Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    76—యూదా

    దేవుని మన్నన పొంది ఉండగలిగే ఒక జీవితం ఎలా విషాదంగా అంతమొందిందో యూదా చరిత్ర వివరిస్తోంది. యెరూషలేముకి తన చివరి ప్రయాణానికి ముందు యూదా మరణించి ఉంటే క్రీస్తు శిష్యుల్లో ఒకడుగా అతడికి స్థానం ఉండేది. అతడి లోటుకు అందరూ సంతాపపడేవారు. తన చరిత్ర చివరిలో వెల్లడైన గుణలక్షణాలు లేకపోతే, శతాబ్దాలుగా అతణ్ని వెంటాడుతోన్న ద్వేషం ఉండేది కాదు. అయితే అతడి ప్రవర్తనను లోకం ముందుంచడంలో ఒక ఉద్దేశం ఉంది. అతడిలాగే పరిశుద్ధ ధర్మకార్యానికి ద్రోహం చేసేవారికి అది ఒక హెచ్చరికగా నిలవాల్సి ఉంది.DATel 805.1

    యేసుని తమ చేతులికి అప్పగించడానికి యాజకులతో తన ఒప్పందాన్ని యూదా పస్కాకి కొంచెం ముందు నవీకరించుకున్నాడు. రక్షకుని విశ్రాంతి స్థానాల్లో ఒక దానికి ధ్యానానికి ప్రార్థనకు ఆయన్ని తీసురావాలన్న అవగాహనకు వచ్చారు. సీమోను ఇంటిలో విందు నాటినుంచి యూదా తాను ఒప్పుకున్న కార్యాన్ని నెరవేర్చడం గురించి తీవ్రంగా ఆలోచుస్తున్నాడు. అతడి ఉద్దేశం మారలేదు. ముప్పయి వెండి నాణేలకు - ఒక బానిసకు చెల్లించాల్సిన ధరకు మహిమ ప్రభువును అవమానం భరించడానికి, మరణించడానికి అతడు అమ్మాడు.DATel 805.2

    యూదాకి డబ్బంటే స్వభావసిద్ధంగా మితిలేని ఆశ. కాని అతడు ఇలాంటి పని చెయ్యడానికి ఎల్లప్పుడు అవినీతిగా లేడు. తన జీవిత లక్ష్యం అయ్యేంతవరకూ అతడు దురాశను పెంచి పోషించాడు. అతడి ధనాశ క్రీస్తుపట్ల తన ప్రేమను అణగదొక్కింది. ఒక్క దుర్గుణానికి బానిస అవ్వడం ద్వారా అతడు తన్నుతాను సాతానుకి అప్పగించుకున్నాడు. పాపంలో ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమయ్యాడు.DATel 805.3

    వేవేల ప్రజలు క్రీస్తుని వెంబడిస్తున్న సమయంలో యూదా శిష్యుల్లో కలిశాడు. సమాజమందిరంలో, సముద్రం పక్క కొండమీద ఆయన చెప్పిన మాటలకు వారు ఆకర్షితులయ్యారు. రక్షకునిబోధ వారి హృదయాల్ని కదిలించింది.DATel 806.1

    వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, అంధులు పట్టణాలనుంచి నగరాల నుంచి వచ్చి ఆయన చుట్టూ మూగడం యూదా చూశాడు. మరణిస్తున్నవార్ని ప్రజలు ఆయన పాదాల వద్ద ఉంచడం చూశాడు. రోగుల్ని స్వస్తపర్చడంలోను, దయ్యాలిని వెళ్లగొట్టడంలోను, మృతుల్ని లేపడంలోను రక్షకుని అద్భుత కార్యాల్ని అతడు చూశాడు. క్రీస్తు శక్తి నిదర్శనం తనలో ఉన్నట్లు యూదా వ్యక్తిగతంగా గుర్తించాడు. తాను విన్న బోధలన్నిటికన్నా క్రీస్తు బోధ ఉత్తమమయ్యిందని గుర్తించాడు. యూదా ఆ మహాబోధకుణ్ని ప్రేమించాడు. ఆయనతో ఉండాలని ఆకాంక్షించాడు. ప్రవర్తనలోను జీవితంలోను మారాలని యోచించాడు. ఈ మార్పు క్రీస్తుతో సంబంధం ద్వారా పొందాలని నిరీక్షించాడు. రక్షకుడు యూదాని నిరోధించలేదు. పన్నెండు మందిలో అతడికి స్థానాన్నిచ్చాడు. అతడు సువార్త సేవకుడి పనిచేస్తాడని నమ్మాడు. రోగుల్ని స్వస్తపర్చడానికి, దయ్యాల్ని వెళ్లిగొట్టడానికి అతడికి శక్తినిచ్చాడు. కాని యూదా తన్నుతాను క్రీస్తుకి పూర్తిగా సమర్పించుకునే స్థితికి రాలేదు. తన లోకాశల్ని లేదా ధనాశను విడిచి పెట్టలేదు. క్రీస్తు సేవకుడి స్థానాన్ని అంగీకరించినప్పటికీ అతడు దేవుని శిక్షణకు లోనుకాలేదు. తన సొంత ఆలోచనల్ని అభిప్రాయాల్ని ఉంచుకుని వాటిని అనుసరించాలనుకున్నాడు. విమర్శించే స్వభావాన్ని ఆరోపణలు చేసే ప్రవృత్తిని అలవర్చుకున్నాడు.DATel 806.2

    శిష్యులు యూదాను గౌరవించారు. వారిపై యూదా ప్రభావం బలంగా ఉంది. సొంత అర్హతల్ని గురించి అతడికి ఎంతో అతిశయం. సమాలోచనల్లోను సామర్థ్యం విషయంలోను సహోదరుల్ని తనకన్నా తక్కువస్థాయి వారిగా పరిగణించేవాడు. వారికి వచ్చే తరుణాల్ని చూసి వారు పరిస్థితుల్ని సొంతలాభానికి వినియోగించుకోలేదని అతడి అభిప్రాయం. దూరదృష్టిలేని అట్టివారు నాయకులుగా ఉంటే సంఘం వృద్ధి చెందదని అభిప్రాయపడ్డాడు. పేతురు దుందుడుకు వ్యక్తి. అతడు ఆలోచించకుండా ముందుకి వెళ్తాడు. క్రీస్తు నోటి నుంచి వెలువడున్న సత్యాల్ని భద్రపర్చుకునే యోహాను సరైన ఆర్థిక నిపుణుడుకాడని యూదా అభిప్రాయం. తాను చేసే ప్రతి పనిలోను ఎవరి శిక్షణ అతడికి తనకు నిర్దుష్టత నేర్పిందో ఆ మత్తయి నిజాయితీపరుడు కచ్చితమైన మనిషి. అతడు నిత్యం క్రీస్తు మాటల్ని ధ్యానించే వ్యక్తి. అతడు ఆయన మాటల్లో నిమగ్నమవ్వడాన్ని బట్టి అతడు చురుకైన దూర దృష్టిగల వ్యాపారానికి అస్సలు పనికిరాడని యూదా భావించాడు. ఈ రీతిగా యూదా శిష్యులందరినీ అంచనావేశాడు. కార్యనిర్వాహకుడిగా తన ప్రతిభ లేకపోయినట్లయితే సంఘం తరచుగా సంకటపరిస్థితిని ఎదుర్కోనవలసి వచ్చేదని భావించి అతిశయించేవాడు. తాను సమర్థుణ్నని తనను ఎవరూ మోసం చెయ్యలేరని యూదా భావించేవాడు. సువార్త సేవకు ఘనత ప్రతిష్ఠ తనవల్లే వస్తున్నాయన్నవి అతడి అభిప్రాయం .DATel 806.3

    తన ప్రవర్తనలోని బలహీనతకు యూదా గుడ్డివాడయ్యాడు. తన బలహీనతను గుర్తించి దాన్ని తొలగించుకునే అవకాశం ఉండే స్థలంలో క్రీస్తు అతణ్ని నియమించాడు. శిష్యులికి ఖజానాదారుడుగా ఆ చిన్న సమూహం అవసరాలకు ఆర్థిక వనరుల్ని సమకూర్చడం బీదల అవసరాల్ని తీర్చడం అతడి బాధ్యత. “నీవు చేయుచున్నది త్వరగా చేయుము” (యోహా 13:27) అని పస్కా గదిలో క్రీస్తు అతడితో అన్నప్పుడు, పండుగకు అవసరమైన వస్తువుల్ని కొనమని లేక బీదలకు ఏదో ఇవ్వమని ప్రభువు అతణ్ని ఆదేశించాడని శిష్యులు భావించారు. ఇతరులికి పరిచర్య చెయ్యడంలో యూదా స్వార్థరహిత స్వభావాన్ని వృద్ధిపర్చుకుని ఉండవచ్చు. కాని క్రీస్తు బోధను రోజుకిరోజు వింటూ, ఆయన నిస్వార్త జీవితం రోజుకి రోజు చూస్తూ యూదా తన పేరాశ ప్రవృత్తిని పెంపొందించుకున్నాడు. తన చేతికి వస్తున్న చిన్నచిన్న మొత్తాలు అతడికి నిత్యం శోధనగా పరిణమించాయి. క్రీస్తుకి చిన్నసేవ చేసినప్పుడు లేదా మతపరమైన విషయాలికి సమయం వెచ్చినప్పుడు తరచు దానికి ఈ చిన్న నిధి నుంచి ద్రవ్యం తీసుకునేవాడు. తన చర్యను సమర్ధించుకోడానికి ఈసాకులు తన దృష్టికి న్యాయమైనవి అనిపించేవి. కాని దేవుని దృష్టికి అతడు దొంగ.DATel 807.1

    తన రాజ్యం ఈ లోకసంబంధమైంది కాదని క్రీస్తు తరచుగా చెప్పేమాట యూదాకు బాధాకరంగా ఉండేది. అతడు ఒక విధానాన్ని ఏర్పర్చుకున్నాడు. దాని ప్రకారం క్రీస్తు పనిచెయ్యాలని యోచించాడు. బాప్తిస్మమిచ్చే యోహాన్ని చెరసాల నుంచి రక్షించాలన్నది అతడి ఆలోచన. అయితే యోహానుని శిరచ్ఛేదనానికి విడిచిపెట్టాడు క్రీస్తు. యేసు తన రాజ్యపరిపాలన హక్కును ఉపయోగించుకుని యోహాను మరణానికి ప్రతీకారం తీర్చుకునే బదులు విశ్రాంతి తీసుకోడానికి శిష్యులతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్లిపోయాడు. ఇంకా చురకైన పటిష్టమైన పోరాటం సాగించాలన్నది యూదా అభిప్రాయం. శిష్యులు తమ పథకాల్ని అమలు పర్చడంలో అడ్డుతగలకుండా క్రీస్తు వాటిని కొనసాగనిస్తే ఆయన సేవ జయప్రదంగా ముందుకు సాగుతుందని యూదా అభిప్రాయపడ్డాడు. అతడు యూదు నాయకుల శతృత్వం పెరుగుతుండడం, వారు పరలోకం నుంచి ఒక గుర్తు కోరినప్పుడు ఆ సవాలును ఆయన ఖాతరు చెయ్యకపోవడం యూదా గుర్తించాడు. అతడి హృదయద్వారం అవిశ్వాసానికి తెరుచుకుంది. శత్రువు సందేహాల్ని తిరుగుబాటు భావాల్ని ప్రోది చేశాడు. నిరాశను కలిగించే దానిపైనే యేసు ఎందుకు అంతగా మాట్లాడాడు? తనకు తన శిష్యులికి కష్టాలు హింస వస్తాయని ఎందుకు ప్రవచించాడు? నూతన రాజ్యంలో ఉన్నతస్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం క్రీస్తు కర్తవ్యాన్ని బహిరంగపర్చడానికి యూదాని నడిపించింది. అతడి ఆశలు నిరాశలు కానున్నాయా? క్రీస్తు దేవుని కుమారుడు కాడని యూదా నిర్ధారించుకోలేదు. కాని ఆయన మహత్కార్యాల్ని ప్రశ్నించడం, వాటికి కొంత వివరణ కోసం ప్రయత్నించడం ప్రారంభించాడు.DATel 807.2

    రక్షకుని బోధను లెక్కచెయ్యకుండా క్రీస్తు రాజుగా యెరూషలోము నుంచి పరిపాలిస్తాడన్న అభిప్రాయాన్ని యూదా నిత్యం ప్రబోధిస్తోన్నాడు. అయిదు వేలమందికి ఆహారం పెట్టినప్పుడు దీన్ని అమలుపర్చాలని అతడు ప్రయత్నించాడు. ఈ సమయంలో యూదా ఆకలిగా ఉన్న జనసమూహాలకి ఆహారం ఒడ్డించడంలో సహాయం చేస్తోన్నాడు. తన ఆధీనంలో ఉన్నదాన్ని ఇతరులికి ఇవ్వడంలో ఉన్న ప్రయోజనాన్ని గుర్తించే అవకాశం అతడికి కలిగింది. దేవుని సేవలో ఉండే తృప్తిని పొందాడు. రోగుల్ని బాధపడున్నవారిని ప్రజల మధ్యనుంచి క్రీస్తు వద్దకు తీసుకురావడంలో సహాయం చేశాడు. విమోచకుడి స్వస్తత శక్తి తెచ్చే నివారణను, సంతోషాన్ని ఆనందాన్ని అనుభవపూర్వకంగా గ్రహించాడు. క్రీస్తు పద్ధతుల్ని అవగాహన చేసుకుని ఉండేవాడు. కాని అతడి స్వార్థాశలు ఆసక్తులు అతణ్ని గుడ్డివాణ్ని చేశాయి. రొట్టెల సూచక క్రియ పుటించిన ఉత్సాహం నుంచి లబ్ది పొందిన వారిలో ప్రథముడు యూదా. క్రీస్తుని బలవంతంగా తీసుకువెళ్లి రాజును చెయ్యాలన్న పథకనాన్ని రూపొందించింది అతడే. అతడి ఆశలు ఆకాశాన్నంటాయి. కనుక అతడి నిరాశ దుర్భరమయ్యింది.DATel 808.1

    జీవాహారం గురించి క్రీస్తు సమాజమందిరంలో చేసిన ప్రసంగం యూదా చరిత్రను మలుపు తిప్పింది. “మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనేకాని నాలో మిరు జీవము గలవారు కారు” (యోహా. 6:53) అన్నమాటలు విన్నాడు. క్రీస్తు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసమేగాని లౌకిక ప్రయోజనాల కోసం పనిచెయ్యడం లేదని అతడు గ్రహించాడు. తాను దూరదృష్టిగల వ్యక్తినని భావించాడు. యేసుకి ఎలాంటి గౌరవం ఉండదని, తన అనుచరులికి ఆయన ఏ ఉన్నత స్థానాల్నీ ఇవ్వలేడని భావించాడు. క్రీస్తుకి అంత దగ్గరగా ఉండకూడదని, దూరంగా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. కాని జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. తాననుకున్నట్టు జాగ్రత్తగానే వేచి ఉన్నాడు.DATel 809.1

    అప్పటి నుంచి అతడు సందేహాలు వెలిబుచ్చడం మొదలు పెట్టాడు. శిష్యుల్ని అవి తికమక పెట్టాయి. క్రీస్తు చెబుతున్న సంగతుల్ని వ్యతిరేకిస్తూ శాస్త్రులు పరిసయ్యులు చేస్తున్న వాదనల్ని పునరావృత్తం చేస్తూ తప్పుదారి పట్టించే విధానాల్ని ప్రవేశపెట్టాడు. సువార్తకు ఎదురవుతున్న చిన్న చితక కష్టాలు, శ్రమలు, సమస్యలు, ఆటంకాలు ఆయన సేవ యధార్థ సేవ కాదడానికి నిదర్శనాలని వాదించాడు. క్రీస్తు బోధిస్తున్న సత్యానికి సంబంధించని లేఖన వాక్యాల్ని ప్రస్తావనకు తెచ్చేవాడు. వాటి సందర్భం నుంచి విడదీసి ఉపయుక్తమౌతున్న ఈ వాక్యాలు శిష్యుల్ని గలిబిలి పర్చి వారిని నిత్యం వేధిస్తున్న నిరాశను అధికం చేశాయి. అయినా ఇదంతా మనస్సాక్షితో చేసినట్లు కనిపించేటట్లు వ్యవహరించాడు. తమ పరమ గురువు చెప్పిన సంగతుల్ని ధ్రువపర్చే నిదర్శనం కోసం శిష్యులు అన్వేషించేటప్పుడు యూదా వారిని తమకు తెలియకుండా మరోదారికి మళించేవాడు. ఈ రకంగా భక్తిగా విజ్ఞతగా వ్యవహిరిస్తున్నట్లు కనిపిస్తూ, యేసు తమకు బోధించిన దానికి విరుద్ధంగా విషయాల్ని ప్రబోధిస్తూ, ఆయన ఉద్దేశించని భావాన్ని ‘ఆయన మాటలకు జోడిస్తూ అతడు తకిన శిష్యులతో వ్యవహరించసాగాడు. అతడి సూచనలు సలహాలు నిత్యం లోక సంబంధమైన ఆశలకు ప్రేరణ నిచ్చి, తాము పరిశీలించాల్సిన ప్రధానమైన అంశాల నుంచి శిష్యుల గమనాన్ని మళ్లిస్తూ వచ్చాయి. తమలో ఎవరు గొప్పవారు అన్న వివాదాన్ని పురికొలిపింది యూదానే.DATel 809.2

    ధనవంతుడైన యువ అధికారి తన శిష్యుడు కావడానికి యేసు పెట్టిన షరతు యూదాకి నచ్చలేదు. అతడి విషయంలో యేసు తప్పు చేశాడని భావించాడు. ఈ ధనికుడు వంటి వారు విశ్వాసులైతే వారు క్రీస్తు సేవను ఆర్థికంగా ఆదుకుంటారని అతడు అభిప్రాయపడ్డాడు. తనను యేసు సలహాదారుగా తీసుకుని ఉంటే తన చిన్న సంఘం వృద్ధి చెందడానికి తాను ఎన్నో ప్రణాళికలు రూపొందించగలుగుతానని యూదా తలపోసుకున్నాడు. తన నియమాలు పద్దతులు క్రీస్తు పద్ధతులకన్నా కొద్దిపాటి భిన్నత గలవేగాని క్రీస్తుకన్నా తానే విజ్ఞత గలవాణ్ని అని యూదా భావించాడు.DATel 810.1

    క్రీస్తు తన శిష్యులికి బోధించిన ప్రతీ విషయంలోనూ యూదా ఏకీభవించని అంశం ఏదో ఉండేది. దాన్ని మనసులో వ్యతిరేకించేవాడు. అతడి ప్రభావం కింద విద్రోహపు పులిసిన పిండి తన పనిని అది చురుకుగా చేస్తున్నది. దీనంతటికి అసలు కారణాన్ని శిష్యులు గ్రహించలేదు. కాని సాతాను తన గుణగణాల్ని యూదాకి అందిస్తున్నాడని ఆ రీతిగా తక్కిన శిష్యుల్ని ప్రభావితం చెయ్యడానికి మార్గాన్ని తెరుస్తోన్నాడని యేసు గ్రహించాడు. అప్పగింతకు ఒక సంవత్సరం ముందు యేసు ఇలా అన్నాడు, “నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను” యోహా 6: 70.DATel 810.2

    అయినా యూదా బాహాటంగా వ్యతిరేకించలేదు, రక్షకుని బోధనల్ని ప్రశ్నిస్తున్నట్లు కనిపించలేదు. సీమోను గృహంలో జరిగిన విందు వరకూ బహిర్గతంగా సణగడం కూడా చెయ్యలేదు. మరియ రక్షకుని పాదాల్ని అభిషేకించినప్పుడు యూదా తన దురాశా ప్రవృత్తిని బయట పెట్టుకున్నాడు. యేసు నుంచి వచ్చిన గద్దింపు అతడి స్వభావాన్ని చేదు చిరకగా మార్చింది. దెబ్బతిన్న ఆత్మాభిమానం, ప్రతీకారేచ్ఛ అడ్డుగోడల్ని కూల్చివేసింది. దీర్ఘకాలంగా తనలో ఉన్న దురాశ అతణ్ని తన అదుపులో ఉంచింది. దుర్మారం మూలాన్ని ప్రతిఘటించి జయించకపోతే అది సాతాను శోదనలికి ప్రతిస్పందిస్తుంది. ఆత్మ అతడి చిత్తానికి బానిస అవుతుంది.DATel 810.3

    కాగా యూదా పూర్తిగా కఠిన హృదయుడు కాలేదు. రక్షకుణ్ని అప్పగించడానికి రెండుసార్లు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ పశ్చత్తాపానికి ఇంకా అవకాశం ఉంది. పస్కారాత్రి భోజనం వద్ద ద్రోహి మనుసులోని ఉద్దేశాన్ని బయట పెట్టడం ద్వారా యేసు తన దైవత్వాన్ని నిరూపించుకున్నాడు. శిష్యులికి చేసిన పరిచర్యలో ఆయన యూదాను కూడా చేర్చాడు. అయినా ప్రేమ చేసిన చివరి విజ్ఞాపన నిరర్థకమయ్యింది. అతడు దాన్ని పట్టించుకోలేదు. అప్పుడు యూదాను గూర్చిన నిర్ణయం జరిగింది. యేసు కడిగిన పాదాలు ఆయన్ని అప్పగించే పనికి వడివడిగా కదిలాయి.DATel 811.1

    యేసుని సిలువవేయాల్సి ఉంటే ఆ ఘటన సంభవించాలి. రక్షకుణ్ని అప్పగించే తన క్రియ ఫలితాన్ని మార్చలేదు. క్రీస్తు జీవించాల్సి ఉంటే ఆయన తన్నుతాను కాపాపడుకోడానికి తన క్రియ ఒత్తిడి చేస్తుంది. ఇది అతడి ఆలోచనాధోరణి. అన్ని సందర్భాల్లోను యూదా తన మోసం ద్వారా లబ్దిపొందుతూ వచ్చాడు. తన ప్రభువుని అప్పగించడంలో తాను తెలివిగా బేరసారాలు నిభాయించగలిగానని సంతోషపడ్డాడు.DATel 811.2

    తనను బంధించటానికి క్రీస్తు ఒప్పుకోడని యూదా దృఢంగా నమ్మాడు. తన్ను అప్పగించడంలో ఆయనకి ఒక పాఠం నేర్పించాలన్నది యూదా ఉద్దేశం. రక్షకుడు ఇకనుంచి తనను మర్యాదగా చూడడానికి జాగ్రత్త పడడానికి చిన్న పాత్ర నటించాలని ఉద్దేశించాడు. అంతేగాని తాను క్రీస్తుని మరణానికి అప్పగిస్తున్నానని అతడు గ్రహించలేదు. రక్షకుడు ఉపమాన రూపంలో బోధిస్తున్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఆయన వాడిన సాదృశ్యాలు విని ఎంత తరచుగా తమ్మును తాము మర్చిపోయేవారు! వారు ఎంత తరచుగా తమపైకి తామే తీర్పులు తెచ్చుకునేవారు! తరచు తమ హృదయాలికి సత్యం ప్రకటితమైనప్పుడు వారు ఆగ్రహంతో నిండి ఆయన మీద విసరడానికి రాళ్లు తీసుకునేవారు. అలాటి సందర్భాల్లో ఆయన ప్రతీసారి తప్పించుకొని వెళ్లిపోయేవాడు. ఆయన ఎన్నో ఉచ్చుల నుంచి తప్పించుకున్నాడు గనుక ఇప్పుడూ తనను బంధించనియ్యడు అని యూదా ఊహించాడు.DATel 811.3

    యూదా ఆ విషయాన్ని పరీక్షకు పెట్టాలనుకున్నాడు. యేసు నిజంగా మెస్సీయా అయితే ఏ ప్రజలకి ఆయన ఎంతో ఉపకారం చేశాడో వారు ఆయన పక్కకు వచ్చి ఆయన్ని రాజుగా ప్రకటిస్తారు. ఇప్పుడు అనిశ్చితంగా ఉన్న అనేక మనసుల్ని అది నిరంతరంగా స్థిరపర్చుతుంది. రాజుని దావీదు సింహాసనం మిద నెలకొల్పిన గౌరవం యూదాకి దక్కుతుంది. నూతన రాజ్యంలో తనకు క్రీస్తు పక్క ప్రథమ స్థానాన్ని ఈ క్రియ సంపాదించి పెడుతుంది.DATel 812.1

    ఈ అబద్ద శిష్యుడు యేసుని అప్పగించడంలో తన పాత్రను నిర్వహించాడు. “నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడి” (మత్త. 26 :48) అని మూక నాయకులతో తోటలో అన్నప్పుడు, క్రీస్తు వారి చేతుల్లో నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడని పూర్తిగా నమ్మాడు. ఆ తర్వాత వారు తనను నిందిస్తే, గట్టిగా పట్టుకోమని నేను మీకు చెప్పలేదా అనవచ్చుననుకున్నాడు.DATel 812.2

    తన మాటల ప్రకారం వారు క్రీస్తుని గట్టిగా బంధించడం యూదా చూశాడు. తనను వారు తీసకుపోవడాన్ని ఆయన అనుమతించడం చూసి విస్మయం చెందాడు. ఆందోళన చెందుతూ ఆ తోటలోనుంచి ఆయన వెంట నడిచి యూదు అధికారుల ముందు విచారణ జరగాల్సిన తావు వరకూ వెళ్లాడు. ఆయన అటుఇటు కదిలినప్పుడల్లా దేవుని కుమారుడుగా వారి ముందు ప్రత్యక్షమై వారి కుట్రల్ని అధికారాన్ని వమ్ము చేసి వారిని ఆశ్చర్యంలో ముంచుతాడని కనిపెట్టాడు. కాని గంటలు గడిచిపోతున్నాయి. యేసు తనకు జరుగుతున్న అఘాయిత్యం అంతటిని భరిస్తుండడం చూచసినప్పుడు తన ప్రభువుని మరణానికి అప్పగించానన్న భయం అతణ్ని ఆవరించింది.DATel 812.3

    విచారణ సమాప్తానికి వస్తున్న తరుణంలో యూదా అపరాధ భారంతో కుంగిపోతున్న, తన మనసాక్షిని ఇక భరించలోకపోయాడు. ఆయన నిరపరాధి ఓ కయప, ఆయన్ని విడిచి పెట్టు అంటూ అర్థాంతరంగా బొంగురుపోయిన ఒక స్వరం ఆ గది అంతా వినిపించింది. అందరూ భయంతో గుండెలు చేతపట్టుకున్నారు.DATel 812.4

    భయంతో నిండిన సభమధ్య నుంచి యూదా త్వరత్వరగా వెళ్తున్నాడు. అతడి ముఖంలో రక్తంలేదు. అలసిపోయినట్లు కనిపిస్తోన్నాడు. నొసలు చెమటతో నిండి ఉంది. న్యాయ సభాపతి పీఠం వద్దకు వడిగా నడిచివెళ్లి, ప్రధానయాజకుడి ముందు వెండినాణేల్ని పడేశాడు. తన రక్షకుణ్ని అప్పగించినందుకు యాజకులిచ్చిన ద్రవ్యం అది. కయప వస్త్రం పట్టుకుని యేసు మరణించడానికి తగిన నేరమేమి చెయ్యలేదని ఆయను విడిచిపెట్టాల్సిందని వేడుకున్నాడు. కయప అతణ్ని దులపరించికున్నాడు గాని తబ్బిబ్బుపడ్డాడు. ఏం చెప్పాలో తెలియలేదు. యాజకుల వంచన బట్టబయలయ్యింది. తన ప్రభుని అప్పగించడానికి ఆ శిష్యుణ్ని వారు లంచంతో ప్రలోభపెట్టారని తేలిపోయింది.DATel 812.5

    “నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితిని” అని యూదా మళ్లీ బిగ్గరగా చెప్పాడు. ప్రధాన యాజకుడు తమాయించుకుని “దానితో మాకేమి? నీవే చూచుకొనుము” అన్నాడు. మత్త. 27:4. యాజకులు యూదాని ఉపయోగించుకున్నారు గాని అతడి నైచ్యాన్ని అసహ్యించుకున్నారు. అతడు క్షమాపణ వేడుకుంటూ వెళ్లినప్పుడు అతణ్ని తృణీకరించారు.DATel 813.1

    యూదా ఇప్పుడు క్రీస్తు పాదాలపై పడి, ఆయన్ను దైవకుమారుడుగా గుర్తించి, తన్నుతాను విడిపించుకోవలసిందిగా వేడుకున్నాడు. యేసు తన్ను పట్టిచ్చిన యూదాని నిందించలేదు. ఆయనకు తెలుసు యూదా పశ్చాత్తపపడలేదని. అతడి ఒప్పుకోలు నిరసన ఒత్తిడి వలన తీర్పు ఉన్నదన్న గుర్తింపు ఒత్తిడి వలన అపరాధ హృదయం నుంచి వచ్చింది. కాని కళంకంలేని దైవ కుమారుణ్ని అప్పగించినందుకు హృదయం పగిలేటంతగా కలిగే దుః ఖం నుంచి వచ్చింది కాదు. అయినా క్రీస్తు అతణ్ని నిందించలేదు. యూదావంక దయగా చూసి, ఈ గడియకోసమే నేను లోకంలోకి వచ్చాను అన్నాడు.DATel 813.2

    తీర్పు గదిలో ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్న గుసగుసలు వినిపించాయి. తనను అప్పగించిన వాడిపట్ల క్రీస్తు చూపించిన సహనాన్ని చూసి అందరూ విస్మయం చెందారు. ఈయన మానవుడికన్నా అధికుడు అన్న విశ్వాసం మళ్లీ ఆసభలోని వారందరికీ కలిగింది. కాని ఈయన దేవుని కుమారుడైతే తన బంధాల్ని విదల్చుకుని తన ప్రత్యర్థులపై ఎందుకు విజయం సాధించడు? అని ప్రశ్నించారు.DATel 813.3

    తన మనవి నిరర్థకమని యూదా గుర్తించాడు. చాలా ఆలస్యం! చాలా ఆలస్యం! అంటూ ఆ గదిలో నుంచి బయటికి వెళ్లిపోయాడు. యేసును సిలువ వెయ్యబడడం చూడడానికి బతికి ఉండలేననుకున్నాడు. నిరాశతో బయటకి వెళ్లి ఉరిపోసుకుని మరణించాడు.DATel 814.1

    అనంతరం అదేరోజు పిలాతు తీర్పుగదినుంచి కల్వరికి వెళ్లే మార్గంలో, ఆయన్ని సిలువ వేసే స్థలానికి తీసుకువెళ్తున్న దుష్టుల ఎగతాళి కేకలకు అంతరాయం ఏర్పడింది. వారు ఒక విశ్రాంతి స్థలం దాటుతుండగా, ఒక ఎండిపోయిన చెట్టు మొదలు వద్ద యూదా శరీరాన్ని చూశారు. అది చాలా జుగుస్సాకర దృశ్యం. చెట్టుకి అతడు పోసుకున్న ఉరితాడు తెగి అతడి శరీరం కిందపడింది. ఇప్పుడు దాన్ని కుక్కలు తింటున్నాయి. మిగిలిన అవశేషాల్ని వెంటనే పూడ్చిపెట్టారు. ఆ అల్లరిమూకలో ఎక్కువ ఎగతాళి లేదు. చాలామంది ముఖాలు పాలిపోయాయి. అవి వారిలో చెలరేగుతున్న ఆలోచనల జాడను తెలుపుతున్నాయి. యేసు (రక్త) నేరానికి పాల్పడ్డవారికి శిక్ష అప్పుడే ప్రారంభమయ్యింది.DATel 814.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents