Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    62—సీమోను ఇంటిలో విందు

    బేతనియకు చెందిన సీమోనుని యేసు అనుచరుడుగా పిలిచేవారు. ఆయన అనుచరుల్లో బహిరంగంగా చేరిన కొద్దిమంది పరిసయుల్లో ఇతడొకడు. అతడు యేసుని బోధకుడుగా గుర్తించాడు. మెస్సీయా అయినా కావచ్చునని భావించాడు. కాని ఆయన్ను రక్షకుడుగా స్వీకరించలేదు. అతడి ప్రవర్తన మారలేదు. అతడి నియమాలూ మారలేదు.DATel 618.1

    సీమోను కుష్టు వ్యాధిని యేసు బాగుచేశాడు. అందుచేత అతడు యేసుకి ఆకర్షితుడయ్యాడు. ఆయన చివరిసారిగా సందర్శించినప్పుడు అతడు రక్షకుడికి ఆయన శిష్యులికి విందు చేశాడు. ఈ విందుకి అనేకమంది యూదులు వచ్చారు. ఈ సమయంలో యెరూషలేములో గొప్ప ఉద్రేకం చోటుచేసుకుంది. క్రీస్తు ఆయన సేవ ప్రజలికి అమితాసక్తి పుట్టిస్తోన్న అంశాలు. విందుకు వచ్చినవారు ఆయన కదలికల్ని గమనిస్తూ ఉన్నారు. అందులో కొందరు తమ చూపుల్లో అక్కసును వెళ్లగక్కుతున్నారు.DATel 618.2

    రక్షకుడు బేతనియకు పస్కాకు ఆరు రోజులు ముందే వచ్చాడు. తన అలవాటు ప్రకారం ఆయన లాజరు గృహంలో విశ్రాంతి తీసుకోడానికి చూశాడు. ఆ పట్టణానికి చేరుకున్న ప్రయాణికుల సమూహాలు ఆయన యెరూషలేము వెళ్లే ప్రయాణంలో ఉన్నాడని సబ్బాతురోజు బేతనియలో విశ్రాంతి తీసుకుంటాడని చెప్పారు. ప్రజల్లో గొప్ప ఉత్సాహం చోటు చేసుకుంది. అనేకులు బేతనియ వచ్చారు. కొందరు యేసు పట్ల సానుభూతితో రాగా ఇతరులు మృతుణ్ని లేపిన మహానీయుణ్ని చూడాలన్న ఉత్సుకతతో వచ్చారు.DATel 618.3

    మరణించిన తర్వాత తాను చూసిన అద్భుత దృశ్యాల గురించి లాజరు నోటి నుంచి వినాలని అనేకులు ఎదురుచూశారు. చెప్పడానికి అతడికేమీ లేదు. లేఖనం ఇలా చెబుతోంది, “చచ్చినవారు ఏమియు ఎరుగరు... వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు.” ప్రస 9:5,6. అయితే లాజరు క్రీస్తు సేవను గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. ఇందుకోసమే అతడు మరణం నుంచి లేవబడ్డాడు. నిశ్చయతతోను గొప్ప శక్తితోను యేసు దేవుని కుమారుడని అతడు ప్రకటించాడు.DATel 619.1

    బేతనియను సందర్శించినవారు తిరిగి యెరూషలేముకు తీసుకువెళ్లిన నివేదికలు ప్రజల ఉత్సాహాన్ని ఇబ్బడిముబ్బడి చేశాయి. యేసును చూడాలని ఆయన మాటలు వినాలని ప్రజలు ఆతృతగా ఉన్నారు. లాజరు ఆయనతో యెరూషలేముకు వస్తాడా? ఆ ప్రవక్త పస్కాపండుగలో రాజుగా పట్టాభిషేకం పొందుతాడా? అన్న ప్రశ్నలు అంతటా ప్రస్తావనకు వస్తోన్నాయి. యాజకులు అధికారులు ప్రజలమీద తమ పట్టు బలహీనపడుతున్నట్లు గమనించారు. యేసుపై వారి పగ ఇంకా ఎక్కువయ్యింది. ఆయన్ని పూర్తిగా తీసివేసే అవకాశం వచ్చేవరకూ ఆగలేకపోతున్నారు. ఆయన అసలు యెరూషలేముకే రాకపోవచ్చునని కొన్నిసార్లు ఆందోళన చెందారు. ఆయన హత్యకు తాము వేసిన పథకాల్ని ఎంత తరచుగా ఆయన భంగపర్చాడో గుర్తు చేసుకుని ఇప్పుడు ఆయన తమ మనస్సుల్ని చదివి తమ ఉద్దేశాల్ని తెలుసుకొని యెరూషలేముకి రాకుండా ఉండిపోతాడేమోనని దిగులు చెందారు. వారు తమ ఆందోళనను దాచుకోలేక “నా కేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడాయేమి?” అని పరస్పరం ప్రశ్నించుకున్నారు.DATel 619.2

    యాజకులు పరిసయ్యులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. లాజరు పునరుత్థానం నాటినుంచి ప్రజల సానుభూతి పూర్తిగా క్రీస్తు విదే ఉన్నదని అందువలన ఆయన్ని బహిరంగంగా పట్టుకోడం ప్రమాదభరితమని వారు భావించారు. కనుక ఆయన్ని రహస్యంగా పట్టుకోవాలని ఆయనకు సంబంధించిన తీర్పు రహస్యంగా జరిపించాలని అధికారులు నిశ్చయించుకున్నారు. ఆయనకు తాము విధించిన శిక్ష ప్రజలికి తెలిసేసరికి గడిగడికి మారే ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉండవచ్చునని ఊహించారు.DATel 619.3

    ఇలా యేసుని చంపాలని వారు ప్రతిపాదించారు. అయితే లాజరు బతికి ఉన్నంత కాలం తమకు క్షేమం ఉండదని యాజకులికి రబ్బీలకి తెలుసు. మరణించి నాలుగు రోజులు సమాధిలో ఉండి యేసు పలికిన ఒక్కమాటవలన బతికిన వ్యక్తి జీవించి ఉండడమే ప్రజా ప్రతిస్పందన ఎప్పుడైన కలిగించవచ్చునని భయపడ్డారు. అలాంటి సూచకక్రియను చేసిన ఆయనను చంపినందుకు నాయకుల్ని ప్రజాగ్రహం నాశనం చేస్తుందని భయపడ్డారు. అందును బట్టి లాజరు కూడా మరణించాలని స హెడ్రిన్ తీర్మానించింది. అసూయ దురభిమానం ఉన్నవారు వీటికి బానిసలవుతారు. దేవుని మాహాశక్తి ఎవరిని సమాధి చెర నుంచి విడిపించిందో అతణ్ని సయితం చంపడానికి సిద్ధమయ్యేంతవరకు యూదు నాయకుల ద్వేషం అపనమ్మకం పెచ్చరిల్లాయి.DATel 620.1

    యెరూషలేములో కుట్రలు కుతంత్రాలు ఇలా సాగుతుండగా యేసుని ఆయన మిత్రుల్ని సీమోను విందుకు ఆహ్వానించాడు. భోజనం బల్లవద్ద రక్షకుడు తాను ఎవరి కుష్టువ్యాధిని బాగుచేశాడో ఆ సీమోనుకి, తాను మరణం నుంచి లేపిన లాజరుకి మధ్య కూర్చున్నాడు. మార్తా వడ్డిస్తోంది. మరియ మాత్రం యేసు చెబుతోన్న ప్రతీ మాటనూ ఏకాగ్రతతో వింటోంది. కృపామయుడైన యేసు ఆమె పాపాల్ని క్షమించాడు. మరియ హృదయం కృతజ్ఞతతో నిండింది. క్రీస్తు తనకు రానున్న మరణం గురించి మాట్లాడడం ఆమె విన్నది. ఆయన పట్ల తనకున్న ప్రేమవల్ల ఆయన మరణం విషయమైన దుఃఖంవల్ల ఆయన యెడల తన గౌరవాభిమానాల్ని ప్రదర్శించుకోవాలని ఆశించింది. గొప్ప వ్యక్తిగత త్యాగంతో గొప్ప విలువగల “జటామాంసి అత్తరు” కొన్నది ఆయన దేహాన్ని దానితో అభిషేకించడానికి. అయితే ఆయన రాజుగా అభిషేకం పొందడానికి సిద్ధంగా ఉన్నాడని ఇప్పడు అనేకమంది ప్రకటిస్తోన్నారు. ఆమె దుఃఖం ఆనందంగా మారింది. తన ప్రభువుని ఘనపర్చడంలో తాను ముందంజలో ఉండాలని ఆమె తలంచింది. తన అత్తరు బుడ్డిని పగులగొట్టి ఆ అత్తరు యేసు తలమీద పాదాలమీద పోసింది. ఆ తర్వాత ఏడుస్తూ మోకరించి ఆయన తలని పాదాల్ని తన కన్నీటితో తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచింది.DATel 620.2

    తనను తన కదలికను ఎవరూ గమనించకుండా వ్యవహరించేందుకు ప్రయత్నించింది గాని అత్తరు సువాసన గదంతా వ్యాపించడంతో ఆమె చర్య అక్కడున్న వారందరికి తెలిసిపోయింది. ఈ చర్య యూదాకి తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఆ విషయంపై క్రీస్తు స్పందనకు ఆగకుండా తన పక్క ఉన్నవారితో తన ఆక్షేపణని నింపాదిగా వెలిబుచ్చుతూ, ఆవ్యర్థ వ్యయాన్ని అనుమతించినందుకు క్రీస్తు మీద బురద చల్లడానికి ప్రయత్నించాడు. స్వామి ద్రోహానికి దారితీసే సూచనల్ని యుక్తిగా చేశాడు.DATel 620.3

    శిష్యులికి యూదా ఖజానాదారుడు. వారి అంతంత మాత్రపు ఆదాలో నుంచి తన సొంత ఖర్చులికి రహస్యంగా డబ్బు తీసేవాడు. వారి స్వల్ప ఆర్థిక వనరుల్ని ఈరకంగా సన్నగిల్లజేశాడు. వెయ్యగలిగిందంతా సంచిలో వెయ్యడానికి ఆరాటపడేవాడు. సంచిలోని ద్రవ్యం బీదల కష్టాలు తీర్చడానికి తరచు వినియుక్తమయ్యేది. అవసరం లేనిదిగా యూదాకి తోచిందేదైన కొనుగోలు చేసినప్పుడు ఈ వ్యర్థం ఎందుకు? దీనికి ఖర్చు చేసిన ద్రవ్యాన్ని బీదలకోసం నేను మోస్తున్న సంచిలో ఎందుకు వెయ్యలేదు? అని నిగ్గదీసేవాడు. ఇప్పుడు మరియు చేసిన కార్యం అతడి స్వార్ధాసక్తికి పూర్తి భిన్నంగా ఉండి అతడికి చెంపదెబ్బగా పరిణమించింది. ఆమె కానుకకు తాను చెప్పిన అభ్యంతరానికి తన అలవాటు ప్రకారం బలమైన కారణాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. శిష్యుల తట్టు తిరిగి ఇలా అన్నాడు, “ఈ అత్త రెండుకు మూడువందల దేనారములకు అమ్మి బీదలకియ్యలేదు? వాడీలాగు చెప్పినది బీదల మిద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయైయుండి తన దగ్గర డబ్బు సంచి యుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.” యూదాకి బీదల మీద ప్రేమలేదు. మరియ అత్తరును అమ్మడం ఆ డబ్బు అతడి చేతిలో పడడం జరిగి ఉంటే బీదలకి ఏ ఉపకారం లభించేది కాదు.DATel 621.1

    యూదాకి తన కార్యనిర్వాహక సామర్థ్యం పై గొప్ప నమ్మకం ఉండేది. ఆర్థిక బాధ్యతగల వ్యక్తిగా తాను సాటి శిష్యులకన్నా అధికుణ్ననుకున్నాడు. తనను వారు ఆవిధంగానే పరిగణించేటట్లు వారిని మలుచుకున్నాడు. వారిపై అతడి ప్రభావం బలంగా ఉండేది. బీదల పై అతడు ప్రకటించుకున్న సానుభూతి వారిని మోసపుచ్చింది. అతడి పుల్లవిరుపు మాటలు మరియ భక్తి విషయంలో అనుమానాలు అపోహలు పుట్టించాయి. “ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే” అన్నాడు.DATel 621.2

    మరియ ఈ విమర్శను విన్నది. ఆమె హృదయం కంపించింది. తన దుబారాకు తన సోదరి మందలిస్తుందని భయపడింది. ప్రభువుకూడా తనను పొదుపులేని వ్యక్తిగా పరిగణిస్తాడేమోనని భావించింది. క్షమాపణగాని సాకుగాని చెప్పుకోకుండా ఆమె అక్కడనుంచి వెళ్లిపోడానికి సిద్ధపడ్తుండగా “ఈమెను మీరేల తొందర పెట్టుచున్నారు?” అంటున్న ప్రభువు స్వరం విన్నది. ఆమె ఇబ్బందిపడి దుఃఖిస్తున్నట్లు ఆయన చూశాడు. ఆమె చేసిన ఈ కార్యంలో తన పాపాన్ని క్షమించినందుకు ఆమె కృతజ్ఞతను తెలియజేసిందని ఆయనకు తెలుసు! ఆయన ఆమెకు ఉపశమనాన్ని మనశ్శాంతిని ఇచ్చాడు. విమర్శల గొణుగుడికి పైగా స్వరమెత్తి ఆయన ఇలా అన్నాడు, “ఈ స్త్రీ నా విషయమై యొక మంచికార్యము చేసెను, ఆమెను మీరేల తొందర పెట్టుచున్నారు? బీదలెల్లప్పుడు నాతోకూడ ఉన్నారు గాని నేనెల్లప్పుడు మీతో కూడి ఉండను. ఈమె యీ అత్తరు నాశరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను.”DATel 622.1

    రక్షకుని మృతదేహంపై పొయ్యాలని మరియ కొన్న పరిమళ ద్రవ్యం ఆయన సజీవ శరీరం మీద పోసింది. సమాధి వద్ద దాని సువాసన సమాధిని మాత్రమే నింపేది. ఇప్పుడు అది ఆమె విశ్వాసం ప్రేమ ధ్రువీకరణతో ఆయన హృదయాన్ని ఆనందంతో నింపింది. అరిమతయియ యోసేపు, నీకొదేము ప్రభువుకి తమ ప్రేమ కానుకను ఆయన జీవించి ఉండగా ఇవ్వలేదు. చల్లని, దుఃఖిస్తూ ప్రాణంలేని ఆయన శరీరానికి విలువైన సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చారు. సమాధి వద్దకు సుగంధ ద్రవ్యాల్ని తీసుకువెళ్లిన స్త్రీలు తమ ప్రయాస వ్యర్థమని తెలుసుకున్నారు. కారణమేంటంటే ఆయన సమాధి నుంచి లేచాడు. కాని తన భక్తి విశ్వాసాల స్పృహ ఆయనకున్న సమయంలోనే మరియ తన ప్రేమను రక్షకుని మిద పోసి ఆయన్ని సమాధికి అభిషేకించింది. సిలువలో ఆయన మహాశ్రమను అనుభవించడానికి వెళ్లినప్పుడు ఆమె చర్య జ్ఞాపకాన్ని తీసుకువెళ్లాడు. తాను విమోచించిన వారి నుంచి ఆయన నిరంతరం పొందనున్న ప్రేమకు అది బజానా.DATel 622.2

    మరణించిన వారికి తమ కానుకలు తెచ్చేవారు చాలామంది ఉన్నారు. చల్లని, జీవంలేని శవం చుట్టూ నిలిచి ప్రేమతో నిండిన మాటలు మాట్లాడారు. చూడని, వినని ఆకారం మీద ప్రేమ, ప్రశంసలు, అభిమానం కురిపిస్తారు. అలసిపోయి ఉన్నవారి ఆత్మకు ఎంతో అవసరమైన సమయంలో ఆమాటల్ని చెప్పి ఉంటే, వారి చెవి వినగలిగినప్పుడు, వారి హృదయం గ్రహించగలిగినప్పుడు వాటిని చెప్పి ఉంటే వాటి పరిమళం ఎంత విలువను సంతరించుకునేది!.DATel 622.3

    ప్రేమతో తాను చేసిన ఆ కార్యం ప్రాముఖ్యాన్ని మరియ గ్రహించలేదు. తనని నిందిస్తున్న వాడికి సమాధానం చెప్పలేక పోయింది. యేసును అభిషేకించడానకి ఆ సమయాన్ని తాను ఎందుకు ఎంచుకున్నదో మరియ వివరించలేకపోయింది. పరిశుద్దాత్మే ఆమె చర్యను సంకల్పించాడు. ఆమె ఆయన నడిపించినట్లు నడిచింది. దేవుడు దిగివచ్చి కారణం చెప్పడు. ఆ అదృశ్య సమక్షం మనసుతోను ఆత్మతోను మాట్లాడుంది. మనల్ని చర్య చేపట్టడానికి నడిపిస్తుంది. దాని ఉనికే దాని స్వీయసమర్ధన.DATel 623.1

    మరియ నిర్వహించిన చర్య భావాన్ని క్రీస్తు ఆమెకు వివరించాడు. ఇందులో తాను పొందిన దాని కన్నా ఆయన ఎక్కువ ఆమెకిచ్చాడు. “ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను” అని ఆయన అన్నాడు. అత్తరు బుడ్డిని పగులగొట్టి దాని పరిమళంతో ఇల్లంతా నింపిన మాదిరిగా క్రీస్తు మరణించాల్సి ఉన్నాడు. ఆయన శరీరం చితుక గొట్టబడాల్సి ఉంది. కాని ఆయన సమాధి నుంచి లేవాల్సి ఉన్నాడు. ఆయన జీవిత పరిమళం భూమిని నింపాల్సి ఉంది. “క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించకొనెను.” ఎఫెసీ 5:2.DATel 623.2

    “సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్ధముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని క్రీస్తు వెల్లడించాడు. భవిష్యత్తులోకి చూస్తూ, తన సువార్త నిశ్చితిని గూర్చి రక్షకుడు మాట్లాడాడు. అది లోకమంతటా ప్రకటితం కావలసి ఉంది. సువార్త వ్యాపించిన ప్రాంతాలన్నిటిలోను మరియ కానుక దాని సువాసనను నింపుతుంది. ఆమె నిస్వార్ధ చర్య ద్వారా హృదయాలకు మేలు చేకూరుతుంది. రాజ్యాలు ఉనికిలోకి వస్తాయి పడిపోతాయి. చక్రవర్తులు, విజేతల పేర్లు మరుగున పడిపోతాయి. కాని ఈ స్త్రీ క్రియ మాత్రం పరిశుద్ధ చరిత్రపుటల్లో చిరస్మరణీయమై నిలుస్తుంది. కొలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు పగులగొట్టిన అత్తరబుడ్డి పాపమానవ జాతిపట్ల దేవుని అనంత ప్రేమను గూర్చిన కథను చెబుతూనే ఉంటుంది.DATel 623.3

    మరియ చేసిన కార్యం యూదా చేయనున్న పనితో ఎంతో విభేదించింది. తప్పుపట్టడం, దుష్టి తలంచడం అన్న విత్తనాల్ని శిష్యుల మనసుల్లో చల్లిన అతడికి క్రీస్తు నేర్పిన పాఠం ఎంత పదునైంది! నింద మోపుతున్న అతడి మీదే నిందమోపడం ఎంత సబబు! ప్రతీవారి హృదయాలోచనల్ని తెలిసిన ఆయన, ప్రతీ క్రియను గ్రహింగల ఆయన, విందుకు హాజరైన వారందరి ముందు యూదా అనుభవంలోని చీకటి అధ్యాయాల్ని బట్టబయలు చెయ్యగలిగేవాడే. ఆ ద్రోహి మాటల వెనుక ఉన్న దొంగాట గుట్టురట్టు చేయగలిగే వాడే. ఎందుకంటే బీదల పట్ల సానుభూతి బదులు వారి సహాయం కోసం ఉద్దేశించిన నిధుల్ని అతడు స్వాహా చేస్తున్నాడు. విధవరాండ్రను, అనాధలను, కూలీలను బాధిస్తున్నందుకు అతడిమీద ప్రజాఫ్రహం భగ్గుమనేది. అదీగాక, యూదా ధరించిన వంచన ముసుగును యేసు తొలగించి ఉంటే, అతడు ఆయన్ని పట్టి ఇవ్వడానికి ఇదొక హేతువుగా ప్రచారమయ్యేది. దొంగగా ముద్రపడినా, యూదా శిష్యుల నుంచి సయితం సానుభూతి పొందేవాడు. రక్షకుడు అతణ్ని నిందించలేదు. తద్వారా అతడు ఒడిగట్టిన ద్రోహానికి అతడికి ఎలాంటి సాకూ లేకుండా చేశాడు.DATel 624.1

    కాని యేసు యూదా వంక చూసిన చూపు రక్షకుడు తన నాటకాన్ని కనిపెట్టేశాడని, తన నీచ క్షుద్ర ప్రవర్తనను ఆకళించుకున్నాడని అతడు గ్రహించాడు. యూదా ఖండించిన మరియ చర్యను ప్రశంసించడం ద్వారా యేసు యూదాను మందలించాడు. దీనికి ముందు రక్షకుడు అతడ్ని ప్రత్యేకంగా మందలించలేదు. ప్రభువుతో రాత్రి భోజనం నుంచి అతడు నేరుగా ప్రధానయాజకుడి భవంతికి వెళ్లాడు. అక్కడ సభ సమావేశం జరుగుతోంది. యేసుని వారికప్పగించడానికి ముందుకువచ్చాడు.DATel 624.2

    యాజకులికి పట్టరాని ఆనందం కలిగింది. ఇశ్రాయేలులోని ఈ నాయకులికి డబ్బులేకుండా, మూల్యం చెల్లించనవసరం లేకుండా క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించే విశేషావకాశం ఉంది. కాని బలవంతం చేసే ప్రేమతో దేవుడిచ్చిన ఆ అమూల్య వరాన్ని వారు నిరాకరించారు. బంగారం కన్నా విలువైన రక్షణను తోసిపుచ్చి వారు తమ ప్రభువుని ముప్పయి వెండి నాణేలకు కొన్నారు.DATel 624.3

    యూదా దూరాశను ప్రేమించాడు. అతడి ప్రవర్తనలోని మంచి గుణాలన్నీ నశించిపోయేంతవరకూ ప్రేమించాడు. క్రీస్తుకి సమర్పించిన కానుక విషయంలో కక్ష పెంచుకున్నాడు. లోక రాజులికి తగిన కానుక రక్షకుడు పొందినందుకు అతడి హృదయం అసూయతో భగ్గున మండింది. ఒక అత్తరు బుడ్డి ఖరీదు కన్నా ఎంతో తక్కువ విలువకు అతడు తన రక్షకుణ్ని పట్టి ఇచ్చాడు.DATel 625.1

    శిష్యులు యూదావంటి వారు కారు. వారు రక్షకుణ్ని ప్రేమించారు. అయినా వారు ఆయన సమున్నత ప్రవర్తనను సరిగ్గా అభినందించలేదు. ఆయన తమ నిమిత్తం ఏమిచేశాడో గుర్తించి ఉంటే, ఆయన మిద వెచ్చించింది ఏదీ నష్టం కాదని గ్రహించి ఉండేవారు. యేసు గురించి ఎక్కువ తెలియని తూర్పుజ్ఞానులు ఆయనకు చెందాల్సిన ఘనతను వాస్తవంగా అభినందించినట్లు చూపించుకున్నారు. రక్షకునికి వారు కానుకలర్పించారు. ఆయన పశువుల తొట్టిలో కేవలం శిశువుగా ఉన్నప్పుడు ఆయన ముందు సాగిలపడి నివాళులర్పించారు.DATel 625.2

    హృదయపూర్వక గౌరవంతో చేసే కార్యాల్ని క్రీస్తు అభినందిస్తాడు. ఎవరైనా ఆయనకు సహాయం చేసినప్పుడు ఆ వ్యకిని గొప్ప మర్యాదతో దీవించేవాడు. చిన్నపిల్ల మిక్కిలి సామాన్యమైన పుష్పాన్ని తన చేతితో కోసి ప్రేమతో ఇచ్చినప్పుడు ఆయన ఎన్నడూ నిరాకరించలేదు. ఆయన చిన్నపిల్లల కానుకల్ని అంగీకరించేవాడు. ఇచ్చిన వారిని దీవించి వారి పేరు జీవగ్రంథంలో రాసేవాడు. మరియ యేసును అభిషేకించడం ఆమెను ఇతర మరియలకన్నా ప్రత్యేక స్థానంలో ఉంచుతుందని లేఖనాల్లో పేర్కొడం జరిగింది. ప్రేమతో కూడిన కార్యాలు, యేసుపట్ల భక్తిశ్రద్ధలు దేవుని కుమారుడుగా ఆయనపై విశ్వాసానికి రుజువు. క్రీస్తుపట్ల స్త్రీల ప్రభుభక్తికి నిదర్శనాలుగా పరిశుద్దాత్మ వీటిని పెర్కొంటున్నాడు: “పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమ పడువారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొన్నది.” 1 తిమో. 5:10.DATel 625.3

    మరియ తన ప్రభువు చిత్రాన్ని జరిగించడానికి చూపించిన ప్రగాఢ ఆసక్తి క్రీస్తుకి ఆనందాన్నిచ్చింది. పవిత్ర ప్రేమైశ్వర్యాన్ని ఆయన స్వీకరించాడు. దాన్ని ఆయన శిష్యులు గ్రహించలేదు. గ్రహించడానికి సిద్ధంగా లేరు. తన ప్రభువుకి ఈ సేవ చెయ్యాలని మరియకున్న కోరిక ఈ భూప్రపంచంలో ఉన్న అత్తరు అంతటి కన్నా క్రీస్తుకి ఎక్కువ విలువైనది ఎందుకంటే అది లోకరక్షకుని పట్ల తన ప్రేమాభినందనల్ని వ్యక్తీకరించింది. క్రీస్తు పట్ల తనకున్న ప్రేమే ఆమెను బలవంతం చేసింది. అసమానమైన క్రీస్తు ప్రవర్తన ప్రాశస్త్యం ఆమె హృదయాన్ని నింపింది. అత్తరు దాత హృదయానికి సంకేతం. అది పరలోకం నుంచి ప్రవహించి కట్టలు తెంచుకుని పారిన ప్రేమకు బాహ్య ప్రదర్శన.DATel 626.1

    ఆయన పట్ల తమకున్న ప్రేమను వ్యక్తం చెయ్యడం క్రీస్తుకి ఆనందాన్నిస్తుందని శిష్యులికి చూపించడానికి అవసరమైన పాఠం మరియ చేసిన ఆ కార్యమే. వారికి అన్నీ ఆయనే. త్వరలో ఆయన తమ మధ్యనుంచి వెళ్లిపోతాడని, తమపట్ల ఆయన మహాప్రేమకు కృతజ్ఞత తెలపడానికి గుర్తుగా ఏది ఇవ్వడానికి త్వరలో ఇక అవకాశం ఉండదని వారు గ్రహించలేదు. పరలోక ప్రాంగణం విడిచిపెట్టిన క్రీస్తు ఒంటరితనాన్ని, మానవుడిగా ఆయన జీవించడాన్ని శిష్యులు సరిగా అవగాహన చేసుకోలేదు లేదా అభినందించలేదు. శిష్యుల నుంచి ఆయన పొందాల్సిన దాన్ని వారు ఇవ్వనందుకు ఆయన తరచు సంతాపం చెందేవాడు. తనతో వచ్చిన దేవతూతల ప్రభావం కిందకు శిష్యులు వచ్చి ఉంటే హృదయంలోని ఆధ్యాత్నిక ప్రేమను వెల్లడించటానికి ఏ కానుకకూ చాలినంత విలువలేదని వారు కూడా తలంచి ఉందురని ఆయన ఎరుగును.DATel 626.2

    యేసు తమతో ఉంటుండగా తమప్రేమను కృతజ్ఞతను ఆయనకి వ్యక్తం చెయ్యడానికి తాము ఇది చేసి ఉండాల్సింది అది చేసి ఉండాల్సింది అన్న తెలివిడి ఆయన వెళ్లిపోయిన తర్వాత శిష్యులికి కలిగింది. యేసు ఇక తమతో లేనప్పుడు తాము కాపరిలేని గొర్రెల్లా ఉన్నామని భావించినప్పుడు, అప్పుడు వారు తమ ప్రభువుకు సంతోషం కలిగించేటట్లు ఆయనకు తమ శ్రద్ధాసక్తుల్ని గమనాన్ని ఎలా ఇచ్చి ఉండాల్సిందో గ్రహించారు. వారు మరియను ఇక నిందించలేదు. తమ్మును తాము నిందించుకున్నారు. తమ విమర్శల్ని తిరిగి తీసుకోగలిగితే ఎంత బాగుండును! ఆ కానుకకు యేసు కన్నా బీదలు ఎక్కువ అర్హులని వారు చెప్పిన మాటలు వెనక్కు తీసుకోగలిగితే ఎంత బాగుండును! తమ ప్రభువు శరీరాన్ని సిలువ మీద నుంచి కిందకి తీసే తరుణంలో ఆ మందలింపు వారి మనసులికి మరింత వాడిగా గుచ్చుకుంది.DATel 626.3

    నేడు మన ప్రపంచంలో ఇదే లోటు కళ్ళకు కట్తోంది. క్రీస్తును అభినందించే వారు చాలా కొద్దిమంది. ఆయన్ని అభినందిస్తే, మరియ ప్రేమను వారు వ్యక్తం చేస్తారు. ఆమె చేసిన అభిషేకం అభినందిస్తే మరియ ప్రేమను వారు వ్యక్తం చేస్తారు. ఆమె చేసిన అభిషేకం చేస్తారు. విలువైన అత్తరు వ్యర్థం అనరు. క్రీస్తుకి ఇవ్వడానికి ఏదీ ఎక్కువ వెలగలది కాదు. ఆత్మత్యాగం లేక ఆత్మార్పణ ఏదీ ఆయన నిమిత్తం భరించలేనిది కాదు.DATel 627.1

    “ఈ నష్టమెందుకు?” అని కోపంతో అన్నమాటలు ఎన్నడూ జరుగని మహత్తర త్యాగాన్ని క్రీస్తు కన్నుల ముందుకి తెచ్చాయి. నశించిన ప్రపంచానికి పాపప్రాయశ్చితంగా తన్నుతాను బలిగా అర్పించుకోడం. ఇక ఆయన చేయగలిగింది ఏమిలేదు అన్నంత సమృద్ధిగా ప్రభువు తన మానవ కుటుంబం విషయంలో ఉంటాడు. క్రీస్తుని ఇవ్వడంలో దేవుడు మొత్తం పరలోకాన్నే ఇచ్చాడు. మానవ దృక్కోణంలో చూస్తే అలాంటి త్యాగం గొప్ప వ్యర్థం. మానవ హేతువాదానికి రక్షణ ప్రణాళిక మొత్తం కృపా పరంగాను వనరుల పరంగాను వ్యర్థంగా కనిపిస్తుంది. ఆత్మత్యాగం, హృదయపూర్వక త్యాగనిరతి మనకు అన్నిచోట్ల దర్శనమిస్తాయి. క్రీస్తులో వ్యక్తమైన అపారప్రేమచేత ఉద్దరణ ఉన్నత స్థితి పొందడానికి నిరాకరిస్తోన్న మానవ కుటుంబం వంక పరలోక నివాసులు నివ్వెరపోతూ చూస్తుండవచ్చు. ఈ వ్యర్థం ఎందుకు? అని వారనవచ్చు.DATel 627.2

    అయితే నశించిన ప్రపంచం కోసం జరిగే ప్రాయశ్చిత్తం సంపూర్ణంగా సమృద్ధిగా, సంపూర్తిగా ఉండాల్సి ఉంది. క్రీస్తు అర్పణ దేవుడు సృజించిన ప్రతీ ఆత్మనూ చేరగలిగినంత సమృద్ధమైంది. ఈ గొప్ప వరాన్ని అంగీకరించాలని ఆశించే వారి సంఖ్య ఇంతకు మించకూడదన్న పరిమితి ఉండదు. అందరూ రక్షణ పొందలేరు. అయినా అది ఉద్దేశించిన వారందరినీ రక్షించడమన్న కార్యాన్ని సాధించడం లేదు కాబట్టి రక్షణ ప్రణాళిక వ్యర్థం కాదు. చాలినంతమంది ఆమాటకొస్తే అంతకన్నా ఎక్కువమంది ఉంటారు.DATel 627.3

    మరియ అర్పణపై యూదా చేసిన విమర్శ అతిథేయుడు అయిన సీమోన్ని, ప్రభావితం చేసింది. యేసు వ్యవహరించిన విధం అతణ్ని ఆశ్చర్యపర్చింది. అతడిలోని పరిసయ్యుడి అహంభావాన్ని దెబ్బకొట్టింది. తన అతిథుల్లో చాలామంది క్రీస్తుపట్ల అనుమానంగా, విముఖంగా ఉన్నారని అతడికి తెలుసు. సీమోను తనలో తాను ఇలా అనుకున్నాడు, “ఈయన ప్రవక్తయైన యెడల తన్నుముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటి దో యెరిగి యుండును. ఇది పాపాత్మురాలు.”DATel 628.1

    సీమోను కుష్ఠువ్యాధిని బాగుచెయ్యడం ద్వారా క్రీస్తు అతణ్ని జీవన్మరణం నుంచి కాపాడాడు. అయితే సీమోను ఇప్పుడు రక్షకుడు ప్రవక్తా అని తనలో తాను ప్రశ్నించికుంటున్నాడు. ఈమె తన దగ్గరకు రావడానకి క్రీస్తు సమ్మతించాడు గనుక, తన పాపాలు క్షమించరానంత ఘోరమైనందున ఆగ్రహాంతో ఆమెను తోసిపుచ్చలేదు గనుక, ఆమె చెడిపోయిన స్త్రీ అని ఆయన గుర్తించలేదు గనుక ఆయన ప్రవక్తకాడని సీమోను భావించాడు. తన ప్రదర్శనలో స్వేచ్ఛతో వ్యవహరిస్తున్న ఈ స్త్రీ గురించి యేసుకి ఏమి తెలియదని, తెలిస్తే ఆమె తనను ముట్టుకోడానికి సమ్మతించడని సీమోను ఊహాగానం.DATel 628.2

    కాని దేవుని గురించి క్రీస్తు గురించి అతడి అజ్ఞానమే తాను ఈ విధంగా తలంచడానికి దారి తీసింది. దేవుని కుమారుడు దేవుని మార్గంలో ప్రేమ, కనికరం, దయతో వ్యవహరించాలని అతడు గ్రహించలేదు. సీమోను మార్గం ఏంటంటే మరియ పొందిన మారుమనసును, ఆమె సేవను గుర్తించకుండా ఉండడం. ఆమె క్రీస్తు పాదాల్ని ముద్దు పెట్టుకోడం వాటిని అత్తరుతో అభిషేకించడం అతడి హృదయ కాఠిన్యాన్ని రెచ్చగొట్టింది. క్రీస్తు ప్రవక్త అయిఉంటే ఆయన పాపుల్ని గుర్తించి వారిని మందలిస్తాడని తలంచాడు.DATel 628.3

    అతడి మనసులోని ఈ ఆలోచనకు రక్షకుడిలా సమాధానం ఇచ్చాడు: “సీమోనూ, నీతో ఒకమాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు - బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు- అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థులుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చిఉండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వారిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోనుఅతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నాదని చెప్పగా ఆయన- నీవు సరిగా యోచించితివి” అన్నాడు.DATel 628.4

    దావీదు విషయంలో నాతానుని మల్లే క్రీస్తు తన వాడి వేడి వర్తమానాన్ని ఉపమానం రూపంలో అందించాడు. తనపై తానే తీర్పు ప్రకటించుకునే భారాన్ని ఆయన తన అతిథేయుడి మీదే పెట్టాడు. ఇప్పుడు తాను ద్వేషించి విమర్శిస్తోన్న స్త్రీని పాపం రొంపిలోకి దింపింది అతడే. ఆమెకు అతడు తీరని అన్యాయం చేశాడు. ఉపమానంలో ఇద్దరు రుణస్తులూ సీమోను మరియలే. ఆ ఇద్దరు వ్యక్తుల విధి విషయంలో వ్యత్యాసం ఉన్నట్లు భావించాలని నేర్పించడం యేసు ఉద్దేశం కాదు. ఎందుకంటే కృతజ్ఞత విషయంలో వారిద్దరూ రుణస్తులే. అది తీర్చలేని రుణం. అయితే సీమోను మరియ కన్నా నీతిమంతుణ్ని అనుకున్నాడు. కనుక వాస్తవంలో తాను ఎంత ఘోరపాపో అతడు గ్రహించాలన్నది యేసు కోరిక. తన పాపం ఆమె పాపం కన్నా ఎక్కువని ఆమెది ఏబయి దేనారాల ఎత్తు అయితే తనది అయిదువందల దేనారాల ఎత్తు అని అతడికి చూపించాడు.DATel 629.1

    సీమోను ఇప్పుడు తనను తాను కొత్త వెలుగులో చూసుకోడం మొదలు పెట్టాడు. ప్రవక్తకన్న గొప్పవాడు మరియను ఎలా పరిగణించాడో అతడు చూశాడు. తన నిశిత, ప్రావచనిక దృష్టితో క్రీస్తు ఆమె ప్రేమను, భక్తితో నిండిన హృదయాన్ని చదివాడని అతడు తెలుసుకున్నాడు. సిగ్గుతో తలవంచుకున్నాడు. తన కన్నా సమున్నతమైన వాని సముఖంలో తానున్నట్లు గుర్తించాడు.DATel 629.2

    “నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్యలేదు గాని, యీమె తన కన్నీళ్లతో నాపాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచెను. “నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని” నీవు ద్వేషించే యీమె “నేను లోపలికి వచ్చినప్పటినుండి నాపాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు” అన్నాడు. ప్రభువుపట్ల తన ప్రేమను ప్రదర్శించడానికి, ఆయన తనకు చేసిన ఉపకారానికి ఆయనకు కృతజ్ఞతలు తెలపడానికి సీమోనుకి ఎన్ని తరుణాలున్నాయో ప్రభువు వల్లిస్తోన్నాడు. తన బిడ్డలు తమ మాట ద్వారాను ప్రేమాకార్యాల ద్వారాను తమ కృతజ్ఞతను వ్యక్తం చెయ్యనప్పుడు తనకు దుఃఖం కలుగుతుందని రక్షకుడు స్పష్టంగా, ఎంతో సున్నితంగా తన శిష్యులికి చెప్పాడు.DATel 629.3

    హృదయ పరిశోధకుడు మరియ చర్య ఉద్దేశాన్ని చదివాడు. సీమోను మాటల్ని ప్రోత్సహించిన స్ఫూర్తిని కూడా ఆయన చూశాడు. “ఈ స్త్రీని చూచుచున్నావే” అన్నాడు యేసు. ఆమె పాపి “ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును.”DATel 630.1

    రక్షకుని పట్ల సీమోను నిర్లిప్తంగా ఉదాసీనంగా ఉండడం అతడు పొందిన మేలును తాను ఎంత తక్కువగా అభినందించాడో సూచిస్తోంది. యేసుని తన గృహానికి ఆహ్వానించడం ద్వారా ఆయన్ని గౌరవించానని అతడు భావించాడు. కాని ఇప్పుడు అతడు తన వాస్తవ స్థితిని గ్రహించాడు. తన అతిథిని చదువుతున్నానని తాను అనుకొంటుంటే తన అతిథి అతణ్ని చదువుతోన్నాడు. తన విషయంలో క్రీస్తు ఆలోచన ఎంత వాస్తవమో అతడు చూశాడు. అతడి మతం పరిసయ్యుల మతం ధరించిన అంగీనే. అతడు క్రీస్తు చూపించిన ప్రేమను తృణీకరించాడు. యేసుని దేవుని ప్రతినిధిగా గుర్తించలేదు. మరియ క్షమాపణ పొందిన పాపికాగా సీమోను క్షమాపణ పొందని పాపి. అతడు ఆమెపట్ల అనుసరించాలన్న కఠిన నిబంధనే అతణ్ని దోషిగా తీర్చింది.DATel 630.2

    అతిథుల ముందు తనను బాహాటంగా మందలించకుండా తన పట్ల యేసు చూపించిన దయకు సీమెను హృదయం చలించింది. మరియ పట్ల వ్యవహరించాలని అతడు కోరినట్లు ఆయన అతడితో వ్యవహరించలేదు. తన అపరాధాన్ని ఇతరులికి బట్టబయలు చేయకుండా వాస్తవాన్ని ప్రకటించడం ద్వారా తనను ఒప్పించడానికి, దయ కనికరాలతో తన హృదయాన్ని లొంగదియ్యడానికి యేసు ప్రయత్నించినట్లు అతను చూశాడు. తీవ్ర ఖండన సీమోను హృదయాన్ని పశ్చాత్తాపపడకుండా కఠినపర్చేది. కాని సహనం పాటించి హితవు పలకడం అతడు తన తప్పుని తెలుసుకోడానికి దోహదపడింది. ప్రభువుకి తాను ఎంత రుణపడి ఉన్నాడో అతడు గ్రహించాడు. అతడి అతిశయం మాయమయ్యింది. అతడు పశ్చాత్తాపం పొందాడు. గర్వి పొగరుబోతు అయిన పరిసయ్యుడు దీనమనస్కుడు, ఆత్మత్యాగి అయిన శిష్యుడయ్యాడు.DATel 630.3

    మరియను ఘోర పాపిగా పరిగణించడం జరిగింది. అయితే ఆమె జీవితాన్ని అలా తయారుజేసిన పరిస్థితులేమిటో క్రీస్తుకి తెలుసు. ఆమె ఆత్మలోని ప్రతీ నిరీక్షణ నెరుసును ఆర్సి ఉండేవాడే. కాని అలా చెయ్యలేదు. నిరాశ నిస్పృహలతో కుమిలిపోతున్న ఆమెను పైకి లేవనెత్తింది ఆయనే. తన మనసును తన హృదయాన్ని అదుపు చేస్తున్న దయ్యాల్ని ఏడుసార్లు ఆయన గద్దించడం విన్నది. తన తరపున ఆయన తండ్రికి చేసిన మొరల్ని విన్నది. కళంకం ఏ మాత్రం లేని ఆయన పవిత్రతకు పాపం ఎంత అభ్యంతరకరమో గ్రహించింది. ఆయనశక్తితో ఆమె జయించింది.DATel 631.1

    మానవ దృష్టికి ఆమెది నిరీక్షణలేని పరిస్థితిగా కనిపించినప్పుడు, ఆమెలో మంచి చెయ్యడానికి సమర్ధతల్ని క్రీస్తు చూశాడు. ఆమె ప్రవర్తనలోని మెరుగైన గుణాల్ని చూశాడు. విమోచన ప్రణాళిక మానవుల్లో గొప్ప అవకాశాల్ని పెట్టుబడిగా పెట్టింది. మరియలోని ఈ అవకాశాల్ని క్రియాత్మకం చెయాల్సి ఉంది. ఆయన కృప ద్వారా ఆమె దైవ స్వభావంలో పాలిభాగస్తురాలయ్యింది. పతనమైన ఆమె, ఎవరి మనసు దయ్యాలికి ఆవాసం అయ్యిందో ఆమె, సహవాసం విషయంలోను పరిచర్య విషయంలోను రక్షకునికి దగ్గరయ్యింది. ఆయన పాదాలవద్ద కూర్చుని ఆయన్ని గురించి నేర్చుకున్న స్త్రీ మరియనే. ఆయన తలమీద విలువైన అభిషేక తైలం పోసింది ఆయన పాదాలు కన్నీటితో కడిగింది మరియనే. మరియ సిలువ పక్క నిలబడింది. ఆయన వెంట సమాధి వద్దకు వెళ్లింది. ఆయన పునరుత్థానం దరిమిల సమాధి వద్ద ఉన్న మొట్టమొదటి వ్యక్తి మరియనే. తిరిగి లేచిన రక్షకుణ్ని ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి మరియనే.DATel 631.2

    ప్రతీ ఆత్మ పరిస్థితులూ యేసుకు తెలుసు. నేను పాపిని, గొప్ప పాపినని మీరనవచ్చు, కావచ్చు. మీరు ఎంత చెడిపోతే యేసు నాకు అంత అవసరం. ఏడుస్తూ పశ్చాత్తాపపడే ఏ ఆత్మనూ ఆయన తరిమివేయడు. తాను వెల్లడించేదంతా ఆయన ఎవరికీ చెప్పడు. కాని వణికే ప్రతీ ఆత్మకూ ధైర్యం చెబుతాడు. క్షమాపణ పునరుద్దరణల కోసం తనవద్దకు వచ్చేవారిని ఆయన బహుగా క్షమిస్తాడు.DATel 631.3

    దేవుని పట్ల ద్వేషంతో నిండినవారిని నాశనం చెయ్యడానికి ఆయన ఉగ్రత పాత్రలోనిది లోకంపై కుమ్మరించాల్సిందిగా పరలోక దూతలికి క్రీస్తు ఆజ్ఞ ఇవ్వవచ్చు. ఈ చీకటి లోకాన్ని విశ్వం నుంచి తుడిచి వేయవచ్చు. కాని ఆయన ఈ పని చెయ్యడు. దేవుని సహాయాన్ని అర్థిస్తూ ప్రార్థించే వారి ప్రార్థనలు దేవుని ముందు పెట్టడానికి నేడు ఆయన ధూపవేదిక ముందు నిలబడి ఉన్నాడు.DATel 632.1

    ఆశ్రయం కోసం తన వద్దకు వచ్చేవారిని నిందించే వారినుంచి వ్యతిరేకించే వారి నుంచి యేసు లేపి వారిని పైనుంచుతాడు. ఈ ఆత్మల్ని ఏ మనిషి ఏ దుష్టదూత తొలగించలేడు. క్రీస్తు తన దేవ మానవ స్వభావంతో వారిని సమైక్యపర్చుతాడు. దేవుని సింహాసనం నుంచి ప్రకాశించే వెలుగులో వారు లోక పాపాలు మోసే ప్రభువు పక్క నిలబడ్డారు. “దేవుని చేత ఏర్పరచబడినవారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపన కూడ చేయువాడును ఆయనే.” రోమారి:33, 34.DATel 632.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents