ప్రకటించుకున్నారు. తాము దేవునికి మద్దతు పలుకుతున్నామని భావించారు. కాని దేవుడే శరీరధారి అయి తమ పక్కనే ఉన్నప్పుడు ఆయన్ని గుర్తించలేదు.DATel 351.3

    ఈ పరిణమాలు ఆయన మార్గాన్ని ముళ్ళతో నింపి ఆయన గమనాన్ని కష్టతరం చేశాయి. సొంత కుటుంబంలోనే తలెత్తిన పొరపొచ్చాలతో తీవ్ర పొందాడు. ఆయన సందర్శించడానికి ముచ్చటపడే గృహమొకటుండేది. అదే లాజరు, మరియ మార్తల గృహం. అక్కడి విశ్వాస, అనురాగ వాతావరణంలో ఆయన ఆత్మకు విశ్రాంతి లభించింది. అయినా ఆయన దివ్యకర్తవ్యాన్ని అవగాహన చేసుకున్నవారూ మానవాళి పక్షంగా ఆయన మోస్తోన్న భారాన్ని అవగతం చేసుకున్న వారూ లేరు. ఒంటరిగా ఆయనకు ఉపశమనం లభించేది.DATel 352.1

    క్రీస్తు నిమిత్తం శ్రమలు పొందడానికి సొంత కుటుంబంలో సయితం పొరపొచ్చాల్ని అపనమ్మకాన్ని ఎదుర్కునేవారు యేసుకూడా వాటిని భరించాడని తెలుసుకుని ఆదరణ పొందవచ్చు. వారి పట్ల ఆయన కనికరం కలిగి ఉన్నాడు. తనకు మిత్రులు కావలసిందని, తాను కనుగొన్న ఉపశమనాన్ని తండ్రితో సహవాసంలో కనుగోవలసిందని అట్టివారికి ఆయన పిలుపునిస్తోన్నాడు.DATel 352.2

    క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించేవారు తమ జీవితంలోని శ్రమల్ని బాధల్ని ఒంటరిగా భరించడానికి అనాధలు కారు. వారిని పరలోక కుటుంబసభ్యులుగా ఆయన స్వీకరిస్తాడు. తన తండ్రిని తమ తండ్రి అని పిలువమంటాడు. వారు ఆయన “చిన్నబిడ్డలు”. వారంటే దేవునికి ఎంతో ప్రాణం. వారితో ఆయనకు మమతాను రాగాల బంధం ఉంది. వారి పట్ల ఆయనకు చెప్పనలవికాని ప్రేమకనికరాలు. మన నిస్సహాయ స్థితిలో మన తల్లి తండ్రి మన పట్ల చూపించే ప్రేమ కన్నా అది గాఢమైంది.DATel 352.3

    ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన నిబంధనల్లో తన ప్రజలతో క్రీస్తు సంబంధానికి ఓ సాదృశ్యం ఉంది. పేదరికం వల్ల ఒక హెబ్రీయుడు తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి తన్నుతాను బానిసగా అమ్ముకోవాల్సివచ్చినప్పుడు, అతణ్ని అతడి స్వాస్థ్యాన్ని విడిపించే బాధ్యత అతడి సమీప బంధువు మీద ఉండేది. లేవీ 25:55, 47-49; రూతు 2:20 చూడండి. మనల్నీ, పాపం ద్వారా మనం పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని విమోచించే బాధ్యత మనకు “సమీప బంధువు” అయిన ఆయన మీద పడింది. మనల్ని విమోచించేందుకు ఆయన మన బంధువయ్యాడు. ఆయన ఇలాగంటోన్నాడు, “నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు. “నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను.” యెషయా 43:1,4.DATel 353.1

    తన సింహాసనం చుట్టూ ఉన్న పరలోకవాసుల్ని క్రీస్తు ప్రేమిస్తాడు. అయితే ఆయన మనపట్ల చూపిస్తున్న మహత్తర ప్రేమకు హేతువేమిటి? దాన్ని అవగాహన చేసుకోలేం కాని మన అనుభవంలో అది నిజమని మన మెరుగుదుం. ఆయనతో బంధుత్వాన్ని నిలుపుకున్నట్లయితే, మన ప్రభువుకి సహోదరులు సహోదరీలు అయిన వారిని మనమెంత దయగా పరిగణించాలి? దేవునితో మన బాంధవ్య హక్కుల్ని మనం త్వరపడి గుర్తించవద్దా? దేవుని కుటుంబంలో దత్తత బిడ్డలుగా వచ్చిన మనం మన తండ్రిని బంధుజనుల్నీ గౌరవించవద్దా?DATel 353.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents