Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    77—పిలాతు న్యాయస్థానంలో

    రోమా గవర్నరు పిలాతు న్యాయస్థానంలో క్రీస్తు ఖైదీగా సంకెళ్లతో నిలబడి ఉన్నాడు. ఆయన చుట్టూ కావలికాసే సైనికులున్నారు. తీర్పు హాలు ప్రేక్షకులతో నిండుతోంది. గుమ్మం వెలపల సన్ హెడ్రిన్ న్యాయాధికారులు, యాజకులు, అధికారులు, పెద్దలు, ప్రజల సమూహం ఉన్నారు.DATel 815.1

    యేసును నేరస్తుడుగా తీర్చి శిక్ష విధించిన తర్వాత సన్ హెడ్రిన్ సభ్యులు తమ తీర్పును ధ్రువపర్చుకుని దాని అమలును ఖరారు చేసుకోడానికి పిలాతు వద్దకు వచ్చారు. అయితే ఈ యూదు నాయకులు రోమా న్యాయస్థానంలో ప్రవేశించరు. వారి ఆచార ధర్మశాస్త్రం ప్రకారం ఆ పనిచేయడం ద్వారా అపవిత్రులవుతారు. కనుక వారిని పస్కాలో పాల్గొనేందుకు అనుమతించేవారు కాదు. తమ హృదయాల్ని ద్వేషం అపవిత్రపర్చిందని వారు తమ గుడ్డితనం వల్ల గుర్తించడంలేదు. క్రీస్తే నిజమైన పస్కాపశువని, వారు ఆయన్ని విసర్జించారు గనుక ఆ గొప్ప పండుగ తమకు అర్థరహితమయ్యిందని వారు గ్రహించలేదు.DATel 815.2

    రక్షకుణ్ని తీర్పు హాల్లోకి తీసుకువచ్చినప్పుడు పిలాతు ఆయనపట్ల సుహృద్భావంతో లేనట్లు కనిపించాడు. ఆ రోమా గవర్నురుని పడకగది నుంచి పిలిచారు. అతడు తన పనిని త్వరగా ముగించుకుని బయటపడడానికి ఆరాటపడున్నాడు. ఖైదీతో న్యాయపరమైన కాఠిన్యంతో వ్యవహరించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. కఠిన ముఖవైఖరి పెట్టి, తాను పరీక్షించడానికి ఇంత పొద్దున్నే ఎలాంటి నేరస్తుణ్ని తీసుకు వచ్చారో చూడడానికి అతడు క్రీస్తు పక్కకు తిరిగాడు. విచారణ జరిపి త్వరగా శిక్షపడేటట్లు చూడాలని యూదు అధికారులు కోరుతున్న కేసు ఈయనదని అతడు గ్రహించాడు.DATel 815.3

    యేసుకి భాద్యత వహిస్తున్న మనుషుల వంక అతడు చూశాడు. ఆ తర్వాత అతడు క్రీస్తు వంక పరీక్షగా చూశాడు. అతడు అన్ని రకాల నేరగాళ్లతో వ్యవహరించాలి. కాని అలాంటి మంచితనం అలాంటి ఉదాత్తత ఉట్టిపడే మనిషిని తన ముందుకు తీసుకురావడం మునుపెన్నడూ జరగలేదు. ఆయన ముఖంలో దోషిత్వ సూచనలు లేవు. భయంలేదు. చొరవగాని ధిక్కారవైఖరి గాని లేవు. ప్రశాంతమైన, గౌరవనీయుడైన ఆ వ్యక్తిలో నేరస్తుడి సూచనలు కాక పరలోక సంతకం గల వ్యక్తిని అతడు చూశాడు.DATel 816.1

    క్రీస్తు ముఖ వైఖరి పిలాతుని ఆకర్షించింది. అతడిలోని మంచి స్వభావం మేల్కొంది. అతడు యేసును గురించి ఆయన చేసిన అద్భుతాల గురించి విన్నాడు. రోగుల్ని స్వస్తపర్చి మృతుల్ని బతికించిన ఈ గలిలయ ప్రవక్తను గురించి తన భార్య చెప్పగా అతడు కొంత విన్నాడు. ఇప్పుడు ఇది ఒక కలగా పిలాతు మనసులోకి వచ్చింది. చాలా మూలాల నుంచి తాను విన్న పుకార్లును గుర్తు చేసుకున్నాడు. ఖైదీకి వ్యతిరేకంగా తమకున్న ఆరోపణను వెల్లడించాల్సిందిగా యూదుల్ని డిమాండు చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు.DATel 816.2

    ఈ మనుషుడు ఎవరు? ఇతణ్ని మీరు ఎందుకు తీసుకువచ్చారు? ఈయనపై మీరు మోపుతున్న నేరమేంటి? అని వారిని నిగ్గదీశాడు. యూదులు ఆందోళన చెందారు. క్రీస్తుపై తాము ఆరోపిస్తున్న నేరాల్ని నిరూపించడం సాధ్యంకాదు గనుక వారు బహిరంగ విచారణ కోరలేదు. ఆయన నజరేయుడైన యేసు అన్న పేరుగల మోసగాడు అని సమాధానం చెప్పారు.DATel 816.3

    “ఈ మనుష్యుని మిద మీరు ఏ నేరము మోపుచున్నారు?” అని పిలాతు మళ్లీ ప్రశ్నించాడు. తమ కోపాన్ని వ్యక్తం చేసే ఈ మాటల్లో వారు బదులు పలికారు, “వీడు దుర్మార్గుడు కాని యెడల వీనిని నీకు అప్పగించి యుండము.” స హెడ్రిన్ సభ్యులు దేశ ప్రధమ పౌరులు అయిన వ్యక్తులు ఒకణ్ని మరణారుడుగా పరిగణించినప్పుడు అతడిపై నేరమేంటని ప్రశ్నించాల్సిన అవసరముందా? అన్నారు. పిలాతుకి తమ ప్రాముఖ్యాన్ని వెల్లడిచేసుకుని, ఆ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా తమ మనవిని అంగీకరింపజెయ్యాలని వారు నిరీక్షించారు. తమ తీర్పుపై ఆమోదముద్ర వేయించాలని వారు తాపత్రయ పడున్నారు. ఎందుకంటే క్రీస్తు అద్భుత కార్యాలు చూసిన ప్రజలు తాము చెప్పే వాటికి భిన్నమైన విషయాలు చెబుతారని వారికి బాగా తెలుసు.DATel 816.4

    బలహీనుడు స్థిరతలేనివాడు అయిన పిలాతు ద్వారా తమ పథకాల్ని నిరాటంకంగా అమలు పర్చుకోవచ్చని యాజకులు భావించారు. ఇంతకుముందు పిలాతు మరణదండనలకు ఇట్టే ఆమోదం తెలిపాడు. ఆ వ్యక్తులు కూడా మరణార్హులు కారు. అతడి దృష్టిలో ఖైదీ జీవితం ఏమంత ముఖ్యమైనది కాదు. వ్యక్తి నిరపరాధా అపరాధా అన్నది అతడికి ప్రధానంశం కాదు. ఆయన చెప్పేది వినకుండా పిలాతు క్రీస్తుకి మరణాన్ని ఖరారు చేస్తాడని యూదులు నిరీక్షించారు. తమ గొప్పజాతీయ పండుగ సమయంలో ఒక ప్రత్యేక వరంగా యూదులు తమ మనవి మంజూరుని కోరారు.DATel 817.1

    పిలాతు అందుకు అంగీకరించకుండా ఉండడానికి ఈ ఖైదీలో ఏదో ఉన్నది. యాజకుల ఉద్దేశాన్ని అతడు గ్రహించాడు. కొద్దికాలం క్రితం మరణించి నాలుగు రోజులు సమాధిలో ఉన్న లాజరుని యేసు లేపడం గుర్తుకు వచ్చింది. కనుక ఆ మరణ దండనపై ఆమోద ముద్ర వేయకముందు యేసుపై మోపిన నేరమేమిటో తెలుసుకోవాలని పిలాతు కోరాడు.DATel 817.2

    ఈ తీర్పే సరిపోతే మరి ఈ ఖైదీని నా వద్దకు ఎందుకు తెచ్చారు? “మీరతని తీసికొనిపోయి నా ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పుతీర్చుడి” అన్నాడు. ఈ రకంగా ఒత్తిడికి లోనైన యాజకులు ఆయనకు తీర్పుతీర్చామని దాని అమలుకు తన ఆమోదం అవసరమని పిలాతుకి విన్నవించారు. మీరిచ్చిన తీర్పేంటి? అని పిలాతు అడుగగా మరణ దండన అని వారు ఉత్తరమిచ్చారు. కాని ఆ మరణ దండన మేము విధించడం చట్టబద్ధంకాదని అన్నారు. క్రీస్తు అపరాధిత్వానికి తమ మాటను అంగీకరించి శిక్ష అమలుకి ఆమోదించాల్సిందిగా వినతి చేశారు. దాని పర్యవసానానికి తాము బాధ్యత వహిస్తామని భరోసా ఇచ్చారు.DATel 817.3

    పిలాతు న్యాయబుద్ధిగాని మనస్సాక్షిగాని లేని న్యాయాధిపతి. కాని నైతికంగా బలహీనుడైనా ఈ మనవిని తోసిపుచ్చాడు. యేసుపై నేరారోపణ జరిగే వరకు ఆయనకు శిక్షను విధించనని అతడు కరాఖండిగా చెప్పాడు.DATel 817.4

    యాజకులు సందిగ్ధంలో పడ్డారు. తమ మోసాన్ని బందోబస్తుగా దాచి ఉంచాలని వారు నిర్ధారించారు. క్రీస్తుని మతపరమైన కారణాల పై బంధించారన్న అభిప్రాయం కలగకుండా చూసుకోవాలి. దీన్ని ఒక కారణంగా చెబితే వారి చర్యలు పిలాతుకి ఆమోదయోగ్యం కావు. కనుక క్రీస్తు సామాన్య చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు చిత్రించాలి. అప్పుడు ఆయన్ని రాజకీయ నేరస్తుడుగా విచారించవచ్చునన్నది వారి ఎత్తుగడ. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూదుల మధ్య అల్లర్లు సంఘర్షణలు నిత్యం జరిగేవి. ఈ తిరుగుబాట్లను రోమియులు కఠిన చర్యలతో అణచివేసేపారు. తిరుగుబాటుకు దారితీసే పరిస్థితుల్ని కని పెట్టి వాటిని నిర్భయంగా అణచివెయ్యడానికి వారు నిత్యం జాగ్రత్తగా ఉండేవారు.DATel 818.1

    దీనికి కొన్ని రోజులు ముందు క్రీస్తుని ఉచ్చులో ఇరికించడానికి, “మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా?” అని ప్రశ్నించారు. అయితే క్రీస్తు వారి మోసకారితనాన్ని బట్టబయలు చేశాడు. అక్కడున్న రోమీయులు “కైసరువి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుడి” అంటూ ఆయనిచ్చిన సమాధానంతో కుట్రదారుని వైఫల్యాన్ని ఆశాభంగాన్ని గుర్తించారు. (లూకా 20:22-25)DATel 818.2

    ఈ సందర్భంలో క్రీస్తు తాము అనుకుంటున్నవిధంగా బోధించి ఉంటాడని భావించారు. తమకు ఏర్పడ్డ సంకట పరిస్థితిలో తప్పుడు సాక్షుల సాయాన్ని ఆశ్రయించారు. “ఇతడు మా జనులను తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్య వద్దనియు, తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేమువింటిమి” అని వారన్నారు. ఇవి ఆధారాలు లేని మూడు ఆరోపణలు. యాజకులుకి ఇది తెలుసు. కాని తమ లక్ష్యం సాధించడానికి అసత్య ప్రమాణం చెయ్యడానికి కూడా వారు సిద్ధమే.DATel 818.3

    పిలాతు వారి దురుద్దేశాన్ని కనిపెట్టాడు. క్రీస్తు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపన్నాడని నమ్మలేదు. ఆయన సాత్వికం దీన స్వభావం వారు మోపిన నేరంతో అన్వయించడంలేదు. యూదు ఉన్నతాధికారుల దారికి అడ్డంగా ఉన్న నిరపరాధి అయిన వ్యక్తిని నాశనం చెయ్యడానికి పెద్దకుట్ర జరిగిందని పిలాతు నమ్మాడు. క్రీస్తు పక్కకు తిరిగి, “నీవు యూదుల రాజువా?” అని ప్రశ్నించగా “నీవన్నట్టే” అని రక్షకుడు” బదులు పలికాడు. ఆయన మాట్లాడుతుండగా ఆయన ముఖం సూర్యకిరణం పడి ప్రకాశించినట్లు ప్రకాశించింది.DATel 818.4

    వారు ఆ సమాధానం విన్నప్పుడు క్రీస్తు తనపై మోపబడ్డ నేరాన్ని అంగీకరించాడని దానికి పిలాతు సాక్షిగా ఉండాలని కయప అతడితో ఉన్నవారు కోరారు. యాజకులు, శాస్త్రులు, అధికారులు గట్టిగా కేకలు వేస్తూ ఆయనకి మరణిశిక్ష విధించాల్సిందిగా డిమాండు చేశారు. అంతట జనసమూహం కూడా కేకలు వెయ్యడంతో చెవులు బద్దలయ్యేంత గగ్గోలు పుట్టింది. పిలాతుకి ఏమీ పాలుపోలేదు. తన్ను నిందిస్తోన్న వారికి క్రీస్తు ఎలాంటి జవాబు ఇవ్వకపోవడంతో ఆయనతో పిలాతు ఇలా అన్నాడు, “నీవు ఉత్తరమేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసుమరి ఏ ఉత్తరమును చెప్పలేదు.”DATel 819.1

    పిలాతు వెనక నిలిచి, న్యాయస్థానం అంతటికి కనిపిస్తూ, క్రీస్తు వారి దుర్భాషలు విన్నాడు. కాని వారు చేస్తున్న తప్పుడు ఆరోపణల విషయం ఆయన ఒక్కమాటకూడా ఆనలేదు. ఆయన ప్రవర్తన తన నిరపరాధిత్వాన్ని చాటి చెప్పింది. తన చుట్టూ తెరలు తెరలుగా రేగుతున్న అగ్రహ తరంగాల్లో ఆయన నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. కల్లోలమైన సముద్రంలో ఎత్తుగా లేస్తున్న తరంగాల్లాగ పెల్లుబుకుతోన్న ఆగ్రహం ఆయన చుట్టు విరుచుకుపడింది. కాని అది ఆయన్ని తాకలేదు. ఆయన మౌనంగా నిలబడి ఉన్నాడు. ఆ మౌనం గట్టిగా వినిపించే మౌనం. అది లోపలి మనిషి నుంచి బయట మనిషికి ప్రసరించే వెలుగులాంటిది.DATel 819.2

    క్రీస్తు వ్యవహరించిన తీరుకు పిలాతు ఆశ్చర్యపడ్డాడు. ఈయన ఈ విషయాల్ని పట్టించుకోకపోవడం ప్రాణాన్ని రక్షించుకోవాలన్న ఆశ తనకు లేనందుకా? అని పిలాతు తన్నుతాను ప్రశ్నించుకున్నాడు. అవమానాన్ని ఎగతాళిని ప్రతిఘటన లేకుండా భరిస్తోన్న యేసుని చూసినప్పుడు ఆయన గగ్గోలు పెడున్న యాజకులంత ఆనీతిమంతుడు అన్యాయస్తుడు అయి ఉండడని అతడు అనుకున్నాడు. ఆయన్నుంచి సత్యం రాబట్టడానికి, అలజడికి దిగిన మూకనుంచి తప్పించుకోడానికి పిలాతు యేసుని పక్కకు తీసుకువెళ్లి, “యూదుల రాజవునీవేనా?” అని మళ్లీ ప్రశ్నించాడు.DATel 819.3

    క్రీస్తు ఈ ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం చెప్పలేదు. పరిశుద్దాత్మ పిలాతులో పనిచేస్తున్నాడని క్రీస్తుకు తెలుసు. కనుక తన విశ్వాసాన్ని అంగీకరించడానికి క్రీస్తు అతడికి తరుణం ఇచ్చాడు. “నీ అంతట నీవే యీ మాట అనుచున్నావా?” అని యేసు అడిగాడు. అనగా అది యూదుల ఆరోపణా లేక సత్యాన్ని క్రీస్తు నుంచి తెలుసుకోడానికి పిలాతు వేసిన ప్రశ్నా? పిలాతు క్రీస్తు ఉద్దేశాన్ని గ్రహించాడు. అయితే అతడిలో అహంభావం తలెత్తింది. అతడు ఇలా అన్నాడు, “నేను యూదుడనాయేమి? నీ స్వజనమును ప్రధాన యాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివి?”DATel 820.1

    పిలాతుకు వచ్చిన స్వర్ణావకాశం దాటిపోయింది. అయినా యేసు అదనపు వెలుగు అతనికివ్వకుండా విడిచిపెట్టలేదు. పిలాతు ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం చెప్పకపోయినా, ఆయన తన కర్తవ్యాన్ని స్పష్టంగా చెప్పాడు. తాను లోక రాజ్యాన్ని ఆకాంక్షించడం లేదన్న స్పష్టమైన అవగాహనను యేసు పిలాతుకి ఇచ్చాడు.DATel 820.2

    ఆయన ఇలా అన్నాడు, “నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు - నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు - నీవన్నట్టు నేను రాజునే; సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధి అయిన ప్రతివాడును నా మాట వినవలెను.”DATel 820.3

    వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవారికి మర్మాల్ని తెరచే తాళపు చెవి తన వాక్యమేనని క్రీస్తు ధ్రువపర్చాడు. దానికి ఆజ్ఞాపించే శక్తి ఉన్నది. ఆయన సత్యరాజ్య విస్తరణ రహస్యం ఇదే. సత్యాన్ని స్వీకరించి అనుసరించడం ద్వారా మాత్రమే తన భ్రష్ట స్వభావాన్ని పునర్మించుకోవడం సాధ్యపడుందని పిలాతు గ్రహించాలని ఆయన ఆకాంక్షించాడు.DATel 820.4

    పిలాతు సత్యాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షించాడు. అతడి మనసు గలిచిలి అయ్యింది. అతడు రక్షకుని మాటల్ని గ్రహించాడు. వాస్తవంగా అది ఏమిటో దాన్ని ఎలా పొందగలనో తెలుసుకోవాలని అతడి హృదయం తపించింది. పిలాతు “సత్యమనగా ఏమిటి?” అని ప్రశ్నించాడు. కాని సమాధానం కోసం ఆగలేదు. బయట జరుగుతున్న అల్లరి అతడి సముఖాన్ని కోరింది. యాజకులు తక్షణ చర్యను కోరుతున్నారు. బయట ఉన్న యూదుల వద్దకు వెళ్లి “అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు.” అన్నాడు.DATel 821.1

    రక్షకునిపై నిందమోపుతున్న ఇశ్రాయేలు పెద్దల మోసపూరిత, అసత్య వర్తనకు ఒక అన్యమత న్యాయాధి కారి పలికిన ఈ మాటలు చెంపపెట్టులాగున్నాయి. పిలాతు పలికిన ఈ మాటలు విన్నప్పుడు యాజకులు పెద్దల ఆశాభంగానికి ఆక్రోశానికి హద్దులు లేవు. వారు ఎంతోకాలం నుంచి కుట్రలుపన్ని ఈ అవకాశం ఎదురుచూశారు! యేసు విడుదలయ్యే అవకాశం కనిపించగా వారు ఆయన మీద పడి చీల్చి వేసేటట్లు కనిపించారు. వారు పిలాతును దూషించారు. అతణ్ని రోమా ప్రభుత్వం చేత అభిశంసింపజేస్తామని బెదిరించారు. కైసరుకి శత్రువుగా తయారైన యేసుని శిక్షించడానికి నిరాకరించాడంటూ అతణ్ని విమర్శించారు.DATel 821.2

    ఇప్పుడు కోపంతో నిండిన స్వరాలు వినిపించాయి. యేసు విద్రోహక ప్రభావం దేశమంతా వ్యాపించిందని ఆరోపించారు. “ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయదేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడు” అని యాజకులు నిందించారు.DATel 821.3

    ఈ సమయంలో క్రీస్తుకి శిక్ష విధించాలని పిలాతుకు లేదు. ద్వేషంతో దురభిమానంతో ఆయనపై నేరాలు మోపారని అతడికి తెలుసు. తన విధి ఏమిటో అతడికి తెలుసు. క్రీస్తుని వెంటనే విడుదల చేయాలని చట్టం డిమాండు చేసింది. అయితే పిలాతు ప్రజల నిరసనకు భయపడ్డాడు. క్రీస్తుని వారికి అప్పగించకపోతే పెద్ద గలాభా జరగవచ్చు. దీన్ని ఎదుర్కోడానికి అతడు భయపడ్డాడు. క్రీస్తు గలిలయవాడని విన్నప్పుడు క్రీస్తుని హేరోదు వద్దకు పంపడానికి తీర్మానించుకున్నాడు. హేరోదు ఆ రాష్ట్ర పరిపాలకుడు. అప్పుడు అతడు యెరూషలేములో ఉన్నాడు. ఈ క్రియవల్ల విచారణ బాధ్యతను తన నుంచి హేరోదుకి మార్పిడి చెయ్యాలని పిలాతు భావించాడు. తనకు హేరోదుకి మధ్య ఉన్న ఒక పాత కక్షను సరిచేసుకోడానికి ఇది మంచి అవకాశమని కూడా అతడు భావించాడు. అది పనిచేసింది కూడా. ఈ ఇద్దరు న్యాయాధికారులు రక్షకుని విచారణ విషయంలో మిత్రులయ్యారు.DATel 821.4

    పిలాతు రక్షకుణ్ని మళ్లీ సైనికులికి అప్పగించాడు. జన సమూహం అపహాస్యం పరాభవం నడుమ రక్షకుణ్ని హేరోదు తీర్పు గదికి తీసుకువెళ్లారు. “హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను.” అతడు రక్షకుణ్ని ఇంతకు ముందు కలవలేదు. “ఆయనను గూర్చి చాల సంగతులువిన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను.” ఈ హేరోదు చేతులే బాప్తిస్మమిచ్చే యోహాను రక్తంతో తడిసి ఉన్నాయి. హేరోదు క్రీస్తును గురించి మొట్టమొదటగా విన్నప్పుడు భయంతో నిండి ఇలా అన్నాడు, “నేను తలగొట్టించిన యోహానే, అతడు మృతులలో నుండి లేచియున్నాడు.” “అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములగుచున్నవి.” మార్కు 6:16, మత్త. 14:2. అయినా హేరోదు క్రీస్తుని చూడాలని ఆశించాడు. ఇప్పుడు ఈ ప్రవక్త ప్రాణం కాపాడడానికి అవకాశం ఉంది. పళ్లెంలో రక్తంకారుతున్న తల జ్ఞాపకాన్ని తుడిచివేయవచ్చునని రాజు నిరీక్షించాడు. అంతేకాదు అతడు తన ఉత్సుకతను తృప్తి పర్చుకోవాలని కూడా భావించాడు. క్రీస్తుకి విడుదల కలిగే అవకాశం లభిస్తే ఆయన ఏది అడిగితే దాన్ని చేస్తానని హేరోదు అన్నాడు.DATel 822.1

    క్రీస్తుతో హేరోదు వద్దకు ఒక పెద్ద యాజకులు పెద్దల గుంపు వెళ్లింది. రక్షకుణ్ని లోనికి తీసుకవెళ్లిన తర్వాత ఈ ఉన్నతాధికారులు ఆయన పై తమ ఆరోపణల్ని వివరిస్తూ ఉత్సాహంగా మాట్లాడారు. వారి ఆరోపణల్ని హేరోదు పట్టించుకోలేదు. క్రీస్తుని ప్రశ్నించాలని అందరినీ నిశ్శబ్దంగా ఉండాల్సిందని ఆజ్ఞాపించాడు. క్రీస్తు సంకెళ్లని విప్పమని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో ఆయనతో కఠినంగా ప్రవర్తించారని అయన శత్రువుల్ని నిందించాడు. లోక విమోచకుని నిర్మలమైన ముఖంలోకి దయగా చూస్తూ ఆ ముఖంలో వివేకాన్ని పవిత్రతను చూశాడు. అవి పగతోను అసూయతోను క్రీస్తుపై మోపిన నేరాలని హేరోదు, పిలాతు గ్రహించారు.DATel 822.2

    హేరోదు క్రీస్తుని ఎన్నో మాటలతో ప్రశ్నించాడు. కాని రక్షకుడు మౌనంగా నిలబడి ఉన్నాడు. గాజు రోగపీడితుల్ని వికలాంగుల్ని రప్పించమని ఆజ్ఞ ఇవ్వగా వారు వచ్చారు. వారిని బాగుచేని తన్నుతాను నిరూపించుకోవలసిందిగా హేరోదు క్రీస్తుని ఆదేశించాడు. నీవు రోగుల్ని స్వస్తపర్చగలవని అంతా చెప్పుకుంటున్నారు అని హేరోదు అన్నాడు. నీ ప్రఖ్యాతి అబద్ధం కాకూడదని నేను నిరీక్షిస్తున్నాను. క్రీస్తు స్పందించలేదు. హేరోదు ఇంకా విజ్ఞప్తి చేశాడు. నీవు పరులకోసం సూచక క్రియలు చేయగలిగితే ఇప్పుడు నీ మేలుకోసం ఒక సూచక క్రియ చెయ్యి అది నీకు ఎంతో లాభదాయకమౌతుంది అన్నాడు. పుకార్లు చెబుతున్నట్లు నీకు ప్రభావం ఉందని చూపించడానికి ఒక అద్భుతం చేసి మాకు చూపించమంటూ విజ్ఞప్తి చేశాడు. కాని క్రీస్తు వినగలిగి చూడలేనివాడిగా ఉన్నాడు. దైవ కుమారుడు మానవస్వభావం ధరించాడు. అలాంటి పరిస్థితుల్లో మానవుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ఆయన ప్రవర్తించాలి. కనుక అట్టి పరిస్థితుల్లో మనుషుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఆయనా ప్రవర్తించాలే గాని బాధను, సిగ్గును తప్పించుకోడానికి సూచక క్రియ చెయ్యకూడదు.DATel 822.3

    తన ముందు ఒక సూచక క్రియ చేసినట్లయితే తనను విడిచి పెడ్తానని హేరోదు క్రీస్తుకి వాగ్దానం చేశాడు. క్రీస్తు ప్రత్యర్థులు ఆయన చేసిన అద్భుతాల్ని ప్రత్యక్షంగా చూశారు. మృతుల్ని సమాధిలోనుంచి లేవమని ఆయన ఆజ్ఞాపించడం వారు విన్నాక ఆయన స్వరాన్ని విని మృతులు సమాధినుంచి బయటికి రావడం వారు చూశారు. క్రీస్తు ఇప్పుడు ఒక సూచకక్రియ చేస్తాడేమోనని వారిలో గుబులు పుట్టింది. వారు ఎక్కువగా భయపడింది ఆయన శక్తి ప్రదర్శనకే. ఆ ప్రదర్శన వారి పథకాలకు మాత్రమేకాదు తమ ప్రాణాలకే అంతం పలకవచ్చు. యాజకులు అధికారులు ఆయనపై తమ ఆరోపణల్ని మళ్లీ ఏకరువు పెట్టారు. ఇతడు దేశద్రోహి, దేవదూషకుడు అంటూ గొంతెత్తి అరిచారు. అతడు బయెల్తబూ శక్తి ద్వారా తన సూచక క్రియలు చేస్తున్నాడు, అతడు దయ్యాల రాజు అని అరిచారు. తీర్పు గది గంధరగోళంతో నిండింది. కొందరు ఒకటంటే మరికొందరు వేరొకటి అంటున్నారు.DATel 823.1

    బాప్తిస్మమిచ్చే యోహాను తలను హేరోదియ కోరినప్పుడు హేరోదు భయంతో వణికాడు. అయితే ఇప్పుడు అతడి మనస్సాక్షి అంత చురుకుగా స్పందించడంలేదు. తన భయంకర చర్యకు అతడు కొంతకాలం పశ్చాత్తాపపడ్డాడు. కాని తన అనైతిక, విశృంఖల జీవితం వల్ల అతడి నైతిక విచక్షణ క్షీణించింది. ఇప్పుడు అతడి హృదయం ఎంత కఠినమయ్యిందంటే తనను మందలించినందుకు యోహాను తలకొట్టించానని అతిశయంగా చెప్పుకుంటున్నాడు. అతడు ఇప్పుడు ఆయన్ని విడిపించడానికిగాని ఆయనకి మరణ శిక్ష విధించడానికిగాని తనకు శక్తి ఉన్నదంటూ యేసుని బెదిరించాడు. కాని అతడి పేలాపనలో ఒక్కమాట కూడా యేసు విన్న సూచనలు లేవు.DATel 823.2

    ఆయన మౌనం దాల్చడం హేరోదుకి కోపం పుట్టించింది. తన అధికారాన్ని లెక్కచేయ్యనట్లు అది సూచించింది. వ్యర్ధుడు డాంబికుడు అయిన రాజుని ఆరకంగా నిర్లక్ష్యం చెయ్యడం కంటే బహిరంగంగా మందలించడం అంత బాధాకరంగా ఉండేది కాదు. అతడు కోపంగా మళ్లీ బెదిరించాడు. క్రీస్తు నిశ్చలంగా మౌనంగా నిలిచి ఉన్నాడు.DATel 824.1

    ఈ లోకంలో క్రీస్తు కర్తవ్యం పనికి మాలిన ఔత్సుకతను తృప్తిపర్చడం కాదు. గుండె చెదరిన వారిని ఆదరించడానికి ఆయన వచ్చాడు. పగిలిన హృదయాల్ని బాగు చెయ్యడానికి వచ్చాడు. పాప వ్యాధిగ్రస్తమైన ఆత్మను స్వస్తపర్చడానికి మాట్లాడగలిగి ఉంటే ఆయన మౌనంగా నిలిచి ఉండేవాడు కాడు. కాని తమ అపవిత్ర పాదాలతో సత్యాన్ని తొక్కేవారికి వినిపించేందుకు ఆయనకి మాటలు లేవు.DATel 824.2

    కఠినాత్ముడైన హేరోదు చెవుల్ని ఛేదించే మాటలు క్రీస్తు మాట్లాడగలిగేవాడే! అతడి పాపపూరిత జీవిత చరిత్రను అతడి ముందున్న భయంకర నాశనాన్ని అతడి ముందు పెట్టి భయకంపితుణ్ని చేయగలిగేవాడే. కాని క్రీస్తు మౌనం అతడికందించగలిగిన కఠినాతి కఠినమైన మందలింపు. ప్రవక్తలందరిలో ఉత్తమ ప్రవక్త అందించిన వర్తమానాన్ని హేరోదు నిరాకరించాడు. అతడికి ఇక ఇవ్వాల్సిన వర్తమానం లేదు. పరలోక ప్రభువు నుంచి అతడికి ఒక్కమాట కూడా లేదు. మానవ దుఃఖానికి నిరంతరం జాగృతంగా ఉన్న ఆ చెవి హేరోదు ఆజ్ఞల్ని వినలేదు. పశ్చాత్తాపపడి ప్రార్ధన చేసే పాపి మిద నిలిచిన ఆయన చూపులో క్షమించే ఆయన ప్రేమలో హేరోదుకి ఇవ్వడానికి ఏమిలేదు. హృదయాన్ని ఆకట్టుకునే శక్తిమంతమైన సత్యాన్ని వచించిన ఆ పెదవులు, అతి ఘోరమైన, అతి నీచమైన పాపితో ప్రేమానురాగాలతో విజ్ఞాపన చేసిన ఆ పెదవులు, రక్షకుడి అవసరాన్ని గుర్తించని గర్విష్టుడైన రాజుకి వచ్చేసరికి మూతపడ్డాయి.DATel 824.3

    హేరోదు ముఖం ఆవేశంతో నిండి నల్లగా మారింది. ప్రజల తట్టు తిరిగి మోసగాడంటూ యేసుని ఆగ్రహంగా ఖండించాడు. అప్పుడు యేసుతో నీవంటున్న దానికి ఏ గుర్తూ ఇవ్వకపోతే నిన్ను సైనికులికి ప్రజలకు అప్పగిస్తాను అన్నాడు. వారు నిన్ను మాట్లాడించడం సాధ్యపడవచ్చు. నీవు మోసగాడివైతే వారి చేతుల్లో మరణమే నీకు వచ్చేది, నీకు అర్ధమయ్యింది. నీవు దేవుని కుమారుడవే అయితే ఒక సూచక క్రియ చేసి నిన్ను నీవు రక్షించుకో అన్నాడు.DATel 825.1

    అతడు ఈ మాటలన్న వెంటనే ప్రజలు తోసుకుంటూ ఆయన వద్దకు వచ్చారు. అడవి మృగాల్లా ఆయన మీదికి దూకారు. ఆయన్ని ఇటు అటూ ఈడ్చారు. దైవ కుమారుణ్ని హీనపర్చడానికి వారితో హేరోదు కూడా చెయ్యి కలిపాడు. రోమా సైనికులు కలుగజేసుకుని ఉన్మాదులైన ఆ ప్రజల్ని వెనక్కి నెట్టి ఉండకపోతే వారు రక్షకుణ్ని ముక్కముక్కలుగా చీల్చేవారు.DATel 825.2

    “హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము” తొడిగంచాడు. ఈ అపహాస్య ప్రక్రియలో రోమా సైనికులు కలిశారు. హేరోదు మద్దతుతో, యూదు ఉన్నతాధికారుల దన్నుతో ఈ సైనికులు చేసిన అపహాస్యం అవహేళన అంతా ఆయన భరించాడు. ఆయన సహనాన్ని కోల్పోలేదు.DATel 825.3

    తమ ప్రవర్తనను బట్టి క్రీస్తు హింసకులు ఆయన ప్రవర్తనను కొలవడానికి ప్రయత్నించారు. తాము ఎంత నీచులు అధములో అంత నీచంగా ఆయన్ని చిత్రించడానికి వారు ప్రయత్నించారు. అయితే ప్రస్తుతం కనిపిస్తోన్న దాని వెనుక ఇంకో దృశ్యం దర్శనమిచ్చింది. అది వారు ఒక రోజున చూడనున్న దృశ్యం. క్రీస్తు సముఖంలో భయంతో వణికిన వారు కొందరున్నారు. ఆ అనాగరిక జనసమూహం ఎగతాళిగా ఆయనముందు నమస్కరిస్తుండగా ఆ క్రియలో పాల్గొడానికి ముందుకు వచ్చిన వారిలో కొందరు భయపడి నిశ్శబ్దంగా వెనక్కుమళ్లారు. హేరోదుకి నమ్మిక కలిగింది. పాపంతో కరడుగట్టిన అతడి హృదయంపై చివరి కృపా కిరణాలు పడున్నాయి. ఈయన సామాన్య మానవుడు కాదని నమ్మాడు. అపహాసకులు, వ్యభిచారులు హంతకులు క్రీస్తుని చుట్టుముట్టి ఉన్నప్పుడు, సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ని చూసినట్లు హేరోదు మనసుకి అనిపించింది.DATel 825.4

    ఎంత కఠినాత్నుడైనా హేరోదు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించలేక పోయాడు. ఆ భయంకర బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. యేసుని తిరిగి రోమా న్యాయస్థానానికి పంపాడు.DATel 826.1

    పిలాతుకి ఆశాభంగం కలిగింది. చాలా అసంతృప్తి చెందాడు. యూదులు యేసుని తీసుకుని తిరిగి వచ్చినప్పుడు, నన్నేమి చెయ్యమంటారు? అని వారిని అసహనంతో ప్రశ్నించాడు. తాను క్రీస్తుని పరీక్షించానని ఆయనలో తనకు ఏ తప్పు కనిపించలేదని చెప్పానని వారికి గుర్తు చేశాడు. ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు తెచ్చారేగాని వాటిలో తాము ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయారని చెప్పాడు. తమ జాతీయుడు, గలిలయ చతుర్ధాధిపతి అయిన హేరోదు వద్దకు యేసుని పంపానని అతడు కూడా క్రీస్తులో మరణార్హమైన ఏ నేరమూ కనుగోలేదని చెప్పాడు. “ఇతని శిక్షించి విడుదల చేతును” అన్నాడు.DATel 826.2

    పిలాతు ఇక్కడ తన బలహీనతను ప్రదర్శించుకున్నాడు. అతడు యేసు నిరపరాధి అన్నాడు. అయినా తన ప్రత్యర్థుల్ని తృప్తిపర్చడానికి ఆయన్ని, కొరడాలతో కొట్టడానికి అనుమతించాడు. అల్లరి మూకతో రాజీపడడానికి అతడు న్యాయాన్ని నియమాన్ని తుంగలో తొక్కాడు. ఇది అతడికే చేటు కలిగించింది. ఆ మూక అతడి అవకతవక వర్తనను ఆసరా చేసుకుని ఖైదీ ప్రాణం కోసం మరింత గట్టిగా అరిచారు. పిలాతు మొదట్లోనే దృఢంగా ఉండి తాను నిరపరాధిగా కనుగొన్న వ్యక్తిని దండించనుగాక దండించనని చెప్పిఉంటే, తనను దుఃఖంలోను అపరాధంలోను తన జీవితకాలమంతా బంధించి ఉంచనున్న గొలుసును ఛేదించి ఉండేవాడు. న్యాయమని తాను నమ్మినదాన్ని అతడు అమలుపర్చి ఉంటే యూదులు అతణ్ని ఆటలాడించేవారు కాదు. క్రీస్తును వారు చంపేవారేకాని ఆ అపరాధం పిలాతుకి చుట్టుకునేది కాదు. పిలాతు చేపట్టిన ప్రతీచర్య అతడి మనసాక్షిని క్షోభింపజేసిందే. సమత న్యాయాలతో తీర్పు తీర్చలేకపోయినందుకు తన్నుతాను క్షమించుకున్నాడు. ఇప్పుడు అతడు యాజకులు అధికారుల చేతిలో కీలుబొమ్మలా మెదిలాడు. ఊగిసలాట, తటపలాయింపు ధోరణి అతణ్ని గోతిలోకి దింపాయి.DATel 826.3

    ఇప్పుడు సైతం పిలాతు గుడిగా వ్యవహరించడానికి లేదు. తాను చెయ్యడానికి ఆయత్తపడున్న ఒక కార్యం గురించి దేవుని వద్దనుంచి వచ్చిన ఒక వర్తమానం అతణ్ని హెచ్చరించింది. క్రీస్తు ప్రార్ధన ఫలితంగా పిలాతు భార్యను ఒక పరలోకదూత సందర్శించాడు. దర్శనంలో ఆమె రక్షకుణ్ని చూసి ఆయనతో సంభాషించింది. పిలాతు భార్య యూదురాలు కాదు. కాని ఆమె క్రీస్తుని దర్శనంలో చూసినప్పుడు, ఆయన ప్రవర్తన విషయంలోను ఆయన పరిచర్య విషయంలోను ఆమెకు ఎలాంటి సందేహం లేదు. ఆయన దేవుని కుమారుడని గుర్తించింది. ఆయన్ని తీర్చు హాలులో విచారించడాన్ని చూసింది. నేరస్తుడి చేతుల్ని బంధించినట్లు ఆయన చేతుల్ని బంధించడం చూసింది. హేరోదు అతడి సైనికులు క్రూరకృత్యాల్ని జరపడం చూసింది. దుర్బుద్ధితో నిండిన యాజకులు అధికారులు మతిలేకుండా చేస్తున్న ఆరోపణల్ని వింది. “మాకొక నియమము కలదు.... ఆ నియమము చొప్పున ఇతడు చావవలెను” అన్న మాటలు ఆమె వింది. “ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు” అన్న తర్వాత పిలాతు యేసును కొరడాతో కొట్టడానికి అప్పగించడం ఆమె చూసింది. పిలాతు ప్రకటించిన మరణ తీర్మానాన్ని విన్నది. అతడు క్రీస్తుని తన హంతులకు అప్పగించడం చూసింది. కల్వరిపై సిలువను పైకెత్తడం చూసింది. భూమి చీకటి కమ్మడం చూసింది, “సమాప్తమైనది” అన్న మార్మిక ప్రకటనను విన్నది. ఆమె చూస్తుండగా మరో దృశ్యం వచ్చింది. భూమి అంతరిక్షంలో భ్రమిస్తూ ఉండగా బ్రహ్మాండమైన తెల్లని మేఘంపై ఆయన ఆసీనుడై ఉండడం ఆయన హంతకులు ఆయన మహిమకు తాళలేక పారిపోవడం చూసింది. భయంతో పెద్ద కేకవేసి నిద్రనుంచి లేచింది. వెంటనే పిలాతుకు హెచ్చరిక చేస్తూ ఉత్తరం రాసింది.DATel 826.4

    ఏం చెయ్యాలని పిలాతు లోలోన సంఘర్షణ పడుతున్న తరుణంలో ఒక వార్తాహరుడు జనసమూహం మధ్య నుంచి దూసుకుంటూ వచ్చి పిలాతుకి తన భార్య పంపిన ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరంలో ఇలా ఉంది.DATel 827.1

    “నీవు ఆ నీతిమంతున్ని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని”DATel 827.2

    పిలాతు ముఖంలో నెత్తురు చుక్కలేదు. తనలో చెలరేగుతున్న విరుద్ధ భావావేశాల్లో కొట్టుమిట్టాడున్నాడు. అతడు చర్య తీసుకోక తప్పలేదు. అతడు ఒక ఆచారం గురించి ఆలోచించాడు. అది క్రీస్తు విడుదలకు మార్గం కావచ్చుననుకున్నాడు. ఈ పండుగ సమయంలో ప్రజలు కోరుకున్న ఒక నేరస్తుణ్ని విడుదల చెయ్యడం ఆచారం. ఈ ఆచారం అన్యమత మూలాల నుంచి వచ్చింది. అందులో న్యాయమన్నది ఎక్కడాలేదు. కాని యూదులు ఆ ఆచారాన్ని ఎంతో విలువైన ఆచారంగా పరిగణించారు. ఈ సమయంలో రోమా అధికారులు బరబ్బా అనే నేరగాణ్ని బంధించి ఉంచారు. అతడికి మరణశిక్ష ఖరారయ్యింది. ఇతడు తాను మెస్సీయానని చెప్పుకున్నాడు. లోకాన్ని క్రమబద్దీకరించడానికి వివిధ రకాల ఆచారాల్ని క్రమాల్ని స్థాపించడానికి తనకు అధికారముందని చెప్పుకున్నాడు. సాతాను వంచన కింద దొంగతనం, దోపిడీల వల్ల తాను సంపాదించగలిగిందంతా తనదేనని అతడు చెప్పుకున్నాడు. సాతాను సాధనాల ద్వారా అతడు అద్భుతకార్యాలు సాధించాడు. ప్రజలలో కొందరు అనుచరుల్ని సంపాదించాడు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహక చర్యల్ని ప్రోత్సహించాడు. మతోత్సాహం ముసుగులో ఉన్న కరడుకట్టిన దుర్మార్గుడు అతడు. అతడు తిరుగుబాటులు లేవదీసి దౌర్జన్యాలికి పాలుపడ్డ గూండా. ఇతడికీ క్రీస్తుకీ మధ్య ప్రజలికి ఎన్నిక అవకాశమివ్వడం ద్వారా వారిలో నీతిపట్ల న్యాయంపట్ల స్పృహను మేల్కొల్పాలన్నది పిలాదు ఆశాభావం. యాజకులు అధికారులికి వ్యతిరేకంగా క్రీస్తుకి మద్దతుగా ప్రజల సానుభూతిని కూడగట్టాలని ప్రయత్నించాడు. కనుక ప్రజల తట్టు తిరిగి “నేనెవనిని విడుదల చేయవలెను మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా?” అని చాలా ఆసక్తితో అడిగాడు.DATel 827.3

    “మాకు బరబ్బను విడుదల చేయుడి” అంటూ ప్రజలు అడవిమృగాలు అరచినట్లు అరిచారు. బరబ్బ! బరబ్బ! అన్న నినాదం మిన్నుముట్టింది. తన ప్రశ్నను ప్రజలు అర్థం చేసుకోలేదని భావించి పిలాతు మళ్లీ, “నేను యూదుల రాజును మాకు విడుదల చేయగోరుచున్నారా?” అని అడిగాడు. “వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదలచేయుము!” అంటూ వారు మళ్లీ కేకలు వేశారు. “ఆలాగైతే యూదుల రాజని వారు చెప్పువాని నేనేమి చేయుదును?” అని పిలాతు అడిగాడు. మళ్లీ ప్రజలు దయ్యాల్లా గర్జించారు. ఆ జనసమూహంలో మానవ రూపంలో దయ్యాలున్నాయి. కనుక “వానిని సిలువవేయుము” అన్న జవాబుకన్నా వేరేదేముంటుంది?DATel 828.1

    పిలాతు ఆందోళన చెందాడు. ఇలా జరుగుతుందని అతడు అనుకోలేదు. ఒక నిరపరాధిని సిగ్గుకరమైన క్రూరమైన మరణానికి విడుదల చెయ్యడానికి పిలాతు వెనకాడాడు. కేకలు ఆగిపోయిన తర్వాత అతడు ప్రజలపక్కకు తిరిగి, “ఎందుకు? అతడే చెడుకార్యము చేసెను?” అని అడిగాడు. కాని ఆవిషయం వాదన పర్వం దాటిపోయింది. వారికి కావలసింది క్రీస్తు నిరపరాధిత్వానికి నిదర్శనం కాదు. ఆయన మరణం.DATel 829.1

    పిలాతు ఇంకా ఆయన్ని రక్షించడానికి ప్రయత్నించాడు. “మూడవమారు అతడు ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. ” విడుదల అన్నమాట వినిపించగానే ప్రజల ఉన్నాదం పదిరెట్లు పెరిగింది. “వీని సిలువవేయుము సిలువవేయుము” అని కేకలు వేశారు. పిలాతు అనిశ్చతత్వం వల్ల చెలరేగిన తుపాను ఉదృతమయ్యింది.DATel 829.2

    అలసిపోయిన, గాయాలతో ఉన్న యేసుని తీసుకువెళ్లి ప్రజల ముందు కొరడాలతో కొట్టారు. “సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయన యెద్ద సైనికులనందరిని సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి. ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అని ఆయన తలకు పెట్టి, ...ఆయన యెదుట మెకాళ్ళూని -యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించిరి.” ఆయన మీద ఉమ్మివేశారు. ఆయన చేతిలో ఉంచిన రెల్లును అప్పుడప్పుడు కొందరు దుష్టులు లాగుకుని దానితో ఆయన్ని తలమీద కొట్టారు. ఆదెబ్బతో తలమిది ముళ్లు కణతల్లోకి దిగగా రక్తంకారి అది ఆయన ముఖాన్ని గడ్డాన్ని తడిపింది.DATel 829.3

    ఆకాశమా, ఆశ్చర్యపడు! భూలోకమా, ఆశ్చర్యపడు! బాధిస్తున్న వాణ్ని బాధితుణ్ని చూడండి. ఒక ఉన్నాద జన సమూహం లోక రక్షకుణ్ని చుట్టుముంటింది. అపహాస్యం గేలి ఒట్టు పెట్టుకోడం దేవదూషణ - అన్నీ మిళితమయ్యాయి. దయ ఏకోశానా లేని ప్రజల మూక ఆయన్ని సామాన్య జననం గురించి దీన జీవితం గురించి చెడ్డగా వ్యాఖ్యానించింది. తాను దేవుని కుమారుణ్ని అనడాన్ని పరిహసించారు. అక్కడి వారి నోళ్లు అవహేళనతో, ఎగతాళి వెక్కిరింతలతో నిండి ఉన్నాయి.DATel 829.4

    రక్షకుణ్ని అపహసించి హింసించడంలో ఆ క్రూర ప్రజాసమూహాన్ని సాతాను నడిపించాడు. సాధ్యమైతే తిరిగి దెబ్బకొట్టడానికి లేక తన్ను తాను విడిపించుకోడానికి ఒక సూచకక్రియ చెయ్యడానికి ఆయన్ని రెచ్చగొట్టి, తద్వారా రక్షణ ప్రణాళికను నిరర్థకం చెయ్యడమే అతడి ఉద్దేశం. ఆయన మానవ జీవితంపై ఒక్క మరక, తీవ్ర పరీక్షను తట్టుకోడంలో ఆయన మానవతలో ఒక్క తప్పటడుగు, దేవుని గొర్రెపిల్లని కళంకం గల అర్పణను చేసేది. మానవ విమోచన విఫలమయ్యేది. కాని ఎవరు తన ఆజ్ఞతో పరలోక సేవల్ని తనకు సహాయంగా రప్పించుకోగలరో, ఎవరు తన దివ్య సముఖం నుంచి ఆ అల్లరి మూకను భయభ్రాంతుల్నిచేసి కకావికలు చేయగలరో ఆ ప్రభువు దుర్భరమైన అవమానానికి దౌర్జన్యానికి తన్నుతాను ప్రశాంతంగా అప్పగించుకున్నాడు.DATel 830.1

    తన దైవత్వానికి రుజువుగా ఒక సూచక క్రియని చెయ్యమని క్రీస్తు ప్రత్యర్ధులు డిమాండు చేశారు. తనను హింసించిన వారి క్రూరత్వం వారిని సాతాను రూపంలోకి దిగజార్చినట్లు యేసు సాత్వికం ఓర్పు ఆయన్ని మానవాళికన్నా ఎంతో పైన ఉంచి దేవునితో ఆయన సమాన ప్రతిపత్తిని నిరూపిస్తోంది. ఆయన భరించిన అవమానం ఆయన ఔన్నత్యానికి వాగ్దానం. గాయపడ్డ ఆయన కణతల్నుంచి కారి ఆయన ముఖం మీద నుంచి ఆయన గడ్డంమీద నుంచి పడ్డ రక్తపు చుక్కలు, మన ప్రధాన యాజకుడుగా ఆయన పొందనున్న “ఆనంద తైలముతో అభిషే” కానికి వాగ్దానం. (హెబ్రీ 1:9)DATel 830.2

    తన మీదకి అన్యాయంగా రప్పించిన నింద అవమానం అఘాయిత్యాలు రక్షకుని పెదవుల్నుంచి ఒక్క గొణుగుడి కూడా రప్పించులేకపోడం చూసినప్పుడు సాతానుకి కోపం వచ్చింది. ఆయన మానవ నైజాన్ని స్వీకరించినా ఆయన్ని దివ్యమైన నైతిక ధైర్యం ఆదుకొంటుండడంతో తండ్రి చిత్రాన్ని ఆయన తు.చ. తప్పకుండా ఆచరిస్తున్నాడు.DATel 830.3

    కొరడాలతో కొట్టడానికి అపహసించడానికి పిలాతు ఆయన్ని ప్రజలికి అప్పగించినప్పుడు ఆ క్రియ క్రీస్తుపట్ల ప్రజల సానుభూతిని రేపుతుందని, అతడు భావించాడు. ఈ శిక్ష సరిపోతుందని వారు నిర్ణయిస్తారని అతడు ఊహించాడు. యాజకుల కక్ష కూడా ఇప్పుడు తగ్గుతుందని భావించాడు. కాని నిరపరాధిగా ప్రకటించబడ్డ వ్యక్తిని శిక్షించడంలోని బలహీనతను యూదులు సూక్ష్మబుద్దితో గ్రహించారు. పిలాతు క్రీస్తు ప్రాణాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడని వారు గ్రహించారు. యేసుని విడిచి పెట్టడం జరగనివ్వకూడదని కృతనిశ్చయులయ్యారు. మనల్ని తృప్తిపర్చడానికి సంతోషపర్చడానికి పిలాతు క్రీస్తుని కొరడాలతో కొట్టించాడు గదా, ఈ విషయాన్ని మనం ఇంకా గట్టిగా కోరితే మన ఉద్దేశాన్ని నెరవేర్చుకో గలుగుతాం అని వారు భావించారు.DATel 830.4

    పిలాతు ఇప్పుడు బరబ్బ కోసం భటుల్ని పంపించాడు. అప్పుడు ఈ ఇద్దరు ఖైదీల్ని పక్కపక్కన నిలపెట్టి రక్షకుని వంక చూపిస్తూ “ఇదిగో ఈ మనుష్యుడు” “ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను నా యొద్దకు వెలుపలికి తోసికొని వచ్చుచున్నాను” అంటూ ఆయనకోసం విజ్ఞాపన చేశాడు.DATel 831.1

    అపహాస్యపు వస్త్రం ముండ్లకిరీటం ధరించి రక్షకుడు అక్కడ నిలబడి ఉన్నాడు. మొలవరకు వస్త్రం లేదు. ఆయన వీపుమీద కొరడాదెబ్బల చారలు రక్తం కారుతూ కనిపిస్తోన్నాయి. ఆయన ముఖం రక్తంతో మరకలుపడి ఉంది. దానిపై అలసిపోయిన సూచనలు బాధననుభవిస్తున్న చిహ్నాలు కనిపిస్తోన్నాయి. అయితే ఆ ముఖం తన శత్రువుల ముందు కళాహీనం కాలేదు. ఆయన ముఖకవళికల్లో ప్రతీదీ సాధుత్వాన్ని, విధేయతను క్రూరమైన తన శత్రువుల పట్ల దయను కనపర్చుతోంది. ఆయన తీరులో పిరికితనంతో కూడిన బలహీనత లేదు. దీర్ఘశాంతానికి అవసరమైన బలం, గౌరవం ఉన్నాయి. ఆయనకు భిన్నంగా ఉన్నాడు ఆయన పక్కనున్న బరబ్బ. బరబ్బ ముఖం మీద ప్రతీ ముడత అతడు కరడుగట్టిన నేరగాడని గూండా అని సూచిస్తున్నాయి. వారి మధ్య భేదం చూసేవారందరికీ అవగతమయింది. చూస్తున్న వారిలో కొందరు సానుభూతితో నిండాయి. తన్ను గురించి ఆయన ఏమైతే చెప్పాడో అదంతా నిజమని యాజకులు అధికారులు సయితం గుర్తించారు.DATel 831.2

    క్రీస్తు చుట్టూ ఉన్న రోమా సైనికులందరూ కఠినులు కారు. ఆయన నేరస్తుడు లేక ప్రమాదకరమైన వ్యక్తి ఔనా కాదా అనడానికి ఒక్క నిదర్శనం కోసం వారిలో కొందరు ఆయన ముఖంలోకి దీక్షగా పరీక్షగా చూస్తున్నారు. అప్పుడప్పుడు బరబ్బ వంక కక్షగా చూస్తున్నారు. అతడెలాంటి వాడో గ్రహించడానికి ప్రావీణ్యం అవసరం లేదు. విచారణ కింద ఉన్న ఆయన వంక మళ్లీ తిరిగి చూస్తున్నారు. బాధ అనుభవిస్తున్న దైవాన్ని చూసినప్పుడు వారిలో దయపుట్టింది. క్రీస్తు మౌనంగా బాధను భరించడం వారి మనసులపై చెరగని ముద్రవేసుకుంది. ఆయన్ని క్రీస్తుగా గుర్తించేవరకో లేదా ఆయన్ని నిరాకరించడం ద్వారా తమ భవిష్యత్తును నిర్ణయించుకునేవరకో చెరిగిపోని ముద్ర అది.DATel 831.3

    సణుగుడు గొణుగుడులేని రక్షకుని ఓర్పుకు పిలాతు దిగ్ర్భాంతి చెందాడు. బరబ్బ పక్కని ఈయన్ని చూసినప్పుడు వారి మధ్య ఉన్న భేదం క్రీస్తుపట్ట యూదుల సానుభూతిని పొందగలుగుతుందని పిలాతు భావించాడు. కాని లోకానికి వెలుగై ఉండి తమ చీకటిని దోషాన్ని చూపించిన ఆయన పట్ల యాజకుల మతఛాందసాన్ని ద్వేషాన్ని పిలాతు అవగతం చేసుకోలేదు. వారు జనసమూహాన్ని రెచ్చగొట్టారు. మళ్లీ యాజకులు, అధికారులు ప్రజలు కలిసి “వీనిని సిలువవేయుము సిలువవేయుము” అని కేకలు వేశారు. కడకు వివేచన విచక్షణలేని వారి క్రూరత్వాంతో విసిగిపోయి పిలాతు ఇలా అర్థించాడు, “ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడి.”DATel 832.1

    క్రూరమైన దృశ్చాలతో పరిచయమున్నప్పటికీ నేరస్తుడుగా తీర్పుపొంది కొరడా దెబ్బలు తిని రక్తం కారుతున్న శిరస్సు దెబ్బలగాయాలతో నిండిన వీపుతో ఉన్నా, తన సింహాసనం మీద ఆశీనుడై ఉన్న రాజు ఠీవిని ప్రదర్శిస్తున్న ఖైదీని చూసి ఆరోమా గవర్నరు హృదయం చలించింది. యాజకులు ఇలా అన్నారు, “మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెను.”DATel 832.2

    పిలాతు ఉలిక్కిపడ్డాడు. అతడికి క్రీస్తును గురించి ఆయన పరిచర్యను గురించి నిర్దుష్టమైన అభిప్రాయం లేదు. కాని అతడికి దేవుని పై అస్పష్టమైన విశ్వాసం, మానవులకన్నా ఉన్నతులైన వారు ఉన్నారన్న నమ్మకం ఉన్నాయి. ఒకప్పుడు తన మనసులో ఉన్న ఆలోచన ఇప్పుడు మరింత నిర్దిష్టమైన రూపం ధరించింది. తన ముందు ఊదా రంగు అపహాస్యపు వస్త్రం, ముండ్ల కిరీటం ధరించి నిలిచిఉన్న వ్యక్తి పరమాత్ముడుకాడా? అని తన్నుతాను ప్రశ్నించుకున్నాడు.DATel 832.3

    అతడు మళ్లీ, తీర్పు హాలులోకి వెళ్లి “నీ వెక్కడ నుండి వచ్చితివి? అని యేసుని అడిగాడు. క్రీస్తు అతడికి సమాధానం చెప్పలేదు. రక్షకుడు పిలాతుతో స్వేచ్చగా మాట్లాడాడు. నిత్యసాక్షిగా లోకంలో తన పరిచర్యనుగూర్చి అతడికి విశదీకరించాడు. పిలాతు తనకు వచ్చిన వెలుగును అలక్ష్యం చేశాడు. ప్రజల డిమాండులకు లొంగిపోడం ద్వారా అతడు న్యాయాధికారిగా తన ఉన్నత హోదా తాలూకు బాధ్యతను దుర్వినియోగం చేశాడు. అతడికివ్వడానికి క్రీస్తు వద్ద ఇక ఏ సందేశం లేదు. ఆయన మౌనంతో విసుగుచెంది పిలాతు ఇలా అన్నాడు గర్వంగా:DATel 833.1

    నాతో మాట్లడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా?” యేసు ఈ సనాధానం ఇచ్చాడు, “పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించినవానికి ఎక్కువ పాపము.”DATel 833.2

    తన తీవ్ర శ్రమ మధ్య దుఃఖం మధ్య కరుణామూర్తి అయిన రక్షకుడు రోమా గవర్నరు తనను సిలువేయడానికి అప్పగించినందుకు అతణ్ని క్షమించాడు. ఇది లోకానికి నిత్యం ఆదర్శంగా నిలువవలసిన సన్నివేశం! లోకమంతటికి న్యాయాధిపది అయిన ఆ ప్రభువు ప్రవర్తనపై ఇది ఎంత గొప్ప వెలుగు విరజిమ్ముతోంది!DATel 833.3

    “నన్ను నీకు అప్పగించినవానికి ఎక్కువ పాపము” అన్నాడు యేసు. ప్రధాన యాజకుడుగా యూదు జాతికి ప్రతినిధి అయిన కయపను ఉద్దేశించి క్రీస్తు ఈ మాటలు అన్నాడు. రోమా అధికారులిని అదుపు చేసిన నియమాలు వారికి తెలుసు. ప్రవచనాల్లోను తన సొంత బోధనలు సూచక్రియల్లోను వారికి వెలుగు ఉంది. ఎవరికి యూదు న్యాయాధికారులు మరణశిక్ష విధించారో ఆయన దేవత్వాన్ని గూర్చి వారికి తిరుగులేని నిదర్శనం ఉంది. తాము పొందిన వెలుగును బట్టి వారు తీర్పుపొందుతారు.DATel 833.4

    తాము దుర్బుద్ధితో శత్రువు చేతికి అప్పగిస్తున్న పవిత్ర వాక్య నిధుల విషయంలో సింహభాగ దోషిత్వం సింహభాగ బాధ్యత దేశంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారికే చెందుతుంది. పిలాతు, హేరోదు, రోమా సైనికులు యేసుని గురించి సంతులనంగా అజ్ఞానలు. ఆయన్ని అవమానించడం ద్వారా యాజకుల్ని అధికారుల్ని సంతోషపర్చడానికి చూశారు. యూదు జాతి పొందిన విస్తారమైన వెలుగువారికి లేదు. సైనికులు ఆ వెలుగును పొంది ఉంటే వారు క్రీస్తుతో తాము ప్రవర్తినంత క్రూరంగా ప్రవర్తించేవారు కాదు.DATel 833.5

    రక్షకుణ్ని విడుదల చెయ్యడానికి పిలాతు మళ్లీ ప్రతిపాదించాడు. “నీవు ఇతని విడుదల చేసితివా కైసరుకు స్నేహితుడవుకావు” అని యూదులు కేకలు వేశారు. కైసరు అధికారాన్ని కాపాడున్నవారిలా ఈ వేషధారులు ఈ రకంగా నాటకమాడారు. పర ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారందరిలో ఎక్కువ వ్యతిరేకత ప్రదర్శించన వారు యూదులే. తమకు క్షేమం ఉన్నంతకాలం తమ జాతీయ, మతపర విధుల్ని నిరంకుశంగా అమలుపర్చేవారు, కాని ఏదో దౌర్జన్యాన్ని సృష్టించాలని తలపెట్టినప్పుడు, కైసరు అధికారాన్ని ఘనపర్చేవారు. క్రీస్తుని నాశనం చేయాలన్న ఉద్దేశాన్ని నెరవేర్చుకోడానికి తాము ద్వేషించిన పరపాలననకు నమ్మకంగా ఉన్నట్లు చెప్పుకున్నారు.DATel 834.1

    “తాను రాజుననని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధనుగా మాటలాడుచున్నవాడే” అని వారు కేకలు వేశారు. ఇది పిలాతుకి కీలుచూసి వాత పెట్టినట్లయ్యింది. పిలాతుని రోమా ప్రభుత్వం అనుమానిస్తోంది. అలాంటి నివేదిక తనకు విఘాతం కలుగిస్తుందని అతడికి తెలుసు. ఇప్పుడు యూదుల్ని అడ్డగించినట్లయితే వారి ఆక్రోషం తనపైకి తిరుగుతుందని భయపడ్డాడు. ప్రతీకారం తీర్చుకోడానికి వారు ఏమైనా చేయగలరని అతడికి తెలుసు. కారణమేమి లేకుండా తాము ద్వేషిస్తున్నవాణ్ని చంపడానికి పట్టువిడుపులు లేకుండా ఎలా ప్రయత్నిస్తున్నారో అన్న దానికి ఉదాహరణ తన కళ్లముందే ఉంది.DATel 834.2

    పిలాతు న్యాయపీఠాన్ని అధిష్టించి “ఇదిగో నా రాజు” అని చెప్పి యేసుని మళ్లీ యూదుల ముందుంచాడు. మళ్లీ “ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయును” అని పిచ్చికేకలు వేశారు. అంతటా వినిపించే గంభీర స్వరంతో “మి రాజును సిలువేయుదునా?” అని పిలాతు ప్రశ్నించినప్పుడు ‘కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు” అని బదులు పలికారు.DATel 834.3

    ఈ విధంగా అన్యపరిపాలకుణ్ని ఎంపిక చేసుకోడం ద్వారా యూదు జాతి దైవ పరిపాలన నుంచి తన్నుతాను ఉపసంహరించుకుంది. వారు దేవుణ్ని తమ రాజుగా విసర్జించారు. ఇక నుంచి వారికి విమోచకుడు లేడు. వారికి కైసరు తప్ప వేరొక రాజు లేడు. యాజకులు బోధకులు ప్రజల్ని ఈ స్థితికి నడిపించారు. దీనికి దీని వెంట కలిగిన భయంకర ఫలితాలికి వారే బాధ్యులు. ఒక జాతి పాపానికి ఒక జాతి నాశనానికి దాని మతనాయకులే కారణం.DATel 835.1

    “పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదేగాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని -ఈ నీతిమంతుని రక్తమునుగుర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.” పిలాతు భయంతోను ఆత్మఖండనతోను క్రీస్తు వంక చూశాడు. పైకి చూస్తున్న ముఖాలన్నిటిలో క్రీస్తు ముఖం శాంతితో నిండి ఉంది. ఆయన తలచుట్టూ సున్నితమైన కాంతి ప్రకాశిస్తోంది. ఈయన దేవుడే అని పిలాతు తన హృదయంలో అనుకున్నాడు. ప్రజల తట్టుతిరిగి ఈయన రక్తం విషయంలో నేను నిరపరాధిని. ఆయన్ని తీసుకువెళ్లి మిరే సిలువ వెయ్యండి. కాని యాజకులూ, అధికారులూ గుర్తుంచుకోండి -ఆయన నీతిమంతుడని నేను ప్రకటిస్తున్నాను. ఆయన ఎవరిని తన తండ్రి అని చెబుతున్నాడో ఆయన ఈనాడు జరిగిన కార్యానికి నన్నుకాదు మిమ్ముల్ని బాధ్యులుగా తీర్పుతీర్చునుగాక అన్నాడు. అప్పుడు యేసుతో - ఈ కార్యానికి నన్ను క్షమించు, నేను నిన్ను రక్షించలేను అన్నాడు. మళ్లీ యేసుని కొరడాలతో కొట్టి సిలువేయడానికి యూదులికి అప్పగించాడు.DATel 835.2

    పిలాతు యేసుని విడిపించాలని ఆకాంక్షించాడు. కాని ఇది చేసి తన హోదాను గౌరవాన్ని నిలుపుకోలేనని గ్రహించాడు. లోక సంబంధమైన అధికారాన్ని పోగొట్టుకునే బదులు ఒక నిరపరాధ జీవితాన్ని బలి ఇవ్వడానికి ఎంపిక చేసుకున్నాడు. ఇలాగే నష్టం నుంచో బాధనుంచో తప్పించుకోడానికి ఎంతమంది నియమాలకి నీళ్లోదులుతున్నారు! మనస్సాక్షి, కర్తవ్యం ఒక మార్గాన్ని చూపిస్తే స్వార్థ ప్రయోజనం మరో మార్గం చూపిస్తుంది. తప్పుడు దిశగా పోవడానికి గాలి బలంగా వీస్తుంది. దుష్టత్వంతో రాజీపడేవాణ్ని అపరాధం అంధకారంలోకి తోసుకుపోతుంది.DATel 835.3

    పిలాతు ప్రజల ఒత్తిడికి లొంగిపోయాడు. తన పదవిని పోగట్టుకోవడంకన్నా అతడు యేసుని సిలువ వెయ్యడానికి అప్పగించాడు. కాని అతడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా, అనంతరం తనకు సంభవించవచ్చునని తాను భయపడున్నది తన మీదికి రానే వచ్చింది. అతడి బిరుదుల్ని తీసివేశారు. అతడి ఉన్నత హోదాను తొలగించారు. క్రీస్తుని సిలువవేసిన కొద్దికాలానికి పశ్చాత్తాపంతో నిండి, ఆత్మాభిమానం దెబ్బతిని అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే పాపంతో రాజీపడేవారందరికీ దుః ఖం నాశనం మాత్రమే లభిస్తాయి. “ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది నాశనమునకు త్రోవ తీయును” సామె. 14:12.DATel 836.1

    క్రీస్తు రక్తం విషయంలో తాను నిరపరాధిని అని పిలాతు అన్నప్పుడు కయప “వాని రక్తము మామిదను మాపిల్లల మీదను ఉండునుగాక” అని పలికారు.DATel 836.2

    ఇశ్రాయేలు ప్రజలు తమ తీర్మానం చేసుకున్నారు. క్రీస్తు వంక చూపిస్తూ “వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదలచేయుము” అన్నారు. బందిపోటు హంతకుడు అయిన బరబ్బ సాతాను ప్రతినిధి. క్రీస్తు దేవుని ప్రతినిధి. క్రీస్తుని తిరస్కరించి బరబ్బను అంగీకరించారు ప్రజలు. వారి అధి నాయకుడు సాతాను. ఒక జాతిగా వారు సాతాను ఆజ్ఞను పాలిస్తారు. అతడి కార్యాలు చేస్తారు. అతడి పరిపాలనను సహిస్తారు. బరబ్బను ఎంపిక చేసుకున్న ప్రజలు అతని క్రూరత్వాన్ని లోకాంతం వరకు అనుభవించాల్సి ఉన్నారు.DATel 836.3

    మొత్తబడిన దేవుని గొర్రెపిల్ల వంక చూస్తూ “వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక” అని వారన్నారు. భయంకరమైన ఆమొర దేవుని సింహాసనం ముందుకు వెళ్లింది. తమపై తాము ప్రకటించుకున్న తీర్పు పరలోకంలో దాఖలయ్యింది. ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు. దైవకుమారుని రక్తం వారి పిల్లలమీద వారి పిల్లల పిల్లలమీద నిత్యం శాపంగా ఉన్నది.DATel 836.4

    ఇది యెరూషలేము భయంకర విధ్వంసంలో నెరవేరింది. పద్దెనిమిది శతాబ్దాలుగా యూదుజాతి అనుభవిస్తూ వస్తున్న పరిస్థితుల్లో అది ప్రదర్శితమౌతోన్నది. ఆ జాతి ఎండిపోయి ఫలాలు ఫలించని ద్రాక్షవల్లి అయ్యింది. దాన్ని పోగుజేసి కాల్చివేయాల్సి ఉంది. శతాబ్దం వెంబడి శతాబ్దం ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్తూ ఆ జాతి ప్రజలు అతిక్రమాల్లోను పాపాల్లోను మరణించి ఉన్నారు.DATel 836.5

    ఆ మహా తీర్పుదినం నాడు ఆ ప్రార్థన భయంకరమైన రీతిలో నెరవేరుతుంది. అల్లరి మూక మధ్య ఖైదీగా గాక యేసు మళ్లీ ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులు ఆయన్ని చూస్తారు. అప్పుడు ఆయన్ని పరలోక రాజుగా చూస్తారు. క్రీస్తు తన మహిమతోను, తండ్రి మహిమతోను, పరిశుద్ధ దూతల మహిమతోను వస్తాడు. సుందరమైన, జయశీలురైన, దేవుని కుమారులైన, ప్రచండ మహిమతో నిండిన దూతలు ఆయనతో వస్తారు. అప్పుడు ఆయన తన మహిమా సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన ముందు అన్ని జాతుల ప్రజలూ సమావేశమౌతారు. అప్పుడు ప్రతీ నేత్రం ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచినవారూ ఆయన్ని చూస్తారు. ముళ్ల కిరీటం బదులు ఆయన మహిమ కిరీటం ధరిస్తాడు. అది కిరీటంలోని కిరీటం. ఆ ఊదారంగు రాజవస్త్రం స్థానే ఆయన మిక్కిలి తెల్లని, “లోకములో ఏ చాకలియు తెల్లగా చలువచేయ” లేనంద తెల్లని (మార్కు 9:3) వస్త్రం ధరిస్తాడు. ‘రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును” అన్న నామం (ప్రక. 19:16) ఆయన వస్త్రం మీద తొడమీద రాయబడి ఉంటుంది. ఆయనను అపహసించినవారు కొట్టినవారు అక్కడుంటారు. యాజకులు అధికారులు తీర్సుహాలులోని దృశ్యాన్ని మళ్లీ చూస్తారు. అగ్నితో రాసిన అక్షరాల్లాగ ప్రతీ పరిస్థితి ప్రతీ వివరం వారి ముందుకి వస్తుంది. అప్పుడు “వాని రక్తము మా మిదను మా పిల్లల మీదను ఉండునుగాక” అన్నవారు తమ ప్రార్థనకు జవాబు పొందుతారు. అప్పుడు సర్వలోకం తెలుసుకుని అవగాహన చేసుకుంటుంది. దీనులు, బలహీనులు, పరిమితులు గల వ్యక్తులు అయిన తాము ఎవరితో పోరాడున్నదీ తెలుకుంటారు. భయంకరమైన బాధతోను భయంతోను వారు కొండలకు బండలకు ఇలా మొర పెట్టుకుంటారు, “సింహాసనాసీనుడైయున్న వాని యొక్కయు గొట్టెపిల్లయొక్కయు ఉగ్రత మహా దినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మామీదపడి ఆయన సన్నిధికిని గొట్టెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి.” ప్రక. 6:16, 17.DATel 837.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents