Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  13—విజయం

  “అంతట అపవాది పరిశుద్ద పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి - నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము.DATel 113.1

  ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును.
  నీ పాద మెప్పుడైనను రాతికి తగులకుండ వారు
  నిన్ను చేతులతో ఎత్తికొందురు’
  అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.”
  DATel 113.2

  ఇప్పుడు యేసుని తన పంథాలోనే ఎదుర్కున్నానని సాతాను భావించాడు. ఈ జిత్తులుమారి ప్రత్యర్థి దేవుని నోటి నుంచి వెలువడ్డ మాటల్నే. ఉటంకిస్తోన్నాడు. అతడింకా వెలుగు దూతలాగే కనిపిస్తూ, తనకు లేఖనాలతో పరిచయం ఉందని ఆ లేఖనవచనాల ప్రాముఖ్యాన్ని గూర్చిన అవగాహన ఉందని ఈ రకంగా చూపించుకుంటున్నాడు. యేసు తన నమ్మికకు మద్దతుగా దైవవాక్యాన్ని ఉపయోగించినట్లే శోధకుడు ఇప్పుడు తన మోసానికి మద్దతుగా వాక్యాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తోన్నాడు. తాను యేసు విశ్వసనీయతను పరీక్షిస్తున్నానని, ఆయన ధృఢంగా నిలిచినందుకు ఆయనను అభినందిస్తోన్నానని చెప్పాడు. రక్షకుడు దేవునిపై నమ్మకాన్ని ప్రదర్శించాడు. కనుక తన విశ్వాసానికి ఇంకొక నిదర్శనం ఇవ్వమని ప్రభువుని సాతాను కోరాడు.DATel 113.3

  “నీవు దేవుని కుమారుడవైతే” అంటూ వ్యగ్యంగా అపనమ్మకాన్ని సూచిస్తూ అతడు మళ్లీ తన శోధనను మొదలు పెట్టాడు. .... అయితే” అన్నదానికి జవాబు చెప్పాలన్నది ఆయనకు వచ్చిన శోధన. అయితే, ఆయన సందేహాన్ని కొంచెం కూడా అంగీకరించడానికి ఇష్టపడలేదు. సాతానుకి నిదర్శనం ఇవ్వడంలో తన ప్రాణానికే ముప్పు తెచ్చుకోడానికి ఆయన సిద్ధంగా లేడు.DATel 114.1

  క్రీస్తు మానవత్వాన్ని ఆసరా చేసుకుని దురభిమానానికి పాల్పడమని శోధకుడు ఆయన్ని ప్రోత్సహించాడు. సాతాను పాపం చెయ్యమని యాచించగలడే గాని ఒత్తిడి చెయ్యలేడు. యేసుని పడదొయ్యలేనని ఎరిగి “క్రిందికి దుముకుము” అని ఆయనతో అన్నాడు. ఆయన్ని కాపాడేందుకు దేవుడు కలుగజేసుకుంటాడని అతడి భావన. కిందికి దూకమని యేసును సాతాను బలవంతం చెయ్యలేడు. క్రీస్తు శోధనకు లొంగితే తప్ప సాతాను ఆయన్ని జయించలేడు. తన తండ్రి చిత్తం నుంచి ఇసుమంత వైదొలగడానికి ఆయన్ని బలవంతం చెయ్యగల శక్తి భూమిమీదే గాని పాతాళంలోనే గాని లేదు.DATel 114.2

  శోధకుడు చెడు చెయ్యడానికి మనల్ని బలవంతం చెయ్యలేడు. మనసులు అతడి అదుపుకు లొంగితేనే తప్ప అతడు వాటిని అదుపు చెయ్యలేడు. సాతాను మనపై తన పట్టును బిగించకముందు మన చిత్తం అతణ్ని అంగీకరించాలి, క్రీస్తుపై మనకున్న విశ్వాసం ధ్వంసమవ్వాలి. అయితే మనలో పుట్టే ప్రతీ పాపేచ్ఛ అతడికి చోటు పెడుతుంది. మనం దైవ ప్రమాణాన్ని చేరలేని ప్రతీ సందర్భం మనల్ని శోధించి నాశనం చెయ్యడానికి అతడికి తెరచిన తలుపు అవుతుంది. మన ప్రతీ వైఫల్యం లేదా పరాజయం అతడు క్రీస్తును నిందించడానికి అవకాశాన్నిస్తుంది.DATel 114.3

  “ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును” అన్న వాగ్దానాన్ని ఉటంకించినప్పుడు “నీ పాదమెప్పుడును రాతికి తగులకుండ” అన్న మాటలు, అనగా దేవుడు ఎన్నుకొన్న మార్గాలన్నిటిలో అన్న మాటలు విడిచి పెట్టేశాడు. విధేయత మార్గాన్ని విడిచి పెట్టి బయటికి వెళ్లడానికి యేసు ససేమిరా ఒప్పుకోలేదు. తండ్రి పై పరిపూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, తండ్రి ఆదేశం లేకుండా ఆయన తనను మరణం నుంచి కాపాడ్డానికి కలుగజేసుకోవాల్సిన పరిస్థితుల్ని సృష్టించుకోడం యేసుకు సమ్మతం కాదు. తనను కాపాడడానికి దేవుణ్ని ఒత్తిడి చేసి తద్వారా విశ్వసించడంలోను తన్ను తాను సమర్పించుకోడంలోను మానవుడికి ఆదర్శంగా ఉండడంలో విఫలమవ్వడం ఆయనకు ఇష్టం లేదు.DATel 114.4

  యేసు సాతానుకి ఈ సమాధానం ఇచ్చాడు, “ప్రభువైన నీ దేవుని నీవు శోధింప వలదని మరియొక చోట వ్రాయబడియున్నది.” ఇశ్రాయేలీయులు అరణ్యంలో తీవ్ర దాహానికి గురి అయి నీళ్లు ఇవ్వమంటూ మోషేని డిమాండు చేసిన తరుణంలో “యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో” అని వారు శోధించినప్పుడు మోషే అన్న మాటలివి. (నిర్గమ 17:7) వారి నిమిత్తం దేవుడెన్నో అద్భుతాలు చేశాడు. అయినా ఆపద కలిగినప్పుడు వారు ఆయనపై నమ్మకముంచలేదు. ఆయన తమతో ఉన్నాడనడానికి నిదర్శనాన్ని కోరారు. తమ ఆవిశ్వాసం కొద్దీ ఆయన్ని పరీక్షించడానికి పూనుకున్నారు. క్రీస్తును కూడా అదే పని చేయాల్సిందిగా సాతాను కోరుతున్నాడు. యేసు తన కుమారుడని తండ్రి అంతకు ముందే సాక్ష్యం ఇచ్చాడు. యేసు దేవుని కుమారుడనడానికి ఇప్పుడు రుజువు కోరడం దేవుణ్ని పరీక్షించడమే, శోధించడమే. అలాగే దేవుడు ఏదైతే వాగ్దానం చెయ్యలేదో వాన్ని కోరడం కూడా ఆయన్ను పరీక్షించడం అవుతుంది. అపనమ్మకాన్ని ప్రదర్శించి ఆయనను శోధించడమౌతుంది. దేవుడు తన మాటను నెరవేర్చుకుంటాడో లేదో పరీక్షించడానికి కాక వీటిని నెరవేర్చుతాడు గనుక మన మనవుల్ని ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని నిరూపించడానికి కాక మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన తన మాటల్ని నెరవేర్చుతాడు. “విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము; దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెనుగదా” హెబ్రీ 11:6.DATel 115.1

  అయితే విశ్వాసం దురభిమానానికి సంబంధించింది కాదు. యధార్థ విశ్వాసంగల వ్యక్తి మాత్రమే దురభిమానం బారిని పడకుండా భద్రంగా ఉంటాడు. దురభిమానం సాతాను రూపొందించిన నకిలీ విశ్వాసం. విశ్వాసం దేవుని వాగ్దానాల్ని విశ్వసించి విధేయ జీవితం ద్వారా ఫలాలు ఫలిస్తుంది. దురభిమానం కూడా వాగ్దానాల్ని నమ్ముతున్నట్లు చెప్పి వాటిని సాతాను మాదిరిగా అతిక్రమాన్ని ఉపేక్షించడానికి వినియోగించుకుంటుంది. మన మొదటి తల్లిదండ్రులు దేవుణ్ని ప్రేమించి ఆయన ఆజ్ఞల్ని ఆచరించడానికి విశ్వాసం వారిని నడిపించి ఉండేది. అయితే దురభిమానం ఆయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడానికి, ఆయన గొప్ప ప్రేమ తమ పాప పర్యవసానం నుంచి తమను రక్షిస్తాదని నమ్మడానికి వారిని నడిపించింది. కృపను పొందడానికి గల షరతుల్ని నెరవేర్చకుండా, దేవుని ప్రసన్నతను పొందజూ సేది విశ్వాసం కాదు. యధార్ధమైన విశ్వాసానికి పునాది లేఖనాల్లోని వాగ్దానాలు షరతులే.DATel 115.2

  సాతాను మనలో అవిశ్వాసం పుట్టించలేకపోయినపుడు తరచు దురభిమానం పుట్టించడంలో విజయం సాధిస్తాడు. శోధించడానికి అనుకూలమైన స్థితిలోకి మనల్ని నడిపించగలిగితే మనపై విజయం సాధించడం ఖాయమని అతడికి తెలుసు. తనకు విధేయులై నడుచుకునే వారందరిని దేవుడు కాపాడాడు. ఆ మార్గం నుంచి వైదొలగే వారందరూ సాతాను భూభాగంలో మసలడానికి సాహసించే వారవుతారు. అక్కడ మనకు భంగపాటు తప్పదు. రక్షకుడు మనల్ని ఇలా హెచ్చరిస్తోన్నాడు, “మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా నుండి ప్రార్ధన చేయుడి.” మార్కు 14:38. అపాయకర మార్గంలోకి తెగబడకుండా ధ్యానం ప్రార్ధన మనల్ని కాపాడాయి. ఈ రీతిగా మనం అనేక అపజయాల్నుంచి తప్పించుకోగలుగుతాం.DATel 116.1

  శోధనకుగురి అయినప్పుడు మనం నిరాశ చెందకూడదు. శ్రమలు బాధలు ఎదురైనప్పుడు మనల్ని నడిపించేవాడు దేవుని ఆత్మకాదేమోనన్న సందేహం కలుగుతుంది. అయితే సాతాను శోధనకు గురి అవ్వడానికి దేవుని ఆత్మే యేసును ఆరణ్యంలోకి నడిపించాడు. దేవుడు మనల్ని శ్రమల్లోకి నడిపించినపుడు మనకు మేలు కలిగే ఉద్దేశం ఏదో ఆయనకు ఉంటుంది. యేసు దురభిమానంతో నిండి, దేవుని వాగ్దానాలపై ఆధారపడి శోధనలోకి అడుగు పెట్టలేదు. లేక శోధన తన మీదకు వచ్చినప్పుడు నిరాశచెంది చతికిలపడలేదు. మనం కూడా నిస్పృహ చెందకుండా ఆయనలాగే స్పందించాలి. “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు నాకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యాడు. అంతేకాదు; సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.” ఆయన ఇలా అంటోన్నాడు, “దేవునికి స్తుతియాగము చేయుము. మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరచెదవు.” 1 కొరింథీ 10:13; కీర్త 50: 14, 15.DATel 116.2

  రెండో శోధనలో యేసు విజయం సాధించాడు. సాతాను నిజస్వరూపం అతడి ప్రవర్తన బయటపడింది. అయితే అతడు చీలిన పాదాలు, గబ్బిలం రెక్కలు కలిగి దుష్ట రాక్షసుడిలా కనిపించడు. పతితుడైనా అతడు మహాశక్తిగల దేవదూత. తిరుగుబాటు అధినాయకుడిగా ఈ లోకానికి దేవుడిగా అతడు తన్నుతాను ప్రకటించుకున్నాడు.DATel 117.1

  యేసును ఎత్తయిన పర్వతం మీదికి తీసుకువెళ్లి, వైబోగాలతో నిండిన ఈ లోకరాజ్యాల దృశ్యమాలికని ఆయన ముందుంచాడు. దేవాలయాల్లో శోభిల్లుతోన్న నగరాలపై, చలువరాతి రాజభవనాలపై, సారవంతమైన పంట పొలాలపై, ద్రాక్ష పండ్ల తో చూడముచ్చటగా ఉన్న ద్రాక్షతోటల పై సూర్యకిరణాలు పడుతోన్నాయి. పాపం ఆనవాళ్ళు మరుగునపడి ఉన్నాయి. చీకటి నీడల్ని నిర్జన ప్రదేశాన్ని అంతవరకూ వీక్షించిన యేసుకన్నులు ఇప్పుడు అతిసుందరమైన, ఉజ్వలమైన దృశ్యాన్ని వీక్షిస్తోన్నాయి. అంతలోనే శోధకుడి స్వరం ఇలా అనడం వినిపించింది: “ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది. అదెవనికి నేను ఇయ్యగోరుదునో వాని కిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగును.”DATel 117.2

  శ్రమల ద్వారా మాత్రమే క్రీస్తు కార్యం నెరవేర్పు సాధ్యపడుంది. ఆయన ముందున్నవి దుఃఖం, శ్రమ, సంఘర్షణ, సిగ్గుకరమైన మరణాన్ని భరించాల్సిన జీవితం. ఆయన యావత్ ప్రపంచభారాన్ని మోయాల్సి ఉన్నాడు. తండ్రి ప్రేమకు దూరం కావాల్సి ఉన్నాడు. తాను అక్రమంగా హస్తగతం చేసుకున్న అధికారాన్ని విడిచి పెట్టేస్తానని శోధకుడు ఇప్పుడు ముందుకు వస్తోన్నాడు. సాతాను సర్వాధికారాన్ని అంగీకరించడం ద్వారా ఆ భయంకర భవితవ్యాన్నుంచి క్రీస్తు సాతానుకి విజయం చేకూర్చడమౌతుంది. పరలోకంలో దైవకుమారుడికన్నా తన్నతాను హెచ్చించుకోడానికి ప్రయత్నించడంలోనే సాతాను పాపం చేశాడు. ఇప్పుడు సాతాను గెలుపొందితే తిరుగుబాటు గెలుపు సాధించినట్టే.DATel 117.3

  ఈ రాజ్యాలు లోక మహిమ నాకప్పగించబడ్డాయి. వాటిని నేను ఎవరికి ఇయ్యగోరితే వారికిస్తాను అని క్రీస్తుతో సాతానన్నప్పుడు అతడు కొంత నిజాన్ని మాత్రమే చెప్పాడు. అది కూడా వంచనను సాగించేందుకు మాత్రమే చెప్పాడు. సాతాను రాజ్యం తాను ఆదాము నుంచి ఏమైతే లాక్కున్నాడో అదే. అయితే ఆదాము సృష్టికర్తకు ప్రతినిధి మాత్రమే. ఆదాము స్వతంత్ర పరిపాలికుడు కాదు. భూమి దేవునిది. ఆయన అన్నింటినీ తన కుమారునికి ఇచ్చాడు. ఆదాము క్రీస్తు ఆధ్వర్యంలో పరిపాలించాల్సి ఉన్నాడు. ఆదాము తన సార్వభౌమాధికారాన్ని సాతాను చేతుల్లో పెట్టినపుడు క్రీస్తు ఇంకా హక్కుదారుడైన రాజే. అందుకే ప్రభువు నెబుకద్నెజరుతో ఇలా అన్నాడు, “మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియై యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వానికనుగ్రహించును.” దానియేలు 4:17. సాతాను తన అక్రమాధికారాన్ని దేవుడు అనుమతించినంత కాలం మాత్రమే సాగించగలడు.DATel 118.1

  లోకరాజ్యాన్ని మహిమను క్రీస్తుకి ఇస్తానని శోధకుడన్నప్పుడు, క్రీస్తు ఈలోకం వాస్తవిక రాచరికాన్ని వదులుకుని తన ఆజమాయిషీ కింద పరిపాలను అంగీకరించమని సాతాను ప్రతిపాదిస్తోన్నాడు. యూదులు ఆశలు పెట్టుకున్న రాజ్యం ఇదే. వారు ఈ లోకరాజ్యాన్ని ఆకాంక్షించారు. అలాంటి రాజ్యాన్ని ఇవ్వడానికి క్రీస్తు అంగీకరించి ఉంటే వారు ఆయన్ని. ఆనందంగా అంగీకరించేవారు. కాని దుఃఖ బాధల్తో నిండిన పాప శాపం దానిపై నిలిచింది. “సాతానా; పొమ్ము - ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నది.” అని శోధకుతో క్రీస్తు అన్నాడు.DATel 118.2

  దుష్టత్వ సూత్రాలకు క్రీస్తు నివాళి అర్పిస్తే దానికి ప్రతిఫలంగా ఈ లోక రాజ్యాన్ని ఆయనకు ఇస్తానని పరలోకంలో తిరుగుబాటు చేసిన ఈ వ్యక్తి అంటోన్నాడు. కాని క్రీస్తు అలా అమ్ముడుపోయే వ్యక్తికాడు. ఆయన నీతిరాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ కార్యాన్ని ఆయన సాధించకుండా విడిచిపెట్టడు. సాతాను ఇదే శోధనతో మనుషుల వద్దకు వెళ్తాడు. ఇక్కడ అతడికి అధిక జయం లభిస్తుంది. క్రీస్తుపై కలగని జయం ఇక్కడ సాధిస్తాడు. తన సర్వోన్నత అధికారాన్ని అంగీకరించడమన్న షరతుపై మనుషులికి అతడు ఈ లోక రాజ్యాన్ని ఇవ్వజూపుతాడు. ప్రభుభక్తి త్యాగాన్ని, మనస్సాక్షి అణచివేతను, స్వార్థాశల సంతృప్తిని అతడు కోరతాడు. దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెదకవలసిందిగా క్రీస్తు ఆదేశిస్తాడు. సాతాను వారి సరసన నడుస్తూ ఇలా చెబుతాడు, నిత్య జీవానికి సంబంధించిన సత్యం ఏదైనప్పటికీ, ఈలోకంలో విజయం సంపాధించాలంటే మీరు నన్ను సేవించాలి. నా సుఖక్షేమాలు నాచేతుల్లో ఉన్నాయి. నాకు నేను భాగ్యం, వినోద విలాసాలు, ప్రతిష్ఠ, ఆనందం ఇవ్వగలను. నా సలహాలు పాటించండి. నిజాయితీని, ఆత్మ త్యాగాన్ని గూర్చిన వెర్రి ఆలోచనలకు తావీయకండి. మా ముందున్న మార్గాన్ని నేను సుగమం చేస్తాను అంటాడు. ప్రజలు ఈ రకంగా మోసపోతారు. వారు స్వప్రయోజనాలకోసమే నివసిస్తారు. ఇది సాతానుకి తృప్తి కలిగిస్తుంది. లౌకికాసక్తుల పైకి మనసును ఆకర్షించి ఆత్మపై నియంత్రణను చేజిక్కించుకుంటాడు. తనకు చెందని దాన్ని ఇస్తానని నమ్మబలుకుతాడు గాని అది అతడి వద్ద నుంచి లాక్కోబడుతుంది. దేవుని కుమారులుగా తమ స్వాస్థ్యాన్ని వారు పోగొట్టుకునేటట్లు చేస్తాడు.DATel 119.1

  యేసు దేవుని కుమారుడో కాదో అన్న సందేహాన్ని సాతాను వ్యక్తం చేశాడు. దాన్నిపూర్తిగా తోసిపుచ్చడంలోనే కాదనలేని రుజువుంది. బాధననుభవిస్తోన్న మానవత్వంలో దేవత్వం ప్రకాశించింది. ఆ ఆజ్ఞను అడ్డుకోడానికి సాతానుకి శక్తి లేదు. సిగ్గుతోను ఆగ్రహంతోను మండుతూ లోక రక్షకుడి సముఖంలో నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆదాముది పరిపూర్ణ పరాజయమైతే క్రీస్తుది సంపూర్ణ విజయం .DATel 119.2

  అలాగే మనం శోధనను తిప్పికొట్టి సాతానుని తరిమివెయ్యాలి. యేసు దేవునిపై విశ్వాసం ఉంచి ఆయనకు తన్నుతాను సమర్పించుకోడం ద్వారా విజయాన్ని సాధించాడు. అపొస్తలుడి నోట మనతో ఆయనిలా అంటోన్నాడు, “కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడువాడు మా యొద్ద నుండి పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును” యాకోబు 4:7, 8. అపవాది శక్తినుంచి మనల్ని మనం కాపాడుకోలేం. అతడు మానవాళిని జయించాడు. మనం మన సొంత బలంతో అతడికి వ్యతిరేకంగా నిలబడితే అతడి కుతంత్రాలకు బలైపోతాం . కాని “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.” సామెతలు 18:10. ఆ బలమైన నామంలో ఆశ్రయం కనుగొన్న అతిబలహీన ఆత్మ అంటే వణుకుపుట్టి సాతాను పారిపోతాడు.DATel 119.3

  అపవాది వెళ్లిపోయిన తర్వాత యేసు అలసిపోయి నేలమీద పడిపోయాడు. ఆయన ముఖంపై మరణఛాయలు ముసిరాయి. పరలోక దూతలు ఆ సంఘర్షణను చూస్తున్నారు. మనం తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చెయ్యడానికి. తమ ప్రియతమ సేనాపతి చెప్పనలవిగాని శ్రమలు భరించడం వారు వీక్షించారు. ఆయన ఆ పరీక్షకు తట్టుకుని నిలబడ్డాడు. అది మనం భరించగలిగిన దానికన్నా ఎంతో కఠినం. మరణిస్తోన్నవాడిలా ఇప్పుడు పడి ఉన్న దైవకుమారునికి దేవదూతలు సేవలు చేస్తోన్నారు. ఆహారంతో ఆయన బలం పొందాడు. .తండ్రి ప్రేమా సందేశంతోను, తన విజయంలో పరలోకం యావత్తు విజయం సాధించిందన్న నిశ్చయతతోను, ఆయన ఆదరణ పొందాడు. తెప్పరిల్లి ఉత్సాహం పొందిన ఆయన హృదయం మానవుడిపట్ల దయగొన్నది. తాను ప్రారంభించినపనిని ముగించడానికి ముందుకిసాగాడు. విరోధిపై విజయం సాధించేంత వరకు, పతనమైన మన మానవజాతి విమోచనకార్యం సిద్ధించేంతవరకు విశ్రమించకుండా కృషిచెయ్యడానికి సాగాడు.DATel 120.1

  రక్షణ పొందినవారు రక్షకునితో కలిసి దేవుని సింహాసనం ముందు నిలబడే వరకు మన విమోచన మూల్యం ఎంతో అన్నది గ్రహించలేం. ఆనంద పారవశ్యంలో ఉన్న మనముందు ఆ నిత్య పరలోకగృహ మహిమలు కనువిందు చేస్తుండగా, యేసు వాటన్నిటిని మననిమిత్తం తోసిరాజని, పరలోకాన్ని విడిచి పెట్టడమేగాక, పరాజయ ప్రమాదాన్ని, నిత్యనాశన ప్రమాదాన్ని అంగీకరించడాన్ని అప్పుడు అవగాహన చేసుకుంటాం. అప్పుడు మనం మనకిరీటాలు ఆయన పాదాల వద్ద పెట్టి “వధింపబడిన గొట్టెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు” అంటూ గళాలెత్తి గానం ఆలపిస్తాం. ప్రకటన 5:12.DATel 120.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents